ఇస్లాం వలసవాదం-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?-part 8



ఇబన్ వారక్
8వ అధ్యాయం
అరబ్ సామ్రాజ్యవాదం, ఇస్లాం వలసవాదం
    అరబేతర ముస్లిం దేశాలలో పర్యటించాను. ఇస్లాం అరబ్ మతంగా ప్రారంభమయింది. అరబ్ సామ్రాజ్యంగా వ్యాపించింది. ఇరాన్, పాకిస్థాన్, మలేసియా, ఇండోనేసియాలలో  ప్రజలు విదేశీమతంలోకి మారినచోట నేను పర్యటించాను. ఆ ప్రజలు 19, 20 శతాబ్దాలలో యూరోప్ సామ్రాజ్యాలకు, మరొకవైపున  అరబ్ మతానికి ఇమిడిపోయారు. ఆ ప్రజలు రెండు విధాల వలసకు గురై, సొంత వ్యవస్థకు రెండుసార్లు దూరమయ్యారు.
    వి.ఎస్.నయపాల్-న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్, 1991, జనవరి 31
      ఇస్లాంపై ఆధునిక పరిచయ గ్రంథం ఏది చూచినా అచిరకాలంలో నాగరిక ప్రపంచాన్ని, సింధునది నుండి అట్లాంటిక్ తీరాలవరకూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారిని పొగడటం కనిపిస్తుంది. భిన్న ప్రజలూ, సంస్కృతులను ముస్లింలు పరిపాలించిన తీరును ఆకాశానికి ఎత్తినట్లు చూడవచ్చు. బ్రిటీషు సామ్రాజ్యం ప్రపంచంలో 3వ వంతు దేశాలను పరిపాలించి ఆక్రమించింది. కానీ, సమకాలీన బ్రిటీష్ చరిత్రకారులు అందుకు బ్రిటన్ ను పొగడటం కనిపించదు. యూరోప్ వలసవాదం, సామ్రాజ్యవాదం తిట్టుపదాలుగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దోషాలకూ అవే కారణాలంటారు. యూరోప్ వారిని సిగ్గుపడేటట్లు  చేసిన విధానమది. కాని అరబ్బు సామ్రాజ్యవాదాన్ని పొగిడి, ముస్లింలు గర్విస్తున్నారు.
      మూడవ ప్రపంచంపై యూరోప్ తన విలువలూ, సంస్కృతీ, భాషల్ని రుద్దినందుకు విమర్శకు గురయ్యారు. ఇస్లాం తన వలసవాదంతో ప్రాచీన అభివృద్ధికర నాగరికతలను నాశనం చేసినందుకు ఎవరూ వేలెత్తి చూపటం లేదు. మైకేల్ కుక్ ఇలా అన్నాడు. (మహమ్మద్, ఆక్స్ ఫర్డ్, 1983, పుటః 86)
      అరబ్ దండయాత్రలు సామ్రాజ్యాలను నాశనం చేసి కొన్ని ప్రాంతాలను శాశ్వతంగా మార్చివేసాయి. ఇది దారుణమైన సంఘటన కుక్, క్రోనేలు ఈ దండయాత్రలు చేసిన విపరీత సాంస్కృతిక నష్టాన్ని వివరించారు. (హేగరిజం, కేంబ్రిడ్జి, 1977, పీఠిక పుటః 8)
      1060, 1070 ప్రాంతాలలో టర్కీ దండయాత్రల వలన చాలామంది ప్రజలు పారిపోయారు, పట్టుబడ్డారు. హతమార్చబడ్డారు. బానిసలయ్యారు. హెలెనిక్, క్రైస్తవరీతులు నాశనమయ్యాయి. బైజాంటైన్ సామ్రాజ్యం తుడిచిపెట్టకపోయింది. (హంఫ్రీస్, ఇస్లామిక్ హిస్టరీ, ప్రిన్ స్టన్, 1991, పుటః 280-81, స్పెరోస్ వైనిస్ ది డిక్లైన్ ఆఫ్ మిడివల్ హెలెనిజం ఇన్ ఏషియా మైనర్ అండ్ ది ప్రోసెస్ ఆఫ్ ఇస్లామైజేషన్ ఫ్రం ది ఎలెవెన్స్ త్రూది ఫిఫ్టీన్త్ సెంచురీ)
      అల్జీరియాలో ఫ్రెంచి భాషను మానేశారు. ఫ్రెంచి వలనవాద చిహ్నంగా భావించినందున అలా చేశారు. ఒక తరం వారిని సంపన్న, సాంస్కృతిక సంపదకు ఆ విధంగా దూరం చేశారు. అరబిక్ భాష బయటనుండి వచ్చిందన్న విషయం మర్చిపోయారు. అక్కడ ప్రజల భాష బర్బర్. కానీ ప్రజల్ని అరబ్బులుగా చిత్రించి నచ్చజెప్పి, అక్కడి సంప్రదాయాలకు భిన్నంగా, మతం కోసం మనసులు మార్చారు. అరేబియా వైపుకు తిరిగి 5సార్లు వంగి ప్రార్థించటం సాంస్కృతిక సామ్రాజ్యవాద చిహ్నమే.
      తోటి మతం వారిని ముస్లింలు చిన్నచూపు చూస్తారు. పరాయి పాశ్చాత్య విలువలను ఒప్పుకున్నారని అంటారు. తమ ప్రాచీన సంస్కృతిని విస్మరించిన ద్రోహులుగా వారు ప్రవర్తిస్తున్నారన్న విషయం మరచిపోయారు. ఇండియాలో నేటి ముస్లింలు హిందువుల నుండి మారారు. ఇరాన్ లో జొరాస్ట్రియన్ నుండి మారారు. సిరియాలో క్రైస్తవం నుండి మారారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎక్కడో ఉన్న మతాన్ని ఆమోదించటం, అర్థంగాని భాషలో ఉన్న పుస్తకాన్ని చదవటం, మాతృభాష, జాతీయ భాష తెలియకపోయినా అరబ్బీ నేర్చుకోవటం వారికి సాధారణమై పోయింది. ఇస్లాం రాకముందు తమ దేశంలో ఉన్న గతాన్ని తెలుసుకోకుండా భౌగోళికంగా మారుమూలలో ఉన్న ప్రజల చరిత్రను నేర్చుకుంటున్నారు.
      ముస్లింలు తమ సంపన్న సంస్కృతిని దూరంగా పెట్టి ఇస్లాం విజయం వలన దారుణ ఫలితాలకు గురి అవుతున్నారు. పాకిస్తాన్ లో పర్యటించిన వి.ఎన్.నయపాల్ ఇలా రాశాడు.
      ఇస్లాంకు ముందున్నఅంతా అంధకారమని ముస్లిం మత సిద్ధాంతం బోధిస్తున్నది. చరిత్ర కూడా మత సిద్ధాంతానికి సేవ చేస్తున్నది. సింధులోయలోని మొహంజదారో క్రీ.పూ. 1500 నాటి ఆర్యుల రాజ్యం అక్కడి త్రవ్వకాలు పాకిస్తాన్ కూ, ప్రపంచానికీ పురావస్తు సంపదలు. ఆ తవ్వకాల నిండా నీరు నిండిపోగా, ప్రపంచ సంస్థల సహాయంకోసం అర్థిస్తున్నారు. పాకిస్తాన్ దినపత్రిక డాన్ ఆ చోటు గురించీ సొంత భావాలు వెల్లడించింది. ఖురాన్ లో చరణాలు మొహంజదారోలో తగినచోట్ల చెక్కాలన్నది.
