గీత రహస్యం కీ.శె . నార్ల వెంకటేశ్వరరావు (వి. ఆర్. నార్ల ) పరిశోధనాత్మక
ఇంగ్లిష్ తెలుగు సేత .జీవితకాలం గితపై మూల గ్రంధాలు సేకరించి నిశిత విశ్లేషణ గావించిన రచనను అమెరికాలో ప్రొమిథియస్ ప్రచురణలవారు వెలువరించారు గిత ప్రభావం రీత్యా నేటి తరానికి ఇది అవసరం . నార్ల గీతను పారాయణం చేయక అధ్యయనం గావించారు . చివరలో పరిశీలక రచనల పట్టి వుంటుంది.
The Truth about the Gita
గీతా రహస్యం
పీఠిక
దేశ విదేశాలలో కొందరు గొప్పవారు భగవద్గీతను గొప్పమత గ్రంథంగానూ, తత్వం, నీతి రంగాలలో తిరుగులేని మార్గ దర్శిగానూ, సామాజిక విజ్ఞాన రంగాలకు సైతం ఆదర్శవంతమైనది గానూ భావించారు. వారిపై నేను తీవ్ర విమర్శచేశాను. అందుకు క్షమాపణ కోరడం లేదు. వారెంత గొప్ప వారైనా ఒక్క విషయంలో లోపభూయిష్టులే. వారికి ఆధునిక మనస్తత్వం లేదు.
ఆధునిక మనస్సు అంటే ఏమిటి? అంధ విశ్వాసాన్ని యీసడించడం, మూఢ నమ్మకాన్ని త్రోసిపుచ్చడం, పిడివాదాన్ని గర్హించడం, మాయ మాటల్ని కాదనడమే ఆధునిక మనస్సు. వివేచనాత్మకంగా, విజ్ఞాన పూరితంగా ఆలోచించడమే ఆధునిక మనస్సు పని. హేతుబద్ద కొలతకు నిలవలేని దానిని నిరాకరించడమే ఆధునిక మనస్సు. స్వేచ్ఛగా, సాహసోపేతంగా, కొత్త పరికల్పనలతో, తెలియనిది తెలుసుకుంటూ పోవడమే. భూమి విశ్వంలో ఒక అణువు మాత్రమే. దానిని గురించి, జీవితాన్ని గురించి, విశాల విశ్వం గురించి తెలుసుకుంటూ పోవడమే ఆధునిక మనస్సు.
ఆధునిక మనస్సుకు కేంద్రం దేవుడుకాదు, మానవుడు. ఆ మనస్సుకు జాతి, మతం, దేశం, వర్గం, కులం అడ్డం రావు. సంకుచితం, తలబిరుసుతనం, అల్పత్వం, స్వార్థం ఆధునిక మనస్సుకు దూరం. ఆధునికుడు యీ ప్రపంచాన్ని పట్టించుకుంటాడు, మరో లోకాన్ని కాదు.` నేను నీ సృష్టికర్తను` అని ఎవరైనా అంటే,` పోవోయ్, నాకునేనే సృష్టికర్తను. నేను పరిణితి చెందుతున్నాను. నా బాల్యదశలో భయం, అజ్ఞానం వలన ఎందరో దేవుళ్ళను దేవతలను సృష్టించాను. అలాగే స్వర్గాలను నరకాలను పుట్టించాను. వాటన్నిటినీ కూలగొడుతున్నాను` అంటాడు.
అలాంటి ఆధునిక మనిషికి గీత చాలా మొరటుగానూ, ఆదిమ దశగానూ, అర్థ సత్యంగానూ, పరస్పర విరుద్ధాలుగానూ, ఆధారాలు లేని మాటలతోనూ, ఘోరమైన విషయాలతోనూ, కనిపించడం సహజం. డి.డి. కోశాంచి దృష్టిలో గీత- పరస్పర విరుద్ధాలను సమన్వయించే సంస్కృత రచన మాత్రమే., వ్యతిరేక విరుద్దాలను దిగమింగే ప్రయత్నం జరిగింది.
నా రచనలన్నింటిలో యీ రచన నాకు సంతృప్తినిచ్చింది. స్వాతంత్ర్యం రావడంతో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తామని ఒకప్పుడు అనుకునేవాడిని. కాని తిరోగమన వాదం ఉప్పెన వలె వచ్చిపడడం చూస్తుంటే విచారంగా వుంది. 1947కు ముందు కంటె, నేడు మనం మూఢనమ్మకాలతో, ఛాందసంతో, మాయ మాటల గారడీలతో వున్నాం. మన స్వాతంత్ర్యం భ్రమగా తయారైంది. మనస్సుకు బంధాలుంటే, స్వేచ్ఛ ఎలా వస్తుంది? ప్రజాస్వామిక సంస్థలున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛా వ్యవస్తలు కనిపిస్తున్నా, సరైన అర్ధంలో మనకు స్వేచ్ఛ లేదు.
ఈ స్థితిని వివరించడం ఎలా? జాతీయోద్యమం తిరోగమనంలో ప్రారంభించి కొనసాగిందని, వెనక్కు తిరిగి పరిశీలిస్తే అవగాహన అవుతుంది. బంకించంద్ర ఛటర్జీ, వివేకానంద, బిపిన్ చంద్రపాల్, లజపతిరాయ్, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్, గాంధీ వంటి విభిన్న జాతీయ నాయకులకు ఉత్తేజాన్ని కలిగించింది భగవద్గీత. గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సెకు సైతం అదే పవిత్ర గ్రంథం! మన స్వాతంత్ర్యానంతరం అందకారంలోకి ఎలా ప్రవేశించామో దీన్ని బట్టి ఆశ్చర్య పడనక్కరలేదు. జ్యోతిష్యం ప్రకారం స్వాతంత్ర్య మూహూర్తం నిర్ణయించారు. అదంతా చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఈ తిరోగమన ఉపద్రవాన్ని 76 ఏళ్ళ వయస్సులో తిప్పి గొట్టగలనా? చేయగలననే నా విశ్వాసానికి యీ పుస్తకమే నిదర్శనం. అదే నాకు సంతృప్తినిస్తున్నది.
ఈ పుస్తకరచనకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి. డా. వై. వెంకటేశ్వరరావు, డా. డి. ఆంజనేయులు, డా. పి.ఎస్.ఎన్. మూర్తి యీ రచన చదివి అనేక సూచనలు చేశారు. అయితే యీ రచనలోని అభిప్రాయాలకు వారెవరూ బాధ్యులుకారు. అవి కేవలం నావే.
యువతరానికి ఒక విజ్ఞప్తి. ప్రపంచం అత్యంత వేగంగా మారుతున్నది. ప్రతి పదేళ్ళకు యీ వేగం చాలా ఎక్కువగా వుంటున్నది. గత 80 ఏళ్ళలో చాలా మార్పువచ్చింది. చాలా మంచి జరిగింది. ఇంచుమించు అంతే చెడుకూడా వుంది. ప్రపంచ ప్రళయం జరగకుండా ఆపే ప్రయత్నాలు జరిగాయి. మార్పుకు అనుగుణంగా, ఉపద్రవాలను అడ్డుకొంటూ, మనం సాగిపోవాలి. ఇందులో యువత బాధ్యత చాలా వుంది. గీత తెచ్చిపెట్టిన పాత అలవాట్లనుండి బయటపడాలి. అలాగే ప్రపంచంలో పవిత్రగ్రంథాల పాత బంధాలు కూడా తెంచాలి. కొత్త భావనలు, కొత్త విలువలు రాకుంటే ప్రపంచంలో జీవన రంగం అదృశ్యమౌతుంది. మన ఆశలు, భవిష్యత్తు అన్నీ పోతాయి.
- నార్ల వెంకటేశ్వర రావు
రచన తెలుగుసేత
నార్ల వెంకటేశ్వరరావు నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment