ఇస్లాం వలసవాదం-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?-part 8



ఇబన్ వారక్
8వ అధ్యాయం
అరబ్ సామ్రాజ్యవాదం, ఇస్లాం వలసవాదం
    అరబేతర ముస్లిం దేశాలలో పర్యటించాను. ఇస్లాం అరబ్ మతంగా ప్రారంభమయింది. అరబ్ సామ్రాజ్యంగా వ్యాపించింది. ఇరాన్, పాకిస్థాన్, మలేసియా, ఇండోనేసియాలలో  ప్రజలు విదేశీమతంలోకి మారినచోట నేను పర్యటించాను. ఆ ప్రజలు 19, 20 శతాబ్దాలలో యూరోప్ సామ్రాజ్యాలకు, మరొకవైపున  అరబ్ మతానికి ఇమిడిపోయారు. ఆ ప్రజలు రెండు విధాల వలసకు గురై, సొంత వ్యవస్థకు రెండుసార్లు దూరమయ్యారు.
    వి.ఎస్.నయపాల్-న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్, 1991, జనవరి 31
      ఇస్లాంపై ఆధునిక పరిచయ గ్రంథం ఏది చూచినా అచిరకాలంలో నాగరిక ప్రపంచాన్ని, సింధునది నుండి అట్లాంటిక్ తీరాలవరకూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారిని పొగడటం కనిపిస్తుంది. భిన్న ప్రజలూ, సంస్కృతులను ముస్లింలు పరిపాలించిన తీరును ఆకాశానికి ఎత్తినట్లు చూడవచ్చు. బ్రిటీషు సామ్రాజ్యం ప్రపంచంలో 3వ వంతు దేశాలను పరిపాలించి ఆక్రమించింది. కానీ, సమకాలీన బ్రిటీష్ చరిత్రకారులు అందుకు బ్రిటన్ ను పొగడటం కనిపించదు. యూరోప్ వలసవాదం, సామ్రాజ్యవాదం తిట్టుపదాలుగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దోషాలకూ అవే కారణాలంటారు. యూరోప్ వారిని సిగ్గుపడేటట్లు  చేసిన విధానమది. కాని అరబ్బు సామ్రాజ్యవాదాన్ని పొగిడి, ముస్లింలు గర్విస్తున్నారు.
      మూడవ ప్రపంచంపై యూరోప్ తన విలువలూ, సంస్కృతీ, భాషల్ని రుద్దినందుకు విమర్శకు గురయ్యారు. ఇస్లాం తన వలసవాదంతో ప్రాచీన అభివృద్ధికర నాగరికతలను నాశనం చేసినందుకు ఎవరూ వేలెత్తి చూపటం లేదు. మైకేల్ కుక్ ఇలా అన్నాడు. (మహమ్మద్, ఆక్స్ ఫర్డ్, 1983, పుటః 86)
      అరబ్ దండయాత్రలు సామ్రాజ్యాలను నాశనం చేసి కొన్ని ప్రాంతాలను శాశ్వతంగా మార్చివేసాయి. ఇది దారుణమైన సంఘటన కుక్, క్రోనేలు ఈ దండయాత్రలు చేసిన విపరీత సాంస్కృతిక నష్టాన్ని వివరించారు. (హేగరిజం, కేంబ్రిడ్జి, 1977, పీఠిక పుటః 8)
      1060, 1070 ప్రాంతాలలో టర్కీ దండయాత్రల వలన చాలామంది ప్రజలు పారిపోయారు, పట్టుబడ్డారు. హతమార్చబడ్డారు. బానిసలయ్యారు. హెలెనిక్, క్రైస్తవరీతులు నాశనమయ్యాయి. బైజాంటైన్ సామ్రాజ్యం తుడిచిపెట్టకపోయింది. (హంఫ్రీస్, ఇస్లామిక్ హిస్టరీ, ప్రిన్ స్టన్, 1991, పుటః 280-81, స్పెరోస్ వైనిస్ ది డిక్లైన్ ఆఫ్ మిడివల్ హెలెనిజం ఇన్ ఏషియా మైనర్ అండ్ ది ప్రోసెస్ ఆఫ్ ఇస్లామైజేషన్ ఫ్రం ది ఎలెవెన్స్ త్రూది ఫిఫ్టీన్త్ సెంచురీ)
      అల్జీరియాలో ఫ్రెంచి భాషను మానేశారు. ఫ్రెంచి వలనవాద చిహ్నంగా భావించినందున అలా చేశారు. ఒక తరం వారిని సంపన్న, సాంస్కృతిక సంపదకు ఆ విధంగా దూరం చేశారు. అరబిక్ భాష బయటనుండి వచ్చిందన్న విషయం మర్చిపోయారు. అక్కడ ప్రజల భాష బర్బర్. కానీ ప్రజల్ని అరబ్బులుగా చిత్రించి నచ్చజెప్పి, అక్కడి సంప్రదాయాలకు భిన్నంగా, మతం కోసం మనసులు మార్చారు. అరేబియా వైపుకు తిరిగి 5సార్లు వంగి ప్రార్థించటం సాంస్కృతిక సామ్రాజ్యవాద చిహ్నమే.
      తోటి మతం వారిని ముస్లింలు చిన్నచూపు చూస్తారు. పరాయి పాశ్చాత్య విలువలను ఒప్పుకున్నారని అంటారు. తమ ప్రాచీన సంస్కృతిని విస్మరించిన ద్రోహులుగా వారు ప్రవర్తిస్తున్నారన్న విషయం మరచిపోయారు. ఇండియాలో నేటి ముస్లింలు హిందువుల నుండి మారారు. ఇరాన్ లో జొరాస్ట్రియన్ నుండి మారారు. సిరియాలో క్రైస్తవం నుండి మారారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎక్కడో ఉన్న మతాన్ని ఆమోదించటం, అర్థంగాని భాషలో ఉన్న పుస్తకాన్ని చదవటం, మాతృభాష, జాతీయ భాష తెలియకపోయినా అరబ్బీ నేర్చుకోవటం వారికి సాధారణమై పోయింది. ఇస్లాం రాకముందు తమ దేశంలో ఉన్న గతాన్ని తెలుసుకోకుండా భౌగోళికంగా మారుమూలలో ఉన్న ప్రజల చరిత్రను నేర్చుకుంటున్నారు.
      ముస్లింలు తమ సంపన్న సంస్కృతిని దూరంగా పెట్టి ఇస్లాం విజయం వలన దారుణ ఫలితాలకు గురి అవుతున్నారు. పాకిస్తాన్ లో పర్యటించిన వి.ఎన్.నయపాల్ ఇలా రాశాడు.
      ఇస్లాంకు ముందున్నఅంతా అంధకారమని ముస్లిం మత సిద్ధాంతం బోధిస్తున్నది. చరిత్ర కూడా మత సిద్ధాంతానికి సేవ చేస్తున్నది. సింధులోయలోని మొహంజదారో క్రీ.పూ. 1500 నాటి ఆర్యుల రాజ్యం అక్కడి త్రవ్వకాలు పాకిస్తాన్ కూ, ప్రపంచానికీ పురావస్తు సంపదలు. ఆ తవ్వకాల నిండా నీరు నిండిపోగా, ప్రపంచ సంస్థల సహాయంకోసం అర్థిస్తున్నారు. పాకిస్తాన్ దినపత్రిక డాన్ ఆ చోటు గురించీ సొంత భావాలు వెల్లడించింది. ఖురాన్ లో చరణాలు మొహంజదారోలో తగినచోట్ల చెక్కాలన్నది.
    సర్ మహమ్మద్ ఇక్బాల్ (1875-1938) పాకిస్తాన్ స్థాపకుడుగా, జాతీయ కవిగా, భారత ముస్లిం కవిగా గుర్తింపు పొందారు. నయపాల్ అతని చరణాల నుండి ఉదహరించాడు. నయపాల్ ఇలా రాశాడు. భారతీయుల ముస్లిం రాజ్యం అరబ్బు సామ్రాజ్యవాదముద్ర లేకుండా ఇస్లాం రాజ్యంగా ఉండాలని ఇక్బాల్ అశించాడు. అరబ్బులు సామ్రాజ్యవాదులుగా జయప్రదంగా ఉన్నారు. వారు జయించటమంటే, విశ్వాసపరుల దృష్టిలో రక్షణ పొందటమే.
    పాకిస్తాన్ స్కూలు పుస్తకాలలో చరిత్ర అరేబియా, ఇస్లాంతో ప్రారంభమౌతుంది. ప్రవక్త, ప్రథమ నలుగురు ఖలీఫాలు, ప్రవక్త కుమార్తె ఫాతిమా గురించి పాఠాలలో పేర్కొంటున్నారు. ఇక్బాల్, పాకిస్తాన్ రాజ్యస్థాపకుడు జిన్నా, ఇండియాకు వ్యతిరేకంగా పవిత్రయుద్ధంలో హతమైన ఇద్దరు, ముగ్గురు సైనికుల ప్రస్తావన అరుదుగా కనిపిస్తుంది.  పేగన్ గతంపట్ల ఈ విధమైన జూగుప్స వలన ముస్లింల చారిత్రక దృష్టికి పరిమితులు ఏర్పడి మేథస్సు సంకుచితమౌతున్నది. అమెరికా, యూరోప్ పండితులు ఈజిప్ట్, అసీరియా, ఇరాన్ శాస్త్రాలను తొలుత పట్టించుకున్నారు. పాశ్చాత్య పురావస్తు పండితులు దివ్యమైన ఈ గతాన్ని గురించి మానవాళికి అందించారు.
అరబ్ సామ్రాజ్యవాదం, ఇస్లాంకు ప్రతిఘటన
    ఇస్లాంకు ముందు మతాన్ని పట్టించుకోలేదు. (గోల్డ్ జిహర్, ముస్లిం, స్టడీస్, సంపుటి 1, పుటః 12) ఆనాడున్న మతం అరబ్పుల నిత్య జీవితంలో ఆట్టే ప్రాధాన్యత వహించలేదు. పోరాటాలూ, తాగటం, తినటం, ఆట పాటలూ, శృంగారం వారి కాలక్షేపాలు. అది ఆదిమ జాతి మానవ వాదంగా వాట్ పేర్కొన్నాడు. తొలి నమ్మకస్తులు మతం మార్చుకున్నవారూ తమ విశ్వాసాన్ని వెల్లడిస్తూ మహమ్మద్ బోధనలలో దేవుడికి అంకితం కావాలని చెప్పిన మాటల్ని అర్థం చేసుకోలేకపోయారు. (గోల్డ్ జిహర్, పుటః 15) బెడోయిన్ అరబ్బులు ఎడారివాసులుగా కొత్తమతాన్ని తొందరగా అమోదించలేదు. ఉక్కల్, ఉరానా తెగలు ఇస్లాంను ఆమోదించినా, తమ ప్రాంతాలకు వెళ్ళిపోదామని మహమ్మద్ ను అడిగారు. మదీనా వదలి వెళ్ళటానికి అనుమతించినా వారు వెళుతూ తమకు అప్పగించిన ముఠాధిపతిని చంపేసి, పాత ధోరణిలోకి మారిపోయారు. ప్రవక్త వారిపై క్రూరంగా పగ తీర్చుకున్నాడు.
      చాలామంది బెడోయిన్లు ఇస్లాంపట్ల ఆకర్షితులు కాలేదు. నగర అరబ్బులు వీరిని నిరసించేవారు. గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. ఎడారిలోని అరబ్బులు ప్రార్థనలపట్ల అసక్తి చూపలేదు. ముస్లిం క్రతువుల్ని పట్టించుకోలేదు. పవిత్ర గ్రంథాన్ని ఉదాసీనంగా చూశారు. అందులో చాలా విషయాలు వారికి తెలియవు. కొరాన్ లోని పవిత్ర చరణాలకంటె పేగన్ నాయకుల గురించిన గేయాలే వారికి వచ్చేవి. (గోల్డ్ జిహర్, పుటః 43)
      ఇస్లాంలోని సన్యాసత్వం, ఆహారం, మత్తుపానీయాలపట్ల ధోరణి అరబ్బులను ఇబ్బంది పెట్టాయి. శిక్షలు పడుతున్నా తాగుడు మానేయటానికి చాలామంది ఒప్పుకోలేదు. గోల్డ్ జిహర్ ఇలా రాశాడు.
      అరబ్బు వాసులలో స్వేచ్చాపరులు కొత్త విధానాన్ని నిరసించి ఆ సమాజానికి దూరంగా పోదలచారు. స్వేచ్ఛను వదులుకునే బదులు కొత్తమతాన్ని వదులుకోదలిచారు. ఉదారస్వభావానికి పేరుపొందిన రబియా ఉమయా ఖలాఫ్ అలాంటి వాడే. ఇస్లాం పేరిట అతడు తాగటం మానదలుచుకోలేదు. రంజాన్ మాసంలో కూడా తాగేవాడు. అందుకని ఖలీఫా అతడిని మదీనా నుండి బహిష్కరించాడు. ఉమర్ చనిపోయిన తరువాత కూడా మదీనా రావడానికి అతడు నిరాకరించాడు. క్రైస్తవ సామ్రాజ్యానికి పోయి క్రైస్తవుడుగా మారటానికి నిర్ణయించుకున్నాడు. (గోల్డ్ జిహర్, పేజి. 43)
అరబ్బు జాతివాదం
    ఇస్లాం జాతిపరంగా అమాయకమైనదని పాశ్చత్యులు భ్రమ కల్పించారు. ఇది పాశ్చాత్యులకు సరిపోయింది. ఇస్లాంను ఆదర్శంగా పైకెత్తి పాశ్చాత్య వైఫల్యాన్ని దెబ్బతీయటానికి ప్రయోగించారు. (లెవీస్, ది అరబ్స్ ఇన్ హిస్టరీ, న్యూయార్క్, 1966, పుటః 101)
అరబ్బులు
    ఇస్లాం చరిత్రలో తరచు తిరుగుబాటు రావటానికి అరబ్బుల జాతి ధోరణి, తలబిరుసుతనమే కారణం (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్, పుటః 98) నమ్మకస్తుల అందరి సమానత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది. (ముస్లిమేతరుల విషయం వేరు) అరబ్బు జాతులకు బదులు ఇస్లాం కట్టుబడి ఉంటే సూత్రంగా పనిచేస్తుందని  నచ్చచెప్పటానికి ప్రవక్త తిప్పలుపడ్డాడు. ఇస్లాం ఖండిస్తున్నా, ఆబ్బాసిడ్ల కాలంవరకూ తెగల స్పర్థలూ, కలహాలూ, పోటీలూ సాగాయి. ఈ తెగలు  తమ తగాదాలను  పరిష్కరించుకోలేక, యుద్ధాలలో కూడా వేరుగా ఉంటూ, వేరు వేరు మసీదులు కట్టుకున్నారు. అరబ్బులలో ఉత్తర, దక్షిణ వారి మధ్య హింసాయుత విధ్వంసకర స్పర్థలు ఉన్నాయి. అండలూషియాను అరబ్బులు జయించిన తరువాత తెగల అంతర్యుద్ధాలను నివారించటానికి భిన్న ప్రాంతాలలో వారిని అట్టిపెట్టినా, కలహాలు తప్పలేదు. ముస్తఫా కమాల్-అల్దిన్-అల్సిద్ధికీ 1137లో ఇలా రాశాడు. ఖయాలైత్ ఉత్తర అరబ్బులకూ, ఎమినైట్ దక్షిణ అరబ్బులకూ పోరాటాలు నిరంతరం సాగాయి. ప్రవక్త వాటిని నిషేధించినా అవి ఆగలేదు. (గోల్డ్ జిహర్, పుట. 79)
      ఒకే తెగలో కొందరు అధికులమని భావించి, ఇతర తెగలతో వివాహాలు నిరాకరించారు.
      ప్రవక్తకు కొన్ని సంప్రదాయాలు అంటగట్టి ముఠాలస్పర్థలకు దుర్వినియోగపరిచారు. అరబ్బులు జయిస్తూ పోతుండగా, కీలక స్థానాల నియామకాలు ఈ ముఠాలకు అసంతృప్తిని కలిగించగా అంతర్యుద్ధాలు సాగాయి. అరబ్బులలో సమానత్వం అనే బోధన మొదటి రెండు శతాబ్దాలలోనూ ఫలించలేదని గోల్డ్ జిహర్ రాశాడు.
అరబ్బులు - ఇతరులు
    ఇస్లాంలో సమానత్వాన్ని గురించి చెప్పేదంతా మృతప్రాయమనీ, అది అరబ్బులు గుర్తించలేదనీ, వారి దైనందిన ప్రవర్తనలో నిరాకరించారని స్పష్టమయింది. (గోల్డ్ జిహర్, పుటః 98)
      అరబ్బులు విజయపరంపరలు సాగించిన తరువాత ఇతరులను ఇస్లాంలోకి మార్చినా విచక్షణ కూడదని ఇస్లాం చెపుతున్నా సమానత్వం చూపలేకపోయారు. జయించిన వారు, జయింపబడిన వారూ అనే విచక్షణ ఆధారంగా అరబ్బులు తమ అవకాశాలను వదులుకోలేక పోయారు. అరబ్బులు కాని ముస్లింలను, తక్కువగా చూచి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సైనిక ఇబ్బందులకు గురిచేశారు. (లెవీస్, ది అరబ్స్ ఇన్ హిస్టరీ, పుట 36) ఒక విధమైన ఆటవిక ఉన్నతాధికారులుగా అరబ్బులు పరిపాలన సాగించారు. తల్లిదండ్రుల పారంపర్యతలో అరబ్బులైతేనే నిజమైన అరబ్బులుగా గుర్తించారు. జయించిన చోట స్త్రీలను, అరబ్బులు ఉంపుడుకత్తెలుగా స్వీకరించారు. వారి పిల్లలను అరబ్బులుగా కాక వేరుగా చూశారు.
      అరబ్బులు కాని ముస్లింలపట్ల విచక్షణ బాగా పాటించిన అరబ్బులు జుగుప్సతో వారిపట్ల ప్రవర్తించారు. యుద్ధాలలో వారిని పదాతిదళంగా వాడారు. దోపిడీ సంపదలో వాటా ఇవ్వలేదు. వీధిలో ఒకవైపు నడవలేదు. కూర్చోవటం కూడా వేరువేరు చోట్ల కూర్చున్నారు. మసీదులు నేరుగా నిర్మించారు. అరబ్బులకూ, వీరికీ మధ్య వివాహాలు సాంఘిక నేరాలుగా చూశారు. (కేంబ్రిడ్జి ఇస్లాం చరిత్ర, పుటః 40)
బానిసత్వం
      చరిత్రలో ప్రతి నాగరికతలోనూ ప్రజలు భావించినట్లే, ముస్లింలకు కూడా నాగరికత ప్రపంచం అంటే వారు మాత్రమే వికాసం, వాస్తవ విశ్వాసం వారికే ఉన్నాయి. బయట ప్రపంచం అంతా ఆటవికులూ, విశ్వాస రహితులూ, కొందరికి మతవాసనలు, నాగరిక ఛాయలూ లేకపోలేదు. బహు దేవతారాధకులూ, విగ్రహారాధకులూ బానిసలుగా పవికొస్తారు  (లెవీస్, ది అరబ్స్ ఇన్ హిస్టరీ, పుటః42)
      ఖురాన్ లో బానిస విధానాన్ని ఆమోదించి, యజమాని బానిస సంబంధాలను గుర్తించారు. (సుర 16.77, 30.28) ఉంపుడుకత్తెల విధానం అనుమతించారు. (సుర 4.3, 23.6, 33.50-52, 70-30) బానిసలపట్ల దయగా ఉండమని ఖురాన్ చెపుతుంది. బానిస విమోచన పవిత్ర చర్యగా భావిస్తుంది. అరబ్బు తెగలపై యుద్ధాలలో చాలామందిని ఖైదీలుగా ప్రవక్త పట్టుకున్నాడు. కొందరిని బానిసలుగా మార్చేశాడు.
