మానవత్వపు దారిలో …
Posted by
innaiah
on Sunday, April 6, 2014
మానవత్వపు దారిలో …
పుస్తకం నా చేతికి అందిన రెండు రోజుల్లో పూర్తి చేశాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది.
మొదటగా చెప్పవలసింది భాష, శైలి గురించి, చిన్న చిన్న వాక్యాలతో చాలా సరళంగా ఆపకుండా చదివించిందీ పుస్తకం. ఎన్నో పరిచయాలు.. ఎన్నెన్నో స్నేహాలు.. కొన్ని పరిచయాలు అక్కడే ఆగిపోయినా, కొన్ని మాత్రం జీవితపర్యంతం కొనసాగడం మనం చూస్తాం. సామాన్యుల నుంచీ అసామాన్యుల దాకా ఎవరి నిశానీని ఇన్నయ్యగారు వదలలేదు. అయితే ఎవరి గురించి ఎంత చెప్పాలో అంతే ఎంతో బాగా చెప్పారు.
ఇంచుమించు ఆంధ్రదేశంలోని ప్రతి ప్రదేశాన్నీ చూపించారు. ఎందరి అంతరంగాలనో స్పర్శించారు. అంతేకాక ఆంధ్రచరిత్ర రాయడం చాలా విశేషం.
పుస్తకాలకాప్తమిత్రుడాయన. ఊరూరా గ్రంథాలయాల గురించి రాశారు. నిజమే.. ఇప్పుడు ఇంటింటా టి.వి.లున్నట్లు అప్పుడు లైబ్రరీలు ఉండేవి. మేము కూడా అలాగే ఎక్కడకు వెళ్ళినా పుస్తకాలనీ వెతుక్కునే వాళ్ళం.
‘ఎదిగిన కొద్దీ ఒదగడం’ లాంటి పాత సామెతల్ని పక్కన పెడితే, అంతగా ఎదగడానికి ఒక తపన ఉండాలి. దాంతో సాటి తపస్సూ (కృషి) ఉండాలి. అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోవడం తెలియాలి. ఆత్మీయతని పెంచుకుంటూ, వేస్తున్న ప్రతి అడుగులో అప్రమత్తత నిండాలి. ఈ మహా వృక్షాన్ని చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచనలివి.
ఈ జీవన గమనంలో కుటుంబ సంబంధాలు, చుట్టరికాలూ ఉన్నాయి. కానీ పరిమిత చర్చమాత్రమే. శ్రీమతి కోమలగారి గురించి మరిన్ని విషయాలు వ్రాసి వుండవలసింది.
హేతువాద, మతతత్త్వ, మానవతావాద ఉద్యమాల గురించి, వాటి దృక్పథాల గురించి బాగా వివరించారు. భారత్ లో ఆయా ఉద్యమాలు ఊపందుకోకపోవడానికి, క్రియాశీలత లోపించడానికి గల కారణాలను సహేతుకంగా విశ్లేషించారు. పుస్తకం నిండా వ్యక్తులే. సహృదయులు, గొప్పవాళ్ళ పరిచయ పరిమళాలలతో మనసు పరవశించింది. సంజీవదేవ్ గోరా, ఎం.ఎన్.రాయ్, ఆవుల సాంబశివరావుగారు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో ప్రముఖుల గురించి ఇదివరకు బాగానే విన్నాం. మరికొందరి విషయం రేఖామాత్రంగానైనా తెలుసు. అజ్ఞాత వ్యక్తులెందరిగురించో తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది.
సాధారణంగా ఇటువంటి జీవనయాత్రల్లో స్వోత్కర్ష, ఆడంబరం ఉండడం కద్దు. అవేవీ లేకపోగా పలాయనవాదం, అవకాశవాదం ఆయన్ను అంటుకోలేదు. పరిచయాలను, స్నేహితులను స్వార్ధానికి నిచ్చెనలుగా చేసుకోకపోవడం, విషయాలను క్లుప్తంగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం రచయిత నిజాయితీకి, సంస్కారానికి నిదర్శనం.
కొన్నిచోట్ల కుల ప్రస్తావనలు వచ్చినా అనవసరం అని ఎక్కడా అనిపించలేదు. వివాదాస్పద విషయాల గురించి కూడా చాలా సరళంగా వివరించారు.
మొత్తంగా ఇది చదివాక నాకు కబీర్, తులసీదాస్ ల దోహాలు రెండు గుర్తుకు వచ్చాయి. వాటి భావం ఇలా వుంటుంది.
1. హంస పాలని నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించినట్లు సజ్జనుడు గుణ దోషాలతో నిండిన చరాచర ప్రపంచంలో చెడును వదిలి మంచిని మాత్రమే గ్రహిస్తాడు.
2. సత్పురుషులని జాతి మతాల గురించి అడగవద్దు, వారి జ్ఞానం గురించి మాత్రమే ప్రశ్నించాలి. ఖడ్గం యొక్క పదును చూడాలంటే ఒరని పక్కన పెట్టవలసిందే.
ముఖచిత్రంగా వచ్చిన రేఖాచిత్రంలో స్పష్టాస్పష్టంగా ఉన్న వ్యక్తి గురించి లోపల చాలా ఉంది (ఇన్ + అయ్యా) అని చెప్పీ చెప్పనట్లుంది.
చివరలో ప్రచురించిన ఉత్తరాలు, రచనల వివరాల పట్టిక, పుస్తకంలో పలకరించే వ్యక్తుల సమాచారం, ఛాయా చిత్రాలు అన్నీ చాలా సమాచారదాయకంగా ఉన్నాయి.
ఒక మంచి అనుభవాల పరంపర చదవడం చక్కని అనుభూతి. ఈ జర్నీ అమెరికా నుండి విశ్వవ్యాప్తం కావాలని ఆశిస్తున్నాను.
Ramasundari Vellanki
vrs.forall19@gmail.com
No comments:
Post a Comment