గీత గూఢార్ధంలోఎవరికి కావలసింది వారికి!--21- Truth about Gita final



రోమన్ దేవుడు జేనస్ కు రొండు ముఖాలుంటే, హిందువుల దేవుడు హరికి వెయ్యి ముఖాలున్నాయి. కృష్ణావతారంలో హరి వెయ్యినాల్కలతో మాట్లాడతాడు. గీత యిచ్చే వెయ్యి సందేశాలలో ఏది స్వీకరించాలో అది నీ యిష్టం. నీకు నచ్చే సందేశాలను కలిపి చూచుకోవచ్చు. అలా కలిపినప్పుడు ఎన్నో తత్వ్తాల గురించి ఎప్పటి కప్పుడు పుష్కలంగా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. ఇక అనువాదాలూ, భాష్యాలూ లెక్కకు మించాయి. క్రీ.త. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు దీనికి శ్రీకారం చుట్టాడు. అది నిర్విఘ్నంగా సాగిపోతూ యజ్ఞాలూ, ప్రసంగాలూ, ప్రవచనాలరూపం దాల్చాయి.
గీత ఆకర్షించటానికి అందులోని గందరగోళమే కారణం. భిన్నత్వం, మరొక అంశంగా చెప్పవచ్చు. ఎవరికేది కావాలో అది గీతలో ఉన్నది. కేవల అద్వైతం నుండి ద్వైతం వరకు శంకరుడూ, రామానుజుడూ, మధ్వుడూ, వల్లభుడూ గీతనుండి స్వీకరించారు. ముక్తికి భిన్న మార్గాలున్నాయన్నారు. అన్ని మార్గాలూ తన వద్దకే చేరుస్తాయని కృష్ణుడన్నాడు. శంకరుడు జ్ఞానయోగాన్ని కోరాడు. సన్యాసం కావాలన్నాడు. మిగిలిన ముగ్గురాచార్యులూ భక్తియోగం ఎంపిక చేసుకున్నారు. శంకరుణ్ణి వ్యతిరేకించిన ఈ ముగ్గురూ వారిలో వారు విభేదించారు.
ఈ ఆచార్యుల చుట్టూ అనేక భాష్యకారులు బయలుదేరారు. ఇందులో శంకరుడిది చాలా విస్తారమైనది. ధనపతి, హనుమత్, మధుసూధన, శ్రీధర, నీలకంఠ, వెంకటనాధ, శంకరానంద, భాష్యకారులుగా పేర్కొనదగినవారు. శంకరుడిని అనుసరించిన వీరు మధ్యలో సొంతదారులు నిర్మించారు. ఎదుటి పక్షం వారితో చేరిన సందర్భాలూ లేకపోలేదు. రామానుజుడూ, మధ్వుడూ, వల్లభుడూ తమ అనుచరులతో వేర్వేరుగా కొనసాగారు. యమునాచార్యుడూ, వెంకటనాధ చాలా సమర్ధులైన రామానుజాచార్యుల ముఠాకు చెందినవారు. పురుషోత్తం వంటి వారు వల్లభుడిని సమర్ధించారు. జయతీర్ధ, రాఘవేంద్ర వంటివారు మధ్వుడి కోపు వేసుకొన్నారు. వీరందరిలో వ్యక్తిగత తేడాలున్నాయి.
కేసవ, నింబార్కుడు ఏ ముఠాలకూ చెందకుండా గీతకు సొంత వ్యాఖ్యానాలు చేశారు. భాస్కర, అభినవగుప్త, ఆనందవర్ధన, రమాకాంతులు కాష్మీరు పండితులుగా గీతకు భాష్యం చెప్పారు. బొంగాలలో చైతన్య, మహారాష్ర్టలో రామ్ దాస్, ఏకనాధ్, ఇంకా తుకారాం వారి భాష్యాలు వెల్లడించారు.
మహారాష్ర్టలో గీతపై చెప్పే వ్యాఖ్యానానికి బ్రాహ్మణులు జ్ఞానదేవుడిని 13వ శతాబ్దంలో హింసించారు. అతనిని కాపాడిన కొందరు బ్రాహ్మణులు గీతపై వేరే అనువాదం, భాష్యం వెల్లడింపచేశారు. మహారాష్ర్టలో అన్ని కులాల వారికీ అది ప్రేరణ కల్పించింది. (D.D. Kosambi : The Culutre And Civilization of Ancient India) అతడి భాష్యంలో మానవవాదం ఉన్నది. జ్ఞానదేవుని ఆదర్శపురుషుడు ప్రపంచంలోని ఏ వస్తువును చూచినా దివ్యమైన ప్రేమతో పొందిపోతారు. జీవితాదర్శం మోక్షం కాదు. భక్తి మాత్రమే. కర్మకాండలూ, యోగాభ్యాసాలూ నిరుపయోగం. జీవితం పాపపంకిలం కాదు. దైవ ప్రేమానుభూతిని చూపేదే జీవితం. అది గ్రహించటమే జీవిత లక్ష్యం. ఇందుకు కులాలూ, కాల, ప్రదేశాలు అడ్డురాకూడదు. ఇది జ్ఞాన దేవుడి సందేశం. (B.P. Birat : A Philosophy of Gnanadeva Pandharipur, 1956). 13వ శతాబ్దంలో మోక్షం ఆదర్శం కాదని, కులాలను ఖండించటం అసాధారణం. 22వ ఏట చనిపోయిన జ్ఞానదేవుడు మురాఠీ భాషపై, ఆలోచన పై తన ప్రభావాన్ని చూపెట్టాడు.
శంకరుని చాలా మంది ప్రమాణంగా స్వీకరించినా మైంకర్కు అతని పట్ల చాలా స్వల్పమైన అభిప్రాయం ఉన్నది. గీతకు భక్తియోగం కేంద్రమనీ, శంకరుడు వక్రభాష్యం చేసి తన జ్ఞానయోగాన్ని సమర్ధించుకున్నాడనీ అన్నాడు. భగవద్గీత భాష్య కారుడుగా శంకరుడిపై ఆధారపడటానికి వీలులేదన్నాడు. (T.G. Mainkar : A Comparative Study on the commentary of Bhagavadgeetha, Delhi 1969). గీతపై సంప్రదాయ భాష్యకారులందరికీ ఈ మాటలు వర్తించవచ్చు.
ఆర్.డి. రణడే పండితుడుగా గీతపై భాష్యం చెప్పాడు. ఎస్.హెచ్. జాబ్వాలా హీనమైన భాష్యం చెప్పాడు. ఐతే, వారు ఆధునిక కాలాన్ని కూడా తమ భాష్యంలో చెప్పారు.
గీతను ఎలా చదివాల్సిందీ వివరిస్తూ త్రిదండి స్వామి బి.హెచ్. బాన్ రాయగా, పేరు లేకుండా మరొకరు గైడు రాశారు. చైతన్య ధోరణిలో గీతను త్రిదండిస్వామి అనువదించాడు. పేరు లేని వ్యక్తి రాధాకృష్ణను ఉదహరిస్తూ కాలాతీతంగా, విశ్వవ్యాప్తంగా గీత పనికి వస్తుందని బోధించాడు.
ఢిల్లీలోని సుందర్ లాల్ అనే హిందువు గీతను ముస్లింలు ఎలా చదవాల్సిందీ రాయగా హైదరాబాద్ లోని సయ్యద్ అసదుల్లా దానిని అనుసరించాడు. గీతను క్రైస్తవులు చదవ వలసిన తీరుపై కొన్ని పుస్తకాలున్నాయి. బౌద్ధ, జైన, యూదు, జోరాస్ట్రియన్, షింటొ, కన్ఫ్యూసియన్ గైడ్లు కూడా వస్తుండవచ్చు. (Anon : Githadarshan as Bhaktiyoga, Madras 1968 : Tridandaswamy, B.H. Bon : The Gita as a Chaitanyait Reads it, Bombay 1938).
బాల్ గంగాధర్ తిలక్ గీతను ఆచరణకు పురికొల్పుతున్నట్లు, నిష్కామకర్మగా, ప్రపంచం కోసం ఈ ఆచరణ జరపాల్సినట్లు అభిప్రాయపడ్డాడు. మరాఠీలో రాసిన ఈ పుస్తకాన్ని బర్మాలోని మాండలే జైలులో ఉండగా తిలక్ ఉద్ర్గంధంగా రూపొందించాడు. దీనిని బాలచంద్ర శీతారాం సుక్తాంకర్ ఇంగ్లీషులోకి అనువదించాడు. గీత భాష్యాన్ని అరవిందుడు కొట్టిపారేశాడు. గాంధీ కూడా విభేదించాడు.
అరవిందుడు చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటూ, హఠాత్తుగా పాండిచేరి పారిపోయి అది భయపడి తీసుకున్న చర్య కాదనీ, దైవపిలుపును బట్టి తీసుకున్న నిర్ణయం అనీ మనల్ని నమ్మమంటున్నాడు. సంపన్న శిష్యులతో, వారి ఆదరణతో సొంద జీవితాన్ని గడిపాడు.
తిలక్, గాంధీల మధ్య గీతాభాష్యంపై వచ్చిన అభిప్రాయభేదాలను డి.కె. గోసావీ విడమర్చి చెప్పాడు. (Tilak,Gandhi and Geetha, Bombay, 1983)
గాంధీ కేవలం సత్యం, సంపూర్ణ బ్రహ్మచర్యం, పూర్తి ఆహింస, తిరుగులేని త్యాగం, కేవల నైతిక విలువలూ కావాలన్నాడు. అలా అంటే చివరకు వ్యక్తిలో కపట ప్రవర్తనకు దారితీసే లక్షణాలు వస్తాయి. నైతికవాది మానవస్వభావాన్ని విస్మరించే అవకాశం వున్నది. అలాంటప్పుడు నైతికవాదిని మానవస్వభావం కూడా పక్కనబెడు తుంది. బెట్రాండ్ రసెల్ ఇలాంటి హెచ్చరికచేశాడు. ఐనా గాంధీ పట్టించుకో లేదు. దాని ఫలితం అనుభవిస్తున్నాం. ప్రజా జీవితం, వ్యక్తిగత జీవితంలో కూడా నైతిక విలువల్ని పాటించకుండా నటనతో కప్పిపుచ్చుతున్నాం. దీనంతటికీ గీతా ప్రభావం చూపవచ్చు. అన్ని అభిప్రాయాలకూ నమ్మకాలకూ అసమానతలకూ ఆర్థిక పరమైన అన్యాయాలకూ గీతను అడ్డం పెట్టుకోవచ్చు చంపేవాడూ, చంపబడేదీ అనేది లేదని గీత చెపుతుండగా ఇక హత్యలకూ, మూకుమ్మడి హింసలకూ, వ్యతిరేకత ఎలా వస్తుంది. చంపుతున్నారనుకోటం అజ్ఞానం. దేవుడు వారిని ముందే చంపేశాడు అంటుంది గీత. గీతాకారులకు ఆచరణలో స్వేచ్ఛ లేదు. అతడు దేవుని చేతిలో కీలుబొమ్మ. వేదాంతులు దీనివే ఈశ్వరలీల అంటున్నారు.
ఆల్బర్ట్ షూజర్ భగవద్గీతకు స్పింన్క్స్ వంటి స్వభావం ఉన్నదన్నాడు. అది కేవలం గూఢార్ధంతో నవ్వుతుంది. కాని, గీత గూఢార్ధంలో మాట్లాడుతుంది, వాదిస్తుంది, బెదిరిస్తుంది, ప్రేరేపిస్తుంది, ఇంకెన్నో చేస్తుంది. నైతిక విలువల్ని పాటించదు. గీత నీతికి దూరమైనది. మనం దానిని చదివి గౌరవిస్తున్నాం. గీతను రాసిన అనామకులకు అది గొప్ప విజయం. భారతదేశానికీ, ప్రపంచానికీ అదొక విషాదం.
22వ అధ్యాయం
తుదిమాట
1200 సం.రాల క్రితం శంకరాచార్యుడు దుమ్ముదులిపి గీతను పైకి తీసి తన మేధస్సుతో భాష్యంగా రాసి విమోచన గ్రంధంగా ప్రజలు ముందుంచాడు. అప్పటి నుండీ దీని ప్రభావం సర్వత్ర దారుణంగా పరిణమించింది. మానవ అసమానతలకు, బాధలకూ బాధపడకుండా, ఉదాసీనత చూపటానికి గీతే కారణం. మనల్ని కపటవర్తనలోకి గీత నెట్టేవేసింది. ఆ విషయాన్ని ప్రేమనాధ్ బజాజ్ రాశాడు.
గీత జాతీయ పవిత్రగ్రంధంగా ఆవిర్భవించటం, మన మనస్తత్వాన్ని ఆవరించటం పరస్పర సంబంధం గలవి. ఆ మాట అంటే గీతాభిమానులు దూషిస్తారు. ఈ విషయంలో చర్చ జరగాలి. ఆలోచనల సంఘర్షణ సాగాలి. అప్పుడు కొత్త జీవితానికి నాంది పలుకుతుంది.
గీత పేర్కొన్నట్లు కృష్ణుడు మళ్ళీ ఈ భూమి మీదికి ధర్మస్థాపన నిమిత్తం రాకూడదు. లోగడ వచ్చినందుకే తీరని నష్టం జరిగింది. ధర్మం పేరిట మారణకాండ జరిగింది. మహాభారతం ప్రకారం అప్పుడు మిగిలిన వారు 9 మందే. ద్వాపరయుగం అంతమై కలియుగ మారంభమైందన్నారు. కృష్ణుడు తనను వజ్రాయుధంగా వర్ణించుకున్నారు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు వస్తే అణ్వాయుధాల కృష్ణుడవుతాడు. భూమిపై మనుషులుండరు.

అర్జునుడు విస్మరించినట్లే మనం గీతను విస్మరించాలి. కృష్ణుడు బోధించిన ఒక ఏడాది లోనే గీత తన మనసు నుండి తొలిగిపోయిందని అర్జునుడన్నాడు. మనజాతి మనసునుండి కూడా అలాగే తొలిగిపోవాలి. అంతటితో మన నిద్రావస్తపోయి, భ్రమలు తొలగి సొంత ఆలోచన పెరుగుతుంది. అప్పుడే స్వార్ధాన్ని పక్కన బెట్టి మానవజాతి భవిష్యత్తుకు బాటలు వేయగలం. కార్ల్ సేగన్ ఊహించినట్లు మనభూమి వంటివి ఈ విశ్వంలో యింకెన్నో ఉండి ఉండవచ్చు. అవి వివిధ సంస్కృతులలో మనల్ని మించిపోయి ఉండవచ్చు. అర్జునుడు గీతను మరచిపోయినట్లే మనం గీత వైరుధ్యాలనూ, గందరగోళాలనూ ఎత్తుగడలనూ మరచిపోయే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. భారతీయులు ఆనందంగా అర్థవంతంగా మనుగడ సాగిస్తారని కోరుకుంటున్నాను. ఆలోచన స్థభింపజేసే ధోరణి మార్చుకోవాలి. అనంతాకాశంలోకి చూస్తూ, ఆత్మ పరమాత్మతో లీనమయ్యే ఎండమావుల కోసం వెతక్కుండా ఉండాలి. విశ్వంలోని మర్మాల పొరలను విప్పుకుంటూ మానవుడు పురోగమించాలి. అందుకు తొలిమెట్టుగా కృష్ణుడిని, గీతనూ విసర్జించాలి.
by late Narla Venkateswararao Telugu by: Innaiah Narisetti

No comments:

Post a Comment