      ఇస్లాంలో బానిసలకు న్యాయహక్కులు లేవు. వారు యజమాని ఆస్తిగా కేవలం వస్తువులు మాత్రమే. వారిని అమ్మవచ్చు, బహూకరించవచ్చు. బానిసలు సంరక్షకులుగా, సాక్షులుగా ఉండరాదు. వారి సంపాదన యజమానిదే. న్యాయస్థానంలో బానిస సాక్ష్యం ఇవ్వరాదు. ముస్లిమేతర బానిస ఇస్లాంలోకి మారినా, విముక్తి చెందినట్లుగాదు. అతడిని స్వేచ్ఛాపరుడుగా చేయటం యజమాని ఇష్టం.
      లోగడ అరబ్బు దండయాత్రలలో బానిసలుగా చాలామందిని పట్టుకున్నారు. అరబ్బులు వీరిని వాడుకొని దోపిడి చేసి ఆర్థికంగా సంపన్నులయ్యారు. (బాస్వర్త్, ఇస్లామికి డైనాస్టీస్, ఎడింబరో, 1980, పుటః 6) జయించిన ప్రజల్ని రక్షిత స్థాయిలో అట్టిపెట్టడంలోనే బానిస విధానం సన్నగిల్లి అరబ్బులు ఇతర చోట్ల బానిసలకోసం అన్వేషించారు. కొన్ని రాజ్యాలు కప్పం కింద వందలాది స్త్రీ, పురుషులను బలవంతంగా బానిసలను చేసి పంపారు.
      అరబ్బులు బానిస వ్యాపారంలో చైనా, ఇండియా, ఆగ్నేయాసియా రంగాలకు విస్తరించారు. టర్కీ, మధ్య ఆసియా, జైజాంటియం సామ్రాజ్యం, మధ్య-తూర్పు యూరోప్, పశ్చిమ - తూర్పు ఆఫ్రికా నుండి నల్ల, తెల్లవారిని బానిసలుగా చేపట్టారు. ఇస్లాం లోకంలో ప్రతి నగరంలోనూ బానిస వాణిజ్యం ఉన్నది.
      పట్టుబడినప్పటి నుంచి, అమ్మేవరకు, వందలాది బానిసలను అమానుషంగా చూడటంతో రోగాలు, అకలిదప్పులతో అనేక మంది చనిపోయారు. గృహ సేవకులైన వారు అదృష్టవంతులు. మిగిలినవారి శ్రమను ఉప్పు కొఠారులలో, చిత్తడి నేలల్లో, పత్తి చెరకు పొలాల్లో దోపిడీ చేస్తున్నారు.
      ఇస్లాం నిషేధిస్తున్నా స్త్రీ బానిసలను వ్యభిచారిణులుగా తెస్తున్నారు. యజమాని ఇష్టారాజ్యంలో వారుంటారు. స్టాన్లీలేన్ ఫూల్ ఇలా రాశాడు. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, పుటః 680)
      తూర్చు రాజ్యాలలో స్త్రీ బానిస విధానం దయనీయంగా ఉన్నది. యజమాని చేతిలో ఆవిడ కీలుబొమ్మ. ముస్లిం ఎంతమంది ఉంపుడుగత్తెలనైనా ఉంచుకోవచ్చు. తెల్ల బానిసల్ని లైంగిక తృప్తికోసం అట్టిపెట్టుకుని అవసరం లేనప్పుడు అమ్మేస్తుంటారు. అలాంటి స్త్రీలు చితికిపోతున్నారు. ఆమె కుమారుడినికంటె పరిస్థితి కొంత మెరుగవుతున్నది. కుమారుడిని తృణీకరించే హక్కు యజమానికున్నది. ప్రవక్త ఘోరకృత్యాలను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. దండెత్తి జయించిన దేశాలపై స్వీకరించిన బానిసలను గౌరవంగా చూశారు. అలాంటిచోట్ల స్త్రీలను ముస్లిం సైనికుడు తన ఇష్టంవచ్చినట్లు వాడుకోవచ్చు. వేలాది స్త్రీలు, తల్లులూ, కూతుళ్ళూ చెప్పటానికి వీలులేనంత దారుణంగా ఈ విధానంలో బాధలకు గురయ్యారు. ముస్లింల ప్రవర్తనపై ఈక్రూరత్వం ప్రతిబింబించింది.
    ఇస్లాంలో స్త్రీలు ఎలా ఉంటారనే చర్చలో స్త్రీ బానిసల్ని గురించి వారి పరిమిత హక్కులూ, గతినీ విస్మరిస్తున్నారు.
నల్లవారి వ్యతిరేక స్పర్థలు
    రష్యా రచయిత పుష్కిన్ పూర్వీకులు ఇథియోపియన్లు. ఈ విషయం తెలిస్తే రష్యన్లు ఎలా అలోచిస్తారో మరి. అలాగే అరబ్బులలో ఇథియోపియన్ వాసుల్నీ, కవుల్నీ అరబ్బులు కాకులుగా చిత్రిస్తుంటారు. అరబ్బు కవులలో ఇస్లాంకు వూర్వం, ఇస్లాం తొలిరోజుల్లో ఆఫ్రికన్లు, మిశ్రమ అరబ్బులు, ఆఫ్రికన్ తల్లిదండ్రులు గలవారూ అనేకమంది ఉండేవారు. వారి కవితలను బట్టి జాతిద్వేషానికి గురైనట్లు, తమపై తామే దయతలుస్తూ, అసహ్యత పెంచుకుంటూ పోయినట్లు తెలుస్తున్నది. నేను నల్లనివాడిని కాని మనసు తెల్లనిది. నేను తెల్లవాడినైతే స్త్రీలు నన్ను ప్రేమించేవారు. మొదలైన ప్రస్తావనలు  వారి కవితల్లో ఉన్నాయి. ఇలాంటి కాకుల లో సుహాయం (660లో మరణం) సుసాయబ్ ఇబ్న రహ (726లో మరణం). అల్-హై-కుతన్, అబూ దులామ (776లో మరణం) ఉన్నారు. తొలి ముస్లిం సమాజంలో నల్ల బానిసలకు తక్కువ స్థాయి ఉండేది. లెవీస్ ఇలా రాశాడు.
      ప్రాచీన అరేబియాలో నేటి జాతివాదం లేదు. ఇస్లాం అలాంటి ధోరణులను ఖండిస్తూ ముస్లింలందరి సమానత్వాన్ని ప్రకటించింది. ఐనా, ఇస్లాంలోకంలో విషపూరిత జాతి విచక్షణలూ, విద్వేషాలూ తలెత్తినట్లు సాహిత్యం తెలుపుతున్నది. (ది అరబ్స్ ఇన్ హిస్టరీ, పుటః 36)
రద్దు
      20వ శతాబ్దం వరకూ ఇస్లాం ప్రపంచంలో బానిసత్వం కొనసాగింది. మొరాకోలో స్త్రీ పురుషులను బానిసలుగా తీసుకొచ్చి రహస్యంగా అట్టిపెట్టేవారు. టింబక్ టూ నుండి బాహాటంగా రావటం, బహిరంగ అమ్మకం అసాధ్యం కావటం ఈ ఆచారానికి దారితీసింది. (బ్రమ్స్ విగ్, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, నూతన ప్రచురణ)
      సౌదీ అరేబియాలో ఎమెన్ లో 1950 తరువాత కూడా బానిసత్వం కొనసాగింది. దీనిని రద్దు చేయటం మందకొడిగా సాగింది. విదేశీ ప్రభావం వలన ఈ రద్దు ఆరంభమైంది. బానిసత్వాన్ని రద్దు చేయాలని ఒక సిద్ధాంతంగా ఇస్లాం ఎన్నడూ చెప్పలేదని బ్రమ్స్ విగ్ అన్నాడు. ఖురాన్ లో బానిసత్వాన్ని చట్టబద్ధం చేయటంతో మత సూత్రాలకు అనుగుణంగానే ఇది సాగింది. బానిసత్వాన్ని పూర్తిగా రద్దు చేయటమంటే పవిత్ర గ్రంథానికి వ్యతిరేకంగా పోవటమేనని కొందరనుకొంటున్నారు.
      ఇటీవల ఆగ్నేయాసియా నుండి సౌదీ అరేబియాకు, మధ్య ప్రాచ్యానికీ గృహ సేవకులుగా వచ్చిన వారిని బానిసలుగా చూస్తూ ఇళ్ళల్లో బంధించి ఎటూ పోకుండా నిషేధించి, వారి పాస్ పోర్టులు తీసేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాలలో, మధ్య ప్రాచ్యంలో ఏటా 45 వేలమందిని సేవకులుగా నియమించటానికి ఆఫ్రికా యువకులను ఎత్తుకొస్తున్నారు. (ఫ్రెంచి పత్రిక  LVIE నం. 2562, 1994, అక్టోబర్ 6)
అరబ్బు వ్యతిరేక స్పందన
షుబియ
      సుర 49లో 13 చరణాన్ని బట్టి ముస్లింలందరూ సమానంగా ఉండాలన్నారు. దీని ఆధారంగా షుబియాలు అరబ్బులు తలబిరుసుతనాన్ని అభ్యంతర పెడుతూ అరేబియా ఎడారుల్లో ఆటవికులుగా అరబ్బులు ప్రవర్తిస్తున్నారు. షుబియా పార్టీ 2, 3 శతాబ్దాలలో (ముస్లిం) చాలా ప్రభావంతో సాగింది. అబ్బాసిద్ ఖలీఫాల ఆధ్వర్యాన కొన్ని పర్ష్యన్ కుటుంబాలు జొరాస్ట్రియన్ ఆచారాలను అట్టిపెట్టాలని కోరారు. పర్ష్యా ఉన్నత వర్గాల విద్యావంతులలో ఇస్లాం ప్రభావం లేదని స్పష్టపడుతున్నది. అబ్బాసిద్ ఖలీఫా అల్-ముతాసిమ్ కు (833) సైన్యాధిపతిగా ఉన్న ఖాదరి ఖవూస్ (అప్సిన్ అనికూడా అంటారు) క్రైస్తవులుకు వ్యతిరేకంగా మత యుద్ధాలు జయప్రదంగా నిర్వహించాడు. ఆనాడతడు ఇస్లాం హీరో.
      ఇస్లాంను ప్రచారం చేస్తున్న ఇరువురు ఒక పేగన్ దేవాలయాన్ని మసీదుగా మార్చదలచినప్పుడు అతడు వారిపట్ల క్రూరంగా వ్యవహరించాడు. ఇస్లాం చట్టాలను వెక్కిరించాడు. ఇస్లాం ఆచారాల ప్రకారం చంపితినే జంతువులు కంటె గొంతు నులిమేసి వండిన మాంసం బాగుంటుందని  ప్రచారం చేశాడు. సున్తీ ఆచారాన్నీ, ఇతర ముస్లిం పద్ధతులనూ వేళాకోళం చేశాడు. పర్ష్యా సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని కలలు గన్నాడు (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్, మొదటి సంపుటి, పుటః 139)
      అఫిసిన్ వలె అరబ్బేతరులు అవకాశం కోసం ముస్లింలలో చేరారు. పర్ష్యా జాతీయ స్వతంత్రాన్ని, ప్రాచీన సంప్రదాయాలనూ విధ్వంసం చేసిన అరబ్బులను ఏవగించుకున్నారు. (గోల్డ్ జిహర్, పుటః 140)
      ఇతర అరబ్బేతర ముఠాలను గమనిస్తే అరబ్బులు వారిపట్ల చూపిన జుగుప్స వెల్లడవుతుంది. దర్బర్ మేథావులు ఈ అరబ్బుల సామ్రాజ్య వాదాన్ని, ఇస్లాంనూ తప్పించుకోటానికి అనేక పెత్తనాలు చేశారు.
      ఇలా జుగుప్స చూపిన జాతులన్నీ ఇస్లాంకు ముందున్న తమ గొప్పతనాన్ని చాటుకున్నాయి. పర్ష్యన్లు తమ గతాన్ని గురించి అతిశయోక్తిగా చెప్పుకోనక్కరలేదు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో నబాటియన్ రసాయనిక పరిశోధకుడు  ఇబ్న వాషియా బాబిలోనియా సాహిత్యాన్ని అట్టిపెట్టి అరబ్బులకంటె తమ నాగరికత విజ్ఞానం గొప్పవని చూపే ప్రయత్నం చేశారు. (గోల్డ్ జిహర్, పుటః 146)
      నబాటియన్ వ్యవసాయం ఇబ్న గ్రంత చౌర్య అనువాదంగా చెపుతున్నారు. ఈజిప్టులో కోప్టులు ప్రాచీన ఈజిప్టు వారి కార్యకలాపాల గురించి రాసిన పుస్తకంలో అరబ్బుల వ్యతిరేక ప్రస్తావన ఉన్నది.
      అన్ని రంగాలలోనూ అరబ్బేతరులు సాధించిన వాటిని పేర్కొన్నారు. అరబ్బేతరులు కళలూ, శాస్త్రాలను మానవాళి అందించిన తీరును షుబైట్లు తెలిపారు. అరబ్బులు ఆటవికంగా ఉన్న రోజులలో తత్వం, ఖగోళం, సిల్కు అల్లికలు బయట ప్రపంచానికి తెలుసు. అరబ్బులు గర్వించదగిందల్లా వారి కవిత్వమే. అందులోనూ గ్రీకులు పైచేయి అనిపించుకున్నారు. చదరంగం వంటి ఆటలు కూడా బయటివారు పెంపొందించారు. అరబ్బులు అరిచే తోడేళ్ళనీ, మీదబడి రక్కే జంతువులనీ, పరస్పర కలహాలతో జీవించే వారని చిత్రీకరణ జరిగింది.  (గోల్డ్ జిహర్, పుటః155)
బాబక్ లో ఖురామి తిరుగుబాటు
    ఖురామీల తిరుగుబాటు అబ్బాసిద్ పాలకులను ఆందోళనలో పడవేసింది. ఈ ఖురామీలు మజ్ దాకిసిం నుండి సామాజిక  మత ఉద్యమాలు చేబట్టి 8వ శతాబ్దంలో ప్రాముఖ్యతలోకి వచ్చారు. 9వ శతాబ్దం ఆరంభంలో బాబక్ ఖురామి నాయకత్వ స్వీకరించినప్పుడు అరబ్బు వ్యతిరేక, ఖలీఫా వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక లొంగుబాటుగా విజృంభించారు. అజర్ బైజాన్ లో అతడికి అరబ్బు వ్యతిరేక ధోరణి గలవారు అనుచరులయ్యారు. తబరిస్తాన్, కొరాసన్, బాల్క్, ఇస్సాహన్, కోమ్, ఆర్మీనియా ప్రాంతాలలో ఖురామీలు ఉండేవారు. అబ్బాసిద్ లను 20 సంవత్సరాలపాటు బాబక్ ప్రతిఘటించాడు. చివరకు అల్ అఫ్సీన్ ను సైన్యాధిపతిగా ఖలీఫా అల్ ముతాసిమ్ నియమించాడు. రెండేళ్ళలో బాబక్ ను వశపరుచుకున్నారు. బహిరంగంగా అవమాన పరిచారు. అల్ ముతాసిమ్ ఉత్తురువులపై 838లో బాబక్ ను క్రూరంగా ఉరితీశారు.
      ఖురామీ ఆధ్వర్యంలో 9వ శతాబ్దంలో కొనసాగినా 11వ శతాబ్దం వరకూ, బాబక్ ఆరాధన కనిపిస్తుంది.
ఇస్లాం ముందు ఔన్నత్యాలు
    19వ శతాబ్దం వరకూ ఇస్లాంకు ముందు ఏమున్నదో తెలుసుకోవటానికి ముస్లిం దేశం ప్రయత్నించలేదు. 1868లో ఈజిప్టు రచయిత, కవి చరిత్రకారుడు, షేక్ రిఫా అల్ తహతవీ ఈజిప్టు చరిత్రను ప్రచురించాడు. గత చరిత్రను బాగా పరిశోధించాడు. అప్పటివరకూ ఈజిప్టు చరిత్ర అరబ్బు దండయాత్రలతో ఆరంభమయ్యేది. అల్ తహతవీ రాసిన చరిత్రలో ఇస్లాం, అరబ్బు వాదంతో గాక, జాతీయ, దేశభక్తి ధోరణిలో ఈజిప్టును గుర్తించారు. మొట్టమొదటిసారిగా తన దేశచరిత్ర అనేక మతపరమైన, భాషాపరమైన నాగరికత మార్పులకు లోనౌతూనే సజీవంగా, నిరంతరంగా ఒక గుర్తింపుతో ఉన్నట్లు అతడు స్పష్టీకరించాడు.
      షుబియ కాలం నుండి మొట్టమొదటిసారిగా ముస్లిం అధికార వాదాన్ని కాదని, ఇస్లాం పూర్వం అజ్ఞానం, ఆటవికత్వం ఉండే సరైన ధోరణి కాదని షేక్ రిఫా చూపాడు. ఈజిప్టు జాతీయతను  ధైర్యంగా చాటాడు. ఇస్లాం నాగరికతకు ప్రత్యామ్నాయాలున్నాయన్నాడు. ఇరాన్, ఇరాక్ లు కూడా ఇస్లామ్ కు పూర్వమే ఎంతో సాధించినట్లుగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇస్లాంకు ముందు ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకుంటే ఛాందస వాదం తగ్గుతుంది. ఈజిప్టులో క్రైస్తవ ఫెరోవిక్కులు గర్వించదగినవారనీ , కోప్టులు తోటి ఈజిప్టువారిగా ఆమోదించదగిన వారనీ గుర్తిస్తే వారి సొంత దేశంలోనే అల్ప సంఖ్యాకులుగా చిత్రహింసలుకు గురయ్యే బాధ తప్పుతుంది. అల్జీరియా వాస్తవ విషయాలనూ, గతాన్నీ బర్బర్, రోమన్, అరబ్, ఫ్రెంచి, ఉన్నత విషయాలనూ తెలుసుకుంటే మంచిదని స్లిమేన్ జగిడోర్ అన్నాడు. టెలిరమ. 1992 జూలై) మార్పు, పాతను కొనసాగించుట అనేది గుర్తిస్తే ముస్లిం సమాజాలు ముందుకు సాగుతాయి. ఇస్లాంకు ముందు ఉన్న స్థితినీ, యూరోప్ వలస వాదాన్నీ గమనంలోకి తీసుకోవాలి.
      ఇస్లాంకు ముందు ఉన్న గతాన్ని కావాలని అశ్రద్ధ చేయటంతో ముస్లిం ప్రపంచం వక్ర మార్గంలో నడిచింది. నయపాల్ ఇలా అన్నాడు. మత విశ్వాసం గతాన్ని తుడిచిపెట్టింది. దీనివలన చరిత్ర భావన దెబ్బతిన్నది. మానవ ప్రవర్తన, మంచి ఆదర్శాలూ పాడయిపోయాయి. నిజమైన ఒకే విశ్వాసం అనే సంకుచిత దృష్టి ఆవరించింది. సత్యం, సాహసం, మన పక్షానే ఉన్నాయనీ, ప్రతిదీ ఆ పరిధిలోనే చూడటం ఆరంభించారు. విశ్వాసం విలువలను మార్చివేసింది. మానవ ప్రవర్తనను నిర్ణయాలనూ పక్కదారులు పట్టించింది. (న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్, 1991 జనవరి 31)
      ఇలాంటి అసలైన మతం క్రూరంగా స్థాపించి దానికి దివ్యత్వాన్ని ఆపాదించి నడిపారు.
      ప్రపంచాన్ని విశ్వాసపూరితులు, ఆదిలేనివారూ అని రెండుగా విభజించి చూచినందున సెక్యులర్ దృక్పథంలో ఉన్న అరబ్బు మేథావులు సైతం మధ్య ప్రాచ్య దుస్థితిని పాశ్చాత్యుల మీదకు నెట్టేశారు.
యూరోప్ సామ్రాజ్యవాదం
      ఫ్రెంచివారు అల్జీరియాను ఆక్రమించుకున్నారు. వారికి ముందు అరబ్బులూ, టర్కీవారు ఆపని చేశారు. దేశాన్ని వలసగా మార్చి చాలా భూమిని ప్రెంచివారు భుక్తం చేసుకున్నారు. అదే పని లోగడ అరబ్బులూ, టర్కులూ చేశారు. లోగడ చేసిన వారి ఘోరాలకంటే ఫ్రెంచివారి అవసరాలు ఎక్కువేమీ కాదు. ఫ్రెంచివారు అణచివేతకు గురిచేసి అల్జీరియాను పేదరికంలో పడవేశారు.  1962లో ఆవిర్భవించిన అల్జీరియా, స్వేచ్ఛకూ, సంపన్నతకూ, న్యాయానికీ ప్రతిబింబంగా ఉన్నదా ? ఫ్రెంచి రోజులకోసం తిరిగి చూచే అల్జీరియన్లు ఎందరులేరు ?
      (కెడోరి, టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, 1992, జూలై 10)
      ఫ్రెంచి వారు రాకముందు అల్జీరియా ఏ నిర్వచనంతో చూచినా అనాగరకంగా ఉన్నది
      (హూగ్ థామస్ యాన్ అన్ ఫినిష్డ్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. పేజి 602, లండన్ 1981)
      భారతీయులలో చదువుకున్నవారు, కొంత చారిత్రక సత్యం పట్ల గౌరవం ఉన్నవారూ, బ్రిటిషుపాలనలో ఎన్ని లోపాలున్నా సంక్షేమాన్నీ, సంతోషాన్నీ పెంపొందించినదనటంలో వెనకాడరనుకొంటాను.
      (నీరద్ చౌదరి దై హాండ్ అనార్క్, ఢిల్లీ 1987, పుట 774)
      యూరోప్ సామ్రాజ్య వాదానికి సంబంధించిన చారిత్రక అవగాహన అవసరం. భారతదేశాన్ని ఉదాహరణగా చూద్దాం. 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత చరిత్రకారులు జాతీయ చరిత్రలు గుర్తించి, బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎలాంటి ఉపయోగం జరగలేదన్నట్లుగా రాశారు. 1960-70 ప్రాంతాలలో దేశంలో వైఫల్యాలు, లోపాలు, బ్రిటీషువారి శని గ్రహం వలన, దోపిడీ వలన సంభవించాయన్నారు. 50 ఏళ్ళ తరువాత బ్రిటీషువారి మూలంగా ఇండియాకు సమకూరిన ఉపయోగాలను ఒప్పుకోవటం మొదలుపెట్టారు. రాడికల్ హ్యూమనిస్ట్ తార్కొండే ఈ విషయం ఇలా రాశారు. భారత జాతీయ వాదులు ఒక భ్రమను సృష్టించి బ్రిటీషువారు రాకముందు భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్నదనీ, విదేశీ ఆధిపత్యమే దిగజారుడుకు కారణమనీ అన్నారు. ఇది ఆధార రహితం. భారతదేశం అంత గొప్పదైతే, 6వేల మైళ్ళ నుండి నావలలో  వచ్చిన కొద్దిమంది వ్యాపారస్తులు అంత సులభంగా దేశాన్ని ఆక్రమించుకునేవారు కారు. నియంతృత్వం, అన్యాయం, అరాచకత్వం దేశంలో తాండవిస్తుండగా అత్యధిక సంఖ్యాకులు బ్రిటీషువారి చట్ట పాలనను ఆహ్వానించారు. తొలి దశలో వారి ప్రభావం చాలా ఉన్నది. అది ఈ శతాబ్దం ప్రారంభంలో అభ్యుదయ పాత్ర నిర్వహించలేక పోయింది. బ్రిటిషువారు ప్రవేశపెట్టిన స్వేచ్చ, మానవ గౌరవం, వివేచన వలన ఆలస్యంగానైనా పునర్వికాసం పలికింది. మత మూఢత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. సతీ సహగమనం పోవాలనీ విధవలు తిరిగి వివాహం చేసుకోవచ్చనీ, స్త్రీలు చదువుకోవచ్చుననీ, బాల్యవివాహాలు కూడదనీ, అంటరానితనం నిర్మూలించాలనీ వివిధ ఉద్యమ రూపాలు దాల్చాయి. (వి.ఎం.తార్కుండే, రాడికల్ హ్యూమనిస్ట్, ఢిల్లీ, 1983)
      పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలనే బ్రిటీషువారి నుండి సంక్రమించింది. అరబ్బులకు ఇలాంటి చరిత్ర, సంస్కృతిలో ఆసక్తిలేదు. ఇందుకు భిన్నంగా ఇండియాలో బ్రిటీషువారు ఎంతో శ్రద్ధతో ముస్లిం, హిందు, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతుల గురించి పరిశోధన చేసి గ్రంథస్తం చేశారు. లార్డ్ కర్జన్ వంటి సామ్రాజ్యవాదులు తాజ్ మహల్ తో సహా అనేక శిల్పాలను కాపాడారు.
      యూరోప్ వారు సామ్రాజ్యవాద పాలనలో ఎన్ని లోపాలు చూసినా ప్రజలకు అనేక ఉపయోగాలు కూడా జరిగాయి. కొన్ని ఘోరకృత్యాలున్నప్పటికీ మొత్తం మీద యూరోప్ వారు మానవతను చూపారు. యూరోప్ దండయాత్రలు ఇస్లాంను దెబ్బతీశాయి. ముస్లింలు ఓడిపోవటానికి వారి మూర్ఖ సిద్ధాంతం కూడా తోడ్పడింది.
      ముస్లింలు ఇస్లాం సరిహద్దులను విస్తృత పరచడానికీ, నమ్మకం లేనివారిని అణచటానికి ప్రయత్నించారు. అది పవిత్ర యుద్ధం. అలాంటి నమ్మకంతో ముస్లింలు ఆత్మ విశ్వాసం పొంది అధికులమనే ధోరణి ప్రదర్శించారు. యూరోప్ క్రైస్తవ రాజ్యాల చేతుల్లో ఓటమి పరంపరలు చూచిన ముస్లింల అత్మ గౌరవం సన్నగిల్లింది. నైతిక మేథస్సు సంక్షోభం వచ్చింది. ముస్లింలకు దేవుడు ప్రేరేపణ విషయంలో ఎంత సత్యం ఉన్నదనేది సందేహించవలసి వచ్చింది. (లెవీస్, ది వరల్డ్ ఆఫ్ ఇస్లాం, కెడోరి వ్యాసం, పుట 322, లండన్ 1976) ముస్లిం మేథావులు పాశ్చాత్య లోకంపై ద్వేషాన్ని ప్రబలింపజేశారు. అలా చేయనివారు ఒకరిద్దరే ఉన్నారు. ఈ ద్వేషభావం  వలన మానవ హక్కులూ, చట్టబద్ధపాలన, సంస్కరణ, మార్పుకూడా రాకుండా పోయాయి.
      గల్ఫ్ యుద్ధంలో పాశ్చాత్యులకు వ్యతిరేకంగా నిలిచిన సద్దాం హుస్సేన్ అదే భ్రమలో ముస్లింలూ, అరబ్ మేథావులూ సద్దాంహుస్సేన్ ను సమర్థించారు. అందులోనే ఇస్లాం వైఫల్యం కనిపిస్తుంది. పాశ్చాత్యులతో పోలిస్తే తాము తక్కువ వారమనే ధోరణి కూడా ఇందులో ఇమిడి ఉన్నది. అరబ్బులూ, కుర్దులూ, సున్నీలూ, షియాలూ, ముస్లింలూ, యూదులూ వేల సంఖ్యలో హతంగావడానికి కారకుడు సద్దాంహుస్సేన్, అలాంటి వ్యక్తిలో ముస్లింలు ఆశాకిరణాలు చూస్తే అశ్చర్యమే. అత్మ విమర్శ ఈ మేథావులలో లోపించింది. వారు, మనమూ అనే తేడాతో ఇంకా పోరాటాలు చేస్తున్నారు. ముస్లిం లోకంలో వైఫల్యాలకు పాశ్చాత్యలోకాన్నీ, ఇజ్రాయల్ నూ, యూదుకుట్రనూ చూపుతున్నారు. కనుక మాకియా ఇలా రాశాడు. (క్రూయల్టీ అండ్ సైలెన్స్, 235, పుట. న్యూయార్క్, 1993)
      పాత అలవాట్లు ఒక పట్టాన పోవు. ఇతరులపై అన్నిటికీ నేరారోపణ చేయటం అలవాటుగా మారిపోయింది. పాశ్చాత్య లోకాన్నీ, ఇజ్రాయల్ నూ, అరబ్బు మేథావులు నిందించటం పరిపాటయిపోయింది. దీనివలన పూనకం వచ్చిన రీతిలో ప్రవర్తించటం తప్ప మరేమీ సాధించలేక పోతున్నారు.
      నేటి అరబ్బులు మేథావి పరోక్షంగా అలోచించేటట్లు అరబ్బులను ప్రభావితం చేస్తున్నారు. ద్వేషాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ప్రేమకు దూరమవుతున్నారు. గతాన్ని స్వర్ణయుగంగా భావించే భ్రమలో బతుకుతున్నారు. ఒక ముస్లిం వందమంది కాఫిర్లను జయించగలడనే భ్రాంతిలో ఉన్నారు. కనస్ మాకియా కోరినట్లు మార్పు రావాలంటే ఆత్మవిమర్శ అవసరం. ఫాద్హ్ జకారియా ఇలా రాశాడు. మన వెనుకబడినతనాన్ని గమనించి, మన వ్యవస్థను ఆత్మవిమర్శ చేసుకుంటూ పోవాలి. ఇతరులెవరూ మనల్ని ఏదో చేశారనుకునే దానికంటే మనల్ని మనం నిశిత పరిశీలనకు గురిచేసుకోవాలి  (రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్, పుట 117)
బర్బర్ జాతీయవాదం
      చరిత్ర పుట్టకముందు నుండే ఉత్తర ఆఫ్రికాలో బర్బర్ మాట్లాడే ప్రజలు నివశించారు. క్రీ.పూ. 7000 నుండి ఉత్తర ఆఫ్రికాలో వీరు స్థిరపడ్డారు. కార్తేజ్ లో వీరికి సంబంధం ఉన్నా, మొత్తం మీద స్వతంత్ర జీవనం గడిపారు. తరచూ వీరి నాయకులు తెగలను ఏకం చేసి, సామ్రాజ్యాన్నిస్థాపించారు. క్రీ.పూ. 238-148లో తూర్పు సుముదియన్ మశైలీ రాజైన గాయ  కుమారుడు మాసినిస  ఉన్నాడు. అతడు కార్తేజ్ లో పెరిగి రోమన్ల పక్షాన పోరాడాడు. జామాలో రోమన్లు గెలవటానికి అతని దళం కీలక పాత్ర వహించింది. క్రీ.పూ. 202 అతడు బర్బర్ తెగలను ఐక్యపరచి సుమిడియా రాజ్యాన్ని స్థాపించాడు.
      అరబ్బులు రాకముందు వీరి నాగరికత, భాష, చరిత్ర ఉన్నతంగా కొనసాగినాయి. ఆధునిక బర్బర్ మేథావులు అరబ్బు సామ్రాజ్య వాదాన్ని, ఇస్లాంను నిరాకరిస్తున్నారు.
      బర్బర్ల స్వాతంత్రేచ్ఛను రోమన్లు, వాండల్స్, బైజాంటియన్లు ఆపలేకపోయారు. అరబ్బుల రాకవలన కూడా బర్బర్లపై తొలుత ఎలాంటి ప్రభావమూ లేదు. ముస్లిం సేనాధిపతి ఒక్బానఫీ ఈ తెగలను అదుపులో పెట్టలేకపోయారు. 683లో తహూదా వద్ద ఒక్బాను 300 మంది అనుచరులనూ బర్బర్ నాయకుడు కుశైలా హతమార్చాడు. క్రమేణా బర్బర్లు తమ ప్రయోజనార్థం ఇస్లాంలోకి మారుతూ వచ్చారు. బర్బర్ల సహాయంతో తాలిక ఇబ్న జైద్ వంటివారు స్పెయిన్ ను జయించనారంభించారు. ఉత్తరాఫ్రికాలో అరబ్బుల దండయాత్రలు పూర్తి అయ్యాయి.
      పర్ష్యా, సిరియాలలో వలె అరబ్బులు, కాని ముస్లింలపట్ల తక్కువ చూపు చూచినట్లే బర్బర్లు కూడా తమకు న్యాయం జరగలేదని భావించారు. అరబ్బులపై తిరుగుబాటు చేశారు. అల్మోరా విద్దులు (1056-1145), అల్మోహద్దుల (1130-1269) మారినిద్దుల 11, 12 శతాబ్దాలలో బర్బర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
      అఫ్రో, ఆసియా భాషల కుటుంబానికి చెందిన బర్బర్లు సుమారు 300 వరకూ వివిధ లిపితో కూడిన భాషలను వాడుతున్నారు. ఒక కోటి ఇరవై లక్షలమంది బర్బర్ భాషను వాడేవారు. ఈజిప్ట్, లిబియా, టునీషియా, అల్జీరియా, మొరాకో, చాద్, మాలీ, నైజర్, మారిటానియాలలో ఉన్నారు. కాబిలే, షావియా భాషలు అల్జీరియాలో మాట్లాడుతారు. మొరాకోలోన్లూ, తమాజిత్ రిఫ్ భాషలు మాట్లాడుతారు. సహారా దేశాలలో తమాహక్ భాష మాట్లాడుతారు. వీరు రాసే టిఫ్ నాగ్ లిపి క్రీ.పూ.200 సంవత్సరాలకు చెందింది.
అరబ్బు సామ్రాజ్య వాదాన్ని తృణీకరించిన ఆధునిక బర్బర్లు
    కాతిబ్ యాచినీ (1929-1989) అల్జీరియా రచయిత, ప్రసిద్ధ మేధావి, ఇస్లాం అరబ్ సంస్కృతిక సామ్రాజ్య వాదాన్ని నిరాకరించి తన పూర్వీకుల బర్బర్ భాషను సమర్థించాడు. మతం పట్ల సందేహాలను వ్యక్తపరిచాడు. నేను ఖురాన్ పాఠశాలకు వెళ్ళాను. నాకు ఆ మతం నచ్చలేదు. ఖురాన్ అర్థం చెప్పటానికి అరికాళ్ళపై బెత్తాలతో కొట్టేవారు. ఫ్రెంచి పాఠశాలలో ఉపాధ్యాయిని మమ్మల్ని తల్లిలాగా చూచి, స్కూల్ పట్ల ఆసక్తి పెంపొందింపజేసింది. (లమాండే, 1989, అక్టోబర్ 31)
      అల్జీరియా నుంచి వచ్చిన ఫ్రెంచివారికి బార్ రేడియో స్టేషన్ స్థాపించారు. అందులో యాచినీ మాట్లాడుతూ తాను అల్జీరియా వాడిననీ, ముస్లింనూ, అరబ్బునూ కాదని అన్నాడు. అవాల్ పత్రికా గోష్ఠిలో ఇస్లాం పట్ల తన జుగుప్సను వెల్లడించాడు. (1987) అరబో ఇస్లాం అల్జీరియా వారిమని చెప్పుకునేవారు. వారికి వారే వ్యతిరేకులు. అల్జీరియాకు కూడా వ్యతిరేకులే. ఇస్లాం కత్తిని చూపి అలాంటి అల్జీరియాను స్థాపించింది. కన్నీటితో, రక్తంతో, అల్జీరియా తడిసిపోయింది. ఇక్కడ పరమళాలు, మాధుర్యాలు లేవు. అణచివేత, హింస, జుగుప్స ఉన్నాయి. ఫలితాలు అనుభవిస్తున్నాం. (లమాండే, 1994 మే. 20) ఒకనాడు అల్జీరియా మళ్ళీ బర్బర్లు మాట్లాడిన భాషలో తమేజగ  అని పిలవాలి. ప్రపంచానికి  అశాంతిని అందించిన మూడు మతాలపట్ల యాదినీ పరుషవాక్యాలు పలికాడు. వాటివల్లనే ప్రజలకు చెడు సంభవించిందన్నారు. అల్జీరియా అశాంతి అక్కడే ఆరంభమయిందన్నారు. రోమనులు, క్రైస్తవులను గురించి ఒకప్పుడనుకునే వాళ్ళమనీ, ప్రస్తుతం అరబ్, ఇస్లాంలపై సుదీర్ఘ పోరాటం జరపాలనీ అన్నాడు.
      1989లో చనిపోకముందు యాదినీ, బర్బర్ గాయకుడు హైత్ మెంగులెత్ పుస్తకానికి పీఠిక రాశాడు. ప్రాచీన కబాలే కవిత్వాన్ని గురించి 1980లో ఏర్పాటు చేసిన అల్జీరియా సమావేశాన్ని నిషేధించిన విషయం ప్రస్తావించారు. బర్బర్లు ఆ నిషేధాన్ని వ్యతిరేకించి తమ భాషకోసం కొట్లాడారు. ఫ్రెంచి అల్జీరియా కోసం ఒకప్పుడు బలవంతంగా ఫ్రెంచి నేర్చారు. అలాగే నిర్బంధంగా అరబిక్కును అమలు పరిచి మాతృభాష తమాజిత్ ను మాట్లాడకుండా చేశారు. అరబ్బు జాతి మిథ్యా భావనతో అల్జీరియాను అణచివేశారు. అల్జీరియా భాష అరబిక్ అనే భ్రాంతిని వ్యాపింపజేసింది. శతాబ్దాల విదేశీ ఆధిపత్యం ఉన్నా తమాజిత్ వారి మాతృభాష, ఫ్రెంచి అల్జీరియాను సాయుధ పోరాటంలో ఒదిలించాం. కాని అరబ్ ఇస్లామిక్ అల్జీరియా అనే విధ్వంసక భ్రమలో కూరుకుపోయాం. 104 సంవత్సరాల ఫ్రెంచి అల్జీరియా పోయింది. అరబ్ - ఇస్లాం అల్జీరియా 13వ శతాబ్దాల భారాన్ని తెచ్చిపెట్టింది. మనం అరబ్బులమని అనుకోటమే వైమనస్యతకు దారితీసింది. అరబ్బు జాతి అరబ్బు దేశం లేదు. పాలకులు కొరాన్ పవిత్ర భాషను అడ్డం పెట్టి, సొంత విషయాన్ని తెలుసుకోకుండా చేస్తున్నారు. అయితే మెంగూలెత్ బర్బర్ భాషలో రాస్తే విదేశీయుడుగా చూస్తున్నారు. లమాండే (1989       నవంబరు 3)
1994, అల్జీరియాలో బర్బర్లు
    బర్బర్లు తమ భాషకోసం 1980లో సాగించిన పోరాటాన్ని గుర్తుచేస్తూ 1994 ఏప్రిల్ లో ప్రదర్శనలు జరిపారు. బర్బర్ల గుర్తింపు కావాలన్నారు. బహుళ వాదాన్ని కోరుతూ బర్బర్ల భాషను, ద్వితీయ, జాతీయ భాషగా గుర్తించాలన్నారు. మానవ హక్కుల సంఘం అల్జీరియాలో ఆవిర్భవించటానికి బర్బర్ సాంస్కృతికోద్యమమై నాంది పలికింది. ఇస్లాం భావాలకూ, మానవహక్కులకూ పొందిక లేదని బర్బర్ సంస్కరణ వాదులు భావించారు. తమ దేశం, ఆటవిక దశలో కూరుకుపోకుండా ఫాసిస్ట్ ధోరణి రాకుండా వ్యతిరేకించాలని బర్బర్లు తలపెట్టారు. (1994, ఏప్రిల్ 20 ఇన్ఫర్మేషన్)
----
అనువాదం
        నరిసెట్టి ఇన్నయ్య
 

మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా ?-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ? -part 7

Writer , translator
ఇబన్ వారక్
అధ్యాయం  - 7
ప్రజాస్వామ్యం - మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా ?
ఇస్లాం ఏనాడూ ప్రజాస్వామిక ధోరణులను ఆమోదించలేదు. (హర్ గ్రోంజె, సెలెక్టెడ్ వర్క్స్, పుటః 277)
ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానం మా ప్రాంత ప్రజలకు పనికిరాదు. అలాగే స్వేచ్ఛాపూరిత ఎన్నికలు కూడా మా దేశానికి సరిపడవు.
(సౌదీ అరేబియా రాజు ఫాద్ (Fahd) ఫోరిన్ ఎఫైర్స్, 1993)
ఇస్లాంకు ప్రజాస్వామ్యానికీ పడదని కింగ్ ఫాద్ చిత్తశుద్ధితో చెప్పాడు. కాని పాశ్చాత్య ఇస్లాం సానుభూతిపరులు, ముస్లింలలో ఆధునీకరణ కావాలనేవారు ఇస్లాంలో, ఇస్లాం చరిత్రలో, ప్రజాస్వామ్య సూత్రాలను వెతుకుతున్నారు.
మానవ హక్కులు, ఇస్లాం
      1948లో ప్రపంచ మానవహక్కులు ప్రకటన జరిగింది. ఇస్లాం చట్టాన్నీ, సిద్ధాంతాన్నీ దానితోపోల్చి చూడండి.
      (ఎ.ఐ. మెల్డెన్, హ్యూమన్ రైట్స్, బెల్ మౌంట్, 1970 అనుబంధం)
      ఆర్టికల్ 1. మానవులంతా పుట్టుకతో సమానం. హక్కులలో, గౌరవంలో సమానం. వారికి వివేచన, మనస్సాక్షి ఉన్నాయి. సౌభ్రాతృత్వ భావనతో ప్రవర్తించాలి.
      ఆర్టికల్ 2. అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ అనుభవించటానికి అందరూ అర్హులు. ఇందులో జాతి, రంగు, లింగ, భాష, మత, రాజకీయ, జాతీయ విచక్షణలకు తావులేదు. ఆస్తులూ, పుట్టుక, అంతస్తులూ, సాంఘిక స్థితిని గమనించరు.
      ఆర్టికల్ 3. ప్రతివారికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, వ్యక్తి భద్రత హక్కులున్నవి.
      ఆర్టికల్ 4. ఎవరినీ బానిసత్వంలో, సేవలో బంధించరాదు. బానిసత్వం, బానిస వ్యాపారం అన్ని రూపాలలో నిషిద్ధం.
వ్యాఖ్యానాలు 1. ఇస్లాం చట్టంలో స్త్రీలు తక్కువ స్థాయివారు. న్యాయస్థానంలో వారి సాక్ష్యం పురుషులలో సగం మాత్రమే. వారి స్వేచ్ఛకు పరిమితులు విధించరాదు. ముస్లిమేతరులను పెండ్లాడరాదు.
      ఆర్టికల్ 2. ముస్లిం దేశాలలో నివశిస్తున్న ముస్లిమేతరులకు ఇస్లాం చట్టం ప్రకారం తక్కువ స్థాయి ఉన్నది. ముస్లింకు వ్యతిరేకంగా వారి సాక్ష్యం చెప్పరాదు. మహమ్మద్ సంప్రదాయం ప్రకారం అరేబియాలో 2 మతాలు ఉండటానికి వీలు లేదు. సౌదీ అరేబియాలో ముస్లిమేతరులను, వారి మతాచారాలనూ, దేవాలయ నిర్మాణంలోగానీ, బైబుల్ వంటివి అట్టిపెట్టుకోవటం వంటివి అనుమతించరు.
      ఆర్టికల్ 3. దైవనమ్మకం లేనివారు - నాస్తికులు (చరిత్రలో వీరు అశ్రద్ధకు గురైన అల్ప సంఖ్యాకులు. ముస్లిం దేశాలలో వీరికి జీవించే హక్కు లేదు. వారిని చంపేయాలి. పెద్ద పాపాలు, చిన్న పాపాలనేవి రెండు రకాలు. 17 పెద్ద పాపాలలో దైవనమ్మకం లేకపోవటం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది హత్య, దొంగతనం, వ్యభిచారానికి మించిపోయింది.
      ఆర్టికల్ 4. కొరాన్ లో బానిసత్వాన్ని గుర్తించారు. సుర 4.3 ప్రకారం ముస్లింలు వారి స్త్రీ బానిసలతో సంభోగించవచ్చు. బానిసలైతే వారిని వివాహితులుగా స్వీకరించవచ్చు. (సుర 4.28) బానిసలు నిస్సహాయ స్థితి చూస్తుంటే సృష్టికర్త  సమక్షంలో అరేబియా తప్పుడు దేవుళ్ళ విషయం తెలుస్తున్నది. (సుర 16.77).
      ఆర్టికల్ 5. ఎవరినీ అమానుషంగా, క్రూరంగా శిక్షించరాదు. చిత్రహింస పెట్టరాదు.
      వ్యాఖ్యః పవిత్రచట్టాన్ని పాటించనివారిని చేతులు, కాళ్ళూ నరకడం, శిలువ వేయటం, రాళ్ళు కొట్టి చంపడం, కొరడా దెబ్బలు కొట్టటం వంటి శిక్షలు గమనించాం. ముస్లిం దేశంలో ఈ శిక్షలన్నీ మామూలుగా లేవని ఎవరైనా ముస్లిం వాదించవచ్చు. కానీ, వాటిలోని అమానుషత్వం మాటేమిటి ? ఈ శిక్షలు దైవికంగా వచ్చాయి. గనుక మానవుడి ప్రమాణాలతో కొలవరాదని ముస్లిం వాదించవచ్చు. కాని, మానవుల ప్రమాణాల ననుసరించి అది అమానుషమైనది.
      ఆర్టికల్ 6ః చట్టం ముందు ప్రతివారూ గుర్తింపు పొందాలి. ఇస్లాంలో వ్యక్తి స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవడానికి, నైతికంగా బాధ్యత వహించటానికి అవకాశం లేదు.
      ఆర్టికల్స్ 7, 8, 9, 10, 11 నిందితుడికి న్యాయమైన విచారణ జరగవలసిన హక్కు ఉన్నది.
      వ్యాఖ్య 1. షాట్ చూపినట్లు షరియాలో న్యాయం, సత్యం, ధర్మం, విశ్వాసం అనేవాటికి తక్కువ స్థానం ఉన్నది. నేరస్తుడుగా నిందితుడు అనే భావనలేదు.
      2. చంపినందుకు పగ తీర్చుకోటం అధికారికంగా అనుమతించారు. నష్టపరిహారం డబ్బు రూపేణ చెల్లించవచ్చన్నారు.
      3. ఇస్లాంలో చట్టరీతులు నిస్పాక్షికం అయినవి. సక్రమమైనవీ అనటానికి వీలులేకుండ సాక్షుల విషయంలో అన్యాయాలు పాటిస్తున్నారు. ముస్లింకు వ్యతిరేకంగా ముస్లిమేతరుడు సాక్ష్యం చెప్పరాదన్నారు. ఉదాహరణకుః ముస్లిమేతరుడి ఇంటిని ఒక ముస్లిం దోచినప్పుడూ అక్కడ ముస్లిమేతరుడు తప్ప మరెవరూ సాక్ష్యం లేకుంటే చేయగలిగిందేమీ లేదు. ముస్లిం స్త్రీల సాక్ష్యాన్ని అరుదుగా స్వీకరిస్తారు. పురుషులకంటే రెట్టింపు సంఖ్యలో సాక్ష్యం ఇవ్వాలి.  
అర్టికల్ 16. స్త్రీ పురుషుల వైవాహిక హక్కులు చర్చించబడ్డాయి.
      వ్యాఖ్యః ఇస్లాం చట్టంలో స్త్రీలకు సమానహక్కులు లేవు. వారి ఇష్ట ప్రకారం పెళ్ళి చేసుకోవటానికి వీలులేదు. విడాకుల హక్కులు కూడా సమానం కాదు.
      ఆర్టికల్ 18. ప్రతివారికీ స్వేచ్ఛ, మత స్వాతంత్రం ఉండాలి. మతాన్ని నమ్మకాన్ని మార్చుకునే స్వేచ్ఛకూడా ఉన్నది. వ్యక్తిగతంగానూ, బహిరంగంగానూ ఇతరులతో కలసి ఈ మార్పులు చేసుకోవచ్చు. మతాన్నీ, నమ్మకాన్నీ బోధించటం, ఆచరించటం, పాటించటం, ప్రార్థించటం యథేచ్ఛగా చేసుకోవచ్చు.
వ్యాఖ్యః 1, ఇస్లాం చట్టంలో ముస్లిం కుటుంబంలో పుట్టినవారు మతం మార్చుకోటానికి వీలలేదు. ఇందుక భిన్నంగా ఇతర మతస్తులను ముస్లింలలో చేర్చుకోవచ్చు.  ముస్లిం మారితే అతనికి మరణమే శిక్ష. బేదవి భాష్యం చెపుతూ బహిరంగంగా కానీ, రహస్యంగాగానీ ఎవరు మతం మార్చుకున్నా వారిని చంపేయవచ్చు. వారికి దూరంగా ఉండాలి. (1291)
      2. ఇస్లాం నుండి క్రైస్తవానికి మారిన లెక్కలు స్పష్టంగా లేవు. ఇని నేరంగా పరిగణించటం ఒక కారణం. ముస్లింలు మారరని ఒక భ్రమ ఉన్నది. మధ్యకాలాల నుండి, నేటి వరకూ ఇస్లాంను వదిలి. క్రైస్తవంలోకి మారిన వేలాది ఉదాహరణలున్నాయి. మారాకో, టునీషియా యువరాజులు 17వ శతాబ్దంలోనూ, ఆఫ్రికాలో కాన్ స్టాంటిన్ మతగురువు ఇందుకు సోదాహరణలు. 1614-1798 మధ్య ఒక్కరోమ్ లోనే 1087 మంది మతం మారారు. ఎ.టి.విల్లీస్ ప్రకారం 1965లో కమ్యూనిస్టులను ఊచకోత కోసినప్పుడు 30 లక్షల వరకూ ముస్లింలు మతంమారి క్రైస్తవులయ్యారు. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లో 300 వరకూ ఇస్లాం నుండి క్రైస్తవానికి మారుతున్నారు. ఈజిప్టులో జరుగుతున్న మతమార్పిడి ముస్లిం ముల్లాలకు ఆగ్రహాన్ని కలిగించగా ఇలాంటప్పుడు మరణశిక్ష విధించాలని చట్టం చేయమంటున్నారు. (ఆన్.ఇ.మేయర్, ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్, బౌల్డర్, 1991, పుటః 177) ఇస్లాం నుండి చాలామంది స్త్రీలు మతం మార్చుకొని తమ స్థితిగతులు మెరుగుపరుచుకుందామని చాలామంది లోగడ భావించారని మేయర్ పేర్కొన్నది.
      3. క్రైస్తవంలోకి మారిన తరువాత ఒక ముస్లిం దేశంలో ఉండటమంటే ప్రమాదకరమే. మారినా వారికి హక్కులుండవు. తగిన పత్రాలను ఇవ్వరు గనుక దేశం వదలటం కష్టం. అతని పెళ్ళి చెల్లదని ప్రకటిస్తారు. అతని పిల్లలను వేరుచేసి ముస్లింలుగా పెంచుతారు. అతడు ఆస్తిహక్కు కోల్పోతాడు. కుటుంబంలోని వారే అతన్ని చంపేస్తారు. ఐనా వారికి శిక్ష ఏమీ ఉండదు. (Gzndeul, Jean-Marie, Appelesparle Christ llsviennent Del’ Islam, Paris, 1991)
        ఆర్టికల్ 19. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉండాలి. ఇందులో సరిహద్దుల ప్రతిబంధకాలు అడ్డు రాకూడదు. భావాలు, సమాచారం స్వీకరించడానికీ, అందించడానికీ, ప్రసార సాధనాలు వినియోగించుకోటానికీ హక్కు ఉండాలి.
      వ్యాఖ్య 1. ఇరాన్ పాకిస్తాన్, సౌదీ అరేబియాలో ఈ హక్కులు ఉల్లంఘిస్తున్నారు. బహాయ్, అహమ్మదీయ, షియా అల్ప సంఖ్యాకుల హక్కుల్ని తృణీకరించారు. ఇందుకు కూడా షరియాను చూపి సమర్థించుకుంటున్నారు. ఈ దేశాలలో క్రైస్తవుల హక్కుల నిరాకరించి తరచు నేరారోపణలు చేసి బంధిస్తున్నారు.
సౌదీ అరేబియాలో ఉన్నస్థితిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వివరణ
      “వందలాది క్రైస్తవులు కేవలం తన మత నమ్మకాలను వ్యక్తం చేసినందుకు స్త్రీలు, పిల్లలతో సహా ఎలాంటి విచారణ లేకుండా నిర్భంధానికి గురయ్యారు. కొందరిని కొరడాలతో కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. బైబుల్, పూసలదండలు, శిలువ, జీసస్ క్రైస్ట్ బొమ్మలు, ఇస్లామేతర వస్తువులూ నిషేధించారు. వాటిని స్వాధీనపరుచుకునేవారు.” (జూలై-ఆగస్టు, 1993, ఎ.ఐ.ఎన్.ఓ. 62)
      షియా ముస్లింలను బాధించి, బంధించి, నిర్భంధించి కొన్ని సందర్భాలలో తలతీసేసారు. 1992 సెప్టెంబరు 3న సాధిక్ అబ్దుల్ కరీం ముల్లాలను అల్ ఖతీఫ్ లో బహిరంగంగా ఉరితీశారు. 1988లో షియా ముస్లిం సాదిక్ ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ పై రాళ్ళు విసిరాడని నేరం మోపి రహస్యంగా దేశంలోకి బైబుల్ని తెచ్చాడన్నారు. ఒంటరిగా నిర్భంధంలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. పాకిస్తాన్ లో అహమ్మదీయుల పరిస్థితి ఆలాగే ఉంది. మీర్జాగులామ్ అహమ్మద్ (1908లో మరణం) అహమ్మదీయ ఉద్యమాన్ని స్థాపించాడు. అతడిని ప్రవక్తగా అనుచరులు భావిస్తారు. వారిస్థితిని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇలా వర్ణించింది.
      “తమను ముస్లింలుగా అహమ్మదీయులు భావించినా, సనాతన ముస్లింలు వారిని పరాయివారిగానే చూస్తున్నారు. మహమ్మద్ తుది ప్రవక్త కాదనీ తమ ఉద్యమ నిర్మాత ప్రవక్త అనీ, వీరు భావించటం నేరమయింది. అహమ్మదీయుల ప్రకారం మహమ్మద్ ను  ప్రవక్తగా తాము నిరాకరించలేదనీ, మీర్జా గులామ్ అహమ్మద్ కొత్తగా దైవాంశ ఏదీ వెల్లడించలేదనీ పేర్కొన్నారు. కాని ప్రవక్త మహమ్మద్ తిరిగి తలెత్తిన రూపంలో ఇతడు ఉన్నాడనీ, కనుక ఇస్లాంను తిరగదోడాలనీ చెప్పారు. దీని ఫలితంగా అహమ్మదీయులను విచక్షణతో చూస్తూ ఇస్లాం దేశాలల చిత్రహింసలు పెడుతున్నారు. సౌదీ అరేబియా ఒక ప్రపంచ ముస్లింలీగ్ సంస్థను ఏర్పరచి అహమ్మదీయులకు వ్యతిరేకంగా 1970 నుండి ఉపక్రమించింది. సౌదీ అరేబియాలో వీరు నిషిద్దులు.
      పాకిస్తాన్ చరిత్రలో అహమ్మదీయులను హింసించడం, తరచూ రక్తపాతం జరగటం గమనార్హం. 1977లో సైనిక కుట్ర అనంతరం జియావుల్ హక్ అధ్యక్షుడుకాగా అతడు ఇస్లామీకరణ విధానంలో అహమ్మదీయులపై తీవ్ర ఆంక్షలు విధించాడు. వీరి నుద్దేశించి 1984లో చట్టాలు తెచ్చాడు. ఆహమ్మదీయులు అప్పటినుండి ముస్లింలుగా పిలుచుకోవటానికి వీలులేదన్నారు. పాకిస్తాన్ శిక్షాస్మృతి ప్రకారం చాలామంది అహమ్మదీయులను శిక్షించారు. వారి మత స్వేచ్ఛ వెల్లడించినందుకే మరణశిక్ష కూడా విధించవచ్చన్నారు. మహమ్మద్ చివరి ప్రవక్త అనీ, ఇస్లాం వెలుపల ముక్తికి మార్గం లేదనీ ఇస్లాం సంపూర్ణ, తుదిరూపంగా దైవం ప్రదర్శించిందనీ, సనాతనులు భావిస్తున్నందువలననే ఇవన్నీ వచ్చాయి.
      2. దేవుడికీ, ప్రవక్తకూ వ్యతిరేకత చూపితే ఇస్లాం చట్టంలో మరణశిక్ష విధించవచ్చు. వ్యతిరేకతను అణచి వేయటానికి కొన్ని సందర్భాలలో వ్యక్తిగత దోషాలు తీర్చుకోవటానికి ముస్లిం ప్రభుత్వాలు ఇలాంటి శిక్షలు వేస్తున్నాయి పాకిస్తాన్ లో జరుగుతున్న రీతుల్ని ఎకానమిస్ట్ పత్రిక ఇలా రాసింది.
      లాహోరు హైకోర్టు తీర్పు పాకిస్తాన్ క్రైస్తవులను ఆందోళన పెడుతున్నది. పాకిస్తాన్ లో చట్టాలు, ఇస్లాం ప్రవక్తలందరికీ అన్వయిస్తాయన్నారు. ఇస్లాంలో జీసస్ కూడా ఒక ప్రవక్తే దేవుడి కుమారుడిగా జీసస్ ను పూజించటం క్రైస్తవుల నేరంగా పాకిస్తాన్ భావిస్తున్నది. 12 లక్షల క్రైస్తవులు పాకిస్తాన్లో ఉన్నారు. నమ్మకాల వలన వారు బాధలకు గురి అవుతున్నారు. విమానదళంలో మెకానిక్ గా ఉన్న తాహిర్ ఇక్బాల్ క్రైస్తవంలోకి మారినందుకు నిర్భంధంలో అంతు తెలియని రీతిలో చనిపోయాడు. మంజూర్ మాషీని బెయిలుపై విడుదల చేసి వీధుల్లో కాల్చిచంపారు. ఆస్తులూ, ఉద్యోగాల స్పర్థలు, రాజకీయ కక్షలు తరచు ఇలాంటివాటికి దారితీస్తున్నాని మానవ హక్కుల పర్యవేక్షకులు చెప్పారు. (1994, మే 7).
      ఆర్టికల్ 23. ప్రతివారికీ పని చేసేహక్కు, స్వేచ్ఛగా ఉద్యోగం ఎంపిక చేసుకునే హక్కు, పనిలో న్యాయమైన అనుకూల స్థితిగతులూ, నిరుద్యోగానికి వ్యతిరేకంగా సంరక్షణ, హక్కూ ఉండాలి.
      వ్యాఖ్య 1. ఇస్లాం చట్టంలో స్త్రీలకు స్వేచ్ఛగా పనిచూసుకునే హక్కు లేదు. కొన్ని ఉద్యోగాలు వారికి నిషిద్ధం. ముస్లిం దేశాలలో ఉదార పరిస్థితులున్నచోట కూడా ఈ నిషేధాలున్నాయి. ఇల్లుదాటి స్త్రీలు పనిచేయటాన్ని సనాతన ఇస్లాం నిషేధించింది.
      2. ముస్లిం దేశాలలో ముస్లిమేతరులు యథేచ్ఛగా పని చేయటానికి వీలులేదు. సౌదీ అరేబియా ఇందుకు ఉదాహరణ. ముస్లింల యాజమాన్యంలో ఉన్న ఒక కంపెనీ క్రైస్తవుల్ని కొత్త యజమానిగా నియమిస్తే ముస్లింలు అభ్యంతరపెట్టారు. ఇస్లాం చట్టంలో ముస్లింలపై ముస్లిమేతరులు పెత్తనం చేయటానికి వీలు లేదని రియాద్ లోని ఇస్లాం లా కళాశాలకు చెందిన షేక్ మన్నా              కె. అల్.కుబ్ తాన్ ప్రకటించాడు. అందుకు ఖురాన్ లో రెండు చరణాలు చూపాడు. నమ్మకస్తులపై విజయం సాధించే అవకాశం అల్లా నమ్మకంలేని వారికి ఇవ్వడు. (సుర. 4.141)
అధికారం, ఒత్తిడి అనేవి దేవుడికీ, ప్రవక్తకూ, నమ్మకస్తులకు మాత్రమే చెందుతాయి.               (సుర 73.8)
      ఆర్టికల్ 26, విద్యహక్కు.
      వ్యాఖ్య, స్త్రీలకు కొన్ని రంగాలలో విద్య నిరాకరించారు. మానవహక్కులూ, ఇస్లాం పొసగని ఇస్లాం తీవ్రవాదులకు తెలుసు. 1981లో తీవ్రవాదులు పారిస్ లో సమావేశం అయి ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఖండిస్తూ ఇస్లాం మానవహక్కులు అని ప్రకటించారు. 1981 నవంబరులో ముస్లిం దేశాల వత్తిడి మూలంగా ఐక్యరాజ్యసమితి మత విచక్షణ తొలగించిన అంశాన్ని తిరగదోడింది.  అలాగే దత్తత స్వీకార హక్కులను గూడా తిరగదోడింది. మతాన్ని అట్టిపెట్టుకునే హక్కు కొనసాగిస్తూ మతాన్ని మార్చుకునే హక్కుని సమితి ఉపసంహరించింది. (ఫ్రీ ఎన్ క్వైరీ, స్ట్రింగా 1984).
ప్రజాస్వామ్యం, ఇస్లాం
    వ్యక్తివాదం, ఉదారవాదం, రాజ్యాంగవాదం, మానవహక్కులూ, సమానత్వం, స్వేచ్ఛ, చట్టనియమం, ప్రజాస్వామ్యం స్వేచ్ఛావాణిజ్యం, రాజ్యం-మతం వేరు అనే పాశ్చాత్య భావాలు ఇస్లాం, కన్ ఫ్యూషియన్, జపాన్, హిందూ, బౌద్ధ సనాతన సంస్కృతులకు పట్టలేదు.
    శామ్యూల్ పి.హింటింగ్ట్రన్ (ఫారిన్ ఎఫైర్స్, సంపుటి. 72, సంచిక. 3. 1993)
      అమెరికా రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలూ, సూత్రాలూ నిర్వచించి ప్రవేశపెట్టారు. 1688లో బ్రిటిష్, 1789లో అమెరికా హక్కులపత్రం వచ్చాయి.
మతం, రాజ్యం వేరు
    ప్రజాస్వామ్యంలో మతాన్ని రాజ్యంనుండి వేరుచేయటం మౌలిక సూత్రం. (అమెరికా రాజ్యాంగం 1వ సవరణః మతాన్ని స్థాపించటానికి, స్వేచ్ఛగా అవలంబించే విధానాన్ని నిషేధించటానికి కాంగ్రెస్ ఎలాంటి చట్టం చేయదు) ఇస్లాంలో ఇలాంటి తేడాలేదు. థామస్ పెయిన్ పేర్కొన్నట్లు మతం, రాజ్యం అసహ్యంగా కలిసిపోయాయి. వాటి వేర్పాటు ఎందుకు అవసరం ? ముస్లింలు తమ దేశాలలో ప్రజాస్వామ్యాన్ని చిత్త శుద్ధితో అమలు పరచదలిస్తే మతమూ, రాజ్యమూ ఏర్పాటును తెలుసుకోవాలి. ఇస్లాంతో ఈ సూత్రాలు ఎంతవరకు పొందికగా ఉంటాయి. ఏ మేరకు సనాతన భావాలు ఈ సూత్రాలు ఎంతవరకు పొందికగా, ఉంటాయి. ఏ మేరకు సనాతన  భావాలు రాజీ పడవలసివస్తుంది అనేది చూచుకోవాలి. నైతిక, సిద్ధాంతపర మేథస్సు సంబంధమైన ఇలాంటి కప్పదాటు వ్యవహారం కుదరదు.
      మతమూ, రాజ్యమూ వేరు పరచాలని లాక్, స్పినోజా, వికాస తాత్వికులూ, పాశ్చాత్య లోకంలో సూత్రీకరించారు. సహనానికి సంబంధించిన లేఖలలో ఈ సూత్రాలను అవలంబించడానికి లాక్ 3 కారణాలు పేర్కొన్నాడు. (జె.లాక్.,ఎ లెటర్ కన్ సర్నింగ్ టాలరేషన్, బఫెలో, 1990 పుటః 19-22)
      మనస్సాక్షి పౌరుల ఆలోచనలో జోక్యం చేసుకోటం రాజ్యం పని కాదు. వత్తిడితో ప్రజల్ని మతస్తులుగా రాజ్యం చేయజాలదు. బలవంతం చేసి పాటించేటట్లు చూస్తే, చిత్తశుద్ధి లేని నమ్మకాలే మిగులుతాయి. లాక్, కాండ్ మరొక సూచనలో మతాన్ని అధికారికంగా అమలు పరిస్తే అభివృద్ధికీ, వికాసానికీ ఆ తరాన్ని దూరం చేసినట్లే, ఒక శాశ్వత మతసంస్థను ప్రజలకు కట్టుబడేటట్లు చేయటం నిషిద్ధం అని కాంట్ పేర్కొన్నాడు. (ఇమాన్యూల్ కాంట్, అన్ హిస్టరీ, అనువాదం, బెక్, యాంకర్, ఫతెన్ హైమ్, న్యూయార్క్, 1963, పుట 7, 8) అలా వత్తిడి చేస్తే వివేచనను వదిలేసి వికాసాన్ని త్యజించి మానవహక్కులను కాలరాయటమే. లాక్ వాదిస్తూ పుట్టుకతో ముస్లింలు, పుట్టుకతో, క్రైస్తవులు అనే భావాన్ని పోగొట్టుకోవాలనీ, ఈ విషయంలో ఇంకేమీ చేయలేమనటం సరికాదనీ అన్నాడు.
      మతాన్నీ, రాజ్యాన్నీ వేరు చేయాలనే సూత్రం అంగీరిస్తే, హింసకు గురికాకుండా మతాన్ని స్వేచ్ఛగా చర్చించాలి. ఈ విషయంలోనే మత నిరంకుశులు, మత ప్రభుత్వాలు భయపడుతున్నారు. ముస్లింలు మతానికీ, రాజ్యానికీ ఉన్న సంబంధాన్ని చర్చించటానికి వీలులేకుండా శిక్షలు విధించి బాధలు పెట్టారు.  ఈ రెండింటి తేడాను చూడగలిగిన చోట మత విధానంలో విప్లవం తప్పదు. పురోహితుల్ని పట్టుకొనకా తప్పదు. బహుశ కలుషితంలేని ఒకే దేవుడిలో నమ్మకాన్ని తిరిగి తీసుకురావచ్చేమో (థామస్ పెయిన్, ది ఏజ్ ఆఫ్ రీజన్, సకాకస్, 1974, పుటః 51)
      లాక్ ను ఆదర్శంగా స్వీకరించి అమెరికా రాజ్యాంగ నిర్మాతలు,  ముఖ్యంగా మేడిసన్ మత స్వేచ్ఛను సమర్థించారు. హక్కులపత్రం ఆమోదించటంలో మతాన్నీ, రాజ్యాన్నీ వేరు చేశారు. అంతవరకూ అసహనానికీ, ఓటుహక్కు లేకపోవటానికి, విచక్షణకూ, బాధలకూ గురైన అసమ్మతివాదులు, మత అల్ప సంఖ్యాకులూ హక్కులను కాపాడుకోగలిగారు.
      1785లో మేడిసన్ ఇలా రాశాడు. (ఆర్.ఎస్.ఎలే. సంపాదకత్వం, జేమ్స్ మేడిసన్ ఆన్ రెలిజియస్ లిబర్టీ, బఫెలో 1985, పుటః 56)
      మతాన్నీ వ్యక్తి నమ్మకానికీ, మనస్సాక్షికీ వదిలేయాలి. ప్రతివ్యక్తీ ఈ హక్కును వినియోగించుకో గలిగారు. క్రైస్తవం స్థాపించుకునే హక్కు ఎలా ఉండేదో, అలాగే మిగతా మత శాఖలు కూడా స్థాపించుకోగలగాలి. ఈ విషయంలో మనకెంత స్వేచ్ఛ ఉన్నదో, మనం చెప్పేవి నమ్మని వారికి కూడా అంతే స్వేచ్ఛ ఉండాలి.
    నాస్తికులంటే లాక్ కూడా అసహనం చూపాడు. కాని, మేడిసన్ ఉదారంగా ప్రవర్తించాడు. భిన్న మతాలూ, భిన్న జాతుల సమాజాలూ ఉన్న ఈ రోజుల్లో, 1788 లోనే మేడిసన్ పేర్కొన్న మాటలు గమనార్హం. మతంలో జోక్యం చేసుకొటం ప్రభుత్వ హక్కు కాదు. కనీస జోక్యం అనేది. అత్యవసరంగా పాటించాలి. మతస్వేచ్ఛను సంపూర్ణంగా సమర్థించాలి. (పైన పేర్కొన్న గ్రంథం, పుటః 71)
      మతాన్నీ, రాజ్యాన్నీ వేరు పరచటం అంటే ఏమిటో జస్టిస్ హ్యూగో బ్లాక్ 1947లో ఒక తీర్పు ఇస్తూ పేర్కొన్నాడు. (ఆక్స్ ఫర్డ్ కంపానియన్ టు ది సుప్రీంకోర్ట్, న్యూయార్క్, 1992, పుటః 262-63) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మతాన్ని స్థాపించవు. మతానికి సహాయ పడటం కానీ, ఆదరించటం కానీ, చట్టరూపంగా చేయదు. ఏ వ్యక్తినీ మతానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వత్తిడి చేయదు. మత ప్రార్థనలకు వెళ్ళినా, వెళ్ళకపోయినా శిక్షించటం జరగదు. మతాన్ని సమర్థించటానికి ఎలాంటి పన్నులూ విధించదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహిరంగంగా గానీ, రహస్యంగా గానీ, మత వ్యవహారాలలో పాల్గొనదు. జాఫర్ సన్ మాటల్లో మతానికీ, రాజ్యానికీ వేరు పద్ధతులు స్పష్టంగా అనుసరించాలి.
పెత్తందారీతనం, ప్రజాస్వామ్యం, ఇస్లాం
    మత సంస్థను నిస్సందేహంగా స్థాపించిన తరువాత కాంట్, పెయిన్ పేర్కొన్నట్లు నిరంకుశత్వం, నిశిత పరిశీలన లేకపోవటం, నైతిక ప్రగతి నిరోధించే పద్ధతులు వస్తాయి. ఇస్లాం మతంలో దేవుడు తిరుగులేని పాలకుడు గనుక ఎలాంటి చర్యలేకుండా, సందేహాలూ ప్రశ్నలూ తలెత్తనీయకుండా దేవుడి మాటలు పాటించాలి. ఇందులో రాజీ లేదు. నిరసనకు తావులేదు. ఇస్లాం దేవుడు ప్రజాస్వామికుడు కాదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులను తొలగించినట్లు, దేవుడిని తీసేయటానికి వీలులేదు. అధికారం చెడగొడితే పూర్తి అధికారం పూర్తిగా చెడగొడుతుంది.
      మన చరిత్రకారులు 1942లో రాస్తూ మహమ్మద్ ప్రవక్త ధోరణి అంతా నేటి జాతీయ నాయకుడితో పోల్చవచ్చన్నారు. (బాకే (Bouquet), పుటః 269) పాశ్చాత్యవాదులు కొందరు ఇస్లాంలోని ఈ పెత్తందారీతనం ఆకర్షణీయంగా ఉన్నదన్నారు. 1910లో జె.ఎం.కెనడీ రాస్తూ బౌద్దుల, దివ్యమతవాదుల ప్రశాంతతను గర్హించాడు. యూదుల మెతకదనాన్ని ఖండించాడు. కారుణ్య వాదంతో క్రైస్తవులు చెప్పే దిగజారుడు సూత్రాలను తూలనాడాడు. కోట్లాది ముస్లింలు యుద్ధం, బలం, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ భయపడకుండా కత్తితో మతాన్ని మార్చే ధోరణిని మెచ్చుకున్నాడు. (జె.ఎం.కెనెడీ, ది రెలిజియన్స్ అండ్ ది ఫిలాసఫీస్ ఆఫ్ ది ఈస్ట్, పుటః 144)
      ఇటీవల కొందరు పాశ్చాత్య ఇస్లాం వాదులు సూత్రబద్ధమైన నిరంకుశవాదాన్ని స్పెయిన్ లో ఫ్రాంకో అచరించిన ధోరణితో పోల్చుతూ మెచ్చుకుంటున్నారు. కెనెడీ రాసిన పద్ధతిలోనే మార్టిన్ లింక్స్ ప్రజాస్వామ్యం పట్ల జుగుప్సను కనబరచి ఇస్లాం మతవాదం వంటిది కోరుకున్నాడు. (ది ఎలవెన్స్ అవర్, ది స్పిరిట్యువల్ క్రైసిస్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ప్రోఫేసీ, 1987- చూడు, న్యూ హ్యూమనిస్ట్, సంచిక 109, నం.2)
      ప్రజాస్వామ్యం, ఇస్లాం కంటే నియంతృత్వం, ఇస్లాంలే సన్నిహితంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం స్వేచ్ఛా పూరిత ఆలోచన, చర్చలపై ఆధారపడుతుంది. ఇస్లాం చట్టం ఉలేమాలు అంగీకారానికి వచ్చిన విషయాలను చర్చించటాన్ని నిషేధిస్తుంది. ఖురాను గ్రంథం లేదా కొందరు వ్యక్తుల అభిప్రాయం తిరుగులేనివని అనుకోటం అప్రజాస్వామికం, అశాస్త్రీయం, ప్రజాస్వామ్యం నిశితచర్చపైనా, హేతుబద్ధమైన ఆలోచనపైనా ఇతర అభిప్రాయాలను వినటం పైనా మనసు మార్చుకోటం పైనా ఆధారపడుతుంది. ప్రతిపాదనలన్నీ విమర్శకు గురిచేస్తాయి. సిద్ధాంతాలన్నీ పరీక్షకు పెట్టి అవసరమైతే నిరాకరిస్తారు. ఇస్లాం చట్టం శాసనబద్ధంగా వచ్చిందికాదు. దైవ ప్రేరితంగా, నిర్దోషంగా వచ్చిందన్నారు. ఈ నిర్దోషిత్వమే అనంత దోషాలకూ, మూఢనమ్మకాలకూ, క్రూరత్వానికీ, మత అసహనానికీ దారితీసిందని టి.హెచ్.హాక్సలే చెప్పాడు.
      ప్రజాస్వామ్యం, మానవహక్కులతో ఇస్లాం ఎందుకు పొసగదు ?
1.   వ్యక్తి జీవితంలో అన్నిటినీ చట్టం చేయడానికి ఇస్లాం ప్రయత్నిస్తుంది. వ్యక్తిగా ఆలోచించటానికీ, నిర్ణయించటానికీ స్వేచ్ఛనివ్వదు. కొందరు భాష్యం చెప్పిన రీతిలో దైవాజ్ఞలను వ్యక్తి పాటించాలి. ఉదార ప్రజాస్వామ్యంలో అన్నింటినీ, నిర్దేశించే నీతి, స్మృతి, సంపూర్ణ విలువల చట్టం లేదు.
2.   ప్రజాస్వామ్య సాంస్కతిక స్థాయిని కొలవటానికి  ఆసమాజంలో స్త్రీలకూ, అల్ప సంఖ్యాకులకూ ఇచ్చిన హక్కులూ, అంతస్తును బట్టి నిర్ధారించవచ్చు. ఇస్లాం చట్టం స్త్రీల హక్కులనూ, ముస్లిమేతర అల్ప సంఖ్యాకుల హక్కులను నిరాకరిస్తుంది. నమ్మకం లేనివారిపట్ల, ఇతర మతస్తులపట్ల సహనం చూపలేదు. మతాన్ని మార్చుకోమనీ, లేదా, చంపుతామనీ అన్నారు. యూదులూ, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. మహమ్మదును చివరి ప్రవక్తగా, ఇస్లాం దైవ తుది వాక్యంగా పరిగణించి అహమ్మదీయుల వంటి వారిని బాధించారు.
          ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల పాలనే కాదని ముస్లింలు గ్రహించవలసి ఉన్నది. అధిక సంఖ్యాకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య సమాజం కాపాడుకుంటూ నిరసన తెలిపేవారిపై అభిప్రాయాలను బలవంతంగా రుద్దకుండా ఉండాలి.
          స్త్రీలను పురుషులకంటే తక్కువ వారిగానూ, మతపరంగా వారి హక్కులూ, విధులూ పరిమితంగానూ ఇస్లాం చూచింది. పురుషుల్లో సగం మాత్రమే స్త్రీకి విలువనిచ్చి సాక్ష్యం, ఆస్తి సంక్రమణ, ధనవ్యవహారాలలో చూచింది. వివాహం, విడాకులలో పురుషులకంటే స్త్రీకి అవకాశాలు తక్కువ. కొన్ని సందర్భాలలో భర్త హింసించటానికి అనుమతించింది. (షాట్, యాన్ ఇంట్రడక్షన్ టు ఇస్లామిక్ లా, పుటః 126-27).
          ముస్లిమేతరుల చట్ట పరిస్థితిని షాట్ ఇలా వివరించాడు.
          ముస్లిమేతరుల పట్ల ఇస్లాం కేవలం యుద్ధ ప్రాతిపదికగా చట్టం చేసింది. మతం మార్చటమో, అణచటమో, చంపటమో మార్గాంతరాలన్నది. స్త్రీలు, పిల్లలు, బానిసలకు మినహాయింపు ఉన్నది.) అరబ్బులోని ఇతర మతస్తులంతా ఇస్లాంలోకి మారాలి, లేదా హతమార్చబడాలి. యుద్ధ ఖైదీలు బానిసలుగా ఉండాలి. లేదా చంపేసేయాలి. ముస్లిం ఖైదీల మార్చిడికూడా దీన్ని ఉపయోగించవచ్చు.
        లొంగుబాటు ఒడంబడిక ప్రకారం ముస్లిమేతరులు థిమ్మీలు అని పిలవబడతారు. ఆ పేరిట వారికి రక్షణ ఉంటుంది.
    ఈ ఒడంబడికననుసరించి ముస్లిమేతరులు జిజియా, ఖరజ్ వంటి పన్నులు చెల్లిస్తూ లొంగి ఉండాలి. ప్రత్యేక దుస్తులు ధరించాలి. వారి ఇళ్ళు స్పష్టంగా, వేరుగా ఉండాలి. ముస్లింల ఇళ్ళకంటే పెద్దదిగా ఉండరాదు. గుర్రాలపై స్వారీ చేయరాదు. ఆయుధాలు ఉంచుకోరాదు. ముస్లింలకు దారి తొలగాలి. బహిరంగంగా పూజలు చేయరాదు. వారి ఆచారాలను పాటించరాదు. తాగరాదు. కొత్త దేవాలయాలనూ, ఆశ్రమాలకూ నిర్మించరాదు. పోల్ టాక్స్ కట్టాలి. ముస్లింలకున్న అవకాశాలు వారికుండవు.
    ముస్లింకు వ్యతిరేకంగా థిమ్మీ సాక్ష్యం చెప్పరాదు.  ముస్లిం పిల్లలకు సంరక్షకులుగా ఉండరాదు. (షాట్, పైపుస్తకం, పుటః 130-32)
      అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం చట్టంలో ఎవరికీ సమాన రక్షణ లేకుండా చేయరాదు. తొలుత నల్లజాతి వారికి విచక్షణ చూపకుండా ఇది ఉద్దేశించినా, క్రమేణా ఇతర జాతులకు దీన్ని విస్తరించి అల్ప సంఖ్యాకులు భద్రత పొందేటట్లు చేశారు.
