ముక్తి మార్గాలు అన్వేషించడం వృధా-6

జీవితమే సఫలము
ఉన్నత నైతిక ప్రమాణాలు

తోటి మానవులతో మన సంబంధాలు సాఫీగా సాగడానికి సాధారణ నైతిక రీతులు తోడ్పడతాయి. మన వ్యక్తిగత జీవితంలో పాటించే మానవ విలువలు ఎన్నో వున్నాయి. నైతిక అభివృద్ధికి, ఉన్నత ప్రతిభా వ్యుత్పన్నతకు, జీవితంలో సాధించే వాటికి నీతి తోడ్పడుతుంది. నీతి పాటించడం వలన మనలోని ఔన్నత్యం విప్పారుతుంది. అలాంటి నైతిక లక్షణాలు జీవితాన్ని సమతూకంలో నడిపిస్తాయి.
  • తొలుత స్వతంత్ర ప్రతిపత్తి - అంటే మనమీదమనం  ఆధారపడడం గొప్ప లక్షణంగా రాల్ఫ్ వాల్డొ ఎమర్సన్ పేర్కొన్నాడు. అంటే వ్యక్తి తన చర్యలకు తానే బాధ్యత వహించడం. వివాహం, వృత్తి, బ్రతుకు తీరుతెన్నులు అన్నిటికీ బాధ్యత వహించడం, తనకు తాను నిర్ణయాలు తీసుకొని సాగిపోవడమన్నమాట. స్వయం ప్రతిపత్తి అంటే స్వేచ్ఛను పాటించడమే. కొందరి దృష్టిలో స్వేచ్ఛ అంటే ఎంతో భారంతో కూడింది. తమ పట్ల  నిర్ణయాలను తల్లిదండ్రులకు, సహచరులకు, గురువులకు, నాయకులకు, ప్రవక్తలకు, లాభార్జనాపరులకు వదిలేస్తారు. జీవితం ఒక్కసారే వుంటుందనేది సత్యాన్ని స్వేచ్ఛాపిపాసి గుర్తిస్తాడు. ఎలా బ్రతకాలన్నది వ్యక్తి యిష్టం. మనం యితరులతో భాగం పంచుకుంటాం. ప్రజాస్వామిక నీతిని అంగీకరిస్తాం. కాని తుది నిర్ణయం వ్యక్తిదే.
  • విలువలలో వివేచన, తెలివితేటలకు అగ్రస్థానం వుంటుంది. కేవలం సాంకేతిక నైపుణ్యత వుంటే సరిపోదు. గ్రహణశక్తి పెంపొందించుకోకుంటే జీవితంలో ఉత్తమ దశల్ని సాధించలేం. మానవ తెలివితేటల్ని మానవుడి నిర్ణయాల్ని కించపరచేవారున్నారు. మనపై మనం ఆధారపడితే సమస్యలు పరిష్కరించలేమనే వారున్నారు. మన వివేచనను ఇతరులకు తాకట్టు పెట్టే వారున్నారు. వివేచన వలననే సమస్యలన్నీ పరిష్కారం కాకపోవచ్చు. కొన్నిసార్లు రెండు దోషాలలో తక్కువ హాని కలిగించేది ఎంపిక చేసుకోవలసిరావచ్చు. నైతికంగా బ్రతకాలంటే వివేచనాత్మక నిర్ణయమే ఉత్తమం.
  • మనల్ని మనం కట్టుబాటులో వుంచుకోవాలి. మన వాంఛల్ని అవసరాల్ని ఉద్వేగాల్ని తీర్చుకోవచ్చు. కాని దీనికి వివేచన జోడించాలి. మన నిర్ణయాలు ఇతరులకూ మనకూ హాని చేయరాదు. మనం ఉత్తేజపూరిత పథకాల గురించి కలలు గనవచ్చు. కాని అవి సాధించడానికి త్యాగాలు అవసరం. మన వివేచన తాకట్టు పెట్టి రంగంలో దిగరాదు.
  • మన వ్యక్తిగత హుందాతనాన్ని కాపాడుకుంటేనే మానసికంగా కొనసాగుతుంటాం. మనల్ని మనమే అసహ్యించుకుంటే వ్యక్తిత్వం దెబ్బతింటుంది. మనం ఎవరిమో ఏమిటో గ్రహించి ప్రవర్తించడం అవసరం. మన శక్తియుక్తుల్ని అంచనా వేసుకోలేకపోతే దెబ్బతింటాం. దేనికీ పనికిరాని వారమనే భావన మనల్ని ఆవహిస్తుంది. మనం సాధించగలమనే ధైర్యంతో సాగడం అవసరం.
  • విలువలలో అత్యంత ప్రధానమైనది సృజన. కొత్తవి కనుగొనడానికి యిది మంచి సాధన. ఇది అనంతమైన ప్రతిభల కూడలి. మన స్వతంత్ర ప్రతిపత్తికీ సృజనకూ సన్నిహిత సంబంధం వుంది. మనపై మనకు విశ్వాసం వుండడానికి యిది తోడ్పడుతుంది. మన ప్రతిభలు చూపడానికి యీ రంగం గొప్ప అవకాశం యిస్తుంది. సృజనలేని వ్యక్తి, వున్నదానితో సరిపెట్టుకుంటాడు. కొత్తమార్గాలు తొక్కడానికి ముందుకు రాడు. దారి మళ్లాలంటే పిరికితనం అడ్డొస్తుంది. జీవితంలో సాహసోపేతులు మాత్రమే నూతన విషయాలకు దారితీస్తారు. మనలోని మానవత్వానికి సృజన గీటురాయి. మన భవిష్యత్తుకు మనమే నిర్దేశకులం. జీవితానందాలకు కొత్తవి సమకూర్చి పెట్టేది సృజనపరులే. దీనికి సాహసం కావాలి.
  • మానవులకు ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలు సాధించాలనే పట్టుదల వుండాలి. కొత్త అనుభవాలకు, ఆలోచనలకు, నూతన మార్గాలకు సిద్ధపడాలి. అలాంటివారికి జీవితం ఆసక్తికరంగా, ప్రోత్సాహకరంగా వుంటుంది. జీవితం ఎన్నడూ విసుగుపుట్టించేది కాగూడదు. తాము చేస్తున్న పని మంచిది కాదనుకునేవారున్నారు. ఏదైనా సాధించాలనే ధోరణి ఆపేస్తున్నారు. గుంపులో కలిసిపోయి కొత్తదారులు తొక్కడానికి భయపడుతున్నారు. తమ శక్తియుక్తుల్ని గ్రహించకపోవడమే యిందుకు కారణం.
  • జీవితాన్ని ప్రత్యక్షంగా, స్పష్టంగా స్వీకరించాలి. మనం చేసే పని విలువైనది అనుకోవాలి. మన కృషి వలన కొంత మార్పు వస్తుందనుకోవాలి. భవిష్యత్తు బాటలు వేయగలమనుకోవాలి. కొన్ని వైఫల్యాలు రావొచ్చు. వాటిని దాటి, సాగిపోగలమనుకోవాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య కొంత ఎదురీదగల మనుకోవాలి. కొత్త సవాళ్ళను స్వీకరించాలి. జీవితంలో సాహసంగా బ్రతకడం ముఖ్యం. మన శక్తిని కించపరచుకోరాదు. మానవులుగా మన సత్తా చూపడం మానుకోరాదు. మన ప్రతిభా వ్యుత్పన్నతల్ని వెల్లడిస్తుండాలి. వచ్చిన అవకాశాల్ని స్వీకరించి, సృజనకు తోడ్పడాలి.
  • ఆనందంగా అనుభవించడం వ్యక్తి మంచి లక్షణం. అది మనిషికి తృప్తినిస్తుంది. భౌతిక మానసిక సుఖాలను అందిస్తుంది. ఇందులోనే ఇతరులకు మంచి చేసే రీతులూ వుంటాయి. చదవడం, అన్వేషించడం, జీవితాన్ని అనుభవించడం గొప్ప లక్షణం.
  • బాగా బ్రతకాలంటే ఆరోగ్యం సంగతి పట్టించుకోవాలి. మాదకద్రవ్యాలు స్వీకరించరాదు. పరిమితంగా తప్ప, మోతాదు మించి మత్తుపదార్థాలు తీసుకోరాదు. జీవితంలో వత్తిళ్ళు వస్తాయి. అదే అదుపు చేసుకోవాలి. పోషకాహారం అవసరం. తగిన విశ్రాంతి కావాలి. శారీరక అభ్యాసం చేయాలి. ఇతరులను ప్రేమించడం, వారి ప్రేమను పొందడం కూడా అలవరచుకోవాలి. మన జీవితాన్ని సహచరులతో, స్నేహితులతో పంచుకోవాలి. సమాజంలో భాగస్వాములు కావాలి. ఆటపాటల్లో పనిలో కలవాలి. ఏకాంతంగా గడిపే సమయాలు, ప్రశాంతంగా ఆలోచించే రీతులు అలవరచుకోవాలి.
  • జీవితంలో మంచి లక్షణాలకు దారిచూపే ఉత్తమ నైతిక లక్షణాలు గ్రహించాలి. సృజన, సంక్షేమం మంచి విలువలు. అనే ఆనందమయ జీవిత సారాంశం. జీవితం నుండి సన్యసించరాదు. చురుకుగా జీవించాలి. మన శక్తుల్ని యినుమడింపజేసేది జీవితమే. జీవించడమే జీవిత లక్ష్యం. ప్రతిక్షణం ప్రతిభావ్యుత్పన్నతతో గడపడంలో వున్న ఆనందం మరెక్కడా లేదు. జీవితానంతరం ఏదో దాచిపెట్టిన సత్యాలున్నాయనుకోవడం భ్రమ. ముక్తి మార్గాలు అన్వేషించడం వృధా. తప్పుడు లక్ష్యాలు, భ్రాంతి భ్రమలు జీవితాల్ని వృధా చేస్తున్నాయి. జీవితానందాల్ని జీవితంలోనే అనుభవించాలి. అదే వివేచన. అక్కడే సృజన వుంది. జీవితంలో దుఃఖాలు, బాధలు, కష్టాలు, విషాదాలు, ఆనందాలు, అద్భుతాలు వున్నాయి. అవన్నీ బ్రతుకుబాటలో భాగం. వాటిని స్వీకరించాలి.

రచన అనువాదం

పాల్ కర్జ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment