శక్తివంతమైన లక్షణాలుబ్రతుకులోనే లభిస్తాయి-8

జీవితమే సఫలము


ప్రాచీన ప్రవక్తలు, ఆధునిక గురువులు జీవిత రహస్యాల్ని కనుగొన్నామంటుంటారు. బ్రతుకు నుండి తప్పుకొని, ధ్యానంతో అర్థాన్ని సాధిస్తామంటారు. జీవితానికి ఒక అర్థమంటూ లేదు. జీవితానికి ఎన్నో అవకాశాలున్నాయి. భయపడి వాటినుండి తప్పుకోవచ్చు. ఆనందంతో అవకాశాల్ని చేజిక్కించుకోవచ్చు.
  • బ్రతుకుపై ఆసక్తిగలవారు శక్తివంతమైన లక్షణాలు కనుగొనవచ్చు. అవి బ్రతుకులోనే లభిస్తాయి. అనుభవాలతో కొత్త పరిస్థితులు సృష్టించుకుంటూ పోవచ్చు.
  • జీవిత ఫలసాయాన్ని అనుభవించేవారికి బ్రతుకుపై కొత్త ఆశలు చిగురిస్తూనే వుంటాయి. జీవిత విలువ ఏమంటే, జీవితంలోనే మంచి వుందనేది గ్రహించడమే. బ్రతుకులో ప్రతిక్షణం విలువైనది, ఆకర్షణీయమైనది.
  • జీవిత రహస్యాలనేవి బహిరంగ సత్యాలు, అందరూ వాటిని విప్పిచూడచ్చు. అవి బ్రతుకు పుస్తకంలోనే అగుపిస్తాయి. మన కృషిలో, జీవనరాగంలో, పరోపకారంలో, ప్రేమించినవారి పట్ల అనురాగం చూపడంలో, గణిత సాక్ష్యాల మాధుర్యంలో, పర్వతారోహణలో, ప్రశాంతంగా వుండడంలో, పాడుకోవడంలో, ఆటల పోటీని ఆనందించడంలో, పద్యపఠనంలో, తల్లిదండ్రుల సాన్నిహిత్యంలో, స్నేహబంధాలలో, తోటివారికి ఉపయోగపడడంలో యిలాంటివాటన్నింటిలో జీవితరహస్యాలు వున్నాయి.
  • ప్రస్తుత దశల సాధించిన జీవితాంశాలు, గతానుభవాలు, రానున్న కాలంలో సాధించదలచినవి జీవిత పాఠాలలో భాగాలే. జీవితం రామణీయకమైంది. అందులో మంచితనం వుంది. జీవితం ఆసక్తిదాయకం. సృజనాత్మక చర్యలలో వివేచనలో, సత్ప్రవర్తనలో జీవిత మాధుర్యం వుంది. అంతకు మించి జీవితంలో ఏం కావాలి?
  • మన పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాలు అన్నీ జీవితానికి అర్థం సమకూర్చేవే.
  • మనకు మనమే అర్థాల్ని సమకూర్చుకుంటాం. సాంస్కృతిక సహజ ప్రపంచరంగంలో మనమే అర్థం సృష్టించుకుంటాం. మనం కనుగొన్నవి ప్రకృతిలో ప్రవేశపెడతాం.
  • ప్రాచీన ఈజిప్టువాసుల జీవితాలలో అర్థం వుంది. పిరమిడ్ల సంస్కృతిలో అర్థం వుంది. బైబిల్ పాత నిబంధన ప్రవక్తల ఆలోచనలో భావాలున్నాయి. నగరపాలనలో న్యాయం ఆశించిన ఏథెన్స్ వాసుల అర్థం చూడాలి. మధ్యయుగాల పట్టణ నిర్మాణాలు, గ్రామీణ సంస్కృతి స్థానంలో, వాటి ఆర్థిక, ఫ్యూడల్ చోటులో తెలత్తాయి. దీని వెనుక క్రైస్తవ సంస్కృతి వుంది. జపాన్ సంస్కృతిలో సమురాయ్ సైనికుల అనుభవాలున్నాయి. పెరూవాసుల ఆశలు, ఆశయాలలో అర్థం వుంది. ఆఫ్రికా దేశీయ వాటుసి జాతుల సంస్కృతిలో అర్థం వుంది. హిందూ, ముస్లిం సంస్కృతులున్నాయి. నేటి ఆధునికానంతర నాగరిక ప్రపంచంలో కొత్తదారులు  తొక్కుతున్నారు. అందులో సరికొత్త సాంస్కృతిక విషయాలు, అవకాశాలు, సాహసాలు వున్నాయి.
  • చారిత్రక సాంస్కృతిక అనుభవాల నేపథ్యంలో మానవులు అర్థాలు చూస్తున్నారు. అందులో బ్రతుకుబాట గమనిస్తున్నారు. వారికి జీవితంలో అర్థం వుంది. విషయం వేరుగావచ్చు. భిన్న సంస్కృతులలో జీవనసరళి ఆశాపూరితంగా, ఆనందమయంగా, అద్భుతంగా వుంటుంది.

రచన అనువాదం

పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment