ముందు మాట : ఇబన్ వారక్
నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నేడు ఇస్లాం రిపబ్లిక్ అని చెప్పుకునే దేశంలో పెరిగాను. నా కుటుంబీకులు ముస్లింలే. కొందరు ఛాందసులు, మరి కొందరు అంత కాదు. నా చిన్నతనంలో సుంతీ, కొరాన్ పాఠశాలలో తొలి రోజు జ్ఞాపకమే. దానినిబట్టి మనో విశ్లేషకులు రాబట్టేదేమైనా ఉంటే అలా చేయవచ్చు. నా జాతీయభాష చదవడం, రాయడం రాకముందే, అరబ్బీ చదవడం నేర్చాను. ఒక్క మాటకూ అర్థం తెలియదు. అది ముస్లింపిల్లలకు సహజానుభవమే. సొంతంగా ఆలోచించడం మొదలైన తరువాత, నా మీద రుద్దిన మత ఛాందస పిడి వాదనల్ని వదిలేశాను. ప్రస్తుతం నేను సెక్యులర్ హ్యూమనిస్ట్ ను. మానసిక రుగ్మతతో కూడిన వారి కలల ఫలితమే మతాలని నా ఉద్దేశం. అవన్నీ తప్పుడివే. అలా రుజువుపరచవచ్చు కూడా. మతాలన్నీ హానికరాలే.
అలాంటి పరిస్థితులలో వచ్చిన నేను అలానే ఉండేవాడిని కానీ, ఇస్లాం చెలరేగడం, రష్డీ వ్యవహారం చూశాను. నేను ఇంతకు ముందు ఏ పుస్తకమూ రాయలేదు. కానీ ఈ సంఘటనల మూలంగా రాయవలసి వచ్చింది. 1930 ప్రాంతంలో నాజీ వాదం, కమ్యూనిజం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజు, దేశం, సామ్రాజ్య వ్యతిరేక వాదం ఇత్యాది సిద్ధాంతపర వాతావరణంలో మనం ఎలా నిలదొక్కుకున్నామోనని, యుద్ధం తరువాత వారు నోరునొక్కుకునేవారే. జీవన్మరణ సమస్య ఎదుర్కొన్నప్పుడు ఏ ధోరణి అవలంబిస్తామనేది అరుదుగా పరిష్కరించాల్సి వస్తుంది. అందులో ఇస్లాం చెలరేగడం, రష్డీ సమస్య, వాటివల్ల నేను తీసుకున్న ధోరణే ఈ గ్రంథంలో విశేషాలు. 1930 ప్రాంతంలో లేకపోతిమే అని చింతించే వారికి నేడు రష్డీ సమస్య ఎదురవుతుంది. అల్జీరియా, సూడాన్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ లలో జరుగుతున్న ఘర్షణలలో ముస్లింలు, ముస్లిం స్త్రీలు, ముస్లిం మేథావులు, రచయితలు, సాధారణ పౌరులు బలి అవుతున్నారు. ఈ పుస్తకం నా యుద్ధ యత్నమే. ఇలాంటి రచన చేయగలనా అని నా వివేచనను ప్రశ్నించుకున్నప్పుడల్లా, దేవుడి పేరిట కొత్తగా హత్యలు, ఇస్లాం పేరిట అల్జీరియా, సూడాన్, ఇరాన్, టర్కీలలో జరిగే మారణ హోమాలు నన్ను నా పుస్తకం పూర్తి చేసేటట్లు పురిగొల్పాయి.
ముస్లింల కోసం వాదిస్తున్నామనే పత్రికా రచయితలు, కమ్యూనిజం నుండి ఇతర మతాల నుండి మారినవారు, పాశ్చాత్యలోకంలో పుస్తకాలు, వ్యాసాలు రాశారు. అవి దారుణంగా, అసహ్యంగా ఉన్నాయి. రష్డీ వ్యవహారానికి సంబంధించినదే ఈ ఉదంతం. వీరంతా ముస్లింలకోసం స్పందించడంలేదు. కానీ ముస్లిం దేశాలలో కొందరు ధైర్యవంతులు, రష్డీని సమర్థిస్తూ నిలబడ్డారు. 1994 జనవరిలో ఈజిప్ట్ పత్రిక రోజ్ ఆల్ యూసస్ రష్డీ శటానిక్ వర్సెస్ నుండి కొన్నిభాగాలుగా ప్రచురించింది.
ఇస్లాంలో మౌలిక పిడివాద సూత్రాలపట్ల నిశిత పరిశీలన, రాజీలేని ధోరణి ఛాందస సముద్రంలో సందేహ బిందువులు ఈ గ్రంథం ప్రయత్నంగా ఉంటుంది. దీనిపై విమర్శ వస్తుందని తెలుసు. జాన్ స్టువర్ట్ మిల్. అతని అభిమాని వాన్ హైక్ మాటల్ని ఈ సందర్భంగా ఉదహరిస్తాను.
స్వేచ్ఛ (లిబర్టీ) గురించి మిల్ ఇలా అన్నాడు.
స్వేచ్ఛగా చర్చ కావాలని ఆహ్వానించేవారే. అందుకోసం చివరి దాకాలాగొద్దంటారు. తగిన కారణాలు లేకుంటే ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయరాదో అర్ధం కాదు. (ఆన్ లిబర్టీ, పుట 83) మిల్ ఇంకా ఇలా అన్నాడు.
అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నోరు నొక్కడం మానవ జాతిని దోచుకోవడమే. వాడుకలో ఉన్న అభిప్రాయానికి నిరసన చూపే వారిపట్ల, అలాంటి భావాలున్నలున్న వారిపట్ల అన్యాయం చెయ్యడమే. అభిప్రాయం సరైనదైతే, సత్యాన్ని స్వీకరించి దోషాన్ని తృణీకరించే అవకాశం పోగొడుతున్నారు. దోషంతో సత్యాన్ని మిళితం చేసినప్పుడు స్పష్టంగా విషయాన్ని చూడడం సాధ్యం కాదు. అభిప్రాయాన్ని నోరు నొక్కేసేముందు అది తప్పుడు భావన అని నిర్ధారించాలి. ఒకవేళ తప్పుడు భావన అయినా బలవంతంగా అణచివేస్తామనడం తప్పు. (అదే పుస్తకంలో పుట 79).
(యుటిలిటేరియనిజం, లిబర్టి, రిప్రజంటేటివ్ గవర్నమెంట్, లండన్ 1960)
వాన్ హైక్ (von hayek) ఇలా అంటాడు. ఏ సమాజంలోనైనా స్వేచ్ఛాభావన పరిమితమైన కొద్దిమందికే ప్రాధాన్యత వహిస్తున్నది. అయితే ఈ స్వేచ్ఛను ఎవరికి ఇవ్వాలనే విషయమై నిర్ణయించే సమర్థత, అధికారం ఎవరికీ లేదు! మేథా సంపన్నమైన స్వేచ్ఛ అందరికీ ఒకే విధమైన స్వతంత్ర ఆలోచన అందించదు. గనుక, దానిని నిరాకరించడం కేవలం స్వేచ్ఛ విలువను గుర్తించకపోవడమే. ప్రతివారూ ఆలోచిస్తున్నారా, రాస్తున్నారా అనిగాక, ఏ భావన అయినా కొందరు వాదించడానికి అవకాశం ఉంటేనే, మేథాసంపన్నమైన పురోభివృద్ధి ఉంటుంది. నిరసనను అణచనంతవరకూ సమకాలీన భావాల్ని ప్రశ్నించేవారుంటారు. కొత్త భావాల్ని ప్రచారం చేయడం, పరీక్షకు పెట్టడం కుదురుతుంది.
భిన్న భావాలు, విభిన్న అవగాహనగల మేథావుల మధ్య భావ సంపర్కం జరిగితే, ఆలోచనా జీవన స్రవంతి సాగుతుంది. వివేచన పెంపొందడం సామాజిక రీతి, భిన్నాభిప్రాయాలపై ఇది కొనసాగుతుంటుంది. (పుట. 122 ది రోజోటు సెర్ఫ్ డం, లండన్ 1944).
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
కృతజ్ఞత : ఇబన్ వారక్
నేను పండితుడిని కాను. నిపుణుడినీ కాను. సొంతంగా చెబుతున్నాననుకోవడం లేదు. పండితులపై ఆధారపడి, వారిని ఉదహరిస్తూ, వారి భావాలను సంక్షిప్తంగా రాసి, అవి సేకరించిన వివరాలు నోట్స్ లోనూ, గ్రంథ పట్టికలోనూ ఉదహరించాను. నా సృష్టి అనదగిన ఆలోచన, భావన లేదు. ఉదాహరణల పట్టిక పుస్తకం అని ఎవరైనా దీనిని అంటే నేను బాధపడను.
ఇస్లాం విజ్ఞాన సర్వస్వం (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం) ప్రథమ, ద్వితీయ ముద్రణలు నాకు ఎంతో తోడ్పడ్డాయి. ప్రథమ ముద్రణలో ఉన్న సందేహవాదం ద్వితీయ ముద్రణలో లేదు. నిశిత పరిశీలన కోల్పోయి, రాజకీయ, మత విషయాలు సరైనవేనా అని ద్వితీయ ముద్రణ సరిచూడలేకపోయింది. ఇస్లాం నిఘంటువు (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం) తప్పనిసరి అయింది. అందులో సందేహ వాదన చోటు చేసుకుంది. బెర్న్ డ్ లూయీస్, మాంట్ మొరీవాట్ లకు నేనెంత రుణపడిందీ నోట్ పుస్తక పట్టిక తెలుపుతుంది. బెర్నాడ్ లూయీస్ గత అర్థశతాబ్దిలో ఇంగ్లీషు వచన రచనలో గొప్పవాడు.
ప్రొఫెసర్ వాట్ గురించి కొన్నిసార్లు నేను కర్కశంగా రాసినా అయన గొప్ప పండితుడు. స్పష్టంగా అరమరికలు లేకుండా రచించాడు. న్యూ హ్యూమనిస్ట్ పత్రికలో ఇబ్న ఆల్ రవాండి రాసిన వ్యాస పరంపర నాకు నైతిక సత్తాను, ప్రోత్సాహాన్నిచ్చింది. బహుశ న్యాయం కాదుగాని కొందరు రచయితలను ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాను.
2వ అధ్యాయం డి. టైప్స్
3వ అధ్యాయం డబ్ల్యూ.టిస్ డల్, ఎం.బోయ్ స్, ఎస్.జ్విమ్మర్,
సిసిటోరే, ఎ.జైగర్
4వ అధ్యాయం ఎస్.హర్ గ్రోంజె, ఐ.గోల్డ్ జిహర్, జె.షాట్,
ఎం.కున్, పి. క్రోన్
5వ అధ్యాయం ఎ. జెఫ్రి, డబ్ల్యూ మూర్
6వ అధ్యాయం ఆర్.బెల్, డబ్ల్యూ ఎం.వాట్, ఎ.దష్తి
7వ అధ్యాయం జి.హెచ్.బాక్వె, జె.షాట్
8వ అధ్యాయం ఎ. ఐ. మేయర్
9వ అధ్యాయం ఐ. గోల్డ్ జిహర్
10వ అధ్యాయం బియోర్ (ఆమె మూడు రచనలపై ఈ
అధ్యాయం ఆధారం)
11వ అధ్యాయం జి. వాడ్డ, ఆర్.వాల్జర్, ఐగోల్డ్ జిహర్
12వ అధ్యాయం ఎం.ప్లెన్నర్, పైన్స్, ఆర్.ఎ.నికల్ సన్,
ఎ.జె.ఆర్చరీ
13వ అధ్యాయం ఎ.జె.ఆర్చరీ
14వ అధ్యాయం ఆర్. ఎ. నికల్ సన్, ఎ. రిహాని
15వ అధ్యాయం జి. ఆషా (ఈ అధ్యాయంలో విలువగలవన్నీ
బాస్క్వే నుండే)
16వ అధ్యాయం ఖమరియా, గిధా, లివాట్, ఎఫ్.జె.సి.మూన్స్
17వ అధ్యాయం డబ్ల్యూ ఎం. వాట్, డి. ఎస్. మార్గోవిత్, డబ్ల్యూ మూర్
18వ అధ్యాయం ఎల్. హిస్కెట్
ఎకర్ మన్ తో మాట్లాడుతూ గెట సలహా సూచన చేస్తూ, గ్రంథ చౌర్యంపై ఒక రచయితకు ఇలా చెప్పాడట. నేను రాసిన దానిలో ఒక పుస్తకం నుండో, జీవితం నుండో స్వీకరించాననడంలో అర్థం లేదు. అసలు సంగతేమంటే, సరిగా వినియోగించానా లేదా అని చూడాలి. చాలామంది ఇస్లాం పండితుల పరిశోధనా పాండిత్యాన్ని నేను వాడటం వారు ఆమోదిస్తారో లేదో తెలియదు. కాని అందులో కర్కశంగా తుది నిర్ణయాలతో ఇస్లాం గురించి రాసిందంతా కేవలం నాది మాత్రమే.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
పరిచయం : ఇబన్ వారక్
ఈ పుస్తకం చదివేటప్పుడు సిద్ధాంతానికీ, ఆచరణకు గల తేడా గుర్తుంచుకోవాలి. ముస్లిం ఏం చేయాలి. వాస్తవానికి వారేమి చేస్తున్నారు అనే విచక్షణ గమనించాలి. వారు నమ్మి చేస్తున్నదేమిటి, నమ్మవలసి ఉన్నదేది అనేది కూడా గుర్తించాలి. ఇస్లాంను మూడు కోణాల నుండి పరిశీలించాలి. ఇస్లాం ఒకటిలో ప్రవక్త చెప్పింది ప్రధానం, అంటే కొరాన్ లో ఆయన చెప్పిందన్నమాట. ఇస్లాం రెండులో సంప్రదాయాల (హడిత్) ద్వారా మత పండితులు ప్రవచించి, వ్యాఖ్యానించి, పెంపొందించిన మతం. దీనిలో షరియా, ఇస్లాం చట్టం కూడా ఉన్నాయి. ఇస్లాం మూడులో ముస్లింలు వాస్తవానికి చేసింది, సాధించింది ఏమిటి అంటే ఇస్లాం నాగరికతను గమనించడన్నమాట.
ఇస్లాం మూడులో ఇస్లాం నాగరికత అత్యున్నత దశకు చేరుకున్న ఉదంతం ఈ గ్రంథంలో ఆవిర్భవిస్తుంది. ఇస్లాం ఒకటి, రెండు వలన గాక, వాటిని మించి సాధించిన పని ఇది. ఇస్లాం ఒకటి రెండుతోనే పరిమితమై ఉంటే, ఇస్లాం విజ్ఞానం, సాహిత్యం, కళలు ఉన్నత దిశకు చేరుకునేవి కావు. ఉదాహరణకు కవిత్వం చూద్దాం. తొలి దశలో కవుల్ని మహమ్మద్ ఈసడించుకున్నాడు. దారితప్పిన వారు కవుల్ని అనుసరిస్తారు (సుర.26.224) మిష్కత్ సంప్రదాయాలలో మహమ్మద్ ఇలా అంటాడు. కడుపునిండా కవిత్వంకంటే చెడు పదార్థంతో పొట్ట నింపటం మంచిది. ఇస్లాం ఒకటి, రెండు దశల్ని అనుసరిస్తే, సోమపానాన్ని శ్లాఘిస్తూ యువకుల పిరుదుల్ని పొగుడుతూ, అబూ నువాస్ రాసిన కవితలు గానీ, అరబ్ సాహిత్యంలో సుప్రసిద్ధ మదిర (సారా) కవితలుగాని వచ్చేవే కాదు.
ఇస్లాం నిఘంటువు ప్రకారం మహమ్మద్ చిత్రకారుల్ని, మనుషుల, జంతువుల బొమ్మలు గీసే వారిని శాపనార్ధాలు పెట్టినందువలన, ఇస్లాం కళలో వాటిని నిషిద్ధాలుగా భావించారు. (మిష్కత్ 7, అధ్యాయం 1, ఒకటో భాగం) అరబ్ చిత్రకళ పరిచయ వాక్యాలలో ఎటింగ్ హాసన్ ప్రస్తావిస్తూ బొమ్మలు గీసే వారిని అధములుగా హడిత్ ఖండించినట్లు చెప్పాడు. సృష్టికర్త అయిన దేవుడితో వీరు పోటీ పడుతున్నట్లు భావించారు. చట్ట ప్రకారం బొమ్మలతో కూడిన చిత్రకళకు ఆస్కారం లేదు. కొత్తగా మారిన ముస్లిమ్ లు ఈ సనాతన స్థితిని అనుసరించక, సంపన్న చిత్ర సంప్రదాయాల్ని, ప్రాచీన నాగరికతల్ని పాటించి, పర్షియన్ మొగల్ చిత్ర కళల్ని రూపొందించారు.
ఇతర నాగరకతలతో, ఉన్నత సంపదతో సంబంధాల వలన ఇస్లాం కళ, తత్వం, విజ్ఞానం సృజనాత్మకంగా పెంపొందింది. ఇస్లాంలో ఒకటి రెండు దశలవలన ఇవి రాలేదు. కళలు, తత్వం, శాస్త్రీయ సంప్రదాయాలు అరేబియాలో బొత్తిగా లేవు. అరబ్ గతం నుండి కవిత తలెత్తి, సృజనాత్మకత కొనసాగడానికి ఇస్లాం ప్రేరణ అంతగా తోడ్పడలేదు. బైజాంటైన్, ససానియన్ కళలు లేకుంటే ఇస్లాం కళలు ఉండేవి కావు. ఇస్లాం ఒకటి, రెండు దశలు కూడా కళలకు వ్యతిరేకం. గ్రీకు తత్వం, విజ్ఞానం పెరిగేవి కావు. ఈ విదేశీ శాస్త్రాలకు ఇస్లాం ఒకటి, రెండు దశలు వ్యతిరేకం. సనాతనుల దృష్టిలో ఇస్లాం తత్వం అనేది పరస్పర విరుద్ధం. ఇస్లాం సైన్స్ వృధా.
ఈ రంగాలలో అత్యున్నతంగా ప్రాతినిధ్యం వహించిన వారు ఇస్లాం ఒకటి, రెండు దశలకు వ్యతిరేకులు, ముస్లిమేతరులు మాత్రమే. గ్రీకు తత్వాన్ని అరబిక్ లోకి అనువదించిన హునైన్ ఇబ్న ఇషాక్ (809-873) క్రైస్తవుడు. అరబ్బు గద్యానికి సృష్టికర్తగా భావిస్తున్న ఇబ్నఅల్ ముఖఫా (757లో చనిపోయాడు) పహల్వీ నుండి అరబ్బీ లోనికి అనువదించినవాడు మనిషియన్. ఇతడు ఖురాన్ ను విమర్శించాడు. (వాట్ - ఇస్లామన్ ఫిలాసఫీ అండ్ థియాలజీ, ఎడిన్ బరో 1979) అబ్బాసిద్ కాలానికి ప్రాతినిధ్యం వహించే కవులుగా మూటి ఇబ్న ఇయాస్, అబునూవాస్, అబూ అతాహియ, అల్ ముతనబి, అల్ మారి అనే ఐదుగురిని నికల్ సన్ చర్చకు స్వీకరించాడు. (లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, కేంబ్రిడ్జి 1930) వీరందరూ ద్రోహులుగా, విరుద్ధ భావుకులుగా చిత్రీకరించి, చర్చించబడ్డారు. ఇస్లాం సైన్స్ కి ప్రాతినిధ్యం వహించిన గొప్ప వ్యక్తి అల్ రజి, ఇతడు గొప్ప వైద్యుడు కూడా. (11వ అధ్యాయం చర్చ) ఇస్లాం ఒకటి రెండు దశలన్నింటికీ అల్ రజి వ్యతిరేకి. మహమ్మద్ కు ప్రవక్త స్వభావం లేదన్నాడు కూడా.
స్త్రీలు, ముస్లిమేతరులు, నమ్మకం లేనివారు, విరుద్ధ భావుకులు, బానిసలు (స్త్రీ, పురుషులు) సిద్ధాంత, ఆచరణ రీత్యా కూడా దిగ్భ్రమ గొలిపే విషయం. ఈ విషయమై ఇస్లాం అన్ని దశల్ని ఖండించాల్సిందే. ఖురాన్ సూత్రాలవలన, ఇస్లాం న్యాయవేత్తల వలన స్త్రీలపట్ల ముస్లిమేతరులు, విరుద్ధ భావుకులపట్ల అనుసరించిన ధోరణి రూపొందింది. ఇస్లాం చట్టం నియంతృత్వంతో కూడినది. వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ అన్నివిధాల అదుపులో పెట్టాలంటుంది. అయితే ఇస్లాం చట్టం తు.చ. తప్పకుండా పాటించడం లేదు. సారా తాగడం, పురుషాయతం ఇస్లాం ఖండించినా, ఆచరణలో ఇస్లాం నాగరికత వీటిని సహిస్తున్నది. అయితే కుటుంబం వివాహం, విడాకుల వంటివి షరియా అదుపులో ఉన్నాయి.
షరియాకంటే పేర్కొనే దానికంటే కొన్ని విషయాలు ఇస్లాం తీవ్రంగా పాటిస్తున్నది. ఖురాన్ లో సున్తీ ప్రస్తావన లేదు. న్యాయవేత్తలు దీనిని సిఫారసు చేస్తున్నారు. ముస్లిం పిల్లలందరికీ సున్తీ చేయిస్తున్నారు. ఖురాన్ లో బాలికల సున్తీ ప్రస్తావన లేదు. కొన్ని ఇస్లాం దేశాలలో దీనిని పాటిస్తున్నారు. ముస్లిం పురుషులందరూ మౌలికంగా సమానమని ఖురాన్ అంటుంది. అచరణలో ఇది పాటించడము లేదు. ఇస్లాం ప్రకారం అరబ్బులు కాని వారిని విచక్షణతో చూస్తున్నారు. ఇస్లాం ఒకటి, రెండు దశలు చెప్పే నీతి సూత్రాలని ఇస్లాం మూడోదశ ఆచరించడం లేదు.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment