ధనెంకుల నరసింహం ( 1923-2001)

ధనెంకుల నరసింహం ( 1923-2001) రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బర్మా, ఇండియా కలిసే వుండేది. కోస్తా తీర ప్రాంతం నుండి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుండి అనేకమంది బర్మా వెళ్ళారు. జి.సి. కొండయ్య , గుత్తికొండ నరహరి, అలా వెళ్ళిన వాళ్ళలో ఉన్నారు. ధనెంకుల నరసింహం కూడా పదిహేనేళ్ళ ప్రాయానికే రంగూన్ వెళ్ళారు. అక్కడే స్కూలులో చేరి చదివారు. బాలభక్త సమాజం ఏర్పరచారు. 1937లో జవహర్ లాల్ నెహ్రూ రంగూన్ వెళ్ళినప్పుడు ధనెంకుల నరసింహం ఆయన్ను చూడగలిగారు. 1942లో ఎన్.జి. రంగాను కలసి ఆయన నాయకత్వాన్ని ఆదరించి, నెల్లూరు జిల్లాలో రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948 నాటికి స్వస్థలంలో స్కూలు ప్రారంభించి విద్యాభివృద్ధికి కృషిచేశారు. 1959 నాటికి జిల్లా పరిషత్తులో సభ్యులయ్యారు. 1962లో వరికుంటపాడు సమితికి అధ్యక్షుడయ్యాడు. ఆ ప్రాంతంలోని నక్కలగండి, గండిపాలెం, వెలుగొండ, ప్రాజెక్టులపై బాగా కృషిచేశారు. జిల్లాలో కిసాన్ సభలు జరిపి 1953 నుండి ఆచార్య రంగా, కందుల ఓబుల్ రెడ్డి, తెన్నేటి విశ్వనాథం వంటి నాయకులను ఆహ్వానించారు. 1967లో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర పార్టీ పక్షాన ఉదయగిరి నుండి ఎమ్.ఎల్.ఎ.గా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన ప్రత్యేక జై ఆంధ్రా ఉద్యమంలో ముందంజ వేశారు. విద్యార్ధిగా ఉన్న ఎమ్. వెంకయ్య నాయుడిని ప్రోత్సహించి రాజకీయాలలోకి ఆహ్వానించి, ఆరంగేట్రం చేయించింది ఈయనే. శాసనసభ్యుడుగా చక్కని ఉపన్యాసాలు చేసి పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీలో సభ్యుడుగా తన పాత్రను నిర్వహించాడు. అదే రోజులలో తన వాణి వినిపించటానికి నెల్లూరు నుండి `విజయభేరి` పత్రికను పెట్టారు. అనేకమంది చేత రాయించి, ఎడిట్ చేసేవారు. హైదరాబాదు రాజధాని విలేఖరిగా నేను రాజకీయ లేఖలు రాసేవాడిని. అనేక ఇతర వ్యాసాలు కూడా రాశాను. రాజకీయాలలో వచ్చిన మార్పులవలన ఆచార్య రంగా తిరిగి కాంగ్రెసులోకి ప్రవేశించగా, నరసింహం మాత్రం ప్రతిపక్షంలోనే ఉండిపోయాడు. 1988 నాటికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా ఎంపికై విద్యాభివృద్ధికి కృషి జరిపారు. తన కుమారులు అమెరికా వెళ్ళగా నరసింహం అమెరికా పర్యటించారు.

No comments:

Post a Comment