ధనెంకుల నరసింహం ( 1923-2001)

ధనెంకుల నరసింహం ( 1923-2001) రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బర్మా, ఇండియా కలిసే వుండేది. కోస్తా తీర ప్రాంతం నుండి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుండి అనేకమంది బర్మా వెళ్ళారు. జి.సి. కొండయ్య , గుత్తికొండ నరహరి, అలా వెళ్ళిన వాళ్ళలో ఉన్నారు. ధనెంకుల నరసింహం కూడా పదిహేనేళ్ళ ప్రాయానికే రంగూన్ వెళ్ళారు. అక్కడే స్కూలులో చేరి చదివారు. బాలభక్త సమాజం ఏర్పరచారు. 1937లో జవహర్ లాల్ నెహ్రూ రంగూన్ వెళ్ళినప్పుడు ధనెంకుల నరసింహం ఆయన్ను చూడగలిగారు. 1942లో ఎన్.జి. రంగాను కలసి ఆయన నాయకత్వాన్ని ఆదరించి, నెల్లూరు జిల్లాలో రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948 నాటికి స్వస్థలంలో స్కూలు ప్రారంభించి విద్యాభివృద్ధికి కృషిచేశారు. 1959 నాటికి జిల్లా పరిషత్తులో సభ్యులయ్యారు. 1962లో వరికుంటపాడు సమితికి అధ్యక్షుడయ్యాడు. ఆ ప్రాంతంలోని నక్కలగండి, గండిపాలెం, వెలుగొండ, ప్రాజెక్టులపై బాగా కృషిచేశారు. జిల్లాలో కిసాన్ సభలు జరిపి 1953 నుండి ఆచార్య రంగా, కందుల ఓబుల్ రెడ్డి, తెన్నేటి విశ్వనాథం వంటి నాయకులను ఆహ్వానించారు. 1967లో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర పార్టీ పక్షాన ఉదయగిరి నుండి ఎమ్.ఎల్.ఎ.గా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన ప్రత్యేక జై ఆంధ్రా ఉద్యమంలో ముందంజ వేశారు. విద్యార్ధిగా ఉన్న ఎమ్. వెంకయ్య నాయుడిని ప్రోత్సహించి రాజకీయాలలోకి ఆహ్వానించి, ఆరంగేట్రం చేయించింది ఈయనే. శాసనసభ్యుడుగా చక్కని ఉపన్యాసాలు చేసి పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీలో సభ్యుడుగా తన పాత్రను నిర్వహించాడు. అదే రోజులలో తన వాణి వినిపించటానికి నెల్లూరు నుండి `విజయభేరి` పత్రికను పెట్టారు. అనేకమంది చేత రాయించి, ఎడిట్ చేసేవారు. హైదరాబాదు రాజధాని విలేఖరిగా నేను రాజకీయ లేఖలు రాసేవాడిని. అనేక ఇతర వ్యాసాలు కూడా రాశాను. రాజకీయాలలో వచ్చిన మార్పులవలన ఆచార్య రంగా తిరిగి కాంగ్రెసులోకి ప్రవేశించగా, నరసింహం మాత్రం ప్రతిపక్షంలోనే ఉండిపోయాడు. 1988 నాటికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా ఎంపికై విద్యాభివృద్ధికి కృషి జరిపారు. తన కుమారులు అమెరికా వెళ్ళగా నరసింహం అమెరికా పర్యటించారు.

ఇన్నయ్య స్వీయచరిత్రకి శ్రీరమణ వినూత్నపరిచయం

ఇన్నయ్య స్వీయచరిత్రకి శ్రీరమణ వినూత్నపరిచయం ఈ పుస్తకానికి నన్ను ముందుమాట రాయమని ఇన్నయ్యగారడిగారు. మాటవరసకి గాని, మొహమాటానికి గాని ‘నేనేంటి మీ స్వీయచరిత్రకి మున్నుడి రాయడమేమిటి?’ అని అనకుండా అలాగే అన్నాను. ఒప్పుకున్న నేరానికి మొత్తం ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చదివాను. సందేహాలు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్లి తిరగేశా. అచ్చం హేతువాదులు ఎలా రాస్తారో అలాగే వుంది. మానవ వాదులు, నాస్తికులు, హేతువాదులు నాకు కొత్తకాదు. ‘ఎమ్. ఎన్. రాయిని తప్ప చిల్లర రాళ్ళని కొలవని వారని’ చాలా ఏళ్ళక్రితమే నిర్వచించాను. ఇన్నయ్య, కోమలగార్లంటే నాకు చాలా యిష్టం. అది యీ నాలుగు ముక్కలూ అయ్యేదాకా పక్కన పెడితే తప్ప కలం సాగదు. ఇన్నయ్య తన జీవనగమనంలో 75 సంవత్సరాల అనుభవాలను పొందుపరచాల్సినంత ఆప్తంగా పొందుపరిచారా లేదా అన్నది విజ్ఞులైన పాఠకులు తేల్చాల్సి వుంది. ఒక క్రమంలో వరసగా చెప్పుకుంటూ వెళ్ళాలని నిబంధన లేదు. గాని చాలా చోట్ల పునరుక్తి వుంది. రచయిత యీ పుస్తకంపై వెచ్చించాల్సిన సమయం వెచ్చించలేదనిపిస్తుంది. ఆనాటి రాష్ట్ర రాజకీయాలు, నడిచిన పత్రికల గురించి చక్కగా చెప్పారు. ‘ఆంధ్రరాష్ట్రంలో పుట్టిగిట్టిన పార్టీలు’ పేరుతో అన్నింటినీ ఎప్పుడో రికార్డ్ చేశారు. పత్రికారంగంలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పాలిటిక్స్ ని తన కోణంలోంచి స్పృశించారు. ఎమర్జెన్సీలో ఒక్క గోయెంకా తప్ప ఎవరూ ఎదురు నిలవలేదు. సంజయ్ గాంధి గుంటూరు రావడం ఆంధ్రజ్యోతి 40 పేజీల సప్లిమెంటు సంజయ్ స్తోత్రపాఠాలతో వేయడం ఒక మలుపు. ఘాటుగా నార్ల హైదరాబాదు నుంచి స్పందిస్తే దాన్ని ప్రచురించి, కింద దీనికి దీటుగా జవాబు యివ్వగలం గాని వారి మీదున్న గౌరవంతో యివ్వడం లేదని యాజమాన్యం బాక్స్ కట్టి వేసింది. నండూరి సంపాదకీయాలు నార్ల వొరవడిలోనే సాగేవని, అలా లేనివి తేలిపోయేవని వ్యాఖ్యానించారు. నండూరి రాసిన గాంధీసీరీస్, ద్వారం, మహమ్మద్ రఫీలాంటి సెలెబ్రిటీ పోయినపుడు రాసినవి (చిరంజీవులు) గానీ, నండూరి సొంతశైలిని, పరిజ్ఞానాన్ని, విశ్లేషణాపటిమను స్పష్టంగా ప్రదర్శిస్తాయి. నార్ల గొప్ప సంపాదకులు, సాహసి. కాని పలుసార్లు తన సొంత కక్ష కార్పణ్యాలను చూపిన దాఖలాలు లేవా? ఎడిటర్ గా తన హోదాని సొంతానికి వాడుకున్న సందర్భాలు లేవా? 1955 ఎన్నికల ప్రస్తావన వుంది యిందులో. ఎదురుదాడి పుస్తకం వచ్చింది సమగ్రంగా. పండితారాధ్యుల, శ్రీరంగం నారాయణ బాబు, కాళోజి, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, కమ్యూనిస్టు పార్టీకి దన్నుగా నిలిచారు. శ్రీశ్రీకి అప్పుడు మతిస్థిమితం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకిగానే నార్ల ముద్రవేసుకున్నారు. ఆవు-దూడా గుర్తుతో అనూహ్యమైన మెజారిటీతో ఇందిరా కాంగ్రెస్ గెలిచినపుడు, నార్లకి తన ఆక్రోశాన్ని ఎలా అణుచుకోవాలో అర్థం కాలేదు. ఆవు-దూడ దాని ముందు పెద్ద మోపెడు గడ్డి వేసి, ‘ఎక్కాతక్కి’ అనే శీర్షికలో ఇ. వి. ఆర్ కి చెప్పి కార్టూన్ వేయించారు. ప్రజల తీర్పుని గడ్డితో పోల్చడం ఔచిత్యం వుందా? ప్రజారాజ్యంలో ప్రజల యిష్టానికి విలువ యివ్వద్దా? నార్ల మరో అబ్సెషన్ విశ్వనాథ సత్యనారాయణ. నాగార్జున విశ్వవిద్యాలయంలో విశ్వనాథ పీఠం పెట్టాలన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి చాలా రగడ లేపింది.చేశాననే భావం వ్యక్తపరిచారు. వివేకానంద గురించి ఏదో గుట్టు రట్టు చేశాననే భావం వ్యక్తపరిచారు.ఔను, ఖేత్రీ సంస్థానాధీశులు ఆనాడు అమెరికాయాత్రకు సాయం చేశారు. విలాస జీవితం అంటే యిష్టం. కుటుంబానికి చాలా సాయపడ్డాడు. అంతమాత్రం చేత వివేకానందుణ్ణి తూర్పార పట్టాల్సిన పనిలేదు. ఆయన దేశాభిమానాన్ని మానవజాతిపట్ల ఆయనకు గల ఆపేక్షను తక్కువగా అంచనా వేయడం మర్యాద కాదు. నేను సుమారు 40 ఏళ్ళ క్రితం ఖేత్రీ సంస్థానానికి వెళ్లాను. హిమాలయ పాదపీఠంలో లోహ ఘాట్ దాని కేంద్రం. ఖేత్రి కుటుంబాలకు అప్పటికే సంస్థానాలు పోయాయి. ఉత్తరప్రదేశ్, ఆ చుట్టుపక్కల టీ ఎస్టేట్స్ వున్నాయి. టీ ఏజెన్సీ, యితర వ్యాపారాలతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు చాలా చదివి, చాలా మందితో సన్నిహిత పరిచయాలుండి లోకం విస్తృతంగా చూసిన ఇన్నయ్యగారి లాంటి వారి నుంచి యింకా బోలెడు ఆసక్తికర విషయాలను పాఠకులు ఎదురు చూస్తారు. “మార్క్స్ కి గ్రహణం పట్టించిన మార్క్సిస్టులు” శీర్షికతో ఇన్నయ్యగారి `ఆంధ్రజ్యోతి`లో వ్యాస పరంపర నడిచింది. అలాంటి వ్యాసాలు నచ్చేవారికి అవి నచ్చాయి. అనంత కాలంలో ఎరిక్ ఫ్రామ్ రచనలు, అభిప్రాయాలు ఇన్నయ్యని ఆకర్షించి వుంటాయని నా సందేహం. సర్వసమానత్వం, సంపద పోగేసుకోవడం నేరంలాంటి మార్క్సిస్టు సిద్ధాంతాలు ఆచరణ సాధ్యంగాని చక్కని నినాదాలుగా నాకు ధ్వనిస్తాయి. అన్నట్టు ప్రసిద్ధ కమ్యూనిస్టు రచయిత రావిశాస్త్రికి జ్యోతిష్యమంటే ఎంత ఆసక్తో, నమ్మకమో చెప్పలేను. ఇన్నయ్య, కోమలగార్లు సహృదయులు. మంచి అతిథేయులు. ఇంటికి వెళితే కోమల గారు ఏదో ఒకటి తినిపించకుండా పంపరు. ఇన్నయ్యగారి దొడ్లో మంచి పనస చెట్టుంది. తేనెపనస అని పద్మినీజాతి చెట్టు. దాని కాయల్లో మూడు వంతులు నాకే దక్కేవి. ఇన్నయ్యగారు అమెరికా వెళ్ళడంతో తేనెపనస తొనలు పోగొట్టుకున్నాను. ఇంత మంచి మనిషికి రవ్వంత దైవభక్తి కూడా వుండి వుంటే ఎంతబాగుణ్ణనిపిస్తుంది. హేతువాదులు ఏదో భ్రమపడతారు కాని మేము మాత్రం దేవుణ్ణి నమ్మి ప్రత్యేకం ఏమి చేస్తున్నాం? దేవుడి మీద నిజంగా భయం భక్తీ వుంటే తిరుపతి పరకామణి దగ్గర అన్ని సి.సి. కెమెరాలెందుకు? హుండీ దగ్గర అంత కాపలా దేనికి.. దేవుడంటే అందరికీ చనువే. ఒకసారి బెంగుళూరు వెళ్ళినపుడు అగరుబత్తీలు తెచ్చాను. తీరా వెలిగిస్తే ఏమాత్రం పరిమళంగా లేవు. ఏం బాగాలేవన్నాను. వెంటనే మా అమ్మ, అవి పారేయకు నాయనా నాకివ్వు దేవుడి దగ్గర వెలిగించుకుంటా అని తీసుకుంది. మా తాతగారు ప్రతి శనివారం కొబ్బరికాయ కొట్టేవారు. ఆ రోజు మా యింట్లో గోరుచిక్కుడుకాయ కూర తప్పనిసరి. పూజ కూడా త్వరగా ముగించి, కూర వేల్టికి కొబ్బరి అందించేవారు. వేమూరు సెంటర్ లో లక్ష్మీ గణపతి గుడి వుంది. దాన్ని ఆనుకునే చిన్న హోటల్ వుండేది. ఇప్పుడు కూడా వుంది. పొద్దున్నే వ్యాపారస్తులంతా వచ్చి, దేముడి మొక్కి, ఆ హోటల్ లో మెక్కి వెళ్ళేవారు. మా చిన్నతనంలో కొణిజేటి రోశయ్యగారు లక్ష్మీగణపతిని దర్శించుకుని, అక్కడ వేడి ఇడ్లీ కారప్పొడి నెయ్యిలో తిని రైస్ మిల్లుకి వెళ్ళేవారు. అదే ఆయనను ఇంతవాడిని చేసిందని నా నమ్మకం. ఇన్నయ్యగారు అంగీకరించకపోవచ్చు. కార్యకారణ సిద్ధాంతాన్ని అన్వయించి, అంచెలంచెలుగా ఎదిగారని తర్కించి రుజువు చెయ్యచ్చు. స్కూలు పిల్లలందరూ పరీక్షల సీజన్ లో తప్పకుండా గణపతికి మొక్కుకునేవారు. నేను, మా అన్నయ్య ఏటా రెండు టెంకాయలు ఖాయలు. రిజల్ట్స్ రాగానే ఇద్దరం నాలుగు కాయలు కొట్టి వచ్చేవాళ్ళం. సరిగ్గా పగలు పన్నెండున్నరకి పూజారి గుడి తలుపులు వేసి భోజనానికి వెళ్ళేవాడు. మళ్ళీ నాలుగింటికి గుడి తలుపు తీస్తారు. మేము సరిగ్గా ఒంటిగంటకు వెళ్ళినాలుగు కాయలు గుమ్మం ముందు కొట్టి, ఎనిమిది టెంకాయ చిప్పలూ యింటికి తెచ్చి మా నాయనమ్మని ఆనంద పెట్టేవాళ్లం. అమ్మ పైకి కేకలేసినా లోలోపల మురిసిపోయేది. ఈ ఉదాహరణలన్నీ ఎందుకంటే మేం కూడా మూఢభక్తులం కాదనీ, హేతువాదులమేననీ నమ్మించడానికి. మామూలుగా హిందూ బాబాల మీద, మాతాజీల మీద దాడి చేస్తారు. గాని ఇతర మతాల జోలికి పోరు. ఇన్నయ్య మదర్ తెరిసా ప్రస్తావన కూడా తెచ్చారు.ఇస్లాం, క్రైస్తవం ను తీవ్రంగా విమర్శకు గురి చేశారు. ఒకసారి ‘వేలాడు సమాధి’ అనే వ్యాసం వచ్చింది. హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఆఫీసు పేల్చేస్తామన్నారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ గారు పార్లమెంటులో నిండు మనసుతో క్షమాపణలు చెప్పుకున్నారు. ఆ వ్యాసం శాస్త్రీయమైనదే. కాని క్షణాపణ క్షమాపణే! ఎవరి మనోభావాలు వారివి. ఇది ఆధునిక ఋక్కు. దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి? అనే కథను వందేళ్ళకు ముందే రాశారు గురజాడ. ఆస్తికత్వం పుట్టగానే నాస్తికత్వం పుట్టింది. చార్వాకం వచ్చింది. కొందరిని ఆకర్షించింది. దేవుడు నల్లరాయిలా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చలించలేదు. యుగయుగాలుగా తట్టుకు నిలబడ్డాడు. రాజమండ్రిలో రామలింగసిద్ధాంతి అని ఒక జ్యోతిషవేత్త వున్నాడు. చాలా ఫేమస్. జ్ఞాని జైల్ సింగ్, ఇందిరాగాంధి లాంటివారు కూడా ఆయన వద్ద చేతులు జాచారంటే మీరే ఆలోచించుకోండి ఆయన స్థాయి. ఒక మిత్రుని ద్వారా వారిని కలిశాను. ఒక సాయంత్రం పూట రాజమండ్రి లాంచీలరేవు గట్టుమీద సిగరెట్టు కాలుస్తూ కూచున్నారు సిద్ధాంతిగారు. మిత్రుడు యిదే మంచి అదును అనుకుని నన్ను పరిచయం చేశారు. చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఎలా భవిష్యత్ వాణిని వినిపించగలుగుతున్నారని అడిగాను. ఆయన గోదావరి వైపు చూసి చిరునవ్వుని కొద్దిగా శ్రుతిపెంచి నవ్వాడు. సంగీతపు భాషలో అయితే స్థాయి ఒకటిన్నర అనుకోవచ్చు. ‘చూడు బాబూ’ ఎక్కడో కోటల్లో వుండేవారు మన రాజమండ్రిని వెతుక్కుంటూ వచ్చి, తమ దర్శనమే మహాభాగ్యంగా కోట్లాది ప్రజలు భావించే మాహానుభావులు యీ సిద్ధాంతి ముందు భయభక్తులతో చెయ్యిజాచారంటేనే… (సిగరెట్ చివరి పీల్పు లాగి విసిరేసి) వారి గ్రహాలు కుదురుగా లేవని అర్థం. అన్నీ బావుండి అంతా సక్రమంగా వుంటే యీ రామలింగం ఎవడు? వక్రంగా వుంటేనే యీ వేట ఆరంభమవుతుంది. ఇదిగో ఆ ఆలోచనతో కథ నడిపిస్తాం! మాకప్పుడు ఒక్క సత్యం తలకెక్కింది. సైన్సయినా, ఆసైన్సయినా కామన్ సైన్స్ లోంచి, విచక్షణాజ్ఞానంలోంచి వుద్భవిస్తాయని. మా వేమూరులో ‘కోడిగుడ్డుపస్తీ’ వేసేవాడు అంజాదాసు. ఆయనతో ఆశ్రమంలాంటి యిల్లు, పెరట్లో పెద్ద గిలకబావి వుండేవి. ఇంట్లో సొమ్ము పోయినా, పంటకుప్పలు, గడ్డివాములూ తగలబడ్డప్పుడు ఎవరిమీదన్నా అనుమానం వున్నా, దయ్యం పట్టిందని డౌటు వచ్చి అంజాదాసు పస్తిీకి వచ్చేవారు. తొమ్మిది పదేళ్ళ కుర్రాడు చేత మాత్రమే చెప్పిస్తాడు. మనమే తీసికెళ్ళవచ్చు పిల్లాణ్ణి. కోడిగుడ్డకి మసి పట్టిస్తాడు పూర్తిగా. ఈ పస్తీక్రియ సూర్యోదయానికి ముందే పూర్తవుతుంది. గడ్డివామి తగలడిందని, ఎవరో తేలాలని పస్తీకి వెళ్ళాం. వారంలో రెండురోజులే పస్తీ వేసేవాడు. వారం ఖరారైంది. తెల్లవారుజామున అయిందింటికి తొమ్మిదేళ్ళ పిల్లాడితో సహా మేం నలుగురం వెళ్ళాం. పిల్లాడి ఒంటిమీద బట్టలు విప్పి చిన్న గోచీ పెట్టి బావి గట్టుమీద వాడిని నిలబెట్టారు. మమ్మల్ని దూరంగా నిలబడమన్నాడు అంజాదాసు జడలగట్టిన జుట్టు, గెడ్డంతో నుదురంతా కుంకం పూసుకుని కాషాయి కొల్లాయి కట్టుకుని వున్నాడు. పిల్లాడిని ఎగాదిగా చూశాడు కళ్ళు పెద్దవి చేసి, పెద్దగా హూంకరించి లోపలకు వెళ్ళాడు. ఇద్దరు మనుషులు వస్తాదుల్లా వున్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద బొక్కెన్లతో నీళ్ళు తోడి పిల్లాడి తలమీద పోయడం మొదలు పెట్టారు. అప్పటికే వాడు భయంతో బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈ వాతావరణం, చన్నీళ్ళధారలు వాడిని వొణికిస్తున్నాయి. ఇంతలో లోపల్నించి గంటలు మోగడం మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు పది కంచుగంటలు. ఒక్కతాడు లాగితే పదీ వూగి మోగే ఏర్పాటుంది. మధ్యమధ్య శంఖనాదాలు, హోరు. వందకు పైగా బొక్కన్ల నీళ్ళు వాడి మీంచి జారాయి. పిల్లగాణ్ణి లోపలికి తీసుకురండి అని అరుపు వినిపించింది. మమ్మల్ని కూడా రమ్మన్నారు. లోపల గుగ్గిల్లం పొగలు కక్కుతోంది. రెండు కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాల మధ్య అంజాదాసు మోకాళ్ళ మీద కూచుని వున్నాడు. ముందున్న ముగ్గు మీద పిల్లాణ్ణి నిలబెట్టారు. వాడి మెడలో నిమ్మకాయల దండ వేశారు. అప్పటికే పిల్లగాడి మెదడు అదుపు తప్పి వుంటుంది. చూసేవాళ్ళకీ పెద్దవాళ్ళకే అట్లా వుంది. మసిపూసిన కోడిగుడ్డుని చిన్న దీపపుకుందిలో పెట్టి తెచ్చారు. అంజాదాసు పిల్లాడి నెత్తిన అరచెయ్యి పెట్టి, ఏవో మంత్రాలు గొణిగాడు. పెదాలు భయంకరంగా కదుల్తున్నాయి.. అన్నాడు గంభీరంగా. వాడు తలూపాడు. ‘నోటితో చెప్పు’ అన్నాడు. చెప్పాడు. ‘గుడ్డుమీద తెరతీస్తా, తెరలోంచి ఏం కనిపిస్తోందా చెప్పాల’ అన్నాడు అంజాదాసు. మేము వుత్కంఠగా దగ్గరగా వెళ్ళబోతే అల్లంత దూరాన సైగతోనే ఆపారు. ‘చూడు’ చూడు ఏం కనిపిస్తోంది.. పిల్లాడి మౌనం. ‘గడ్డివామి కనిపిస్తుంది చూడు’ అని ఘీంకరించాడు. పిల్లాడి తలనించి చన్నీళ్ళు బొట్లు బొట్లుగా రాలుతున్నాయి. వాడి కాళ్ళు చలికి భయానికి వణుకుతున్నాయి. తర్వాత అంజాదాసు అడిగినవన్నీ వాడికి కోడిగుడ్డు మీద కనిపించాయి. గళ్ళలుంగీ కట్టుకున్న జులపాల జుట్టువాడు రావడం, పిడకల మధ్య నిప్పు తెచ్చి గడ్డివామిలో పెట్టి వెళ్ళడం, చెట్టుమీద కాకులు అరవడం, దూరంగా రెండు గేదెలు అన్నీ ఆ పిల్లాడికి కనిపించాయి. అయితే అంజాదాసే ముందుగా చూసి వివరం చెబుతాడు. చివరకు ఏమవుతుందంటే వీళ్ళు ఎవరిని అనుమానిస్తున్నారో వాడి పోలికలే కనిపిస్తాయి. అంజాదాసు పస్తీకి బోలెడు సంబరాలూ, కొద్దిగా డబ్బు తీసుకుంటాడు. దయ్యం పట్టినపుడు దాన్ని వదిలించడానికి చాలా ఖర్చు అవుతుంది. అసలు సంగతేమంటే మాకసలు గడ్డివామి లేదు. అయినా తర్వాత కూడా అంజాదాసు ప్రాక్టీసు పడిపోలేదు. మేము చాలా తెలివిగా పోలీసు కంప్లయింట్ యిద్దామని వెళ్ళాం. ‘మేము కూడా ఒక్కోసారి క్లూ కోసం దాసుగారి దగ్గరకు వెళ్తుంటాం’ అన్నాడు. హెడ్డు, అంజాదాసు కేవలం ఒక వ్యక్తిగాదని ఒక వ్యవస్థనీ మాకు అర్థమైంది. కల్కి భగవాన్ దంపతుల లీలలు మద్రాసులో వున్నప్పటి నుంచి నాకు తెలుసు. అక్కడ సానుకూలంగా లేదని మన సరిహద్దుకు మార్చాడు మకాం. కిందటి సంవత్సరం మహా ఛానెల్ లో కల్కి బండారాన్ని సీరియల్ గా ప్రత్యక్షంగా గంటలకొద్దీ ప్రసారం చేసింది. దాసాజీలతో స్వయంగా బండారాలు బయటపెట్టారు. వాళ్ళ ఫోన్ కాల్స్ వినిపించారు. మొదటి రోజు కల్కి భక్తులు కొద్దిమంది వచ్చి గొడవ చేసారు. తరవాత షరా మామూలే. భక్తులు తరగకపోగా, బోలెడు ప్రచారం వచ్చింది. అక్కడి విశేషాలు వింతలు తెల్సుకుని కొత్త భక్తులు చేరి వుంటారు. నిత్యం రకరకాల పేర్లతో ఐడియాలతో సంస్థలు వెలిసి కుచ్చుటోపి పెట్టిన వార్తలు వస్తూనే వుంటాయి. అయినా మళ్ళీ కొత్తవి వస్తూనే వుంటాయి. మనిషిలో పేరాశ వున్నన్నాళ్ళు యివి వర్థిల్లుతూనే వుంటాయి. ఈజీ మనీ, ఇహలోక భోగాలు శక్తివంతమైన అయస్కాంతాలు. వీటిని సమూలంగా వదిలించాలంటే మనలోనే మార్పు రావాలి. ప్రతి మూఢనమ్మకం వెనక స్వార్థం వుంటుంది - రెండువైపులా, లాటరీలను ప్రభుత్వాలే నడిపి అదృష్టాల్ని రూపాయికి అమ్ముతున్నాం కదా! పైగా వెల్ఫేర్ లాటరీలు! నాకు 131 న్యూ ఎంఎల్ఎ క్వార్టర్స్ బాగా పరిచయం. `ప్రసారిత` క్వార్టర్లీతో సాన్నిహిత్యం. ‘గతాన్ని గురించిన అపోహలు’ పేరుతో రొమిలా థాపర్ `పాస్ట్ అండ్ ప్రిజడిస్` అనువాదాన్ని వేశారు. ఎమర్జన్సీలో థాపర్ కుటుంబాన్ని చాలా రొష్టు పెట్టింది ప్రభుత్వం. ఎమర్జన్సీ అనంతరం రొమిలా నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చింది. ప్రత్యేకం చూడడానికి వెళ్ళాను. జీన్స్ ప్యాంటు, టీషర్టు, చేతిలో సిగరెట్టు. వేదిక మీదకు వస్తూనే సిగరెట్టు చివరి దమ్ములాగి కిందవేసి నలిపేసి మైకు ముందుకు వచ్చి అద్భుతంగా ప్రసంగించింది. రాత్రి ఇంటికి వెళ్ళాక, అమ్మకి చెప్పాను. పంట్లాము బనీను వేసుకుంటే ఫర్వాలేదుగాని అట్లా సిగరెట్లు కాలిస్తే మనకు యిబ్బంది అవుతందేమోనంది. ఆవిడ ఏమనుకుందో ఏమో? నాకు ఇన్నయ్యగారికి తెలిసినవారిలో సగానికి పైగా దగ్గరగా తెలుసు. మల్లాది రామ్మూర్తి బాపట్లలో మా పక్కింటాయన. మా తాతగారికి ఏరా ఏరా మిత్రుడు. పొద్దున్నే కలిసి రేడియో వినేవారు. కలిసి పేపరు చదివేవారు. అందర్నీ తిట్టుకుని, ఆఖరికి వాళ్ళిద్దరూ తిట్టుకుని లేచి వెళ్ళిపోయేవారు. పాపం రామ్మూర్తిగారి తల్లి పరమ శ్రోత్రీయ వితంతువు, వికేశిని. రామ్మూర్తి, సుబ్బమ్మ దంపతులు అతి బలవంతంగా ఆయుర్వేద గుళికలు మింగినట్లు మాంసం మింగడం మొదలుపెట్టారు. ఆ తల్లి తట్టుకోలేక తరచు మా యింట్లో భోజనం చేసేది. ఇలాంటి వాటికి వీరు ఏమి సంజాయిషీ చెబుతారో ఆ దేవుడికే తెలియాలి. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాట ద్రవిడ వుద్యమం బాగా నడిచింది. రావణుడు, విశ్వామిత్రుడు, కర్ణుడు వీళ్ళంతా సజ్జనులేగాని దుర్జనులు కారని దానిని సమర్థిస్తూ రచనలు చేశారు. ప్రముఖ తమిళ రంగస్థల నటుడు మనోహర యీ నాటకాలే ప్రదర్శించేవాడు. అవి ఎన్.టి.ఆర్ ని కొంత ప్రభావితం చేశాయి. తరువాత కాలంలో కొండవీటి వెంకటకవిలాంటి వారి ప్రోద్బలంతో యీ ప్రతినాయక పాత్రలను నాయకులను చేసి దానవీర శూరకర్ణ, విశ్వామిత్ర సినిమాలు తీసి ముఖ్య భుమికలలో తానే కనిపించారు. ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ద్రవిడ వుద్యమం వైదిక ధర్మాన్ని సంస్కృతిని విమర్శించడానికే అంకితమైంది. ఇ.కె.ఫణిక్కర్ లాంటి మేథావులు వుద్యమానికి మంచి స్ఫూర్తినిచ్చారు. ఫణిక్కర్ ‘హిందీలో రెండే గొప్ప గ్రంథాలున్నాయి. ఒకటి తులసీదాస్ రామాయణం, రెండోది ఆలిండియా రైల్వేగైడు’ అన్నాడు. దీనికాయన పార్లమెంటులో క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. ఎవరెన్ని చేసినా తమిళదేశంలో ఆలయ సాంప్రదాయం భక్తి సంగీతం మూడు ప్రాకారాలు ఆరుగోపురాలుగా వర్థిల్లింది. తరువాతి నేతలు కరుణానిధి, ఎమ్.జి.ఆర్ ప్రజల నాడి దృష్ట్యా దైవదూషణలో తీవ్రతని తగ్గించారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల విశ్వాసాలను గౌరవించి కపాలికొలనులో తలపాగా చుట్టుకుని పలుగుపార పట్టుకుని కరుణానిధి పూడిక తీశాడు. ఫోటోలకు పోజులిచ్చాడు. జనాన్ని చల్లబరచడానికి తాను నమ్మని విశ్వాసాలను నటించడానికి వెనుకాడలేదు. హేతువాదం, నాస్తికత్వం అడ్డురాలేదు. ఎమ్.జి.ఆర్ ఎప్పుడూ అంత తీవ్రవాది కాదు. మూకాంబిక ఆలయానికి తరచు గోప్యంగా వెళ్ళొస్తూ వుండేవాడు. ఎమ్.జి.ఆర్ ఎప్పుడూ అంత తీవ్రవాది కాదు. మూకాంబిక ఆలయానికి తరచు గోప్యంగా వెళ్ళొస్తూ వుండేవాడు. చివరకు యీ వుద్యమాలకు ఓటు కేంద్రబిందువుగా నిలిచింది. అది ఇప్పుడు ద్రోణిలా ఆంధ్రరాష్ట్రానికి విస్తరించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. కులం, మతం ఓటుపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. సీట్ల కేటాయింపులు అదే ప్రాతిపదికన జరుగుతున్నప్పుడు ఓట్ల సంగతి వేరే చెప్పడం దేనికి. సీటంటే ఒక పెద్దనోటు అనుకుంటే, ఓటు దాని తాలూకు చిల్లర. వందపైసలు కలిస్తే ఒక రూపాయి. లక్షన్నర ఓటు కలిస్తే ఒక అసెంబ్లీ సీటు సర్ త్యాగరాయ పిట్టిలాంటి వ్యాపారవేత్తలు యీ వుద్యమానికి కడదాకా అండగా నిలిచారు. చక్రవర్తి రాజగోపాలాచారి, కులపతి కె.ఎమ్.మున్షిలాంటి చతురులు ఎంతో సమతూకంగా రచనలు చేస్తూ పరిస్థితులు పెచ్చరిల్లకుండా కాపాడారు. దేశ రాజకీయాలలో, వుమ్మడి మద్రాసు రాష్ట్ర రాజకీయాలలో రాజాజీ అసాధారణ పాత్రని చాకచక్యంగా పోషించారని పెద్దలు చెబుతారు. హఠాత్తుగా అకారణంగా ప్రకాశం ప్రభుత్వం కుప్పకూలినపుడు, ‘కలయో… వైష్ణవ మాయయో’ అని ఆంధ్రపత్రిక శీర్షిక పెట్టి శీర్షికలోనే సంగతి చెప్పింది. ఏది ఏమైనా ద్రవిడ పదాన్ని వాళ్ళు వదలరు. ద్రవిడ కజగం, ద్రవిడ మున్నేట్ర కజగం, అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం యిలా నడుస్తున్నాయి పార్టీల పేర్లు. దక్షిణాదిన అయ్యప్పస్వామి ఒక పెద్ద ఆకర్షణ. సంక్రాంతి తరుణంలో మకరజ్యోతి దర్శనం యిస్తుంది. మనకి స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి తేది ఖరారు చేసి మకరసంక్రమణం దగ్గర్లో, దూరంగా కొండల్లో కొన్ని టన్నుల కర్పూరం వెలిగిస్తారని, అది నిజం జ్యోతి కాదని వదంతి వచ్చింది. అంతా అడివి ప్రాంతం. కొందరు ఇన్నయ్యలాంటి వారు ధైర్యం చేసి వెళ్ళారు. అక్కడ ఒక కొండరాయి మీద నల్లగా కర్పూరం మండిన మసి కనిపించింది. కోర్టుకు వెళ్ళారు. ‘ఔను మేమే ఏర్పాటు చేస్తున్నా. ఇది ఒక ఉత్సవంలో భాగం. అది దైవమహిమని ఎవరన్నారు పొ’మ్మన్నారు. అయ్యప్ప స్వాములు దీనివల్ల తగ్గలేదు. ఒకప్పుడు దాదాపు వందమైళ్లు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పడు నడక ప్రయాస కొంత తగ్గింది. మనిషిని మూఢ నమ్మకంవైపు మళ్ళించినంత తేలిగ్గా శాస్త్రీయం వైపు తిప్పలేం. మనిషి భయస్తుడు. ఎందుకొచ్చిన తంటా, ఓ దణ్ణం పెడితే పోలేదా అనుకుంటాడు. ఇన్నయ్యగారిది పాతరెడ్డిపాలెం. మాకు కొత్తరెడ్డి పాలెంతో కాషాయి సంబంధాలు వుండేవి. అక్కడొక సాములారుండేవారు. ఆయన మా ఇంటికొస్తే మేము సేవించుకునేవాళ్లం. పెద్ద మాటకారి కాదు. మహిమలూ అవీ చూపించడం తెలియదు. బాపట్లలో మాకు పెద్దఇల్లు దానికి పెద్ద వరండా వుండేది. దక్షిణంవైపు వరండాలో సాయంత్రం అయిదింటికల్లా జింకచర్మం మీద ఆయన కూచుని వుండేవారు. నేను కొంచెం అటూ యిటుగా అదే సమయానికి కాలేజి నుంచి వచ్చేవాణ్ణి. నాకోసం ఆయన కళ్ళు నిరీక్షిస్తూ వుండేవి. వస్తూనే పొట్లం విప్పుతూ ఆయన పక్కనే కూచునేవాణ్ణి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లం. అవి అల్లం పకోడీలు. మెత్తగా వుంటాయి. పిచ్చరుచిగా వుంటాయి. తినేశాక కాగితం దూరంగా ఉల్లి వాసన రానంత దూరంగా పడేసేవాణ్ణి. ఆయన కమండలంలో నీళ్లు వొంపుకుని గటగటా తాగి కళ్ళతోనే నన్ను దీవించేవారు. వారి దీవెనల ఫలితంగానే నేను యిలాంటి స్థాయికి చేరుకున్నానని అనుకుంటాను. ఆయన పూర్వాశ్రమంలో లాకు సూపర్ వైజర్ గా గోదావరి జిల్లాలో పనిచేశారు. లాకుల దగ్గర వేడి వేడిగా యీ పకోడీలు వేసేవారట. మొదట వాయ యీయనకు సమర్పించుకుంటే గాని ఆ బండి అక్కడ నిలవడానికి రూల్స్ ఒప్పుకునేవి కావుట.. ఆయనే నాతో మనసు విప్పి యీ సంగతి చెప్పారు. అబ్రహాం టి. కోవూరు నోట్లోంచి శివలింగాలు తియ్యడం, విబూది రాల్చడం చూశాను. మా బాపట్ల కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు జిల్లెళ్ళమూడి మాతృశ్రీకి శిష్యులైనారు. అమ్మని ‘అంఆ’ అని రాసి కొత్త వొరవడి పెట్టారు. నేను చాలా చిన్నతనంలో అమ్మగారు వెలిసిన రెండు మూడు నెలలు తిరక్కుండానే పెద్ద వాళ్ళతో వెళ్ళాను. ఆమె పేరు అనసూయమ్మ. మా అందరికీ టీలు, కాఫీలు యిచ్చారు. మా మామయ్య వాళ్ళమ్మాయి పెళ్ళెప్పుడవుతుందని అడిగాడు. చిరునవ్వుతో ‘అవుతుందిరా! ఎందుకు కాదు?