జీవితమే సఫలము
ఐదు
అందరికీ నీతి
మత విశ్వాసం లేకుండా సమాజంగాని, వ్యక్తిగాని నీతిగా వుండొచ్చా? కచ్చితంగా వుండొచ్చు. నీతి అనేది మానవుల సాధారణ లక్షణం అదే సమాజంలో వేళ్లు పాతుకుంటుంది.
నీతిని అందరూ పాటిస్తారు. మతవాదులు, మతేతరులు నీతిని ఆచరిస్తారు. సమాజానికి నీతి అవసరం. నీతిమాలిన రీతులు సహజీవనానికి సరిపడవు. తరతరాలుగా నీతిరీతులు వస్తున్నాయి. వాటిని స్నేహితులు, బంధువులు, సహచరులు, దేశవిదేశాలవారు గుర్తించారు. సమాజం సాగడానికి కొన్ని ప్రమాణాలున్నాయి. నీతి విద్యకు అవి మూలం. బడిలో ఇంట్లో నీతి సూత్రాలు చెబుతారు. మర్యాదలు పాటిఁచడం, వినయం, తాదాత్మ్యత అనేవి కలసివుండడానికి అవసరమైన లక్షణాలు. అవి నాగరికతకు మూలం.
సంస్కృతుల హద్దుల్ని మించిపోయి నైతిక లక్షణాలున్నాయి. మానవ అవసరాలలోనే నీతి లక్షణాలున్నాయి. మనుగడకు సాగించే పోరాటం నుండి నీతి సూత్రాలు తలెత్తాయి. సామాజిక జీవరీతులలో అవి చోటుచేసుకున్నాయి. కొన్ని సమాజాలలో కొందరు వ్యక్తులలో అవి కనిపించకపోవచ్చు. ఆ లక్షణాలకు కొన్ని ప్రాతిపదికలు అవసరం.
నీతి రీతులేమిటి?
- వ్యక్తిగతంగా నిజం చెప్పడం ప్రధానం. మోసగించడం, అబద్ధాలాడడం సరికాదు. నయవంచనకు దూరంగా నిర్మొహమాటంగా చిత్తశుద్ధిగా వుండడం అవసరం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రమాణాలు పాటించాలి. ఒడంబడికలు గౌరవించాలి. గోతులు తవ్వడం మాని మాటపై నిలవడం కావాలి.
- నమ్మకంతో వ్యవహరించాలి. ప్రేమించినవారిపట్ల విధేయత చూపాలి. అలాగే సహకార్మికుల, బంధువుల, స్నేహితులపట్ల వ్యవహరించాలి. మనం నమ్మదగినవారమనిపించుకోవాలి. ఇతరులపై మనమూ అలాగే ఆధారపడగలగాలి.
- మంచితనం, ఉన్నత ఆదర్శాలు సరైన రీతులు. ఇతరుల పట్ల స్పష్టమైన వైఖరి వుండాలి. హాని తలపెట్టకపోవడం, ద్వేషభావం లేకుండడం అవసరం. చంపడం కూడదు. దోచడం కూడా తగదు. క్రూరంగా వుండరాదు. దూషణలు మానాలి. మన లైంగిక అభిరుచుల్ని యితరులపై బలవంతంగా రుద్దకూడదు. పరస్పర అంగీకారం అవసరం. అందులోనే దయ, క్షమ వుంటుంది. దీనావస్తలో వున్నవారికి చేయూత నివ్వాలి. ఇతరుల బాధను తగ్గించగలగాలి. ఇతరుల సంక్షేమం చూడాలి.
- అర్హులైనవారికి కృతజ్ఞత చూపాలి. నాగరిక సమాజంలో పౌరులు తమ చర్యలకు బాధ్యత వహించాలి. ఇతరుల పట్ల తప్పుచేసినవారు శిక్షార్హులు. న్యాయం, సమానత్వం అనేవి సమాజంలో తప్పక పాటించాలి. సహనం నైతిక లక్షణం. వ్యక్తులు తమ విశ్వాసాలను, విలువలను, జీవన సరళిని ఆచరించుకోగలగాలి. వాటితో మనం ఏకీభవించకపోయినా సరే. వ్యక్తులందరూ తమ నమ్మకాలు పాటించే అవకాశం వుండాలి. ఇతరుల హక్కుల్ని మనం అగౌరవపరచకూడదు. సహకారం అవసరం. అభిప్రాయభేదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. హింస ద్వేషాలు విడనాడాలి.
వ్యక్తులుగాని, సమాజాలుగాని కొన్ని నైతిక విషయాలలో తేడాలు చూపవచ్చు. కొందరు అతిగా ప్రేమించేవాటిని మనం అడ్డుకోరాదు. కాని ఏ నీతిసూత్రమూ తిరుగులేనిది కాదు. వాటిలో సంఘర్షణలు వాటిల్లవచ్చు. నీతిసూత్రాలు ఆచరణలో ఫలితాలను బట్టి చూడాలేగాని, దైవదత్తాలుగా భావించరాదు. జీవితానికి నీతిసూత్రాలు ఏ మేరకు సరిపడతాయో చూడాలి. అందరం బ్రతకడానికి కొన్ని నీతి సూత్రాలు అవసరం. కొన్నిసార్లు వ్యక్తిగతంగా త్యాగాలు చేయాల్సి వుంటుంది. ప్రవర్తనలో బాధ్యత ముఖ్యం అని గ్రహించాలి.
రచన తెలుగు సేత
పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment