రివల్యూషనరీగా రామస్వామి

      చౌదరి నుండి ఎదిగి కులంతోపాటు మతాన్ని విడనాడి మానవవాదిగా పరిణమించిన త్రిపురనేని రామస్వామి గురించి మంచి వ్యాసం అందిస్తున్నాము. త్రిపురనేని హనుమాన్ చౌదరి మొదలు వెలగా వెంకటప్పయ్య వరకూ కులాన్ని మతాన్ని రామస్వామికి అంటగడుతున్న తరుణంలొ ఇది అవగాహనకు ఉపకరిస్తుంది .
ఇన్నయ్య నరిసెట్టి

          
              ‘కవిరాజు’ త్రిపురనేని
                                               -- ముత్తేవి రవీంద్రనాథ్   98491 31029
            కవి, నాటక కర్త, భావుకుడు, భావ విప్లవకారుడు, హేతువాది,  సంస్కర్త, నాస్తికాగ్రణి,   ఆర్ష సాహిత్యాబ్ధిని అలవోకగా   ఆపోసనపట్టిన  అగస్త్యుడు , పురాణేతిహాసాల లోగుట్టును రట్టుచేసి, దురాచారాల్ని తునుమాడిన క్రాంతదర్శి,  సంఘ సంస్కరణే  ధ్యేయంగా ప్రత్యామ్నాయ సాహితీ సృజన  చేసిన అపర కౌశికుడు,  బారిష్టరు,శతావధాని, ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరిగారి  బహుముఖీనమైన కృషికి
ఈ చిన్న వ్యాసం ద్వారా  నివాళులర్పించబూనడం నిజంగా  నాబోటి సామాన్యుడికి  సాహసమే. అయినా వారిపట్ల నాకున్న అపరిమితమైన అభిమానమే నన్నీ సాహసానికి పురికొల్పింది.
            శ్రీనాథ కవిసార్వభౌముని తరువాత తెలుగులో ఆంధ్ర మహాజనులు ఆదరాభిమానాలతో అర్పించిన
‘కవిరాజు'  బిరుదుకు అన్నివిధాలా తగినవాడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారేనని పండిత కొత్త సత్యనారాయణ చౌదరిగారు అభిప్రాయపడ్డారు.ఇది ప్రత్యక్షర సత్యం.
              కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో త్రిపురనేని చలమయ్య, రామమ్మ అనే రైతు దంపతులకు కడగొట్టు సంతానంగా  1887 జనవరి 15 వ తేదీన రామస్వామి  జన్మించాడు.ఆయనకు నలుగురు అన్నలు, ఒక అక్క.  స్వగ్రామంలోని వీథిబడిలో  మంగయ్య పంతులుగారి వద్ద ఓనమాలు దిద్దిన రామస్వామిలో  బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనుపించేవి.  విద్యాబుద్ధులలో  అందరిలోనూ   ముందుండడం, తోటి విద్యార్థుల్ని అదుపులో పెట్టడం,  పాఠంలో ఎక్కడన్నా తప్పు చెపితే పంతులునైనా సరిదిద్దడం, చర్చలలో ఎంత పెద్దవారినైనా  ధైర్యంగా ఎదిరించడం -- ఇలాంటి సుగుణాలు  తండ్రి ప్రోత్సాహం కారణంగా ఆయనకు బాల్యంలోనే  అలవడ్డాయి.
తొలి చేదు అనుభవం- వర్ణ వివక్ష
                     తండ్రి మరణం తరువాత  ఆంగ్ల విద్య పట్ల మోజుతో అన్నల అనుమతితో రోజూ ఐదు మైళ్ళ దూరంలోని గుడివాడకు వెళ్లి మాధ్యమిక విద్యాభ్యాసం చేశాడాయన. గుడివాడలో చదువుకునే రోజుల్లో జరిగిన ఒక ముఖ్య సంఘటన ఆయన మనస్సుమీద చెరగని ముద్ర వేసింది. ఒకరోజు ఒక బ్రాహ్మణ మిత్రుడితో కలిసి గుడివాడలోని ప్రధాన వీధిలో వెళుతున్న రామస్వామికి మిఠాయి తినాలనిపించి, తనవద్ద ఉన్న డబ్బులతో మిఠాయి కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న బ్రాహ్మణ బాలుడు తనకూ మిఠాయి తినాలని ఉందన్నాడు. అతడికి కూడా మరో పొట్లం మిఠాయి కొని తన చేతులతో  దాన్ని తన మిత్రుడికి ఇవ్వబోయాడు రామస్వామి. అప్పుడా బ్రాహ్మణ బాలుడు ‘ఆ పొట్లం అక్కడే ఉంచు.  నేనే తీసుకుంటాను. నిమ్న కులస్థుడవైన నీవు ఒక బ్రాహ్మణుడు తినబోతున్న ఆహారాన్ని తాకరాదు’, అన్నాడట. దాంతో రామస్వామికి ఆత్మాభిమానం పొడుచుకొచ్చి, ‘నా డబ్బులతోనే కదా మిఠాయి కొన్నది. నేనెందుకు ఆ పొట్లం నా చేతులతో ఇవ్వకూడదు ? ఆ మిఠాయి తయారు చేసేవాడు నిమ్న కులస్థుడే కదా ! అతడు తన చేతులతో తయారు చేసిన మిఠాయి బ్రాహ్మణులకు అసలెలా  తినడానికి పనికివస్తుంది ?’ అంటూ తన బ్రాహ్మణ మిత్రుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడట. ఈ ఘటన ఆయన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపి ఆయనకు కులవ్యవస్థ పట్ల ఏహ్యభావం కలగడానికీ, అగ్రకులాధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఆయన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరపడానికీ,  అనంతరకాలంలో బ్రాహ్మణేతరులలో ఆత్మన్యూనతాభావం పోగొట్టి, వారిలో చైతన్యం నింపిన బ్రాహ్మణేతరోద్యమానికి   ఆయన సారథ్యం వహించడానికి  దారితీసింది.
బందరు చదువులు - సత్సంగాలు
                 ఆ తరువాత  రామస్వామి బందరు హిందూ హైస్కూలులో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ

               
                                                                   -2-
ఆంధ్రోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారికి మన రామస్వామి ప్రియశిష్యుడయ్యాడు. అప్పట్లో  జంట అవధాన కవులైన  తిరుపతి వేంకట కవుల కీర్తి ఆంధ్రదేశమంతా మారుమ్రోగుతూ ఉండింది.
దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1920), చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950)లను అప్పట్లో జంటగా తిరుపతి
వేంకట కవులని వ్యవహరించేవారు. రామస్వామిపై నాడు వేంకట శాస్త్రి గారి ప్రభావమే కాక, ముట్నూరి కృష్ణా రావు గారు  ‘కృష్ణా పత్రిక'లోని   తమ వ్యాసాలలో   వెలిబుచ్చుతున్న భావాల ప్రభావం కూడా ఉండేది. రామస్వామి సంస్కృతాంధ్ర సాహిత్యాలలో దిట్టయై,  క్రమంగా ఛందోబద్ధమైన పద్యాల్ని ఆశువుగా చెప్పడం మొదలెట్టాడు. బందరులో చదువుకున్నంతకాలం  ఆయన తన క్లాసులోని మిగిలిన విద్యార్థులందరికంటే
విద్యలోనూ, క్రీడల్లోనూ ము౦దుండడమే కాదు; వీలు చిక్కినప్పుడల్లా సాహిత్య సత్సంగాలు, అవధానాలలో పాల్గొంటూ పండిత ప్రశంసలు కూడా పొందేవాడు.      క్రీ.శ. 1898 లో రామస్వామికి కృష్ణా జిల్లా చౌటపల్లికి చెందిన పున్నమాంబతో వివాహమైంది.వీరిరువురికీ 1910 సెప్టెంబర్ 8 వ తేదీన ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే  అనంతరకాలంలో  రచయిత, తాత్త్వికుడుగా  ప్రసిద్ధికెక్కిన  గోపీచంద్. తరువాత వీరికి సరోజిని అనే కుమార్తె  కూడా కలిగింది.
తొలి నాటక రచన
           జాతీయ భావాలతో ప్రేరేపితుడైన మన రామస్వామి మెట్రిక్యులేషన్ విద్యార్థిగా ఉండగానే ‘రాణా ప్రతాప్' అనే దేశభక్తి ప్రపూరితమైన నాటకాన్ని రాసి, ప్రచురించాడు. ఆ నాటకంలో ఆయన మతాంతర వివాహాల్ని ప్రోత్సహించాడు. హిందూ మహమ్మదీయుల  ఐక్యతను ప్రబోధించాడు. ఇది నాటి బ్రిటీష్ పాలకులకు రుచించలేదు. హిందూ మహమ్మదీయులు ఒకటైతే స్వాతంత్ర్యోద్యమం మరింత బలపడుతుంది. అందుకే    ఆ నాటకంలో రాజకీయ ద్రోహాన్ని ప్రేరేపించే  భావాలున్నాయనే నెపంతో  ప్రభుత్వం 1911 లో ఆ పుస్తకాల్ని తగులబెట్టించి, ఆ నాటక ప్రదర్శనపై నిషేధం విధించింది.
                 1911 లో అంగలూరులో ఆయన అష్టావధానం నిర్వహించారు. 1912 లో శతావధానం కూడా నిర్వహించారు. చౌటపల్లిలో వివిధ వృత్తిదారులను సంఘటితపరిచి సామాజిక సేవకూ, సంఘ సంస్కరణకూ అంకురార్పణ చేశారు.  1912 లో ఆయన ‘కురుక్షేత్ర సంగ్రామము' అనే తన రెండవ నాటకాన్ని ప్రచురించారు. ఈ నాటకాన్ని ఓ రకంగా పురాణేతిహాసాలపై ఆయన చేసిన మొదటి తిరుగుబాటుగా  మనం భావించవచ్చు. సంప్రదాయానికి విరుద్ధంగా మన రామస్వామి ఆ నాటకంలో పాండవులకు అసలు భారత రాజ్యపాలనార్హతే  లేదనీ, వారి పక్షం వహించి కృష్ణుడు చేసినదంతా అక్రమమూ, మోసమేననీ తేల్చాడు.    1912 లో ఇంటర్ పూర్తిచేసిన ఆయన ఒకపక్క సాహిత్య సమరాంగణంలో సంస్కృతాంధ్రాలలో దిట్టయైన ఆశుకవిగా  ఆంధ్రదేశవ్యాప్తంగా సత్కీర్తి పొందడమే కాక, మరోపక్క క్రీడా౦గణంలో ఫుట్ బాల్ టీములో  చక్కటి శక్తి సామర్థ్యాలు కలిగిన   ‘సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్’ గా  తన టీముకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఉత్తమ క్రీడాకారునిగానూ పేరొందాడు.
బొంబాయిలో న్యాయవిద్య - ఐర్లాండ్ ప్రయాణం
         1913 లో ప్లీడరీ చదవడానికి బొంబాయి వెళ్లాడు. ఆ చదువుతో సంతృప్తి చెందక డబ్లిన్ (ఐర్లాండ్) వెళ్లి ‘బార్-ఎట్-లా’  కూడా చదవాలని అభిలషించాడు. ఇందుకు తగిన ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు అన్నలు సమ్మతించడంతో, భార్యనూ, ఐదేళ్ళ కుమారుడినీ కృష్ణా జిల్లా చౌటపల్లిలోని  అత్తవారింట వదలి,బొంబాయిలో డబ్లిన్ వెళ్లేందుకు స్టీమర్ ఎక్కాడు  రామస్వామి.  మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కారణంగా  సముద్రయానంలో ఏర్పడిన చిక్కుల్నీ, అవా౦తరాలనూ  విజయవంతంగా  తట్టుకుని క్షేమంగా డబ్లిన్ చేరాడు. తన యాత్రానుభవాలను  ఆ తరువాత ఆయన ‘ నా డబ్లిన్ ప్రయాణము' పేరిట ‘కృష్ణా పత్రిక' లో  లేఖల



                                                                    -3-
రూపంలో వ్యాస పరంపరగా వెలువరించారు. ఐర్లాండ్ వెళ్ళినా ఆయన తెలుగుదనాన్ని మాత్రం మరువలేదు. అక్కడ ఉన్నంతకాలం ఆయన తెలుగుదనానికి ప్రతీక అయినట్టి ‘పంచెకట్టు’నువీడలేదు.  ఠీవిగా తలపాగానూ ధరించేవాడు.మాతృభాషపై మమకారాన్నీ ఆయన వదల్లేదు. అందుకే అక్కడి ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో మన ప్రాచీన సంస్కృతిని గురించి లోతైన పరిశోధన చేశారు.  ఆ పరిశోధన  ఫలితమే     ‘శంబుక వధ' నాటక రచన.  అద్భుతమైన ఈ నాటకాన్ని గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి.
శంబుక వధ                        
‘ఆపంచాంకమాదశాంకమ్’ అని  ప్రాచీన సంస్కృత నాటక లక్షణకర్తలు నిర్దేశించారు. అంటే  సంస్కృత నాటకంలో కనీసం ఐదు అంకాల నుంచి పది అంకాల వరకు  ఉండాలి.  తెలుగు నాటక రచయితలకూ అదే కొలబద్ద అయింది. అయితే నాటక  వస్తువునెంచుకునే విషయంలోనే  కాదు; రచనా విధానంలోనూ  కవిరాజుగారు  మొదట్నుంచీ  విప్లవాత్మక పంథానే అనుసరించారు. అందుకే  లక్షణకారుల నిర్దేశాలను ఉల్లంఘించి    ఈ నాటకాన్ని ఆయన నాలుగు అంకాల నాటకంగానే రాశారు. ఇక కథాంశం విషయానికొస్తే- ఇది భవభూతి రాసిన ‘ఉత్తర రామ చరితమ్'లోనిదే. అయితే ఇది అవాల్మీకం- అంటే వాల్మీకి ‘రామాయణమ్’ లో లేనట్టి  గాథ. శంబుకుడనే శూద్రుడు వాలి కుమారుడైన అంగదుడి యొక్క చిదానంద ఆశ్రమంలో  తన మానాన తాను తపస్సు చేసుకుంటూ  ఉంటాడు. ఏ రాజు రాజ్యంలో శూద్రుడు  వర్ణాశ్రమ ధర్మాల్ని అతిక్రమించి తపస్సు చేస్తాడో ఆ రాజ్యంలో బ్రాహ్మణ బాలకులు మరణిస్తారని స్మృతులలో ఎక్కడో ఉన్నదట ! దాన్ని ఎత్తి చూపుతూ వసిష్ఠుడు మొదలైన పురోహితవర్గ ప్రముఖులు రాముణ్ణి  కుట్రపూరితంగా రెచ్చగొట్టి, ధర్మాన్ని అతిక్రమించిన శంబుకుడిని వధించాల్సిందిగా  పురికొల్పుతారు. శంబుకుడిని వధించడానికి  ముందుగా కొంత తటపటాయించినా వసిష్ఠుడికి ఎక్కడ కోపం వస్తుందోనని భయపడిన రాముడు శంబుకుడిని నిష్కారణంగానే వధిస్తాడు.  రాముడి  ఈ నిర్దాక్షిణ్య చర్యను రామస్వామిగారు ఈ నాటకంలోని  ఓ చక్కటి పద్యంలో ఎంత సునిశితంగా విమర్శిస్తున్నారో చూడండి.
                     “కరుణ యొకి౦తలేక కులకాంతను సాధ్విని బూర్ణగర్భిణిన్
                       వరకు నరణ్య భూములకు బంపగ జాలినయట్టి నీకు దు
                        ర్భరమగునే యొకానొకని ప్రాణము తీసెడు పట్ల మౌనిశే
                        ఖరుడగుగాక జాలి యెటు కల్గును దక్షిణ బాహుదండమా !”

          స్వయంగా రాముడే తన కుడి చేతిని  అది ఎలాంటి జాలీ  లేనట్టిదని విమర్శిస్తున్నాడు. కులకాంత, సాధ్వి, నిండు చూలాలు అయిన సీతను కాసింతైనా జాలి లేకుండా చిక్కుల చిట్టడవికి సాగన౦పావు.ఓ దక్షిణ హస్తమా!  అలాంటి నీకు అతడెంతటి ముని శ్రేష్ఠుడయినా సరే ఓ వ్యక్తి ప్రాణాలు తీయడం  దుర్భరమవుతుందా?(కాదు). నీకు అతడి పట్ల జాలి ఎందుకు కలుగుతుంది ? (కలగదు గాక కలగదు).
           ఈ చక్కటి నాటకం ద్వారా ద్రావిడ జాతులను అణచివేయడానికి వసిష్ఠుడు మొదలైన ఆర్య ఋషులు  నాడు ఎంతటి నీచమైన కుట్రలూ, కుహకాలూ పన్నారో మొదటిసారిగా యావన్మందికీ బహిర్గతం చేశారు రామస్వామిగారు.
             ఆయన ఐర్లాండులో ఉన్నప్పుడే ‘కొండవీటి సామ్రాజ్య పతనము', ‘కారంపూడి యుద్ధము' అనే రెండు కృతులు కూడా రాశాడు.చాలమంది విద్యార్థులకు భిన్నంగా ఆయన పాశ్చాత్య సంస్కృతీ ప్రభావానికి లోనుకాకుండా -- అంటే మద్య మాంసాలు ముట్టని  నియమబద్ధమైన శుద్ధ శాకాహారిగానే -- జీవించాడు. అయితే ఆయన సిగరెట్లు మాత్రం సరదాగా కాల్చేవాడట.
                

                                                                    -4-
భయమెరుగని ధీరుడు
                       ఈ సందర్భంగా  రామస్వామిగారి నిర్భీకతకు తార్కాణంగా నిలిచే ఓ  చిత్రమైన విషయాన్ని మనం తప్పక చెప్పుకోవాలి. ఆంగ్లం మాట్లాడే దేశాల ప్రజలలో  పదిహేనవ శతాబ్ది ప్రాంతాలనుంచీ ‘13’సంఖ్య  అశుభసూచకమనే  ఒక మూఢ నమ్మకం ప్రబలింది. ఈ అంధ విశ్వాసం విక్టోరియా రాణి పాలనాకాలం (1837-1901)లో మరింతగా  వెర్రితలలు వేసింది.ఆ విశ్వాసాన్ని అనుసరించి, 13 వ నంబరు గల ఇల్లు ఎవరూ కొనరు. అందులోకి  ఎవరూ అద్దెకు కూడా దిగరు.అంచేత భవన నిర్మాతలు ‘13’వ నంబరుకు బదులుగా ఆ యా భవనాలకు ‘12 A’ అనే సంఖ్య  వేసి తెలివిగా అమ్ముకునేవాళ్ళు.భోజనాల టేబుల్ దగ్గర  ‘13’మంది ఎప్పుడూ కలిసి భోజనానికి కూర్చోరు. అలా కూర్చుంటే ఎవరు ముందుగా భోజనం ముగించి లేస్తారో అతడు ముందుగా మరణిస్తాడనే అంధ విశ్వాసం కూడా ఉండేది. కాబట్టి పాశ్చాత్యులు ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో ఒక  టేబుల్ కి పదముగ్గురు కూర్చున్నా, ఎవరికీ నష్టం జరగకూడదని , భోజనం ముగించి అందరూ ఒకేసారి లేచేవారు.రామస్వామి గారు తన హాస్టల్ లో కావాలనే పదమూడవ నంబర్ రూమును ఎంచుకుని అక్కడ వున్న    నాలుగేళ్ళ కాలంలో అందులోనే ఉండేవారు. భోజనాల టేబుళ్ళవద్ద పదమూడవ వ్యక్తిగా చివరికి వెళ్లి కూర్చుని గబగబా భోజనంచేసి లేచి వెళ్ళే వారట-- అలా  చేయడం వల్ల వచ్చే నష్టం ఏదైనా ఉంటే తనకెలా జరుగుతుందో  జరగనిమ్మని !!  ఆయన ఎక్కడ, ఎప్పుడు, ఏ  హోటల్ లో దిగినా తనకు పదమూడవ నంబర్ రూమే  కావాలని కోరేవాడు. ఎవరూ అడగని కారణంగా అది తప్పనిసరిగా ఖాళీగా ఉండడమే కాక తక్కువ  అద్దెకూ  లభి౦చేది. ఇలా అంధ విశ్వాసాలనూ , సంప్రదాయాలనూ ఎదిరించి నిలబడాలంటే ఎవరికైనా ఎంతటి దమ్మూ,  ధైర్యం కావాలి  మరి ?
బందరులో జాతీయోద్యమ ప్రభావం  
             1917 నవంబర్ నెలలో బారిస్టరుగా స్వదేశం తిరిగి వచ్చిన రామస్వామి బందరులో న్యాయవాదిగా
ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పుడే జరిగిన రష్యన్ బోల్షివిక్ విప్లవం ప్రభావం ఆయనపై తీవ్రంగా పడింది.సరిగ్గా అదే సమయంలో  స్వపరిపాలన కోరుతూ అనీ బిసెంట్ ప్రారంభించిన ‘హోమ్ రూల్' ఉద్యమం దేశ వ్యాప్తంగా ఊపందుకోసాగింది.’వందేమాతరం మందేరాజ్యం' అన్న నినాదాలు  నాటికే జాతీయోద్యమ కేంద్రంగా పేరొందిన  బందరులో మార్మ్రోగాయి. రామస్వామి గారు వెంటనే జాతీయోద్యమంలో మమేకమైపోయి, వేదికలెక్కి  ఉద్వేగభరితమైన  ఉపన్యాసాలు ఇవ్వడం మొదలెట్టారు. లండన్ వెళ్ళినప్పుడు  గాంధీ మహాత్ముడిని కలిసిన రామస్వామిపై  మహాత్ముని ముద్ర బలంగా పడింది. మహాత్ముడి సౌమ్యత, నిరాడంబరత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వారి  పవిత్ర దర్శనంతో తాను కూడా పవిత్రుడనయ్యానని -- ‘కృష్ణా పత్రిక'లో ప్రచురితమైన ఒక లేఖలో రామస్వామి స్వయంగా రాసుకున్నారు. తనపై పడిన గాంధీజీ ప్రభావమే కాక రామస్వామి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొనడానికి  లండన్ లో జరిగిన మరో ఘటన కూడా దారితీసింది. ఒకసారి లండన్ నగరంలో పర్యటిస్తున్న రామస్వామికి  ఒక హోటల్ ముందు ‘భారతీయులకు,  కుక్కలకు  లోనికి  అనుమతి లేదు' అని ఆంగ్లంలో రాసివున్న బోర్డు కనుపించింది. దాంతో ఆయన కోపోద్రిక్తుడై  ‘భారతీయులూ మనుషులే కదా ! కుక్కలతో పోల్చడం అసమంజసం కాదా ?’ అంటూ ఈ చర్య  అంతర్జాతీయ మానవ న్యాయ సూత్రాలకు విరుద్ధమని  ఆ హోటల్ యజమానితో వాదించి, తక్షణం ఆ బోర్డును అక్కడి నుంచి తీసివేయించాడు. స్వభావరీత్యా  స్వాభిమానం మెండుగా కల రామస్వామిని  ఈ తరహా జాతి వివక్షతాపూర్వక ఘటనలు  రెచ్చగొట్టి, జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొనేందుకు ఆయనకు ప్రేరణనిచ్చాయి. ఆయన్ని ఉద్యమానికి విముఖుడినిచేసే ఉద్దేశ్యంతో బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమం నుంచి తప్పుకుంటే సబ్-జడ్జి ఉద్యోగమిస్తామని ఆయన్ని  ప్రలోభపెట్టింది. ఆయన ఇలాంటి ప్రలోభాలకు వేటికీ  




                                                                  -5-
లొంగక, మరింతగా  రెట్టించిన ఉత్సాహంతో జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ దశలో ఆయన భార్య
పున్నమాంబ 1920 జనవరి 15 వ తేదీన  ఇద్దరు పిల్లల్ని తండ్రికి వదిలి కీర్తిశేషురాలయింది. దాంతో రామస్వామి గారు తన మకాంను బందరు నుంచి విజయవాడకు మార్చారు. తరువాత ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. తెనాలికి సమీపంలోని కూచిపూడికి చెందిన  చంద్రావతి వీరి రెండవ పత్ని. వీరికి
గోకుల్ చంద్ అనే ఒక కుమారుడు కలిగాడు.1921-22 రెండు సంవత్సరాలూ ఆయన విజయవాడలోనే ఉన్నారు.ఆ దశలో గుంటూరు జిల్లాకు చెందిన  పాములపాటి వేంకట కృష్ణయ్య, జాగర్లమూడి కుప్పుస్వామి, సూర్యదేవర రాఘవయ్య తదితరుల ఒత్తిడి మేరకు  1922 చివర్లో తన కార్యస్థానాన్ని  విజయవాడనుంచి గుంటూరు జిల్లా తెనాలికి మార్చారు. జాతీయోద్యమ రాజకీయ కార్యకలాపాలకు  గుంటూరు జిల్లా అనువుగా ఉంటుందనీ, రైతు పత్రికను తెనాలి నుంచి ప్రచురిస్తే  చైతన్యవంతులైన గుంటూరు జిల్లా రైతాంగానికి- ప్రత్యేకించి
తెనాలి రైతాంగానికి- ప్రయోజనకరంగా ఉండగలదనీ, కొల్లూరు మొదలైన అత్యంత చైతన్యవంతమైన తెనాలి పరిసర గ్రామాల కారణంగా సంఘ సంస్కరణకు  కూడా తెనాలి ప్రాంతం అనుకూలంగా ఉండగలదనీ ఆయన
భావించారు.తన రెండవ భార్య స్వస్థలం అక్కడికి సమీపంలోని కూచిపూడి గ్రామం కావడం కూడా ఆయన తన మకాంను  బెజవాడ నుంచి  తెనాలి మార్చడానికి  కొంతవరకు  కారణం.
తెనాలిలో న్యాయవాద వృత్తి- రాజకీయాలు
                    తెనాలిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన కొద్ది కాలానికే స్థానికంగా గొప్ప పలుకుబడి కలిగిన  మునిసిపల్ చైర్మన్ పిల్లలమఱ్ఱి ఆంజనేయ పంతులుగారిని   ఎన్నికలలో ఓడించి తెనాలి పురపాలక సంఘానికి చైర్మన్ గా ఎన్నికయ్యారు.ఆ తరువాత మరో రెండు సందర్భాల్లో కూడా ఆయన తెనాలి మునిసిపల్ చైర్మన్ గా పనిచేసి ప్రజాభిమానం చూరగొన్నారు. తన పాలనా కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరచడమే కాక,  మునిసిపాలిటీ పరిధిలో జంతుబలితో కూడిన హింసాత్మక  శ్రౌత యజ్ఞాలను, కొలుపులు, జాతరలను  విజయవంతంగా నిషేధించగలిగారు. 1926 లో ఆంధ్ర  విశ్వవిద్యాలయం సెనేట్  సభ్యత్వానికి పోటీపడి, గుంటూరు మునిసిపల్ చైర్మన్, బారిష్టరు యన్.వి.యల్. నరసింహారావు గారిని ఎన్నికలలో  ఓడించి యూనివర్సిటీ విద్యావిధాన రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించారు. విశ్వ విద్యాలయ తెలుగు పాఠ్య గ్రంథాల ఎంపిక ఉపసంఘ సభ్యునిగా వ్యవహరించి, పాఠ్య పుస్తకాల్లో సంస్కృతం ప్రాముఖ్యాన్ని  తగ్గించే ప్రయత్నం చేశారు.
వివాహ వ్యవస్థ ప్రక్షాళన  
         ఆంధ్ర దేశంలో ఆయన సమర్థవంతమైన నేతృత్వంలో స౦ఘ  సంస్కరణ ఒక ఉద్యమంగా మారుమూల పల్లెలకు కూడా పాకింది. బ్రాహ్మణ పౌరోహిత్యం స్థానంలో కమ్మవారిలో స్వసంఘ పౌరోహిత్యాన్ని ఆయన ప్రోత్సహించాడు. ‘వివాహ విధి' అనే చిన్న పుస్తకం ప్రచురించి, దానిలో పెళ్లి మంత్రాల అర్థాలను  వివరించి, వివాహ క్రతువులో పురోహితునికి లేని పెత్తనాన్ని కట్టబెట్టే పలు అనవసర అంశాలను పరిహరించి, వివాహ వ్యవస్థను అందరికీ అర్థమయ్యే రీతిలో సంస్కరించి, తానే పలు సంస్కరణ వివాహాలను స్వయంగా జరిపించారు.  రామస్వామిగారు హిందూ వివాహ వ్యవస్థను సంస్కరించడానికి చేసిన కృషి ఎన్నో సత్ఫలితాల నిచ్చింది. మొట్టమొదటిగా బ్రాహ్మణ పురోహితుల దోపిడీకి అడ్డుకట్ట పడింది. వివాహ తంతును  తెలుగులో అర్థాలు చెపుతూ నిర్వహించే కారణంగా వధూవరులకు వివాహం ద్వారా తమకు సంక్రమించే హక్కులు, బాధ్యతలు ఏమిటో తెలుసుకునే వీలు కలిగింది. ఎలాంటి ఆడంబరం, పటాటోపం లేకుండా వివాహాలు జరగడం కారణంగా  దుర్వ్యయం, దుబారా అరికట్టబడ్డాయి. దీనివల్ల  పేద కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది.



    
                                                                    -6-
ఊరూరా ఎందఱో ఆయనకు శిష్యులయ్యారు. వారి శిష్య ప్రశిష్యులు  నేటికీ ఆయన సూచించిన  మార్గంలో సంస్కరణ వివాహాలను జరిపిస్తూనే ఉన్నారు.
సూతాశ్రమం- బ్రాహ్మణేతరోద్యమం
                   రామస్వామి ‘ రైతు’ పత్రిక ద్వారా రైతాంగంలో చైతన్యం రగుల్కొలిపారు. రామస్వామి    బ్రాహ్మణేతరోద్యమంలో భాగంగా స్వకుల౦లో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి ,  చైతన్యాన్ని రగుల్కొలిపేందుకు కూడా  యత్నించారు. 1922 వ సంవత్సరంలో టంగుటూరులో జరిగిన  ఆంధ్ర కమ్మ మహాజన సభకు అధ్యక్షత వహించి,  ఉత్తేజపూరితమైన తన అధ్యక్షోపన్యాసం ద్వారా నిద్రాణమైవున్న స్వకులస్థులలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించాడు. ఆంధ్ర దేశంలో బ్రాహ్మణేతరోద్యమానికి తానే పెద్ద దిక్కైన రామస్వామి గారు తెనాలి గాంధీ నగర్ లోని తన నివాసానికి ‘సూతాశ్రమము’ అనే పేరు పెట్టారు. సంస్కృతంలో ‘సూతుడు' అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి.ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీ వల్ల జన్మించినవాడు సూతుడు.  అతడికి రథ చోదన వృత్తిగా నిర్ణయించబడింది. ధృతరాష్ట్రుని రథం తోలిన సంజయుడు సూతుడే. అలాగే ఒక వైశ్యునికి క్షత్రియ స్త్రీయందు పుట్టినవాడినీ  సూతుడనే  అంటారు. ప్రాచీన సమాజంలో అతడికి కవిత్వం చెప్పడం, పురాణాలు గానం చేయడం వృత్తిగా నిర్ణయించారు. వ్యాసుడి శిష్యుడైన సూతుడనే మహాముని  సకల శాస్త్ర మర్మాలూ క్షుణ్ణంగా తెలిసిన జ్ఞాని అని ప్రతీతి. ఈయన రోమహర్షణ మహర్షి కుమారుడు. ఉగ్రశ్రవసుడనేది సూతుడి  అసలు పేరు. మన  కావ్యాలలో ఈ సూతుడే శుక శౌనకాది ఋషులకో,  నైమిశారణ్యంలో దీర్ఘసత్త్ర  యాగం చేసే మునులకో, వనవాసం చేస్తున్న పాండవులకో, సర్పయాగం చేసిన  (అభిమన్యుడి మనుమడు) జనమేజయుడికో  పలు సందర్భాలలో పురాణ గానం ద్వారా కర్తవ్య బోధ చేసినట్లు వర్ణనలున్నాయి. రామస్వామిగారు తన ఇంటికి ‘శంబుకాశ్రమం’ అని  ఒకప్పుడు౦డిన పేరును ఈ సూతుడి పేరిట ‘సూతాశ్రమం' అని మార్చారు.  సూతుడు అందరికీ వివరించినట్లే తనకూ  కొన్ని శాస్త్ర మర్మాలు వివరించాడనీ, వాటినే తాను ‘సూతపురాణ౦’ పేరిట గ్రంథస్థం చేశాననీ  సరదాగా అంటారాయన. వాస్తవానికి రామస్వామిగారే ఒక అపర సూతుడు.    సకలశాస్త్ర మర్మాలూ క్షుణ్ణంగా ఎరిగిన ఆ సూతుడు అందరికీ అవే పురాణా౦తర్గత  విషయాలు  మళ్ళీ మళ్ళీ గానం చేసి వినిపిస్తే, రామస్వామి అనే ఈ ‘అపర సూతుడు’ పురాణేతిహాసాలలో అణగారిన వర్గాలకు జరిగిన తీవ్రమైన అన్యాయాల్ని  తన రచనల్లో బహిర్గతం చేసి, వాటిలోని పుక్కిటినంతా  నేర్పుగా పరిహరించి,  సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రునిలా పౌరాణిక సాహిత్యాన్ని   తనదైన శైలిలో కొంగొత్త భాష్యంతో  తిరగరాశారు. నాడు సూతాశ్రమం బ్రాహ్మణేతరోద్యమానికి కేంద్రంగా ఉండేది. బ్రాహ్మణేతరోద్యమం అంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కాదు. అగ్రకుల ఆధిపత్య౦ కింద వేల ఏండ్లపాటు నలిగి నల్లేరై, ఆత్మ విశ్వాసం కోల్పోయిన బ్రాహ్మణేతర కులాలవారిలో చైతన్యాన్ని నింపి వారిని ప్రగతిపథంలో నడపడమే ఈ ఉద్యమ లక్ష్యం. అధ్యయన౦, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహణ౦,  యజనం,యాజనం - ఈ ఆరింటినీ ‘షట్కర్మలు ‘ అంటారు. అధ్యయనం  (చదువుకోవడం) ఎవరైనా చేయవచ్చునట. కాని అధ్యాపనం (చదువు చెప్పడం)మాత్రం బ్రాహ్మణుడే చెయ్యాలట. దానం ఎవరైనా ఇవ్వొచ్చట. కానీ ప్రతిగ్రహణానికి  (దాన స్వీకరణకు) మాత్రం ఒక్క బ్రాహ్మణుడే అర్హుడట. యజ్ఞం ఎవరైనా చేయవచ్చట. కాని బ్రాహ్మణుడు మాత్రమే యాజనానికి (యజ్ఞం చేయించడానికి) అర్హుడట. ఇలా అందరి దానాలూ స్వీకరిస్తూ,  యజ్ఞాలు చేయి౦చే యాజక వృత్తినీ,  విద్య గరపే అధ్యాపక వృత్తినీ సహస్రాబ్దాలుగా తమకే ‘రిజర్వ్' చేసుకుని,  ‘శీర్యంతీతి శూద్రః' అంటూ మెజారిటీ ప్రజలైన శూద్రులకు మాత్రం ‘సేవా వృత్తి' ని కేటాయించి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడిన బ్రాహ్మణులు



                                                                -7-
సమాజంలో పెత్తనం చెలాయిస్తూ, మిగిలిన అన్ని కులాలవారినీ చులకనగా చూడడం నాటి లోకరీతి. ఇది
రామస్వామి గారికీ తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా స్వయంగా అనుభవం అయింది. బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయడానికి బ్రాహ్మణేతర కులాలవారిలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి, తాము ఎందులోనూ, ఎవరికంటేనూ  తక్కువకాదని గ్రహింపజేయాల్సి ఉందని ఆయన గమనించాడు.ఇందుకోసం బ్రాహ్మణేతర కులాలవారిలో స్వసంఘ పౌరోహిత్యాన్ని ఆయన ప్రోత్సహించాడు.
బ్రాహ్మణ పురోహితుడు లేకుండా ఆయనే ఎన్నో పెళ్ళిళ్ళు స్వయంగా జరిపించాడు. ఎందఱో శిష్యులకు వివాహ నిర్వహణలో శిక్షణనిచ్చి వారిని ఆదర్శ పురోహితులుగా తీర్చిదిద్దాడు.  విద్య యొక్క ప్రాధాన్యాన్ని గుర్తెరిగి
బ్రాహ్మణేతరులలో చదువు సంధ్యల్ని ప్రోత్సహించాడు. ప్రత్యేకించి స్త్రీ విద్యకు మరింత ఊతమిచ్చాడు. నాటి  రామస్వామి వంటి  నేతల ముందుచూపు కారణంగానే బ్రాహ్మణేతర కులాల్లో- ముఖ్యంగా కమ్మ కులంలో- ఆత్మవిశ్వాసం పెరిగి,  విద్యార్జన విస్తరిల్లి నేడు వారు పలు రంగాలలో గణనీయమైన అభ్యున్నతి సాధించడ౦ సాధ్యపడింది. శ్రౌత యజ్ఞాలలో తప్పనిసరి అంశమైన జీవహి౦సను  ఏమాత్రం సహించలేక ఆయన యజన, యాజనాలను రెంటినీ వ్యతిరేకించాడు.  అప్పటికే సమాజంలో  వైదిక బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా జి.యస్.బి. సరస్వతి(నియోగి బ్రాహ్మణుడు), మామిడి వెంకయ్య (వైశ్యుడు),  సూర్యదేవర రాఘవయ్య చౌదరి, సింగమనేని రామయాజి వంటి  కమ్మ నేతలు ఎందఱో తిరగబడి యజ్ఞాలు చేయించారు. బ్రాహ్మణేతరోద్యమానికి ఊపిరులూదారు. ఆ తర్వాత కాలంలో ‘సూతాశ్రమం' బ్రాహ్మణేతరోద్యమానికీ, హేతువాదోద్యమానికీ  ప్రధాన కార్య స్థానంగా మారింది. అయినా అక్కడికి అనునిత్యం పలువురు బ్రాహ్మణ పండితులు, కవులు, రచయితలు వస్తూ పోతూ ఉండేవారు. వారిలో ‘మాలపల్లి' నవల రాసిన ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక చి౦తనాపరుడు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారివంటివారెందఱో ఉండేవారు. దీన్నిబట్టి  నాటి బ్రాహ్మణేతరోద్యమ లక్ష్యం బ్రాహ్మణేతరులలో ఆత్మవిశ్వాసం నింపడమే కాని,  బ్రాహ్మణులను ద్వేషించడం  మాత్రం కాదని మనం గ్రహించగలం. నాడు సూతాశ్రమంలో అడుగు పెట్టని కవి పండితులూ, ఆస్తిక నాస్తికులూ, రాజకీయవేత్తలూ, ప్రముఖ వ్యక్తులూ ఉండేవారు కాదంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.  ప్రపంచ కమ్యూనిస్టు నేత, మానవవాది మానవేంద్రనాథ రాయ్ (యం.యన్.రాయ్) కూడా  ఓ దశలో సూతాశ్రమం సందర్శించి హేతువాదంపై  రామస్వామి గారితో చర్చలు జరిపారు.
                     రామస్వామి గారు ఇలా అనునిత్యం సంఘ సంస్కరణ, సాహిత్య సేవ, చర్చా గోష్ఠులలో మునిగితేలుతూ ఉండగా కలగుండు పడ్డట్లుగా అనుకొని రీతిలో  1932 లో వారి రెండవ భార్య చంద్రావతి గారు
హఠాన్మరణం చెందారు. 1933 లో రామస్వామి గారు మూడవ వివాహం చేసుకున్నారు. ఆమె పేరు అన్నపూర్ణమ్మ గారు. వీరికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు చౌదరాణి.
                     రామస్వామిగారు  తమ జీవితకాలంలో అపారమైన సాహిత్య సేవ చేశారు. ఆయన సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యిగా భాసిల్లారు. ‘కావ్యేషు నాటకం రమ్యమ్' కదా ! అందుకే ఆయన తన సాహిత్య సేవను నాటక రచనతోనే ప్రారంభించారు.  ఆయన రాసిన మొత్తం ఏడు నాటకాల్లో ‘రాణా  ప్రతాప్',  ‘కురుక్షేత్ర సంగ్రామము', ‘శంబుక వధ' గురించి మనం ఈవరకే ముచ్చటించుకున్నాం.
‘ఖూనీ ‘ నాటకం  
         రామస్వామి గారు భాగవతంలోని అ౦గ రాజు, సునీథాదేవిల సంతానమైన  వేనరాజు కథను ‘ఖూనీ' పేరిట నాటకంగా రాశారు. వేనుడి పట్టాభిషేకం కబురు తెలియగానే పాము భయంతో ఎలుకలు కలుగులో దూరినట్లు ఆ రాజ్యంలోని దొంగల౦తా  అరణ్యాలలోకి పారిపోయారట.  వేనుడు అంతటి       మహితోగ్ర



                                                                    -8-
శాసనుడన్నమాట . భ్రుగు మహర్షి మొదలైన పురోహిత వర్గ ప్రముఖులు  రాజ్య క్షేమం కోరి యజ్ఞాలు
చెయ్యమని  రాజుకు సలహాలిచ్చారు. రాజు  ఆ ప్రాంతంలో  ప్రభావవంతంగా ఉన్న బౌద్ధ, జైన ధర్మాల   పట్ల  అప్పటికే ఆకర్షితుడయ్యాడు. జీవహింసతో కూడిన యజ్ఞాల నిర్వహణకు  ఆ మతాలవారు   వ్యతిరేకం. అందుకే వేనరాజు  తన పురోహితుల సలహాలను పట్టించుకోలేదు.దీంతో వారు అతడిపై కక్షకట్టి, అతడిని అంతం చేసే అవకాశం కోసం కాచుకుంటారు.మరి రాజు    వైదిక విధులు  పాటిస్తేనే, యజ్ఞాల ద్వారా ఆదాయం వచ్చి,  తమ
పబ్బం గడుస్తుంది కదా ! తమ మాట  విననందుకే  అనంతరకాలంలో వారు అవిధేయతతో
వేనుడు వినాశనమైతే , అతడి కుమారుడు పృథువు విధేయతతో  గొప్ప చక్రవర్తియై వాసికెక్కాడని పలు  
కథలు ప్రచారం చేశారు.   రాజులలో వేనుడు, నహుషుడు, యవనపుత్రుడైన సుదాసు, సుముఖుడు, నిమి అనేవారు  అవినయం (వినయం లేక పోవడం) కారణంగా వినాశనమైతే, పృథువు, మనువు పెద్దలకు విధేయులై ఉన్న కారణంగా రాజ్యప్రాప్తి పొందారని ‘మను స్మృతి’( 7-41,42 ) పేర్కొంది. పెద్దలంటే వైదిక పురోహితవర్గం; విధేయులై ఉండడమంటే యజ్ఞయాగాది కర్మకాండను క్రమం తప్పక పాటించడం.వైదిక పురోహితులు నాడు జీవహి౦సతో  కూడిన శ్రౌత యజ్ఞాల్ని వ్యతిరేకించిన   రాజులనందరినీ అవిధేయులుగానే భావించారు.    పురోహితవర్గం  వేదేతర మతాలైన జైన, బౌద్ధాల ప్రభావంలో ఉన్న వేనరాజుకు వ్యతిరేకంగా కుట్ర చేసి, అతడి  విశ్వాసపాత్రుడైన సేనాని ధృష్టవర్మ చేతనే వేనరాజును ఖూనీ చేయించి అడ్డు తొలగించుకుంటారు. వేనుడి  కుమారుడు, తాము చెప్పినట్లు నడుచుకునేవాడైన  పృథువుకు పట్టాభిషేకం చేస్తారు. ఇదీ క్లుప్తంగా కథ. వేనుడిని దుర్మార్గుడిగా చిత్రిస్తూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ‘వేనరాజు' నాటకానికి ప్రతిగా రామస్వామిగారు ‘ఖూనీ' నాటకం రాశారు. వైదికేతర మతాలపట్ల ఆకర్షితుడవుతూ,  యజ్ఞ నిర్వహణను పట్టించుకోని కారణంగానే  వేనరాజును   పురోహితవర్గం దుర్మార్గుడనే అసత్య ప్రచారం చేసి, కుట్రతో మోసంతో చంపించి తమ పంతం నెగ్గించుకున్నారని  రామస్వామి గారు  ఈ నాటకం ద్వారా  యావన్మందికీ  తేటతెల్లం  చేశారు. వేనరాజు నిజంగా  స్వభావరీత్యా దుర్మార్గుడూ, అవిధేయుడూ అయితే యువరాజుగా ఉన్నప్పుడు మరింత అవిధేయుడుగా ఉండితీరాలి.కానీ అప్పుడు  ఇదే పురోహితవర్గం అతడిని మహావీరుడనీ, ఉత్తముడనీ ఎందుకు, ఎలా కీర్తి౦చారనీ,  అదే పురోహితులు అతడికి పట్టాభిషేకం అతి  ఘనంగా ఎలా చేశారనీ, వైదికేతర మతాల పట్ల  ఆకర్షితుడై , జీవ హింసకు స్వస్తి చెప్పగానే ఒక్కసారిగా వేనుడు దుర్మార్గుడెలా ఔతాడనీ రామస్వామిగారు ప్రశ్ని౦చారు. అలా  పురోహితవర్గం కుట్రలకు, కుహకాలకూ బలైన మరొక గొప్ప వ్యక్తి వేనరాజని రామస్వామి గారి  నిశ్చితాభిప్రాయం.
           మనం చెప్పుకున్న ఈ నాలుగు నాటకాలూ కాక, మరో మూడు అముద్రిత నాటకాలు కూడా ఆయన రాశారు. ‘పల్నాటి పౌరుషము'  నాటకంలో బ్రహ్మనాయని చాపకూటి  సిద్ధాంతాన్ని కొనియాడి, వర్ణాంతర
వివాహాల ఆవశ్యకతను ప్రబోధిస్తారు.’నరకము' అనే  నాటకంలో గాంధీ మహాత్ముని సత్యాగ్రహోద్యమంలోని లోపాల్ని ఎత్తిచూపుతారాయన. ‘అ౦పకము' అనే నాటకంలో తన కాలంనాటి భూస్వాముల  దౌష్ట్యాన్నీ, దుర్నీతినీ  ఎండగట్టి  వారి కుతంత్రాల్ని తూర్పారబడతారాయన.
శతక సాహిత్యం
         ఆయన రాసిన శతకాలు ఆధునిక శతక సాహిత్యంలో మణిపూసలవంటివి. ఆయనకు మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చాయి. ‘కుప్పుసామి శతకం', ‘ధూర్త మానవా!’ అనే మకుటంతో రాసిన  మరో శతకం-- ఇవి రెండూ  ప్రసిద్ధాలు. ‘గోపాలరాయ' అన్న మకుటంతోనూ, ‘చెన్నకేశవా !’ అన్న మకుటంతోనూ కూడా  ఆయన శతకాలు రాసినా వాటిలో ఒకటిరెండు పద్యాలకు మించి లభించలేదు.
              రామస్వామి కూడా వేమనవలెనే ప్రజాకవి. తన పద్యాల ప్రయోజనం ప్రజాహితమే కావాలని   



                                                                 -9-
ఆయన మనసారా ఆకాంక్షించారు. అంధ విశ్వాసాలతో సమాజం నానాటికీ నీతిబాహ్యం అవుతున్నదని
కలతచెందిన రామస్వామి పదునైన భాషతో సమాజపు తీరుతెన్నుల్ని సున్నితంగానూ, సునిశితంగానూ కూడా విమర్శించారు.
                జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరిగారు రామస్వామి గారికి మంచి మిత్రులు. వారిరువురూ కనీసం వారానికొకసారైనా కలుసుకునేవారట. తాను రాసిన పద్యాల్ని రామస్వామిగారు కుప్పుస్వామిగారికి చదివి
వినిపించేవారట. ఆ పద్యాల్లో కుప్పుస్వామిగారికి సన్నిహితులైన కొందరిపై రామస్వామిగారు విసిరిన చెణుకులు కూడా ఉండేవి. ‘కుప్పుసామి శతకం' పేరిట వీటినాయన ప్రచురించారు.
            రామస్వామిగారు నాస్తికులన్న విషయం జగద్విదితం. అందుకే గుడికి వెళ్ళేవాడు చెడ్డ పాపమేదో
చేసివుంటాడని, లేకుంటే  అసలు గుడికి వెళ్ళాల్సిన పనేం ఉంటుందనే   ఆయన అభిప్రాయాన్ని తెలియజెప్పే ఈ పద్యం చూడండి.
                          గుడికి దరచుపోయి గొణుగుచుండెడి వాడు
                          చెడ్డ పాపమేదొ చేసియుండు
                          నదియె వానిబట్టి నట్టిట్టు పీడింప
                           గుడికిబోవు నతడు కుప్పుసామి.
                అనుమానపు మొగుడితో ఎంత సాధ్వి అయినా సంసారం చేయలేదని ఎంత చక్కగా చెప్పాడో చూడండి.
                              సంశయించు భర్త సాహచర్యము జేయ
                              సాధ్యపడునె ఎట్టి సాధ్వికైన ?
                               సీత భూమిజొచ్చె శ్రీరామచంద్రుని
                               గూడి యు౦డలేక కుప్పుసామి.
                 ఇల్లాలు చదువుకున్నదైతే ఇంటిని చక్కదిద్దుకొనగలదని ఎ౦చిన  రామస్వామిగారు బిడ్డల చదువుకంటే భార్య చదువుకే ఎక్కువ  ప్రయోజన౦  ఉ౦దని  భావించారు.  అందుకే ఆయన స్త్రీవిద్యకు గట్టిగా మద్దతిచ్చారు. ఆయనేమంటున్నారో చూడండి.
                                       భార్య చదువు పతికిబనికి వచ్చుచునుండు
                                       గొడుకు చదువుకన్న గొంతవరకు
                                        చదువుకొన్న భార్య సంసారమును దిద్ది
                                        కొనుచు బతికి గూర్చు గుప్పుసామి.
                     జీవహింసతో కూడిన శ్రౌత యజ్ఞాలు చేయడం మానుకొమ్మని  ప్రజలకు సలహా ఇస్తూ ఆయన చెప్పిన పద్యం చూడండి.
                                          జీవహింస జేసి జీవింతునను కంటె
                                           జెట్ట యె౦దుగూడ బుట్టబోదు
                                           జీవహింస మాని జీవింపరాదొకో
                                            కొంత మేలు దాన గుప్పుసామి.
                           ‘ధూర్త మానవా !’ అనే మకుటంతో ఆయన రాసిన పద్యాలు ఆయన హఠాన్మరణం కారణంగా అర్ధ శతకంగానే మిగిలిపోయాయి. భగవంతుడు వ్యంగ్యోక్తితో మానవుడిని సంబోధిస్తున్నట్లు రాసిన
ఈ చక్కటి పద్యాలలో మచ్చుకు ఒకటి చూద్దాం.
                         



                                                                    -10-
            ‘నాకు గుడులూ గోపురాలూ కట్టమనీ, ఏటేటా పెళ్ళిళ్ళు జరిపించమనీ  నిన్ను నేనేప్పుడైనా కోరానా ? వాటికోసం చీటికీ మాటికీ  చందాల పేరుతో అందరి జేబులూ కొల్లగొట్టడం ఎక్కడి ధర్మం ?’ -   అంటూ ధూర్త మానవుడిని  భగవంతుడు ఎలా నిలదీస్తున్నాడో చూడండి.
                        ఈ టకటొ౦కులేమిటికి ? నిల్లును వాకిలి గట్టిపెట్టి యే
                         టేటను బెండ్లి సేయమని యేనెపుడైనను గోరి యుంటినే ?
                         చీటికి మాటికిన్ బరుల  జేబులు గొట్టుట ధర్మమార్గమే ?
                          ఏటికి నీయబద్ధ మరరే ! యిక సాగునె  ? ధూర్త మానవా !
సూత పురాణం     
              రామస్వామిగారు పురాణాల లోగుట్టున౦తా బట్టబయలుచేస్తూ రాసిన   ‘ సూత పురాణం'  అనే కావ్యం వారికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. పాతబాటనే వెళితే కొత్త చోటికి చేరలేమని  రామస్వామిగారికి  అచంచల విశ్వాసం. అందుకే ఆయన కావ్య వస్తువులోనూ, కవనపు తీరులోనూ ఎంతో వైవిధ్యం కనబరిచారు. ఈ కావ్యం సూతుడు చెపుతుంటే తాను రాసినట్లు ఆయన చెప్పుకున్నారు.  అందరికీ సకల పురాణ గాథలూ
సూతుడు చెప్పినవేనని జనం నమ్మకం. ఆ గాథల ఆధారంగానే అందరూ  ఏది ధర్మమో, ఏది అధర్మమో నిర్ణయిస్తున్నారు. తన కాలపు  సమాజంలో అధర్మం, అన్యాయం, అక్రమం మొదలైనవన్నీ  కొందరు తెలివిగా ధర్మం పేరిటే  చెలామణీ చేయడం చూసి చలించిపోయిన రామస్వామిగారు  పురాణ గాథలలోని అసంగతమైన, అక్రమమైన విషయాలన్నీ  బయటపెట్టి , ధర్మాధర్మాల గురించి లోతైన పునర్విచారణ చేయదలచి రాసిన కావ్యమిది. ఆ గాథలన్నీ సూతుడు చెప్పినవేనని జనం నమ్ముతున్నప్పుడు నేను కూడా  విప్లవాత్మకమైన ఈ కావ్యాన్ని సూతుడు చెపుతుంటేనే  రాశానని అంటే  దాన్ని ఖండించడానికి ఎవరివద్దనైనా ఏం ఆధారాలు౦టాయి ?  ఆ  పురాణ గాథల్ని సూతుడు చెప్పడం చూసి, విన్నవాళ్ళు మనలో ఎవరూ లేరుకదా !  ఈ తరహా ఆలోచనను మదిలో ఉంచుకుని ఆయన ఈ కావ్యాన్ని సూతుడు చెపుతుంటే తాను రాసినట్లు పేర్కొన్నాడు.
                సాధారణంగా కావ్యాల్ని అందరూ ఇష్టదేవతా స్తుతితో ప్రారంభిస్తారు.  కాని రామస్వామిగారు తనకావ్యాన్ని ఇష్టానిష్ట దేవతాస్తుతితో ప్రారంభించారు.  దైవతకోటిని ప్రార్థిస్తూ ఆయన రాసిన మొదటి పద్యమే ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి.
                     ఇల్లును వాకిలింగలిగి ఇద్దరొ ముగ్గురొ యాండ్రుగల్గి పై
                      బిల్లలు జల్లలుం గలిగి వెక్కసమైన కుటుంబ భారమన్
                       వెల్లువ నీదలేక పలవించెడి దైవతకోటి నా మొరల్
                        మెల్లగ నాలకించి లవలేశము ముక్తినొసంగ నేర్చునే.
     ఇల్లూ వాకిలీ, ఇద్దరు ముగ్గురు భార్యలూ ఉండి, బహు సంతానం కలిగి మోయలేని కుటుంబ భారం అనే
ప్రవాహాన్ని ఈది ఆవలి గట్టుకు చేరలేక, పలవరిస్తున్న దేవతలు నా మొరలు శ్రద్ధగా విని, నాకు ముక్తిని ప్రసాది౦చ గలరా? వాళ్ళ బాధలతో వాళ్ళే సతమతం అవుతున్నారు. ఇంకా వాళ్ళు నా గోడు ఏం పట్టించుకుంటారు ?(అందుకే నేను ఏ దేవతలకూ ప్రార్థన చెయ్యను-  అని భావం)
         మరొక పద్యంలో చమత్కారంగా ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు పెద్దలు. అందుకే దయచేసి నా జోలికి మాత్రం రాబోకుమ’ని శివుడిని చేతులెత్తి మొక్కుతాడు. మరో పద్యంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని అతి చమత్కారంగా ఖండిస్తాడు. ఇంతకుముందు నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు గుర్తులేకపోవడం నా అదృష్టం.



                                                                         -11-
ఎందుకంటే అదే గనుక నాకు గుర్తుంటే  (నేను నా వెనుకటి జన్మలలో  మనిషినో, జంతువునో, ఏదైనా
కీటకాన్నో-- ఎవరినైనా సరే ) నా గత జన్మలన్నింటిలోని  తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు అందరికీ ఒంగి ఒంగి ప్రణామాలు చేసి చేసి నా ఒంట్లోని   ఓపికంతా ఇప్పటికే అయిపోయి  ఉండేద౦టాడు.
         పూర్వ సంప్రదాయం పాటించి మిగిలిన కవులవలె ఆయన  కావ్యారంభంలో కుకవి నింద చేయలేదు.  ఓ చక్కటి పద్యంలో ‘కావ్యాల ప్రారంభంలో కుకవి నింద  చేయడం  ఏమైనా  ఘన కార్యమా ?  కుకవులనేవారు ఉండబట్టే కదా సుకవి చంద్రుల కీర్తి చంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి ! అలాంటప్పుడు వారినెందుకు నిందించాలి ?’ అని తన గొప్ప మనసును చాటుకున్నాడు.
           ఒకడు సప్త సముద్రాల్నీ ఆపోసన పట్టాడని ఒక కథ. భూమినంతా మరొకడు చాపగా చుట్టాడని ఇంకొక కథ.ఒకప్పుడు కొండలకు రెక్కలు౦డేవనీ, అవి గాలిలో ఎగురుతూ జనావాసాలమీద వాలుతూ ఉండడంతో
జనం అసంఖ్యాకంగా మరణిస్తూ ఉండడం చేత  ఒకడు ఆ కొండల రెక్కల్ని తన వజ్రాయుధంతో నరికేశాడనీ,
ఆరోజు నుంచీ  పర్వతాలు  ఉన్నచోటినుంచి  కదలకుండా  స్థాణువుగా  ఉన్నందున      వాటికి  ‘అచలాలు’ అనే పేరు  వచ్చిందని మరో కథ. కోతి, కొండముచ్చులకు, కొండలకు మానవులు పుట్టారనే  మాయమాటలు చెప్పే కథలన్నీ ఈ పురాణాల్లోనే ఉన్నాయి. ఈ పురాణాలన్నీ పిట్టకథలకు పుట్టినిళ్ళు-- అంటాడు మరో చక్కటి పద్యంలో మన రామస్వామి.
              మరో పద్యంలో ఆయన సూతుడిని ఇలా ప్రశ్నిస్తాడు, 'అయ్యా ! బ్రాహ్మణేతరులు వివేచనతో సంస్కృత  భాషను చదవ కూడదా ? చదివినవాటినన్నిట్నీ ద్విజన్ములకు (బ్రాహ్మణులకు) వినిపించ కూడదా? అలా  ఎవరైనా చేస్తే  వాళ్ళు నరకంలో నశించక  తప్పదా ? ఈ ధర్మ సూక్ష్మం కొంచెం వివరించి చెప్పండి.’    అప్పుడు సూతుడు,’ లోగడ ఒక సత్ర యాగం సందర్భంగా వ్యాసుడికీ, శౌనకుడికీ ఇదే విషయమై సంవాదం జరిగింది. జన్మ బ్రాహ్మణుడు కాని సూతుడు చేసే కావ్యగానం, చెప్పే ధర్మ సూక్ష్మాలు బ్రాహ్మణులు వినవచ్చా ? అన్న శౌనకుడి ప్రశ్నకు వ్యాసుడు -- ధర్మవ్యాధుడనే  ఒక బోయవాడి నుంచి లోగడ కౌశికుడు
ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్న విషయం చెప్పి,  బ్రాహ్మణేతరుడు     అలా చెప్పడంకానీ, బ్రాహ్మణులు అది వినడంగానీ ఎంతమాత్రం ధర్మవిరుద్ధం కాదని తెలిపాడు'  అంటూ బదులిచ్చాడు. ఇంకా  ‘మీ తెలుగు దేశంలోనే
కంచెర్ల గోపన్న అనే బ్రాహ్మణుడు   విద్వాంసులు  వేనోళ్ళ కీర్తించే భక్తి యోగాన్ని మ్లేచ్చుడైన కబీర్ దాస్ చెప్పగా విని తెలుసుకోలేదా ?’ అన్నాడు సూతుడు.
                రాజైనట్టి దశరథుడికి పది రథాలున్నాయనడం, రావణుడికి పది తలలున్నాయనడం, ఋష్య శృంగుడికి ఒక మనుబోతు కొమ్ము ఉందనడం - ఇవన్నీ ఏమేరకు విశ్వసనీయాలు? సహస్రాక్షుడి (ఇంద్రుడి)కి  వేయి కళ్ళు ఉన్నాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి నాకైతే అతడి ఒడలినిండా పొడలే కనుపిస్తున్నాయి.మాండూక్యముని ఆడ కప్పకూ, శుక యోగి ఆడ చిలుకకూ పుట్టార౦టే నమ్మాలా ?
మునిశ్రేష్ఠుడైన  శౌనకుడు ఆడ కుక్కకూ, అశ్వత్థామ ఆడ గుర్రానికీ పుట్టారంటే నమ్మశక్యమేనా ? అంటాడొక
పద్యంలో.
                  ‘బ్రాహ్మణో న హంతవ్య' అని శృతి వాక్యం. ఎంతటి ఘోర  నేరం చేసినా బ్రాహ్మణుడికి మరణ శిక్ష విధించరాదని ప్రాచీనులు భావించారు.  ఎందుకంటే  వారి దృష్టిలో బ్రాహ్మణుడు చంపదగినవాడు కాదు. బ్రహ్మ హత్య మహా పాతకం అంటారందుకే. ధర్మశాస్త్రాల్లో ఇది విధిగా పాటించాల్సిన ఒక సూత్రంగా చేర్చడానికి  నాటి బ్రాహ్మణాధిక్యత ఒక కారణం. వారికి అనుకూలమైన విధంగా ధర్మశాస్త్రాలు  వాళ్ళే తయారుచేసుకుని వాటిని జనం మీద రుద్ది,  శతాబ్దాల తరబడి  నిరాటంకంగా అమలు పరిచారు. ఇక రెండవ కారణం  లిఖితరూపంలో లేని నాటి శాస్త్రాలను మౌఖికంగా  తరతరాల శిష్య పరంపరకు అందించేది బ్రాహ్మణుడే.  వేద విద్యలన్నీ



                                                                     -12-
అలా   అనూచానుల ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందేవి.ఒక బ్రాహ్మణుడు మరణిస్తే అతడితోపాటు అతడిలో నిక్షిప్తమైన విజ్ఞానాన్ని కూడా సమాజం కోల్పోయినట్లే. నాటి సమాజంలో బ్రాహ్మణుడికి మరణ శిక్ష విధించ  రాదనే నియమం ఏర్పరచడానికి ఇది కూడా మరో కారణం.
         అయితే రామస్వామి గారి కాలం నాటి  సమాజంలో  కేవలం బ్రాహ్మణులే కాదు;  అందరూ చదువుకుంటున్నారు. బ్రాహ్మణే తరులలోనూ సకల శాస్త్ర పారంగతులు ఉన్నారు. అలాగే జాతిమాత్రోపజీవులుగా బతుకుతూ ఎలాంటి విద్యాగంధం లేకున్నా బ్రాహ్మణులుగా చెలామణీ అవుతున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలా  అప్పటికే సమాజంలోని బ్రాహ్మణులంతా  దాదాపు  జన్మ బ్రాహ్మణులే. నియమ నిష్ఠలు క్రమం తప్పక పాటించే కర్మ బ్రాహ్మణులన్నా  అక్కడక్కడా ఉండేవారుగానీ, జ్ఞాన బ్రాహ్మణులు కాగడాలతో వెదికినా కనుపించని స్థితి.  మరి మహాభారతంలోని భీష్మపర్వం ప్రకారం పుట్టుకతో అందరూ శూద్రులే. చేసే కర్మలనుబట్టి కొందరిని ద్విజులు అంటారు. వేద పాఠాలను వల్లెవేసేవారిని  విప్రులు అని మాత్రమే  అనాలి. కేవలం బ్రహ్మజ్ఞానుల్ని మాత్రమే బ్రాహ్మణులు అని పిలవాలి. ఇక శాస్త్రాలు ఒకప్పుడు తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేయబడేవి. కాగితం, ముద్రణా యంత్రాలు కనుగొన్న తరువాత ఒకనాటి తాళపత్ర గ్రంథాలలో ఉన్నట్టి శాస్త్రాలేకాదు; ఆధునిక  విజ్ఞాన శాస్త్రాలన్నీ, పుస్తకాల రూపంలో  నిక్షిప్తం చేయబడుతూవచ్చాయి. .వీటన్నింటి దృష్ట్యా రామస్వామి గారు ఒక పద్యంలో అజ్ఞానులు చేసే  చిన్న చిన్న అపరాధాలకు సైతం అత్యంత కఠినమైన  శిక్షలు వేయడం, జ్ఞానులు చేసిన ఘోరమైన నేరాలకు  కూడా నామమాత్రపు శిక్షలు విధించడం  న్యాయమేనా - అని స్మృతి రచయితయైన మనువును ప్రశ్నించారు.’బ్రాహ్మణో న హ౦తవ్య’ వంటి ధర్మసూత్రాలు, ఒకే నేరానికి నేరస్థుడి వర్ణాన్నిబట్టి పలు విధాలుగా దండనలు విధించడం ఎక్కడి న్యాయం; ఎలాంటి ధర్మం అని కూడా ప్రశ్నించారు.పనిలోపనిగా ఆంధ్రులను మ్లేచ్ఛజాతులలో కలిపావేమిటని కూడా మనువును నిలదీస్తాడు.  మనుస్మృతి (10-36) లో చెప్పబడినదాని
ప్రకారం ఒక నిషాదుడి (బోయవాడి)కీ, వైదేహ కులానికి చెందిన స్త్రీకీ   పుట్టినవాడిని కారావరుడు అంటారు.అతడు చర్మకార వృత్తి చేస్తాడు. ఒక వైదేహికునికీ  కారావర  స్త్రీకీ  పుట్టినవాడు ఆంధ్రుడు. వైదేహికునికి నిషాద స్త్రీకీ పుట్టినవాడిని  మేద  అంటారు. ఆంధ్రులూ, మేదలూ గ్రామం వెలుపల నివసిస్తారు.                   ‘శూద్రుల మీద రవ్వంతైనా కనికరం లేకుండా నీ స్మృతిలో శూద్రుడు దాస్యమే  చేయాలని ఎలా రాయగాలిగావు ?’-- అంటూ  రామస్వామిగారు మనువును ప్రశ్నిస్తున్న ఈ పద్యం చూడండి.
                                              ఒక్కటి యడిగెద జెప్పుమ
                                               యెక్కటి ‘శూద్రంతు కారయేద్దాస్య’ మటం
                                               చెక్కరణిన్ స్మృతి వ్రాసితి
                                                వక్కటికము నీకు సుంతయైనను గలదే ?
               మనుస్మృతి (1-91) శూద్రుడికి భగవంతుడు ఒకటే ధర్మం విధించాడనీ, ఏ పనీ ఇది తప్పు అనుకోకుండా పై మూడు వర్ణాలవారికీ శుశ్రూషలు చేయడమే అతడి ధర్మమనీ పేర్కొంది. మనుస్మృతి (8-410) ద్విజ      వర్ణాలవారిని సేవించడమే శూద్రుడి ధర్మమని పేర్కొంది. యజ్ఞోపవీతార్హత కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర వర్ణాలవారిని  ద్విజవర్ణాలవారు అంటారు.బాహ్య, అంతరంగ శౌచాలు పాటిస్తూ, మృదువైన మాటలతో, అహంకారం లేకుండా బ్రాహ్మణాది వర్ణాలవారిని ఆశ్రయించి, వారికి శుశ్రూషలు చేసే శూద్రుడికి (తదుపరి జన్మలో) ఉత్తమ వర్ణం సంప్రాప్తిస్తుందని మనుస్మృతి (9-335) పేర్కొంది. ఇలా మనువు తన స్మృతితో శూద్ర వర్ణాన్ని దాస్యంపాలు చేసివేశాడనేది  ఎవ్వరూ కాదనలేని సత్యం.
                 



                                                                -13-
ఇంతటి  అద్భుతమైన రచన కనుకనే  ‘సూత పురాణం' పండిత ప్రకాండుల మెప్పు పొందింది.
రామస్వామి చౌదరి గారికి అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించి పెట్టింది.
                    రామస్వామిగారి గురువు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు ‘సూత పురాణం' గొప్పతనాన్ని ఓ అందమైన కందంలో    ఇలా కీర్తించారు.
                              బూతుపురాణము కాదిది
                              ప్రాత పురాణమునుగాదు, పాతకహరమౌ
                               సూత పురాణంబియ్యది
                                పూత పురాణంబు పుణ్యపురుషావళికిన్ .
(ఇది బూతు పురాణమూ కాదు. పాత పురాణమూ కాదు. నవ్యమైనది.సకల పాపాల్నీ హరించే సూతపురాణమిది. పుణ్య పురుషులకు ఇదే పరిశుద్ధమైన పురాణం.)
                      ‘దేశోద్ధారక' కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు సూత పురాణాన్ని పోలిన సృష్టి ఇంతవరకూ ఉత్పన్నం కాలేదనీ, సంస్కృత పురాణాలలో ఉన్న అభూత కల్పనలు దీనిలో కనిపించవనీ,
దీనిలోని కవిత సుధామధురమనీ, ఇలాంటి ఉత్తమ పౌరాణిక విమర్శనా గ్రంథాన్ని ఆంధ్రులకు ప్రసాదించిన
రామస్వామి చౌదరి గారికి పౌరాణిక ప్రపంచంలో వాల్మీకికి ఉన్న స్థానం ఉందనీ  గ్రంథ సమీక్షలో పేర్కొన్నారు.
                        ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు ‘సూత పురాణం' గురించి చెపుతూ--  ' సూత పురాణం’ రాసేనాటికి పండిత కవియైన రామస్వామి గారి కవిత్వం పండిందనీ, శివకవులను మించిన జాను తెలుగులో ఆయన రాశారనీ, మధురమైన శైలిలో రాసిన ఈ కావ్యం ఆయన రచనలన్నింటిలోనూ ఉత్తమోత్తమమైనదనీ, దానిలో అమృతపు సోనలున్నాయనీ పేర్కొన్నారు.
                            వేలూరి శివరామ శాస్త్రి గారు ఈ కావ్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ--’ ఇదొక ఆశ్చర్యకరమైన గ్రంథం. తెలుగుదనం తొణికిసలాడే లాగానూ, కవిత్వ దృష్ట్యానూ చక్కగా రచింపబడిన గ్రంథమిది.ఇందులో అపురూపమైన రవ్వల్లా౦టి  తెలుగు పదాలు ఎన్నో ఉన్నాయి. కవికిగల ద్రావిడాభిమానం ఇందులో వ్యక్తమౌతుంది,’అన్నారు.
సూతాశ్రమ గీతాలు
                రామస్వామి చౌదరి గారు రాసిన పలు గీతాలు ‘సూతాశ్రమ గీతాలు’ గా సుప్రసిద్దాలు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన కొన్నింటిని గురించి మాత్రం ముచ్చటించుకుందాం. మొదటిగా ‘వీరగంధము'
అనే గీతం. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారిని ఉర్రూతలూపి, వారికి నూతనోత్తేజాన్నిచ్చి, స్వాతంత్ర్య సాధన దిశగా వారిని కార్యోన్ముఖుల్ని చేసిన  అతి కొద్ది  దేశభక్తి గీతాలలో ఇది ఒకటి. రామస్వామి
గారు మౌలికంగా జాతీయవాది. ఆయన బ్రాహ్మణేతర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినా, కొందరు    బ్రాహ్మణేతర నేతలవలె ఆయన జస్టిస్ పార్టీ రాజకీయ ప్రవాహంలో పడి కొట్టుకుపోలేదు.జస్టిస్ పార్టీ నేతలు చాలామంది అప్పట్లో జాతీయోద్యమం అంతా బ్రాహ్మణ నేతలతో నిండి ఉన్నదనీ, వాళ్ళు బ్రాహ్మణేతరులను
వేల ఏండ్లుగా అణచివేసిన వర్గానికి ప్రతినిధులనీ, ఆ నేతల నేతృత్వంలో స్వాతంత్ర్యం వస్తే, బ్రాహ్మణేతరులకు
తప్పక అన్యాయమే  జరుగుతుందనీ, ఉన్నతోద్యోగాలన్నీ వాళ్ళే కొట్టేస్తారనే భయాలు, అనుమానాలు వ్యక్తపరచి,  తమకు అసలు స్వాతంత్ర్యమే వద్దనీ, బ్రిటిష్ పాలనే బాగున్నదనీ మెచ్చుకోసాగారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించి, వారికి గొప్ప గొప్ప పదవులు, బిరుదులు  ప్రదానం చేస్తూ, జాతీయోద్యమాన్ని చీల్చ గలిగినందుకు సంతోషపడేది. రామస్వామి గారు జస్టిస్ పార్టీలో ఉన్నప్పటికీ ఏనాడూ



                                                                   -14-
బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వజూపిన బిరుదులు, పదవుల కోసం ఆశపడలేదు. ‘స్వాతంత్ర్యం  ఇప్పట్లో మాకొద్దు’  అనే  జస్టిస్ పార్టీ నేతలతో ఆయన విభేదించారు.ఆ ఉద్దేశంతోనే ‘జాతీయ బ్రాహ్మణేతరోద్యమం' అనే నూతన ఉద్యమాన్ని జస్టిస్ పార్టీకి పోటీగా ఆయన ప్రారంభించి,  ఆ ఉద్యమానికి సంబంధించి బెజవాడలో జరిగిన తొలి మహాసభకు తానే అధ్యక్షత వహించారు.  వీరు నడిపిన ఉద్యమం కులపరంగా బ్రాహ్మణేతరులకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే విషయంలోనూ,   అదే సమయంలో స్వాతంత్ర్యం కొరకు పోరాడే విషయంలోనూ ఒకే రీతిలో  చిత్తశుద్ధిని  కనబరచింది. ఆ దశలో రామస్వామిగారు రాసిన అత్యుత్తమ దేశభక్తి గీతాలలో ‘వీరగంధం' అగ్రగణ్యమైనది. 1930 లో ఉప్పు సత్యాగ్రహోద్యమం జరిగే సమయంలో వారు తెనాలి మునిసిపల్ చైర్మన్ గా ఉన్నారు. జంపని నుంచి తెనాలికి కాలినడకన బయలుదేరిన సత్యాగ్రహుల బృందానికి పట్టణానికి దక్షిణపు సరిహద్దుగా  ఉన్న  చినరావూరు రైల్వే స్టేషన్  వెలుపల సాదరంగా స్వాగతం పలికి,  వారిని సూతాశ్రమానికి తీసుకెళ్ళి , వారికి తాను ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది.  కాలినడకన వచ్చే సత్యాగ్రహుల రాక ఏ కారణంగానో బాగా ఆలస్యమైంది.  నిర్ణీత సమయానికి కొంచెం ముందుగానే  అక్కడికి చేరుకున్న రామస్వామిగారు  స్టేషన్ ప్లాట్ ఫాం చివర ఉన్న  పచ్చిక బయలులో ఒక నిద్రగన్నేరు చెట్టు  నీడలో కూర్చుని సత్యాగ్రహుల కోసం ఎదురుతెన్నులు చూడసాగారట. రానున్న సత్యాగ్రహులకు ఎదురేగి ఒక స్వాగత గీతం పాడితే బాగుంటుందని ఆయన మదిలో ఒక ఆలోచన మెరుపులా తళుక్కున మెరిసింది. అప్పటికప్పుడు ఓ కాగితం తీసుకుని తన మదిలోని భావాలకు అక్షర రూపం కల్పించారాయన. అలా రూపుదిద్దుకున్నదే ఈ చక్కటి దేశభక్తి గీతం.ఆ రోజుల్లో ఈ గీతం జనం నాలుకలపైన నాట్యం చేసిన  అత్యంత జనప్రియ గీతం. ఇది ఎంతగా జనం నోళ్ళలో నానిందంటే, ‘వీరగంధం’ అనే మాటను, ఆ గీతం యొక్క భావాన్ని  వాడుకుంటూ అనంతర కాలంలో సినీ గీతాలు కూడా వచ్చాయి. యన్.టి.ఆర్. నటించిన ‘జయం మనదే' చిత్రంలోని ‘వీరగంధం తెచ్చినామయా.. వీరులెవరో లేచిరండయా.. ‘ గీతం అలాంటి వాటిలో ఒకటి. దీన్ని రామస్వామిగారి ప్రియ శిష్యులు ‘జానపద కవి బ్రహ్మ’ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు రాశారు.
                     తెలుగువారి ప్రభ కొండవీడు, గండికోట దుర్గాలలో వెలుగొందడమే కాదు; తుంగభద్రా నదీ తీరంలో తమ రక్తం వారబోసి తెలుగు వీరులు చేసిన త్యాగాలూ, ఇంకా ఆవల  తమ శత్రువుల కుత్తుకలు ఉత్తరించి తమ కత్తుల నెత్తురును సహ్యజ (కావేరి)లో కడిగిన తెలుగువీరుల శౌర్య ప్రతాపాలూ ఎన్నటికీ మనం మరువలేం. అవి ఎంతైనా ప్రశంసనీయాలు. అలాంటి  పౌరుషం కల తెలుగు జాతికి ఇప్పుడేమయింది ? నిద్రాణమై, నిస్తేజంగా ఉన్న తెలుగు జాతి తక్షణం మేల్కొని స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనాలి. ధర్మం కోసం, శాంతి కోసం జరుగుతున్న ఈ పోరాటం ముగిసిన పిదప, చక్కగా శాంతి మంత్రం జపించవచ్చు. ఇప్పుడు మాత్రం కొదమ సి౦గాల్లా  ముందుకురకండి. స్వాతంత్ర్య పోరాటంలో వెన్నుచూపక మీ త్యాగాలతో తెలుగునాటిని వీరమాతను చేయండి. అంతిమ పోరాటంలో విజయం సాధించే వరకు విశ్రమించ వద్దు, అంటూ
చక్కటి సందేశాన్నిచ్చిన ఈ సుప్రసిద్ధ గీతం చూడండి.
            
            వీరగంధము  దెచ్చినారము
            వీరుడెవ్వడొ తెల్పుడీ
            పూసిపోదుము మెడను వైతుము
             పూలదండలు భక్తితో
                                                            




                                                                -15-
                                                            తెలుగు బావుట కన్ను చెదరగ
                                                             కొండవీటను నెగిరినప్పుడు
                                                             తెలుగువారల  కత్తి దెబ్బలు
                                                             గండికోటను కాచినప్పుడు
                 తెలుగువారల వేడి నెత్తురు
                  తుంగభద్రను గలిసినప్పుడు
                  దూరమందున నున్న సహ్యజ
                   కత్తి నెత్తురు కడిగినప్పుడు
                                                                ఇట్టి సందియ మెన్నడేనియు
                                                                 బుట్టలేదు రవంతయున్
                                                                  ఇట్టి ప్రశ్నల నడుగువారలు
                                                                   లేకపోయిరి సుంతయున్.
                      నడుముగట్టిన తెలుగుబాలుడు
                      వెనుక తిరుగం డెన్నడున్
                       బాస ఇచ్చిన తెలుగు బాలుడు
                        పారిపోవం డెన్నడున్
                                                                        ఇదిగొ! యున్నది వీరగంధము
                                                                         మై నల౦దుము మై నల౦దుము
                                                                         శాంతిపర్వము  జదువవచ్చును
                                                                          శాంతి సమరంబైన పిమ్మట.
                             తెలుగునాటిని వీరమాతను
                              జేసిమాత్రము తిరిగి రమ్మిక,
                              పలు తుపాకులు పలు ఫిరంగులు
                              దారి కడ్డము రాకతప్పవు
                                                                              వీరగంధము దెచ్చినారము
                                                                               వీరు డెవ్వడొ తెల్పుడీ !
                                                                               పూసిపోదుము మెడను వైతుము
                                                                                పూలదండలు భక్తితో !!
       
     ‘తెలుగువారలు పిరికివారా ?’ అనే శీర్షికతో ఆయన రాసిన పద్యాలు తెలుగువారి గత వైభవాన్నీ, శౌర్య పరాక్రమాల్నీ జ్ఞప్తికి తెచ్చి, చదువరులలో దేశభక్తిని రగుల్పజేస్తాయి.
                                              తెలుగువారల ఈటెపోటులు
                                               తెలుగువారల నీటుగోటులు
                                               తెలుగువారల పోటుమాటలు
                                               తెలుగువారల యేటుపాటులు
                                                తెలిసి మెలగిన గోలుకొండ           
                               
    
                                                               -16-
                                                  విజాపురంబును నాముదాపురి
                                                   నడిగి చూడుమ, యేమి చెప్పునొ
                                                   తెలుగువారల ప్రాత కతలన్!
                                                                 తెలుగువారలు పిరికివారలొ
                                                                  తెలుగుబిడ్డా ! తెలిసికొనుమా !!
                       గోల్కొండ, బీజాపూరు, అహ్మద్ నగర్ బహమనీ సుల్తానుల ఏలుబడిలోని రాజ్యాలు.వారికి
తెలుగువారి శౌర్యమేమిటో  బాగా తెలుసు.  పలు యుద్ధాలలో తెలుగువారితో తలపడి ఓడిన అనుభవం వారికుంది మరి.
                        మరో గీతంలో  ‘ఓరుగంటిలో దండు విడిసిన దేవగిరి యాదవ రాజును ఓరగంటనే చూసి,
తక్షణం అతన్నీ, అతని సైన్యాన్నీ దేవగిరి కోట దర్వాజాల వరకు తరిమి తరిమి కొట్టిన తెలుగు దొరసాని రుద్రమదేవి కీర్తిని లోకం ఎరుగదా ?’ అని ప్రశ్నిస్తూ, తెలుగువారి ఆడబిడ్డల తెగువ బిగువులు తెలుసుకొమ్మని హితవు చెబుతాడాయన.
                            ‘మందేరా !’అన్న ఓ గీతంలో ఒకప్పుడు తెలుగువారి పాలనలో ఉన్న పలు ప్రాంతాలను పేర్కొని, వాటన్నిటినీ కలుపుకుని ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడాలని  గట్టిగా అభిలషించారు.ఆ గీతం ఇలా సాగుతుంది.
                                            బ్రహ్మపురము మందేరా
                                             పర్లాకిమిడి మందేరా
                                              కాదని వాదుకువస్తే
                                               కటకం దాక మందేరా
            బ్రహ్మ పురము (బరం పురం- బెర్హంపూర్ ), పర్లాకిమిడి  అనాదిగా తెలుగు ప్రాంతాలు. నేటికి కూడా తెలుగు వారు పెద్ద సంఖ్యలోవున్న ఈ ప్రాంతాలు ఇప్పుడు కూడా  ఒడిసాలో అంతర్భాగంగా ఆంధ్ర- ఒడిసా సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. ఆ రెండు ప్రాంతాలూ మనవేననీ,  కాదని ఎవరైనా వాదనకు దిగితే అసలు కటకం కూడా మనదేనని వాదిద్దాం - అంటారాయన. కటకం  అలనాటి గజపతిరాజులు పాలించిన రాజధానీ నగరం. అది ఒడిసా రాజధాని భువనేశ్వర్ కి కూడా ఇంకా ఉత్తరంగా ఉన్న నేటి కటక్.
              ‘తెలుగు జోదులు’ అన్న గీతంలో--
                                                    తెలుగు బిడ్డా ! మరచి పోకుర
                                                     తెలుగుదేశము పురిటిగడ్డర
                                                      కొక్కొరోకో పాటబాడర
                                                       తెలుగువారల మేలుకొల్పర--
      అంటూ  ‘తెలుగువారు  కొందరు అరవదేశంలోనూ, కొందరు ఒడ్డె బందెల దొడ్డిలోనూ (ఒడిసా లోనూ), ఇంకొందరు నిజాం రాష్ట్రంలోనూ, మరికొందరు కన్నడ దేశంలోనూ చిక్కి , బేలలవలెనూ, దీనులవలెనూ
ఉన్నారు.  ఓ తెలుగు బిడ్డా ! ఇక నీవు లేచి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగువారిని అందరినీ ఒక్క రాష్ట్రంగా కూర్చేటందుకు నీవు గట్టి ప్రయత్నం చెయ్యాల్సి ఉంది’, అని తెలుగు ప్రజలకు సందేశం ఇచ్చారు. ( వివిధ ప్రాంతాల తెలుగువారందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే రామస్వామి గారి ఆకాంక్ష 1956 నవంబర్ 1 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణతో పాక్షికంగా నెరవేరింది.)                   

     
                                                   
                                                                 -17-
         ‘తెలుగు నాయకులు’ అనే గీతంలో త్యాగాలు చేయనిదే తెలుగు రాష్ట్రం తేర తేరగా ఊడి పడదని, అందరూ త్యాగపూరితమైన పోరాటాలకు సిద్ధపడాలని సందేశమిచ్చారు. వేదము వెంకటరాయ శాస్త్రి గారు రాసిన ‘ప్రతాప రుద్రీయము' నాటకాన్ని విమర్శిస్తూ కవిరాజుగారు   ‘ప్రతాపరుద్రీయము ‘ అనే గేయం రాశారు.  దానిలో చారిత్రకంగా  చూస్తే యుగంధరుడు, జనార్దనుడు అనే తెలుగు బ్రాహ్మణ మంత్రులు  అసలు లేరనీ, ఆ నాటకం లోని పిచ్చివాడు, పేరిగాడనే పెద్దచాకలి  కూడా పూర్తిగా కల్పితపాత్రలనీ, ప్రతాపరుద్రుడు ఢిల్లీకి బందీగా తీసుకుపోబడ్డాడనీ,  అతడిని యుగంధర మంత్రి తిరిగి ఓరుగల్లుకు చేర్చాడనీ చెప్పేవన్నీ కట్టుకథలేననీ  తేల్చారాయన. ఢిల్లీ లో పడవ  ఎక్కివచ్చిన ప్రతాపరుద్రుడు ఓరుగల్లుకు ఎలా చేరుకుంటాడని ప్రశ్నిస్తూ తెలుగు బిడ్డలను తెలుగు చరితను నేటికైనా తెలిసికోరా -- అంటూ ప్రబోధిస్తాడు.
               ఇలాంటివే మరికొన్ని కూడా సూతాశ్రమ గీతాల పేరిట ప్రసిద్ధమయ్యాయి.
‘భగవద్గీత’
     రామస్వామి చౌదరి గారి రచనలలో చిట్టచివరిది ‘భగవద్గీత'. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన
‘భగవద్గీత'కాదు.పల్నాటి యుద్ధం సందర్భంగా బ్రహ్మనాయడు బాలచంద్రుడికి బోధించింది.కృష్ణుని భగవద్గీత అర్జున విషాదయోగం తో ప్రారంభమైతే బ్రహ్మ భగవద్గీత బాలచంద్ర విషాదయోగంతో ఆరంభమౌతుంది. కురుక్షేత్ర సంగ్రామానికీ, పలనాటి యుద్ధానికీ ఉన్న ఎన్నో పోలికలను గమనించిన రామస్వామి గారు
ప్రజలలో తార్కికత, హేతుబద్ధత పెంపొందించే లక్ష్యంతో ఈ రచన చేశారు.
                                       శాస్త్రములెల్ల జదివి విజ్ఞానమెరిగి
                                        సంశయింపక  సర్వథా  చర్చజేసి
                                         నిజమెరుంగవలయు నిది నేర్వకున్న
                                          మూడ విశ్వాసమున జేటు మూడుచుండు
          చౌదరి గారు గీతను సెటైర్ చేస్తూ, పల్నాటి చరిత్రను జోడించి దానికి తెలుగుదనం తెచ్చారు. భగవంతుడిని హాస్యాస్పదుడిని చేస్తూ వ్యంగ్యోక్తితో రాసిన ఈ గీత కృష్ణుడి భగవద్గీతకు ఏమాత్రం తీసిపోయేది కాదు. వ్యంగ్య రచన సంఘ సంస్కరణకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో ఈ రచన ద్వారా నిరూపణ అయింది.దీన్ని గురించి చెపుతూ డా.జి.వి.కృష్ణరావు గారు ఇలా అన్నారు -- ‘ఆంధ్ర సాహిత్యంలో ఇప్పుడు
కాని, పూర్వం కాని, పద్యంలో కాని, వచనంలో కాని ఎవ్వరూ చెయ్యని,  చెయ్యబోని పనిని చౌదరి గారు భగవద్గీతలో చేశారు.ఆంధ్ర కవిత్వం ఎన్నడూ ఎరుగని చక్కని సెటైర్, చక్కని హాస్యం వీరివల్ల తెలుగువారికి లభించాయి.
                   బాలచంద్ర విషాదయోగం, సాంఖ్య యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అనే ఆరు యోగాలలో మొత్తం పద్దెనిమిది యోగాల భగవద్గీతపై సెటైర్ ను ఇమిడ్చారాయన. పాత భగవద్గీతకు ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాక, ఎక్కడికక్కడ
కృష్ణ భగవద్గీతను పరిహసిస్తూ సాగిందీ  రచన. కృష్ణ భగవద్గీతలోని విభూతి యోగంలో అన్నింటిలో
సర్వ శ్రేష్ఠమైనవి తానేనని చెపుతూ-- మునులలో  కపిలుడిని, పర్వతాల్లో హిమవత్పర్వతాన్ని, వేదాల్లో సామవేదాన్ని, యక్ష రాక్షసులలో కుబేరుడిని’ అంటాడు కృష్ణుడు. అలాగే రామస్వామిగారి గీతలో బ్రహ్మనాయడు ‘నేను మెకములలో హిపో పొటమసును, శకటములలో ధూమ శకటాన్ని(పొగ బండి- రైలు),
సానులలో ఆరవెల్లి నాగసానిని, కాకులలో బొంతకాకిని, ఏరులలో నాగులేరుని, ఎడారులలో సహారా ఎడారిని,
బాసలలో తెలుగు బాసని, పద్యాల్లో కంద పద్యాన్ని, విద్యలలో చోర విద్యను, ఫలములలో చూత ఫలాన్ని,




                                                               -18-
బిలములలో గుత్తికొండ బిలాన్ని’ అంటూ సాగే  సెటైర్  తీరు  అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఇందులోంచి
మచ్చుకు ఒక కందపద్యం చూడండి.
                                      కంకులలో వరి క౦కిని
                                       రంకులలోనెల్ల పొడల రంకును నేనే
                                       యంకెలలో పదమూడును
                                        వంకలలో చంద్రవంక వంకను నేనే
(రంకువు అంటే తెల్ల దుప్పి; తెల్ల వెంట్రుకలుగల ఇర్రి - The Spotted Axis. పాశ్చాత్యులకు  విశేషించి ఆంగ్లేయులకు-- భయం కొలిపే అంకె పదమూడు కనుక అదంటే కవిగారికి ఎంత ప్రియమో మనం ఇదివరకే చూశాం. పలనాడులో ప్రవహించే వాగు వంకల్లో చంద్ర వంకే సర్వ శ్రేష్ఠమైనది.)
             ఈ బ్రహ్మ భగవద్గీతలో ప్రథమ భాగం మాత్రమే ప్రచురణకు నోచుకుంది. భాగానికి ఆరేసి యోగముల
చొప్పున మూడు భాగాల్లో దీన్ని వెలువరించదలచినట్లు రామస్వామిగారే మొదటి భాగానికి తాము రాసిన ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. కాని కవిరాజు కీర్తిశేషులైన కారణంగా మిగిన భాగాల సృష్టి అర్ధాంతరంగా నిలిచిపోయింది.  ‘భగవద్గీత' లో కవిరాజు గారి హేతు తత్త్వం, తార్కికత తారాస్థాయికి చేరుకున్నాయి. మొదట్లో  చేసిన తన రచనలు కొన్నింటిలో ఆయన ఆర్య సమాజం వైపు కొంత మొగ్గు కనబరిచారు.  ఆర్యసామాజిక పద్ధతిలో కొన్ని వివాహాలు చేయించడం, మతేతరులను శుద్ధి చేసి తిరిగి హైందవం లోనికి చేర్చుకొనడం కూడా చేశారంటారు.స్మృతులను తిరస్కరించి  కొంతకాలం ఆయన శ్రుతులను అంగీకరించాడు.  ఆయన చతుర్వేదాలపట్ల అప్పట్లో  అందుకే గౌరవ భావం కలిగి ఉన్నట్లుంది. ఆ కారణంగానే ‘శంబుక వధ' లో ఆయన శంబుకుడి చేత ‘చతురామ్నాయములం దలంచుచు నమస్కారంబులన్ జేయుచున్ స్మృతి ధిక్కారము సల్పబూనితిమి మా క్షేమాభిలాషంబుచే ‘ (మా క్షేమం పట్ల అభిలాషతో మేము నాలుగు వేదాలనూ తలచుకుని వందనం చేస్తూ, పురాణాలు, ధర్మశాస్త్రాలను మాత్రం తిరస్కరిస్తున్నాం ‘ ) అనిపిస్తాడు. బహుశ ఆ రోజుల్లోనే అతి కొద్ది సందర్భాలలో ఆయన అక్కడక్కడా పరాత్పరుడి ప్రస్తావనలు చేసినట్లుంది. ‘సూత పురాణం'లో కూడా సూతుడి  చేత ఆయన’ పురాణాలన్నీ పిట్ట కథలకు పుట్టినిళ్ళు ‘ అనిపిస్తాడు. ఆ దశలో ఆయన బ్రహ్మసమాజం వైపు      మొగ్గాడనిపిస్తుంది. అందుకే ‘ ఏది చరాచరంబయిన సృష్టికి సర్వము మూలకారణంబేది.... నిత్య సత్య పరతత్త్వ మహత్వము నాశ్రయించెదన్’, ‘ జగన్నాటక సూత్రధారియయినా డెవడో ఆతనిం దలంచెదన్ ‘ అనే ప్రార్థనలకు కారణం బ్రహ్మ సమాజం వైపు ఆయన చూపిన మొగ్గే. ఆ తరువాత ఇక క్రమంగా హేతువాద సిద్ధాంతాల లోతైన పరిశీలన, నాస్తికత్వం పై ప్రగాఢ విశ్వాసం ఆయన రచనలలో ద్యోతకమవుతాయి. మతంలో విశ్వాసం సడలి, జ్ఞాన మార్గం పట్టిన ఆయన క్రమంగా హేతువాదం, నాస్తికవాదం పట్ల అచంచల విశ్వాసం ఏర్పరచుకున్నారు. మతాల వల్ల మానవ జాతికి మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిందని కవిరాజుగారి నిశ్చితాభిప్రాయం. త్రిపురనేని ‘ మతమను మాట మోసము సుమా !
ఇదె మూలము ధర్మ పీడకున్' అనీ, ‘మతములె పుట్టకున్న యెడ మారణ కర్మములిన్ని సాగునే' అనీ పలు మార్లు మతాన్ని తీవ్రంగా నిరసించాడు. యూరప్ లో మధ్యయుగాంతంలో విజ్రుంభించిన విజ్ఞానోద్యమ వైతాళికుడైన ఎరాస్మస్ లక్షణాలు త్రిపురనేనిలో ఎక్కువగా ఉన్నాయని ప్రఖ్యాత చరిత్రకారులు భట్టిప్రోలు హనుమంతరావు గారి అభిప్రాయం.  ‘యూరోపియన్ పునరుజ్జీవనోద్యమానికి వేగుచుక్క ‘ అని కొనియాడబడిన మార్టిన్ లూథర్ యొక్క ఆగ్రహం కంటే ఎరాస్మస్ హాస్యమే చర్చ్ అధికారానికి





                                                                  -19-
గర్భ శ త్రువైందట.  ఎరాస్మస్ వలెనే సునిశిత హాస్యంతో మతం పునాదుల్ని కదిలించి వేసిన త్రిపురనేనిని ‘ఆంధ్ర ఎరాస్మస్'  అనవచ్చని ఆయన పేర్కొన్నారు.
                రామస్వామిగారి బహుముఖీనమైన సాహిత్య సేవకు మెచ్చిన ఆంధ్ర మహాసభ బెజవాడలో    1929 వ సంవత్సరం నవంబర్ నెల నాల్గవ తేదీన ‘దేశోద్ధారక ‘ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి
చేతులమీదుగా వీరికి ‘కవిరాజు' బిరుదమునిచ్చి, ఆ సంస్థ తనను తానే గౌరవించుకుంది.
                          ఇక  కవిరాజు చేసిన సాహిత్య వ్యవసాయాన్ని కాసేపు పక్కనబెట్టి , తిరిగి  సామాజిక రాజకీయ రంగాలలో ఆయన చేసిన కృషి విషయానికొద్దాం. తాను చేస్తున్న న్యాయవాద వృత్తిని తన శిష్యులైన
న్యాయవాదులకు అప్పజెప్పి రామస్వామిగారు కొంతకాలం పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. అయితే మునిసిపల్ రాజకీయాలన్నీ గ్రూపు రాజకీయాలుగా మారిపోయిన  కారణంగా ఆయనకు స్థానిక రాజకీయాలపట్ల ఆసక్తి సన్నగిల్లి ,  తన పూర్తికాలం జాతీయ రాజకీయాలకే వెచ్చించడం మొదలెట్టారు.
తన సూతాశ్రమంలో ఉప్పు సత్యాగ్రహ యోధులకు ఆతిథ్యమిచ్చినందుకు ఆయన ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.తంజావూరులో జరిగిన జస్టిస్ పార్టీ మహాసభకు రెండువేల మంది సుశిక్షితులైన కార్యకర్తలతో తరలివెళ్ళి, బొబ్బిలి రాజాను అధ్యక్ష స్థానం నుంచి దిగలాగి , తాను ఆ పదవిని అలంకరించాడు.
మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆర్య సమాజం యొక్క శుద్ధి సంఘ కార్యకలాపాలలోనూ  కొంతకాలంపాటు అంకితభావంతో పాల్గొన్నారు.  సామాజిక, రాజకీయ కార్యకలాపాలలో ఇంతగా తీరికలేకుండా ఉంటున్నప్పటికీ
ఆయన సాహిత్య వ్యవసాయం  మాత్రం మానలేదు.
             ఆయన స్వస్థలం గుడివాడలో కవిరాజు గారికి ఆధునిక కవులలో ఎవరికీ దక్కని అపూర్వ గౌరవం దక్కింది. గుడివాడ పౌరులు 1942 వ సంవత్సరం ఏప్రిల్ నెల 25,26 తేదీలలో  ఆయన్ని గజారోహణ చేయించి, ఘనంగా సత్కరించి, కవిరాజు గారి పట్ల, వారి సాహిత్య కృషి, సామాజిక సేవల పట్ల తమకున్న అపారమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. వివిధ ప్రాంతాలనుంచి విచ్చేసిన అభిమానులు, ప్రముఖులేకాక, స్థానికులు కూడా వేలాదిగా పాల్గొన్నారు. బెజవాడ రామచంద్రా రెడ్డిగారి అధ్యక్షతన, చల్లపల్లి సంస్థానాధీశుని సమక్షంలో, పండితుల ఆశీస్సులతోనూ, అనేకమంది కవుల అభినందనలతోనూ, ఆ సభ అఖండ వైభవోపేతంగా జరిగింది.ఆరోజు గుడివాడ పురవీధుల్లో జరిగిన ఊరేగింపులో  సర్వాంగ సుందరంగా అలంకరించబడిన 56 ఎడ్ల బండ్లు  మువ్వలు సవ్వడి చేస్తూండగా పాల్గొనడం విశేషం. బహుశా ఇది ఆయన 56వ ఏట జరిగిన ముచ్చట కనుక అలా నిర్వహించి ఉంటారు. ఆనాటి సభలో 82 మంది పండితులు, కవులు,
ప్రముఖ రచయితలు పాల్గొని కవిరాజు ప్రతిభను, వారి సాహిత్య, సాంఘిక సేవలను ప్రశంసించారు. అత్యంత అరుదైన విషయమేమిటంటే -- సాధారణంగా శిష్యులు తమ గురువులకు సన్మానాలు,  గురుపూజలు చేస్తుంటారు.దీనికి భిన్నంగా ఆనాటి సభలో కవిరాజు గారిని సత్కరించి, కవితల రూపంలో ప్రశంసలు కురిపించిన కవి పండితులలో కవిరాజు గారి గురువు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు కూడా ముందంజలో ఉండడం. ఇదీ కవిరాజు ప్రత్యేకత.
                      కవిరాజు గారు నిండు జీవితం అనుభవించకుండానే 1943 వ సంవత్సరం జనవరి 16 వ తేదీన తన యాభై ఆరవ ఏటనే అంతుచిక్కని అనారోగ్యంతో, ఆశేషాంధ్ర ప్రజానీకాన్ని శోక సాగరంలో ముంచి కీర్తిశేషులయ్యారు.
                                విఖ్యాత పాత్రికేయులు నార్ల వెంకటేశ్వర రావు గారు త్రిపురనేనిని గురించి ఇలా అన్నారు--’ మత మౌడ్యాలకు స్వస్తిచెప్పి, మానవతకు పట్టాభిషేకం చేయాలని రామస్వామిగారు కోరారు.అది ఆయన తరంలో జరగలేదు. ఈ తరంలోనూ జరగకపోవచ్చు.కాని అది జరిగే తరం రాకపోదు. వేమనను          



                                                                    -20-
వెర్రివానిగా లోకం నిరసించలేదా ? సోక్రటీసును విద్రోహిగా భావించి విషమిచ్చి చంపలేదా ? అయినా పాత
ఫిలాసఫీ స్థానంలో కొత్తదాన్ని ప్రతిష్ఠాపించడం ద్వారా సాంఘిక విప్లవం సాధించగోరే ధీరులు తమ కృషి నుంచి
చలించరు; దాన్ని విరమించరు. నూటికో కోటికో తలఎత్తే ఇట్టి ధీర వర్గానికి చెందినవారే రామస్వామిగారు. ఆయన్ని రచయితగా కంటే రివల్యూషనరీగానే నేను ఎక్కువగా ప్రేమిస్తాను. గౌరవిస్తాను.
                                        అందుకే రివల్యూషనరీ రామస్వామి గారికి నా నమోవాకాలు'
                 రామస్వామిగారు జీవించినంతకాలం ప్రజలపక్షమే. దేవుని పక్షం కాదు. జనం కడుపులు మాడ్చి దేవుడికి కళ్యాణాలు జరపడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించాడు. ఈ పద్యం చూడండి - ఆయన ఎంతటి సాంఘిక విప్లవకారుడో అవగతమవుతుంది.
                          మలమల మాడు పొట్ట తెగమాసిన బట్ట కలంతపెట్టగా
                           విలవిల యేడ్చుచున్న నిరుపేదకు జాలిని జూపకుండ, ను
                            త్తలపడి పోయి జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
                             పొలమును బుట్ర నిచ్చెడి ప్రబుద్ధ వదాన్యుల నిచ్చ  మెచ్చెదన్.
                      రామస్వామిగారు ఆశావాది. సమాజంలో అంతటా మంచి వికసి౦చాలనీ, మానవులందరిలోనూ  సానుకూల దృక్పథం  వెల్లివిరియాలనీ  ఆయన తపన. అదే  లక్ష్యంతో ఆయన  కడవరకూ నియమబద్ధమైన కృషి చేశారు. రామస్వామి గారి ఆశావహ దృక్పథానికి మచ్చుతునుకగా నిలిచే
ఆయన పద్యమొకటి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
                                     
                                                  ఎల్ల జగముల, ఎల్ల వేళల
                                                   ఎల్ల వస్తువులందునన్
                                                    మంచి కనబడి మంచి నిలబడు
                                                    మంచికాలము వచ్చెడిన్.
                         వారి ఈ సదాశయం నెరవేరి, అందరికీ  ఆ  మంచికాలం అతి త్వరలో రావాలని ఆశిద్దాం.
ఈ సందర్భంగా   లక్ష్య  సాధనకోసం  ఉద్యమమే ఊపిరిగా జీవించిన  ఆ కవిరాజుకు మరోమారు  ఘనంగా అంజలి ఘటిద్దాం.

1 comment:

Unknown said...

గుక్క తిప్పుకోకుండా ఏకబిగిన చదివాను 20 భాగాలూ!కవిరాజు హేతువాదాన్నీ,కవన సొబగులనూ,కమ్మ పురోహితులనూ,సూతాశ్రమాన్నీ,ఖూనీనీ గూర్చిన తబిసీళ్ళను తెలుసుకుని ఆనందించాను!ఒక పెద్దపుస్తకంలో కూడా లభించని వివరాలను గుదిగుచ్చి పూసగుచ్చినట్లు విశదముగా ఒక చిన్న టపాలో వివరించారు!చదువరులనుంచి తక్కువ సమయం తీసుకుని ఎక్కువ విషయాలు అందించేవాడే ఉత్తమ టపాకారుడు!

Post a Comment