3.   మానవ వివేచనకూ, నిశితమైన చర్చకూ ఇస్లాం వ్యతిరేకత చూపింది. అది లేకుండా ప్రజాస్వామ్యం శాస్త్రీయ నైతిక ప్రగతి సాధ్యపడదు.
        యూదు, క్రైస్తవం  వలె ఇస్లాంకూడా హేతుబద్ధమైన ధోరణిని ఖండిస్తుంది. అనేక సంప్రదాయాల ప్రకారం ప్రశ్నించడానికి మహమ్మదు నిరాకరించాడు. మతపరమైన ఆలోచనలో అనేక దృక్పథాలను హదిత్ ప్రస్తావించింది. ప్రజలు పరామర్శిస్తూనే ఉంటారు. అన్నిటినీ సృష్టించిన అల్లాను ఎవరు సృష్టించారు... (వెన్సింక్, ది ముస్లిం క్రీడ్, పుట 53-54 కేంబ్రిడ్జి, 1932)
4. వ్యక్తి హేతుబద్ధ నిర్ణయాలు తీసుకోగలడు. తన చర్యలకు నైతిక బాధ్యత వహించగలడు. అలాంటి వ్యక్తి భావన ఇస్లాంలో లేదు. ఉత్తరువులు శిరసావహించటమే నీతి అన్నారు. చట్టబద్ధమైన విధులు నిర్వర్తించవలసిన వ్యక్తి భావన ఉన్నది. అయితే స్వేచ్ఛాపరుడుగా కాదు. ఇస్లాంలో జీవితానికి కావలసిందీ,  చేయవలసిందీ అంతా దేవుడూ, పవిత్రచట్టమూ నిర్ణయం చేశాయి.
        అమెరికాలో హక్కుల పత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తి, పౌర, రాజకీయ హక్కులను కాపాడుతుంది. జఫర్ సన్ ఇలా అన్నాడు. ప్రపంచంలో ప్రతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హక్కుల పత్రం ఉండాలి. ఏ ప్రభుత్వమూ దీనిని వ్యతిరేకించకూడదు. వ్యక్తులు తమ హక్కుల్ని కోల్పోయేటట్లు సమిష్టి యాజమాన్యం కానీ, పురాణ మార్మిక గాథలుగానీ చేయరాదు. వాన్ హైక్ ఇలా అన్నాడు. (ది రోడ్ టు సర్ఫ్ డమ్, లండన్, 1944 పుటః 152-153) వ్యక్తిగత స్వేచ్ఛను సమాజం యావత్తూ పాటించాలనే లక్ష్యానికి లొంగేటట్లు చేయరాదు. అమెరికా రాజ్యాంగంలో మొదటి 10 సవరణలు. 14వ సవరణ ప్రభుత్వాధికారానికి పరిమితులు విధిస్తున్నది. ప్రభుత్వ అన్యాయ చర్యల నుండి వ్యక్తులను కాపాడుతుంది. వ్యక్తి మత, భావ హక్కుల్ని శాంతియుత సమావేశం అర్జీ పెట్టుకొనటం. ప్రభుత్వ దుర్వినియోగాలకు వ్యతిరేకంగా వ్యక్తి పోరాడే హక్కులూ ఉన్నాయి. పౌర హక్కుల్ని కాదనకుండా కాపాడే విధానాలూ ఉన్నాయి.
        ఉదార ప్రజాస్వామ్యం వ్యక్తి స్వేచ్ఛాపరిధిని విస్తరిస్తుంది. ప్రతి, స్త్రీ, పురుషుడికీ విలువనిస్తుంది. ఇస్లాంలో వ్యక్తి వాదానికి గుర్తింపులేదు. ముస్లింల సమిష్టి భావానికే ప్రాధాన్యతనిచ్చారు. పాశ్చాత్యదేశాలలో 18వ శతాబ్దం నుండీ పెంపొందిన వ్యక్తి హక్కులు ఇస్లాంలో లేవు. ఖలీఫాను దేవుని ప్రతినిధిగా అనుసరించాలని పేర్కొన్న చోట వ్యక్తిగత హక్కులతో గూడిన తత్వం రావటం కష్టం. ఇటీవల ఎ.కె.బ్రోహి అనే ముస్లిం మేథావి వ్యక్తి హక్కులకు వ్యతిరేకంగా ఇలా రాశాడు. అతడు పాకిస్తాన్ లో న్యాయం, మతవిషయాల మాజీమంత్రి, మానవహక్కుల పై ఇస్లాం దృక్పథంతో రాశాడు. (ఎ.ఇ.మేయర్, ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్, 1991, పుట 60-61)
        మానవహక్కులూ, విధులూ నిర్దిష్టంగా నిర్వచించి ఆచరించటం యావత్తు సమాజం కర్తవ్యం. ప్రభుత్వ చట్టపరమైన యంత్రాంగం ఈ కర్తవ్యాన్ని నిర్వహించాలి. సమాజ చట్టం కోసం అవసరమైన వ్యక్తిని త్యాగం చేయాలి. ఇస్లాంలో సమిష్టి తత్వానికి ప్రత్యేకత ఉన్నది.
      ఇస్లాంలో ఆధునిక ఆలోచనా, ఆచరణా చేస్తున్న రీతిలో మానవహక్కులూ, స్వేచ్ఛలూ లేవు. భక్తులు దేవుని విధిలో కైంకర్యం చేయాలి. అది వ్యక్తి ప్రథమకర్తవ్యం.
      పై తత్వంలో నియంతృత్వధోరణి స్పష్టమే. దివ్యత్వంలో బందీలుగా బతకటం నేర్చుకోవాలి. అదే మానవ స్వేచ్ఛ అన్నారు. ఆర్వల్ స్వేచ్ఛనే బానిసత్వం అనే భయంకర నినాదం ఇచ్చాడు. పై వాక్యాలు కూడా అలాంటివే.
        1979లో మరొక ముస్లిం రచయిత ఇలా అన్నాడు. పాశ్చాత్య ఉదారులు స్వేచ్ఛపై నొక్కు పెడుతున్నదంతా ఇస్లాంకు పరాయిదే. వ్యక్తి స్వేచ్ఛ ఇస్లాంలో దైవేచ్ఛకు లొంగి ఉండటమే. సమాజ స్వేచ్ఛ ఆరంభమైన చోట వ్యక్తి స్వేచ్ఛ అంతమవుతుంది. వ్యక్తి హక్కులు విధులననుసరించి ఉంటాయి. విధులు లేకుండా హక్కులు లేవు. ముస్లిం మత వాదం నియంతృత్వవాదానికే మొగ్గు చూపింది.
        ఇస్లాం నియంతృత్వ ధోరణి రచయిత అంగీకరించారు. (పై పేర్కొన్న పుస్తకం, పుట 62-63)
5.నిర్దోషిత్వం పవిత్రగ్రంథం అనేది నైతిక రాజకీయ శాస్త్రీయ ప్రగతికి అవరోధాలు.
6. మతం మార్చుకునే హక్కు ముస్లింకు లేదు. మార్చుకుంటే మరణ శిక్షేగతి.
7.  ఏ రూపంలోనూ స్వేచ్ఛాలోచన ప్రోత్సహించరాదు. కొత్త ఆలోచనలు దోషపూరితమైనవి.  వాటికి  మరణశిక్ష విధించాలి. ఉదార ప్రజాస్వామ్యం వైపుకు ఇస్లాం పోలేకపోవటానికి దైవతుది వాక్యంపై ప్రాధాన్యత ఇవ్వటమే కారణం. ప్రత్యామ్నాయాలకు ఇస్లాం చోటు పెట్టు. ఉదార ప్రజాస్వామ్యంలో ఆలోచనా స్వేచ్ఛ, భావస్వేచ్ఛ, వాదించే హక్కు, ఎదుటి వారివాదన ప్రవేశపెట్టే స్వేచ్ఛ ప్రత్యామ్నాయతత్వం ఉంటాయి. అల్ప సంఖ్యాకుల నిరసన, విమర్శ తేడాలను నిరోధించే హక్కు అధిక సంఖ్యాకులకు లేదు.
మానవహక్కులు
      మానవులకు కొన్ని హక్కులు ఉండటం సబబు అని పాశ్చాత్య నాగరికత తలపెట్టి పెంపొందించింది. ప్లేటో, అరిస్టాటిల్, స్టాయిక్స్ వరకూ ఇలాంటి భావాలు భిన్నంగా సహజనియమాలు మానవులందరికీ పనికొచ్చేవి ఉన్నాయని భావించారు. (మెల్డన్ 1970, పుట 1) మానవ స్వభావంలోనే ఈ హక్కులు ఉన్నాయని కొందరు తత్వవేత్తలు అన్నారు. మానవ స్వభావం అనే మాట నచ్చని వారు అది ఒక సంస్కృతికీ, నాగరికతకూ పరిమితమౌతున్నదంటూ మానవహక్కులనే కోరుకున్నారు. పాశ్చాత్య తత్వవేత్తలు మానవహక్కుల్ని చర్చించేటప్పుడు దేవుడు, దైవేచ్ఛ ప్రస్తావన తీసుకురారు. మానవ వివేచన, హేతుబద్ధమైన వాదనలూ, నిశిత పరిశీలనా గమనిస్తారు.
        చాలా మంది తత్వవేత్తలు  మానవహక్కులలో ఆత్మగౌరవం, నైతికహుందాతనం, నైతిక ఎంపిక గమనిస్తారు.
        లాక్ 17వ శతాబ్దంలో మానవహక్కుల గురించి రాసిన తరువాత ఆధునిక ఆలోచనాపరులు మూడు విషయాలను పెంపొందించారు. 1. ఈ హక్కులు మౌలికమైనవి. అవి లేకుండా ప్రత్యేక హక్కులంటూ ఏమీ ఆయా సమాజాల వ్యక్తులకుండవు. 2. ఈ హక్కులను కోల్పోవటంగానీ, వదిలేయటంగానీ, మరొకరికి మార్చటంగానీ జరుగకూడదు. మానవులకు ఈ హక్కులు కేవలం వారి మానవులు కావటం వల్లనే లభించాయి. సామాజిక పరిస్థితులలో ఎన్ని తేడాలున్నా ఈ హక్కులు కొనసాగించాల్సిందే. (మెల్డెన్, పుట 3, హ్యూమన్ రైట్స్)
        మానవ హక్కులు సాంస్కృతిక భావాలేవీ పెంపొందలేదు. మానవునికి ఉన్నవన్నీ దైవ విధులే. హక్కులు కేవలం దైవానికే ఉన్నాయి. ఇస్లాంలో అందరికీ సమానహక్కులు అనే సూత్రంలేదు. షరియాలో పేర్కొన్నట్లు మానవ విధులనుండి మానవహక్కులు ఎలా రాబట్టాలో చెప్పలేదు.
ఇస్లాం, ఉదార ప్రజాస్వామ్యం - లూయీస్
        బెర్నార్డ లూయీస్ ఇస్లాం, ఉదార ప్రజాస్వామ్యం అనే వ్యాసం రాస్తూ ఇస్లాంలో ఉదార ప్రజాస్వామ్యం ఎందుకు పెంపొందలేదో చక్కాగా వివరించాడు. (ఇస్లాం అండ్ ది వెస్ట్, న్యూయార్క్, 1993, పుటః 88-98)
        ఇస్లాం పండితులవల్ల లూయీస్ కూడా ఇస్లాం మౌలికవాదం అనే పదం అనుచితం అన్నాడు. నేను అంగీకరిస్తున్నాను. ప్రొటెస్టంట్లవలె కాక ముస్లిములందరూ ఖురాన్ ను తు.చ. తప్పకుండా స్వీకరిస్తున్నారు. కనుక ఇస్లాం చాలా లోతుగా పాతుకపోయింది. దీనిని అతిగా వెల్లడించటమే మౌలికవాదం.
        ఇస్లాం మౌలికవాదులు అధికారంలోకి వస్తే ఇస్లాం నియమాలను పాటిస్తారని లూయీస్ అన్నాడు. ఇస్లాం చట్టాన్ని అన్ని విధాలా అన్వయిస్తారు. ఉదార ప్రజాస్వామ్యంతో ఇస్లాం రాజకీయ కార్యక్రమం పొసగదు. లూయీస్, ఇస్లాం వాదులూ ఇస్లాం మౌలిక వాదమనే పదాన్ని వాడుతూనే ఎందుకు ఖండిస్తారో గమనించాలి. ఇస్లాం ప్రజాస్వామ్యంతో పొసగకపోవటమ కారణం కాదు. ఇస్లాం మౌలికవాదులు ఇస్లాం నియమాలను అన్వయిస్తారన్నాము కదా. ఆ నియమాలు ప్రజాస్వామ్యంతో పొసగవు కదా. ఐనప్పుడు ఇస్లాంకూ, ఇస్లాం మౌలిక వాదానికీ తేడాను చూపి సమర్థించుకోవటంలో అర్థంలేదు. ఉదారప్రజాస్వామ్యంతో ఇస్లాం ఎందుక పొసగదో లూయీస్ చూపాడు.
        పాశ్చాత్యలోకంలో ప్రజాస్వామ్యం ఆవిర్బవించటానికి కొన్ని సంస్థలు రూపొందాయి. అందులో ఒకటి ప్రతినిధుల సభలు. దీనిమూలసూత్రం రోమన్ చట్టంలో ఉన్నది. దీనికి సమానమైన సూత్రం ఇస్లాంలో లేదు. షాట్ రాస్తూ ప్రజాద్రవ్య సంస్థగానీ, న్యాయమూర్తుల వ్యవస్థగానీ ఇస్లాంలో లేదన్నాడు. (షాట్, యాన్ ఇంట్రడక్షన్ టు ఇస్లామిక్ లా, పుటః 125).
        పాశ్చాత్య ప్రతినిధుల సభలలో శాసనాలు చేయటం ఒక ప్రధాన కార్యకలాపం. ఇస్లాం రాజ్యాలలో శాసనాలు చేసే అవసరం లేదు. గనుక అలాంటి సంస్థల ఉపయోగమూ లేదు. ఇస్లాం రాజ్యం మతవ్యవస్థ, పాలించేది దేవుడు. అధికారం దైవం నుండి సంక్రమిస్తుంది. పాలకులకు పవిత్రచట్టం దైవమే అధికారాలు సంక్రమింపజేస్తాడు. ప్రజలనుండి అధికారం రాదు. మహమ్మద్ కు దేవుడు చెప్పిన విషయాలను అన్వయించడం, అర్థం చెప్పటం మాత్రమే పాలకులు చేస్తారు. కనుక ఇస్లాంలో ప్రాతినిధ్య సూత్రం పెంపొందలేదు. ప్రతినిధులను ఎన్నుకొనడం ఒక పద్ధతిలో లేదు. ఓటుహక్కుకు నిర్వచనం లేదు. ఎన్నిక విధానానికి ఒక పద్ధతి లేదు. ఇస్లాం రాజ్యాల చరిత్ర నియంతృత్వాల ధోరణిలో సాగుతున్నాయని లూయీస్ అన్నాడు. మతవిధిగా ముస్లిం పాలకులకు లొంగి ఉండటమే ముస్లిం బాధ్యత అలా ఉండకపోవటం పాపం, నేరం.
        లూయీస్ ఇస్లాం సంప్రదాయంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాని లక్షణాలు చూపటానికి ప్రయత్నించాడు. ఖలీఫాల ఎంపిక పద్ధతులను ఇందుకు ఉదాహరణలుగా స్వీకరించాడు. ఇస్లాం ఖలీఫాలు నిరంకుశులు కాదని లూయీస్ అంటాడు.
        ఖలీఫాలకూ, ప్రజలకూ ఉన్న సంబంధం ఒడంబడికలతో కూడినదని లూయీస్ రాశాడు. ఖలీఫాగా స్థానం అలంకరిస్తున్న సందర్భంగా కొన్ని విధులు నిర్వర్తిస్తానని అతడు ప్రతిన పూనతాడనీ, పట్టాభిషేకం సందర్భంగా అతడికి లొంగి ఉంటామని ప్రజలు ఒప్పందం చేసుకుంటారనీ అన్నాడు. ఖలీఫాలు తన విధులను నిర్వర్తించ లేకపోతే కొన్ని సందర్భాలలో అతడిని తొలగించవచ్చు.
        ఏకఛత్రాధిపత్యం ప్రజాస్వామ్యం కాదు. దీనికీ, నిరంకుశత్వానికీ విచక్షణ చూపబూనటం అర్థరహితం, అప్రజాస్వామిక పాలనను చట్టబద్ధంగా చూపటమే. వీరు చేస్తున్నపని, ఖలీఫా అధికారం నిరంకుశమనీ టి.డబ్ల్యూ ఆర్నాల్డ్ రాశాడు. ఖలీఫా కురైష్ జాతికి చెంది ఉండాలనీ, ఖలీఫాకు ఎదురుతిరిగితే దేవునికి ఎదురు తిరిగినట్లే గనుక అందరూ అతనికి లొంగి ఉండాలని అన్నారు. సుర 4.59 భక్తులారా..  దేవుడికి లొంగి ఉండండి. అతడి దూతకూ, అధికారంలో ఉన్నవారికీ లొంగి ఉండండి (సుర. 4.843)
ఖలీఫా వారసుడి ఎంపిక
        టి. డబ్ల్యు. అర్నాల్డ్ దేవుని ఖలీఫాను దైవ ఛాయ అని ఖలీఫాను పిలచి అతడికి లొంగి ఉండేటట్లు భక్తులకు నచ్చజెప్పారనీ, అదే నియంతృత్వ లక్షణం అనీ రాశాడు. (టి.డబ్ల్యు.అర్నాల్డ్, ఎన్ సైక్లోపీడీయా ఆఫ్ ఇస్లాంలో ఖలీఫా పై వ్యాసం)  ఈ లక్షణాలేవీ ప్రజాస్వామికం కాదు. ఇస్లాంలో ఎంపిక అనేది వంశపారంపర్యంగా ఉమాయద్, అబ్బాసిద్ కుటుంబాలకు పరిమితమయింది. ముఆఇయా (661-680) కాలం నుండి  ప్రతి ఖలీఫా తమ వారసుడిని ఎంపిక చేశాడు. కనుక ఎంపిక అనేది కట్టుకథగానే సాగింది. ఖలీఫా పీఠం అప్రజాస్వామికం. అల్ మవర్దీ (1058లో మరణం), ఇబ్న ఖల్ దూల్ రాస్తూ ఖలీఫా విధులను పేర్కొన్నారు. మతాన్ని సమర్థించటం, షరియాను అన్వయించటం, ఖలీఫా విధులను పేర్కొన్నారు. మతాన్ని సమర్థించటం, షరియాను అన్వయించటం, కలహాలను పరిష్కరించటం. అధికారులను నియమించటం, పాలనా విధులను అప్పగించటం, ముస్లిం పాలనను వ్యతిరేకించిన వారిని ఇస్లాంను అనుమతించని వారిపై పవిత్ర యుద్ధం జరుపుట, ఖలీఫా కురైష్ జాతి వురుషుడై ఉండాలనీ, ఇబ్న ఖల్ దూల్ రాశాడు. ఇది ప్రజాస్వామ్య సూత్రం కాదు. ఇస్లాంలో సంప్రదింపుల గురించి ప్రస్తావించారు. ఐతే అది సంస్థాగతం కాలేదనీ, పవిత్ర చట్టంలో ఒడంబడికగానూ రాలేదనీ లూయీస్ రాశాడు. పాలకులు ఆటోమన్ రాజ్యకాలం నుండీ తమ ఉన్నతాధికారులను తరచూ సంప్రదిస్తుండేవారు.
        లూయీస్ ఇస్లాం బహుళ వాదాన్నీ, సహనాన్నీ ప్రస్తావించారు. భిన్న విశ్వాసాల ఆదర్శం ఎప్పుడూ ఇస్లాంకు లేదు. ఇస్లాం చరిత్రలో మతపరమైన హింస, ముఠా కలహాలు అరుదుగా ఉన్నయని లూయీస్ పేర్కొన్నాడు. 14 శతాబ్దాల చరిత్రలో ప్రవక్త కాలంనుడి ఛాందస అసహన, హింసాపూరిత ఉద్యమాలెన్నో వచ్చాయన్నాడు. లూయీస్ తనను తానే ఖండించుకుంటూ పోయాడు.
ముగింపు
        ఇస్లాం షరియాను అమలు పరచాల్సిందేనన్నంత కాలం మతాన్నీ, రాజ్యాన్నీ వేరు చేయటానికి వీలులేనంత కాలం ప్రజాస్వామ్యం, మానవహక్కులు రావు. మూర్ ఇలా రాశాడు. సంస్కరిచినమతం దైవాధికారాన్ని ప్రశ్నిస్తే, హేతుబద్ధమైన ఎంపిక కావాలంటే ఇస్లాంకు ఉండదు. పాశ్చాత్య సంస్థలను అనుసరించదలచిన ఇస్లాం సంస్కరణవాదులు తమ ప్రజలకు ఆమోదయోగ్యం కావటానికి వీలుగా ఇస్లాంలో అలాంటివన్నీ ఉన్నాయని నటించారు. అందులో చిత్తశుద్ధి లేదు. సమస్య పరిష్కారం కాలేదు. నిజమైన ఇస్లాంలో స్త్రీలకు సమానత్వం ఉన్నదనీ, అది ప్రజాస్వామికమనీ, అనటమే తప్ప అసలు సమస్య షరియా అంగీకారం అవునా కాదా అని తేల్చరు.
        భారతదేశం 1947లో స్వతంత్రం పొంది ఇంకా కొనసాగుతున్నది. అక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరించటానికి పవిత్ర గ్రంథాలను ఎవరూ వెతకలేరు. ఇస్లాం ప్రపంచంలో టర్కీ ఒక్కటే ప్రజాస్వామికం అక్కడ మతాన్నీ, రాజ్యాన్నీ వేరు చేశారు. రాజ్యాంగం నుండి ఇస్లాంను తొలగించారు. చట్టంలో షరియా భాగం కాదు.
        ఆన్ ఎలిజబెత్ మేయర్ ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్ అనే గ్రంథం రాసింది. ఆవిడ విశ్లేషణ బాగున్నది. నచ్చజెప్పే తీరులో ఉన్నదు. అంతర్జాతీయ చట్టం కింద ఉన్న స్వేచ్ఛలను తొలగించడానికి ఇస్లాం చట్టాలు ఎలా ఉన్నాయో, అంతర్జాతీయ హామీలను చాలామంది ముస్లింలకు లేకుండా ఇస్లాం కొనసాగుతున్నదో వివరించింది.
        మేయర్ వివరణలో సూడాన్, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు మానవహక్కులను స్త్రీలకు లేకుండా చేస్తూ ముస్లిమేతరులు, బహాయిలు, అహమ్మదీయులు మత అల్ప సంఖ్యాకులూ హక్కులు కోల్పోయేటట్లు ఇస్లామీకరణ చేశారు. ఆ దేశాలలో న్యాయవిధాన స్వతంత్ర ప్రతిపత్తి లేదు. న్యాయస్థానాలు అణచివేతకు ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారు. న్యాయపాలనను దిగజార్చి ఇస్లామీకరణ చేశారు. (మేయర్, ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్. పుటః 35)
        ఇస్లాం మానవహక్కుల పథకాలను మేయర్ అరమరికలు లేకుండా అంతర్జాతీయ మానవహక్కుల దృష్ట్యా పరిశీలించింది. (మేయర్, వుటః 21)
        తాత్వికవాదాల జోలికి పోకుండా మేయర్ సాంస్కృతిక సాపేక్షతావాదాన్ని తృణీకరించింది. ఈ విషయాలు రాస్తున్నప్పుడు అల్జీరియా మానవ హక్కుల లీగ్ అధ్యక్షుడు యూసఫ్ ఫతాలాను ఇస్లాం వాదులు చంపేశారు. (లమాండే, 1994, జూన్ 21)
        మానవహక్కులతో ఇస్లాం మానవహక్కులను మేయర్ పోల్చిచూసింది. అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థగా ఈ మూస్లిం లీగ్ లండన్ లో కేంద్రవ్యవస్థను స్థాపించి మితవాద ముస్లింలకు ప్రాతినిధ్యం వహించింది. వారే ఇస్లాం మానవహక్కులు తయారుచేశారు.
        అజర్ ముసాయిదా రాజ్యాంగం కౌరోలోని ఇస్లాం పరిశోధనా అకాడమీ రూపొందింది. ఇది అల్ అజర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నది. సున్నీ ఇస్లాం ఉన్నత విద్యల్లో ఇది ప్రతిష్ఠాకరమైన సంస్థ. ఇరాన్ రాజ్యాంగం ఇక్కడ సిద్ధమయింది. మదూదీ, తబాంద్ వంటి ముస్లిం అలోచనాపరులు ఇక్కడివారే. మేయర్ తన పుస్తకంలో ఇస్లాం ఏ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛను అదుపులో పెట్టింది. అందుకోసం ఇస్లాం మానవహక్కులను సృష్టించింది వివరించింది. (మేయర్.       పుటః 91)
        షరియాను సంప్రదించే ముస్లిం మితవాదులు పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులివ్వటానికి నిరాకరించారు. ఇస్లాం పథకం ప్రకారం స్త్రీలు వారి భర్తలకు లొంగి ఉంటూ, పిల్లలను పెంచుతూ ముస్లిం ఇళ్ళల్లో గడుపుతూ ప్రజా జీవితంలోకి రాకుండా ఉండాలి.  వ్యక్తులుగా స్త్రీలు అభివృద్ధి చెందటానికి అనుమతి లేదు. అలాగే విద్యావకాశాలూ, ఉద్యోగాలు కూడా లేవు. మత అల్పసంఖ్యాకులకు హక్కుల రక్షణ లేదు. తక్కువ స్థాయిలో ముస్లిమేతరులను ఉంచాలన్నారు. (మేయర్, పుటః 160)
        మత స్వేచ్ఛ ఇస్లాం  పథకంలో ఏ విధంగానూ రక్షణ పొందలేదు.
        ఇస్లాం మానవహక్కులలో షరియాకింద మత వ్యతిరేకులకు మరణశిక్షలు విధించారు. అంటే అంతర్జాతీయ మానవహక్కులతో వీరికి ఎలాంటి పొందికా లేదన్నమాట. ఆధునిక మానవహక్కుల తత్వానికీ, వీరికీ అఖాతం ఉన్నది. (మేయర్, పుటః 187)
మేయర్ విశ్లేషణకు ఒక అభ్యంతరం
      1969 ఫిబ్రవరి నుండి ప్రచురితమైన పుస్తకాలూ, వ్యాసాలూ గమనిస్తే మేయర్ పుస్తకంలో          4 అంశాలు చూడవచ్చు.
        1. ఇస్లాం మూసబోసిన విధానం కాదు. ఇస్లాం సంప్రదాయం ఖచ్చితంగా ఇది అని చెప్పలేము. ఒకే ఇస్లాం అనేది లేదు. ఒకే భాష్యం సరైనది లేదు.
        2. ఇస్లాం మానవహక్కులలో దోషం ఇస్లాంది కాదు. సంప్రదాయ వాదులూ, ముస్లిం మితవాదుల భాష్యమే దోషపూరితం.
        3. ఇదే షరియా అనటానికి వీలులేదు. గతంలో ఇస్లాం చట్టం ఎక్కడా ఒకేచోట ఆగిపోలేదు.
        4. ఇస్లాం ప్రజాస్వామ్యానికీ, హక్కులకూ వ్యతిరేకం కాకపోవచ్చు.
        మేయర్ పుస్తకంలో పై 4 అంశాలు లోతుగా చర్చించలేదు. పుస్తకం ఉద్దేశం కూడా అది కాదు. ఇస్లాం మూల సిద్ధాంతాలను నిశితంగా పరిశీలించలేదని ఆమె చెప్పింది.
        మేయర్ పుస్తకం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇస్లాం అనేది ఏదీ లేదనీ, తదనుగుణంగా మనం కొన్ని సాధారణ విషయాలను రాబట్టగలమనీ పేర్కొన్నది.  మేయర్ అనేక పరోక్ష ప్రకటనలు చేసింది. పొగడకుండా ఇస్లాంను గురించి సాధారణ అంశాలు పేర్కొన్నది. అవన్నీ నిజమే. ఇస్లాం నాగరికత, ఇస్లాం సంప్రదాయం, ఇస్లాం సనాతనత్వం, ఇస్లాం చట్టం గురించి  మేయర్ పవిత్రంగా పెట్టుకున్న అశలు వాస్తవానికి భిన్నంగా పోతున్నాయి.
      ఉదాహరణ ః 1. పాశ్చాత్య నాగరికతలో వ్యక్తి లక్షణం మానవహక్కులు పెంపొందడానికి  ప్రధానం. ముస్లిం సమాజాలలో, ఇస్లాం సంస్కృతిలో వ్యక్తివాదం లేదు. ఇస్లాం అలోచనారీతిలోనే వ్యక్తివాదం కనిపించదు. వ్యక్తిహక్కులూ, స్వేచ్ఛలూ కాపాడే వాతావరణాన్ని ఇస్లాం నాగరికత సృష్టించలేదు. (మేయర్, పుటః 47)
        మేయర్ పాశ్చాత్యులను విమర్శిస్తూ ఇస్లాంను మూసబోసిన విధానంగా భావించటం తప్పన్నది. ఇస్లాంను గురించీ, పాశ్చాత్యలోకాన్ని గురించీ ఆమె సర్వసాధారణంగానే చెప్చేసింది. ఫలానా పాశ్చాత్యం అనేది ఉన్నదా....
        ఉదాః 2. సున్నీ ఇస్లాం సనాతన మతవాదులు మానవ వివేచనపట్ల అనుమానంగా చూస్తారు. దైవ ఆజ్ఞల  నుండీ ముస్లింలు దూరంగా పోతారేమో అని వారి భయం. దైవప్రేరణతో వచ్చిన షరియా చట్టాలు వివేచనను పక్కన పెట్టాయని వారనుకొంటారు. ఇస్లాం దృష్టిలో ప్రాధాన్యత వహిస్తున్న ఇలాంటి ధోరణులవలన ఇస్లాంలో వివేచనాయుగం అంటూ ఏమీలేదు (మేయర్, పుటః 49)
        ఉదాః 3. ఇస్లాం హక్కులు గమనిస్తే వెయ్యేళ్ళపాటు సనాతన ఇస్లాం ఆలోచన ఎలా ప్రాధాన్యత వహించిందో ఆధునిక కాలాలకు ముందు ఉన్న విలువలకు ఎలా ప్రాముఖ్యత యిచ్చిందో అర్థం అవుతుంది. (మేయర్, పుటః 58)
        ఉదాః4. ఇస్లాం చట్టంలో మార్పులు సూచిస్తే అవి అంతర్జాతీయ న్యాయచట్టాలకూ, మౌలిక హక్కులకూ భంగం కలిగిస్తాయని తోసిపుచ్చుతున్నారు.  దైవాజ్ఞల విమర్శ మానవ వివేచనతో చేయజాలమంటున్నారు. షరియాను సంపూర్ణంగా, న్యాయమైనదిగా భావిస్తున్నారు. అది దైవేచ్ఛను ప్రతిబింబిస్తున్నట్లు చెపుతున్నారు (మేయర్, పుటః 58)
        ఉదాః 5. ఇస్లాం సంప్రదాయాలలో దేవునికీ, ఇస్లాం చట్టానికీ లోబడే ఉండాలి.  (మేయర్, పుటః 62)
        ఉదా. 6 ఇస్లాం నాగరికతలో మానవహక్కుల సంప్రదాయం లేదు  (మేయర్, పుటః 73)
      ఉదాః 7. ఇస్లాం చట్టంలో సమానత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నప్పటికీ, చట్టం కింద అందరికీ సమాన రక్షణ అనే సూత్రం ఇస్లాంలో లేదు. (మేయర్, పుటః 98)
      ఉదాః 8. ఇస్లాం పురోహిత వర్గం, ఇస్లాం సంస్థలు స్త్రీలను గృహ పాత్ర నుండి బయట పడవేయటానికీ, అణగి ఉండే రీతులు తొలగించటానికి ఒప్పుకోలేదు. (మేయర్, పుటః 112)
      ఇస్లాంను బయటపడవేయటానికి, మేయర్ చేసిన ప్రయత్నాల వలన దోషపూరిత వాదాలూ, పరస్పర విరుద్ధాలూ వచ్చాయి. మేయర్ తన పుస్తకం పీఠికలో ఇలా వ్రాసింది. మానవహక్కులకు ఇస్లాంతో ఎలాంటి సంబంధం ఉన్నది అనే విషయం అధ్యయనం చేయకుండానే, మధ్యప్రాచ్యంలో తీవ్రసమస్యగా ఉన్న మానవహక్కులకు ఇస్లాం కారణం కాదనిపిస్తున్నది. ఇస్లాం చట్టం లేనిచోట, పాటించవలసినచోట కూడా మానవహక్కుల దుర్వినియోగం కనిపిస్తున్నది.
      ఆమె పుస్తకం అంతా అంతర్జాతీయ చట్టంలో పేర్కొన్న స్వేచ్ఛల గురించి ఇస్లాం ఎలాంటి ప్రాతిపదికలు చూపుతున్నదో చర్చించింది. ఒకస్థాయిలో ఇస్లాం చరిత్ర ప్రకారం మానవహక్కుల అభివృద్ది జరగకుండా ఇస్లాం అడ్డుకున్నదని రాసింది.
      1989కి ముందు సోవియట్ రష్యాలో కమ్యూనిజం అధికార విధానంగా ఉన్నప్పుడు మానవహక్కులు ఉల్లంఘించారు. 1994లో కమ్యూనిజం లేనప్పుడు కూడా ఉక్రేన్ లో మానవహక్కులు ఉల్లంఘించారు. కనుక సోవియట్ కమ్యూనిజానికి మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధం లేదు. అని వాదించటం ఎంత సబబో, మేయర్ పైన చేసిన వాదన కూడా అంతే సబబు.
      గతంలో ఇస్లాం సంస్కృతి ఒకచోట ఆగిపోలేదని మేయర్ చెప్పింది. మరొకచోట వేయి సంవత్సరాలపాటు ఆధునిక కాలాలకు ముందున్న విలువలు పెత్తనం చేశాయన్నది. ఇస్లాంచట్టం స్థిరంగా, మారకుండా ఉన్న తీరును షాట్, హర్ గ్రోంజేలు చూపారు. బాస్క్వే అదే ధోరణిలో రాసాడు.
      ఇస్లాం చట్టం పరిస్థితులకు అనుగుణంగా మారలేదు. శతాబ్దాలుగా దైవేచ్ఛను బోధిస్తూ పవిత్రగ్రంథాల సిద్ధాంతాలు చూపి వాటి భాష్యాన్ని మార్చటానికి  వీలులేదన్నారు. (బాస్క్వే, యుఎన్ఇ ఎక్స్ ప్లికేషన్ మార్కిస్ట్ డ ఇస్లాం ఇన్ హెస్పిరసిస్, 1-1954)
      షరియా చట్టాలలో స్త్రీలూ, ముస్లిమేతరులూ మత స్వేచ్ఛను గురించి ఎన్ని భాష్యాలు, వ్యాఖ్యానాలు చేసినా మానవ హక్కులకు కట్టుబడి ఉండేవారికి అవి రుచించవు. మేయర్ ఉదహరించిన ఒక రచయిత ఘసన్ అషా స్త్రీల విషయమై ఇలా రాశారు. ముస్లిం స్త్రీలను అణచడానికి ఇస్లాం ఒక్కటే కారణం కాదు. కాని నిస్సందేహంగా అదొక మౌలిక కారణం. ప్రధాన ప్రతిబంధకం కూడా, ఇందులో ఇస్లాంను ఏమీ అనకుండా తప్పించే ప్రయత్నాలు లేవు.
      ముస్లిం మితవాదులు షరియాను వారి ధోరణలలో వ్యాఖ్యానించినప్పటికి అలాంటి వ్యాఖ్యానం సరైనది కాదనీ, ఉదార ముస్లింల వ్యాఖ్యానమే సరైనదనటానికి ఆస్కారం లేదు. ఇస్లాంలో సరైనదేదీ నిర్ణయించేదెవరు. ఇస్లాం నాగరికతకు షరియా మూలపీఠమని పండితులు భావిస్తున్నారు.  షరియాకు భాష్యం చెప్పవచ్చు. కాని అందులో సడలింపు బహుస్వల్పం. (క్రేమర్ ఇస్లాం వర్సెస్ డెమోక్రసీ ఇన్ కామెంటరీ, జనవరి 1993, పుటః 38)
      ముస్లింను నొప్పించరాదని మేయర్ చేసిన ప్రయత్నం ఆమెను వైరుధ్యాల్లోకి తీసుకెళ్ళినా మొత్తంమీద మానవహక్కులకు ఇస్లాం పథకాలు రక్షణ కల్పించలేక పోతున్నాయని నిర్థారించి చెప్పగలిగింది.
ముగింపుః
      అంతర్జాతీయ మానవహక్కుల అనుసరణకు ఇస్లాంలో ప్రధాన ఆటంకం దేవుడే. హర్ గ్రోంజే పేర్కొన్నట్లు కొరాన్.  సున్నలకు చూపే గౌరవమే. ప్రధాన నిరోధం కూడా. (హర్ గ్రోంజే, సెలెక్ట్ డ్ వర్క్స్, పుటః 60) ఇస్లాం మానవహక్కులలో వారు స్పష్టం చేస్తూ దైవం వెల్లడించిన తీరులో మానవ సంస్థలూ, సంబంధాలూ స్థాపించి నడిపించాలనీ, అందుకు అనుగుణంగానే చట్టపరమైన, నీతివంతమైన విధానాలుండాలనీ అన్నారు. మానవ వ్యవహారాలు నడిపించటానికి మానవ వివేచన వారు స్వీకరించలేదు. ఇస్లాం బోధనలూ, దైవం నడిపించే తీరూ, సంపూర్ణమనీ, అదే ఆఖరనీ చెప్పారు.
      మేయర్ పేర్కొన్నట్లు ఇస్లాం చట్టాన్ని ప్రశ్నించేవాటిని ముందే ఊహించి కొట్టిపారేశారు. కనుక  షరియా తిరుగులేనిదిగా ఉంటున్నదన్నమాట.
      అంతర్జాతీయ మానవహక్కుల సూత్రాలు ఆమోదింపచేయటానికి ఇస్లాంలో లోగడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ప్రయత్నించటం మేథస్సుతో ఆడుకోవటమే.  కాలం వృధా చేయటమే. అలా చూడటం ఒక విధంగా ఉలేమాల ఉచ్చులో ఇరుక్కోవటం కూడా. ప్రజాస్వామ్యానికీ, ఇస్లాంకూ, మానవహక్కులకూ పొసగదనీ చూపితే ఉలేమాలు అందుకు భిన్నంగా మరికొన్ని ఉదాహరణలు చూపిస్తారు. అలాంటి ఆధారాలు ఇస్లాంలో లేవని చూపగలిగితే ఆ సూత్రాలను వదులుకుంటారా.... మానవహక్కులు విశ్వజనీనమైనవి. స్వతంత్రమైనవి, దైవాధికారంపై ఆధారపడనివి. అతీత కాలానికి సంబంధం లేకుండా హేతుబద్ధంగా ఉన్న సూత్రాలవి. ఈ సూత్రాల ప్రాతిపదికల్ని పండితులు ఆమోదించారు. ఆ తరువాతనే ఇస్లాంలో అలాంటివేమైనా ఉన్నాయేమోనని వెతకనారంభించారు.
