గీత-విజ్ఞానం!-17-Truth about Gita


అనేక శాస్త్రాలతో పాటు గీత ఆధునిక విజ్ఞానాన్ని కూడా బోధించింది. అణుభౌతిక శాస్త్రంలోని పరిశోధనలు సహితం ఊహించింది.
అలాంటి మాటలు వింటే ఆశ్చర్యం వేస్తున్నదా? ఇంకేమైనా అంటే హరీష్ దబాయి విజూభాయి దివాతియా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాడు జాగ్రత్త. గీత-ఆధునిక విజ్ఞానం అంటూ ఒక అధ్యాయం కూడా తన గ్రంధంలో చేర్చాడు. అన్ని పరిశోధనలూ గీతలో చూడాలనుకోవటం విపరీతమే అవుతుందని కూడా అనుకున్నాడు. (H.V. Divatia : The Art of life in Bhagavatgeeta 1970, Bombay) డార్విన్, హక్సలే, స్పేన్సర్ మొదలైన శాస్త్రజ్ఞులు చూపిన వాదనలను తప్పనిచూపే ప్రయత్నం చేశాడు.
కిందిస్థాయి నుండి ఉన్నదశకు జీవితం పరిణమిస్తుందని డార్విన్, హక్సలే చెప్పారు. జీవితం కోసం పోరాటం, అర్హులైనవాడు మనుగడ సాగించటం అనే రెండు భావాలూ వెల్లడించారు. కోతుల నుండి క్రమేణా మానవులుగా పరిణమించారు.
ఈ వాదనలన్నీ తప్పని దివాతియా చూపటానికి ప్రయత్నించారు. అందుకు గాను సర్ ఆలివర్ లాడ్జీ, సర్ రిచర్డ్ గ్రిగరీ, సర్.జె. ఎ.వి. బట్లర్ను సాక్ష్యంగా చూపాడు. ఆధునిక విజ్ఞానంలో వారిదే చివరిమాటగా స్వీకరించ మంటాడు. విశ్వమంతా విశాల జీవరాసి అనీ, ప్రతి జీవి అందులో ఒక భాగమనీ అంటాడు. శక్తి, లేదా ఆత్మ అనే సూత్రం ఈ విశ్వంలో వ్యాపించి ప్రకంపన చెందుతుంటుంది. ఈ భావాలు వేదాంతంలోని మాయనూ, విశ్వంలోని ఒకే భావం, లేదా శక్తి ఉన్నదనే విషయాన్ని సమర్ధిస్తున్నది. విశ్వమంతా బ్రహ్మస్వరూపం. మన ఇంద్రియ పరిమితి వలన భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దివాతియా చెప్పిన విషయం.
ఆధునిక విజ్ఞానం మనలను మాయ, బ్రహ్మల దగ్గరకు తీసుకెళుతుందన్న మాట భారతీయ రుషులు ఆధునిక శాస్త్రీయ పదజాలాన్ని వాడకుండా కవితలో, అలంకారాలలో శాశ్వత సత్యాలు చెప్పారని దివాతియా రాశాడు. గీతను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధునిక విజ్ఞానం అందులో ఉన్నట్లు కనుగొనవచ్చునన్నాడు. హెగెల్ వంటి వారు గీత చదివి ఉంటే ఇంకా గొప్ప తాత్వికులయ్యేవారని అన్నాడు.
సి. రాజగోపాలాచారి గీతను ప్రచారంలో పెట్టటమే గాక, తన అధికారంలో అందలి సూత్రాలను అమరపరచటానికి కూడా ప్రయత్నించారు. మద్రాసు ముఖ్యమంత్రిగా గీతలోని స్వధర్మ సూత్రాన్ని ప్రతి విద్యార్థి పాటించాలన్నారు. తండ్రుల వృత్తిని అనుసరించి రోజులో సగభాగం వినియోగిస్తే, నిరుద్యోగ సమస్యకు పరిష్కారమన్నాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని దొడ్డిదారిన తెచ్చే ఈ ప్రయత్నాన్ని తమిళనాడు ప్రజలు ప్రతిఘటించటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎస్.జి. సర్దేశాయి. వెల్లడించిన ప్రకారం శంకరాచార్యులలో ఒకరు పూనాలో ప్రకటిస్తూ పాపయోని నుండి పుట్టిన శూద్రులూ, స్త్రీలూ ఈసడించబడాలి. ఇందులో వైశ్యులనొదిలి వేయటానికి కారణం మఠాలకు దానాలివ్వటమే కావచ్చు.
రాజగోపాలాచారి శాస్త్రజ్ఞుడి పాత్ర వహించి ఇలా అన్నాడు. తండ్రుల భౌతిక లక్షణాలు, మానసిక ధోరణులూ పిల్లలకు సంక్రమిస్తున్నాయి. ఈ వంశ పార్యం పర్యత కర్మ సూత్రాన్ని వివరించరు. వంశపారంపర్యంలో దేహాలే గాని ఆత్మలు లేవు. ఆత్మకు తల్లిదండ్రులు లేరు. అది స్వయంభువు. ఏ ఆత్మ అయినా తనకు అర్హమైన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పౌరుల అవసరాలను బట్టి ఇంజనీర్లు వివిధ భవనాలు నిర్మించినట్లే యిది కూడా. కాని, అతడెప్పుడైనా డి.ఎస్.ఎ., ఆర్.ఎన్.ఎ., అనే మాటలు విన్నాడా. వంశపారం పర్యలక్షణాలు నిర్ణయించేది అవే, అనీ, కర్మకాదనీ ఎవరూ చెప్పలేదా. అవి కనుగొన్న తరువాత జన్యు శాస్త్రం విప్లవాత్మకంగా మారిందని తెలియదా.
గీతలో విజ్ఞానాన్ని గురించి మాట్లేడే గీతా ప్రచారకులు విజ్ఞానశాస్త్రజ్ఞులలోనూ లోపాలుంటాయని విస్మరిస్తున్నారు. న్యూటన్ లో చాలా మూఢనమ్మకాలున్నాయి. సర్. ఆలివర్ లాడ్జ్, సర్ విలయిం క్రూక్స్, ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ శాస్ర్తజ్ఞులైనా-మరొకవైపున చనిపోయిన అలెగ్జాండర్, షేక్స్ పియర్, నెపోలియన్లతో మాట్లాడుతున్నామంటూ, దయ్యాలశాస్త్రాన్ని ప్రచారంలో పెట్టారు. (F.E. Planer : Superstition, London 1980) చాలా మంది శాస్త్రజ్డులు తమ పరిధి దాటిన తరువాత సంకుచిత మనస్తత్వంతో మూర్ఖంగా ఉన్నారని వాట్ సన్ శాస్త్రజ్ఞుడు రాశాడు. (James D Watson : The Double Helek, London, 1969) మన వద్ధ భగవంతం, స్వామి నాధన్ ఇలాంటి వారే. గీతాకారులు తమ ఆత్మ, పరమాత్మ, కర్మ, పునర్జన్మ వంటి వేదాంతమాటలను సమర్ధించుకునే ముందు, ఐన్ స్టీన్, ఫ్రాన్సిస్ క్రిక్, కార్ సేగన్ వంటి వారి వాదనలు ఎందుకు వినలేదు అనిపిస్తుంది. ఆధునిక విజ్ఞానంలో వేదాంతంలో లేనిదేమీ లేదని అనేవారున్నారు. అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండబోదు. డార్విన్, హక్సలే, ఏమి చెప్పినా, యజ్ఞాల ద్వారానే బ్రహ్మసృష్టి జరిపాడనీ, ఆ తరువాత యజ్ఞాలద్వారానే పెంపొందుతారనీ, సకాలంలో వర్షాలొస్తాయనీ నమ్మారు. దేవుళ్ళకు సంతర్పణలర్పిస్తుంటే వారు బదులందిస్తుంటారు. చంద్రుడిని గొప్ప నక్షత్రంగా భావించారు. మొసలిని మత్స్యంగా స్వీకరించారు. అత్యంత వేగం గలదిగా వాయువును సమ్మారు. హిమాలయాలు అచలాలు అంటే కదలనివి అన్నారు. కొలనులను సముద్రాలుగా భావించారు. మనసును జ్ఞానేంద్రియం అన్నారు. గీత చెప్పిన గొప్ప శాస్త్రీయ సత్యాలు యివే. కృష్ణుడి కాలంలో విద్యుత్ ఉన్నదని కూడా చెప్పారు. కృష్ణుడికి విద్యుత్తు, సూర్య-చంద్రుల అవసరం లేదనీ, కావాలనుకుంటే తన మందిరాన్ని విద్యుత్ తో వెలిగించేవాడనీ ప్రభుపాదరాశాడు. (Sw. Prabhupada, Bhagavadgeetha, Los Angeles, 1972)
గీతలో సైన్స్ అలాంటిది. వేద ఉపనిషత్తుల సారాంశమది. విజ్ఞాన సర్వస్వమది. అలా భావించినంత కాలం భారతదేశంలో సైన్స్ కుంటుతూనే ఉంటుంది.
భారతదేశంలో నోబెల్ ప్రైజు వచ్చిన ముగ్గురిలో ఇరువురు అమెరికాలో కృషి చేసి కనుగొన్నారు. పైగా భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. వేదభూమికి తిరిగి రాలేదు. వేదాంత భూమికలో సరైన శాస్త్రజ్ఞుడు ఆలోచించి పనిచేయటం కష్టం.
by late Narla Venkateswararao Telugu: Innaiah Narisetti


No comments:

Post a Comment