కృష్ణుడెవరు?-----గీతా రహశ్యం--



అధ్యాయం ఏడు

కృష్ణుడెవరు అని ప్రశ్నించటం అసందర్భం కాదు. హిందూ మత కృతుల్లో, కవితలు, పాటలు, నృత్యాలు, నాటకాలు, శిల్పం, చిత్రాలు రూపకంగా హిందూ జీవన రంగంలో కృష్ణుడి ఆధిపత్యం వ్యాపించింది. హెర్మన్ ఓల్డెన్ బర్గ్ కృష్ణుడు ఎవరు అని ప్రశ్న వేశాడు. కృష్ణుడికి పోటీగా రాముడున్నా, హైందవేతరులలో రాముడికి భక్తులు ఆట్టేలేరు. క్రీ.పూ. రెండవ శతాబ్దంలోనే వాసుదేవుని పేరిట గ్రీకులు పూజలు చేశారు. (Cambridge History of India, Vol.I) క్రైస్తవులలో సహితం కృష్ణుడి ప్రభావం ఉన్నది. కమ్యూనిస్టు లోకంలోనూ ఇది వ్యాపించింది. భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న వాటిల్లో యిది ముఖ్యమైనది. అమెరికాలో కృష్ణ చైతన్యపేరిట మాదకద్రవ్య సంస్కృతిలోకి ప్రవేశించింది. సర్వరోగ నివారిణిగా ప్రచారంలోకి వచ్చింది. కృష్ణచైతన్యను ప్రచారం చేయటానికి అమెరికాలోని ఫోర్డ్ కుటుంబంవారు కోట్లాది రూపాలిచ్చారు.
కృష్ణుడెవరు అని అడగటం సులభమే గాని, సమాధానం అంత సులువు కాదు. బిపిన్ చంద్రపాల్ ప్రయత్నించి ఇంకా ఉచ్చులో బిగుసుకుపోయాడు. (Vipin Chanra Pal : Sri Krishna, 1963) కృష్ణుడు చాలా మంది ఉన్నారు. సిసలైన వాడెవరో తేల్చటం కష్టం. వేద కాలంలో ఒక కృష్ణుడు ఆర్యరుషికాగా, మరొకరు ఆర్యేతరులు. రుషిగా ఉన్న కృష్ణుడికి విశ్వకుడు అనే కుమారుడు, విష్ణవుడు అనే మనుమడు ఉన్నారు. ఈ మనవడిని అశ్వనీ దేవతలు పునరుద్ధరించారు. (H.H. Wilson, Rigveda, Vol – I 1946, Bangalore, Page : 190) ఇందులో అశ్వనీ దేవతలకు ప్రార్థన చేయటమే కృష్ణుడి పని. పౌరాణిక కృష్ణుడు తన గురువు సందీపుని సంతోషంతో సముద్రం అడుగుకు వెళ్ళి అతడి కుమారుడిని కాపాడతాడు. (Vemuri Sreenivasa Rao, Purvagadhalahari, 1952, Vijayawada, Page 270).
ఆర్యేతర కృష్ణుడిని రుగ్వేదంలో రాక్షసుడిగా చిత్రించాడు. 10 వేల సైన్యం అతనికి ఉండేదట. ఆర్యుల దేవుడు ఇంద్రుడితో అంశుమతి తీరాన పోరాటం జరిపినప్పుడు కృష్ణుడు ఓడిపోయాడు. అది ఆర్యేతర కృష్ణుడికి చాలా అపఖ్యాతి. పురాణాలలో దీన్ని తిరగదోడి విష్ణుపురాణం పేరిట కృష్ణుడు గెలిచినట్లు, ఇంద్రుడు ఓడినట్లు రాశారు. బృందావన గోపికలు ఇంద్రస్తుతి చేయడాన్ని కృష్ణుడు వ్యతిరేకించారు. కుంభవృష్టిని కురిపించిన ఇంద్రుడి దాడినుండి తన వారిని సంరక్షించటానికి కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికిన వేలుపై 7 రోజుల పాటు గొడుగుపట్టాడు. ఇంద్రుడు మేఘాలను పంపించి వేశాడు. ఇలాంటి కట్టుకథలకు పురాణాలు పెట్టింది పేరు.
ఉపనిషత్తుల్లో కృష్ణుడు దేవకీపుత్రుడుగా చాందోగ్యోపనిషత్తులో కనిపిస్తారు. అంగీరస శిష్యుడేనా ఈ కృష్ణుడు? అవునని ఆదిశంకరా చార్యుడంటాడు. (B. Majundar : Krishna in History and Legend, 1969, Calcutta Page : 3) సనాతనుల దృష్టిలో శంకరాచార్యుడు చెప్పింది తిరుగులేనిది. అంగీరసుని వద్ద కృష్ణుడు ఉపనిషత్తులు నేర్చాడు. పురాణాలను బట్టి కృష్ణుడి గురువు సందీప్. ఉపనిషత్తులను ఔపోసనం పట్టిన ఖ్యాతి కృష్ణుడికి దక్కితే, అంగీరసుడితో ముడిపెట్టక తప్పదు. శంకరాచార్యుడు మెదలు హేమచంద్రరాయ్ చౌదరివరకూ ఆపనే చేశారు. (Hema Chandra Roy Chaudhury, Materials for the History of the Vaishnava sect, New Delhi, 1975) చాందోగ్యంలో, గీతలో కొన్ని పోలికలు ఉన్నాయి. గనుక రాయ్ చౌదర అలా అభిప్రాయపడ్డాడు. ఆ విధంగా చూస్తే మర కొందరు ఉపనిషత్ రుషులకు కూడా కృష్ణుడు శిష్యుడేనని భావించాలి. ఎ.ఎస్.పి. అయ్యర్ ఇలా అంటాడు. అంగీరసుడికి గుణపాఠం చెప్పాలని భావించిన కృష్ణుడు శిష్యుడిగా వెళ్ళాడు. అతడి గ్రహణ శక్తిని గురించి ఆశ్చర్యపడిన అంగీరసుడు నేను చెప్పదగినదంతా నేర్చుకున్నావు. ఇక వెళ్ళవచ్చును అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు పెద్ద ఉపన్యాసమే యిచ్చాడు. యాజ్ఞవల్క్యులు గారితో చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. నిగూఢ సత్యాలను అచ్చుతుడు గ్రహించినట్లు అంగీరసుడు స్తుతించాడు. (A.S.P. Ayyar, Srikrishna, The Darling of Humanity, Madras, 1952) చాందోగ్య ఉపనిషత్తులో ఎంత వెదికినా అయ్యర్ అల్లిన కథ కనిపించవచ్చు. బ్రహ్మసమాజం వారిగా ఉన్న విపిన్ చంద్రపాల్ వైష్ణవుడిగా మారి కృష్ణుడిని అంగీరసుడికి శిష్యుడిగా చేశాడు.
మూడవ కృష్ణుడు మహాభారతంలో, హరివంశంలో కనిపిస్తాడు. ద్వంద్వ వ్యక్తిత్వం గల ఈ కృష్ణుడికి, గీతలోని కృష్ణుడికి పోలికలేదు. మహాభారతంలో దివ్యపురుషుడిగా ఒకవైపున, కురుపాండవుల మధ్య ఎత్తుగడలు, కుట్రలుపన్నిన వ్యక్తిగా మరోవైపునా కనిపిస్తాడు. విష్ణు పురాణంలో కృష్ణుడు గోపికలతో సంచరిస్తాడు. ఇది క్రీ.త. 5వ శతాబ్దంలో రాసింది. కృష్ణుడు నర్మదానదీ తీరాన రాక్షసులను బౌద్ధ జైనులుగా మార్చినట్లు చూపారు. మహామోహ వేషంలో ఆ పని చేశారన్నాడు. (The Cultural Heritage of India, 1969, Calcutta) ఇలాంటి చిత్రణలో ఇతిహాసాలూ, పురాణాలలో మసురుకొని ఉన్నాయి. బుద్ధుడికంటె కొన్ని శతాబ్దాలు ముందే రాముడు ఉండగా, రామాయణంలో బుద్ధుణ్ణి చోరుడుగా రాముడు పేర్కొంటాడు (M.N. Dutt : Ramayana).
భాగవత పురాణంలో కృష్ణావతారం కనిపిస్తుంది. విష్ణుపురాణంలో గోపికలలో సరసాలు ఉండగా, భాగవతంలో వాటి రూపం మారింది. రాధ అప్పటికి రాలేదు. క్రీ.త. 9, 10 శతాబ్దులలో భాగవత కృష్ణుడు వచ్చాడు. కొందరు క్రీ.త. 13వ శతాబ్దానికి కూడా ఈ కృష్ణుడిని నెట్టివేశారు. (Maurice Winter nitz. A History of Indian Literature, Vol-I, Part-II).
క్రీ.త. 14, 15 శతాబ్దాలకు చెందిన బ్రహ్మవైదత్త పురాణంలో కృష్ణుడు కనిపిస్తాడు (Seethanath Tatwabhushan : Krishna And Puranas, Calcutta, 1926). రాధ శృంగార నాయకిగా కనిపిస్తుంది. వైష్ణవ వాదంలో కృష్ణుడి తరువాత ఆమెదే పైచేయి. రాధాకృష్ణుల శృంగార లీలను సమర్ధించటానికి దివ్యాత్మలూ, వ్యక్తి పరమాత్మ లోలీనం కావటం అలాంటివన్నీ తెచ్చిపెట్టారు. కాని, అసలు విషయాన్ని దాచలేకపోయారు.
నారాయణ ఉవాచలో ఇలా ఉంది.
కృష్ణుడు రాధను వివస్ర్తను చేసి ఆమె స్తనాలను పట్టుకుంటాడు. నాలుగు రీతులుగా చుంబిస్తాడు. సంభోగంలో రాధ గజ్జలు తెగిపోతాయి. ముద్దులతో ఆవిడ పెదాలు ఎరుపెక్కుతాయి. స్తనాలపై గంధం చెరిగిపోతుంది. కొప్పువూడి పోతుంది. బొట్టు చెరిగిపోతుంది.
నీరద్ సి. చౌదరి బ్రహ్మ వైవర్తంలోని ఈ భాగాన్ని అనువదించాడు. ఇందులో జీవి అనంతంలో కలిసిపోయే దేమిటో పిచ్చివాడికి కనిపించవలసిందే.
తరువాత కృష్ణుడి పైకి వచ్చిన రాధ సంభోగిస్తుండగా ఆవిడ కాళ్ళ పారాణి చెరిగిపోతుంది. ఆ ప్రక్రియలో ఆమెకు పారవశ్యం కలుగగా రాత్రింబగళ్ళకు తేడా లేకుండా పోయింది. నఖక్షతాలు, దంతక్షతాలతో కృష్ణుడు 8 భంగిమలలో ఆమెతో సంభోగిస్తాడు. గాజుల, మట్టెల చప్పుళ్ళ మధ్య రాధ ఇక భరించలేక సంభోగం నుండి వైదొలగుతుంది. (C. Nirad Chawdhary, Hinduism, New Delhi, 1979) నీరద్ చౌదరి పురాణాలలోని ఘోర విషయాలను ప్రస్తావించాడు.
రాధతో నిమగ్నుడైన కృష్ణుడు గోపికలకు అన్యాయం చేస్తున్నట్లు భావించి ఉద్యానవనంలోకి వెళతాడు. 9 లక్షల మంది ఉండగా అంతమంది పురుషులుగానూ కృష్ణుడు మారి సంభోగించగా ఉద్యానవనం ప్రతిధ్వనిస్తుంది. సామూహిక సంభోగ ప్రక్రియ కొనసాగుతుంది.
సంస్కృతం, ఇంగ్లీషు బాగా తెలిసిన నీరద్ చౌదరి ఈ ప్రక్రియను అనువదించి చూపాడు. యోగులందరికీ గురువైన నారాయణుడు అనేక రూపాలు ధరించి సంభోగించాడు. అప్పుడు గాజుల, మెట్టెల, పట్టెల చప్పుడు ఆనందంగా వినిపించింది. వారంతా పారవశ్యంగా స్పృహ తప్పారు. తెలివి వచ్చిన తరువాత గిచ్చుళ్ళతో, కొరుకుళ్ళతో కృష్ణుడు వారి పిరుదలపై ముద్ర వేశాడు. నగ్నంగా వారెంతో సుందర రూపాలతో ఉన్నారు.
అలాంటి కృష్ణుడిని చూచి వల్లభాచార్యుడూ, చైతన్య, ఇతర వైష్ణవ భక్తులు పారవశ్యం చెందారు. ఆ కృష్ణుడిని చూసే అండాళ్ చండీదాస్, జయదేవుడు, మీరాబాబు, సూరదాస్, విద్యావతి, పోతన, నర్సిమెహతా వంటి కవులూ, కవయిత్రులూ ఆలపించారు. ఆ కృష్ణుడిని గురించే మాధవుడూ, దైవం లీనమైనట్లు ఆధునిక జీవిత చరిత్రల్లో రాశారు.
ధీరేంద్రనాధ్పాల్ ఇలా అన్నారు. ప్రేమరాజ్యం హిమాలయాల నుండి దక్షిణాది వరకూ, ద్వారక నుండి తూర్పు తీరాల వరకూ వ్యాపించింది. (Dhirendranath Pal : Sri Krishna, His Life and Teachings, Calcutta 1904).
కృష్ణుడిని ఎవరూ అర్థం చేసుకోలేదనీ, అతని మార్మికవాదం గొప్పదనీ పాల్ పొగిడాడు. ఐనా, అతన్ని గురించి మనకు తెలియజెప్పడానికి పుస్తకం రాశారు. మోహన్ లాల్ సేన్ 3 సంపుటాలలో కృష్ణుడిని గురించి రాస్తూ బృందావన లీల పేరిట మొదటి సంపుటంలో గోపికలతో కృష్ణుడి క్రీడలను రాశాడు. పారవశ్యం చెందినట్లు కృష్ణుని చిత్రించాడు. బృందావన లీల అంతా ప్రేమమయం అన్నాడు. హిందువులకే గాక అందరికీ శ్రీ కృష్ణుడు దేవుడన్నాడు. (Mohanlal Sen : Lord Sri Krishna, His Life and Teaching, Calcutta 1954).
ప్రతాప్ ఆర్. పరేఖ్ కృష్ణుడి జీవితాన్ని రాస్తూ కృష్ణుడు వాస్తవం అన్నాడు. అతని వంశపారం పర్యతనూ, గ్రహరాసి ఫలితాలను గూడా యిచ్చాడు. బృందావనంలో గోపికలతో, రాధలతో శృంగార లీలను వర్ణించాడు. వీటిని విమర్శించే వారిని గర్హించాడు. గొప్ప వారు ధర్మాన్ని మించిపోయి, నియమాలను పాటిస్తారన్నారు. వారికి దోషాలంటవన్నాడు. చట్టాలు బలహీనులకే అన్నారు. (P. Pratap Parekh : Krishna, Myth or Reality).
హనుమాన్ ప్రసాద్ ప్రోద్దార్ కృష్ణుడి గోపికా లీలను 100 పేజీలలో చిత్రించాడు. దివ్యలక్షణాలున్న వారిలో ప్రేమ స్వభావాన్ని బూతుగా చూడరాదన్నాడు. విశ్వాసంలేని భార్యకు 3 కారణాలుగా గౌరవాన్ని ఆపాదించాలన్నాడు. 1. ప్రేమికుడిపై నిరంతర ధ్యాస, 2. ప్రేమికుడిని కలవాలనే తీరని వ్యామోహం, 3. ప్రేమికుడి దోషాలను పూర్తిగా విస్మరించటం. అలాంటివి మామూలుగా పెళ్ళి చేసుకున్న భార్యలో ఉండదన్నారు. గోపికలు కృష్ణుడితో ఎడబాటు క్షణం కూడా సహించలేకపోయారన్న మాట. ఎ.ఎన్.పి. అయ్యర్ మరొక అడుగు ముందుకి వేసి శ్రీకృష్ణుడు పురుషులందరికీ తండ్రి అనీ, స్ర్తీలందరికీ భర్త అనీ రాశాడు.
కృష్ణభక్తులు బలహీనులకు ఒక నియమం, బలవంతులకు మరో నియమం చూపుతున్నారు. రెండు విధాలైన నీతి శాస్ర్తాలు పేర్కొని ఒకటి దేవుళ్ళకూ, మరొకటి మానవులకూ చెందిందంటున్నారు. భారతీయ జీవనంలో యిదే రెండు నాలుకల విధానం. కృష్ణుడికి చెందిన జీవిత గాధలలో ఇది కన్పిస్తుంది. బాబా పరమానంద్ భారతి, మోనికా వర్మ అలానే రాశారు. (Monika Varma : Lord Krishna, Love Incarnate, New Delhi. 1978 : Baba Paramananda Bhrath, Sri Krishna. The Lord of Love, New York 1904).
భారతీయ బాబాలూ, భగవాన్లూ అమెరికా వెళ్ళి డబ్బు గడిస్తున్నారు. కామం ద్వారా ముక్తి సాధించాలనే భగవానుడొకరు అమెరికాలో ప్రచురణలు చేశారు. అతడి పేరు డొనాల్డ్ ఆర్. కిన్ స్లే. కృష్ణుడిని గురించి రాస్తూ రాధాకృష్ణుల ప్రేమ, గోపికలతో కృష్ణుడి శృంగార లీలలు దివ్యానుభూతిని సూచిస్తాయన్నాడు. ఆ దశలో మామూలు బంధాలు తెగిపోతాయన్నాడు. ఆ శృంగారం నీచమయింది కాదనీ, క్షణికమైంది కాదనీ, అరమరికలు లేనిదనీ, ఆనందభరితమనీ చెప్పాడు. గోపికలు మానవ మాత్రులు. వారు సాధారణ విషయాలను విస్మరించిన దైవమత్తులో స్వేచ్ఛగా శృంగార లీల జరుపుతారన్నాడు. (Donald. Kinsley : The Sword And the Flute, Kali and Krishna, New Delhi)

ఇలాంటి మాటలు కృష్ణ భక్తులకు ప్రోత్సాహాన్నిస్తాయి. అమెరికా ఆధ్యాత్మిక వాది పాదాల వద్ద కూర్చొని బృందావన సందేశాన్ని వినమంటారు. అది అలా ఉంచి ఇందరి కృష్ణులలో అసలు వాడెవరు. అంటే, సంప్రదాయ వాదులు మహాభారతంలో, గీతలో కృష్ణుడుని చూపిస్తారు. అదేమిటో చూద్దాం.
By Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

1 comment:

కమనీయం said...


ఏదీ అంత ఖచ్చితంగా చెప్పలేము.చరిత్రకారులలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి.మహాపద్మనందుడికి పూర్వం 60 తరాలు గడచినట్లు, తరానికి సుమారు 30 సం.తేడా లెక్కిస్తారు.అంటే మహాభారత యుద్ధం క్రీ.పూ. 2000 సం.ప్రాంతంలో జరిగిఉంటుందని భావిస్తారు.ఇది ఒక లెక్క.మెగస్తనీసు పేర్కొన్న చంద్రగుప్తుడు మౌర్య చంద్ర గుప్తుడు కాదు,గుప్తచంద్రగుప్తుడు అని మరొక వాదన.అలా అయితే చరిత్ర మరొక 600 సం. వెనక్కు వెళ్ళుతుంది.ఏదీ ఇంకా గట్టి ఆధారాలు దొరికితేగాని చెప్పలేమని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
ఇంక కలియుగం చెడ్డది, కృతయుగం మంచిది అనేభావన లాంటిది ప్రాచీన గ్రీకులకు కూడా ఉండేది.నార్లవారి అభిప్రాయమే అంతిమసత్యంగా భావించలేము.

Post a Comment