జీవితమే సఫలము-కొత్త సందేహవాదం--2

నిశితంగా పరిశీలించే పద్ధతి సైన్స్ లో ఎంతో ఉపకరించింది. మానవజీవితంలో అన్ని రంగాలకు అదే పద్ధతి విస్తరించాలి. నమ్మకాలన్నీ సాక్ష్యాధారాలతో పరిశీలించాలి. పరిశోధనలకు గురిచేయాలి. పొందికగా ఉన్నాయేమో చూడాలి. పరిశీలన వలన మనకు తెలిసిన విషయాలు మార్చుకోవలసివస్తే, వెనుకాడగూడదు. అప్పుడే జ్ఞానం విప్పారుతుంది. మానవ జ్ఞానాభివృద్ధికి సందేహదృష్టి ఎంతగానో ఉపకరిస్తుంది. విజ్ఞాన తాత్విక రంగాలలో సందేహవాదం చారిత్రక పాత్ర నిర్వహించింది. సందేహవాదం అంటే నిరాశ, వ్యతిరేక ధోరణులు కాదని గ్రహించాలి. ప్రకృతి, మానవజ్ఞాన వికాసానికి కొత్త సందేహవాదం ప్రత్యక్షంగా తోడ్పడుతుంది. నైతిక, రాజకీయ, సాంఘిక, సమస్యల పరిష్కారానికి సందేహవాద ధోరణి, విజ్ఞానం దోహదకారి.

 • మానవ జ్ఞానానికి కచ్చితమైన విషయాలు కనుగొనాలి. ఇందుకు మానవవివేచనే ఆధారం. మానవ జ్ఞానపరిధి విస్తరణకు వైజ్ఞానిక అన్వేషణ బాగా పనికొస్తుంది. మానవుల శ్రేయస్సుకు అది సాధనంగా వాడాలి.
 • వైజ్ఞానిక శోధనలో సందేహవాదం అత్యవసరం. దీనిని దైనందిన జీవితంలో అన్ని రంగాలకు విస్తరించాలి. చట్టాలు, మతం, ఇంద్రియాతీతశక్తులు, ఆర్థికం, రాజకీయం, నీతి, సమాజంలో వివేచన ప్రమాణాలు గీటురాయి కావాలి.
 • ప్రపంచాన్ని గురించిన అన్వేషణలో నిశిత ఆలోచన వుంది. సమస్యల పరిష్కారానికి అది ప్రయోగించాలి. వ్యతిరేకతల్ని తటస్తం చేయాలి. ద్వేషం తొలగించి, రాజీమార్గాలు చూడాలి.
 • పులుముడు అయోమయ రీతుల స్థానంలో స్పష్టమైన ఆలోచన అవసరం. గందరగోళం బదులు నిర్దుష్ట పద్ధతి కావాలి. అస్పష్టత పోగొట్టే భాషాపరమైన నిర్వచనాలు అవసరం.
 • విచారణ జరపకుండా తెలిసిపోయిందనే వాదన ఒప్పుకోం. పరీక్షకు గురిచేయాల్సిందే. తెలిసిందనే వారే రుజువుపరచాలి.
 • ఊహలు కాదు, వాస్తవాలు కావాలి. పిట్టకథలు ఆధారం కాగూడదు. విశ్వాసం బదులు తార్కిక నిరూపణ అవసరం.
 • తిరుగులేని పవిత్రగ్రంథాలు, సూత్రాలు ఎవరు ఏ రూపంలో చెప్పినా వాటికి అంగీకరించకూడదు.
 • పరిష్కారమార్గాలకు పుక్కిటి పురాణాలు పనికిరావు. పెత్తందారీతనం ప్రయోగించి చెబితే ప్రమాణం కాదు. విచారణ, వివేచన, రుజువు మాత్రమే ప్రమాణాలు.
 • కొత్త సాంకేతిక జ్ఞానానికి వివేచన, విజ్ఞానం ఆధారం. అవే మానవబాధలకు మార్గాంతరాలు. మానవుడికి సుఖశాంతులు కల్పించేవి ఆ విధానాలే.
 • నీతి సూత్రాలకు సైతం వివేచనాత్మక పరిశీలన అవసరం. మానవుడి సంక్షేమానికి అవే మార్గదర్శకాలు.
 • మనం అన్నింటినీ కాదనేవాళ్ళం కాదు. నిరాశ, మానవద్వేషంతో మనం లేం. అబద్ధ అసత్య ధోరణులకు మనం వ్యతిరేకులం. మోసాలకు భ్రమలకు వ్యతిరేకులం, మన లక్ష్యాలు సాధించుకోడానికి నిశిత పరిశీలన, పరిశోధనలే అత్యుత్తమ మార్గాలు.

No comments:

Post a Comment