గౌతమ బుద్ధుడు విప్లవవాది కాడు. బౌద్ధవాదం విప్లవమూ కాదు. ఆక్స్ ఫర్డ్ నిఘంటువు నిర్వచించినదానికి దరిదాపుల్లోకి బౌద్ధం రాదు. బౌద్ధం తలపెట్టిన మార్పులు సంపూర్ణం కాదు, మౌలికమూ కాదు. ఉన్నతవ్యవస్థను తిరగవేసి పూర్తి మార్పునూ తేలేదు. బలవంతంగా ఏ రాజునూ, ప్రభుత్వాన్ని తొలగించలేదు. బౌద్ధం సమూల సంస్కరణవాదం. అది ఎంత సమూలమైనా, విప్లవం కాజాలడు. పాతనంతా పడద్రోసి మళ్ళీ నిర్మిస్తే విప్లవం అవుతుంది. సంస్కరణ కేవలం మార్పులతో సరిపెట్టుకుంటుంది.
బుద్ధుడికి పూర్వమే వైదిక యజ్ఞయాగాదుల పట్ల, పశువుల్ని భారీ ఎత్తున చంపటం పట్ల నిరసన ఉన్నది. బుద్ధుడూ, మహావీరుడూ, గోశాల, అజిత మొదలైనవారు వేదాల దైవాధికారాన్ని ప్రశ్నించారు. భూ దేవుల పేరిట నటిస్తున్న పురోహితులపట్ల నిరసన వ్యక్తం అయింది.
బుద్ధుడూ, తదితరులూ ఈ సాంఘిక మత ధోరణులను బలపరిచారు. బిందుసారుడూ, మరి ఇతరుల మద్ధతు లభించినందున సాఫల్యత పొందాడు. ఆ తరువాత అశోకుడూ, అతడి వారసులు కూడా బౌద్ధాన్ని సమర్ధించారు. వేదాల అధికారాన్ని, ప్రశ్నించటం వలన పురోహిత వర్గం బాధపడలేదు. బుద్ధుడికి ముందే ఉపనిషత్తులాపని చేశాయి. బుద్ధుడు కులవ్యవస్థను వ్యతిరేకించినందు వలన కూడా అంతగా నొచ్చుకోలేదు. బౌద్ధ సంఘంలో కులానికి గుర్తింపులేదు. బయట కులాన్ని అతడు పట్టించుకోలేదు. పుట్టుక వలన బ్రాహ్మణుడు కాడనీ, క్షత్రియుడు బ్రాహ్మణుని కంటె అధిక్యతలో ఉన్నాడని బుద్ధుడు చూపాడు. బౌద్ధాన్ని బాగా అధ్యయనం చేసిన హెర్మన్ ఓల్డెన్ బర్గ్ సాంఘిక సంస్కర్త గానూ బుద్ధుడిని ఒప్పుకోలేదు. బుద్ధుడు కులబంధాలు ఛేదించాడని గాని, పేదవారికి బౌద్ధంలో ఆధ్యాత్మిక స్థానాన్ని సంపాదించి పెట్టాడని గానీ అంటే అది చారిత్రకం కాబోదని కూడా అన్నాడు. (Herman Oldenburg : Buddha, His Life, His Doctreni, His order, Calcutta 1927).
తమ ఆర్థిక స్థితి గతులు క్షీణించటంతో పురోహితవర్గం బాధపడింది. వేదయజ్ఞాలు ఆగిపోవటంతో పురోహితులకు బత్వాలు లేకుండా పోయాయి. రాజులు అనుగ్రహం అంతా బౌద్ధ ఆరామాలకు దక్కటంతో పురోహితులకు ఆదాయం పోయింది. నగరీకరణం వలన బాగా సంపాదించిన వైశ్యులు బౌద్ధం వైపుకు మొగ్గారు. పురోహిత వర్గం తమ సామాజిక పునాదులు కదలిపోవటం గ్రహించారు. వర్ణాశ్రమ ధర్మం కూలిపోవటం చూచారు. మనిషి కులంలో పుట్టటం, కులవృత్తిలో మార్పులేకుండా కొనసాగటం వర్ణాశ్రమ ధర్మ లక్షణం.
అత్యధిక సంఖ్యాక ప్రజానీకం బానిసలుగా బ్రతకటం, వారిపట్ల బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలు ఏమాత్రం బాధ్యత వహించక పోవటం ఆనాటి పరిస్థితి. కుల బానిసత్వం అమానుషం, బాధ్యతా రహితం. పుట్టిన కులంలోనే అట్టి పెట్టటం, అదే వృత్తిలో చేరేటట్లు చూడటం ఆచారమైపోయింది. బుద్ధుడు కులంపైనా, కులవృత్తిపైనా తీవ్రంగా దాడి చేయలేదు గాని, ఏ కులంలోని వారైనా సంఘంలో సభ్యుడైతే మిగిలిన వారితో సమానుడౌతాడని చూపాడు. కింది కులాల నుండి బౌద్ధ భిక్కువులుగా వచ్చారనేది వేరే అంశం. వారు చాలా కొద్ది మందేనని ఓల్డెన్ బర్గ్ రాశాడు.
ఈ విధానం తమ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లు పురోహిత వర్గం పసికట్టింది. శూద్రుడు యజమాని కాబోతున్నాడని వారు భయపడినట్లే జరిగింది. శూద్రవంశం నుండి ప్రప్రధమంగా నందులు అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత మౌర్యులు శూద్రులుగా రాజ్యపాలన చేశారు. (Bhupedndranath Dutt ; Studies inIndian Social Polity, Calcutta, Page 189 స్వామి వివేకానంద సోదరుడే ఈ రచయిత) విస్తారమైన మౌర్య సామ్రాజ్యం దేశమంతా పాలించింది. బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు దండ సమత ప్రవేశ పెట్టాడు. (Romila Thopar : Ashoka and the Decline of Mauryas, Oxford, 163) అంటే శిక్షలో అందరికీ సమానత్వం, వ్యవహార సమత కూడా అశోకుడు ప్రవేశపెట్టాడు. భూసురులనూ, శూద్రులనూ ఒకేస్థాయిలోకి తెచ్చాడు. ఛండాలురను కూడా వారి స్థాయిలోనే అట్టి పెట్టాడు. భూసురులు తప్పుడు దేవుళ్లని శాసనంపై చెక్కించాడు. (భూపేంద్రనాధ్ దత్తా పేజి 189).
వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడటానికి శూద్రపాలన అంతం చేయాలి. దీనికి గాను చంద్రగుప్తుడు అశోకుడికి వారసుడైన బృహద్రధులని చంపించారు. అతని వద్ద పుష్యమిత్తుడు అనే బ్రాహ్మణ సైన్యాధిపతి ఉండేవాడు. రాజు సైన్యాలను పరీక్షిస్తూ ఉండగా ఈ హత్య జరిగింది. పుష్యమిత్రుణ్ణి ద్రోహిగా బాణకవి పేర్కొన్నాడు. (Jagannadham : A comprehensive History India, Bombay 1957, Vol. II. Page-94) నిహరంజన్ రే మరొక విధంగా భావించాడు. ఇతిహాసాలూ, పురాణాలూ మౌర్యులను అసురులుగా భావించడాన్ని తేలికగా కొట్టి పారవేయరాదన్నాడు. రచయితలు బ్రాహ్మలుగానటం, మౌర్యులు బౌద్ధులుగావటం ఇందుకు కారణం కాదన్నాడు. (Niharanjan Ray : Maurya and the Post Maurya Art, New Delhi, 1975) నిహరంజన్ రే భారతదేశంలో అత్మవసర పరిస్థితిని సమర్ధించాడు. అలాంటివాడు పుష్యమిత్రుడిని గొప్ప విమోచనకారుడిగా, మౌర్యులు పాలించినప్పుడు సామాన్యులు బాధలకు గురైనట్లుగా చిత్రించాడు.
పుష్యమిత్రుడు, తొలి బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బౌద్ధాన్ని విధ్వంసం చేయాలనీ, బ్రాహ్మణీకాన్ని తిరగదోయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బౌద్ధ భిక్కులను చంపేసి, బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేయతలపెట్టాడు. (K.P. Jayaswal : In Imperial History of India) బౌధ్ధ భిక్కువులను చంపి, వారి తలలను తనకు బహూకరిస్తే నూరు దీనార్లు చొప్పున ప్రతి తలకూ ఇస్తానని ప్రకటించినట్లు దివ్యవదనుడు తెలిపాడు. (B.C. Sinha : History of Sranga Dynasty, Delhi : 1977) ఐతే, అప్పటికే కాలం మారింది. పాతమూసలో బ్రాహ్మణ విధానాన్ని పోయటానికి వీలులేదు. కొత్త తొడుగులు అవసరమయ్యాయి. కనుక రెండు అశ్వమేధ యాగాలు చేశాడు. పతంజలి రాజపురోహితుడుగా ఉన్నాడు. (P Banerjee : Early Indian Religions New Delhi, 1973) అగ్నిస్తోమ, రాజసూయ, వాజ్ పేయ యజ్ఞాలను తిరగదోడారు. పుష్యమిత్ర, పతంజలి అంచలువారిగా సనాతన ప్రతి విప్లవాన్ని తీసుకురావటానికి ప్రయత్నించారు. దీనినే కొత్త బ్రాహ్మణ వాదంగా పి. బెనర్జీ పేర్కొన్నాడు. మౌర్యుల అనంతరం అది కొనసాగింది. విశ్వామిత్రుడు కత్తి పట్టగా, పతంజలి తన తెలివితేటలను వినియోగించాడు. తీరిక ఉన్నప్పుడు వ్యాకరణం రాసినా, పురోహిత వర్గాలను అట్టిపెట్టటమే అతని ప్రధాన లక్ష్యం. 2 వేల సం.రాల క్రితం పతంజలి ఈ విషయంలో ఘన విజయం సాధించాడు.
పాణిని వ్యాకరణంపై భాష్యం రాసిన పతంజలి కృష్ణుడు కంసుని సంహరించటం ప్రస్తావించాడు. వాసుదేవుని పూజించే వాసుదేవకులను కూడా ప్రస్తావించాడు. అంతకుముందు పాణిని వాసుదేవ-అర్జునులు పూజలందుకున్న తీరు చెప్పారు. పతంజలి కాలం నాటికి కృష్ణుణ్ణి దేవుడుగా కొన్ని చోట్ల కొందరు పూజించారు. ఆ విషయాన్ని పతంజలి చాకచక్యంతో వాడుకున్నాడు. బుద్ధుడిని అతని అనుచరులు తదనంతరం దేవుణ్ణిగా చేసి కొలిచారు. (Folyd H. Ross : Meening of Life inHinduism and Buddhism, London 1952) అలా దేవుళ్ళను సృష్టించటం ఆనాటి ధోరణిగా ఉనఅనది. వేదాలలో వ్యక్తిపరమైన దేవుళ్ళు లేరు. ఉపనిషత్తులలోనూ లేరు. వేదాల దేవుళ్ళను సంతృప్తిపరచాలంటే అతి వ్యయంతో కూడిన యజ్ఞాలు చేయాలి. ఉపనిషత్తుల దేవుడు తటస్థ బ్రహ్మం కనుక, సంతృప్తిపరిచే ప్రశ్నలేదు. అలాంటప్పుడు బుద్ధుని దేవుడిగా చేసేటప్పటికి జనం బౌద్ధానికి ఎగబడ్డారు. పతంజలి ఇందుకు బదులుగా, వాసుదేవ, కృష్ణదేవుళ్ళను ఎరగా చూపాడు. విష్ణువు-వాసుదేవ దేవుళ్ళ పరిణామం అట్లా జరిగింది. కృష్ణదేవుళ్ళను ఎరగా చూపాడు. విష్ణువు-వాసుదేవ దేవుళ్ళ పరిణామం అట్లా జరిగింది. కృష్ణుడిని దేవుడుగా చేసి కొత్త బ్రాహ్మణ వాదాన్ని స్థాపించటంలో పతంజలి తన శిష్యుడు పుష్యమిత్రుడి సహకారంతో దండసమత, వ్యవహార సమతను రద్ధు చేశాడు. శిక్షలలో హెచ్చుతగ్గులూ, తరతమ భేధాలు ప్రవేశపెట్టాడు. ఉన్నత కులాలకు స్వల్ప శిక్షలూ, తక్కువ కులాలకు కఠిన శిక్షలూ తిరగదోడాడు. శూద్రులు తలెత్తకుండా కొన్ని పాత సూత్రాలూ, మరి కొన్ని కొత్త సూత్రాలూ కలిపి స్మృతులుగా రూపొందించారు. బెనర్జీ ఈ విషయాలు వివరించారు.
ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ యోగాన్ని పాటించినా, ఒక విషయం మాత్రం విస్మరించరాదు. అదే కులంధర్మం, కులవృత్తిని వీడకుండా ఉండాలి. నీవెంత అసమర్ధుడివైనా ఎంత నీచవృత్తిని అనుసరించవలసి వచ్చినా, కులధర్మాన్ని పాటించాల్సిందే. లేకుంటే నరక ప్రాప్తి తప్పదు. ఆ హెచ్చరిక చేయటానికే గీతారచన సాగింది.
by Narla V R Telugu: Innaiah Narisetti
No comments:
Post a Comment