      ఉదార ప్రజాస్వామ్యం వైపుకు పురోగమించాలంటే ముస్లిం ప్రపంచం, పిడివాదాన్ని పునరాలోచించి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అన్నిరంగాలలో ముస్లిం విజయ పరంపర  ఉన్నదనే స్వర్ణయుగపు ఊహాలోకాన్ని వదులుకోవాలి. రాజ్యాన్నీ, మతాన్నీ వేరుచేసి సెక్యులరిజం పాటించాలి. పాశ్చాత్య రోగంగా సెక్యులరిజాన్ని చూసినంతవరకూ అలా చేయలేరు. ముస్లిం ప్రపంచం పాశ్చాత్య లోకంపట్ల నిర్హేతుక, విధ్వంసకర భయాన్ని పోగొట్టుకొని విలువల్ని మాత్రమే స్వీకరించి ప్రజాస్వామ్యానికి గల తాత్విక ప్రాతిపదికలు స్వీకరించి అనుసరించటం మంచిది.
నిర్హేతుక భయాలు, పాశ్చాత్యులపట్ల జుగుప్స
    ఆధునిక యూరోప్ ను రూపొందించటంలో ఇస్లాం ప్రభావాన్ని చూపుతూనే అదే నాగరికతను కొందరు ముస్లింలు నిరసిస్తుంటారు. అరబ్బులు నిర్దుష్ట విజ్ఞాన శాస్త్రానికి ప్రాతిపదిక వేయకపోతే అమెరికావారు చంద్రునిమీద నడిచేవారే కాదంటారు. మరొకవైపున పాశ్చాత్యులను భౌతిక వాదులుగా మత రహితులుగా, సంకుచితులుగా, శాస్త్రీయమైన వారిగా నిరశిస్తుంటారు. ఈ శాస్త్రీయ పదార్థవాదం ముస్లింల ఆధ్యాత్మిక వాదం కంటే తక్కువైనదని చెపుతారు. ఒక పుస్తకానికి గుడ్డిగా లోబడి ఉండడం ఆధ్యాత్మికం ఎలా అవుతుందో స్పష్టపడదు. పాశ్చాత్యలోకంపై ఇస్లాం ప్రభావాన్ని గురించి మాట్లాడడం తమ లోపాన్ని బయటపెట్టుకోవడమే. ఇస్లాంలో పాశ్చాత్య లోకాన్ని ప్రభావితం చేసినవాటినే చూపుతున్నారనుకోవటం ప్రస్తుత కాలంలో ముస్లింల వైఫల్యాన్ని సూచిస్తుంది.
      ప్రైజ్ జోన్స్ ఇలా రాశారు. అరబ్బులు ఉన్నత శాస్త్రీయ విజయాలు సాధించి ఉంటే వాటి ఫలితాలను యూరోప్ వాసులకు ఎందుకు వదిలేశారు... శాస్త్రీయ సంప్రదాయాలలో వారిమార్గాన్ని పూర్తిగా అపివేసింది ఏది... ఇలాంటి క్షమాపణాపూర్వక మాటలతో ఆత్మవంచన చేసుకోటం ఏ ప్రయోజనాన్ని సాధించటానికి..... వారి పూర్వీకులు సాధించిన దానిని సంక్రమింపచేసుకోకుండా ఉండటమే నేటి అరబ్బుల గతి అనుకోవచ్చా... (ది క్లోజ్డ్ సర్కిల్ పుట 376, లండన్ 1990)
      శాస్త్రీయ పరిశోధనను కనుగొన్నవాటినీ, అధ్యాత్మికేతరంగా భావించినంతకాలం ముస్లింలు ఇలా నిరశిస్తూనే ఉంటారు. పాపర్ తదితరులు సూచించినట్లు విజ్ఞాన శాస్త్రాన్ని సాంకేతిశాస్త్రంతో కలిపి గందరగోళ పడరాదు. (ది ఓపెన్ సొసైటీ అండ్ ఇట్స్ ఎనిమీస్, రెండవ సంపుటి, పుటః 283) సైన్స్ చాలా చింతనతో కూడిన చర్య. కేవలం విషయ సేకరణే కాక, నేటి భావనా ఉద్యమాలలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తున్నది. లూయీస్ ఓల్ పత్ రాస్తూ మానవాళి సాధించిన గొప్ప రామణీయకతలలో సైన్స్ ఒకటి అన్నారు. (ది అన్ నేచురల్ ఆఫ్ సైన్స్, పుటః 189, లండన్, 1992)
      ముస్లిం మేథావులు ప్రాచ్యవాదంలోని సంకుచిత విమర్శలను స్వీకరించటం దారుణం. పాశ్చాత్య పండితులు ముస్లింలకు వారి సంస్కృతిని ఇవ్వటమే కాక కోల్పోతున్నవారి చరిత్రను కూడా అప్పగించి, ఇస్లాం నాగరికత అవగాహనకు తోడ్పడ్డారు. సంవత్సరాల తరబడి అధ్యయనం చేసి పరిశోధించిన జీవిత కాలమంతా అన్వేషించిన పండితులను ప్రాచ్యవాదులుగా ఇప్పుడు నిరశిస్తున్నారు.
      అలెగ్జాండ్రియా గ్రంథాలయాన్ని ముస్లింలు తగలబెట్టడం పాశ్చాత్య పాండిత్యంపై అపనమ్మకానికి నిదర్శనం. 641లో అలెగ్జాండ్రియాను స్వాధీన పరచుకున్న తరువాత ఖలీఫా ఉమర్ అక్కడ గ్రంథాలయాన్ని తగులబెట్టమన్నాడు. దైవగ్రంథంతో గ్రీకుల రచనలు ఆమోదయోగ్యమైతే వాటి ప్రయోజనం లేదు. అట్టిపెట్టనవసరం లేదు. విభేదిస్తుంటే ద్రోహపూరితమైనవి గనుక తగులబెట్టవలసిందే. నగరంలో, స్నానాల గదిలోనూ వేడిగా ఉంచటానికి పుస్తకాలు పొయ్యిలో వేసి తగలబెట్టారు. ఇస్లాం ఖ్యాతిని మచ్చ పరచటానికి పాశ్చాత్యులు అల్లిన కథనమేనని చూపటానికీ, 12వ శతాబ్దంలో ముస్లింలు కనిపెట్టిన వాదన ఇది. లెవిస్  ఇలా అన్నారు. ముస్లింలు ఈ కథను అల్లారు. 18వ శతాబ్దం నుండి నేటివరకూ ఈ కథను అబద్ధమని ఖలీఫా ఉమర్ ఇతర ముస్లింలను అపవాదు పాలుకాకుండా ఉంచటానికి భ్రమలు సృష్టించారు. (న్యూయార్క్, రివ్యూ ఆఫ్ బుక్స్, 1990, సెప్టెంబర్ 2)
      పాశ్చాత్య పదార్థవాదాన్ని ఖండించే ముస్లింలు పాశ్చాత్యుల విజయాలను విస్మరిస్తున్నారు. ఆ సంపద ముస్లింలకు అందుబాటులో ఉన్నదన్న విషయం ఆది మానవాళి సాధించిన గర్వకారణమనే సంగతి మర్చిపోతున్నారు. అలాగే ఇస్లాం శిల్ప సంపద కూడా మానవాళి గర్వించదగిన అద్భుతం. ఇస్లాం తత్వాన్ని అభ్యసించినట్లే ఇస్లాం కేంద్రాలలో మొజార్ట్, బిథోవెన్ సంగీతాన్ని, పునర్వికాస కళలను అధ్యయనం చేయాలి. పాశ్చాత్య సంస్కృతిని తప్పుగా అర్థం చేసుకుంటున్న ముస్లింలు సెక్యులర్ భావనతో తమ మేథస్సును విప్పారచేసుకోవాలి. నైరాశ్యవాదం, స్వార్థపూరితం, పాశ్చాత్య సంస్కృతిలో లేవు. మానవతా ధోరణలున్నాయి. రెడ్ క్రాస్ అందుకు ఒక ఉదాహరణ.
      పాశ్చాత్య  లోకానికి చెందవలసిన ఖ్యాతిని గుర్తించకపోవటం, మానవహక్కులలో ఇస్లాం పూర్వ చరిత్ర ఏమైనా చెపుతున్నదేమో అని వెతకటం అసందర్బ భావాలే. బైజాంటియన్ నగరంలో సార్వభౌమత్వానికి చిహ్నంగా ఉన్న అర్థచంద్రాకార ప్రతిమ ఇస్లాంకు కూడా గుర్తు అయింది. అరబిక్ భాష క్రైస్తవ మిషనరీలు వెతికి పట్టుకోగా, ఫొనిషియన్ అక్షరాలనుండి ఈ భాష నబాటియన్, అరమైక నుండి సంక్రమించింది.
      7వ శతాబ్దానంతరం అరబ్బులు దండయాత్రల ద్వారా అనేక ప్రాచీన సంప్రదాయాలతో పరిచయం ఏర్పరచుకొని ఇస్లాం కళనూ, శిల్పసంపదనూ పెంపొందించారు. కె.ఎ.సి. క్రెస్ వెల్ ఇస్లాం శిల్పసంపదపై రాస్తూ ఇస్లాం తలెత్తినప్పుడు అరేబియన్లో  పేర్కొనదగిన శిల్పసంపద అంటూ ఏమీ లేదన్నాడు. (ఎర్లీ ముస్లిం ఆర్కిటెక్చర్, పుటః1, లండన్, 1958) గ్రాబర్, ఎటింగాహాసన్ ఇలా రాశారు. దండయాత్ర చేసిన అరబ్బులకు కళాత్మక సంప్రదాయాలు స్వల్పమే. కళా సిద్ధాంతాలు పరిమితమే. సంపన్నమైన, కళాత్మక లోకాలలోకి వారు చొచ్చుకవచ్చి వాటి రూపురేఖలను చాలా వరకూ మార్చివేశారు. (ది ఆర్ట్ అండీ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇస్లాం. 650-1250, లండన్, 1991, పుటః 67)
      క్రీ.త. 691లో జెరూసలేంలోని రాక్ డోమ్ ఇస్లాం నిర్మాణలలో సుప్రసిద్ధమైనది అనస్టాసిస్, ఎస్సెన్షన్కు చెందిన క్రైస్తవ నిర్మాణాలతో దీనికి పోలికలున్నాయి. సిరియా, పాలస్తీనా, బైజాంటియం, క్రైస్తవ కళలతో లోనవైపు చెక్కడాలు ప్రభావితం అయినట్లు తెలుస్తున్నది. సిరియా చర్చి టవర్ల శిల్పసంపద మసీదు గోపురాలతో పోలి ఉన్నాయని క్రెస్ వెల్ పేర్కొన్నాడు.  (ఎర్లీ ముస్లిం ఆర్కిటెక్చర్, పుటః 111)
      ఇస్లాం ముసుగులో బైజాంటియం కళ అనే అధ్యాయం రాస్తూ ఎటింగ్ హాసన్ ఇలా ఉటంకించాడు. ఉమాయడ్స్ కాలంలో అరబ్బుల చిత్రకళలు, సంప్రదాయ, ఇరానియన్ లక్షణాలు స్పష్టం. ఇందులో ఇస్లామిక్ ధోరణి లేదు. అబ్బాసిద్ కాలంలో ఇరానియన్ లక్షణాలు బాగా ఉన్నాయి. 12వ శతాబ్దం చివరలో బైజాంటిన్ ప్రేరణతో సంప్రదాయ లక్షణాలు కనిపించాయి. (రిచర్డ్ ఎటింగ్ హాసన్, అరబ్ పెయింటింగ్, జెనీవా, 1977, పుటః 67).
ఇస్లాం చట్టాలపై ప్రభావాన్ని షాట్ ఇలా పేర్కొన్నాడు. రోమన్, బైజాంటియన్ చట్టాలనుండి కొన్ని లక్షణాలూ, ప్రాచ్యమతాల చట్టాలు కొన్నీ, టాల్ మూడిక్, రైబైనిక్, ససానియన్ చట్టాలనుండి ఇస్లాంలోకి మత చట్టాలు ప్రవేశించి సిద్ధాంతాలుగా మారాయి. (ది అరిజిన్స్ ఆఫ్ మహమ్మదన్ జ్యూరిస్ ఫ్రూడెన్స్, పుట 546, ఆక్స్ ఫర్డ్, 1950)
అరబ్బు తాత్వికుడు అల్ కిందీ ఇలా రాశాడు. సత్యం ఎక్కడనుండి వచ్చినా, పరాయిజాతులూ, దేశాలనుండి లభించినా స్వీకరించడానికి సిగ్గుపడరాదు. సత్యాన్వేషకుడికి సత్యం తప్ప మరొక లక్ష్యం ఉండరాదు. (ఆర్బరీ ఉదహరించుట, రీజన్ అండ్ రెవెలేషన్, పుటః 34, 35 లండన్ 1957)
అవరోస్ ఇలా రాశాడు
లోగడ ఈ విషయాన్ని ఎవరైనా అన్వేషించి ఉంటే తమ పూర్వీకులు ఏం చెప్పారని చూడటం మంచిదే. అన్వేషకుడు మన మతస్తుడు కావచ్చుకాకపోవచ్చు. మన వివేచన పదును పెట్టుకోవడానికి మనతో అంగీకరిస్తున్న వ్యక్తి చెప్పందే స్వీకరించనక్కరలేదు. చెప్పిన విషయం సరిగా ఉందా లేదా అనే విషయమే చూసుకోవాలి.
కల్తీలేని జాతులూ, నాగరికతలూ లేవు. మనమందరం, జాతుల కలగపులగమేనని, సబకోవ్ అన్నాడు. పరస్పరం ప్రభావితం చేసుకుంటూ చొచ్చుకుపోయే, ధోరణలే ఇవి. మారనివి కావు. సంప్రదాయాలు మారతాయి. పరిణమిస్తాయి. అవి ఎక్కడనుండో తయారయి ఊడిపడవు. పరాయి ప్రభావాలు స్వీకరించి మార్పులు, చేర్పులు చేసుకుంటూ పురోగమిస్తుంటాయి. ప్రాచీన సంప్రదాయాలనుకునేవి ఇటీవల  విదేశాలనుండీ దిగుమతి చేసుకున్నవీ కావచ్చు. తూర్పు దేశాలలో పుట్టి పశ్పిమానికి ప్రవహించిన మసాలా సరుకు చాలా ఉన్నది.  ఇండియాలో బాగా అలవాటైన కారప్పొడి, తొలుత 16వ శతాబ్దంలో పోర్చుగీసువారు ప్రవేశపెట్టారు. ఇస్లాం నాగరికతలో వివిధ స్రవంతులు లోగడ లేనివెన్నో ఉన్నాయి.  గొప్ప నాగరికతను గుర్తించటానికి ఇతరుల నుండి స్వీకరించకపోవటం, స్వీకరించటం రెండూ లక్షణాలే అని బ్రాడెల్ అన్నాడు. ఇస్లాం ప్రపంచంలో మితస్వభావం ఎంతున్నా ఆధునిక పాశ్చాత్య భావాలు ఎన్నో విధాల చొచ్చుకపోయాయి. పాశ్చాత్య సాహిత్య ప్రభావం 19వ శతాబ్దం నుండి అరబ్బు సాహిత్యంపై ఉన్నది. నోబెల్ బహుమానం అందుకున్న నజీబ్ మహాఫజ్ ను అరబ్ బాల్టాక్ అంటారు.
ముస్లిం దేశాలలో చాలామందికి ఈ భావాలు అందటం లేదు. ప్రజాస్వామ్యం ఉదారవాదం వారికి ఇవ్వడంలో జాతీయ నాయకులూ, మేథావులూ విఫలమవుతున్నారు.
నేటి ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ప్రభావాలకు దూరంగా ఉండటం సాధ్యపడినప్పటికీ అవి పాశ్చాత్యం నుంచి వచ్చాయి గనుక వాటికి దూరంగా ఉండాలనుకోవడం కుర్రచేష్ట. ఇబ్న హాల్డున్ రచనలు,  అల్ హంబ్రా శిల్ప సంపద వలె బీథోవెన్ సాధించింది కూడా మానవాళి యావత్తుకూ చెందింది.
గతంలో జ్ఞానంలో వచ్చిన మార్పు సంస్కృతిని మార్చివేసింది. గత శతాబ్దంనుండి ప్రపంచం అంతటికీ పనికొచ్చే జ్ఞాన సంపద పెరిగింది. దీని ప్రభావం ప్రతి సంస్కృతిమీదా ఉంటుంది. ప్రాచీనమైనది గనుక మంచిది కానక్కరలేదు. వాన్ హయిక్ ఇలా అంటాడు.  చిరకాలంగా పాతుకుపోయిన దోషాలూ, దురాచారాలూ ఉత్తమమైనవి కావు. (ది కాన్సిట్యూషన్ ఆఫ్ లిబర్టీ, పుటః 410, లండన్, 1960) బ్రిటీషువారు విదేశీ సంస్కృతిలో జోక్యం చేసుకొని సతీసహగమన సంప్రదాయాన్ని రద్దుపరిచారు. అంతకుముందు భర్త చితిపై విధవను తగులబెట్టేవారు. ఈ మార్పు స్త్రీలపట్ల అభ్యుదయకరంగా మానవజాతి నైతికంగా ముందుకు పోవడానికి తోడ్పడినట్లు భావించాలి.
మసూది రాస్తూ శత్రువు చెప్పినా, మిత్రుడు చెప్పినా, మంచైతే గ్రహించాలి. సెక్యులరిజం పాశ్చాత్య భావన కనుక తృణీకరించాలనటం సమర్థనీయం కాదు.
సెక్యులరిజం సమర్థన
    గత వంద సంవత్సరాలలో ముస్లింలోకంలో ఉదారవాదానికి చాలా మద్దతు లభించింది. మహమ్మద్ ఆలీ (1769-1849) ఆధునిక ఈజిప్టు స్థాపకుడుగా, అరబ్బు ప్రపంచంలో సెక్యులరిస్టుగా పేరు పొందాడు. టర్కీలో యువరాజు సబాహిద్దీన్ (1948 మరణం) వ్యక్తివాదాన్నీ, ఫెడరల్ వాదాన్నీ, వికేంద్రీకరణనూ కోరాడు. ఈజిప్టులో అహమ్మద్ లత్ఫీ అలసయ్యద్, (1872-1963) వ్యక్తి హక్కులను సమర్థించి అధికారాల వేర్పాటును కోరి వ్యక్తుల జీవితాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా రక్షణలు ఉండాలనీ, పత్రికాస్వేచ్ఛ ఉండాలనీ అన్నాడు. పాద్హ్ జకారియా 1989లో రాస్తూ, రష్డీ ఉదంతం తరువాత సెక్యులరిజం కావాలన్నాడు. (లైసిటీ-క్యు-ఇస్లామిస్మే,పారిస్, 1989) ఇతడు కువైట్ యూనివర్సిటీలో బోధిస్తున్న ఈజిప్టు తత్వవేత్త ఇస్లాం మతవాదనలు నిశితంగా పరిశీలించకపోవటాన్ని ఇతడు విమర్శించాడు. అరబిక్ లో కనీసం ఒక్క పత్రిక కూడా సెక్యులర్ ఆలోచన చేయటం లేదన్నాడు. హేతువాదం, నిశిత పరిశీలన, శాస్త్రీయ దృష్టి, స్వతంత్ర ఆలోచన అనే విలువలు సెక్యులరిజంలో ఉన్నాయని జకారియా భావించాడు. ఇవి ప్రపంచం అంతటికీ పనికొచ్చేవన్నాడు. ఈ విలువల కోసరం లోగడ ముతాజిలైట్లూ, అల్ ఫరాబీ, అవరోస్, ఇబ్నహల్, హయతం వంటి ముస్లింలు పోరాడారని ఇతడు చెప్పాడు. పెత్తందారీతనంతో మధ్యయుగాలు ఆలోచన చేస్తున్న సమాజాలకు సెక్యులరిజం అవసరం అని జకారియా అన్నాడు. ముస్లిం ప్రపంచం ఇంకా అంధకాయుగంలో ఉన్నందున సెక్యులరిజం ఇప్పుడు మరీ అవసరమయింది.

   అనువాదం
        నరిసెట్టి ఇన్నయ్య