1వ అధ్యాయం
సల్మాన్ రష్డి వ్యవహారం
1989 ఫిబ్రవరి 14 ముందు
యూదు తాత్వికుడు, వైద్యుడు అయిన ఇబ్నకమ్మున 1280లో బాగ్దాద్ లో ఒక విశిష్ట గ్రంథాన్ని వెలువరించాడు. మూడు నమ్మకాల పరిశీలన అనేది ఆ గ్రంథ శీర్షిక. యూదు మతం, క్రైస్తవం, ఇస్లాంపై శాస్త్రీయ వాస్తవికత, విమర్శనాత్మక వైఖరులతో వెలువడింది కాన, ఆ పుస్తకం విశిష్టమైనది. అజ్ఞేయ వాదానికి దగ్గరగా ఉన్న దైవచింతన అందులో ఉంది. (పుట. 8, పరిచయం, ఎగ్జామినేషన్ ఆఫ్ త్రి ఫెయిత్స్, అనువాదం - మోషే పెరల్ మన్, బర్కిలీ, లాస్ఏంజిలస్, 1921).
ప్రవక్త మహమ్మద్ చెప్పింది ఏదీ స్వతసిద్ధం కాదు. దైవాన్ని గురించిన మన జ్ఞానాన్ని గురించి కానీ, దైవానికి మనం విధేయులమై ఉండవలసిన అవసరాన్ని గురించి కానీ అతను కొత్తగా చెప్పిందేమీ లేదు. అంతకు ముందటి మతాలన్నిటిలోనూ అది ఉంది. (పుట 145, పైన పేర్కొన్న గ్రంథం). పోనీ, ప్రవక్త పరిపూర్ణుడనుకుందామా అంటే, కానేకాదు. మహమ్మద్ పరిపూర్ణత సాధించడంలోనూ, ఇతరుల్లో దాన్ని పెంపొందించడంలోనూ సామర్ధ్యం లేనివాడు. భయం వలన, అధికారం కోసం, అధిక పన్నులు తప్పించుకోవడానికి, అవమానపడకుండా ఉండడానికి, ఖైదీగా పట్టుబడినప్పుడు, ముస్లిం స్త్రీతో లైంగిక సంబంధం ఏర్పడినప్పుడు ప్రజలు ఇస్లాంలోకి మారారు. అలాంటి కారణాలవల్ల తప్ప, తన విశ్వాసానికీ, ఇస్లాం విశ్వాసానికీ తేడా తెలిసిన ఏ ముస్లిమేతరుడూ ఇస్లాంలోకి మారడు. మహమ్మద్ ప్రవక్త కావడానికి తగిన వాదనలు, రుజువులు ముస్లింలు చూపలేక పోయారు. సందేహవాదాన్ని ముస్లింలు ఎలా పరిగణించారు? పై పుస్రక ప్రచురణ జరిగిన తరువాత నాలుగేళ్ళకు పువాతి (1244-1323) అనే 13వ శతాబ్ది చరిత్రకారుడు ఇలా వివరించాడు.
1284లో యూదు జాతీయుడైన ఇబ్నకమ్మున ఒక గ్రంథం రాశాడని తెలిసింది. అందులో అతడు ప్రవక్త ప్రవచనాలపట్ల అగౌరవం ప్రదర్శించాడన్నారు. ఆయన రాసిందాన్ని తిరిగి మనం చెప్పుకోవలసిన పని లేదు. కానీ, ఉద్రిక్తులైన జనం ఆయన ఇంటి మీద దాడి చేసి చంపాలనుకున్నారు. అమీర్ తోపాటు కొందరు ఉన్నతాధికారులు ముస్తాన్ సిరియా మదరసాకు వెళ్ళి ఆ విషయాన్ని వివరించడానికి ఉన్నత న్యాయమూర్తిని, న్యాయకోవిదుల్ని కలిశారు. ఇబ్నకమ్మున కోసం వెతికారు. అతను దాక్కున్నాడు. ఆరోజు శుక్రవారం ఉన్నత న్యాయమూర్తి ప్రార్థనకు పోతుండగా జనం అడ్డుపడ్డారు. ఆయన మదరసాకు వచ్చాడు. ప్రజల్ని శాంతపరచడానికి అమీర్ బయటకు వచ్చాడు. కాని, ఇబ్నకమ్మునను వెనకేసుకొస్తున్నాడని జనం అతన్ని తిట్టారు.
మరునాడు ప్రొద్దున్నే నగర ప్రాకారం దగ్గర ఇబ్నకమ్మునను తగులబెట్టాలని అమీర్ ఉత్తర్వులిచ్చాడు. అంతే, జనం వూరడిల్లారు. ఇక, ఇబ్నకమ్మున ఊసే ఎత్తలేదు.
తోలుకప్పిన పెట్టెలో ఇబ్నకమ్మునను దాచిపెట్టారు. కిల్లా అనే చోటకు అ పెట్టెను చేర్చారు. కిల్లాలో ఇబ్నకమ్మున కుమారుడు అధికారిగా ఉన్నాడు. చనిపోయే వరకు ఇబ్నకమ్మున అక్కడే ఉన్నాడు. (పుట. 3, నోట్ 5).
మత విమర్శకులపై ముస్లింల తిరుగుబాటు
తమ మతాన్ని అవమానిస్తే సనాతన ఛాందసులే కాక, సాధారణ ముస్లింలు కూడా ఎలా స్పందిస్తారో పునాతి పేర్కొన్న సంఘటన చెపుతుంది. ఇస్లాం చరిత్రలో ఇలాంటి సంఘటనలెన్ని జరిగాయో ? జాన్ కెన్నెత్ గాల్ బ్రెత్ అమెరికా రాయబారిగా ఇండియాలో ఉన్నప్పుడు (1961-63) తన పెంపుడు పిల్లికి అహమ్మద్ అని ముద్దుపేరు పెట్టుకున్నాడు. ప్రవక్త మహమ్మద్ ను అహమ్మద్ అని కూడా పిలుస్తారు. అందువల్ల రాయబారి చిక్కుల్లో పడతాడు. బెంగుళూరు దినపత్రిక దక్కన్ హెరాల్డ్ మహమ్మద్ మూర్ఖుడు అనే శీర్షికతో ఒక కథను ప్రచురించింది. ఆ పత్రిక కార్యాలయాన్ని ముస్లింలు తగలబెట్టారు. నిజానికి అది ప్రవక్తకు సంబంధంలేని కథ. మహమ్మద్ అనేది ఒక వికారి పేరు మాత్రమే. ఆ మధ్య ఒక మళయాళ నాటకాన్ని ది యాంట్స్ దట్ ఈట్ కార్ప్స్ (శవాలను తినే చీమలు) ప్రదర్శించినప్పుడు షార్జాలో 10 మంది భారతీయుల్ని జైల్లో పెట్టారు. అందులో మహమ్మద్ కు వ్యతిరేక వ్యాఖ్యలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
విమర్శించడానికి సాహసించే ముస్లింలని ద్రోహులుగా పేర్కొని తల తీసేయడం, సిలువ కొట్టడం, తగులబెట్టడం జరుగుతుంది. (చూడు. ఈ పుస్తకంలో 10వ అధ్యాయం) ముస్లింలు ఇస్లాంను విమర్శించిన ఇటీవలి ఉదాహరణలు చూద్దాం.
డేనియల్ పైప్స్ వ్రాసిన రష్డీ ఎఫైర్ అనే ఉత్తమ గ్రంథంలో చాలా ఉదంతాలు పేర్కొన్నారు. ఇస్లాంతో విబేధించే రచనలు చేసినందుకు ముస్లిం ఆలోచనాపరులు శిక్షలు పొందారు. కొందరు మాత్రం తప్పించుకోగలిగారు. అలా తప్పించుకున్నవారిలో ఇరాన్ రచయిత అలీ దష్తీ కూడా ఉన్నాడని పైప్స్ పొరపాటుపడి రాశాడు. దష్తీ విషాదగాథను చెప్పుకోబోయే ముందు ముస్లిం నమ్మకాలపై ఇరవై మూడు సంవత్సరాలు అనే గ్రంథంలో రష్డీ చేసిన విమర్శనాత్మక దాడిని చూద్దాం. అతడా పుస్తకాన్ని 1937లో వ్రాసినా, 1974 దాకా అది ప్రచురణకు నోచుకోలేదు. బహుశ అది బీరూట్ లో అచ్చయిందేమో ? ఎందుకంటే, 1971-77 మధ్య ఇరాన్ షా పాలనలో ఉంది. అప్పుడు మత విమర్శ నిషేధానికి గురైంది. 1979 విప్లవానంతరం దాని ప్రచురణకు ప్రభుత్వ వ్యతిరేక రహస్య ముఠాలకు దష్తీ అనుమతిచ్చాడు. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన ఈ పుస్తకం ప్రతులు 1980-86 మధ్య ఐదు లక్షలు అమ్ముడు పోయాయి.
నమ్మకం మానవుడి వివేకాన్నీ ఇంగిత జ్ఞానాన్నీ బండబారుస్తుందంటూ గుడ్డినమ్మకాన్ని విమర్శించిన దష్తీ వివేచనాత్మకతను సమర్ధించాడు. (పుట. 10) పండితుల్లో సైతం నిష్పాక్షిక, హేతుబద్ధ అధ్యయనం అవసరమని నొక్కి చెప్పాడు. ఖురాన్ దైవదత్తం కాదన్నాడు. మహమ్మద్ లో మహత్యాలేమీ లేవన్నాడు. విషయపరిజ్ఞానానికీ, ధర్మబద్ధతకూ ఖురాన్ నిదర్శనమనడం తప్పన్నాడు. సందేహవాద దృక్పథంతో వాటిని పరిశీలించాడు. వంచన, అతిశయోక్తి చోటు చేసుకొనక ముందు ఖురాన్ వంటి గ్రంథాన్ని ఏ దైవభక్తుడైనా సృష్టించగలిగి ఉండేవాడని ఖురాన్ లోని వాక్యక్రమం రుజువు చేస్తున్నదని పూర్వకాలపు ముస్లిం పండితులే అంగీకరించారని దష్తీ రాశాడు. (పుట. 48).
ఖురాన్ లో కొన్ని వాక్యాలు అసంపూర్తిగా ఉన్నందువల్ల అవి అంత స్పష్టంగాలేవు. వాటికి భాష్యం అవసరమవుతున్నది. విదేశీ మాటలు, అరబ్ భాషలో బహుళ ప్రచారంలో లేని మాటలు, మామూలు అర్థంలో వాడని పదాలు, తర్కబద్ధం కానివి, వ్యాకరణబద్ధం కానివి, ఎవరినీ ఉద్దేశించని పదాలు, విషయానికి చెందని పదాలు ఖురాన్ లో ఉన్నాయి. దాదాపు 100కు పైగా సాధారణ నియమాలు పాటించనివి అందులో కన్పిస్తాయి. (అలీ దష్తీ. పుట. 50)
ఖురాన్ అద్భుతాలతో కూడి ఉంది అనే మాటను గురించి ఇబ్నకమ్మున వలే దష్తీ కుడా ఇలా అన్నాడు.
లోగడ వెల్లడించని కొత్త భావాలేవీ ఖురాన్ లో లేవు. నీతి సూత్రాలు కూడా పాతవే. అంతకు ముందు అందరూ గుర్తించినవే. యూదుల క్రైస్తవుల గాథల నుంచి పుణికి పుచ్చుకున్న కథనాలు చాలా ఉన్నాయి. వారి పీఠాధిపతుల్ని, పురోహితుల్ని మహమ్మద్ కలిశాడు. సిరియా వెడుతూ వారిని సంప్రదించాడు. అద్ తాముద్ సంతతివారి జ్ఞాపకాలతో కథలుగా రూపొందినవే మిగతావి. నైతిక రంగంలో కూడా ఖురాన్ సూక్తులు అద్భుతమైనవేమీ కావు. లోగడ అనేక ప్రదేశాల్లోని ప్రజల్లో అలాంటి భావనలున్నాయి. కన్ ఫ్యూషియస్, బుద్ధుడు, జొరాస్టర్, సోక్రటీస్, మోషే జీసస్ మొదలైనవారు అలాంటి భావనల్ని చెప్పారు. లోగా పామర అరబ్బులు యూదుల నుంచి స్వీకరించిన విధులు, ఆచారాలు ఇస్లాంలో కొనసాగాయి. (అలీ దష్తీ, పుట. 56).
మక్కా యాత్ర చేసేటప్పుడు, ఇతరత్రా పాటించే మూడు నమ్మకాలను దష్తీ అపహాస్యం చేశాడు. వ్యతిరేకుల్ని మహమ్మద్ చంపాడు, హత్య చేశాడు. రాజకీయ హత్యలకు పాల్పడ్డాడు. వీటన్నిటినీ ఇస్లాం సేవలుగా మహమ్మద్ అనుచరులు చిత్రించారు. ఇస్లాంలో స్త్రీల పరిస్థితిని పరిశీలించిన దష్తీ వారి స్థితి హీనమన్నాడు. దైవానికి సంబంధించిన ముస్లిం సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఖురాన్ దైవం క్రూరుడు, కోపిష్టి, గర్వి అనీ, అతనిలో శ్లాఘనీయ గుణాలేమీ లేవనీ అన్నాడు. ఖురాన్ దైవదత్తం కాదన్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడో, మహమ్మదే మాట్లాడుతున్నాడో తెలియని గందరగోళ పరిస్థితి ఖురాన్ లో ఉన్నదన్నాడు.
పైప్స్ భావించినట్లుగాకాక, మూడేళ్ళు ఖొమేనీ జైళ్ళలో కుమిలి కుమిలి, ఆ తరవాత తన 83వ యేట మరణించాడు. మరణించబోయే ముందు ఒక స్నేహితుడితో ఇలా చెప్పాడు. ఇలాంటి పుస్తకాలు ప్రచురించడానికి షా అనుమతించి ఉంటే, మనకు ఇస్లామిక్ విప్లవం వచ్చి ఉండేదే కాదు. (అమీర్ తాహరీ, పుట. 290, హోలీ టెర్రర్, 1987, లండన్)
కైరోలోని సుప్రసిద్ధ అల్ అజర్ ఇస్లాం విశ్వవిద్యాలయంలో షేక్ అలీ అబ్ద్ అల్ రజిక్ 1925లో ఇస్లాం అండ్ ది ప్రిన్స్ పుల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. (పైప్స్, పుట. 74, ది రష్డి ఎఫైర్, న్యూయార్క్, 1990) మతమూ రాజకీయాలూ వేర్వేరుగా ఉండాలని ఈ గ్రంథంలో అయన వాదించాడు. ఇస్లాం బోధించింది కూడా అదేనని ఆయన చిత్త శుద్ధితో నమ్మాడు. ఇతర షేక్ లు అలాంటి అభిప్రాయాన్ని అంగీకరించలేదు. అతడిని విచారించి, అపవిత్రత నేరం మోపి, యూనివర్సిటీ నుంచి తొలగించి, మతపరమైన హోదాలన్నిటికీ అనర్హుడుగా ప్రకటించారు.
అల్ హజర్ లోని మరో ఈజిప్టు రచయిత తాహ హుసాన్. (పైప్స్. పుట. 75) ఫ్రాన్స్ లో చదువుతున్న హుసాన్ సందేహవాద మనస్తత్వం పెంపొందించుకున్నాడు. ఈజిప్టుకు తిరిగి వచ్చాక కాలం చెల్లిన సాంప్రదాయాలను విమర్శించి తీవ్ర విమర్శకు గురయ్యాడు. మత సంస్థలు కూడా హుసాన్ భావాలను ఒప్పుకోలేదు. అతడు తన పదవుల నుంచి తొలగవలసి వచ్చింది. ఇస్లాంకు మొదటి కవిత్వం మీద వ్రాస్తూ అతడు అబ్రహాం, ఇస్మాయిల్ ప్రస్తావన ఖురాన్ లో ఉన్నంత మాత్రాన వారు చరిత్రలో ఉన్నట్లు కాదన్నాడు.
సిరియా సైనిక పత్రిక ప్రభావం
సిరియా సైనిక పత్రిక జయాష్ అష్ సాబ్ 1976 ఏప్రిల్ లో ఆరు రోజుల యుద్ధారంభంలో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో ఇస్లాంనే కాక, దేవుణ్ణి, మతాన్ని కూడా చారిత్రక అవశేషాలుగా పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచాలని వ్రాసింది. (పైప్స్, పుట. 75) దానితో ఇబ్నకమ్మున ఉదంతం వలెనే సిరియా నగరాల్లో వీధినపడి హింసకు సమ్మెలకు, అరెస్టులకు పాల్పడ్డారు. అదంతా యూదు అమెరికా కుట్ర అన్నారు. అయినా, హింస ఆగకపోయేసరికి ఆ వ్యాస రచయిత ఇబ్రహీం కలాస్ ను, ఇద్దరు పత్రికా సంపాదకుల్ని పోస్టుమార్టం చేసి నేరస్థులుగా నిర్ణయించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత వారిని విడుదల చేయడం ఒక సుఖాంతం. 1967లో అరబ్బులు ఇజ్రాయిల్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అనంతరం 1969లో ఒక సిరియన్ మార్క్సిస్ట్ మేథావి మతం మీద మంచి విమర్శను వెలువరించాడు. బీరూట్ లోని అమెరికన్ యూనివర్సిటీలో చదివిన అల్ అజం సాదిక్ ఏల్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొంది, బ్రిటిష్ తాత్వికుడైన బిషప్ బర్కిలీపై ఒక అధ్యయనం వెలువరించాడు. (పైప్స్. పుట. 75).
బీరూట్ లోని సున్నీ మతస్థులు అల్ అజం చేసిన తీవ్ర విమర్శను తట్టుకోలేకపోయారు. మత సమస్యల్ని రెచ్చగొడుతున్నందుకు శిక్షించకుండా వదిలివేశారు. సిరియా రాజకుటుంబీకులతో అతనికున్న సంబంధాలే అందుకు కారణం కావచ్చు. అయినా, కొంతకాలం విదేశాల్లో గడపడం శ్రేయస్కరమని అతడు భావించాడు.
ప్రజల్లో విమర్శనాత్మక పరిశీలనను పెంపొందించినందుకు అరబ్ నాయకుల్ని అల్ అజం తప్పుపట్టాడు. ఇస్లాం పట్ల ఏమాత్రం నిశిత పరిశీలన చేయకుండానే కాలదోషం పట్టిన మార్గంలో నాయకులు నడవడాన్ని ఎత్తి చూపాడు. అరబ్ తిరోగమనవాదులు మతాలోచనను సిద్ధాంత ఆయుధంగా వాడుకున్నారన్నాడు.
అరబ్బుల్ని దోచుకోవడంలో ప్రయోగిస్తున్న భావచౌర్యాన్ని శాస్త్రీయ విశ్లేషణ చేయడంలేదనీ, విశుద్ధ పరిశీలన లేదనీ ఆయన అన్నాడు. అరబ్ మేథను విమర్శించడం కాని, సాంఘిక సంప్రదాయాలను పరిశీలించడం కానీ, నాయకులు బొత్తిగా చేయడం లేదన్నాడు. ప్రజల సంప్రదాయాలను, విలువలను, కళలను, మతాన్ని, నీతిని కాపాడుతున్నామనే నెపంతో వెనకబడిన సంస్థల్ని, మధ్యయుగాల సంస్కృతిని, పులుముడు సిద్ధాంతాలను వెనకేసుకొస్తున్నాడని చూపాడు. (డోనోహు, ఎస్ పోసిటో, పుట. 114, ఇస్లాం ఇన్ ట్రాన్సిషన్, 1965, ఆక్స్ ఫర్డ్)
గత 150 సంవత్సరాలుగా శాస్రాభివృద్ధి వల్ల ఉత్పన్నమైన సవాళ్ళను ప్రతి ముస్లిమూ ఎదుర్కోవలసిందే. అనేక విషయాలలో ముస్లిం మత విశ్వాసం శాస్త్రవిజ్ఞానంతో నేరుగా ఘర్షణ పడవవలసి వస్తున్నది. అసలు విధానంలోనే మౌలిక భేదం ఉంది. గుడ్డినమ్మకం మీద ఇస్లాం ఆధారపడుతున్నది. ఇస్లాం పవిత్ర గ్రంథాల్ని పరిశీలించకుండా పాటిస్తున్నది. అవిమర్శనాత్మక యోచన మీద, పరిశీలనమీద, విషయాలను రాబట్టడం మీద, వాస్తవానికి సరిపడుతున్నదా లేదా అనే అంశం మీద ఆధారపడి సైన్స్ పురోగమిస్తుంది. మనం మతాన్ని విమర్శించకుండా ఉండలేము. పవిత్ర గ్రంథాలన్నిటిని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాలి. అప్పుడే, వెనక్కు చూడడం మానివేస్తాం. అప్పుడే మనం అమల్లో ఉన్న వైజ్ఞానిక రాజకీయ వ్యవస్థను ఉన్నదాన్ని ఉన్నట్లుగా అట్టిపెట్టాలనే మార్మికవాదన సమర్థనకు స్వస్తి పలుకుతాం.
సాదిక్ అల్ అజం వ్రాసిన గ్రంథం చాలా ముఖ్యమైనది. అది బాగా వెలుగులోకి రావాలి. ఇంకా అది అరబిక్ నుండి ఇతర భాషల్లోకి రాలేదు. సాదిక్ అల్ అజం ఇటీవల ఒక సాహసోపేత వ్యాసం వ్రాసి రష్డీని సమర్థించాడు. (ది వెల్డ్ డెన్ ఇస్లామ్స్, 31-1991)
మతవాది మహమ్మద్
లోపల నుండే ఇస్లాంను మార్చాలనే మరో ప్రయత్నం కూడా విషాదాంతంగా ముగిసింది. సుడాన్ మతవాది మహమ్ముద్ మహమ్మద్ తాహ చట్టం ద్వారా ఖురాన్ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేశాడు. (పైప్స్. పుట. 75-77) ప్రజావసరాలను తీర్చడానికి 20వ శతాబ్దిలో కొత్త చట్టం అవసరమన్నాడు. తన భావాల ప్రచారానికి రిపబ్లికన్ బ్రదరిక్ అనే సంస్థను స్థాపించాడు. ఖార్టూంలోని మతవాదులు తాహ భావాలపట్ల ఉదారంగా వ్యవహరించలేక పోయారు. 1968లో అతన్ని దోషిగా ప్రకటించారు. ఇస్లాం చట్టంలో దానికి మరణమే శిక్ష. అతని రచనల్ని తగలబెట్టారు. శిక్ష తప్పించుకొని తాహ. 17 సంవత్సరాలపాటు తిరిగాడు. మరల విచారించి 1985 జనవరి ఖార్టూంలో అతని 76వ యేట బహిరంగంగా ఉరితీశారు.
పైప్స్ ఉదహరించిన సమకాలీన ముస్లిం నాయకులలో లిబియా నాయకుడు మహమ్మద్ అల్ గడ్డఫీ సుప్రసిద్ధుడు. మహమ్మదు ప్రవక్తమీదా, ఖురాన్ మీదా, ఇస్లాం మీదా అతడు చాలా విద్రోహకర ప్రకటనలు చేశాడు. (పుట. 79-80) షరియాను వ్యక్తిగతమైనదిగా అట్టిపెట్టాడు. ప్రజాజీవనరంగంలో తన భావాలను ప్రచారం చేశాడు. ఇస్లాం కేలండరును మార్చివేశాడు. మక్కా యాత్రికుల్ని మూర్ఖులుగా చిత్రించాడు. మహమ్మద్ ప్రవక్తను నిరసించాడు. ప్రవక్తకంటే తాను సాధించిందే యెక్కువన్నాడు. ఖురాన్ సత్యాలను గురించి సందేహాలను వెలిబుచ్చాడు. ప్రవక్త జీవిత విశేషాల్ని సందేహించాడు. గడ్డఫీ ఇస్లాంకు విరుద్ధంగా మారుతున్నట్లు మత నాయకులు గమనించారు. కానీ, అతడిని చంపివేయమని పిలుపునివ్వలేదు. అతడు చెప్పేవి అబద్ధాలని ఖండించారు. అతడి రచనల్ని విశ్వసించలేదు. ఈ విషయాలు అమెరికా గూఢచారి సంస్థకు తెలిసి ఉన్నట్లయితే. గడ్డఫీ రచనల్ని పునర్ముద్రించి ఉచితంగా పంచిపెట్టే వాళ్ళే. అనంతర విషయాలు మత ఛాందస పండితులు చూచుకొనేవారే.
ఆధునిక సమస్యలకు పరిష్కారమార్గం ఇస్లాం చూపగలదా అని సందేహించిన మరో ఇరువురున్నారు. (అమీర్ తాహెరీ, పుట. 212). కైరో న్యాయవాది నూర్ ఫర్ వాజ్ 1986లో షరియాను విమర్శిస్తూ, ఆధునిక కాలానికి ఇస్లాంచట్టం పనికిరాదన్నాడు. తిరోగమన ఆదివాసీ నియమాలతో అది కూడి ఉందన్నాడు. మరో ఈజిప్టు న్యాయవాది రచయిత, ఫరజ్ ఫదా 1986లో షరియా వద్దు (నో టు షరియెట్) అనే శీర్షికతో తీవ్రమైన పత్రం ఒకటి ప్రచురించాడు. ఆధునిక రాజ్యాన్ని నడపడానికి తగిన సెక్యులర్ చట్టాన్ని ఇస్లాం ఇవ్వజాలదన్నాడు. కాబట్టి, మతాన్నీ, రాజ్యాన్నీ వేరుచేయాలన్నాడు. పిడివాది అయిన షేక్ కాషిక్ రచనలకంటే ఇతడి రచనే బహుళ జనాదరణ పొందింది. ఇస్లాం ప్రపంచంలో దీనిని ఉర్దూ, టర్కీ, పర్షియన్, ఇంకా ఇతర భాషల్లోకి అనువదించారు.
5 ప్రశ్నలు
1969 ఫిబ్రవరికి ముందు 24 మంది అరబ్బు రచయితలు ద ఇస్లాం ఎన్ క్వొశ్చన్ 5 ప్రశ్నలకు బదులిచ్చారు. (1986 గ్రాసెట్) ప్రశ్నలు
1. ఇస్లాం విశ్వజనీనంగా ఉండగలదా ?
2. ఇస్లాం ఆధునిక రాజ్యానికి ప్రభుత్వ విధానం కాగలదా ?
3. ఇస్లామిక్ అరబిక్ ప్రజల పరిణామానికి ఇస్లాం విధానం తప్పనిసరా ?
4. తిరిగి ఇస్లాం వైపు మళ్ళాలని గత పదేళ్ళుగా సాగుతున్న వాదం సరైనదేనా ?
5. ఈనాడు ఇస్లాంకు బద్ధ విరోధి ఎవరు ?
వీటికి ఇస్లాం పండితులిచ్చిన సమాధానాలనుబట్టి, ఇస్లాం ప్రపంచంలోని సాంఘిక రాజకీయ, ఆర్ధిక సమస్యలకు ఇస్లాం సమాధానం కాదు. సెక్యులర్ విధానం కావాలని అధికసంఖ్యాకులన్నారు. రెండవ ప్రశ్నకు కాదని జవాబిచ్చినవారు 9 మంది. సెక్యులర్ రాజ్యం కావాలన్నవారు ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఔనని చెప్పినవారు కూడా, అది కొన్ని పరిమితులకు లోబడి ఉండాలన్నారు. ఇస్లాంని ఆధునికంగా వ్యాఖ్యానించగలిగేటంతవరకు హక్కులను కాపాడాలన్నారు. తిరిగి ఇస్లాంలోకి పోవడాన్ని మత మౌఢ్యమనీ, ముస్లింలందరికీ అది అత్యంత ప్రమాదకరమైనదనీ భావించారు. అందులో రబిడ్ బోజెడ్రా అనే నవలాకారుడు, రచయిత, కమ్యూనిస్ట్ నాస్తికుడు కూడా ఉన్నాడు. ఆయన అల్జీరీయాలో మతాన్ని గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. (పుట. 203-14 Barbulolsco and Carinal Philippe L’ Islam en Question, Paris, 1986) రంజాన్ మాసంలో కొద్దిమంది మాత్రమే నమ్మకంతో ప్రార్ధిస్తారనీ, 80 శాతం మంది ప్రార్ధనలు చేస్తున్నట్లు నటిస్తారనీ అన్నాడు. సామాజిక ప్రతిష్టకోసం మక్కాయాత్ర చేస్తారనీ, త్రాగుతారనీ, వ్యభిచరిస్తారనీ అయినా వారిని మంచి ముస్లింలుగా చిత్రిస్తారనీ రాశాడు. ఆధునిక రాజ్యానికి ఇస్లాం తగిందేనా? అనే ప్రశ్నకు బోజెడ్రా నిర్ద్వంద్వంగా ఇలా వ్రాశాడు.
కాదు, ఎంతమాత్రమూ కాదు. అసంభవం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సుడాన్ అధిపతి నెమెరూ షరియాను అమలుపరచ దలచినప్పుడు, అది పనిచేయలేదు. కొందరి చేతులు, కాళ్ళు నరికిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు. రాళ్ళతో కొట్టి చంపడం వంటి పద్ధతులపట్ల ముస్లిముల్లో వ్యతిరేకత ఉంది. సౌదీ అరేబియా వంటి చోట్ల అది అమలు జరుగుతూ ఉంది. ఆధునిక రాజ్యానికి ఇస్లాం ఏమాత్రం పొసగదు. ఇస్లాం ప్రభుత్వవిధానం కానేకాదు.
1983 నుండి బోజెడ్రాపై ఫత్వా అమలులో ఉందేమో తెలియదు. అల్జీరియాలో అతడిని చంపేస్తామంటున్నా, రహస్య వేషాలలో అక్కడే చోటు మారుస్తూ ఉన్నాడు. 1992లో అతడు ఇస్లాం పార్టీపై తీవ్ర విమర్శ ప్రచురించాడు. ఆ యేడే ఎన్నికల్లో గెలవడానికి ఉపక్రమించిన ఆ పార్టీకి ఆది గోరుచుట్టుపై రోకటిపోటయింది. అతడు దానిని ప్రజాస్వామ్య వ్యతిరేక తీవ్రవాదపార్టీగా విమర్శించాడు. దానిని నాజీ పార్టీతో పోల్చాడు. మౌనంగా ఉండేవారిపట్ల బోజెడ్రాకు అసహ్యంతప్ప వేరేమీ లేదు. ఇస్లామిస్టుల్ని నిశిత పరిశీలన చేయని వారిపట్ల అతడికి గౌరవం లేదు. మధ్యయుగాల్లోకి పోవడం మంచిదని నటించేవారిని అతడు అసహ్యించుకున్నాడు. 1983లో విధించిన ఫత్వా మరల 1989లో ఫత్వాకు దారితీసింది.
1989 ఫిబ్రవరి 14 అనంతరం
ప్రపంచ చరిత్రలో, మేథారంగంలో 1989 ఒక గిరిగీసిన అంశంగా నిలబడుతుంది. అయొతుల్లా ఖొమిని 1989 ఫిబ్రవరిలో సాల్మన్ రష్డీని చంపేయమని (ఫత్వా) ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే పాశ్చాత్య ప్రపంచంలో మేథావులు, అరబ్బు వాదులు, ఇస్లాం నిపుణులు రష్డీని ఆక్షేపిస్తూ శటానిక్ వర్సెస్ రాసి, నెత్తిమీదకు తెచ్చుకున్నందుకు ఆయన్నే తప్పుపడుతూ రాశారు. అమెరికాలో ఇస్లాం నిపుణుడు జాన్ ఎస్పోసిటో రాస్తూ రష్డీ రాసిన తీరులో పరిస్థితి విషమిస్తుందని పాశ్చాత్యపండితుడెవరైనా చెప్పగలరన్నాడు. (పైప్స్. పుట. 71) అంతకు ముందు ఉదహరించిన సాదిక్ అల్ అజాం పుస్తకం నుండి కొన్ని భాగాలు ప్రచురించిన వ్యక్తి ఇలా అనడం ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది. ఆ పుస్తకంలోనూ ఇస్లాంను విమర్శించారుగా. ముస్లింలు నొచ్చుకున్నందుకు మరికొందరు రచయితలు రష్డీని చంపమని అమానుష పిలుపు ఇస్తే, చరిత్రకారుడు ప్రొఫెసర్ ట్రెవర్ రోపర్ ఉదాసీనంగా ఆమోదం చూపాడు.
బ్రిటిష్ చట్టవు ఉదారత్వంలో సాల్మన్ రష్డీ ఎలా ఉంటున్నాడో తెలియదు. బ్రిటిష్ పోలీసు చట్టం గురించి అతడు మూర్ఖంగా ప్రవర్తించాడు. బ్రటిష్ ముస్లింలు అతడిని చీకటిలో పడేసి బాదితే నేను నొచ్చుకోను. కనీసం అదేనా అతని కలాన్ని అదుపులో పెట్టగలిగితే, సాహిత్యరంగం బాగుపడుతుంది. (హాలిడే పుట 17 ది ఫండమెంటల్ లెసన్ ఆఫ్ ది ఫత్వా న్యూ స్టేట్స్ మన్ అండ్ సొసైటీ 1993 ఫిబ్రవరి 12)
చంపమనడాన్ని ఎవరూ ఈ వ్యాసాల్లో ఖండించలేదు. పైగా రష్డీ పుస్తకాన్నినిషేధించమని, పంపిణీ నుండి తొలగించమని సిఫారసు చేశారు. ప్రజాస్వామిక మౌలిక సూత్రమైన భావ స్వేచ్ఛను సమర్థించలేదు. అది లేకుండా మానవ ప్రగతే లేదు. దీనికోసమే రచయితలు మేథావులు చావడానికైనా సిద్ధమే.
పాశ్చాత్య సాహిత్యం మేథారంగంలో చరిత్రలు కొన్ని ఇస్లాం సున్నితత్వాన్ని కించపరుస్తాయి. గనుక వాటిని ఉపసంహరించాలని ముస్లింలు కోరితే ప్రొఫెసర్ రోవర్ ఏం చేస్తారు ? తనకు ప్రీతిపాత్రమైన గ్రంథాలను ఉపసంహరించక ముందే ట్రెవర్-రోవర్ గాఢనిద్ర నుండి మేల్కొంటారా ?
ఖురాన్ గురించి గిబ్బన్ రాసినదానికి ఆయన పుస్తకాలను ముస్లింలు తగలబెడతారా ? ఖురాన్ లో భావ ప్రేరణ కలిగించేవి చాలా అరుదు. కట్టుకథలు, వ్యర్థమాటలు, ఉదాహరణలో ఉన్న ఖురాన్ కొన్నిసార్లు ఆకాశంలో తేలిపోతూ, మరికొన్నిసార్లు మట్టిగరుస్తూ ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త తనకు దైవదత్తమని చెప్చే ధోరణి చూస్తే అంతకు ముందు బలహీనతలు బయటపడతాయి. తాను దైవ దూతనని చెప్పుకోవడం కట్టుకథే.
తప్పుడు విధానాలు, క్రూరత్వం, అన్యాయం అన్నీ తమ విశ్వాస ప్రకటనలకు వినియోగించారు. యుద్ధరంగం నుండి తప్పించుకున్న యూదుల్ని, ఇతరుల్ని చంపేయడాన్ని మహమ్మద్ అనుమతించాడు. అలాంటి చర్యలవలన మహమ్మద్ శీలం కళంకమైంది. తృష్ణ అతడిని చివరి రోజుల్లో ఆవరించింది. తన యవ్వనదశ పట్ల అతడు లోలోన నవ్వుకొని ఉండవచ్చునని రాజకీయవాదులు గ్రహిస్తారు. వ్యక్తిగత జీవితంలో మనిషి బలహీనతల్ని ప్రవక్త కనబరిచాడు. ప్రవక్త అని ఆపాదించేవన్నీ దుర్వినియోగపరిచాడు. తన జాతి పై విధించిన చట్టాలకు, తాను మాత్రం ప్రవక్తగా దైవం ఇచ్చిన అంశాల నెపంతో ప్రక్కన బెట్టాడు. అరమరికలు లేకుండా తన కోర్కెల్ని స్త్రీలతో తీర్చుకున్నాడు. (గిబ్బన్ 5, సంపుటి పుట 240, డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ 6 సంపుటాలు, లండన్ 1941).
రోవర్ కు ప్రీతిపాత్రుడైన హ్యూం ఇలా రాశాడు. ఖురాన్ ఒక అడ్డగోలు అసంబద్ధ విధానం. మహమ్మద్ చెప్పింది వింటే విద్రోహుల్ని, అమానుషత్వాన్ని, పగను వెనకేసుకు రావడం చూడొచ్చు. నాగరిక సమాజానికి పొసగని విషయాలవి. స్థిరమైన విషయం ఏదీ లేదు. నమ్మకస్తుల్ని బాధపెట్టిందా, ఉపయోగపడిందా అనే దానిపైనే నియమాల్ని పొగడడం, తెగడడం గమనిస్తాం. మహమ్మద్ నటించిన ప్రవక్త అని హ్యూం అన్నాడు. ఖురాన్ అంతా మహమ్మద్ నాటకం అనీ, అతడు చెప్పిందంతా ఘోరమైనదనీ అందరికీ ఈసరికి అర్థమై ఉండాలి. (హ్యూం 3 పుట 450 ఎన్ క్వైరీస్ కన్ సర్నింగ్ ది హ్యూమన్ అండర్ స్టాండింగ్ అండ్ కన్ సర్నింగ్ ఆఫ్ ప్రిన్సిపుల్ ఆఫ్ మోరల్స్, ఆక్స్ ఫర్డ్ 1966)
తన కొత్త మతం కోసం గద్ద ఆకృతిలో పవిత్ర దైవంతో సంభాషించినట్లు మహమ్మద్ నటించాడని హాబ్స్ రాస్తే ఏమంటారు ? (హాబ్స్ పుట 136).
పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప కవితగా నిలచిన డివైన్ కామెడీలో మహమ్మద్ గురించి రాసిందానికి ఏమంటారు (డాంటే ఇన్ ఫెర్నో కాంటో 28 లైన్ 31).
మహమ్మద్ ను నరకంలో పడేయడం గురించి డాంటే కారణాలను డివైన్ కామెడీ అనువాదకుడు మార్క్ మూసా ఇలా అంటాడు. మహమ్మద్ కు, అతనితోపాటు అలీకి ఇచ్చిన శిక్షవలన, క్రైస్తవ, మహమ్మదీయ మతాలపట్ల డాంటే నమ్మకాలు వెల్లడవుతాయి. డాంటే సమకాలీనులు మహమ్మద్ తొలుత క్రైస్తవుడనీ, పోప్ కావాలనుకున్న కార్డినల్ అనే అనుకునేవారు. (డాంటే పుట 331 నోట్ 31, ది డివైన్ కామెడీ అనువాదం ఎం. మూసా లండన్ 1988)
మహమ్మద్, ఖురాన్ గురించి కార్లైల్, వోల్టేర్ కూడా చాలా కర్కశ విషయాలు చెప్పారు. కాని 1989లో పాశ్చాత్య ఇస్లాం పండితులు రష్డీని విమర్శించడంలోను, ఇస్లాం ప్రచార సాహిత్యాన్ని తవ్వి తీయడంలోనూ నిమగ్నులై మత విశ్వాసం పట్ల విమర్శ విస్మరించారు. ఇస్లాం మత మూర్ఖత్వాన్ని వివరించడంలో ఆర్థిక బాధలు, తాదాత్మ్యత కోల్పోవడం, పాశ్చాత్యలోకం నుండి భయం, తెల్ల జాతీయ వాదం వంటివి అడ్డం పెట్టుకొని, ఆటవిక ప్రవర్తనల్ని వెనకేసుకొచ్చారు. నైతిక బాధ్యతను ముస్లింల నుండి పాశ్చాత్యలోకానికి అప్పగించారు. నమస్య ఇస్లాం కాదు. ఖురాన్ పేరిట అతివాదుల ప్రవర్తనే ప్రధానం. ఇస్లాం ఓర్పుగల సహనమతం. అయొతుల్లా ఖొమిని నిజమైన ఇస్లాంను అనుసరించడంలేదు. అతడు అసహ్యంగా ఇరాన్ లో అమలు పరిచేదంతా ఇస్లాం కాదు. ఇస్లాం అన్ని వేళలా అభిప్రాయభేదాల్ని సహిస్తుంది ఇలా నడిచింది వాదన.
ఇస్లాం మూలవాదం, ముస్లిం ఛాందసం వంటి పదజాలాన్ని వాడి ఇస్లాంను క్షమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇస్లాం మౌలిక వాదం అనటమే అనౌచిత్యం. క్రైస్తవం ఇస్లాంల మధ్య చాలా తేడా ఉన్నది. క్రైస్తవులు బైబుల్ ను తు.చ. తప్పకుండా భాష్యం చెప్పడం మానేశారు. అవి అత్యవసరమైనవి కావు అంటూ బైబుల్లో మినహాయింపులు చేసుకుంటున్నారు. గెర్షివిన్. ఇరా. లిరిక్స్, లండన్, 1977, పుట. 149) క్రైస్తవులలో మౌలిక వాదులు అలా కానివారు ఉన్నారు. ముస్లింలు ఖురాన్ ను వ్యాఖ్యానించడంలో అది దైవవాక్యమని భావిస్తున్నారు.
సాధారణ ముస్లింలు తమ పవిత్ర గ్రంథానికి, ప్రవక్తకూ, మతానికీ అవమానాలు జరిగాయంటూ ఊరికేనే రెచ్చిపోతున్నారు. రష్డీని చంపమని ఖొమేనీ ఇచ్చిన ఉత్తరువును సాధారణ ముస్లింలందరూ సమర్థించారు.
ఇస్లాం పేర ఖొమేని ఇరాన్ లో పాటించేదంతా అసలైన ఇస్లాం కాదని ముస్లిం మితవాదులూ, పాశ్చాత్య ఉదారవాదులూ, క్రైస్తవ పురోహిత వర్గం వాదిస్తున్నారు. ముస్లిం మితవాదులు, ఇతరులు తాము చెప్పేదంతా సరైనదనీ అనుకోరాదు. ఇస్లాంలో క్రూరంగా, ఆమోదయోగ్యం కానివన్నీ ఇలాంటివారు చెప్పే మాటలవలన, చిత్తశుద్ధి లేని ధోరణి వలన ఏమాత్రం తొలగి పోదు. ఇస్లాం మౌలిక వాదులు తార్కికంగానూ, చిత్తశుద్ధితోనూ ఉన్నారు. ఖురాన్ దైవదత్తమా, కాదా అనే ప్రాతిపదిక గురించి వారికి స్పష్టత ఉన్నది. ఖొమేనీ చర్యలు ఇస్లాం బోధకులను సూటిగా ప్రతిబింబిస్తున్నది. అవి ఖురాన్ లో ఉండొచ్చు. ప్రవక్త మాటలలో, చేతలలో ఉండొచ్చు. వీటిపై ఆధారపడిన ఇస్లాం చట్టంలోనూ ఉండవచ్చు. రష్డీని చంపమని ఇచ్చిన ఉత్తరువును సమర్థించడానికి మహమ్మద్ జీవితంలో చాలా వివరాలున్నాయి. ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యంగ్య రచనలు చేసిన రచయితల్ని చంపేశారు. రాజకీయ హత్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఖొమేనీ పాశ్చాత్య వాదులకు, ముస్లిం మితవాదులకు సమాధానం ఇస్తూ అలా అంటాడు.
ఇస్లాం సాధించాల్సిన విజయం
వికలాంగులు, చేతగానివారూ తప్ప మిగిలిస యుక్తవయస్కులైన పురుషులంతా ప్రపంచంలోని అన్ని దేశాలను జయించి ఇస్లాంను ఆమోదించేటట్లు చేయాలి.
ఇస్లాం పవిత్ర యుద్ధంలో ప్రపంచాన్ని ఇస్లాం ఎందుకు జయించమంటుందో గ్రహించాలి. ఇస్లాం అంటే తెలియనివారు ఇస్లాం యుద్ధ వ్యతిరేకి అని అనుకుంటారు. వారికి తెలివిలేదు. ఇస్లాం ప్రకారం నమ్మకం లేనివారిని వారెట్లా చంపుతారో అలాగే చంపు అంటుంది. నమ్మకం లేనివారు మనల్ని చంపేవరకూ ముస్లింలు చూస్తూ ఉండాలా...ఇస్లాం ప్రకారం ముస్లిమేతరులను చంపాలి. కత్తికి గురి చెయ్యాలి. వారి సైన్యాన్ని చిందరవందర చేయాలి. అంటే అర్థం ఏమిటి? ముస్లిమేతరులు మనల్ని అధిగమించేవరకూ ఊరికే కూర్చోవాలా ? నిన్ను చంపాలనుకునే వారిని అల్లా పేరిట చంపేయి అని ముస్లిం అంటున్నది. అంటే ఏమిటి ? శతృవుకి లొంగిపోవాలని అర్థం కాదు. ఇస్లాం ప్రకారం కత్తివల్లనే మంచి అంటూ ఏదైనా జరిగితే ఇంతవరకూ జరిగింది. కనుక కత్తితోనే జనాన్ని విధేయులను చేయగలం. కత్తే స్వర్గానికి దారి. పవిత్ర సైనికులు స్వర్గ ద్వారం తెరవాలి. ఖురాన్ సూత్రాలూ, ప్రవక్త ప్రవచనాలూ ముస్లింలను పోరాటానికి పురికొల్పుతున్నాయి. యుద్ధం లేకుండా ఆపాలని ఇస్లాం ఎక్కడా చెప్పడం లేదు. అలా అనే వారిని నేను ఛీత్కరిస్తున్నాను. (అమీర్ తాహెరీ, పుట 226-27, హోలీ టెరర్ లండన్, 1987).
ఖురాన్ నుండి సూటిగా ఉదహరిస్తున్న ఖొమిని జిహాద్ పవిత్ర యుద్ధం అంటే నిఘంటు అర్థం ఇస్తూ ఇస్లాం సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు. ఇస్లాం నిఘంటువు జిహాద్ అంటే ఇలా చెబుతున్నది. మహమ్మద్ ప్రయత్నంలో నమ్మకం లేనివారిపై మత యుద్ధం చేయడమే జిహాద్. అదొక తప్పనిసరైన మత విధి. ఖురాన్ నిర్ధారించిన ఈ విధిని దైవ సంస్థగా సంప్రదాయాలు ధృఢపరుస్తూ, ముస్లింల నుండి ద్వేషాన్ని పారద్రోలడానికి ఇది తోడ్పడుతుంది. (ఇస్లాం నిఘంటువులో జిహాద్ వ్యాసం పుట 243)
ఖొమిని ముస్లింలు నమ్ముతున్నట్లుగా కొరాన్ దైవ వాక్యమైతే అందలి మాటలు విధిగా పాటించాల్సి ఉంటే, పాశ్చాత్యవాదులు ముస్లిం మితవాదులు చెప్పేది సరైనదా ? ఖొమిని చెప్పేది తర్కబద్ధం కాదా ?
నిజమైన ఇస్లాం స్త్రీలను బాగా చూస్తుంది అని కొందరు ఆధునిక మేథావి ముస్లిం పురుషులు - స్త్రీలు నటించడం గమనించవచ్చు. ఇస్లాంకు ప్రజాస్వామ్యానికి మానవ హక్కులకూ విరుద్ధం ఏదీలేదని కూడా అంటూ ఉంటారు. (విపుల చర్చ 7వ అధ్యాయంలో)
ఇస్లాం బెదిరింపు మిథ్యా ?, వాస్తవమా ? అమెరికాలో ఇస్లాం పండితుడు జాన్ ఎస్పోజిటో ఈ విషయాన్ని హోలీక్రాస్ యూనివర్సిటీ నుండి పరిశీలిస్తూ 1991లో ప్రచురించాడు. అశ్లీల శృంగారంపట్ల చిత్తశుద్ధి లేనట్లే ఈ విషయంలోనూ ఈ పుస్తకం చిత్తశుద్ధి కనబరచడంలేదు. శీర్షిక చూస్తే సాహసోపేతం అనిపిస్తుంది. పుస్తకం తెరవకుండానే ఏముందో చెప్పవచ్చు. రష్డీ వ్యవహారానంతరం, ఆక్స్ ఫర్డ్ ప్రచురణకర్తలు ఇస్లాం విమర్శ ప్రచురించే సాహసం చేయబోవడం లేదు. ముస్లిం ప్రపంచ ఆగ్రహానికి ఎస్పోజిటో గురికాదలచనూ లేదు. ఇస్లాం బెదిరింపే గాక, ముస్లింలలో వేలాదిమందికి సైతం బెదిరింపు అని ఇస్లాం పట్ల ఉదారవాదులు గ్రహించడం లేదు. పవిత్ర భయానక విషయంలో చాలామంది ముస్లింలు కొరముట్లు అవుతున్నారని అమీర్ తాహెరీ రాశాడు. ఇస్లాం పాలనలో ఉన్న దేశం నుండి ఒక రచయిత ఇటీవల రాస్తూ రష్డీని సమర్ధించాలి, అలా చేయడంలో మనల్ని మనం సమర్ధించుకున్నట్లే అన్నాడు. (హాలిడే పుట 19 ది ఫండమెంటల్ లెసన్ ఆఫ్ ది ఫత్వా - న్యూ స్టేట్స్ మన్ అండ్ సొసైటీ - 1993 ఫిబ్రవరి 12).
రష్డీకి బహిరంగ లేఖ రాసిన ఒక ఇరానియన్ రచయిత. రష్డీపై దృష్టి సారించడంలో, ప్రపంచ వ్యాప్తంగా వందలాది రచయితల దురదృష్టకర స్థితిని విస్మరిస్తున్నాం. 1989 ఫిబ్రవరి 14 అనంతరం ఇరాన్ లో చాలామంది పత్రికా రచయితలు, కవులు బలి చేయబడి, మూకుమ్మడిగా రాజకీయ ఖైదీలతోబాటు పూడ్చి పెట్టబడ్డారు. వారి ఖాతాలను వెల్లడిస్తూ వ్యాసం రాయడమే వారి దోషం. (మగ్డొనాఫ్ సంపాదకత్వంలో పుట 55-66, ది రష్డీ లెటర్స్, లింకన్ 1993)
అలాంటి వారి పేర్లు కొన్ని - అమీర్ నికైన్, మోనోకర్ బెజది, జావీద్ మిసాని, అబుతొరబ్ బగార్జదా. కొందర్ని అపహరించి, చిత్రహింసలు పెట్టి, చీకట్లో కాల్చి చంపారు. ఇద్దరు కవులు సయ్యద్ సుల్తాన్ పూర్, రహమాన్ హతేఫీ అలా అంతమయ్యారు.
ఎడ్వర్డ్ మోర్టిమన్, ఎస్పోజటో వంటి పాశ్చాత్య భట్రాజీయులు అంటీ అంటనట్లుగా ఉంటూ, అన్నింటికి రష్డీని నిందించడం బట్టి, ఇరానియన్లు కొందరు ధైర్యసాహసంతో ముందుకు వచ్చి చేసిన ప్రకటన గమనార్హం.
ఖొమిని ఇచ్చిన మరణ శాసనం వలన సాల్మన్ రష్డీ భయంతో మూడేళ్ళుగా జీవిస్తున్నాడు. ఈ పాశవిక ఉత్తరువు పట్ల ఎలాంటి సమష్టి చర్య ఇరాన్ వాసులు తీసుకోలేదు. స్వేచ్ఛా ప్రకటనలకు విరుద్ధంగా ఇరాన్ లో ఇచ్చిన ఉత్తరువును ఇరాన్ మేథావులు ఖండించాలి. ఇతరుల కంటే వీరే రష్డీని సమర్థించాలి.
భావ స్వేచ్ఛ మానవాళి సాధించిన గొప్ప విజయం. వోల్టేర్ అన్నట్లు ఈ భావ స్వేచ్ఛను నిర్భయంగా వెల్లడించకపోతే అర్ధం లేదు. సాల్మన్ రష్డీని సమర్థిస్తున్న మేథావులుగా ఈ ప్రకటనపై సంతకాలు చేస్తున్నాం. ఏదో ఒక పవిత్ర నిబంధన అడ్డం పెట్టుకొని, భావ స్వేచ్ఛను వ్యక్తిగాని ముఠాగాని అడ్డు పెట్టరాదు.
ఖొమిని ఇచ్చిన మరణ ఉత్తరువు సహించరానిది. సృజనాత్మక రచనను రామణీయకత దృష్టితో తప్ప, అన్యథా కొలవరాదు. సాల్మన్ రష్డీని ఏకగ్రీవంగా సమర్థిస్తున్నాం. ఇరాన్ రచయితలు కళాకారులు, పత్రికా రచయితలు, భావుకులు ఇరాన్ లో మత కబంధ నిబంధనల వత్తిడిలో కుమిలిపోతున్నారని బయటి ప్రపంచం తెలుసుకోవాలి. ఇరాన్ లో విరుద్ధ భావ ప్రకటనలు వ్యక్తం చేసినందుకు బలి అయిన వారి సంఖ్యను ఉదాశీనంగా చూడ వీల్లేదు.
క్రమ బద్ధంగా ఇరాన్ లో జరుగుతున్న మానవ హక్కుల వ్యతిరేకతను సహిస్తే ఇస్లాం రాజ్యం విజృంభించి భయానక చర్యల్ని బయటి ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది కూడా. (ఎస్.వై.ఆర్.బి. పుట. 31 సం.39, 1992 మే 14 నం. 9)
ప్రవాసంలో ఉన్న 50 మంది ఇరానియన్లు
రష్డీ వ్యవహారం కేవలం విదేశీ జోక్యం మాత్రమే కాదని వీరు అర్థం చేసుకున్నారు. ఇది ఇస్లాం టెర్రరిజం. బ్రిటిషు చట్టం ప్రకారం బ్రిటిష్ పౌరుడిగా రష్డి ఏ నేరం చేయలేదు. రష్డి వ్యవహారంలో భావ స్వేచ్ఛ అనే సూత్రం ఇమిడి ఉన్నది. పాశ్చాత్య నాగరికతలోనూ ఆ మాటకొస్తే నాగరిక సమాజంలోనూ ఈ భావ స్వేచ్ఛ అనే సూత్రం ఇమిడి ఉన్నది. పాశ్చాత్య నాగరికతలోనూ ఆ మాటకొస్తే నాగరిక సమాజంలోనూ ఈ భావ స్వచ్ఛా సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
ఇస్లాం లోకంలో రచయితలూ, మేథావులూ కొందరు ధైర్యంగా రష్డీని సమర్థించారు. డేనియల్ పైప్స్ తన పుస్తకంలో అలాంటి వారి భావాలూ, ప్రకటనలూ పేర్కొన్నాడు. 1993 నవంబరులో పూర్ రష్డీ అనే పేరిట ఫ్రాన్స్ లో వెలువడిన గ్రంథంలో రష్డీ భావ స్వేచ్ఛను సమర్థిస్తూ అరబ్ ముస్లిం మేథావులు 100 మంది తమ మద్దతు తెలిపారు.
ఫత్వా ఫలితంగా చాలామంది భయపడినట్లు కాక, ఇస్లాం ప్రవక్తను, ఖురాన్ ను విమర్శస్తూ పుస్తకాలూ వ్యాసాలు వెలువడుతున్నాయి. ప్రవక్తను వెక్కిరిస్తూ బరాల్డ్ ఒక గ్రంథం రాశారు. పసిపిల్లలను చిత్రహింసలు పెట్టిన ప్రవక్తను గురించి మోరే రాశాడు. (మహమ్మద్ చేసుకున్న 9యేళ్ళ ఆయేషానుద్దేశించి ఈ రచన జరిగింది) అల్లాను సద్దాం హుస్సేన్ గా ఖురాన్ దృష్ట్యా ఫ్లూ ఆంథోనీ చిత్రించాడు. (జులై 1993, సంపుటి 2, సంచిక, 109 న్యూ హ్యూమనిస్ట్) నిశిత పరిశీలన నోరు నొక్కటం జరిగే పని కాదు.
ఇస్లాం అధ్యయనం చేసేవారిలో చాలామంది భావస్వేచ్ఛను సమర్థించకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇస్లాం గురించి ప్రస్తావించే గ్రంథాల పట్టికలో కొన్ని నమ్మకాలకు విరుద్ధమైనవి ఉన్నాయి. వాటికి దూరంగా ఉండటం కష్టం. గిబ్స్ రాసిన ఇస్లాంలో తటస్థవైఖరి గమనించవచ్చు. దీన్ని ఆక్సఫర్డ్ ప్రెస్ వాళ్ళు ముద్రించారు. ఆర్ ఎ. నికల్ సన్ ఎ లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్ లో ఖురాన్ మానవ సృష్టి అన్నాడు. అదే చాలా నమ్మకద్రోహ వాక్యంగా భావించాలి. గిబ్స్ ఉదహరించిన పుస్తకంలో కనీసం మరొక 7 గ్రంథాలనైనా ముస్లింలు నిరాకరిస్తారు. ఇటీవల రిపిన్ తన పుస్తకంలో సూచించిన 15 గ్రంథాలు ముస్లింలు అభ్యంతర పెట్టేవిగా ఉన్నాయి. (ముస్లిమ్స్, దైర్ రెలిజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్) నోల్డెక్, హర్ గ్రోంజె, గోల్డ్ జిహార్, కటానీ, లామెన్స్, షా చెక్ వ్యక్తం చేసిన భావాలు ముస్లింలకు ఆమోదయోగ్యం కాదు. ఇస్లాంను అధ్యయనం చేయాలంటే అలాంటి పండితుల రచనలు పరిశీలించక తప్పదు. అవి ఇంకా లభించటం కొన్నిటిని మళ్ళీ ముద్రించటం శుభసూచకం. లండన్ లో ఇస్లామిక్ బుక్ షాపులో బురఖాలో ఉన్న ముస్లిం ఈ పుస్తకాలను అమ్మటం విశేషం. భావస్వేచ్ఛను, విద్యారంగం స్యేచ్ఛను కాపాడుకుంటేనే అధ్యయనం కొనసాగుతుంది. నమ్మక విరుద్ధమైన విషయాలు రాసేవారే రష్డీని విమర్శించడం రెండు నాలుకల ధోరణి. రష్డీ పోరాటం వారి పోరాటం కూడా.
మేథావుల ద్రోహం
ఇస్లాంలో ఉన్న ప్రతిదాన్నీ విమర్శించే హక్కును ఈ పుస్తకం ద్వారా నేను ప్రదర్శిస్తున్నాను. అది నమ్మకాలకు వ్యతిరేకం కావచ్చు, దోషాలుండవచ్చు, వ్యంగ్యం కావచ్చు, అపహాస్యం కావచ్చు. ఇస్లాం పిడివాదాన్నీ, చరిత్రనూ, ఆధారాలనూ నిశితంగా పరిశీలించే హక్కు ముస్లింలకూ ముస్లిమేతరులకూ ఉన్నది. ముస్లింలు తరచు పాశ్చాత్య సంస్కతిని ఖండిస్తుంటారు. జాతి వాదం, కొత్త వలస వాదం, సామ్రాజ్యవాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని అంటుంటారు. ఇలా విమర్శించే హక్కును వారు వినియోగించుకుంటున్నారు. విమర్శ లేకపోతే ఇస్లాం మధ్యకాలపు మూర్ఖత్వ పిడివాదాల మధ్య, నియంతృత్వ అసహనాల మధ్య గతం నుండి బయటపడలేక జడంగా నిలిచిపోతుంది. దీనివలన ఆలోచన స్తంభించి మానవ హక్కులూ, వ్యక్తిత్వం, సొంత ఆలోచన, సత్యాన్వేషణ పోతాయి.
మేథావుల పట్ల తమ విధులను పాశ్చాత్య పండితులు, ఇస్లాం వాదులు విస్మరించారు. ఇస్లాం పేరెత్తేసరికి నిశిత పరిశీలనంతా వదిలేసి ద్రోహం చేసుకుంటున్నారు. మరికొందరు నిష్పాక్షికంగా సత్యాన్వేషణ చేసే ప్రయత్నానికి కూడా స్వస్తి పలికారు.
కొందరు ఇస్లాం వాదులు తమ మిత్రుల ఆందోళనకర ధోరణులను గుర్తిస్తున్నారు. అరబ్బుల ఇస్లాం పిడివాదాన్ని కార్ల్ బిన్స్ వాంగర్ గుర్తించాడు. (లూయీస్, ది జ్యూస్ ఆఫ్ ఇస్లాం, పుట. 194, నోట్ 1, ప్రిన్ స్టన్ 1984) ఫ్రాన్స్ లో ఇస్లాంను విమర్శించటం, అరబ్బు దేశాలను తప్పుపట్టడం ఆమోదయోగ్యంగా లేదని జాక్ ఎలూల్ 1983లో రాశాడు. (బాత్ యోర్, ది థిమ్మి, లండన్, 1985) 1968లో మాక్సిమ్ రాడిన్ సన్ రాస్తూ ప్రవక్త నైతిక థోరణిని విమర్శంచటం, ఇస్లాంలో అలాంటి థోరణులను దూషించటం సహించలేకపోయిన ఉదంతాలను చరిత్రకారుడు నార్మన్ డేనియల్ చూపాడు. క్షమాపణలు చెప్పుకునే థోరణి ఆవరించి, అవగాహన తొలగిపోయింది అన్నాడు. (రాడిన్ సన్ రాసిన మహమ్మద్, ది లెగసీ ఆఫ్ ఇస్లాం, జోసెఫ్ సాస్ సంపాదితం, ఆక్స్ ఫర్డ్ 1974).
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటికి ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలను గురించి నిశితంగా పరిశీలించే ధోరణిని పాశ్చత్య పండితులు కోల్పోయారని పెట్రిషియాత్రోస్, ఇబ్నారవండి వ్యాఖ్యానించారు. బైబుల్ని విమర్శించిన ధోరణిలో కొరాన్ ను విశ్లేషించి చూడటం బొత్తిగా కనిపించటం లేదని జాన్ వాన్స్ బ్రో అన్నాడు. (కొరానిక్ స్టడీస్, అక్స్ ఫర్డ్ 1977, పీరిన్, పుట.9) 1990 నాటికి పరిస్థితి ఎలా దిగజారిందో ఆండ్రూ రిపిన్ వివరించాడు.
హిబ్రూ బైబుల్, తొలినాటి క్రైస్తవం చారిత్రకంగా అధ్యయనం చేసినవారు ఇస్లాం పరిశీలనకు పూనుకొని నిశిత ఆలోచన అంటూ ఏమీ ఇస్లాం పుస్తకాలలో లేకపోవడం పట్ల ఆశ్చర్యం వెలిబుచ్చారు. చారిత్రకంగా ఇస్లాం జనించిందనే భావన చాలామంది రచయితలలో ఉన్నది. విభిన్న చారిత్రక సంప్రదాయాలను పొందుపరచవలసి ఉన్నప్పటికీ ఒకానొక సన్నివేశంలో ఏది సబబు అని నిర్ధారించడం సమస్యగా తయారవుతున్నది. యూదుల వాదం, క్రైస్తవం అధ్యయనం చేయడంలో మూలాన్ని విమర్శించడం, నోటిమాటల సంప్రదాయాలను గుర్తించడం సాహిత్య విశ్లేషణ నిర్మాణం పరిగణనలోకి తీసుకుంటారు. అలాంటి పరిశోధనా ధోరణి ఇస్లాం పట్ల తక్కువగా ఉన్నది. (రిపిన్ పీఠిక, పుట 9, ముస్లిమ్స్, లండన్, 1991)
పురాణాల ఆధిక్యత
ఇస్లాం పట్ల నిశిత పరిశీలనా ధోరణి లేకపోవడం వలన అనేక పుక్కిట పురాణాలకు ఆధిక్యత అంటగడుతున్నారు. సహనం మహమ్మద్ చట్టాలను ఇచ్చిన తీరు చాలా గొప్పగా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇస్లాంను నిశితంగా పరిశీలించకుండా ఉన్నందున ఇలాంటి భ్రమలు ఎలా తలెత్తాయో చూద్దాం.
1. విదేశీ సంస్కృతి కొన్ని విధాల అవసరం, ఆధిక్యత వహించిందీ అనుకోవటం, మరికొన్ని విధాల తక్కువదనీ, తృణీకరించాలనుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. ఎవరి సంస్కృతి వారికి అలవాటు చొప్పున అసహ్యత పుట్టిస్తుంది. పిల్లలకు పొరుగింటి వాతావరణం నచ్చుతుంది. విదేశాలలో ఉన్న పెద్దలు వారి స్థితి అంతా మెరుగ్గా ఉందనుకొంటారు. వారు మెచ్చుకునే సంస్కృతిలో ఇబ్బందికర ధోరణులను చూసీ చూడనట్లు పోతారు. కొత్త దేశంలో, కొత్త వ్యక్తుల్ని సిద్ధాంత వ్యక్తిగత, ఉద్వేగ కారణాలవలన వారికి కావల్సిందే చూస్తారు. మార్గరేట్ మీడ్ తన సిద్ధాంతాలకు సమోవా దీవులలో ఆమోద ముద్రకోసం అన్వేషించింది. కమింగ్ అఫ్ యాజ్ ఇన్ సమోవా లో ఆమె రాసిందంతా భవిష్యత్తులో మన అశలకూ భయాలకూ సంబంధించిన విషయాలే. (ఫ్రీమన్, మార్గరేట్ మీడ్ అండ్ సమోవా, లండన్, 1984) ఇది మన ఆశలకు అనుగుణంగా కావచ్చుకాని వాస్తవాలకు అనుగుణం కాదు.
మానవ జాతిలో కొందరు నైతికంగా ఉత్తములనీ, మరికొందరు తక్కువ అనీ భ్రమలున్నాయి. కొంతమంది రచయితలు వారి పొరుగు వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ తమకు సంబంధంలేని మానవ జాతిని గురించి వారి సంక్షేమాన్ని గురించీ రాస్తుంటారు (రస్సెల్ ఆన్ పాప్యులర్ ఎస్సేస్, న్యూయార్క్ 1950 పుట. 58)
పాశ్చాత్య యూరోప్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అధిక సంఖ్యాకులు మత నమ్మకాలకు వ్యతిరేక సాక్ష్యాధారాలున్నప్పటికీ, విశ్వాసాలను అట్టిపెట్టుకుంటున్నారు. గాలప్ పోల్ ప్రకారం అమెరికాలో 9 శాతం మాత్రమే నాస్తికులమని, అజ్ఞేయ వాదులమని, మతం లేని వారమని చెబుతున్నారు. ఫ్రాన్స్ లో 12 శాతం మాత్రమే నాస్తికులమని చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు.
మత పీఠాల నుండి, ప్రసార సాధనాల వలన జరిగే ప్రచారం, మతేతరంగా చూస్తే అవినీతిగా, మానవ ద్వేషంగా ఉంటుంది. క్రైస్తవం అవలంబించమని చెప్పడంలో ఇదంతా వాస్తవమని గాక, అందులో గిట్టుబాటు ఉన్నదంటారు. మేథస్సు సంబంధంగా చూస్తే మతంలో చిత్తశుద్ధి లేదు. మతంలో తప్పించుకోవడం సులభం. మతం నుండి మంచి అంతా వస్తుందనీ, మతం ఏం చేసినా మంచిదేననే భావన ప్రబలి ఉంది. రాబిన్ సన్ ఏన్ ఏథియస్ట్స్ వాల్యూస్, ఆక్స్ ఫర్డ్ 1964 పేజి 117-118)
మొత్తం మీద పాశ్చాత్య సమాజం నుండి అక్కడి ప్రసారాలు మతం పట్ల ఏ మాత్రం నిశిత పరిశీలన చేయడం లేదు. రిచర్డ్ డాకిన్స్ ఈ విషయమై రాస్తూ ఇలా అంటాడు.
మత సున్నిత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలంటుంటారు. సెక్యులర్ వాదులు సైతం మత విషయాలు వచ్చేసరికి మెత్తబడతారు. అశ్లీల శృంగారం స్త్రీలను కించపరిచేదిగా ఉందంటూ, ఖండించడంలో స్త్రీ హక్కు వాదులతో కలుస్తాం. స్త్రీలకు సాక్ష్యం ఇచ్చే హక్కు లేదనే చోట, కోర్టు తీర్పు వలన, రాళ్ళు కొట్టి చంపటమంటే అలాంటి పవిత్ర గ్రంథం జోలికి పోము. జంతువుల పరిశోధనలలో మత్తుమందు ఇచ్చి శస్త్ర పరికరాలు వాడుతుంటే, జంతువులను కాపాడాలనేవారు విమర్శిస్తున్నారు. కాని జంతు వధ శాలల్లో వీటిని గొంతుకోసేటప్పుడు అవి బ్రతికుండాలని మతపరంగా చెబితే ఏమంటారు... మత వ్యక్తిని అతడు తన విశ్వాసాన్ని ఎలా సమర్ధించుకొంటావని అడిగితే మాత్రం మత స్వేచ్ఛలో జోక్యం అంటారు. (డాకిన్స్ న్యూ హ్యూమనిస్ట్ ఎ డిప్లోరబుల్ ఎఫైర్ సంపుటి 104 లండన్ మే 1989)
యూరోప్ దేశాలు 16వ శతాబ్దంలో తొలుత ఇతర దేశాల నాగరికతలు చూచినప్పుడు ఏం జరిగిందో దృష్టిలో పెట్టుకుంటే ఇస్లాం పట్ల నిశిత పరిశీలన ఎందుకు లేదో, ఇస్లాం సహనవంతమైందనే భ్రమ ఎలా జనించిందో విశదమవుతుంది. అమెరికాను కనుగొనక ముందు, గ్రీకులు, రోమనులు స్వర్ణయుగాన్ని గురించి, అటవికుల ధర్మ స్వభావాన్ని గురించి భ్రమలో ఉన్నారు. ఈడెన్ తోట నుండి ఆడం, ఈవ్ లను బహిష్కరించడం స్వర్ణయుగపు సాధారణ సహజధర్మభావనలోనిదే. కాలుష్యం లేని అడవులలో మన ప్రాచీనులు అనుభవించిన కాలం అదంతా.
జర్మేనియా జర్మనుల ఔన్నత్యం, రోమ్ అధర్మం పోల్చి చూపాడు. టాసిటన్ (98 సి.ఇ.లో) రోమ్ నాగరికతలో ఆడంబరత్వం, జర్మన్ సంస్కృతిలో సహజత్వం చిత్రించాడు. పరిసరాల పరిశీలన దృష్ట్యా అంతా అసంబద్ధమైనదే. (టాసిటన్ పుట 1034) మాంటేన్, రూసో, గిబ్బన్ ఇలాంటి ప్రభావాలకు లోనైనవారే.
16వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాలకు పునాది వేసిన పీటర్ మార్టర్ ఆంగ్లిరస్ (1459-1525) ఒక పుస్తకం రాశాడు. అందులో ఇండియన్లను పొగడుతూ వారు మోసాలు చేయరనీ, డబ్బుకు బానిసలు కారనీ, క్రూరమైన న్యాయవేత్తలు లేరని అంటూ, స్పెయిన్ వారు సంకుచితంగా, అసహనంతో క్రూరంగా ప్రవర్తిస్తారని చెప్పాడు. (డే రేబస్ ఓసి యూనిక్స్ ఎట్ ఆర్చోమోవే 1516)
పీటర్ మార్టర్ ప్రభావంతో మాంటేన్ రాస్తూ నరుల్ని నలుచుకు తినే విషయ ప్రస్తావన చేశాడు. ఇందులో సాంస్కృతిక సాపేక్షతా వాదం కూడా ఉన్నది. బ్రెజిల్ లోని ఇండియన్ల గురించి మాంటేన్ రాస్తూ ఇలా అన్నాడు.
మన తప్పుల్ని మూసిపెట్టుకుని వారి అటవిక దోషాల్ని నిర్ధారించడం తగదు. మనిషిని సజీవంగా తినటం ఆటవికత్వం. సజీవంగా ఉన్న వ్యక్తిని చిత్రహింసలు పెట్టి, కాల్చి కుక్కలకూ, పందులకూ వేయడం మన మధ్యనే జరుగుతుండడం మతం పేరిట, పవిత్రత పేరిట చూస్తున్నాం. చనిపోయిన వ్యక్తిని కాల్చి తినడం కంటే ఇది దారుణమైన ఆచారం. (మాంటేన్ పుట 113 ఆన్ కేనిబల్స్ 1580)
ఇండియన్లు అవినీతికి దూరంగా సాధారణమైన జీవనాన్ని గడుపుతున్నట్లు వారి పోరాటం కూడా ఉన్నతమైనట్లు మాంటేన్ పేర్కొన్నాడు.
టాసీటస్, పీటర్ మార్టర్ వలే మాంటేన్ సమాచారం కూడా నిర్దిష్టమైనది కానప్పటికీ, తన సంస్కృతీ నాగరికతలను స్వల్ప సమాచారం ఆధారంగానే విమర్శించాడు. ఇస్లాంపట్ల సానుభూతితో కూడిన ధోరణులు 17వ శతాబ్దంలో జూరి, బెయిలీ వంటివారు వెల్లడించారు. టాసిటస్, పీటర్ మార్టర్, మాంటేన్ ధోరణిని పోలినదే ఇది కూడ.
జూరి వెల్లడించిన అభిప్రాయం
జూరి ఇలా అన్నాడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా సారసిన్లు కనబరిచిన క్రూరత్వానికీ, భక్తులపై పాపరి ప్రదర్శించిన అమానుషత్వానికీ పోలికే లేదు. క్రైస్తవులపై సారసీన్లు చిమ్మించిన రక్తం కంటే మతం పేరిట బార్త్ లో మియోదినం నాడు జరిగిన హత్యాకాండ, వాడియోపై జరిగిన యుద్ధంలో ఎంతో రక్తం ప్రవహించింది. మహమ్మదీయ వాదం క్రూరమైనదని ప్రచారం చేయటం, క్రైస్తవాన్ని మినహాయించడం సరైనది కాదు. మానవుల్ని తినే ఆటవిక క్రూరత్వం కంటే పాపరీ దారుణాలు అమానుషమైనవి. (బెయిలీ వ్యాసం-మహమ్మద్, నెస్టోరియస్, 1740, అమ్ స్టర్ డామ్, డిక్ష్షనరీ హిస్టారిక్ ఎట్ క్రికెట్ 5వ ప్రచురణ 10 సంపుటాలు, అనువాదం బెర్నార్డ్, లండన్, 1734-41)
జూరి రాసిన లెటర్స్ పేస్టరల్స్ (1686-89) గమనిస్తే ఇతడు హ్యూజ్ నాట్ పురోహితుడనీ, బోస్కు బద్ధ శత్రువనీ హాలండ్ నుండి రాస్తున్నాడనీ స్పష్టపడుతుంది. సెయింట్ బార్త్ లో మియోదినం నాడు కనబరిచిన కేథలిక్కుల క్రూరత్వం, సారసిల్న పిరికితనం ముందు దారుణంగా అతనికి కనిపించింది. రోమన్ కేథలిక్కులను విమర్శిస్తూ, ముస్లింల సహన ధోరణిగా కనిపించే వాతావరణాన్ని జూరి వినియోగించుకున్నాడు.
జూరి వలన ప్రభావితుడైన పీర్ బెయిలీ, ఇస్లాం సహనం అనే భ్రమలో కొనసాగాడు. ఇండియాలో పోర్చుగీసువారు బ్రాహ్మణులను హింసించిన తీరు, అమెరికాలో స్పెయిన్ వారు ఇండియన్ల పట్ల చూపిన క్రూరత్వంతో పోల్చితే టర్కులు సహనంగా ఉన్నట్లు అతనికి అనిపించింది. క్రైస్తవులకంటే ముస్లింలు ఇతర మతాలపట్ల మానవత్వాన్ని కనబరిచారని అతను అంటాడు. సహనాన్ని కావాలని ఆశించిన బెయిలీ మత అసహనానికి గురై, హాలండ్ నుండి పారిపోవలసి వచ్చింది.
జూరి, బెయిలీలకు టర్కీ అంటే ముస్లింలని అర్థం. టర్కీలో సహనాన్ని ముస్లింల సహనంగా చిత్రించారు. ముస్లింల దారుణ హింసలు ఈ రచయితలకు తెలియవు. క్రైస్తవులూ, యూదులూ తొలి రోజుల్లో జరిపిన హింస, సింధు రాష్ట్రంలో దాడుల సందర్భంగా హిందువుల, బౌద్ధుల ఊచకోత, అల్మొహడ్ ల అసహనం, జొరాష్ట్రియన్ల పీడన ఈ రచయితలకు పట్టలేదు. కాన్ స్టాంట్ నోపుల్ పతనమైనప్పుడు క్రైస్తవుల రక్తం వీధులలో ప్రవహించటం ఈ ఫ్రెంచి రచయితలకు పట్టినట్లు లేదు. సమకాలీన టర్కీలో ఉన్న దేవ్ ష్రిమ్ అనే అమానుష ఆచారం ఈ రచయితలు ప్రస్తావించలేదు.
చాలామంది అల్ప సంఖ్యాకులు సనాతనుల, కేథలిక్కుల హింసను తప్పించుకొని టర్కీలో తలదాచుకున్నారు. 1492, 96లో స్పెయిన్ నుండి బహిష్కరణకు గురైన యూదులు హంగరీ నుండి మారనాస్ కాల్వనిస్టులు, రష్యా, శైలీషియా నుండి మరి కొందరు టర్కీలో తలదాచుకున్నారు. వీరంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా, ప్రవాసులుగా సహించబడ్డారు. జూలి, బెయిలీ ఇస్లాం చరిత్రను బాగా అవగాహన చేసుకోకుడానే ముస్లిం సహనాన్ని గురించి ప్రస్తావించటం తప్పు. ప్రతి శతాబ్దంలోనూ దేశానుగుణంగా పాలకులను బట్టి పరిస్థితి మారుతూ వచ్చింది. అన్ని మత విశ్వాసాల పొందిక అనే సిద్ధాంతం కేవలం ఊహాజనితమే.
బెయిలీ, జూరీలు తెగ పొగిడిన 17వ శతాబ్దపు టర్కీ కూడా అంత ఆకర్షణీయమైనదేమీ కాదు. 1662లో కాన్ స్టాంట్ నోపుల్లో ఇంగ్లీషు రాయబారి ఇలా అన్నాడు.
ప్రస్తుతం వజీర్ క్రైస్తవుల, ఇతర మతాలపట్ల తన సహజ ద్వేషాన్ని చూపటంలో తండ్రికి మించిపోయాడు. రెండేళ్ళక్రితం గలాటా, కాన్ స్టాంట్ నోపుల్లో చర్చీలు తగులబెట్టగా ఆ స్థలాలను గ్రీకులూ, ఆర్మీనియన్లూ, రోమన్లూ అధిక ధరలకు సుల్తాన్ నుండి కొనుక్కున్నారు. ఆ స్థలాలలో మందిరాలు నిర్మించి తమతమ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ అవకాశాన్ని వజీర్ బాగా వాడుకున్నాడు. నేరస్తులను జైలుపాలు చేశాడు. కాని ముఖ్యమైన వారిని వదిలేశాడు (బాట్ యార్ పారిస్ 1991 లెక్రిస్టిన్స్ ది ఓరియంట్ జిహాద్ ధిమ్మి)
టర్కీ సహనం
ఒక పండితుడు టర్కీ సహనాన్ని ఇలా ప్రస్తావించాడు. 16, 17 శతాబ్దాలలో బల్గేరియా ఉత్తరాన, మేసిడోనియా సరిహద్దులలో జనాన్ని బలవంతంగా మతం మార్చేటట్లు, టర్కులు వత్తిడి చేశారు. నిరాకరించిన వారిని సజీవంగా తగలబెట్టారు. లేదా ఉరితీశారు. (బాత్ యార్ పుట. 56)
17వ శతాబ్దం చివరలో వెలువడిన టర్కీ గూఢచారి ఉత్తరాలకు నాంది పలికాయి. మాంటెస్కో (1721), మదాండి గ్రాఫిగ్నీ (1747), డార్గెన్ (1750), వోల్టేర్ (1764), వొరేస్ వాల్ పోల్ (1756), గోల్డ్ స్మిత్ (1762) రాసిన ఉత్తరాలు ఈ ధోరణి లోనివే.
18వ శతాబ్దంలో సొంత నాగరికతను విమర్శిస్తూ ఆటవికత్వాన్ని సమర్థిస్తూ ఒక ధోరణి ప్రబలింది. ఈ ఆటవికత యూరప్ లో ఉన్నతమైన సమకాలీన దృశ్యంగా పరిణమించింది. యూరోప్ వారి అవి నీతి, దిగజారుడు తనాన్ని పేర్కొన్న రచయితలు విదేశీ సంస్కృతీ ఔన్నత్యాన్ని, చైనా, పర్షియా, పెరూ వివేచనా నీతిని ఆకాశానికెత్తారు. ఈ యూరోప్ రచయితలకు ఇతర సంస్కృతులపట్ల అవగాహన లేదు. ఆసక్తీ లేదు.
అలాంటి భూమికలో 18వ శతాబ్దంలో మహమ్మద్ పట్ల పుక్కిటి వురాణగాథలను సహనశీలి, వివేచనాత్మకవాది, న్యాయమూర్తి అని ఎందుకు పేర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. బోలోన్ విల్ రాసిన మహమ్మద్ జీవితచరిత్ర అని మరణానంతరం 1730లో వెలువడింది. వోల్టేర్, గిబ్బన్ పై దీని ప్రభావం ఉన్నది. ఇస్లాంను గురించి, దాని స్థాపకుని గురించి యూరోప్ లో ఏర్పడిన అభిప్రాయాలకు ఈ పుస్తకం ప్రాతిపదికలు వేసింది. బోలన్ విల్ కు అరబిక్ తెలియదు. గనుక ఇతర ఆధారాల సహకారంతో రాశాడు గనుక చాలా దోషాలు, అలంకరణలు చోటు చేసుకున్నాయి. (హోల్డ్, పుట 300 ది ట్రీట్ మెంట్ ఆఫ్ అరబ్ హిస్టరీ) బోలన్ విల్ రచనలో మహమ్మదును, ఇస్లాంను తన మత ద్వేష భావాలకు అనుకూలంగా క్రైస్తవ వ్యతిరేకతకు సానుకూలంగా వాడుకున్నారు. ఇస్లాం హేతుబద్ధం అన్నాడు. అందులో మర్మాలూ, అద్భుతాలు లేవన్నాడు. దైవాంశ కాకపోయినా మహమ్మద్ గొప్ప రాజనీతిజ్ఞుడనీ, ప్రాచీన గ్రీస్ లో ఆవిర్భవించిన వారికంటే గొప్ప శాసనకర్త అనీ అన్నాడు.
ఈ రచనలు జఫ్రీ వ్యాఖ్యానిస్తూ క్రైస్తవులను చిన్నబుచ్చటంలో, మహమ్మద్ ను అత్యున్నతంగా పొగడడంలో ఇది ప్రముఖ పాత్ర వహించిందన్నాడు. హర్ గ్రోంజె ఈ పుస్తకంపై వ్యాఖ్యానిస్తూ ఇస్లాంపై మిడిమిడి జ్ఞానంతో రాసిన పౌరోహిత వ్యతిరేక ఉద్వేగంగా చిత్రించాడు. గిబ్బన్ పుస్తకం హిస్టరీ ఆఫ్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ పై బోలన్ విల్ బురద చల్లటాన్నికూడా గమనించవచ్చు. (జఫ్రీ ది క్వెస్ట్ ఆఫ్ ది హిస్టారికల్ మహమ్మద్. పుట. 30)
ఖురాన్ ను 1734లో జార్జిసేల్ ఇంగ్లీషులోకి నిర్దిష్టంగా అనువదించాడు. మహమ్మద్ జీవిత చరిత్ర రాసిన బోలన్ విల్ వలే సేల్ కూడా అరబ్బులు దైవాంశతో జనించారని నమ్మాడు. (హోల్ట్. పుట. 302)
వోల్టేర్ ధోరణి ఆ శతాబ్దంలో ఆవరించి ఉన్న పరిస్థితులను ప్రతిబింబించింది. మహమ్మద్ అనే నాటకం (1742)లో మనుషుల ఆత్మలను బంధించినవాడుగా చిత్రించటం అతడి స్వభావానికి మించిపోయిన పరిస్థితి అని ఒక ముస్లింకు రాస్తూ వోల్టేర్ అభిప్రాయపడ్డాడు. (బసాక్, 1950 రివ్యూ సైకాలజీ డి పీపుల్స్ 3 పుట. 110, నోట్.2) 1756లో ఎస్సే సుర్ లే మోర్స్ లోనూ, ఫిలాసఫీ నిఘంటువులోనూ వోల్టేర్ ఇస్లాంకు అనుకూలంగా, క్రైస్తవానికి ముఖ్యంగా కేథలిక్కులకు వ్యతిరేకంగా రాశాడు. ప్రపంచాన్ని పట్టి పీడించిన విషపూరిత మతంగా క్రైస్తవాన్ని చిత్రించాడు. (ఎడ్వర్డ్స్ పుట. 715) 18వ శతాబ్దపు మేథావుల వలే వోల్టార్ దైవాన్ని నమ్మినప్పటికీ అద్భుతాలనూ, పిడివాదాన్నీ, పౌరోహిత్యాన్నీ, దైవదత్త మతాన్నీ వ్యతిరేకించాడు.
1762లో ది శర్మన్ ఆఫ్ ది ఫిఫ్టీ రాస్తూ క్రైస్తవులు జీసస్ రక్తమాంసాలను గురించి చెప్పే దాన్నీ, వారు చెప్పే అద్భుత చర్యలనూ విమర్శించాడు. బైబుల్ పరస్పర విరుద్ధాలతో ఉన్నదన్నాడు. క్రైస్తవ దేవుడు క్రూరమైన, ద్వేషపూరితమైన నిరంకుశుడన్నాడు. నిజమైన దేవుడు ఒక యువతికి పుట్టటం, శిలువపై మరణించటం జరగదని, పరస్పర విరుద్ధాలూ, ఉన్మాదం, భయానకంతో గూడిన గ్రంథాలకు ప్రేరణ ఇవ్వడం వోల్టేర్ రాశాడు. (ఎడ్వర్డ్స్. పుట. 715)
వోల్టేర్ దృష్టిలో ఇస్లాం పిడివాదాలు సాధారణమైనవనీ, ఒకే దేవుడు, అతడికి ఒకే ప్రవక్త మహమ్మద్ ఉన్నాడని చెప్పాడు. ప్రకృతే దైవం అనే వారికి ఇస్లాంలోని కృత్రిమ వివేచన నచ్చింది. పురోహితులు లేరు, అద్భుతాలు లేవు. మర్మవాదం లేదు. క్రైస్తవులకు అసహనం ఉండగా ఇస్లాం ఇతర మతాలను సహిస్తుందని కూడా నమ్మాడు.
గిబ్బన్ 18వ శతాబ్దంలో అభూత కల్పనలు, బోలన్ విల్ రచనలతో ప్రభావితుడయ్యాడు. 1776లో డిక్లైన్ అండ్ ఫాల్ ప్రథమ సంపుటి రాసే నాటికి ప్రాశ్చాత్యలోకాన్ని గురించిన పుక్కిటి గాథలు అలుముకొని ఉన్నాయి. ఇస్లాం ఆనాటి శూన్యావస్థను నింపటానికి తగినట్లుగా ఉన్నదని బెర్నాల్డ్ లూయీస్ అభిప్రాయపడ్డాడు. యూరో ప్రజల్ని అంతవరకూ అకట్టుకున్న చైనా వారేమయ్యారు...... 18వ శతాబ్దం ఉత్తరార్ధంలో పరిస్థితిని లూయీస్ ఇలా వివరించారు. పోల్చి చూచుకోవటానికీ, స్వవిమర్శకు యూరోప్ కు గాథలు కావలసి వచ్చాయి. ఒకటి ఉన్నతమైన ఆటకవిత్వం, రెండవది వివేచనాత్మక ప్రాచ్య విధానం కనిపించాయి. కొంతకాలం పాటు జెసూట్లు చైనావారి విధానాలను నైతిక ధర్మాలకు అదర్శంగా భావించారు. వారి తత్వవేత్తల సహనం మతేతరంగా స్వీకరించారు. తిరిగివచ్చిన యాత్రికులు నివేదించేదాన్నిబట్టి చైనాలో విషయాలు జెసూట్లు చెప్పినట్లుగా తాత్వికంగా లేవని అర్థం అయింది. ఒక శూన్యదశ ఏర్పడింది. అది నింపటానికి ఇస్లాం తగినదిగా భావించారు (లూయీస్, రేస్ అండ్ స్లేవరీ ఇన్ ది మిడిల్ ఈస్ట్ న్యూయార్క్, 1990, పుట. 95).
గిబ్బన్
గిబ్బన్ ను గురించి బెర్నార్డ్ లూయీస్ చెప్పేది 17, 18 శతాబ్దాలలో ఇస్లాం గురించి రాసిన వారందరికీ వర్తిస్తుంది. గిబ్బన్ అసంపూర్ణ జ్ఞానం, యూరోప్ పాండిత్యంలో లోటుపాట్లవలన అతని సందేహవాదం కూడా మొద్దుబారింది. సంప్రదాయ జీవిత చరిత్రల సాహిత్యంలో మరుగున పడిన ముస్లిం మతగాథల్నిగిబ్బన్ కనుక్కోలేదు. ఆనాటి చరిత్రకారుడికి ఇట్లాంటి విశ్లేషణ దృష్టి లోపించటం అర్థం చేసుకోవచ్చు (లూయీస్. పుట. 95).
వోల్టేర్ వలే గిబ్బన్ కూడా క్రైస్తవంతో పోల్చి ఇస్లాంకు అనుకూలంగా చిత్రించాడు. క్రైస్తవ దైవత్వ సూత్రాలను పరోక్షంగా ఖండించడానికి మహమ్మద్ మానవత్వాన్ని చరిత్రకారుడుగా గిబ్బన్ నొక్కి వక్కాణించాడు. పురోహిత వర్గానికి వ్యతిరేకంగా ఉన్న గిబ్బన్ ఆ వర్గం నుండి విమోచన పొందిన ఇస్లాంను సమర్థించాడు. మొత్తం మీద క్రైస్తవానికి వ్యతిరేకంగా ఇస్లాంను ఒక ఆయుధంగా వాడాడు.
ఇస్లాం ఒక హేతుబద్ధమైన, పురోహిత వర్గంలేని మతంగా గిబ్బన్ దృష్టిలో ఉన్నది. మహమ్మద్ వివేకవoతమైన సహనంతో కూడిన న్యాయసూత్రాలను ఇచ్చాడు. యూరోప్ లో ఈ వాదన చాలాకాలం ప్రభావితం చేసింది. ఇప్పటికీ పండితులూ, పామరులూ నిశిత దృష్టి లేకుండా ఈ కట్టుకథల్ని నమ్ముతున్నారు. టర్కీ సహనాన్ని ముస్లిం సహనంగా ఓల్టేర్, గిబ్బన్ లు చూపారు. భిన్న విశ్వాసాలకు 18వ శతాబ్దంలో టర్కీలో తావు లేదు. యూదులను జుగుప్సతో చూచినట్లు కార్ స్టన్ నైబర్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. 1758లో కాన్ స్టాంట్ నైబర్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. 1758లో కాన్ స్టంట్ నోపుల్ పరిస్థితిని బ్రిటిష్ రాయబారి ఇలా వర్ణించాడు. సుల్తాన్ తన నియమాలను పాటించేటట్లు ధృఢ నిశ్చయంలో ఉన్నాడు. రహస్యంగా పయనించిన సుల్తాన్ ఒక యూదును కలిసినప్పుడు అతన్ని గొంతు నరికి చంపించి వేశారు. మరునాడు ఒక అర్మీనియన్ను అలాగే చేశారు. ప్రతిచోట భయానక వాతావరణం అలముకున్నది. (బాత్ యార్ ప్యారిస్, 1991 థిమ్మి 7-20 సిరీస్, పుట. 427)
1770లో కాన్ స్టాంటినోపుల్ లో ఒక రాయబారి రాస్తూ చీకటి పడిన తరువాత గ్రీకులూ, ఆర్మీయన్లూ, యూదులూ ఇంటి బయట కనిపిస్తే అరమరికలు లేకుండా చంపేయమన్నారన్నాడు. 1785లో మరొక రాయబారి రాస్తూ క్రైస్తవులు రహస్యంగా తమ చర్చీలు బాగుపరచుకుంటే ముస్లింలు అభ్యంతరం తెలుపగా టర్కీ అధికారులు వాటిని నాశనం చేశారన్నారు. (బాత్ యార్, పుట. 429).
1841లో హీరోస్ అండ్ హీరో వర్షిప్ రాసిన కార్ లైట్ మహమ్మదు గురించి ప్రస్తావించినప్పుడు, పాశ్చాత్య మేథావి ఒక ఇస్లాం నాయకుడిని గురించి సానుభూతితో చిత్రించిన తొలి రచనగా పేర్కొన్నారు. ప్రపంచంలో గొప్ప మతానికి స్థాపకుడుగా మహమ్మద్ ఉండటం హాస్యాస్పదంగా అనిపిస్తుందన్నాడు. (వాట్. పుట. 17 - ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, ఎడింబరో 1977) కార్ లైల్ వ్యాసంలో సరైన వాదనలేవీ లేవు. తీవ్రమైన, అశ్చర్యకరమైన పదగుంభనం గుప్పించారు. (ఆక్స్ ఫర్డ్ కంపానియన్ టూ లిటరేచర్, పుట. 171)
ప్రకృతి మర్మాలను గురించి రణగొణ ధ్వని చేశాడు. ఏదైనా వాదనలంటూ ఉంటే అవన్నీ దోషపూరితమైనవే. మహమ్మద్ ను ద్రోహి కాదన్నాడు. ఎందుకు కాదు. ఒక మాంత్రికుడు, చిత్తశుద్ధిలేని వాడు చేసే పనులకు ఇంతమంది లొంగటం అనూహ్యమన్నాడు. మత విజయం అతనికి కొలమానమైంది. సంఖ్యనుబట్టి సత్యాన్ని కొలిచాడు. 180 మిలియన్ల ముస్లింలు ఉండగా అంతమందిని ఒక తప్పుడు మతం అవలంబించేటట్లు మహమ్మద్ నచ్చచెప్పలేడన్నాడు. వాస్తవానికి మహమ్మద్ నచ్చచెప్పింది కొన్ని వేలమందికే. మిగిలినవారు కేవలం అనుకరించారు. చాలామంది ముస్లింలు గుడ్డిగా తమ తండ్రుల మతాన్ని అనుసరిస్తారు. మహమ్మద్ చిత్తశుద్ధికి అనుకూలంగా, వ్యతిరేకంగా వాదాలను అధిక సంఖ్యాకులు పరిశీలించారనటం అసంబద్ధం.
నమ్మేవారంతా సిద్ధాంత సత్యాన్ని అంచనా వేసారనటం అసందర్భమే. సైంటాలజీ నమ్మేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. అంటే సాలీనా దీనిలో సత్యం కూడా పెరుగుతున్నదా?. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకంటే క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. అంటే ఇస్లాంకంటే క్రైస్తవం ఎక్కువ సత్యమా? ఐన్ స్టీన్ కి వ్యతిరేకంగా 100 మంది రచయితలు అనే శీర్షికన ప్రచురించిన పుస్తకంపై ఐన్ స్టీన్ వ్యాఖ్యానిస్తూ నేను దోషపూరితమైతే ఒకళ్ళు చాలేమో అన్నాడు. దీన్ని తిప్పి చూసినా అంతే.
చిత్తశుద్ధి లేని వ్యక్తి తాను బోధించింది. సత్యం అయినా కాకపోయినా జయప్రదంగా రాణించలేకపోవచ్చు అనటం కూడా తప్పుడు వాదమే. మహమ్మద్ చిత్తశుద్ధి మనకెలా తెలుసు? అతడు, లేకుంటే జయప్రదం అయ్యేవాడే కాదు అంటారు. అతడు ఎలా జయప్రదం అయ్యాడు? చిత్తశుద్ధి వల్లనా? ఇలా తిరుగుడు వాదం ఉంటుంది. రాన్ హబ్బర్డ్ పందెం వేసి తాను ఒక కొత్తమతాన్ని స్థాపించగలనని ఆర్థర్ క్లార్క్ తో అన్నాడట. ఈ నానుడి పేరిట హబ్బర్డ్ వెళ్ళి సైంటాలజీ మతాన్ని స్థాపించాడంటారు. ఇందులో ఎంత నమ్మాలో తెలియదు. టెలీ ఎవాంజలిస్టులు, గురువులు, మత స్థాపకులు, ఉద్యమాలు వీటన్నిటి వెనుక కొన్ని గాథలు ఉండనే ఉంటాయి.
కార్ లైల్
ఇస్లాంపట్ల కార్ లైల్ కు మిడిమిడి జ్ఞానమే ఉన్నది. మహమ్మద్ పై అతడి వ్యాసం పాండిత్యం దృష్ట్యా చూస్తే పనికిరాదు. బంథామ్ చెప్పిన ఉపయోగవాదానికీ, పదార్థ వాదానికీ వ్యతిరేకంగా ఇస్లాంను ఒక ఆయుధంగా మాత్రమే వాడాడు. పారిశ్రామిక విప్లవం వలన ఆవిర్భవిస్తున్న యాంత్రిక ప్రపంచదృష్టిపట్ల కలవరపడిన కార్ లైల్ ప్రాశ్చ వివేచనా గాథలలో సేదతీర్చుకున్నాడు. ఫ్లాబర్ట్ వలె కార్ లైల్ కూడా ఆధ్యాత్మిక పక్షవాతం నుండి పాశ్చాత్యలోకం పునరుజ్జీవం పొందాలని ఆశించాడు. అతడి భావాలు 19-20 శతాబ్దాలలో కూడా మళ్లీ తలెత్తాయి. ఇస్లాం ఒక విధంగా క్రైస్తవానికి గందరగోళ రూపమనీ, క్రైస్తవానికి వికృత బిడ్డ అని చరిత్రకారుడు భావించాడు. డాంటే, తన సమకాలీనులూ ఇస్లాంను హీనమైనదిగా, దారితప్పిన క్రైస్తవంగా చూశారు. కార్ లైన్ ఒక విధమైన క్రైస్తవంగా మహమ్మద్ మతాన్ని భావించి సిరియన్ శాఖలకంటే ఉత్తమమైనదిగా తలపోశారు. (కార్ లైల్ పుట. 297 సార్టార్ రిసార్టర్స్, లండన్, 1973)
ఉత్తమ ఆటవికత్వం అనే భావనకు మతం ముసుగు తొడిగి, మహమ్మద్ ను చిత్రీకరించి చూపాడు కార్ లైల్. మహమ్మద్ ప్రత్యక్షంగా మార్మికాలతో, జీవితంతో, ప్రకృతిలో సంబంధాలు గలవాడన్నాడు. పాశ్చాత్య నాగరిక, సందేహవాద ప్రపంచానికి లభించని, మార్మిక స్వభావాల నిజరూపం మహమ్మద్ కు ఉన్నాయని చిత్రించాడు.
మహమ్మద్ ప్రకృతి నుండి సూటిగా పుణికిపుచ్చుకున్నవానికి ప్రతిబింబంగా వెలుగొందాడు. సంస్కృతికి దూరంగా, కొంత ఆటవికంగా, ప్రకృతి బిడ్డగా అతడున్నాడు. (కార్లైల్ పుట 288-301 షార్జాలోని సార్టస్)
అరబ్బులకు మత స్వభావం ఉన్నదనీ, ధాన్యం గాఢ భావాలు, ఉత్సాహం గలవారనీ స్కాటిష్ పండితుడు చిత్రించాడు. ముఖ్యంగా కావలసింది సత్యం కాదు. చిత్తశుద్ధి మాత్రమే. హేతువుకు అతీతంగానైనా నమ్మేది చిత్తశుద్ధితో అయితే చాలు. చిత్తశుద్ధి లేనివాని సత్యాలకంటే, మహమ్మద్ అసత్యాలే సత్యాలు. (పుట 307 - కార్లైల్ - పై పుస్తకంలో)
ప్రాచీన ఫాసిస్టు లక్షణాలు కార్లైల్ భావాలలో గమనించాడు రస్సెల్. తదితరులు కార్లైల్ ఫాసిజం, అతడు హింసను శ్లాఘించిన దానిలో, క్రూరత్వం, నిర్హేతుకతను పొగిడిన రీతిలోనూ చూడవచ్చు. హేతువు అంటే అతడికి జుగుప్స. తీవ్ర లక్షణాలున్న వ్యక్తిగా, విషయాలు నిర్దుష్టంగా చెబుతాడు. (కార్లైల్ పుట 306 పై పుస్తకంలో) కార్లైల్ రచనను తీవ్రంగా స్వీకరించినవారెవరైనా ఉన్నారేమో తెలియదు. కాని ముస్లింలు ఇతడు మహమ్మద్ గురించి రాసినదంతా, యూరోప్ లో మహమ్మద్ ను స్వీకరించినట్లుగా భావించారు. జాగ్రత్తగా చదివితే మహమ్మద్ అన్ని సందర్భాలలో చిత్తశుద్ధి లేనివాడనీ, అతడి నైతిక ప్రవచనాలు అంత శ్లాఘనీయాలు కాదనీ, ప్రవక్తలలో వాస్తవమైన వాడేమీ కాదనీ రాసినట్లు గమనించవచ్చు. ఖురాన్కు అవమానకరమైన భాగం కూడా ఉంది. అదంతా విసుగు పట్టించే, మోటుగా చెప్పిన గందరగోళం, సమర్థించడానికి వీల్లేని మూర్ఖత్వం ఉంది. తప్పనిసరైతే తప్ప యూరోపియుడెవరూ ఖురాన్ చదవలేడు (కార్లైల్ పుట 299 అదే పుస్తకంలో) కార్లైల్ ను కూడా మనం చదవలేం.
కార్లైల్ రచననుండి పై భాగాలను ఒక ప్రత్యేక పుస్తకంగా అచ్చు వేసి ముస్లింలు చదువుతున్నారంటే, మహమ్మద్ ను గురించి అతడు అనుకూలంగా చెప్పిందంతా హీరో ఏజ్ ఏ పొయిట్ లో విస్మరించాడని ముస్లింలు గమనించరాదనే అయి ఉంటుంది. ప్రవక్తల్నినమ్మాలంటే, ఆదిమ దశలో ఉండాలి అని అతడు అన్నాడు. మహమ్మద్ జనాన్ని ఉద్దేశించి మాట్లాడడంలో అర్థంలేని, పొందికలేని దోషాలు దొర్లాయి. మంచి చెడ్డల సమ్మిళితంగా మాట్లాడడం, అంత జనంలోనే కుదురుతుంది. (కార్లైల్ పుట. 332)
మహమ్మద్ ప్రభావం క్షీణించడం పట్ల కార్లైల్ ఇలా రాశాడు.
మహమ్మద్ గొప్ప ప్రవక్త అనడం తప్పు. అలాంటి తప్పు నేటికీ మనకు సంక్రమించింది. మహమ్మద్ మాటలో అసందర్భాలు, కట్టుకథలు, అపవిత్రాలు, అసహనాలు ఉన్నయి. అతడు గొప్ప వక్త అనడం సందేహాస్పదం. దుర్విగ్ధతతో కూడిన వాచాలుడు మాత్రమే. అరేబియాలో కూడా మహమ్మద్ కాలదోషం పట్టి మరుగున పడి ఉంటాడు. ఆయన చెప్పేదంతా దోషపూరితమే (కార్లైల్ పుట 343).
అతడి ఖురాన్ అర్ధం లేని మూర్ఖ గ్రంథం. అది అతడు నమ్మినట్లు, దేవుడు రాశాడని మనం నమ్మలేం. ఇంతకంటే ద్రోహకర ప్రకటన ఏం కావాలి (కార్లైల్ పుట. 344)
అరబ్బు మూలాధారాలపై 17, 18 శతాబ్దాల యూరోప్ పండితులకు అవగాహన లేదు. మిడిమిడి జ్ఞానమే వారికుంది. క్రైస్తవ అసహనం, క్రూరత్వం, పురోహిత వర్గం, పిడివాదాన్ని ఎదుర్కోవడానికి ఇస్లాంను ఆయుధంగా వాడుకున్నారంతే.
19వ, 20వ శతాబ్దాలలో యూరోప్ లోని ఇస్లాం పండితులకు ఇస్లాంను గురించి ఎక్కువగా తెలుసు. క్రైస్తవులలో భక్తులు, పురోహితులు ఇస్లాంకు మతరీత్యా సమానత్వం ఆపాదించాలంటే మహమ్మదును గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నారు. ఇస్లాం తోటి మతమనీ, యూదు, క్రైస్తవ భావాలతో ప్రభావితం అయిందనీ, కనుక అవి ఉండటమో, ఊడటమో కలసి కట్టుగా జరుగుతుందనీ భావించారు. ఇస్లాం పిడి వాదాన్ని అసంబద్ధతలనూ సిద్ధాంతాలనూ విమర్శిస్తుంటే తమ నిర్మాణచట్రం కూడా కదలి, కూలిపోతుందని క్రైస్తవులు భావించారు. హేతువాదం, సందేహవాదం, నాస్తికవాదం సెక్యులరిజం, పారిశ్రామిక విప్లవం, రష్యా విప్లవం. కమ్యూనిజం, భౌతిక వాదం తలెత్తటం పాశ్చాత్యలోకంలో ప్రమాదకరమైన సామాజిక, ఆర్థిక తాత్విక విషయాలుగా భావించారు. సర్ హేమిల్ టన్ గిబ్ రాస్తూ ఇస్లాం క్రైస్తవం ఒకే ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉన్నాయన్నారు. (డేనియల్. పుట. 306) సందేహవాదాన్ని గురించి జాగ్రత్త వహించాలన్నారు. క్రైస్తవం, ఇస్లాం మతాలు ప్రాపంచిక వత్తిడుల వలన శాస్త్రీయ, నాస్తిక వాదుల దాడికి గురవుతాయని నార్మన్ డేనియల్ బాధపడ్డారు. (అదే పుస్తకం పుట 307)
ముస్లిం స్నేహితులను, తోటివారిని బాధపెట్టకుండా ఇస్లాంను నిశిత పరిశీలనకు గురి చేయకుండా ఉండాలని క్రైస్తవ పండితులు భావించారు. ముస్లింలను బాధించే విషయాలు రాసినందుకు క్షమాపణలు చెప్పటం, చర్చనీయాంశాలలో ఎటూ నిర్ణయాలు తీసుకోకపోవటం క్రమంగా అనుసరించారు. ప్రొ. వాట్ మహమ్మద్ జీవిత చరిత్ర రాస్తూ ఖురాన్ ప్రస్తావనలో మహమ్మద్ ఇలా అన్నాడు, దేవుడు ఇలా అన్నాడు అనే మాటలు తొలగించి, ఖురాన్ ఇలా అంటున్నది అని మాత్రమే రాసాడు. (వాట్ మహమ్మద్ ఎట్ మక్కా, అక్స్ ఫర్డ్ 1953, పీఠిక) ఇలాంటి పద్ధతులవలన ప్రాచ్య విషయాల చర్చలో జాగర్త వహించాల్సి వచ్చిందనీ, కొన్నిసార్లు చిత్త శుద్ధి లేకుండా పోవటం జరిగిందనీ బర్నార్డ్ లూయూన్ అన్నాడు. (ఇస్లాం అండ్ లిటరల్ డెమోక్రసీ, అట్లాంటిక్ మంథ్లీ, ఫిబ్రవరి, 1993 పుట 11) అంటే చాలా సున్నితంగా చెప్పినట్లే ప్రొ. వాట్ క్రైస్తవ భక్తుడు. ఖురాన్ దైవవాక్యమని నమ్మడు. ముస్లింల సున్నితత్వాన్ని బాధపెట్టకుండా ఉండేటందుకు ఇస్లాంవాదులు కొన్ని మార్పులు కూడా చేశారు. మూలంలో మార్పులు చేయలేదన్నారు. రిచర్డ్ రాబిన్ సన్ రాస్తూ మేథా సంబంధంగా చిత్తశుద్ధి లేని ధోరణి మతంలో ప్రవేశించిందన్నాడు. వాట్ లండన్ లోని సెయింట్ మేరీ బోల్టన్స్, ఎడింబరోలోని సెయింట్ పాల్స్ పాస్టర్ గా ఉండేవాడు. అతడు ఎపిస్కోవల్ పాస్టర్ కూడా. బ్రిటన్ లో ఆ మాటకొస్తే పాశ్చాత్యలోకంలోనే ఇస్లాం పండితుడిగా అతడి ప్రభావం చాలా ఉండేది. సందేహవాదం, నాస్తికవాదం, కమ్యూనిజం మతానికి బద్ధ శత్రువులుగా ప్రొ.వాట్, సర్ హెమిల్టన్ గిబ్ భావించారు. తూర్పు దేశాల నుండి ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని ఆశించటంలో వీరు కార్లైల్ ను అనుకరించారు. వాట్ ఇలా అంచనా వేశారు. ఇస్లాం ముఖ్యంగా ప్రాచ్యలోకం దైవం సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పింది. పాశ్చాత్యలోకం ఇటీవల మానవేచ్ఛపై ప్రాధాన్యత చూపింది. ఈ రెండూ భిన్న మార్గాలలో దారి తప్పాయి. ప్రాచ్య లోకం గ్రహించిన సత్యం నుండి పాశ్చాత్యలోకం నేర్చుకోవాలి. (వాట్, ఫ్రీవిల్, లండన్. 1948 పుట 2) (తుది మాట ప్రాచ్యలోకానిదే. పాశ్చాత్యం నుండి ప్రాచ్యం నేర్చుకునేదేమీ లేదా)
సెక్యులరిజం పట్ల తన జుగుప్సను మతం మత వ్యతిరేకత అనే వ్యాసంలో ప్రొ. వాట్ దాచుకోలేకపోయాడు. సెక్యులరిజం, పదార్థవాద ప్రభంజనం తగ్గుముఖం పడుతున్నదని రాసాడు. (వాట్. రెలిజియన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్, పుట. 625-27 మధ్య ప్రాచ్యంలో ఆలోచనాపరులు నేటి సమస్యల తీవ్రతను గ్రహించారు. కనుక వ్యక్తిగత జీవితంలో తలెత్తే సమస్యను ఎదుర్కోవటానికి మతావసరాన్ని గుర్తించారని వాట్ ఇలా రాశాడు.
ఈజిప్టులో ముస్లిం సోదరులూ, సిరియా తదితర చోట్ల ముస్లింలు పర్ష్యాలో ఫైడాయన్ ఇస్లాం, పాకిస్తాన్ లో జమాతే ఇస్లాం కొత్తరకపు ఇస్లాం నియంతృత్వాలను వీటిని ఫాసిజంతోనూ, హిట్లర్ జాతీయ సోషలిజంతోనూ పోలికలున్నాయంటాడు. ఉన్నమాట నిజమే. రాజకీయం దృష్ట్యా ఇది సమర్థనీయం కూడా. విశాల దృష్టితో చూస్తే ఈ చిత్రీకరణ వక్రభాష్యం అవుతుంది. కొన్నిసార్లు ఈ ఉద్యమాలు ప్రజల ఉద్రేకాన్ని, హింసను ఆకర్షణీయమైన నాయకుల కోసం, ఉద్యమ సంఘటితం కోసం వినియోగిస్తారు. గతంలోని వీరోచిత విలువలూ, ఉద్వేగాలూ కావాలంటారు. స్వేచ్ఛగా నిశిత పరిశీలన అణచివేస్తారు. ఐనప్పటికీ మతాన్ని పునరుజ్జీవింప చేయటంలో వీటి ప్రాధాన్యత విస్మరించరాదు. కొత్త ఇస్లాం జన ఉద్యమాలు ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అవి ఫాసిజం, జాతీయసోషలిజం వైపుకు పోవచ్చు.
మతపునరుజ్జీవనం
ఫాసిజాన్ని పొగిడిన తీరు రాజకీయ ఎత్తుగడే. ఫాసిజాన్నిచూసీ చూడనట్లు పోనివ్వమనీ, దాని ప్రత్యక్ష ప్రాధాన్యత గమనించమనీ అంటున్నాడు. పవిత్ర టెర్రరిజాన్ని వాట్ సమర్థిస్తున్నాడు. ముస్లిం సోదరులు అనే సంస్థ టెర్రరిస్టు వ్యవస్థ అని మర్చిపోకూడదు. దీని స్థాపకుడు హిట్లర్, ముసోలినీలను మెచ్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం హసన్ స్థాపించిన ముస్లిం బ్రదర్స్ సంస్థ పౌరులపై దాడి జరిపింది. సినిమాలూ, హోటళ్ళపై బాంబులు వేశారు. తగులబెట్టారు. సరిగా దుస్తులు వేసుకోలేదని స్త్రీలను కత్తులతో పొడిచారు అనేక హత్యలు చేశారు. ఇదంతా మత పునరుజ్జీవనం పేరిట మరిచిపొమ్మంటున్నారు.
మేథస్సును నమ్మక పోవటం, చారిత్రక నిస్పాక్షికతనూ, సత్యాన్ని తృణీకరించడం ఆందోళనకరమైన అంశం. చిహ్నాలను అశ్రద్ధ చేయటం మంచిది కాదనీ, చారిత్రక సత్యంకంటే ఈ చిహ్నాలు ముఖ్యమనీ అన్నారు. (వాట్ ముస్లిం, క్రిష్టియన్ ఎన్ కౌంటర్స్, లండన్ 1991, పుట 116) ఖురాన్ కు పీఠిక రాస్తూ వాట్ నిస్పాక్షిక సత్యాన్నివదిలేసి వ్యక్తిగత అంశానికి అనుకూలత చూపాడు.
