భ్రమల భయం--గీత రూపొందిన తీరూ


అధ్యాయం నాలుగు

పురావస్తు శాస్రం మాట్లాడదు. కాని సత్యాన్ని బయట పెడుతుంది. సాహిత్యానికి అలంకరణలు చేసే స్వభావం ఉన్నది. అందులో గాధలూ, ఇతిహాసాలలో ఉపమానాలూ, అలంకారాలూ, గజి బిజిగా అల్లుకొని ఉంటాయి. కనుక ప్రాచీన చరిత్రల గురించి రాసేటప్పుడు సాహిత్యంలో సాక్ష్యాధారాలను అతి జాగ్రత్తగా స్వీకరించాలి. ఇతర ఆధారాలతో ముఖ్యంగా పురావస్తు శాస్రంతో సరితూగుతున్నదో లేదో గమనించి చేపట్టాలి.
సుమేరియా చరిత్రకారులు ఇలాంటి జాగ్రత్త వహించారు. అలాగే ప్రాచీన దేశాలైన బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్ట్, ఫినీషియా, క్రీట్, మీడియా, ఫైరియా, లిడియా, కార్తేజ్, గ్రీస్, రోమ్, పర్ష్యా, చైనాకు సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త వహించారు. కాని, ప్రాచీన భారతావనికి సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త తీసుకోలేదు. భ్రమలంటే వారు భయపడ్డారా? రెండువేల సంవత్సరాల పాటు పుక్కిటి పురాణాల మధ్య మనం నివశించాం. అదే మనకు ఔషధంగా మారింది. మోతాదు ఎక్కువై భ్రాంతిలో పడ్డాం. ప్రస్తుతాన్ని పక్కకు నెట్టి, గతాన్ని భజన చేస్తున్నాం. అయోధ్య గొప్పతనాన్నీ హస్తినాపురం వెలుగుల్నీ చెప్పుకొంటున్నాం. ఇంద్రప్రస్తలో, మయసభను గురించి పొగుడుకుంటున్నాం.
గతాన్ని తవ్వితీసి ఆర్యులను గురించి తెలుసుకుంటే, వాస్తవాలెన్నో బయటపడతాయి. రాముడూ, కృష్ణుడూ పాలించిన స్వర్గయుగాల భ్రమలు చెదిరిపోతాయి. రామాయణ మహాభారతాలకు చెందిన స్థలాలను తవ్వినప్పుడు అలాంటి సత్యాలు బయటకొస్తున్నాయి. భారతదేశానికి దండయాత్రీకులుగా వచ్చిన ఆర్యుల నాగరికత గురించి పుక్కిటి గాధలు బట్ట బయలు అవుతున్నాయి. దేశంలో ఉన్న ప్రజలు నాగరికులుగా, దాడి చేసిన వారు ఆటవికులుగా చరిత్ర చూపుతున్నది. హరప్పా ఉన్నత నాగరికతను ఆర్యులు ధ్వంసం చేశారు.
ఆ తరువాత వెయ్యేళ్ళకు గాని మగధ సామ్రాజ్యం తలెత్తలేదు. హరప్పా, మోహంజోదారో వంటి నగరాలు, కాళీబంగాన్, రంగవూరు వంటి పట్టణాలు, లోతల్ వంటి రేవులు మళ్ళీ రాలేదు. ఆర్యులు మట్టి ఇళ్ళలో ఉంటూ, కుండల్లో వండుకుని, తాగటానికీ, తినటానికీ మట్టి పాత్రలు వాడారు. నగర జీవితానికీ, సౌకర్యాలకూ వారుదూరం. వారి సంస్కృతి పేదది. గ్రామాలలో నివశిస్తూ, ఆవుల్ని పెంచుకున్నారు. ఆవులే వారికి సంపద, ప్రతిష్ఠాకరమైన విలువిచ్చాయి. సోమరసం ఆరగించేవారు. ఆర్యుల సంస్కృతి అల్పస్థాయిలోనే వుండేది. మెసపొటోమియాలో అమురుల వలె ఆర్యులకు కూడా నగరం అంటే తెలియదని, స్టూవర్డ్ పిగాట్ రాశాడు. (Pre Historic India, by Piggort Stauart 1962, Page : 265) సర్ మార్టిమర్ వీలర్ గొప్ప పురావస్తు శాస్ర్తజ్ఞుడు. ఆర్య సంస్కృతి గుర్తించదగినంత గొప్ప సంఘటనగా విడదీసి చూపటానికి ఆధారాలేవీ కనిపించటం లేదని రాశాడు. (Mortimer Wheeler : Civilization of the Indus Vallery, London 1966, Page : 97).
రామ, కృష్ణ భక్తులు ఈ విదేశీ శాస్త్రజ్ఞుల రచనలను పరిశీలించి వారు తప్పు అని రుజువు చేయగలిగితే బాగుండును. రామాయణ, మహాభారతాలకు సంబంధించిన స్థలాలను తవ్వి అలా చేస్తే సంతోషించవచ్చు. కాని, చెదురుమదురుగా లభించిన పూసలూ, రంగులు వేసిన కుండలూ, 12 గదులతో కూడిన మట్టియిళ్ళూ చూపి అదే గొప్ప సంస్కృతిగా ఆకాశానికి ఏత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. మగధ సామ్రాజ్యం తలెత్తే వరకూ ఆర్యుల సంస్కృతి నిస్సందేహంగా అల్పస్థాయిలో కొనసాగింది.
క్రీ.పూ. 8వ శతాబ్దంలో గంగానది వరదల వలన నాగరికతంతా కొట్టుకుపోయినట్లు పురాణాల్లో రాసిఉందని చెపుతున్నారు. అప్పుడు కౌరవుల రాజధాని కొశాంబీకి మారిందట. హస్తినాపురం వద్ద తవ్వకాలలో యిది బయటపడిందటున్నారు. హస్తినాపురాన్ని పురాణాల ప్రకారం అస్తినుడు స్థాపించాడు. దుష్యంతుడికీ, అతడి కుమారుడు భరతుడికీ హస్తినాపురం రాజధాని అన్నారు. పురాణాల వంశ పారంపర్య జాబితాలో దుష్యంతుడి తరువాత 5వ వారసుడుగా హస్తినుడు వచ్చాడు. అతడు స్థాపించిన రాజధాని ముత్తాతల రాజధాని ఎలా అవుతుంది. పురాణాలన్నీ యిలాంటి అసంగతాలతోనే ఉన్నాయి. (Amar Chand : Hastinapura, 1952, Banares, Page : 7, 8).
భారీ కట్టడాల అవశేషాలు భౌతిక సంస్కృతికి చిహ్నాలు. అలాంటివి హస్తినాపురంలో లేవు. ఎ. ఘోష్ ఇలా హెచ్చరించాడు. మహాభారతగాధల గురించి పురావస్తు శాఖ త్రవ్వకాల ద్వారా సాక్ష్యాధారాలు అందించినట్లు చెపుతారు. అలాంటి నిర్ణయాలకు రావటం తొందరపాటవుతుంది. కౌరవుల రాజధాని హస్తినాపురం భారీ వరదల వలన కొట్టుకుపోయిందని కధలు అల్లారు. ఇతిహాసాల సంప్రదాయాలను సమర్ధించుకోటానికి పురావస్తుశాఖ పరిశోనలను అడ్డంపెట్టుకోవాలి. (A. Ghosh : Ancient India, No.11.12 New Delhi, 1954-55, Page:3).
మన ప్రాచీన గ్రంధాలు ఎంత పెద్దగా ఉంటే వాటి భాష్యాలు, వాటి చరిత్ర కాలక్రమం, భూగోళం అంత చిలవలు పలవలుగా ఉంటుంది. మన సనాతనులు గుడ్డిగా వాటిని అనుసరిస్తారు.
ప్రాచీన భారత చరిత్రలో మహాభారత యుద్ధం ప్రథమ అధికారిక సంఘటనగా సి.వి. వైద్య పేర్కొన్నారు. దీనిని ఎవరూ సందేహించటం లేదన్నారు. (C.V. Vaidya : The Mahabharata War, Bombay, 1929, Page:55). ఆ సంఘటన మాత్రమే కాదు, అది జరిగిన తేదీలు సహితం ప్రశ్నార్ధకంగానే మిగిలాయి. చరిత్రకారుడు విన్ సెంట్ స్మిత్ రాస్తూ మౌర్య సామ్రాజ్యం తలెత్తటంతో చరిత్రకారుడు ఆంధకారంలోంచి వెలుగులోకి వచ్చినట్లయింది. తేదీలు నిర్దుష్టంగా తెలిసాయి. (Vincent Smith : The oxford History of India, 1958, Page:95).
సనాతనులకు అలాంటివి మింగుడు పడవు. సూర్యవంశం నుండి దిగివచ్చిన క్షత్రియులు కేవలం ఆర్యవంశంలో ప్రాచీన భారత దేశంతో పాటు యావత్తు ప్రపంచాన్నీ పరిపాలించారన్న వారే షట్ చక్రవర్తులు. చంద్రగుప్త మౌర్యులతో ప్రారంభించటం విన్ సెంట్ స్మిత్ వంటి యూరోపియన్ల కుట్రమాత్రమే అన్నారు. అలెగ్జాంటర్ తో సమకాలీనులైన చంద్రగుప్తుడు మౌర్యవంశానికి చెందడనీ, అతడు గుప్తవంశంవాడనీ అన్నారు. క్రీ.పూ. 4 వేల సంవత్సరాల క్రితం గుప్త సామ్రాజ్యం ఉన్నదన్నారు. దీనికి పంచాంగాలూ, పురాణాలూ ఆధారాలన్నారు. ద్వాపర, కలియుగాల మధ్య క్రీ.పూ. 3102లో మహాభారత యుద్ధం జరిగిందన్నారు. దీనివలన ఒక వెయ్యి సంవత్సరాలు అశోకుడిని వెనుక్కు నెట్టినట్లయిందని ఎ.ఎ. మెగ్డానెల్ అన్నాడు. (A.A. Macdonell : India’s Part, 1956, Varanasi).
1966లో విలర్డ్ ఎఫ్. లిబి అనే రసాయన శాస్రజ్ఞుడికి కార్బన్-14 డేటింగ్ కనుగొన్నందుకు నోబుల్ బహుమానం వచ్చింది. గతాన్ని తెలుసుకోడానికి ఇతని ప్రక్రియ చాలా వరకు ఉపయోగపడుతున్నది. 40 వేల సం.రాల వరకు కనుగొనే అవకాశం లభించింది. (Libbi Willard F.H. : The Frontiers of Knownedge, Newyork 1975). ఈ విధానంలో దోషాలు కూడా అనల్పంగానే ఉన్నాయి. అది అంగీకరిస్తే ప్రాచీన భారత చరిత్ర తెలుసుకోటానికి పంచాంగాలూ, పురాణాలూ పక్కన పెట్టాల్సిందే. చరిత్ర కారుల ముసుగులో వైద్య వంటి వారెందరో పక్కిటి గాధల్ని చరిత్ర తొడుగుతో చూపారు. అలాంటి వారిని గమనంలోకి తీసుకోరాదు. వారికి ప్రాధాన్యత యిస్తే, చెత్తాచెదారానికి ప్రాముఖ్యత యిచ్చినట్లే.
కార్బన్-14 డేటింగ్ విధానంలో సర్ విలియం జోన్స్ భారత చరిత్ర కాలాన్ని సరిగ్గా చూపాడు. చంద్రగుప్త, అలెగ్జాండర్ సమకాలీనతను నిర్ధారించాడు. అశోకుని శాసనాలు తెలుసుకోటానికి బ్రహ్మీ, ఖరోస్తి లిపి జేమ్స్ ప్రిన్ సెస్ వెలుగులోకి తెచ్చాడు. ప్రాచీన భారత భౌగోళిక విషయాలను ఏర్చికూర్చిన ఖ్యాతి అలెగ్జాండర్ కానింగ్ హాంకు దక్కింది. ప్రిషాల అంటే శూద్ర అనీ, పాపపంకిలుడనీ నిఘంటువులు పేర్కొన్నట్లు ఎందరికి తెలుసు. దేవానాం ప్రియ అనే అశోకుని బిరుదు శాసనాలపై ఉన్నది. దానికి ఉన్మత్తుడు అనే అర్ధాన్ని మన ఇతిహాసాలూ, పురాణాలూ అంటగట్టాయని ఎందరికి తెలుసు.
కురుక్షేత్ర యుద్ధం బహుశ పుక్కిటి పురాణమే కావచ్చు. క్రీ.పూ. వెయ్యి సంవత్సరాలలో ఒకవేళ ఇది జరిగే ఉంటే, కేవలం ఆర్య తెగల మధ్య కలహమే తప్ప యుద్ధం మాత్రం కాదు. వేదసాహిత్యంలో దీని ప్రస్తావన లేదు. ఈ కలహం కూడా కూరు-పాండవుల మధ్య అయి ఉండదు. మహాభారత అధ్యయన పరులు ఇలాంటి భావాలను వెల్లడించారు.
విన్ సెంట్ స్మిత్ మహాభారత యుద్ధాన్ని చారిత్రకేతర కధగా భావించాడు. ఆల్ బ్రెట్ వెబర్ ఆర్య తెగల కలహంగానే భావించాడు. (Albreckt Weber : The History of Indian Literature, London, 1914, Page : 187). రోమిలాధాపర్ దీన్ని కేవలం స్థానిక ముఠాతగాదాకా చెప్పింది. (A History of India, 1968) భాషమ్ దీన్ని యుద్ధంగా పేర్కొన్నప్పటికీ అతిశయోక్తులే చాలా జోడించారు అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం కౌరవులకూ, పాంచాలురకూ మధ్య జరిగిందనీ, దీనికి పాండవులను జోడించడంలో బ్రాహ్మణాసక్తి ఉన్నదనీ క్రిస్టియన్ లాసన్ రాశాడు. (Pre Musalman India, Vol.II, Vedic India, Part I, Madras, 1937). మహాభారతాన్ని సొంతంగా పరిశీలించిన పెండ్యాల శాస్త్రి (పిఠాపురం) కూడా అలాంటి అభిప్రాయానికే వచ్చారు.
దీని అంతటినీ బట్టి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన చరిత్ర, తేదీలు, పాల్గోన్నవారూ అన్నీ సందేహాస్పదాలే. అలాగే కృష్ణుడు, గీత కూడా, మన ప్రాచీన భారత చారిత్రక తేదీలను నిర్ధారించే ప్రయత్నం కొందరు సనాతనులు చేస్తూనే అన్నారు. ఎ.డి. పుసల్కర్ పాషండుడూ కాదు. సందేహవాదీ కాదు. అతడు ఇలా అన్నాడు. మహాభారతానికి సంబంధించి గ్రహ నక్షత్రాలను ఆధారంగా తేదీలు నిర్ణయిస్తున్నారు. దీనివలన భిన్న ఫలితాలు వచ్చాయి. పరస్పర విరుద్ధ వాస్తవాలు బయట పడ్డాయి. కనుక అలాంటి వాటిని ఉత్తరోత్తరా ప్రవేశపెట్టినట్లు భావించి నిరాకరించాలి. (A.D Pusalkar : History and Culutre of the Indian People Vol.I. Vedic Age Page : 269).
పుసల్కర్ చేసిన విమర్శల వంటివి భారతదేశానికే పరిమితం కాలేదు. క్రీ.పూ. 4004 మార్చి 23న బైబుల్ ప్రకారం భగవంతుడు ఆడంను సృష్టించినట్లు బిషప్ ఆషర్ ప్రకటించారు. అతని ప్రేరేపణతో గాబోలు, వెలంది గోపాలయ్యర్ కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 1194 అక్టోబరు 14న మొదలయిందన్నాడు. కలియుగం క్రీ.పూ. 312 ఫిబ్రవరిలో ఆరంభమయిందనీ, ఆ తరువాత 36 ఏళ్ళకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ, మరొక పండితుడు ప్రకటించాడు. (S.B. Roy : Ancient India, 1975). అతడి ప్రకారం క్రీ.పూ. 3227 వరకూ కృష్ణుడు 125 ఏళ్ళు బ్రతికాడన్నాడు. కృష్ణుడు చనిపోయిననాడే కలియుగం మొదలయిందన్నారు. ఆదాయపు పన్ను అధికారిగా రిటైరయి అతడు ఇలాంటి తేదీల నిర్ణయానికి పూనుకున్నారు. ఇండియా అనే భారత దేశం అలాంటివారితో నిండి ఉన్నది. వారికి నమోవాకాలు.

Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

No comments:

Post a Comment