మతానికి విజ్ఞానానికి సంఘర్షణ--Sam Harris Letter to Christian nation


9వ భాగం

విజ్ఞానానికి మతానికి ఉన్న సంఘర్షణ పట్ల సైంటిస్టులు చిత్తశుద్ధితో మాట్లాడడం నైతిక ఆవశ్యకత. అయితే జాతీయ సైన్సు అకాడమి ఈ సంఘర్షణ భ్రమపూరితమైనదని పరిగణించింది :
“కొన్ని మతాలకు పరిణామానికి సంఘర్షణ ఉన్నదనే విషయంలో దురవగాహన ప్రబలింది.  మతానికి శాస్త్రీయ పద్ధతులకు మధ్య ఉన్న జ్ఞాన రీతులు నిశితమైన విబేధాలకు దారి చూపుతున్నదనే అభిప్రాయం ఉన్నది. మతాలు, విజ్ఞానం ప్రపంచాన్ని గురించిన భిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ఇష్టానికి, మానవమనుగడకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా అనేది వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నలు కావు. మానవ జీవితంలో మత, వైజ్ఞానిక జ్ఞాన రీతులు చాలా ప్రధాన పాత్ర నిర్వహించాయి. ఇంకా నిర్వహిస్తాయి కూడా. ప్రకృతిని గురించి తెలుసుకోవడం సైన్సు వివరిస్తుంది. అలౌకిక విషయాలను గురించి సైన్సు ఏమీ చెప్పదు. దేవుడు ఉన్నాడా? లేడా? అనే విషయంలో సైన్సు తటస్థంగా ఉంటుంది.”
ఈ ప్రకటనలో స్వస్థత లేకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వధనం లభించదేమో అనే భయం సైంటిస్టులకు నిరంతరం ఉన్నది. కనుక జాతీయ సైన్సు అకాడమీ పన్ను చెల్లించేవారి దృష్టిని గమనించి ఇలాంటి భయాన్ని వ్యక్తం చేస్తుండవచ్చు. మతానికి సైన్సుకు సంఘర్షణ తప్పనిసరి విజ్ఞాన విజయాలు తరచు మత మూఢవాదాలను దెబ్బతీస్తూ ఉంటాయి. మతమౌఢ్యం సైన్సుకు చాలా ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. మానవ మనుగడలో కేవలం ప్రయోజనం గురించే మతాలు ప్రస్తావించి ఊరుకోవు. సైన్సువలె ప్రతి మతం కూడా ప్రపంచాన్ని గురించి ప్రత్యేకమైన అంశాలను ప్రస్తావిస్తాయి. వాస్తవాలను గురించి ఇలాంటి ప్రకటనలు మతాలు చేస్తుంటాయి. సృష్టికర్త నీవు చేసే ప్రార్థనలు వింటాడని, వాటి ప్రకారం కోరికలు తీరుస్తాడని అంటారు. పుట్టినప్పుడు శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందంటారు. దేవుడి గురించి సరిగా నమ్మకపోతే మరణానంతరం చాలా బాధలకు గురవుతాడంటారు. ఇలా చెప్పేవన్నీ విజ్ఞానానికి భిన్నంగా ఉన్న అంశాలే. పైగా మతాలు చెప్పేవాటికి ఘోరమైన సాక్ష్యాలున్నట్లు గొప్పలు చెప్పుకుంటారు.
సైన్సు అంటే తెలుసుకోవడం అని స్థూలంగా చెప్పవచ్చు. ప్రపంచాన్ని గురించి ఏది వాస్తవమో మనం చేస్తున్న ఉత్తమ ప్రయత్నాల ద్వారా కనుగొంటున్నాం. ఇందులో సైన్సులోని తరతమ స్థాయిలు, చరిత్రవంటి మానవ శాస్త్రాలకు సైన్సుకు ఉన్న తేడాలు గమనించనక్కరలేదు. 1941 డిసెంబరు 7న పెరల్ హార్బర్ పై జపానువారు బాంబు వేశారనేది చారిత్రక సత్యం. ప్రపంచ దృష్టిని గమనిస్తున్నప్పుడు వైజ్ఞానిక వివేచనలో ఇది ఒక సత్యంగా నమోదు అవుతుంది. ఆ తేదీన కాక మరొక తేదీన బాంబు వేశారని ఎవరయినా అంటే, లేక బాంబు వేసింది ఈజిప్టువారని ప్రకటిస్తే ఆ విషయాలను సమర్థించుకోవడానికి చాలా వివరణ కావాలి. సైన్సులో మేథస్సుపరంగా చిత్తశుద్ధి ఉంటుంది. కేవలం మన అదుపులో ఉన్న పరిశోధనలు, గణిత నమూనాలే సైన్సు కాదు. ఒక ప్రతిపాదనలో సత్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాన్ని, తార్కిక వాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. మతంలో ఇందుకు భిన్నంగా వేరే ప్రమాణాలు ఉన్నాయని ప్రజలు ఊహిస్తారు.
రోమన్ కాథలిక్ మతం ఇటీవల వేటికన్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 30 మంది మత విజ్ఞానులు సమావేశమయ్యారు. క్రైస్తవమతం పుచ్చుకునే బాప్టిజం అనే క్రతువు లేకుండా చనిపోయిన శిశువుల పరిస్థితి ఏమిటని చర్చించారు. మధ్య యుగాలలో కాథలిక్కులు నమ్మినదానిని బట్టి అటువంటి పిల్లలు సహజమైన సంతోషాన్ని అనుభవించే లింబో స్థితికి వెడతారని నమ్మారు. సెయింట్ థామస్ అక్వినాస్ అలాంటి అభిప్రాయాలు చెప్పగా అందుకు విరుద్ధంగా సెయింట్ అగస్టిన్ ఆ పిల్లలంతా నరకంలో శాశ్వతంగా ఉంటారని నమ్మారు. బైబిల్ లో ఈ లింబో అనే స్థితికి ఆధారం లేదు. క్రైస్తవమతం అధికారికంగా దీనిని సిద్ధాంతీకరించలేదు. అయినా శతాబ్దాలుగా ఇదొక ప్రధానాంశంగా కాథలిక్ సంప్రదాయం కొనసాగిస్తున్నది. 1905లో పదవ పోప్ పయస్ ఇలా అన్నారు. “జ్ఞాన స్నానం (బాప్టిజం) లేకుండా చనిపోయిన పిల్లలు లింబో స్థితిలోకి పోయి దేవుని సన్నిధి లేకుండా, బాధలు పడకుండా ఉంటారు.” ఈ విషయాన్ని చర్చించడానికి క్రైస్తవమతం వారిలోని మేధావులను సమావేశపరచింది.
అలాంటి చర్చాపథకాన్ని మనం ఊహించగలమా? ఆ చర్చలు ఎలా ఉంటాయో గమనించండి. ఎవరైనా సరే బాప్టిజం పుచ్చుకొని పిల్లల స్థితి మరణానంతరం ఎలా ఉంటుందో చెప్పగల సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగలరా? చదువుకున్నవారెవరైనా ఈ విషయాన్ని దారుణమైనదిగా, కాలాన్ని వృధాపుచ్చేదిగా, హాస్యాస్పదమైనదిగా భావించరా? చిన్న పిల్లల్ని ఆచారాలకు గురి చేసిన వారిని కాపాడని సంస్థ కూడా  ఆ కాథలిక్ మతమే. మానవ శక్తియుక్తులను ఇంతగా వృధా చేయడం కాథలిక్ మతానికే చెందింది.
సైన్సుకు మతానికి ఉన్న సంఘర్షణ కనీస స్థాయికి తగ్గించవచ్చు. నమ్మేవారికి తగిన కారణాలు ఉండి ఉండాలి. లేదా కారణాలు లేకుండా ఉండాలి. జీసస్ కన్యకు పుట్టాడని, మహ్మద్ రెక్కలున్న గుర్రంపై స్వర్గానికి పోయాడని నమ్మడానికి తగిన ఆధారాలుంటే మనం విశ్వాన్ని వివరించడంలో వాటిని కూడా స్వీకరించవచ్చు. విశ్వాన్ని ఆధారంగా చారిత్రక సత్యాలు వివరించాలంటే అర్థం లేని విషయంగా భావిస్తాము. బైబిల్ కు ఖురాన్ కు మూలం ఏమిటని, జీసస్ తిరిగి లేచి వచ్చాడనడానికి, మహ్మద్ దేవదూత గాబ్రియేల్ తో సంభాషించాడనడానికి, తదితర మత మూర్ఖవాదనలకు ఎక్కడా సాక్ష్యాధారాలు లభించవు. కనుక వివేచన విఫలమయినచోట ప్రజలు నమ్మకంపై ఆధారపడుతున్నారని ఒప్పుకోవాలి.
సాక్ష్యాధారాలు లేకుండా నమ్మితే అదొక ఉన్మత్త స్థితి లేదా మూర్ఖత్వం అనుకోవాలి. కాని దేవునిపై విశ్వాసం ఇప్పటికీ మన సమాజంలో ప్రతిష్ఠాకరమైన నమ్మకంగానే చలామణి అవుతోంది. మనలో మతం అనేది ఒక ఉన్నతమైన అంశం అని మానవుడు యదార్థంగా చెప్పుకునే విషయం అని భావిస్తున్నారు. అలాంటి నమ్మకాన్ని ఉన్నతమైనదిగా చాలామంది పాటించడం ఒక ఆధారంగా చూపుతున్నారు. గ్రీకు దేవుడు వాసిడాన్ ను ఎవరైనా నేడు ఆరాధిస్తుంటే వారిని పిచ్చివాళ్ళుగా చూస్తారు.  

మూలం అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment