జీవితమే సఫలము
మానవవాదం ఒక మతం కాదు. తాత్విక, వైజ్ఞానిక, నైతిక దృష్టితో ఆచరించే వివేచనే మానవవాదం. కేవల తత్వమైతే, వివేచనను ప్రేమిస్తుందేగాని, ఆచరణ జోలికి పోదు. మానవవాదం అంతా ఆచరణమయంతో కూడిన వివేచన. నిశిత పరిశీలనతో నైతిక నిర్ణయాలు తీసుకోగలగడమే. నీతితత్వ సారాంశం. అది గొప్ప లక్ష్యం. మానవవాదం ఇంకొంచెం ముందుకెళ్ళి, పొందికైన నైతిక జీవనానికి సోపానాలు నిర్మిస్తుంది. ప్రకృతి గురించి ప్రతిపాదనలు, సిద్ధాంతాలు ఏర్పరుస్తుంది. ఆనాటికి లభ్యమౌతున్న వైజ్ఞానిక ఆధారాలతో యీ పని చేస్తుంది. పరీక్షించిన సత్యాలను సైతం నిశితంగా అంచనా వేయడం మానవవాద విశేషం. ఒకానొక దశలో రాజకీయ ఆదర్శాలను ఆకట్టుకోవచ్చు. మానవవాదం అటు జీవనతత్వాన్ని, యిటు ఆదర్శాన్ని మిళితం చేస్తుంది. ఇంకో అడుగు ముందుకు వేసి, మన ఆధారాలను బట్టి కట్టుబడి వుండే రీతులు పెంపొందిస్తుంది. జీవితంలో ప్రవర్తననూ, వివేచననూ కలపడమే మానవవాదం.
మనకున్న సాక్ష్యాధారాలను బట్టి ఏది కావాలో ఎంపిక చేసుకొని, అలా నడుస్తారు. నమ్మకాల ఆధారంగా మతస్తులు, రాజకీయవాదులు, సైనికులు, కవులు, కళాకారులు, వ్యాపారస్తులు, స్త్రీపురుషులు ఆచరణకు దిగుతారు. కాని నమ్మకాలకు ఆధారం వివేచన కావాలి. మానవవాదంలో వైజ్ఞానిక అవగాహన అతిముఖ్యం. వివిధ రంగాలలో ఆధారపడదగిన జ్ఞానం మన వివేచనకు ముఖ్యం. సిద్ధాంతపరమైన పరిశోధన నైతిక రంగంలో తటస్తంగా వుంటుంది. సాక్ష్యాలతో రుజువు చేయడం శాస్త్రజ్ఞుడికు ముఖ్యం. ప్రమాణాల జోలికి పోకుండా, అధ్యయనం చేసి, ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం శాస్త్రజ్ఞుడి పని. వైజ్ఞానిక రంగంలో తాత్విక ఫలితాలు రాబట్టి, స్త్రీపురుషులకు చెప్పేపని మానవవాదం చేస్తుంది. సైన్స్ ఆధారంగా ప్రపంచ దృష్టిని మానవవాదం రూపొందిస్తుంది. మన జ్ఞానంలో అనేక పరిమితులున్నాయి. వాటిని పరిశోధిస్తూ పోవాలి. మనకు తెలిసిన పరిమితులు మానవవాదం గుర్తిస్తుంది. శాస్త్రీయ వివేచనను ఎప్పటికప్పుడు జీవితానికి అన్వయిస్తూ మానవవాదం సాగుతుంది.
మనకుగల జ్ఞానం ఆధారంగా ప్రకృతిని జీవితాన్ని అవగాహన చేసుకుంటూ, ప్రమాణాలు ఏర్పరచుకోవడం మానవవాదం పని. ఒకవైపు విశ్వదృష్టి, మరోపక్క జీవితానికి తోడ్పడే ప్రమాణాలు, సూత్రాలు చూపడం మానవవాద కృషి.
దైవం ఏదో మనకు ప్రసాదిస్తుందని మానవవాదం ఎదురుచూడదు. ప్రకృతిలో భాగంగా మానవులను చూస్తుంది. కళల్ని, శాస్త్రాల్ని, వివేచనను, సానుభూతిని, చదువును, అన్వయించి జీవితాన్ని మెరుగులు దిద్దుకుంటూ సాగడమే మానవవాదం.
ప్రపంచానికి దూరంగా జరిగితే సుఖశాంతులు రావు. సాహసోపేతంగా సాధించుకుంటూ పోవాలి. ప్రతిక్షణం విలువైనది. ఎన్నో అవకాశాలు కనిపిస్తుండగా వాటిని సృజనాత్మకంగా అనుభవించాలి. జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలి.
మానవుడి స్థితి విషాదపూరితం కాదు. చావును, దుఃఖాన్ని, అవరోధాలను, బాధలను సాహసోపేతంగా, హుందాగా ఎదుర్కోవాలి. వైమనస్యత పోగొట్టుకోవాలి. జీవిత సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరులతో కలసి అనుభవించాలి. భాగం పంచుకోవాలి. తాదాత్మ్యం చెందాలి.
మానవులు పాపాత్ములని మతవాదులంటారు. వారంతట వారు సమస్యలు పరిష్కరించుకోలేరంటారు. దైవం వైపు సాయం కోసం ఎదురుచూస్తారు.
మానవుడు సంపూర్ణుడు కాదు. ఎన్నో పరిమితులున్నాయి. కొన్నిసార్లు సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. అంతమాత్రాన తెలియని శక్తిపై ఆధారపడకూడదు. వివేచనతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వివేచన విజ్ఞానం ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. యాజమాన్యానికి, పెత్తందారీలకు మోకరిల్లడం మానవవాదులు ఒప్పురు. మానవుడు శక్తిమంతుడు. పట్టుదల ఔన్నత్య లక్షణాలతో సాగాలి. ఇతరుల నైతిక శక్తి కూడా గమనిస్తూ పోవాలి.
రచన తెలుగు సేత
పాల్ కర్జ్ ఇన్నయ్య
No comments:
Post a Comment