    సర్ మహమ్మద్ ఇక్బాల్ (1875-1938) పాకిస్తాన్ స్థాపకుడుగా, జాతీయ కవిగా, భారత ముస్లిం కవిగా గుర్తింపు పొందారు. నయపాల్ అతని చరణాల నుండి ఉదహరించాడు. నయపాల్ ఇలా రాశాడు. భారతీయుల ముస్లిం రాజ్యం అరబ్బు సామ్రాజ్యవాదముద్ర లేకుండా ఇస్లాం రాజ్యంగా ఉండాలని ఇక్బాల్ అశించాడు. అరబ్బులు సామ్రాజ్యవాదులుగా జయప్రదంగా ఉన్నారు. వారు జయించటమంటే, విశ్వాసపరుల దృష్టిలో రక్షణ పొందటమే.
    పాకిస్తాన్ స్కూలు పుస్తకాలలో చరిత్ర అరేబియా, ఇస్లాంతో ప్రారంభమౌతుంది. ప్రవక్త, ప్రథమ నలుగురు ఖలీఫాలు, ప్రవక్త కుమార్తె ఫాతిమా గురించి పాఠాలలో పేర్కొంటున్నారు. ఇక్బాల్, పాకిస్తాన్ రాజ్యస్థాపకుడు జిన్నా, ఇండియాకు వ్యతిరేకంగా పవిత్రయుద్ధంలో హతమైన ఇద్దరు, ముగ్గురు సైనికుల ప్రస్తావన అరుదుగా కనిపిస్తుంది.  పేగన్ గతంపట్ల ఈ విధమైన జూగుప్స వలన ముస్లింల చారిత్రక దృష్టికి పరిమితులు ఏర్పడి మేథస్సు సంకుచితమౌతున్నది. అమెరికా, యూరోప్ పండితులు ఈజిప్ట్, అసీరియా, ఇరాన్ శాస్త్రాలను తొలుత పట్టించుకున్నారు. పాశ్చాత్య పురావస్తు పండితులు దివ్యమైన ఈ గతాన్ని గురించి మానవాళికి అందించారు.
అరబ్ సామ్రాజ్యవాదం, ఇస్లాంకు ప్రతిఘటన
    ఇస్లాంకు ముందు మతాన్ని పట్టించుకోలేదు. (గోల్డ్ జిహర్, ముస్లిం, స్టడీస్, సంపుటి 1, పుటః 12) ఆనాడున్న మతం అరబ్పుల నిత్య జీవితంలో ఆట్టే ప్రాధాన్యత వహించలేదు. పోరాటాలూ, తాగటం, తినటం, ఆట పాటలూ, శృంగారం వారి కాలక్షేపాలు. అది ఆదిమ జాతి మానవ వాదంగా వాట్ పేర్కొన్నాడు. తొలి నమ్మకస్తులు మతం మార్చుకున్నవారూ తమ విశ్వాసాన్ని వెల్లడిస్తూ మహమ్మద్ బోధనలలో దేవుడికి అంకితం కావాలని చెప్పిన మాటల్ని అర్థం చేసుకోలేకపోయారు. (గోల్డ్ జిహర్, పుటః 15) బెడోయిన్ అరబ్బులు ఎడారివాసులుగా కొత్తమతాన్ని తొందరగా అమోదించలేదు. ఉక్కల్, ఉరానా తెగలు ఇస్లాంను ఆమోదించినా, తమ ప్రాంతాలకు వెళ్ళిపోదామని మహమ్మద్ ను అడిగారు. మదీనా వదలి వెళ్ళటానికి అనుమతించినా వారు వెళుతూ తమకు అప్పగించిన ముఠాధిపతిని చంపేసి, పాత ధోరణిలోకి మారిపోయారు. ప్రవక్త వారిపై క్రూరంగా పగ తీర్చుకున్నాడు.
      చాలామంది బెడోయిన్లు ఇస్లాంపట్ల ఆకర్షితులు కాలేదు. నగర అరబ్బులు వీరిని నిరసించేవారు. గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. ఎడారిలోని అరబ్బులు ప్రార్థనలపట్ల అసక్తి చూపలేదు. ముస్లిం క్రతువుల్ని పట్టించుకోలేదు. పవిత్ర గ్రంథాన్ని ఉదాసీనంగా చూశారు. అందులో చాలా విషయాలు వారికి తెలియవు. కొరాన్ లోని పవిత్ర చరణాలకంటె పేగన్ నాయకుల గురించిన గేయాలే వారికి వచ్చేవి. (గోల్డ్ జిహర్, పుటః 43)
      ఇస్లాంలోని సన్యాసత్వం, ఆహారం, మత్తుపానీయాలపట్ల ధోరణి అరబ్బులను ఇబ్బంది పెట్టాయి. శిక్షలు పడుతున్నా తాగుడు మానేయటానికి చాలామంది ఒప్పుకోలేదు. గోల్డ్ జిహర్ ఇలా రాశాడు.
      అరబ్బు వాసులలో స్వేచ్చాపరులు కొత్త విధానాన్ని నిరసించి ఆ సమాజానికి దూరంగా పోదలచారు. స్వేచ్ఛను వదులుకునే బదులు కొత్తమతాన్ని వదులుకోదలిచారు. ఉదారస్వభావానికి పేరుపొందిన రబియా ఉమయా ఖలాఫ్ అలాంటి వాడే. ఇస్లాం పేరిట అతడు తాగటం మానదలుచుకోలేదు. రంజాన్ మాసంలో కూడా తాగేవాడు. అందుకని ఖలీఫా అతడిని మదీనా నుండి బహిష్కరించాడు. ఉమర్ చనిపోయిన తరువాత కూడా మదీనా రావడానికి అతడు నిరాకరించాడు. క్రైస్తవ సామ్రాజ్యానికి పోయి క్రైస్తవుడుగా మారటానికి నిర్ణయించుకున్నాడు. (గోల్డ్ జిహర్, పేజి. 43)
అరబ్బు జాతివాదం
    ఇస్లాం జాతిపరంగా అమాయకమైనదని పాశ్చత్యులు భ్రమ కల్పించారు. ఇది పాశ్చాత్యులకు సరిపోయింది. ఇస్లాంను ఆదర్శంగా పైకెత్తి పాశ్చాత్య వైఫల్యాన్ని దెబ్బతీయటానికి ప్రయోగించారు. (లెవీస్, ది అరబ్స్ ఇన్ హిస్టరీ, న్యూయార్క్, 1966, పుటః 101)
అరబ్బులు
    ఇస్లాం చరిత్రలో తరచు తిరుగుబాటు రావటానికి అరబ్బుల జాతి ధోరణి, తలబిరుసుతనమే కారణం (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్, పుటః 98) నమ్మకస్తుల అందరి సమానత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది. (ముస్లిమేతరుల విషయం వేరు) అరబ్బు జాతులకు బదులు ఇస్లాం కట్టుబడి ఉంటే సూత్రంగా పనిచేస్తుందని  నచ్చచెప్పటానికి ప్రవక్త తిప్పలుపడ్డాడు. ఇస్లాం ఖండిస్తున్నా, ఆబ్బాసిడ్ల కాలంవరకూ తెగల స్పర్థలూ, కలహాలూ, పోటీలూ సాగాయి. ఈ తెగలు  తమ తగాదాలను  పరిష్కరించుకోలేక, యుద్ధాలలో కూడా వేరుగా ఉంటూ, వేరు వేరు మసీదులు కట్టుకున్నారు. అరబ్బులలో ఉత్తర, దక్షిణ వారి మధ్య హింసాయుత విధ్వంసకర స్పర్థలు ఉన్నాయి. అండలూషియాను అరబ్బులు జయించిన తరువాత తెగల అంతర్యుద్ధాలను నివారించటానికి భిన్న ప్రాంతాలలో వారిని అట్టిపెట్టినా, కలహాలు తప్పలేదు. ముస్తఫా కమాల్-అల్దిన్-అల్సిద్ధికీ 1137లో ఇలా రాశాడు. ఖయాలైత్ ఉత్తర అరబ్బులకూ, ఎమినైట్ దక్షిణ అరబ్బులకూ పోరాటాలు నిరంతరం సాగాయి. ప్రవక్త వాటిని నిషేధించినా అవి ఆగలేదు. (గోల్డ్ జిహర్, పుట. 79)
      ఒకే తెగలో కొందరు అధికులమని భావించి, ఇతర తెగలతో వివాహాలు నిరాకరించారు.
      ప్రవక్తకు కొన్ని సంప్రదాయాలు అంటగట్టి ముఠాలస్పర్థలకు దుర్వినియోగపరిచారు. అరబ్బులు జయిస్తూ పోతుండగా, కీలక స్థానాల నియామకాలు ఈ ముఠాలకు అసంతృప్తిని కలిగించగా అంతర్యుద్ధాలు సాగాయి. అరబ్బులలో సమానత్వం అనే బోధన మొదటి రెండు శతాబ్దాలలోనూ ఫలించలేదని గోల్డ్ జిహర్ రాశాడు.
అరబ్బులు - ఇతరులు
    ఇస్లాంలో సమానత్వాన్ని గురించి చెప్పేదంతా మృతప్రాయమనీ, అది అరబ్బులు గుర్తించలేదనీ, వారి దైనందిన ప్రవర్తనలో నిరాకరించారని స్పష్టమయింది. (గోల్డ్ జిహర్, పుటః 98)
      అరబ్బులు విజయపరంపరలు సాగించిన తరువాత ఇతరులను ఇస్లాంలోకి మార్చినా విచక్షణ కూడదని ఇస్లాం చెపుతున్నా సమానత్వం చూపలేకపోయారు. జయించిన వారు, జయింపబడిన వారూ అనే విచక్షణ ఆధారంగా అరబ్బులు తమ అవకాశాలను వదులుకోలేక పోయారు. అరబ్బులు కాని ముస్లింలను, తక్కువగా చూచి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సైనిక ఇబ్బందులకు గురిచేశారు. (లెవీస్, ది అరబ్స్ ఇన్ హిస్టరీ, పుట 36) ఒక విధమైన ఆటవిక ఉన్నతాధికారులుగా అరబ్బులు పరిపాలన సాగించారు. తల్లిదండ్రుల పారంపర్యతలో అరబ్బులైతేనే నిజమైన అరబ్బులుగా గుర్తించారు. జయించిన చోట స్త్రీలను, అరబ్బులు ఉంపుడుకత్తెలుగా స్వీకరించారు. వారి పిల్లలను అరబ్బులుగా కాక వేరుగా చూశారు.
      అరబ్బులు కాని ముస్లింలపట్ల విచక్షణ బాగా పాటించిన అరబ్బులు జుగుప్సతో వారిపట్ల ప్రవర్తించారు. యుద్ధాలలో వారిని పదాతిదళంగా వాడారు. దోపిడీ సంపదలో వాటా ఇవ్వలేదు. వీధిలో ఒకవైపు నడవలేదు. కూర్చోవటం కూడా వేరువేరు చోట్ల కూర్చున్నారు. మసీదులు నేరుగా నిర్మించారు. అరబ్బులకూ, వీరికీ మధ్య వివాహాలు సాంఘిక నేరాలుగా చూశారు. (కేంబ్రిడ్జి ఇస్లాం చరిత్ర, పుటః 40)
బానిసత్వం
      చరిత్రలో ప్రతి నాగరికతలోనూ ప్రజలు భావించినట్లే, ముస్లింలకు కూడా నాగరికత ప్రపంచం అంటే వారు మాత్రమే వికాసం, వాస్తవ విశ్వాసం వారికే ఉన్నాయి. బయట ప్రపంచం అంతా ఆటవికులూ, విశ్వాస రహితులూ, కొందరికి మతవాసనలు, నాగరిక ఛాయలూ లేకపోలేదు. బహు దేవతారాధకులూ, విగ్రహారాధకులూ బానిసలుగా పవికొస్తారు  (లెవీస్, ది అరబ్స్ ఇన్ హిస్టరీ, పుటః42)
      ఖురాన్ లో బానిస విధానాన్ని ఆమోదించి, యజమాని బానిస సంబంధాలను గుర్తించారు. (సుర 16.77, 30.28) ఉంపుడుకత్తెల విధానం అనుమతించారు. (సుర 4.3, 23.6, 33.50-52, 70-30) బానిసలపట్ల దయగా ఉండమని ఖురాన్ చెపుతుంది. బానిస విమోచన పవిత్ర చర్యగా భావిస్తుంది. అరబ్బు తెగలపై యుద్ధాలలో చాలామందిని ఖైదీలుగా ప్రవక్త పట్టుకున్నాడు. కొందరిని బానిసలుగా మార్చేశాడు.
      ఇస్లాంలో బానిసలకు న్యాయహక్కులు లేవు. వారు యజమాని ఆస్తిగా కేవలం వస్తువులు మాత్రమే. వారిని అమ్మవచ్చు, బహూకరించవచ్చు. బానిసలు సంరక్షకులుగా, సాక్షులుగా ఉండరాదు. వారి సంపాదన యజమానిదే. న్యాయస్థానంలో బానిస సాక్ష్యం ఇవ్వరాదు. ముస్లిమేతర బానిస ఇస్లాంలోకి మారినా, విముక్తి చెందినట్లుగాదు. అతడిని స్వేచ్ఛాపరుడుగా చేయటం యజమాని ఇష్టం.
      లోగడ అరబ్బు దండయాత్రలలో బానిసలుగా చాలామందిని పట్టుకున్నారు. అరబ్బులు వీరిని వాడుకొని దోపిడి చేసి ఆర్థికంగా సంపన్నులయ్యారు. (బాస్వర్త్, ఇస్లామికి డైనాస్టీస్, ఎడింబరో, 1980, పుటః 6) జయించిన ప్రజల్ని రక్షిత స్థాయిలో అట్టిపెట్టడంలోనే బానిస విధానం సన్నగిల్లి అరబ్బులు ఇతర చోట్ల బానిసలకోసం అన్వేషించారు. కొన్ని రాజ్యాలు కప్పం కింద వందలాది స్త్రీ, పురుషులను బలవంతంగా బానిసలను చేసి పంపారు.
      అరబ్బులు బానిస వ్యాపారంలో చైనా, ఇండియా, ఆగ్నేయాసియా రంగాలకు విస్తరించారు. టర్కీ, మధ్య ఆసియా, జైజాంటియం సామ్రాజ్యం, మధ్య-తూర్పు యూరోప్, పశ్చిమ - తూర్పు ఆఫ్రికా నుండి నల్ల, తెల్లవారిని బానిసలుగా చేపట్టారు. ఇస్లాం లోకంలో ప్రతి నగరంలోనూ బానిస వాణిజ్యం ఉన్నది.
      పట్టుబడినప్పటి నుంచి, అమ్మేవరకు, వందలాది బానిసలను అమానుషంగా చూడటంతో రోగాలు, అకలిదప్పులతో అనేక మంది చనిపోయారు. గృహ సేవకులైన వారు అదృష్టవంతులు. మిగిలినవారి శ్రమను ఉప్పు కొఠారులలో, చిత్తడి నేలల్లో, పత్తి చెరకు పొలాల్లో దోపిడీ చేస్తున్నారు.
      ఇస్లాం నిషేధిస్తున్నా స్త్రీ బానిసలను వ్యభిచారిణులుగా తెస్తున్నారు. యజమాని ఇష్టారాజ్యంలో వారుంటారు. స్టాన్లీలేన్ ఫూల్ ఇలా రాశాడు. (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, పుటః 680)
      తూర్చు రాజ్యాలలో స్త్రీ బానిస విధానం దయనీయంగా ఉన్నది. యజమాని చేతిలో ఆవిడ కీలుబొమ్మ. ముస్లిం ఎంతమంది ఉంపుడుగత్తెలనైనా ఉంచుకోవచ్చు. తెల్ల బానిసల్ని లైంగిక తృప్తికోసం అట్టిపెట్టుకుని అవసరం లేనప్పుడు అమ్మేస్తుంటారు. అలాంటి స్త్రీలు చితికిపోతున్నారు. ఆమె కుమారుడినికంటె పరిస్థితి కొంత మెరుగవుతున్నది. కుమారుడిని తృణీకరించే హక్కు యజమానికున్నది. ప్రవక్త ఘోరకృత్యాలను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. దండెత్తి జయించిన దేశాలపై స్వీకరించిన బానిసలను గౌరవంగా చూశారు. అలాంటిచోట్ల స్త్రీలను ముస్లిం సైనికుడు తన ఇష్టంవచ్చినట్లు వాడుకోవచ్చు. వేలాది స్త్రీలు, తల్లులూ, కూతుళ్ళూ చెప్పటానికి వీలులేనంత దారుణంగా ఈ విధానంలో బాధలకు గురయ్యారు. ముస్లింల ప్రవర్తనపై ఈక్రూరత్వం ప్రతిబింబించింది.
    ఇస్లాంలో స్త్రీలు ఎలా ఉంటారనే చర్చలో స్త్రీ బానిసల్ని గురించి వారి పరిమిత హక్కులూ, గతినీ విస్మరిస్తున్నారు.
నల్లవారి వ్యతిరేక స్పర్థలు
    రష్యా రచయిత పుష్కిన్ పూర్వీకులు ఇథియోపియన్లు. ఈ విషయం తెలిస్తే రష్యన్లు ఎలా అలోచిస్తారో మరి. అలాగే అరబ్బులలో ఇథియోపియన్ వాసుల్నీ, కవుల్నీ అరబ్బులు కాకులుగా చిత్రిస్తుంటారు. అరబ్బు కవులలో ఇస్లాంకు వూర్వం, ఇస్లాం తొలిరోజుల్లో ఆఫ్రికన్లు, మిశ్రమ అరబ్బులు, ఆఫ్రికన్ తల్లిదండ్రులు గలవారూ అనేకమంది ఉండేవారు. వారి కవితలను బట్టి జాతిద్వేషానికి గురైనట్లు, తమపై తామే దయతలుస్తూ, అసహ్యత పెంచుకుంటూ పోయినట్లు తెలుస్తున్నది. నేను నల్లనివాడిని కాని మనసు తెల్లనిది. నేను తెల్లవాడినైతే స్త్రీలు నన్ను ప్రేమించేవారు. మొదలైన ప్రస్తావనలు  వారి కవితల్లో ఉన్నాయి. ఇలాంటి కాకుల లో సుహాయం (660లో మరణం) సుసాయబ్ ఇబ్న రహ (726లో మరణం). అల్-హై-కుతన్, అబూ దులామ (776లో మరణం) ఉన్నారు. తొలి ముస్లిం సమాజంలో నల్ల బానిసలకు తక్కువ స్థాయి ఉండేది. లెవీస్ ఇలా రాశాడు.
      ప్రాచీన అరేబియాలో నేటి జాతివాదం లేదు. ఇస్లాం అలాంటి ధోరణులను ఖండిస్తూ ముస్లింలందరి సమానత్వాన్ని ప్రకటించింది. ఐనా, ఇస్లాంలోకంలో విషపూరిత జాతి విచక్షణలూ, విద్వేషాలూ తలెత్తినట్లు సాహిత్యం తెలుపుతున్నది. (ది అరబ్స్ ఇన్ హిస్టరీ, పుటః 36)
రద్దు
      20వ శతాబ్దం వరకూ ఇస్లాం ప్రపంచంలో బానిసత్వం కొనసాగింది. మొరాకోలో స్త్రీ పురుషులను బానిసలుగా తీసుకొచ్చి రహస్యంగా అట్టిపెట్టేవారు. టింబక్ టూ నుండి బాహాటంగా రావటం, బహిరంగ అమ్మకం అసాధ్యం కావటం ఈ ఆచారానికి దారితీసింది. (బ్రమ్స్ విగ్, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, నూతన ప్రచురణ)
      సౌదీ అరేబియాలో ఎమెన్ లో 1950 తరువాత కూడా బానిసత్వం కొనసాగింది. దీనిని రద్దు చేయటం మందకొడిగా సాగింది. విదేశీ ప్రభావం వలన ఈ రద్దు ఆరంభమైంది. బానిసత్వాన్ని రద్దు చేయాలని ఒక సిద్ధాంతంగా ఇస్లాం ఎన్నడూ చెప్పలేదని బ్రమ్స్ విగ్ అన్నాడు. ఖురాన్ లో బానిసత్వాన్ని చట్టబద్ధం చేయటంతో మత సూత్రాలకు అనుగుణంగానే ఇది సాగింది. బానిసత్వాన్ని పూర్తిగా రద్దు చేయటమంటే పవిత్ర గ్రంథానికి వ్యతిరేకంగా పోవటమేనని కొందరనుకొంటున్నారు.
      ఇటీవల ఆగ్నేయాసియా నుండి సౌదీ అరేబియాకు, మధ్య ప్రాచ్యానికీ గృహ సేవకులుగా వచ్చిన వారిని బానిసలుగా చూస్తూ ఇళ్ళల్లో బంధించి ఎటూ పోకుండా నిషేధించి, వారి పాస్ పోర్టులు తీసేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాలలో, మధ్య ప్రాచ్యంలో ఏటా 45 వేలమందిని సేవకులుగా నియమించటానికి ఆఫ్రికా యువకులను ఎత్తుకొస్తున్నారు. (ఫ్రెంచి పత్రిక  LVIE నం. 2562, 1994, అక్టోబర్ 6)
అరబ్బు వ్యతిరేక స్పందన
షుబియ
      సుర 49లో 13 చరణాన్ని బట్టి ముస్లింలందరూ సమానంగా ఉండాలన్నారు. దీని ఆధారంగా షుబియాలు అరబ్బులు తలబిరుసుతనాన్ని అభ్యంతర పెడుతూ అరేబియా ఎడారుల్లో ఆటవికులుగా అరబ్బులు ప్రవర్తిస్తున్నారు. షుబియా పార్టీ 2, 3 శతాబ్దాలలో (ముస్లిం) చాలా ప్రభావంతో సాగింది. అబ్బాసిద్ ఖలీఫాల ఆధ్వర్యాన కొన్ని పర్ష్యన్ కుటుంబాలు జొరాస్ట్రియన్ ఆచారాలను అట్టిపెట్టాలని కోరారు. పర్ష్యా ఉన్నత వర్గాల విద్యావంతులలో ఇస్లాం ప్రభావం లేదని స్పష్టపడుతున్నది. అబ్బాసిద్ ఖలీఫా అల్-ముతాసిమ్ కు (833) సైన్యాధిపతిగా ఉన్న ఖాదరి ఖవూస్ (అప్సిన్ అనికూడా అంటారు) క్రైస్తవులుకు వ్యతిరేకంగా మత యుద్ధాలు జయప్రదంగా నిర్వహించాడు. ఆనాడతడు ఇస్లాం హీరో.
      ఇస్లాంను ప్రచారం చేస్తున్న ఇరువురు ఒక పేగన్ దేవాలయాన్ని మసీదుగా మార్చదలచినప్పుడు అతడు వారిపట్ల క్రూరంగా వ్యవహరించాడు. ఇస్లాం చట్టాలను వెక్కిరించాడు. ఇస్లాం ఆచారాల ప్రకారం చంపితినే జంతువులు కంటె గొంతు నులిమేసి వండిన మాంసం బాగుంటుందని  ప్రచారం చేశాడు. సున్తీ ఆచారాన్నీ, ఇతర ముస్లిం పద్ధతులనూ వేళాకోళం చేశాడు. పర్ష్యా సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని కలలు గన్నాడు (గోల్డ్ జిహర్, ముస్లిం స్టడీస్, మొదటి సంపుటి, పుటః 139)
      అఫిసిన్ వలె అరబ్బేతరులు అవకాశం కోసం ముస్లింలలో చేరారు. పర్ష్యా జాతీయ స్వతంత్రాన్ని, ప్రాచీన సంప్రదాయాలనూ విధ్వంసం చేసిన అరబ్బులను ఏవగించుకున్నారు. (గోల్డ్ జిహర్, పుటః 140)
      ఇతర అరబ్బేతర ముఠాలను గమనిస్తే అరబ్బులు వారిపట్ల చూపిన జుగుప్స వెల్లడవుతుంది. దర్బర్ మేథావులు ఈ అరబ్బుల సామ్రాజ్య వాదాన్ని, ఇస్లాంనూ తప్పించుకోటానికి అనేక పెత్తనాలు చేశారు.
      ఇలా జుగుప్స చూపిన జాతులన్నీ ఇస్లాంకు ముందున్న తమ గొప్పతనాన్ని చాటుకున్నాయి. పర్ష్యన్లు తమ గతాన్ని గురించి అతిశయోక్తిగా చెప్పుకోనక్కరలేదు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో నబాటియన్ రసాయనిక పరిశోధకుడు  ఇబ్న వాషియా బాబిలోనియా సాహిత్యాన్ని అట్టిపెట్టి అరబ్బులకంటె తమ నాగరికత విజ్ఞానం గొప్పవని చూపే ప్రయత్నం చేశారు. (గోల్డ్ జిహర్, పుటః 146)
      నబాటియన్ వ్యవసాయం ఇబ్న గ్రంత చౌర్య అనువాదంగా చెపుతున్నారు. ఈజిప్టులో కోప్టులు ప్రాచీన ఈజిప్టు వారి కార్యకలాపాల గురించి రాసిన పుస్తకంలో అరబ్బుల వ్యతిరేక ప్రస్తావన ఉన్నది.
      అన్ని రంగాలలోనూ అరబ్బేతరులు సాధించిన వాటిని పేర్కొన్నారు. అరబ్బేతరులు కళలూ, శాస్త్రాలను మానవాళి అందించిన తీరును షుబైట్లు తెలిపారు. అరబ్బులు ఆటవికంగా ఉన్న రోజులలో తత్వం, ఖగోళం, సిల్కు అల్లికలు బయట ప్రపంచానికి తెలుసు. అరబ్బులు గర్వించదగిందల్లా వారి కవిత్వమే. అందులోనూ గ్రీకులు పైచేయి అనిపించుకున్నారు. చదరంగం వంటి ఆటలు కూడా బయటివారు పెంపొందించారు. అరబ్బులు అరిచే తోడేళ్ళనీ, మీదబడి రక్కే జంతువులనీ, పరస్పర కలహాలతో జీవించే వారని చిత్రీకరణ జరిగింది.  (గోల్డ్ జిహర్, పుటః155)
బాబక్ లో ఖురామి తిరుగుబాటు
    ఖురామీల తిరుగుబాటు అబ్బాసిద్ పాలకులను ఆందోళనలో పడవేసింది. ఈ ఖురామీలు మజ్ దాకిసిం నుండి సామాజిక  మత ఉద్యమాలు చేబట్టి 8వ శతాబ్దంలో ప్రాముఖ్యతలోకి వచ్చారు. 9వ శతాబ్దం ఆరంభంలో బాబక్ ఖురామి నాయకత్వ స్వీకరించినప్పుడు అరబ్బు వ్యతిరేక, ఖలీఫా వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక లొంగుబాటుగా విజృంభించారు. అజర్ బైజాన్ లో అతడికి అరబ్బు వ్యతిరేక ధోరణి గలవారు అనుచరులయ్యారు. తబరిస్తాన్, కొరాసన్, బాల్క్, ఇస్సాహన్, కోమ్, ఆర్మీనియా ప్రాంతాలలో ఖురామీలు ఉండేవారు. అబ్బాసిద్ లను 20 సంవత్సరాలపాటు బాబక్ ప్రతిఘటించాడు. చివరకు అల్ అఫ్సీన్ ను సైన్యాధిపతిగా ఖలీఫా అల్ ముతాసిమ్ నియమించాడు. రెండేళ్ళలో బాబక్ ను వశపరుచుకున్నారు. బహిరంగంగా అవమాన పరిచారు. అల్ ముతాసిమ్ ఉత్తురువులపై 838లో బాబక్ ను క్రూరంగా ఉరితీశారు.
      ఖురామీ ఆధ్వర్యంలో 9వ శతాబ్దంలో కొనసాగినా 11వ శతాబ్దం వరకూ, బాబక్ ఆరాధన కనిపిస్తుంది.
ఇస్లాం ముందు ఔన్నత్యాలు
    19వ శతాబ్దం వరకూ ఇస్లాంకు ముందు ఏమున్నదో తెలుసుకోవటానికి ముస్లిం దేశం ప్రయత్నించలేదు. 1868లో ఈజిప్టు రచయిత, కవి చరిత్రకారుడు, షేక్ రిఫా అల్ తహతవీ ఈజిప్టు చరిత్రను ప్రచురించాడు. గత చరిత్రను బాగా పరిశోధించాడు. అప్పటివరకూ ఈజిప్టు చరిత్ర అరబ్బు దండయాత్రలతో ఆరంభమయ్యేది. అల్ తహతవీ రాసిన చరిత్రలో ఇస్లాం, అరబ్బు వాదంతో గాక, జాతీయ, దేశభక్తి ధోరణిలో ఈజిప్టును గుర్తించారు. మొట్టమొదటిసారిగా తన దేశచరిత్ర అనేక మతపరమైన, భాషాపరమైన నాగరికత మార్పులకు లోనౌతూనే సజీవంగా, నిరంతరంగా ఒక గుర్తింపుతో ఉన్నట్లు అతడు స్పష్టీకరించాడు.
      షుబియ కాలం నుండి మొట్టమొదటిసారిగా ముస్లిం అధికార వాదాన్ని కాదని, ఇస్లాం పూర్వం అజ్ఞానం, ఆటవికత్వం ఉండే సరైన ధోరణి కాదని షేక్ రిఫా చూపాడు. ఈజిప్టు జాతీయతను  ధైర్యంగా చాటాడు. ఇస్లాం నాగరికతకు ప్రత్యామ్నాయాలున్నాయన్నాడు. ఇరాన్, ఇరాక్ లు కూడా ఇస్లామ్ కు పూర్వమే ఎంతో సాధించినట్లుగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇస్లాంకు ముందు ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకుంటే ఛాందస వాదం తగ్గుతుంది. ఈజిప్టులో క్రైస్తవ ఫెరోవిక్కులు గర్వించదగినవారనీ , కోప్టులు తోటి ఈజిప్టువారిగా ఆమోదించదగిన వారనీ గుర్తిస్తే వారి సొంత దేశంలోనే అల్ప సంఖ్యాకులుగా చిత్రహింసలుకు గురయ్యే బాధ తప్పుతుంది. అల్జీరియా వాస్తవ విషయాలనూ, గతాన్నీ బర్బర్, రోమన్, అరబ్, ఫ్రెంచి, ఉన్నత విషయాలనూ తెలుసుకుంటే మంచిదని స్లిమేన్ జగిడోర్ అన్నాడు. టెలిరమ. 1992 జూలై) మార్పు, పాతను కొనసాగించుట అనేది గుర్తిస్తే ముస్లిం సమాజాలు ముందుకు సాగుతాయి. ఇస్లాంకు ముందు ఉన్న స్థితినీ, యూరోప్ వలస వాదాన్నీ గమనంలోకి తీసుకోవాలి.
      ఇస్లాంకు ముందు ఉన్న గతాన్ని కావాలని అశ్రద్ధ చేయటంతో ముస్లిం ప్రపంచం వక్ర మార్గంలో నడిచింది. నయపాల్ ఇలా అన్నాడు. మత విశ్వాసం గతాన్ని తుడిచిపెట్టింది. దీనివలన చరిత్ర భావన దెబ్బతిన్నది. మానవ ప్రవర్తన, మంచి ఆదర్శాలూ పాడయిపోయాయి. నిజమైన ఒకే విశ్వాసం అనే సంకుచిత దృష్టి ఆవరించింది. సత్యం, సాహసం, మన పక్షానే ఉన్నాయనీ, ప్రతిదీ ఆ పరిధిలోనే చూడటం ఆరంభించారు. విశ్వాసం విలువలను మార్చివేసింది. మానవ ప్రవర్తనను నిర్ణయాలనూ పక్కదారులు పట్టించింది. (న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్, 1991 జనవరి 31)
      ఇలాంటి అసలైన మతం క్రూరంగా స్థాపించి దానికి దివ్యత్వాన్ని ఆపాదించి నడిపారు.
      ప్రపంచాన్ని విశ్వాసపూరితులు, ఆదిలేనివారూ అని రెండుగా విభజించి చూచినందున సెక్యులర్ దృక్పథంలో ఉన్న అరబ్బు మేథావులు సైతం మధ్య ప్రాచ్య దుస్థితిని పాశ్చాత్యుల మీదకు నెట్టేశారు.
యూరోప్ సామ్రాజ్యవాదం
      ఫ్రెంచివారు అల్జీరియాను ఆక్రమించుకున్నారు. వారికి ముందు అరబ్బులూ, టర్కీవారు ఆపని చేశారు. దేశాన్ని వలసగా మార్చి చాలా భూమిని ప్రెంచివారు భుక్తం చేసుకున్నారు. అదే పని లోగడ అరబ్బులూ, టర్కులూ చేశారు. లోగడ చేసిన వారి ఘోరాలకంటే ఫ్రెంచివారి అవసరాలు ఎక్కువేమీ కాదు. ఫ్రెంచివారు అణచివేతకు గురిచేసి అల్జీరియాను పేదరికంలో పడవేశారు.  1962లో ఆవిర్భవించిన అల్జీరియా, స్వేచ్ఛకూ, సంపన్నతకూ, న్యాయానికీ ప్రతిబింబంగా ఉన్నదా ? ఫ్రెంచి రోజులకోసం తిరిగి చూచే అల్జీరియన్లు ఎందరులేరు ?
      (కెడోరి, టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, 1992, జూలై 10)
      ఫ్రెంచి వారు రాకముందు అల్జీరియా ఏ నిర్వచనంతో చూచినా అనాగరకంగా ఉన్నది
      (హూగ్ థామస్ యాన్ అన్ ఫినిష్డ్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. పేజి 602, లండన్ 1981)
      భారతీయులలో చదువుకున్నవారు, కొంత చారిత్రక సత్యం పట్ల గౌరవం ఉన్నవారూ, బ్రిటిషుపాలనలో ఎన్ని లోపాలున్నా సంక్షేమాన్నీ, సంతోషాన్నీ పెంపొందించినదనటంలో వెనకాడరనుకొంటాను.
      (నీరద్ చౌదరి దై హాండ్ అనార్క్, ఢిల్లీ 1987, పుట 774)
      యూరోప్ సామ్రాజ్య వాదానికి సంబంధించిన చారిత్రక అవగాహన అవసరం. భారతదేశాన్ని ఉదాహరణగా చూద్దాం. 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత చరిత్రకారులు జాతీయ చరిత్రలు గుర్తించి, బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎలాంటి ఉపయోగం జరగలేదన్నట్లుగా రాశారు. 1960-70 ప్రాంతాలలో దేశంలో వైఫల్యాలు, లోపాలు, బ్రిటీషువారి శని గ్రహం వలన, దోపిడీ వలన సంభవించాయన్నారు. 50 ఏళ్ళ తరువాత బ్రిటీషువారి మూలంగా ఇండియాకు సమకూరిన ఉపయోగాలను ఒప్పుకోవటం మొదలుపెట్టారు. రాడికల్ హ్యూమనిస్ట్ తార్కొండే ఈ విషయం ఇలా రాశారు. భారత జాతీయ వాదులు ఒక భ్రమను సృష్టించి బ్రిటీషువారు రాకముందు భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్నదనీ, విదేశీ ఆధిపత్యమే దిగజారుడుకు కారణమనీ అన్నారు. ఇది ఆధార రహితం. భారతదేశం అంత గొప్పదైతే, 6వేల మైళ్ళ నుండి నావలలో  వచ్చిన కొద్దిమంది వ్యాపారస్తులు అంత సులభంగా దేశాన్ని ఆక్రమించుకునేవారు కారు. నియంతృత్వం, అన్యాయం, అరాచకత్వం దేశంలో తాండవిస్తుండగా అత్యధిక సంఖ్యాకులు బ్రిటీషువారి చట్ట పాలనను ఆహ్వానించారు. తొలి దశలో వారి ప్రభావం చాలా ఉన్నది. అది ఈ శతాబ్దం ప్రారంభంలో అభ్యుదయ పాత్ర నిర్వహించలేక పోయింది. బ్రిటిషువారు ప్రవేశపెట్టిన స్వేచ్చ, మానవ గౌరవం, వివేచన వలన ఆలస్యంగానైనా పునర్వికాసం పలికింది. మత మూఢత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. సతీ సహగమనం పోవాలనీ విధవలు తిరిగి వివాహం చేసుకోవచ్చనీ, స్త్రీలు చదువుకోవచ్చుననీ, బాల్యవివాహాలు కూడదనీ, అంటరానితనం నిర్మూలించాలనీ వివిధ ఉద్యమ రూపాలు దాల్చాయి. (వి.ఎం.తార్కుండే, రాడికల్ హ్యూమనిస్ట్, ఢిల్లీ, 1983)
      పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలనే బ్రిటీషువారి నుండి సంక్రమించింది. అరబ్బులకు ఇలాంటి చరిత్ర, సంస్కృతిలో ఆసక్తిలేదు. ఇందుకు భిన్నంగా ఇండియాలో బ్రిటీషువారు ఎంతో శ్రద్ధతో ముస్లిం, హిందు, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతుల గురించి పరిశోధన చేసి గ్రంథస్తం చేశారు. లార్డ్ కర్జన్ వంటి సామ్రాజ్యవాదులు తాజ్ మహల్ తో సహా అనేక శిల్పాలను కాపాడారు.
      యూరోప్ వారు సామ్రాజ్యవాద పాలనలో ఎన్ని లోపాలు చూసినా ప్రజలకు అనేక ఉపయోగాలు కూడా జరిగాయి. కొన్ని ఘోరకృత్యాలున్నప్పటికీ మొత్తం మీద యూరోప్ వారు మానవతను చూపారు. యూరోప్ దండయాత్రలు ఇస్లాంను దెబ్బతీశాయి. ముస్లింలు ఓడిపోవటానికి వారి మూర్ఖ సిద్ధాంతం కూడా తోడ్పడింది.
      ముస్లింలు ఇస్లాం సరిహద్దులను విస్తృత పరచడానికీ, నమ్మకం లేనివారిని అణచటానికి ప్రయత్నించారు. అది పవిత్ర యుద్ధం. అలాంటి నమ్మకంతో ముస్లింలు ఆత్మ విశ్వాసం పొంది అధికులమనే ధోరణి ప్రదర్శించారు. యూరోప్ క్రైస్తవ రాజ్యాల చేతుల్లో ఓటమి పరంపరలు చూచిన ముస్లింల అత్మ గౌరవం సన్నగిల్లింది. నైతిక మేథస్సు సంక్షోభం వచ్చింది. ముస్లింలకు దేవుడు ప్రేరేపణ విషయంలో ఎంత సత్యం ఉన్నదనేది సందేహించవలసి వచ్చింది. (లెవీస్, ది వరల్డ్ ఆఫ్ ఇస్లాం, కెడోరి వ్యాసం, పుట 322, లండన్ 1976) ముస్లిం మేథావులు పాశ్చాత్య లోకంపై ద్వేషాన్ని ప్రబలింపజేశారు. అలా చేయనివారు ఒకరిద్దరే ఉన్నారు. ఈ ద్వేషభావం  వలన మానవ హక్కులూ, చట్టబద్ధపాలన, సంస్కరణ, మార్పుకూడా రాకుండా పోయాయి.
      గల్ఫ్ యుద్ధంలో పాశ్చాత్యులకు వ్యతిరేకంగా నిలిచిన సద్దాం హుస్సేన్ అదే భ్రమలో ముస్లింలూ, అరబ్ మేథావులూ సద్దాంహుస్సేన్ ను సమర్థించారు. అందులోనే ఇస్లాం వైఫల్యం కనిపిస్తుంది. పాశ్చాత్యులతో పోలిస్తే తాము తక్కువ వారమనే ధోరణి కూడా ఇందులో ఇమిడి ఉన్నది. అరబ్బులూ, కుర్దులూ, సున్నీలూ, షియాలూ, ముస్లింలూ, యూదులూ వేల సంఖ్యలో హతంగావడానికి కారకుడు సద్దాంహుస్సేన్, అలాంటి వ్యక్తిలో ముస్లింలు ఆశాకిరణాలు చూస్తే అశ్చర్యమే. అత్మ విమర్శ ఈ మేథావులలో లోపించింది. వారు, మనమూ అనే తేడాతో ఇంకా పోరాటాలు చేస్తున్నారు. ముస్లిం లోకంలో వైఫల్యాలకు పాశ్చాత్యలోకాన్నీ, ఇజ్రాయల్ నూ, యూదుకుట్రనూ చూపుతున్నారు. కనుక మాకియా ఇలా రాశాడు. (క్రూయల్టీ అండ్ సైలెన్స్, 235, పుట. న్యూయార్క్, 1993)
      పాత అలవాట్లు ఒక పట్టాన పోవు. ఇతరులపై అన్నిటికీ నేరారోపణ చేయటం అలవాటుగా మారిపోయింది. పాశ్చాత్య లోకాన్నీ, ఇజ్రాయల్ నూ, అరబ్బు మేథావులు నిందించటం పరిపాటయిపోయింది. దీనివలన పూనకం వచ్చిన రీతిలో ప్రవర్తించటం తప్ప మరేమీ సాధించలేక పోతున్నారు.
      నేటి అరబ్బులు మేథావి పరోక్షంగా అలోచించేటట్లు అరబ్బులను ప్రభావితం చేస్తున్నారు. ద్వేషాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ప్రేమకు దూరమవుతున్నారు. గతాన్ని స్వర్ణయుగంగా భావించే భ్రమలో బతుకుతున్నారు. ఒక ముస్లిం వందమంది కాఫిర్లను జయించగలడనే భ్రాంతిలో ఉన్నారు. కనస్ మాకియా కోరినట్లు మార్పు రావాలంటే ఆత్మవిమర్శ అవసరం. ఫాద్హ్ జకారియా ఇలా రాశాడు. మన వెనుకబడినతనాన్ని గమనించి, మన వ్యవస్థను ఆత్మవిమర్శ చేసుకుంటూ పోవాలి. ఇతరులెవరూ మనల్ని ఏదో చేశారనుకునే దానికంటే మనల్ని మనం నిశిత పరిశీలనకు గురిచేసుకోవాలి  (రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్, పుట 117)
బర్బర్ జాతీయవాదం
      చరిత్ర పుట్టకముందు నుండే ఉత్తర ఆఫ్రికాలో బర్బర్ మాట్లాడే ప్రజలు నివశించారు. క్రీ.పూ. 7000 నుండి ఉత్తర ఆఫ్రికాలో వీరు స్థిరపడ్డారు. కార్తేజ్ లో వీరికి సంబంధం ఉన్నా, మొత్తం మీద స్వతంత్ర జీవనం గడిపారు. తరచూ వీరి నాయకులు తెగలను ఏకం చేసి, సామ్రాజ్యాన్నిస్థాపించారు. క్రీ.పూ. 238-148లో తూర్పు సుముదియన్ మశైలీ రాజైన గాయ  కుమారుడు మాసినిస  ఉన్నాడు. అతడు కార్తేజ్ లో పెరిగి రోమన్ల పక్షాన పోరాడాడు. జామాలో రోమన్లు గెలవటానికి అతని దళం కీలక పాత్ర వహించింది. క్రీ.పూ. 202 అతడు బర్బర్ తెగలను ఐక్యపరచి సుమిడియా రాజ్యాన్ని స్థాపించాడు.
      అరబ్బులు రాకముందు వీరి నాగరికత, భాష, చరిత్ర ఉన్నతంగా కొనసాగినాయి. ఆధునిక బర్బర్ మేథావులు అరబ్బు సామ్రాజ్య వాదాన్ని, ఇస్లాంను నిరాకరిస్తున్నారు.
      బర్బర్ల స్వాతంత్రేచ్ఛను రోమన్లు, వాండల్స్, బైజాంటియన్లు ఆపలేకపోయారు. అరబ్బుల రాకవలన కూడా బర్బర్లపై తొలుత ఎలాంటి ప్రభావమూ లేదు. ముస్లిం సేనాధిపతి ఒక్బానఫీ ఈ తెగలను అదుపులో పెట్టలేకపోయారు. 683లో తహూదా వద్ద ఒక్బాను 300 మంది అనుచరులనూ బర్బర్ నాయకుడు కుశైలా హతమార్చాడు. క్రమేణా బర్బర్లు తమ ప్రయోజనార్థం ఇస్లాంలోకి మారుతూ వచ్చారు. బర్బర్ల సహాయంతో తాలిక ఇబ్న జైద్ వంటివారు స్పెయిన్ ను జయించనారంభించారు. ఉత్తరాఫ్రికాలో అరబ్బుల దండయాత్రలు పూర్తి అయ్యాయి.
      పర్ష్యా, సిరియాలలో వలె అరబ్బులు, కాని ముస్లింలపట్ల తక్కువ చూపు చూచినట్లే బర్బర్లు కూడా తమకు న్యాయం జరగలేదని భావించారు. అరబ్బులపై తిరుగుబాటు చేశారు. అల్మోరా విద్దులు (1056-1145), అల్మోహద్దుల (1130-1269) మారినిద్దుల 11, 12 శతాబ్దాలలో బర్బర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
      అఫ్రో, ఆసియా భాషల కుటుంబానికి చెందిన బర్బర్లు సుమారు 300 వరకూ వివిధ లిపితో కూడిన భాషలను వాడుతున్నారు. ఒక కోటి ఇరవై లక్షలమంది బర్బర్ భాషను వాడేవారు. ఈజిప్ట్, లిబియా, టునీషియా, అల్జీరియా, మొరాకో, చాద్, మాలీ, నైజర్, మారిటానియాలలో ఉన్నారు. కాబిలే, షావియా భాషలు అల్జీరియాలో మాట్లాడుతారు. మొరాకోలోన్లూ, తమాజిత్ రిఫ్ భాషలు మాట్లాడుతారు. సహారా దేశాలలో తమాహక్ భాష మాట్లాడుతారు. వీరు రాసే టిఫ్ నాగ్ లిపి క్రీ.పూ.200 సంవత్సరాలకు చెందింది.
అరబ్బు సామ్రాజ్య వాదాన్ని తృణీకరించిన ఆధునిక బర్బర్లు
    కాతిబ్ యాచినీ (1929-1989) అల్జీరియా రచయిత, ప్రసిద్ధ మేధావి, ఇస్లాం అరబ్ సంస్కృతిక సామ్రాజ్య వాదాన్ని నిరాకరించి తన పూర్వీకుల బర్బర్ భాషను సమర్థించాడు. మతం పట్ల సందేహాలను వ్యక్తపరిచాడు. నేను ఖురాన్ పాఠశాలకు వెళ్ళాను. నాకు ఆ మతం నచ్చలేదు. ఖురాన్ అర్థం చెప్పటానికి అరికాళ్ళపై బెత్తాలతో కొట్టేవారు. ఫ్రెంచి పాఠశాలలో ఉపాధ్యాయిని మమ్మల్ని తల్లిలాగా చూచి, స్కూల్ పట్ల ఆసక్తి పెంపొందింపజేసింది. (లమాండే, 1989, అక్టోబర్ 31)
      అల్జీరియా నుంచి వచ్చిన ఫ్రెంచివారికి బార్ రేడియో స్టేషన్ స్థాపించారు. అందులో యాచినీ మాట్లాడుతూ తాను అల్జీరియా వాడిననీ, ముస్లింనూ, అరబ్బునూ కాదని అన్నాడు. అవాల్ పత్రికా గోష్ఠిలో ఇస్లాం పట్ల తన జుగుప్సను వెల్లడించాడు. (1987) అరబో ఇస్లాం అల్జీరియా వారిమని చెప్పుకునేవారు. వారికి వారే వ్యతిరేకులు. అల్జీరియాకు కూడా వ్యతిరేకులే. ఇస్లాం కత్తిని చూపి అలాంటి అల్జీరియాను స్థాపించింది. కన్నీటితో, రక్తంతో, అల్జీరియా తడిసిపోయింది. ఇక్కడ పరమళాలు, మాధుర్యాలు లేవు. అణచివేత, హింస, జుగుప్స ఉన్నాయి. ఫలితాలు అనుభవిస్తున్నాం. (లమాండే, 1994 మే. 20) ఒకనాడు అల్జీరియా మళ్ళీ బర్బర్లు మాట్లాడిన భాషలో తమేజగ  అని పిలవాలి. ప్రపంచానికి  అశాంతిని అందించిన మూడు మతాలపట్ల యాదినీ పరుషవాక్యాలు పలికాడు. వాటివల్లనే ప్రజలకు చెడు సంభవించిందన్నారు. అల్జీరియా అశాంతి అక్కడే ఆరంభమయిందన్నారు. రోమనులు, క్రైస్తవులను గురించి ఒకప్పుడనుకునే వాళ్ళమనీ, ప్రస్తుతం అరబ్, ఇస్లాంలపై సుదీర్ఘ పోరాటం జరపాలనీ అన్నాడు.
      1989లో చనిపోకముందు యాదినీ, బర్బర్ గాయకుడు హైత్ మెంగులెత్ పుస్తకానికి పీఠిక రాశాడు. ప్రాచీన కబాలే కవిత్వాన్ని గురించి 1980లో ఏర్పాటు చేసిన అల్జీరియా సమావేశాన్ని నిషేధించిన విషయం ప్రస్తావించారు. బర్బర్లు ఆ నిషేధాన్ని వ్యతిరేకించి తమ భాషకోసం కొట్లాడారు. ఫ్రెంచి అల్జీరియా కోసం ఒకప్పుడు బలవంతంగా ఫ్రెంచి నేర్చారు. అలాగే నిర్బంధంగా అరబిక్కును అమలు పరిచి మాతృభాష తమాజిత్ ను మాట్లాడకుండా చేశారు. అరబ్బు జాతి మిథ్యా భావనతో అల్జీరియాను అణచివేశారు. అల్జీరియా భాష అరబిక్ అనే భ్రాంతిని వ్యాపింపజేసింది. శతాబ్దాల విదేశీ ఆధిపత్యం ఉన్నా తమాజిత్ వారి మాతృభాష, ఫ్రెంచి అల్జీరియాను సాయుధ పోరాటంలో ఒదిలించాం. కాని అరబ్ ఇస్లామిక్ అల్జీరియా అనే విధ్వంసక భ్రమలో కూరుకుపోయాం. 104 సంవత్సరాల ఫ్రెంచి అల్జీరియా పోయింది. అరబ్ - ఇస్లాం అల్జీరియా 13వ శతాబ్దాల భారాన్ని తెచ్చిపెట్టింది. మనం అరబ్బులమని అనుకోటమే వైమనస్యతకు దారితీసింది. అరబ్బు జాతి అరబ్బు దేశం లేదు. పాలకులు కొరాన్ పవిత్ర భాషను అడ్డం పెట్టి, సొంత విషయాన్ని తెలుసుకోకుండా చేస్తున్నారు. అయితే మెంగూలెత్ బర్బర్ భాషలో రాస్తే విదేశీయుడుగా చూస్తున్నారు. లమాండే (1989       నవంబరు 3)
1994, అల్జీరియాలో బర్బర్లు
    బర్బర్లు తమ భాషకోసం 1980లో సాగించిన పోరాటాన్ని గుర్తుచేస్తూ 1994 ఏప్రిల్ లో ప్రదర్శనలు జరిపారు. బర్బర్ల గుర్తింపు కావాలన్నారు. బహుళ వాదాన్ని కోరుతూ బర్బర్ల భాషను, ద్వితీయ, జాతీయ భాషగా గుర్తించాలన్నారు. మానవ హక్కుల సంఘం అల్జీరియాలో ఆవిర్భవించటానికి బర్బర్ సాంస్కృతికోద్యమమై నాంది పలికింది. ఇస్లాం భావాలకూ, మానవహక్కులకూ పొందిక లేదని బర్బర్ సంస్కరణ వాదులు భావించారు. తమ దేశం, ఆటవిక దశలో కూరుకుపోకుండా ఫాసిస్ట్ ధోరణి రాకుండా వ్యతిరేకించాలని బర్బర్లు తలపెట్టారు. (1994, ఏప్రిల్ 20 ఇన్ఫర్మేషన్)
----
అనువాదం
        నరిసెట్టి ఇన్నయ్య
 

No comments:

Post a Comment