ఆనందమయ జీవనం-7

జీవితమే సఫలము


ఆనందమయ జీవనం మానవవాదుల దృష్టిలో అంతర్గతంగా వుంటుంది. అదే సుఖప్రదం కూడా. గ్రీకులు దీనిని సంక్షేమం అన్నారు. వ్యక్తి స్వభావాన్ని బయటపెట్టటమే యిందలి అంశం. దానినుండి పొందే ఆనందం జీవితం అంతటికీ చెందినదేగాని, ఏవో కొన్ని క్షణాలకు పరిమితం కాదు. వ్యక్తులు తమ కోర్కెలను అదుపులో వుంచుకోవాలి. ఆనందమయ జీవనంలో బ్రతకాలనే కాంక్ష, ఉన్నతదశలో ఉత్సాహం, సాహసోపేత చర్యలకు పూనుకోవడం యిమిడివుంటాయి.
  • మన అవసరాలు, కోర్కెలు తీరినప్పుడు ఆనందం పెరుగుతుంది. మన లక్ష్యాలు, ఆదర్శాలు సృజనాత్మకంగా వెల్లడౌతున్నప్పుడు కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. అందులో ఔన్నత్యం, సమగ్రత, ప్రతిభ, సాధనలు బయటపడతాయి. అలాంటి వ్యక్తులు జీవితాన్ని ఉత్సాహభరితంగా కొనసాగిస్తారు. వ్యక్తిత్వాలు వికసిస్తాయి. అప్పుడే సంపూర్ణత వైపుకు దారితీయడం సాధ్యం.
  • వ్యక్తులు తమ వాంఛల్ని, ప్రతిభను, కలల్ని, ఆదర్శాలను సాధిస్తుంటే ఆనందం అవధులు దాటుతుంది. పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, సహచరులు మన జీవితానందంలో భాగం పంచుకుంటే ఆనందం యింకా విప్పారుతుంది. నైతికాభివృద్ధిలో యీ విషయం స్పష్టపడుతుంది. ఇతరుల అవసరాలను మెచ్చుకుంటాం. వారికోసం త్యాగం చేస్తాం. వారి అవసరాల కోసం మనమూ శ్రమపడతాం.
  • జీవన వికాసంలో ఆనందం ఎంతో కొట్టొచ్చినట్లుంటుంది. దీనినే ప్రతిభ, సంతోషం అంటాం.
  • శీలం, గ్రహణదృష్టి, సాహసం, సృజన, శ్రద్ధ వహించడం కూడా ఆనందంలో భాగమే.
  • అంత మాత్రాన బాధల్ని నిస్పృహల్ని పక్కనబెడుతున్నట్లనుకోరాదు. అలాగే విషాదాలను, చెడును కూడా గ్రహిస్తాం. అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలను స్వీకరిస్తాం. నయంగాని జబ్బులు, మరణాలు వుండనే వున్నాయి. ద్రోహచర్యల్ని ఎదుర్కొంటాం.
  • పరిణతి చెందిన వ్యక్తులు బాధాకరమైన పరిస్థితులు విశాల దృక్పథంతో స్వీకరిస్తారు. అయినా జీవితం కొనసాగించాలని పట్టుదల చూపుతారు. కవితలు, రామణీయకతలు, ఆనందం, ప్రేమ జీవితంలో భాగస్వాములే.
  • వ్యక్తి వృత్తి, జీవనశైలి కళాత్మకం. అందులో రాగద్వేషాలు వెలుగునీడలు చూడాల్సిందే. చెడును దాటి మంచికి పయనించడం అవసరం. ఆశావాదంతో నిరాశావాదాన్ని జయించాలి. ఆందోళన సమయంలో ధైర్యంగా వుండాలి.
  • ఇంత జరుగుతున్నా జీవితం కొనసాగించదగిందే. లోగడ చేసినదానినే, చేయలేకపోయామే అనే భావనకూ మధ్య మంచిని గ్రహించాలి. బాధలు, దుఃఖాలు వుండగా, ఆనంద సమయాలు వాటి పరిష్కారాలుగా రావాలి. జీవించడం, అనుభవించడం ఉత్తమం. జీవితం లేకపోవడం కంటె, జీవితాన్ని అనుభవించడం ఉత్తమం కదూ.

రచన అనువాదం

పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment