హోమియోకు సైంటిఫిక్ ఆధారాలు లేవా?


హోమియో సృష్టికర్త హానిమన్. పూర్తిపేరు శ్యామ్యూల్ హానిమన్. జర్మన్ దేశస్తుడు. బహు భాషలు నేర్చిన వైద్యుడు. ఆనాడు అలోపతి వైద్యం చదివాడు. ఆ వృత్తిలో కనిపించిన దోషాలు, రోగాలు తగ్గించడానికి ఆవలంబించే పద్ధతులు ఆయనకు నచ్చలేదు. ముఖ్యంగా శరీరం నుండి రక్తం తీసే రీతులు చూసి అసహ్యపడ్డాడు.
క్రమేణా మార్గంతరాలు ఆలోచించాడు. అప్పట్లో మలేరియా వ్యాధి ప్రబలి ఉండేది. దీనికిగాను క్వినైన్ వాడేవాడు.
హానిమన్ ఒకసాకి సింకోనా బెరడు తిన్నాడు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో సింకోనా బెరడు విస్తారంగా లభిస్తుంది. అది తీసుకున్నప్పుడు హానిమన్ చలితో వణికి పోయాడు. మలేరియా జ్వరలక్షణాలు వచ్చాయి. జ్వరం నయం చేయడానికి ఉపకరించే వస్తువు, ఆరోగ్యంగా ఉన్నవారు తీసుకుంటే, రోగలక్షణాలు రావడం విశేషమని భావించాడు. ఇలాంటి రీతిలో ఇతర రోగాలకు వాడ వస్తువులతో ప్రయోగించి చూచాడు. అంటే రోగలక్షణాలు, ఔషధ లక్షణాలు ఒకటే  అయితే, దీనిని సూత్రీకరించి, సారూప్య సూత్రం చెప్పాడు.
అయితే ఔషధం బాగా పనిచేయడానికి దాని శక్తి పెంచాలనుకున్నాడు. ఔషధాన్ని పలచబరిచి బాగా కుదుపుతూ పోతే, శక్తి పెరుగుతుందని హానిమన్ నమ్మాడు. తాను పరిశోధించే  ఔషధశక్తిని, పనిచేసే తీరును పరిశీలించ నారంభించాడు. కొన్ని స్వయంగా తీసుకున్నాడు. అలాగే ఇతరులకు యిచ్చాడు. అలా తీసుకున్నప్పుడు కొన్నాళ్ళపాటు కనిపించే లక్షణాలన్నీ రాసుకున్నాడు. ఇతరులనూ రాయమన్నాడు. వాటినే రుజువులుగా హానిమన్ స్వీకరించాడు. అలా క్రోడీకరించిన వాటిని ఆరు సంపుటాలుగా ప్రచురించాడు. అదే హోమియో పవిత్ర గ్రంథం అయింది.
హోమియో ఔషధాలు తయారు చేయడానికి, మొక్కలు, లోహాలు, కొన్ని ఆహారపదార్థాలు, కొన్ని రోగాలకు మూలమైన క్రిములు స్వీకరించాడు. అలా స్వీకరించిన వస్తువును నీటితోగాని, సారాయితోగాని కలుపుతారు. మూల వస్తువును మదర్ టింక్చర్ అంటారు. ఒక కూజాలో దీనిని అట్టిపెడతారు. నీటిలో అట్టిపెట్టిన కొన్నాళ్ళకు మూలవస్తువు తొలగిస్తారు. ఆ నీటినే మదర్ టింక్చర్ అంటారు. దానిని క్రమంగా పలచబరుస్తూ ఉంటారు. ఒక భాగం మూల టింక్చర్ కు 9 భాగాల నీటిని కలుపుతారు. బాగా కుదుపుతారు. అలా కుదిపినప్పుడు శక్తి పెరుగుతుందంటారు. మళ్ళీ  అందులో ఒక భాగం తీసుకుని 9 పాళ్ళు నీరు కలిపి కుదుపుతారు.  అలా కుదుపుతూ, కుదుపుతూ పలచబరుస్తూ పోయి, తరువాత చక్కెర బిళ్ళలో కలుపుతారు.
100 కణాలు మూల పదార్థం వున్నది క్రమేణా ఏ ఒక్క కణం లేని స్థితికి పోతుంది. అది 3x స్థాయి.
30c  అనబడే హోమియో ఔషధం సిద్ధం చేయడానికి 30 సార్లు పలచబరచి, ప్రతిసారీ కుదుపుతూ పోతారన్నమాట. అంటే మూల పదార్థాన్ని శక్తివంతం చేయడానికి చేసిన పద్ధతిలో చివరకు మూలకణాలు వుండవు. అంటే రోగులకు యిచ్చే ఔషధ టింక్చర్లో కేవలం నేడు తప్ప ఎలాంటి కణాలూ మిగలవు.
నీటిలో కరగని మూలపదార్థాలను హోమియో వారు, నూరడం, పొడి చేయడం ద్వారా పలచబరుస్తారు. అప్పుడు చక్కెర కలుపుతారు.  ఇది లోహాల వంటి వాటికి అన్నమాట. 
ఇంతకూ హోమియో ఔషధంలో ఎలాంటి ఔషధకణం లేకున్నా ఎలా పనిచేస్తుంది. వారిచ్చే ఔషధ పిల్, టింక్చర్కు జ్ఞాపక శక్తి వుంటుందా? దివ్యశక్తి వుంటుందా? ఎనర్జీ వుంటుందని వారినమ్మకం. దీనికి ఆధారాలు, రుజువులు లేవు. హానిమన్ ప్రకారం హోమియో చికిత్స వ్యక్తి లక్షణాలకు ప్రాధాన్యతయిస్తుంది. రోగాన్ని నయం చేయడం గాక, వ్యక్తి  స్వభావం, లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటామంటారు. కనుకనే రోగిని సుదీర్ఘంగా ఇంటర్వూ చేసి, అన్ని లక్షణాలు రాసుకుంటారు.
అప్పుడు హోమియో మెటీరియా మెడికోలో యీలక్షణాలకు పోలినది చూచి, ఔషధ నిర్ణయం చేస్తారు. హోమియో ప్రకారం అన్ని రోగాలకూ చికిత్స ఉంది.
హానిమన్ తన కాలంలో కొన్ని చికిత్సలు పేర్కొనగా, తరువాత అనుచరులు వాటిని పెంచుతూ వేల సంఖ్యకు చేరారు. రాను రాను మూల విధానాలకు మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కాని ‘’జీవశక్తి’’ సూత్రం పై నమ్మకం మాత్రం మారలేదు.
హోమియోలో అన్ని రోగాలనూ సిఫిలిస్, సోరోసిస్, సైకోసిస్ అనే మూడుగా వర్గీకరించారు.
హోమియో శాస్త్రీయం కాదనే విమర్శ వుంది. ముఖ్యంగా హోమియో చెప్పే, జీవశక్తి  (వైటల్ ఫోర్స్), కుదుపుతూ పలచబరుస్తూ పోతే శక్తి పెరుగుతుందనేది శాస్త్రీయ పరిశోధనకు గురి చేస్తే ఎక్కడా నిలబడడం లేదు.
పాశ్చాత్య దేశాలలో కొందరు సైంటిఫిక్ పద్ధతులలో హోమియోనూ రుజువు చేయడానికి తిప్పలు పడి, చతికిలబడ్డారు.  అయినా హోమియోకు బలమైన లాబీ వుంది. పాశ్చాత్య దేశాలలో హోమియో ఆటుపోటులు జరుగుతూనే ఉన్నాయి. హోమియో వ్యాపారం జోరుగా సాగుతున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలలో హోమియో డిగ్రీలు యిస్తున్నారు. నమ్మకానికి ఎంత విలువ వుందో దీనివలన తెలుస్తుంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాలలో కొందరు హోమియోను శాస్త్రీయం అని రుజువు పరచడానికి కృషి చేశారు. ఒక స్థయిలో రుజువు అయినట్లు పరిశోధనా ఫలితాల వ్యాసాలను మెడికల్ మేగజైన్లకు పంపారు. లాన్సట్ వంటి ప్రతిష్ఠాకరమైన సైన్స్ పరిశోధనా పత్రికలు వాటిని ప్రచురించేసరికి, సైన్స్ లోకం విస్తుపోయింది. తీరా ఆరా తీస్తే పరిశోధనలు అన్నీ మోసపూరితంగా, కృత్రిమంగా తయారు చేశారని తేలిందిపత్రికలు క్షమాపణలు చెప్పాయి. జేమ్స్ రాండీ వంటివారు మిలియన్ డాలర్ల అవార్డు పెట్టి, హోమియోను శాస్త్రీయం అని నిరూపించమన్నారు. నిరూపించామని ప్రగల్భాలు పలికినవి, బూకరింపులని తేలింది.
అయినా హోమియో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఇండియా, అమెరికా బెల్జియం, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లో సాగిపోతున్నది. ఎందుకని?
నమ్మకం, మూఢవిశ్వాసం ఒక్కటే కారణం కాదు. అలోపతిలో వున్న దోషాలు, పాలనా లోపాలు, వ్యయం సాకుగా చూపుతున్నారు. హోమియోవారు ముందుగా అలోపతిని విమర్శించడంతో రోగిని ఆకర్షిస్తారు. తరువాత క్షుణ్ణంగా ఇంటర్వూ చేయడంతో మరియు బుట్టలో పడేస్తారు. దీనికి తోడు రోగిలో వున్న విశ్వాసం, మూఢనమ్మకం హోమియోకు పెట్టుబడిగా పనికొస్తుంది.
ఇంతకూ మొదటి ప్రశ్న అలాగే మిగిలిపోయింది. మందు లేని మందు ఎలా రోగం నయం చేస్తుంది?
మేరీమాత కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. వినాయకుడు పాలు తాగుతున్నాడు. అయ్యప్ప కొండపై జ్యోతి వెలుగుతుంది. అల్లా ఒక్కడే దేవుడు. వెంకటేశ్వర స్వామికి మొక్కితే తీరుస్తాడు. షిరిడీ సాయి మహత్తులు నిజమైనవి. ఈ నమ్మకాలు చదువుకున్నవారిలో చదువురాని వారిలో వున్నాయి. అలాగే హోమియో వలన రోగాలు నయం అవుతాయనడం కూడా.
దీనికి ఆధారంగా కొందరు సినిమా తారలు. క్రికెట్ ఆటగాళ్లు, నాయకులకు నయం అయినట్లు చెబుతారు.
కొందరు ప్రముఖుల సర్టిఫికెట్లు ప్రదర్శిస్తారు.
నేడు హోమియో వైద్యులు కొందరు ఆధునిక కంప్యూటర్లు. పరికరాలు వాడుతున్నారు. వీటివలన రోగ లక్షణాలు తెలుసుకోవడం శాస్త్రీయంగా ప్రదర్శిస్తున్నారు. ఎలక్ట్రో హోమియో అందులో ఒకటి.
కాని హోమియో మూలతత్వం, మందు మాత్రం శాస్త్రీయం కాదనేది స్పష్టం.
ఆధునిక వైద్యాన్ని విమర్శించేటప్పుడు ఒక విషయం మరచిపోతున్నారు. అది సంపూర్ణతను ప్రదర్శించడం లేదు. లోపాలను ఒప్పుకుంటుంది. నిత్య నూతనంగా పరిశోధన చేస్తూ పోతుంది. తప్పులను దిద్దుకుంటూ సాగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో తప్పులు ఒప్పుకొని దిద్దుకుంటూ పోవడం కీలక అంశం.
అది హోమియోలో వుండదు. హోమియో అన్ని విధాలా యిప్పటివరకూ అశాస్త్రీయం.
హోమియో వలన ప్లాసిబొ ప్రభావంతో తత్కాలిక ఉపశమనాలను చికిత్స చూపడం దారుణం. రోగంలో హెచ్చుతగ్గులు ప్రతి రోగికీ వుండగా, వాటిని ఆసరాగా హోమియో తమ గొప్పతనం అని చాటడం తప్పు.
ఇంతకూ హోమియోకు మూలధనం నమ్మకమే. శాస్త్రీయ రుజువులు అడగరాదు.
భారతదేశంలో రిజిష్టర్ చేయించుకోకుండా ప్రాక్టీసు చేసే హోమియోలకు లెక్కలేదు. ఇంగ్లండ్ లో హోమియో ప్రాక్టీసుకు ముందు కనీసం ఎం.బి.బి.ఎస్. చదవాల్సిందే. ఇక అమెరికా హోమియో మందులు విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు. దీనికి అదుపు లేకపోవడానికి రాజకీయ లాబీ కారణం. ఇది 1938 నుండీ నడుస్తున్న చరిత్ర.
హోమియో గురించి ఇంటర్నెట్ లో చూడదలచినవారు Quackwatch.com చదవదలచినవారు Trick or Treatment by Simon Singh, Edzard Erust (2008 W.W.Norton & Co. Publication) గ్రహించవచ్చు.
హైదరాబాద్ లో డా. పి.ఎం. భార్గవ (సైంటిస్ట్) నేను పత్రికా సమావేశంలో హోమియోను విమర్శిస్తే, హెమియో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు దాడి చేశారు. శాస్త్రీయ రుజువులు చూపగలవారు రౌడీలుగా మారడం దేనికి ?
హోమియో మందును మీ యిష్టం వచ్చిన లాబ్ (పరిశోధనాలయం)కు తీసుకెళ్ళి, టెస్ట్ (పరీక్ష) చేయించండి.  ఏదైనా మందు వుందేమో గమనించండి.
కొందరు టీకాల వైద్యం పద్ధతి హోమియోకు పోల్చి చెప్పబోతారు. కాని టీకాల మందులో మందు వున్నది. హోమియోలో లేదు. అదే ప్రధాన తేడా
నేను బ్రస్సెల్స్ వెళ్ళినప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో హోమియోను గురించి చెబితే చాలా ఆశ్చర్యపోయి, అనేక ఆసక్తికర ప్రశ్నలు వేశారు.  

 Innaiah Narisetti

No comments:

Post a Comment