ఎప్పటికప్పుడు దేవుళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు


ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అంతకుమించి దేవుళ్ళున్నారు. గతం నుండి గమనిస్తే ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు దేవుళ్ళు పుట్టుకొస్తూనే వున్నారు. దేవుళ్ళ చరిత్ర చూస్తే పాత వాళ్ళు కొందరు గతించడం, కొత్తవాళ్ళు చిగురించడం స్పష్టం. ప్రాంతాల వారీగా, దేశాల వారీగా దేవుళ్ళున్నారు. ఎక్కడికక్కడ జనం అలవాట్లు, ఆచారాలు, చివరకు వేషభాషలు కూడా దేవుళ్ళకు వచ్చాయి.
బాగా జన బాహుళ్యంలో వ్యాపించిన దేవుళ్ళు కొందరే వున్నారు. యూదుల దేవుడు ప్రాచీన హేబ్రూ భాష మాత్రమే తెలిసినవాడు. క్రైస్తవుల దేవుడు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాడు. యూరోప్ వాసుల వాణిజ్య వ్యాపార విస్తృతితోబాటు, దేవుణ్ణి వెంట బెట్టుకెళ్ళి ప్రచారం చేసి పెట్టారు.  ముస్లింల దేవుడు 7వ శతాబ్ది నుండి ఆరంభించి, ఉధృతంగా విస్తరించాడు.
బౌద్ధం బాగా ప్రాచీనమైనా చాలాకాలం ఇండియాకు, ఆసియా ఖండానికి పరిమితమై సరిపెట్టారు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాలకు బౌద్ధం కొంత విస్తరించకపోలేదు.
హిందువుల దేవుళ్ళు ఇండియాకు మాత్రమే సరిపెట్టుకున్నారు. వీరి సంఖ్య అపరిమితంగా వుంది. అందులో ప్రధానమైనవారు ముగ్గురే కాగా, చిలవలపలవలుగా మిగిలినవారు తలెత్తారు.
దక్షిణ అమెరికాలో, చైనాలో, ఆఫ్రికాలో దేవుళ్ళు వేరే లేకపోలేదు. మొత్తం మీద దేవుళ్ళు చరిత్ర, పరిణామం విజ్ఞాన సర్వస్వసంపుటాలకు మించిపోయింది. దానికి యింకా ఫుల్ స్టాప్ పెట్టలేదు.
ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని మతాలున్నా, ఎన్ని రూపాలు కనబడినా అసలు దేవుడు ఒక్కడే అనేవారున్నారు.
విశ్వవ్యాప్తంగా ఒకే శక్తి వున్నదని అది అతీతమైనదని నమ్మేవారు కనిపిస్తారు.
దేవుడు సర్వాంతర్యామి అని, సర్వజ్ఞుడు అని, సర్వ శక్తివంతుడు అని వర్ణించిన వారూ వున్నారు.
దేవుళ్ళను గురించి రాసినా, మాట్లాడినా, సినిమాలు తీసినా, అదంతా మానవ ప్రక్రియమాత్రమే.
పరిమితమైన మానవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడి గురించి ఎలా మాట్లాడగలడు? అలా మాట్లాడేవారికి దైవంతోబాటు అన్ని లక్షణాలు వుండి వుండాలి. లేవు గనక వూహిస్తున్నారు.
ఇంతకూ యీ దైవ భావన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది?
మానవుల శక్తి పరిమితం. తెలియని అంశాలు అపరిమితం, క్రమేణా తెలుసుకుంటూ సాగిపోతున్నారు. ఈలోగా తెలియని వాటికి కారణాలు వెతకడం సహజం. కారణాలు తెలియనప్పుడు, అంతవరకూ, ఆగకుండా, దైవభావం తెచ్చిపెట్టారు. మనుషులకు తెలియనివాటికి, కారణం దైవం అని నమ్మారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు, ఎండలు, భూకంపాలు, తుఫాన్ లు, గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షం, భూగర్భం, సముద్రాలు యిత్యాది అన్నీ దైవ సృష్టి అని నమ్మారు. అంటే కార్యకారణ వాదం గట్టిగా అంగీకరించారన్నమాట. ప్రతి దానికీ కారణం వుండాలి. మనకు తెలియనప్పుడు అదే దైవం అన్నారు. తర్కం బాగున్నది. ఆ మాటమీదే నిలిస్తే, ప్రతిదానికీ కారణం వుండాలి అంటే, సరే బాగుంది.
అయితే, వీటన్నిటికి కారణమైన దేవుడికి కారణం ఏమిటి? ఆ మాట అడగొద్దు అన్నారు. అది తప్పు అన్నారు. శిక్షించారు. నరకానికి పోతావన్నారు. ఇంకా ఏమో అన్నారు. అక్కడ కార్యకారణ వాదం విఫలమైంది.
అన్నిటికీ కారణం దేవుడే అయితే, స్వయంగా సృష్టించే శక్తి అయితే, ఆ మాట ప్రకృతికి ఎందుకు అంటగట్ట కూడదు?
కొత్త దేవుళ్ళు
దేవుళ్ళ చరిత్ర చూస్తే అందరూ పరిణమించిన వారే. కొందరు శక్తివంతంగా తయారైతే, మరికొందరు పేలవంగా తేలిపోయారు. ఎహోవా, జీసెస్, అల్లా, బుద్ధుడు, బ్రహ్మ, విష్ణు, శివ యిలా ఎవరిపేరు విన్నా అదే కథ. ప్రజల్నిబట్టి వారి భాషలోనే పవిత్ర గ్రంథాలు, దేవుళ్ళు అందించారు. చదువు రాకపోయినా గ్రంథాలు రాయడం దైవ శక్తికి నిదర్శనంగా మానవులు చూపారు!
అట్లా వుండగా, ప్రతి శతాబ్దిలో కొత్త దేవుళ్ళను సృష్టించారు. ఇంకా పుట్టిస్తూనే వున్నారు. ఇండియాలో షిర్డీసాయి, అయ్యప్ప, వెంకటేశ్వరుడు, ఇంకా మాతలు, బాబాలు అందరూ స్థానిక దేవుళ్లే.
క్రైస్తవులలో కేథలిక్కులతో ఆరంభించి, క్రమేణా చీలి, ప్రొటస్టెంట్.లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, మర్మోన్లు, సైంటాలజిస్టులు, కొన్నివందల శాఖలు చేరాయి. ముస్లింలలో సున్నీలు, ప్రథాన శాఖగా ఉన్న తరువాత షియాలు, ఖుర్ద్ లు, ఇంకా అనేక చిన్న ప్రాంతీయ శాఖలు వున్నాయి.  బౌద్ధులలో హీనయాన, మహాయానం ముఖ్యం కాగా, చిన్న శాఖలు వుండనే వున్నాయి.
చీలిన శాఖలు శివమెత్తి అనేక సందర్భాలలో దేవుడి పేర కొట్టుకున్నారు. చంపుకున్నారు. ఇంకా అది సాగుతూనే వున్నది.
దేవుడి జీవితం ప్రభావం
మనుషులే దేవుళ్ళను పుట్టించారు. క్రమేణా ఆ దేవుళ్ళకు బానిసలయ్యారు. తామే దేవుళ్ళను పుట్టించామని మరిచిపోయారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా దేవుడిని నమ్ముతున్నవారు యించుమించు అత్యధిక సంఖ్యలో వున్నారు. ఇది 90 శాతం వరకూ లేకపోలేదు. ఇందులో తారతమ్యాలున్నాయి. వ్యక్తిగతంగా దేవుడుంటాడని కొందరనుకుంటారు. శక్తిగానే మిగిలాడని కొందరు నమ్ముతారు. వివిధ అవతారాలను విశ్వసించేవారూ వున్నారు. దేవుడికి పెళ్ళి చేయడం, సంతానం కలగడం, కొందరికి బహుభార్యాత్వం యివన్నీ మనుషులు అంటగట్టినవే.
దేవుడిని నమ్మించడానికి ఎత్తుగడలు పాటించారు. అందులో ముఖ్యాంశం “పవిత్ర గ్రంథాలు” మనుషులు రాసినా, వాటిని గౌరవించి, ఆరాధించి, పాటించాలంటే, పవిత్రం అని ముద్ర వేయాలి. అదే చేశారు. ఇంచుమించు అన్ని మతాలకు పవిత్ర గ్రంథాలున్నాయి. కొండ గుహల్లో చదువురాని వ్యక్తులకు దేవుడు వీటిని అందించిన కథలున్నాయి. వేదాలను అపౌరుషేయాలన్నారు. మూలగ్రంథాల సృష్టి ఆధునిక కాలాలవరకూ, సాగింది. క్రైస్తవులలో మోర్మోన్.లు, సైంటాలజీ శాఖలు ఆ పని చేశాయి. మూలగ్రంథాలన్నీ మనుషులు సృష్టించడంతో వుండవలసిన దోషాలు, పరస్పర విరుద్ధ విషయాలు, సెక్స్, కిరాతకాలు, నీతి సూత్రాలు అన్నీ వున్నాయి. మత గ్రంథాలను సైంటిఫిక్ గా సమర్థించే ప్రయత్నాలు సాగాయి. కాని ఫలించలేదు.
దేవుడి చుట్టూ, స్వర్గం, నరకం, కర్మ, పాపం, పుణ్యం, పునర్జన్మ, ప్రార్థనలు, యోగ, మొదలైనవన్నీ ఆకర్షణలుగా అల్లారు పురోహిత వర్గం. దేవుడికి మనుషులకు మధ్య దళారులుగా నిరంతర వ్యాపారం చేస్తున్నారు.
దేవుడున్నాడా? లేడా? అనేది నమ్మకస్తుల సమస్య. రుజువు చేయవలసింది నమ్మకస్తులే. వున్నాడని గట్టిగా నమ్మి ఇతరులకు బోధ చేస్తున్నారు. వారే రుజువు చేయాలి. అలా చేయనంత వరకూ వారు చెప్పేది నిజం కాదని అనడంలో తప్పులేదు. సైంటిఫిక్.గా దేవుడున్నాడని రుజువు చేస్తామంటున్నవారు ఎక్కడా సఫలం కాలేదు. సైంటిఫిక్ మెథడ్ తనను తాను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ సాగుతుంటుంది. దోషాలను ఒప్పుకుంటుంది. అంతా తెలిసింది అని ఎప్పుడూ అనదు. తెలుసుకోవడం అనంతంగా, నిరంతరంగా సాగే ప్రక్రియ. దానికి పవిత్ర గ్రంథాలుండవు. పెత్తందారీతనం వుండదు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఐన్ స్టయిన్.తో సహా రుజువుకు నిలవాల్సిందే. అది మతానికి అన్వయిస్తే ఏ దేవుడూ నిలవడు!!
by Innaiah Narisetti

2 comments:

Post a Comment