జీవితమే సఫలము --Part 1

(Innaiah with Paul Kurtz)
ముందుమాట

మతానికీ, కులానికీ అతీతంగా మానవ విలువలతో జీవితాన్ని ఆనందదాయకంగా గడపటం సాధ్యమే. గుడ్డినమ్మకాలూ, ఛాందస భావాలూ, లేకుండా వైజ్ఞానిక దృక్పథంతో కళలూ, రామణీయకతలూ, పోషించుకుంటూ అనువదించటం ఆనందాన్నిచ్చే విషయమే. తెలియని అతీత శక్తుల మిథ్యలో మానసిక దాస్యాలకు గురయి బాధలు పడేకంటే జీవితాన్ని ఫలప్రదంగా సాగించటం సక్రమ పద్ధతి. అందులో మానవ ఉత్సవాలకు, పెళ్ళిళ్లకు, వివిధ కార్యక్రమాలకు చోటు ఉంటుంది. పుట్టుక నుండి చనిపోయేవరకు, వివిధ అంశాలు, మానవ ప్రాధాన్యతతోనే, జరుపుకోవచ్చు. ఇందులో స్త్రీ పురుషులకు సమానత్వం ఉంటుంది. పరిశీలన, పరిశోధన చేయకుండా గుడ్డిగా నమ్మటం కాని, ఎవరో చెప్పారని, కాళ్ళకు మొక్కటం గాని, ఉండరాదు. అలాంటి జీవితానికి మార్గదర్శకాలు సూచిస్తూ సుప్రసిద్ధ మానవవాద నాయకుడు కీ.శే. పాల్ కర్జ్ సరళంగా చిన్న రచన చేశారు. దానిని వరుసగా తెలుగులో అందిస్తున్నాము. (తెలుగుసేత - నరిసెట్టి ఇన్నయ్య).





ఒకటి
మానవవాదం నిర్ధారణగా చెబుతున్న సంగతులు

ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి వివేచన, విజ్ఞానం ఆధారాలు చేసుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం.

  • భూమిని కాపాడదాం. రానున్న తరాలవారికి భూసంపద అట్టిపెడదాం. ఇతర జీవజాలాన్ని అనవసరంగా బాధలకు గురిచేయం.
  • జాతి, మతం, వర్గం, కులం వంటి సంకుచిత విభజన శక్తులను దాటిపోయి మానవుల మంచికోసం కృషి సాగిద్దాం.
  • బహుళ, స్వేచ్ఛా సమాజాలు కావాలి. పెత్తందారీ వర్గాల నుండి అణచివేసే అధికసంఖ్యాకుల నుండి మానవహక్కులు కాపాడదాం.
  • ఉన్నత నీతి స్థాయిని పెంచుదాం.
  • చిత్తశుద్ధి, పరోపకారం, నిజాయితి, బాధ్యత అందరికీ మంచి చేస్తాయి. మానవవాద నీతి నిశిత పరిశీలనకు, వివేచనాత్మక మార్గదర్శకత్వానికి నిలుస్తుంది. అందరం కలసి ప్రమాణాలు ఏర్పరచుకుందాం. ఫలితాలను బట్టి నైతిక సూత్రాలను పరీక్షిద్దాం.
  • పిల్లలకు నైతిక విద్య అవసరం, వివేచన, దయ పెంపొదిద్దాం.
  • మానవజీవితాన్ని మెరుగుపరిచేది వైజ్ఞానిక పరిశోధన, సాంకేతిక శాస్త్రమే.
  • పరస్పర అవగాహనకు, విభేదాలు పరిష్కరించుకోడానికి సంప్రదింపులు, రాజీలు ఉత్తమ పంథా.
  • విచక్షణ, అసహనం పోగట్టాలి. న్యాయం సాధించుకోవాలి.
  • మతాన్ని రాజ్యాన్ని వేరుచేయాలి.
  • వికలాంగులు తమ శక్తిపై తాము ఆధారపడేట్లు వారికి తోడ్పడాలి.
  • జీవితం ఆనందమయంగా గడపడానికి, వ్యక్తుల ప్రతిభను పూర్తిగా వికసింపజేసుకోడానికి కృషి జరగాలి.
  • వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి. యుక్తవయస్సు నుండీ వ్యక్తులు తమ ఆశయాలు సాధించుకునే అవకాశాలు వుండాలి. లైంగికంగా వారి యిష్టాయిష్టాలు వారికే వదిలేయాలి. సంతాన నిర్ణయంలో స్వేచ్ఛ వుండాలి. ఆరోగ్యసంరక్షణ అవకాశాలుండాలి. గౌరవప్రదంగా చనిపోయే రీతులు అవసరం.
  • విజ్ఞానానికి కళలకు సమాన అవకాశాలు వుండాలి.
  • మానవులంతా విశ్వపౌరులు, రానున్న కొత్త పరిశోధనలలో భాగస్వాములు కావాలి.
  • పరీక్షకు గురిచేయని వాటిపట్ల సందేహాలు ఉండాల్సిందే. కొత్త భావాలను ఆహ్వానించాలి. కొత్త ఆలోచనలు వెతకడాన్ని స్వాగతించాలి.
  • మానవవాదం వాస్తవం. హింసకు, నిరాశకు గురిచేసే మతవాదనలకు మానవవాదం మార్గాంతరం. మానవసేవలో మానవవాదం చక్కని మార్గాంతరం.
  • మనం నిరాశకు లోనుకాగూడదు. ఆశాజీవులంగా వుండాలి. నిస్పృహకంటే ఆశ మంచిది. పిడివాదం కంటే నేర్చుకోవడం ఉత్తమం. పాపం అనే భావన బదులు ఆనందం చోటుచేసుకోవాలి. భయం స్థానంలో సహనం రావాలి. ద్వేషం కాదు ప్రేమ కావాలి. అసహ్యతకు బదులు రామణీయకత చోటుచేసుకోవాలి. గుడ్డి నమ్మకాలబదులు వివేచన రావాలి.
  • మానవులుగా మనలోని ఉత్తమ, ఉన్నత లక్షణాలు సాధించుకోవాలి.

No comments:

Post a Comment