గీతఎప్పుడు రాశారు?--12-Truth about Gita




గీత ఎప్పుడు రాసిందీ సరిగా తెలియకపోవటంలో ఆశ్చర్యంలేదు. మనవారికి చారిత్రక జ్ఞానం లేదు. కాలజ్ఞానం లేకపోవటమే అందుకు కారణం. సంవత్సరం అంటే మన వారికి బొత్తిగా అర్థం లేని విషయమే. దేవుళ్ళ దృష్టిలో అది ఒక రోజు మాత్రమే. ఒక జీవిత కాలానికీ మనవారు ప్రాధాన్యత యివ్వలేదు. అనంత గతజన్మలలో, భవిష్యత్తు జన్మలలో యిది ఒక బిందువు మాత్రమే. ఆత్మ, పరమాత్మలో లీనం కావటం అసలు లక్ష్యం. అది జరిగినప్పుడు కాలం ఆగిపోతుంది. కనుక కపిలుడు ఎప్పుడు అన్నాడు. కణాదుడు ఎప్పుడు బోధించాడు, కనిష్కుడు ఎప్పుడు పాలించాడు. కాళిదాసు ఎప్పుడు రచించాడు. అనేవి పట్టించుకోగూడదు. వారంతా క్షణకాలం వెలిగి కాలగర్భంలో కలిసిపోతారు. మనం కాలాతీతంగా సమయానికి మించిపోయి వాస్తవాన్ని చూడాలి. బ్రహ్మ, విష్ణు, శివుడు, రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మావతారాలు మొదలగు వాటి నుండి బయటపడటం ఎలా? కాలాన్నీ, చరిత్రనూ పట్టించుకునేదెప్పుడు? ప్రాచీన భారత చరిత్రను నిర్దుష్టంగా రాసేదెలా? గీతను ఎవరు, ఎప్పుడు రాశారో నిర్ణయించేదెవరు?
మత గ్రంధాలూ, ఇతిహాసాలూ, ఆధారం లేని చరిత్రలూ నమ్ముకోవలసి వస్తున్నది. బుద్ధుడికి ముందే గీత ఉన్నదని ఊహిస్తున్నారు.
అలా చెప్పే ఎస్.బి.రాయ్, సురేంద్రనాధ్ దాస్ గుప్తాకు ఆధారాలేమిటి? గీతలో బౌద్ధ ప్రస్తావనలేదు. రామాయణం కర్తలకంటే మహాభారతంలో ప్రవేశపెట్టిన వారు తెలివైన వారు. బుద్ధుడు చోరుడని రాముడి నోట పలికించారు. బుద్ధుడికి ముందే రాముడున్న విషయం వారు విస్మరించారు. గీతలో బౌద్ధం ప్రస్తావన లేనప్పటికీ, గీతాశ్లోకాలపై బౌద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఆనాడున్న బ్రాహ్మణ వాదాన్ని దెబ్బకొడుతున్నా, బౌద్ధాన్ని తిప్పి కొట్టాలనే ప్రయత్నంతో గీతారచన సాగింది.
బుద్ధ, ప్రతిబుద్ధ అనే మాటలు ఇతిహాసంలో తరచుదొర్లాయి. సంస్కృతంలో స్ధూప అనే అర్థం గల పదం ఎక్కువసార్లు కనిపించింది. దేశమంతా స్థూపాలతో నిండినట్లు గమనిస్తే బౌద్ధం తరువాతనే మహాభారత రచన సాగినట్లు తెలుస్తుంది.
గీతను ప్రాచీనతకు నెట్టి వేయాలని చూచేవారు గీతలో బ్రహ్మసూత్ర ప్రస్తావనను తెస్తారు. బాదరాయణుడి బ్రహ్మ సూత్రమే గీతలో ఉంటే, బౌద్ధం అనంతరమే భగవద్గీత వచ్చి ఉండాలి. బౌద్ధంలోని క్షణిక వాదాన్నీ, శూన్యవాదాన్నీ బ్రహ్మసూత్రం కాదంటుంది. (సూత్రాలు 18-32 Majundar : Krishna in History and Legend)
బ్రహ్మ సూత్ర ప్రస్తావన అలా ఉంచి గీతలో వేదాంత ప్రస్తావన కూడా ఉన్నది. బౌద్ధం అనంతరం, బ్రహ్మసూత్రం అనంతరం గీత వచ్చిందనటానికి యిదొక ఆధారం.
కె.యల్. ఉపాధ్యాయ గీతకు సంబంధించిన తేదీలూ, వివిధ పండితుల పరస్పర విరుద్ధ అభిప్రాయాలూ ప్రస్తావించి, అవన్నీ సమస్యా పరిష్కారానికి అవరోధాలే తప్ప సహాయకారి కాదన్నాడు. రాధాకృష్ణన్, బాలగంగాధర తిలక్, ఆర్.జి. భండార్కర్ ప్రభృతుల భిన్నాభిప్రాయాలు చూపాడు. (K.L. Upadhya : Early Buddhism and the Bhagavadgeetha, Delhi, 1971)
డి.డి. కోశాంబి రాస్తూ గీతలోని సంస్కృతం క్రీ.త 3వ శతాబ్దానికి చెందినదనీ, కనుక అంతకుముందు ఉన్నదనటానికి వీలులేదన్నాడు. ఇదంతా పరిశీలిస్తే పతంజలి అనంతరం అనేక మంది రచనగా గీత ఆవిర్భవించి ఉంటుంది.
ఈ అభిప్రాయాలను చూచి వైద్య వంటి వారు మండిపడటం సహజం. 84వ ఏట కృష్ణుడు సుదీర్ఘ తాత్విక విషయాన్ని కురుక్షేత్రంలో చెప్పటంలో ఆశ్చర్యం లేదన్నాడు. మొదటి ప్రపంచయుద్ధంలో హైండ్ బర్గ్ 70వ ఏట యుద్ధరంగం నుండి చాలా పెద్ద సమాచారాన్ని పంపించలేదా అన్నాడు.
ఎస్.కె. బెల్వాల్కర్ మహాభారతాన్ని ఆధారంగా చర్చిస్తూ, గీత అందులో భాగం కాదని నిదర్శనాలున్నాయన్నాడు. చాలా తెలివిగల వారెవరో గీతను భారతంలో చేర్చి ఉండాలి. (S.K. Belwalkar : The Cultural Heritage of India Vol. II. Calcutta 1961 Page 136, 137).
by Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

1 comment:

cg9 said...

చాలా బాగుందండి మీ బ్లాగ్.

Post a Comment