` అందామె అన్నట్టే అయింది. కాకపోతే ఆరేళ్ళ తరవాత. మా యింటికి ఆమె వస్తూండేది. ఆమె ఉయ్యాల మీద కూచుంటే, ఆమె కాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య చెరొకరి వీపు మీదా పెట్టగా ఫోటోలు దిగేవారు. ఎవరి ఆనందాలు వాళ్ళవి. మాతృశ్రీ అని కేవలం ఆమె మహత్తుల మీద ఒక మాసపత్రిక నడిచేది. ఇప్పటికీ జిల్లెళ్ళమూడి ప్రభ అలాగే వుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాళ్ళ మనోభావాలు వాళ్ళవి. గ్రివెంచి రాసిన చిన్న కథను ముళ్ళపూడి బుద్ధిమంతుడు సినిమా కథగా మలిచారు. సినిమాలన్నింటిలో అది నాకు గొప్పదిగా అనిపిస్తుంది. దేవుడు వున్నాడో లేడో గాని వున్నాడన్న ఊహ చాలా ముఖ్యమని చెబుతుంది ఆ కథ. పాపభీతి చాలా తప్పుల్ని ఆపుతుంది. కొన్ని తప్పుల్ని చేయిస్తుంది. దేవుడి పేరిట అమాయకుల్ని దోచుకోవడం తరతరాలుగా సాగుతోంది. ముందు కూడా సాగుతుంది. ‘ముప్పదికోట్ల దేవత తెగబడ్డ దేశమున యింకా మన ఆకలెక్కడ తీరుతుంద’ని జాషువా ఆక్షేపించారు. ‘ఇంద్రుణ్ణి కాదు కొండని కోనని ఆరాధించ’మని జనంలో చైతన్యం తెచ్చిన కృష్ణుడు తొట్టతొలి నాస్తికుడని ఆరుద్ర ప్రతిపాదించారు. ‘ఏ వేదంబు పఠించె లూత, భుజగంబే శాస్త్రముల్ నేర్చె, చెంచే మంత్ర ముూహించె - చదువులయ్యా కావు’ అంటూ పద్యమించిన ధూర్జటిలో హేతువాది కనిపిస్తాడు. ‘గజం మిధ్య, పలాయనం మిధ్య’ అంటూ సత్యబోధ చేసిన శంకరాచార్యుడిలోనూ హేతువాది లేకుండా లేడు. కాకపోతే అతివాద హేతువాదులు, మితవాద హేతువాదులు అని రెండు విధాలు. పై చెప్పిన వారు మితవాదులు. మనిషికి ప్రకృతి తప్పనిసరి అవసరాలైన అయిదు ముఖ్యదినుసులను పంచభూతాల పేరిట ఆరాధించాడు. ఇప్పుడు విద్యుత్తు, సైబర్ సౌకర్యాలు నీరు, గాలి జాబితాలో చేరాయి. వచ్చిన ప్రమాదం దేవుడి ఏజంట్లుతోనే గాని దేవుడితో కాదు. బలహీనతల్ని సొమ్ము చేసుకోవడం మామూలే. మనుషులలో స్వాములు బాబాలు మాతాజీలు వుంటారు గాని జంతువుల్లో పక్షుల్లో జలచరాలలో వుంటారని అనుకోను. అత్యంత మేథా సంపన్నుడుగా వాసి కెక్కిన మనిషే ఏజన్సీలను నమ్ముతాడు. ఆశ్రయిస్తాడు. నష్టపోతాడు. పాదాలు ఆశ్రయించి లబ్ధి పొందేవారు కూడా అనేకులున్నారు. ఒక ప్రఖ్యాత బాబా జీవిత కథని నా పేరుతో పుస్తకంగా రాస్తే చాలా పెద్ద మొత్తం ఇస్తామని వారి శిష్యగణం ఆఫర్ చేశారు. ‘రాస్తాను గాని వారు ప్రదర్శించిన లీలల్నిమీరు చెబుతారా, అవి కూడా నేనే సమకూర్చుకోవాలా?` అన్నాను. (హిందీలో లీలల్ని చమత్కార్ అంటారు. ఆ పదం నాకు చాలా యిష్టం) వారందుకు ఖంగు తినలేదు. మీరు ఆశ్రమానికి రండి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. నేను వెళ్ళాను. సంగతులు సందర్భాలు బాబా వారితో చర్చించాను. నేను వారిని `సార్ సార్` అని సంబోధిస్తుంటే ఓ శిష్యుడు `స్వామి స్వామి` అని సరి చేస్తుంటే బాబావారు ఫర్వాలేదన్నట్లు సైగ చేశారు. ఇంతకీ నాకు ఆ కాంట్రాక్టు దొరకలేదు. నేను మరీ ఎక్కువ కోట్ చేశానని వారు అభిప్రాయపడ్డారు. బాబావారి దివ్య ఆశీస్సులు మాకు అదనంగా దక్కుతాయని వారు చెప్పారు. అయినా ఇప్పుడు చేతికి అందే డబ్బు మాత్రమే నాకు లెఖ్ఖ అన్నాను. అయితే యీ బేరసారాలు చర్చల వల్ల ఎన్నో విషయాలు ఎరుకకు వచ్చాయి. లోపలివిషయాలు వెల్లడించడం అనైతికం అవుతుంది. కాబట్టి, నేను సైతం మర్చిపోయే ప్రయత్నం చేశా, చేస్తున్నా. శ్రీశ్రీ కవిత్వంలో వాడిన పురాణ భావజాలాన్ని వేరే అర్థంలో అర్థం చేసుకోవాలన్నారు కమ్యూనిస్టు భావాలున్న మేథావులు. యజ్ఞోపవీతం అంటే, రథ చక్రమంటే, మహిషమంటే, యింకా అవంటే ఇవంటే విప్లవ నేపథ్యంలో అర్థం చేసుకోవాలన్నారు. వాటికి ప్రత్యేక నిఘంటువులు నిర్మించే శ్రమ తీసుకున్నారు. శ్రీశ్రీ ఆ సమర్థింపులన్నిటికీ పీఠాధిపతుల్లాగే మందహాసంతో మౌనంగా వుదాసీనంగా వుండిపోయారు. కొన్నిసార్లు తీవ్ర వుక్కపోతని సహించి భరించారు. శ్రీశ్రీలు రెండూ రెండు విద్యుత్ నిండిన మబ్బులు. ఆ వొరిపిడిలోంచి సదా మెరుపుతీగలు ఉరుములు పుడుతూనే వుండేవి. కుహనా భక్తులు అనగానే ఒక సభలో గందరగోళం చెలరేగింది. ‘తప్పేమన్నాను. మీలో చాలామంది కుసుమ హరనాథ్ భక్తులు కదా’ అని పొడి అక్షరాలతో సమర్థించుకున్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ చివ్వరి కోరిక వజ్రపుటుంగరం. దాన్ని ఆర్డర్ చేశారు. కాని అది ఇంటికి రాకుండానే శ్రీశ్రీ కన్నుమూశారు. ఇన్నయ్యగారు తన పుస్తకానికి ముందుమాట రాయమంటే యివన్నీ నేనెందు రాసినట్టు? నాకు యివన్నీ తెలుసుకాబట్టి. దాదాపు 80 మంది మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, బాబాలను, మాతృశ్రీలను స్వయం ప్రకటిత దేవుళ్ళని దగ్గరగా దర్శించి వారివారి చమత్కారాలను గ్రహించాను, సంగ్రహించాను. నేను చదివిన కొద్దిపాటి చదువుకన్నా, నే నేర్చిన యీ అనుభవాల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఈ చదువులు ఇతర వ్యాపకాలు అక్కరకు రాని రోజు నేను సంగ్రహించిన అనుభవాలను తగు పాళ్ళలో మేళవించి, సరికొత్త సిద్ధాంతరసాయనాన్ని తయారించి అమ్ముకోగలను. ఆ మనోధైర్యంతోనే ఉన్నాను. ఇలా రాతలో యీ మర్మం చెప్పినా, నేను కొత్త అవతారంలో వచ్చినపుడు యివి ఏ మాత్రం అవరోధాలు కావు. చెట్టు తిరగేయడం, జ్యోతిష్యం, వాస్తు, చేపమందు, హోమియోమాత్ర అశాస్త్రీయమని ఇన్నయ్య ఎంతోకాలంగా యాగీ చేస్తుంటే ఎవరైనా విన్నారా? జ్యోతిష్యం తెలుగు విశ్వవిద్యాలయంలో కోర్సుగా పెడితే కోర్టు వ్యాజ్యాలకు వెళ్ళారు. వాస్తు మూలంగా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆ తపనలో మళ్ళీ అంటున్నాను. చదువు, సంస్కారం, సౌశీల్యం అన్నీ ఉన్న ఇన్నయ్యకి వీసమెత్తు దైవచింతన కూడా వుంటే బాగుండునని ముందొకసారి అన్నాను. రామరావణ యుద్ధం పూర్తయింది. అప్పటి దాకా సీత ఎట్లా వుంటుందో హనుమంతుడికి తప్ప ఎవరికీ తెలియదు. యుద్ధానంతరం సీతను తనవద్దకు తెమ్మన్నాడు రాముడు. వచ్చింది సీత. వానరులంతా వుత్కంఠతో ఉన్నారు. ఎగిరెగిరి సీతను చూశారు. తరవాత వాళ్ళు అనుకున్నారట - సీతమ్మ చాలా చక్కగా వుంది. కాని పాపం చిన్న తోక కూడా వుంటే యింకెంత బాగుండేదోకదా - అని. నా దైవచింతన ఆలోచన అట్లా వుంది. నా యీ మాటల్ని, గోపదేవ్ గారి జంధ్యాలను కృష్ణలో విసర్జించిన విధానం వదిలి, ఇన్నయ్య జీవనగమనంలో కన్పించే ఆనాటి సాంఘిక అంశాలను పరామర్శించండి. - శ్రీరమణ హైదరాబాదు

వికాసం పత్రిక-మల్లాది రామమూర్థి సంపాదకత్వాన

వికాసం పత్రిక మల్లాది రామమూర్థి సంపాదకత్వాన , విజయవాడ,హైదరబాద్ నుండి 1970-80 లలో వెలువడింది. మానవ వాద, హేతువాద,శాస్త్రీయ వ్యాసాలు, సిద్దాంత చర్చలు బాగా సాగేవి. అఖిల భారత హూమనిస్ట్ సంఘ ప్రెసిడెంట్ గా వున్న రామమూర్తి వ్యాపార లక్షణాలులేక పత్రిక నిలిపి వేశారు.

1949 లో జమిన్ రైతు వారపత్రిక చాలా ఆసక్తి కరంగా ఉగాది బిరుదులు ప్రసాదించింది

1949 లో జమిన్ రైతు వారపత్రిక చాలా ఆసక్తి కరంగా ఉగాది బిరుదులు ప్రసాదించింది

మానవత్వపు దారిలో …

మానవత్వపు దారిలో … పుస్తకం నా చేతికి అందిన రెండు రోజుల్లో పూర్తి చేశాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. మొదటగా చెప్పవలసింది భాష, శైలి గురించి, చిన్న చిన్న వాక్యాలతో చాలా సరళంగా ఆపకుండా చదివించిందీ పుస్తకం. ఎన్నో పరిచయాలు.. ఎన్నెన్నో స్నేహాలు.. కొన్ని పరిచయాలు అక్కడే ఆగిపోయినా, కొన్ని మాత్రం జీవితపర్యంతం కొనసాగడం మనం చూస్తాం. సామాన్యుల నుంచీ అసామాన్యుల దాకా ఎవరి నిశానీని ఇన్నయ్యగారు వదలలేదు. అయితే ఎవరి గురించి ఎంత చెప్పాలో అంతే ఎంతో బాగా చెప్పారు. ఇంచుమించు ఆంధ్రదేశంలోని ప్రతి ప్రదేశాన్నీ చూపించారు. ఎందరి అంతరంగాలనో స్పర్శించారు. అంతేకాక ఆంధ్రచరిత్ర రాయడం చాలా విశేషం. పుస్తకాలకాప్తమిత్రుడాయన. ఊరూరా గ్రంథాలయాల గురించి రాశారు. నిజమే.. ఇప్పుడు ఇంటింటా టి.వి.లున్నట్లు అప్పుడు లైబ్రరీలు ఉండేవి. మేము కూడా అలాగే ఎక్కడకు వెళ్ళినా పుస్తకాలనీ వెతుక్కునే వాళ్ళం. ‘ఎదిగిన కొద్దీ ఒదగడం’ లాంటి పాత సామెతల్ని పక్కన పెడితే, అంతగా ఎదగడానికి ఒక తపన ఉండాలి. దాంతో సాటి తపస్సూ (కృషి) ఉండాలి. అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోవడం తెలియాలి. ఆత్మీయతని పెంచుకుంటూ, వేస్తున్న ప్రతి అడుగులో అప్రమత్తత నిండాలి. ఈ మహా వృక్షాన్ని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచనలివి. ఈ జీవన గమనంలో కుటుంబ సంబంధాలు, చుట్టరికాలూ ఉన్నాయి. కానీ పరిమిత చర్చమాత్రమే. శ్రీమతి కోమలగారి గురించి మరిన్ని విషయాలు వ్రాసి వుండవలసింది. హేతువాద, మతతత్త్వ, మానవతావాద ఉద్యమాల గురించి, వాటి దృక్పథాల గురించి బాగా వివరించారు. భారత్ లో ఆయా ఉద్యమాలు ఊపందుకోకపోవడానికి, క్రియాశీలత లోపించడానికి గల కారణాలను సహేతుకంగా విశ్లేషించారు. పుస్తకం నిండా వ్యక్తులే. సహృదయులు, గొప్పవాళ్ళ పరిచయ పరిమళాలలతో మనసు పరవశించింది. సంజీవదేవ్ గోరా, ఎం.ఎన్.రాయ్, ఆవుల సాంబశివరావుగారు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో ప్రముఖుల గురించి ఇదివరకు బాగానే విన్నాం. మరికొందరి విషయం రేఖామాత్రంగానైనా తెలుసు. అజ్ఞాత వ్యక్తులెందరిగురించో తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది. సాధారణంగా ఇటువంటి జీవనయాత్రల్లో స్వోత్కర్ష, ఆడంబరం ఉండడం కద్దు. అవేవీ లేకపోగా పలాయనవాదం, అవకాశవాదం ఆయన్ను అంటుకోలేదు. పరిచయాలను, స్నేహితులను స్వార్ధానికి నిచ్చెనలుగా చేసుకోకపోవడం, విషయాలను క్లుప్తంగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం రచయిత నిజాయితీకి, సంస్కారానికి నిదర్శనం. కొన్నిచోట్ల కుల ప్రస్తావనలు వచ్చినా అనవసరం అని ఎక్కడా అనిపించలేదు. వివాదాస్పద విషయాల గురించి కూడా చాలా సరళంగా వివరించారు. మొత్తంగా ఇది చదివాక నాకు కబీర్, తులసీదాస్ ల దోహాలు రెండు గుర్తుకు వచ్చాయి. వాటి భావం ఇలా వుంటుంది. 1. హంస పాలని నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించినట్లు సజ్జనుడు గుణ దోషాలతో నిండిన చరాచర ప్రపంచంలో చెడును వదిలి మంచిని మాత్రమే గ్రహిస్తాడు. 2. సత్పురుషులని జాతి మతాల గురించి అడగవద్దు, వారి జ్ఞానం గురించి మాత్రమే ప్రశ్నించాలి. ఖడ్గం యొక్క పదును చూడాలంటే ఒరని పక్కన పెట్టవలసిందే. ముఖచిత్రంగా వచ్చిన రేఖాచిత్రంలో స్పష్టాస్పష్టంగా ఉన్న వ్యక్తి గురించి లోపల చాలా ఉంది (ఇన్ + అయ్యా) అని చెప్పీ చెప్పనట్లుంది. చివరలో ప్రచురించిన ఉత్తరాలు, రచనల వివరాల పట్టిక, పుస్తకంలో పలకరించే వ్యక్తుల సమాచారం, ఛాయా చిత్రాలు అన్నీ చాలా సమాచారదాయకంగా ఉన్నాయి. ఒక మంచి అనుభవాల పరంపర చదవడం చక్కని అనుభూతి. ఈ జర్నీ అమెరికా నుండి విశ్వవ్యాప్తం కావాలని ఆశిస్తున్నాను. Ramasundari Vellanki vrs.forall19@gmail.com

Narla V.R.: Interview with Narla VR by Innaiah, Polu Satyanarayana, K B Satyanarayana-audio

Narla V.R.: Interview with Narla VR by Innaiah, Polu Satyanarayana, K B Satyanarayana-audio

పర్వతనేని కోటేశ్వరరావు- అరుదైన పొలిస్ అధికారి

పర్వతనేని కోటేశ్వరరావు రాష్ట్రపతి, ప్రధాని అవార్డులు అందుకున్న పోలీస్ అధికారి. కృష్ణాజిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. వృత్తి రీత్యా అనేక ఉద్యోగాలు చేశారు. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా వుండగా సెక్యూరిటీ ఆఫీసర్ గా వున్నారు. ఆవుల సాంబశివరావు లోకాయుక్తగా వుండగా అక్కడ ఉద్యోగం చేశారు. ఉన్నత పోలీస్ అధికారులు ఆయన్ను బాగా గౌరవించడానికి ఆయన ప్రవర్తన, తెలివితేటలు, జడ్జిమెంట్ కారణం. కోటేశ్వరరావు మాకు సన్నిహిత కుటుంబ మిత్రులు. ఏమాత్రం అవకాశం ఉన్నా మానవవాద, సెక్యులర్ ఉపన్యాసాలకు, శిబిరాలకు వచ్చేవారు. మంచి విమర్శనాత్మక విశ్లేషణ రచనలు వ్యాసాలు చదివేవారు. సమకాలీన రాజకీయ పార్టీల, నాయకుల విషయంలో నిశిత పరిశీలన చేసేవారు. పోలీస్ అధికారిగా ఆయనకు తెలిసిన అనేక లోగుట్టులు చెప్పేవారు. కొన్ని వృత్తి ధర్మం రీత్యా ప్రచురించవద్దనేవారు. అప్పుడే ఆయన మేథస్సు గ్రహించగలిగాను. ఎన్.టి. రామారావును సన్నిహితంగా చూచాడు గనుక అనేక ఆసక్తికరమైన సంగతులు చెప్పేవాడు. దాదాపు ఆరు మాసాలపాటు సన్యాసి కాషాయవస్త్రాలు సూట్ కేసులో పెట్ట్టుకుని తిరిగాడని, ఆలోచించి, చివరకు వాటిని ధరించాడని చెప్పాడు. కొందరు ఉన్నతాధికారులు రామారావును ముఖస్తుతి చేసి, తిరుపతి దేవస్థానం వంటి చోట పదవులు పొందారన్నాడు. నాదెళ్ళ భాస్కరరావుకు కోటేశ్వరరావు అంటే యిష్టం వుండేదికాదు. చిత్తశుద్ధిగల ముక్కుసూటి ఆఫీసర్ గావడమే కోటేశ్వరరావు లోపం! అయితే రామారావు ఆయన్ను బాగా గౌరవించేవాడు. 1982 ఎన్నికల సమయంలో పోలీస్ అధికారిగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో డబ్బుల సూట్ కేసులు కళ్ళారా చూచిన కోటేశ్వరరావు ముక్కుపై వేలు వేసుకున్నాడు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రత్యేక విమానంలో సూట్ కేసులలో డబ్బులు తేవడం, వాటిని కాంగ్రెస్ అభ్యర్థులకు ఉద్దేశించి పోవడం జరిగింది. అయినా ఓడిపోయిన సంగతి అలా ఉంచండి. శ్రీశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు రచనలంటే కోటేశ్వరరావు యిష్టపడేవారు. మేము ఎన్నోసార్లు కలుసుకుని ముచ్చటించేవాళ్ళం. రిటైర్ అయిన కొద్ది రోజులకే (1992లో) చనిపోయారు.

ఏప్రిల్ కౌముది లో సినారె పై నావ్యాసం

ఏప్రిల్ కౌముది లో చదవండి. అభిప్రాయం వెలిబుచ్చండి కామెంట్స్ లొ

నేను చూచిన అమెరికా

నేను చూచిన అమెరికా ఆవుల గోపాల క్రిష్న మూర్తి రచన మళ్ళి పునర్ముద్రణ జరుగుతున్నది. గ్రంధంలోని విలువైన విషయం వలన నేటి తెలుగు వారికి బాగా ఉపకరిస్తుంది అని పరిసీలకులు భావించి పాఠకులకు అందిస్తున్నారు. అమెరికా సందర్సిస్తున్న తెలుగు వారు చూడవలసిన , తెలుసుకోవలసిన సంగతులు నిశిత పరిసీలనతో ఉన్న ఈ రచన అమెరికాలోని తెలుగు యువ తరానికి సైతం కర దీపికగా వుండగలదు.యాత్రికులు చూడకుండా తిరిగి వెడుతున్న రీత్యా ఇది గొప్ప సూచికగా భావించ వచ్చు .