యూదులూ, క్రైస్తవులూ, బౌద్ధులూ, ముస్లింలూ ఇతరులూ అనుసరించిన విధానాలు వాస్తవమైనవే. ఇవన్నీ వ్యక్తికి జీవితంపట్ల తృప్తికరమైన అనుభవాన్ని ఇచ్చాయి. వీటిలో ఎక్కువా, తక్కువా అనేవి లేవు. ప్రతిదీ సత్యమే. ఈ దృష్టితో ఖురాన్ సత్యమే. ఖురాన్ దైవానికీ, క్రైస్తవ దైవానికీ విరుద్ధ భావన ఉన్నా అవి తప్పుడువి కావు.
ప్రతి భావన సత్యంలో ఒక భాగమే. ఒక భావన విజ్ఞానానికి విరుద్ధంగా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. యావత్తు విధానం మరొక పద్ధతికంటే తక్కువైనదని అనుకోవటానికి వీలు లేదు. జీసస్ ను యూదులు చంపలేదని ఖురాన్ అంటుంది. అంతమాత్రాన ఖురాన్ విధానం యావత్తూ క్రైస్తవులకంటే తక్కువదేమీ కాదు. (వాట్ ఇన్ ట్రడక్షన్ టు ఖురాన్, ఎడింబరో 1977)
వాట్ సాపేక్షతావాదం
మేథస్సు దృష్ట్యా పై వాక్యాలలో చిత్తశుద్ధి లేదు. మానసికంగా వాట్ గమ్మత్తులు చేసి, ఎవరినీ నొప్పించకుండా అందరినీ తృప్తిపరచడానికి ప్రయత్నించాడు. వాట్ పదజాలంలో అస్పష్టత సమస్య అలా ఉంచుదాం. ఖురాన్ పద్ధతి భవన, సంపూర్ణ జీవన అనుభవం అనేవి అస్పష్టాలే. ఇస్లాంపట్ల బ్రిటిష్ ఇస్లాం పండితులు నిశిత పరిశీలన ఎందుకు చేయలేదో అర్థమవుతున్నది. ముస్లిమేతరుడు పరమ సత్యంతో సంబంధం లేకుండా కొనసాగాడు అని వాట్ రాశాడు. మానవుడు ఈ సత్యాన్ని సాధించలేదనే దృష్టి అందుకు కారణం కావచ్చు. సత్యాన్ని సాపేక్షికంగా భావించాడు. మానవుడు ఆధ్యాత్మిక అవసరాలు తీరుతున్న సందర్భంలో నమ్మక వ్యవస్థలను నిశిత పరిశీలన చేయజాలడు. వాట్ చూపిన ధోరణిపై జూలియస్ బెండ తన బిట్రేయల్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ లో బయట పెట్టాడు.
ఆధునిక మేథావులు విశ్వ సత్యాన్ని, నీతిని జుగుప్సగా చూశారు. సాధారణ మానవుల సేవల్ని దృష్టిలో పెట్టుకున్నారు. సత్యాన్ని ఆమోదిస్తే విశ్వజనీనంగా ఉండటం కష్టం అనుకొన్నారు. ప్రాంతీయ సత్యాలూ, ఫ్రాన్స్ కో బ్రిటన్ కో పరిమితమైన సత్యాలు ఉన్నాయని, విశ్వవ్యాప్త సత్యాలు భ్రమలని భావించి వీరు అనందించారు. (బెండ. పుట. 76, 77 బోస్టన్ 1955)
వీటికి ముస్లిం సత్యం, క్రైస్తవ సత్యం అంటూ వాట్ జోడిస్తూ పోయారు. ప్రతి మతం సరైనదేననీ, ఆయా సాంస్కృతిక ప్రాంతంలో అది సరిపడుతుందని వాట్ అన్నాడు.
1920 ప్రాంతంలో తలెత్తుతున్న జాతీయవాదాన్ని బెండ ఎదుర్కొన్నాడు. బాహ్య సత్యాన్ని విడనాడితే, ఫాసిజానికి పోతామని రసెల్ చూపాడు. హిట్లర్ దృష్టిలో విజ్ఞానం సత్యాన్వేషణ చేస్తుందనే దృష్టి అర్థం లేనిది. అతడి ఆమోద నిరాకరణలు రాజకీయ కారణాలుగానే సాగాయి.
1848 నుండి పెరుగుతున్న జాతీయవాద తీవ్రత హేతు విరుద్దానికి ప్రతిరూపం విశ్వవ్యాప్తమైన సత్యం ఉంటుందనేది నిరాకరించారు. సత్యాన్ని దేశీయంగా చూశారు. హేతువాదం సత్యప్రమాణాలను విశ్వజనీనంగా, రాగద్వేషాతీతంగా చూస్తుంది. మానవుల సంక్షేమానికి అది అవసరం. ఈ విధానాన్ని స్వప్నంగా భావించి నిరాకరించే చోట దీని అవసరం ఎంతైనా ఉంది (రసెల్ ఇన్ సైజ్ ఆఫ్ ఐడిల్ నెస్. పుట.107, లండన్. 1935)
నేటి మన కాలంలో మేథస్సు సాపేక్షతావాదం, ప్రధాన రుగ్మతగా కార్ల్ పాపర్ భావించాడు. వాట్ కు సూటిగా సమాధానం ఇస్తున్నాడా అన్నట్లుగా రాశాడు. వాట్ వంటివారు సాపేక్షతా వాదాన్ని తప్పుడు వాదనలతో ప్రవేశపెట్టిన తీరును పాపర్ పరిశీలించాడు. మన దేవుళ్ళను మన ప్రపంచాన్ని సొంత దృష్టితో చూస్తామని, జనోపేన్స్ తత్వవేత్త అన్నమాటలను పాపర్ ఉదహరించాడు. ఐతే, చారిత్రక, సాంస్కృతిక భూమికలు దాటి నిస్పాక్షిక సత్యానికి వెళ్ళలేమనటం అర్థం లేని మాట.
విమర్శను పరిశీలిస్తూ నిశిత పరిశీలనలు చేస్తూ పోతే, అంచలవారీగా మనం వ్యక్తిగత రాగద్వేషాలను తొలగించుకోవచ్చు. భిన్న సాంస్కృతిక ధోరణులున్న వ్యక్తులు ఫలవంతమైన చర్చలు సాగించనూ వచ్చు. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవాలనీ, నేర్చుకోవాలనీ సత్యానికి చేరువగా వెళ్ళాలనీ అసక్తి ఉండాలంతే. సాపేక్షతా ధోరణిలోకి పోకూడదు. చర్చలో ఉభయులూ అంగీకరించకపోతే, ఎవరో ఒకరు లేదా ఉభయులూ తప్పు కావచ్చు. అంతేకాని ఉభయులూ సరిగానే ఉన్నారనడం తప్పు. ఉభయులూ తప్పనడానికీ, ఉభయులూ సరిగానే ఉన్నారనడానికీ తేడా ఉన్నది. అలంకారాలు శబ్దాలతో వీటిని మాయపుచ్చవచ్చు. సొంత విమర్శ చేసుకోవటం పెద్ద ముందంజ వేయటం. అవతలి వ్యక్తి సరిగా చెపుతున్నాడనటం నేర్చుకోవాల్సిన అంశం. ఉభయులూ సరిగానే చెపుతున్నారని భావిండం మాత్రం ప్రమాదం. ఉభయులూ తప్పుగా భావించడం సర్వ సాధారణంగా జరగవచ్చు. బద్ధకంతో స్వీయ విమర్శను నిరాకరించరాదు. సాపేక్షతావాదాన్ని స్వీకరించనూ రాదు. (పాపర్ ది ఓపెన్ సొసైటీ అండ్ ఇట్స్ ఎనిమీస్. ద్వితీయ సంపుటి. పుట. 369-88, లండన్, 1969)
వాట్ వాదంలో జనించే తార్కిక ఫలితాలను అతడే అంగీకరించకపోవచ్చు. మత విశ్వాసాలలో అధిగమించేవి లేవంటూ వాట్ రాసినప్పుడు అందులో హెచ్చుతగ్గులకు తావులేదు. ఏకేశ్వరాధన ఎక్కువనీ, బహుదేవతారాధన తక్కువనీ ఎలా అంటారు. సైంటాలజీ చర్చికి, బగాయూస్ కూ, మూనీస్ కూ, రెవరెండ్ జోన్స్ కూ, చిల్డ్రన్ అఫ్ గాడ్ కూ ప్రొ. ఎవాన్స్ చర్చించిన కల్ట్స్ ఆఫ్ అన్ రీజన్ కూ సమాన గౌరవ ప్రపత్తులు ఎందుకివ్వరు.... ఎక్కువ, తక్కువ, వాస్తవం అనే మాటల్ని వాట్ వాడటానికి లేదు. పైగా ఈ ధోరణిలో ఆధిక్యత ఆపాదించుకునే అవకాశం ఉన్నది. శాంతాక్లాజ్ వంటి నమ్మకాలుగల క్రైస్తవులూ, ముస్లింలను ప్రశ్నించరాదనీ, అలాంటి నమ్మకాలు చెడు చేయకపోగా ఊరట కలిగిస్తున్నాయనీ వాట్ ధోరణిగా కనిపిస్తుంది. భ్రమలతోగాక, సాహసోపేతంగా సత్యాన్ని అన్వేషించటంలోనే మానవుడు పురోగమించగలడు అని రసెల్ రాశాడు.
చారిత్రక సత్యం కంటే సంకేతపరమైన సత్యం ముఖ్యమని వాట్ అంటాడు. ముస్లింలూ, క్రైస్తవులూ ఇందుకొప్పుకోరు. జె.ఎల్. థామ్సన్ ఇలా రాశాడు. బైబుల్ పాత నిబంధన పండితులు ఇజ్రాయల్ సందేశానికి చరిత్ర ముఖ్యమనీ, ఇజ్రాయల్ తొలి సంప్రదాయాలలో చారిత్రకత ఆమోదించటం క్రైస్తవ విశ్వాసానికి మూలమనీ అంటారు. జీవులకు ఇచ్చిన హామీ దృష్ట్యా మరొకసారి దేవుడు బ్రతికి రావటం కూడా అంతే ప్రాధాన్యత వహించిందంటారు. రోలండ్ డివాక్స్ రాస్తూ బైబుల్ సంప్రదాయాలకు చారిత్రక వునాదులను శాస్త్రీయంగా చూపటం చాలా ముఖ్యం అంటాడు. ఆ విశ్వాసం అబద్ధమైతే మిగిలిన నమ్మకాలన్నీ పోతాయంటాడు. నమ్మకం నిలబడాలంటే మత చరిత్రకూ బాహ్య సత్యానికీ సన్నహిత సంబంధం ఉండాలంటాడు. ఇజ్రాయల్ మత చరిత్రను నిరాకరిస్తే, విశ్వాసాన్నికూడా తృణీకరించినట్లే అవుతుందన్నాడు. (థామ్సన్, హీస్టీరిసిటీ ఆఫ్ ది పేట్రియార్కల్ నెరేటివ్స్, లండన్, 1974, పుట. 326-27)
నార్మన్ డేనియల్
వాట్ వలె రెండు నాలుకల ఆలోచన చేసిన నార్మన్ డేనియల్ కూడా ఇస్లాంపట్ల ఉదాసీనత చూపిన పాశ్చాత్యుడే. అతడిలా రాశాడు.
మహమ్మద్ ను పవిత్రంగా చూడటం క్రైస్తవులకు అవసరం. ముస్లింలు ఎలా చూస్తారో అలాగే చూడాలి. లేకుంటే ఇస్లాం అవగాహనకు దూరమైనట్లే. అంతమాత్రాన మహమ్మదు పవిత్రుడనీ, మహమ్మద్ ద్వారా దేవుడు మాట్లాడాడనీ ముస్లింలు భావించినట్లుగా వీరు నమ్మనక్కరలేదు. జనం అలా నమ్మినంత మాత్రాన అది వాస్తవం కాబోదు. కాని ఆధ్యాత్మిక మానసిక ధోరణి ఆ విధంగా లేకుంటే ప్రగతి సాధ్యంకాదు. (డేనియల్. పుట. 305)
క్షమాపణ వాదుల వలన అవగాహన లేకుండా పోయిందని రాడిన్ సన్ వ్యాఖ్యానించాడు. బాహ్యసత్యం అనే భావన డేనియల్ కూడా గ్రహించలేకపోయాడు. ఏకేశ్వర వాదులు సాగించిన ఆధ్యాత్మిక పోరాటంలో డేనియల్, వాట్, ఫ్రెంచి పండితుడు లూయీ మేసిబ్నాస్ కొట్టుకు పోయారు. 1962లో వేటికన్ మత సంస్థ కూడా దైవం, జీసస్ ప్రవక్తలను గురించి ప్రధాన సత్యాలను ఇస్లాం మానవాళికందించిందన్నారు.
క్రైస్తవ యూదు మత నాయకులు చేతులు కలిపి, విభేదాలు విస్మరించి, రష్డీని చంపమని ఇచ్చిన పిలుపుకు నిసరసన తెలుపకపోగా, వారూ ఖండించారు. అయోతుల్లాకంటే మించిపోయి వేటికన్ పత్రిక (L’ OSSEREATORE ROMANO) రష్డీని దుయ్యబట్టింది. న్యూయార్క్ కార్డినల్ జాన్ ఓ కానర్ రష్డీ పుస్తకం చదవద్దని కేథలిక్కులకు పిలుపు ఇచ్చాడు. లాయన్స్ కు చెందిన కార్డినల్ అల్బర్ట్ డికోత్రే శటానికి వెర్ససెస్ ను మతానికి అవమానంగా పేర్కొన్నాడు. ఇజ్రాయల్ లో యూదు పురోహితుడు అవర్ హోమ్ షపీర పుస్తకాన్ని నిషేధించమన్నాడు. ఇవ్వాళ ఈ మతాన్ని వ్యతిరేకించినట్లే రేపు ఇంకొకటి వ్యతిరేకిస్తారు అని అన్నాడు. (పైప్స్, రష్డీ ఎఫైర్, న్యూయార్క్, 1990 పుట. 164) కేంటర్ బరీ ఆర్చి బిషప్ డా. కారే రష్డీ పుస్తకాన్ని ప్రవక్తపై దారుణమైన విమర్శగా భావించి ముస్లింలు నొచ్చుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నాడు.
ఖురాన్ లో జీసస్ క్రైస్త్ పై దారుణ విమర్శ గురించి డా.కారే ఏమంటారు? శిలువపై నాటడాన్నికొరాన్ నిరాకరిస్తుంది. మహమ్మద్ మత శాస్త్రంలో జీసస్ క్రైస్తుకు సంబంధించిన అన్ని విషయాలనూ కాదనటమో, వక్రీకరించటమో జరిగిందని రైస్ రాశాడు. (ముస్లిం వరల్డ్, సంపుటి 1, సంచిక 2, ఏప్రిల్, 1911).
ఇస్లాం ఒక్కటే క్రైస్తవ వ్యతిరేక మతం
ఇస్లాం ఒక్కటే క్రైస్తవ వ్యతిరేక మతం ఆని ముస్లిం వరల్డ్ పేర్కొన్నది. నాస్తికులను శిక్షించే విషయంలో ఆనందాన్ని పొందటం కాసేపు డా. కారే అతి నిద్రావస్త నుండి మేల్కొని, నేషనల్ గ్యాలరీలో సిలువపై కొట్టిన చిత్రాన్ని ముస్లింలు రంగుపూసి ధ్వంసం చేసిన విషయాన్ని పట్టించుకుంటారా ? సిలువపై కొట్టినదేదైనా ముస్లింలకు అవమానకరమే. ఖురాన్ దైవవాక్యం గనుక. అందులో సిలువను నిరాకరిస్తున్నారు గనుక వారలా అనుకొంటున్నారు.
ఎకనామిస్ట్ పత్రిక ఇలా రాసింది. స్వేచ్ఛాభావన వెల్లడించడానికి వ్యతిరేకంగా మత వురోహిత వర్గాలు ఏకమవుతున్నాయి. రష్డీ వ్యవహారంలో అభిప్రాయ స్వేచ్ఛను కొందరు ముస్లింలు అర్థం చేసుకోకపోవడం విశేషం కాదు. చాలామంది పాశ్చాత్య మేథావులు అర్థం చేసుకోకపోవమే గమనించాలి (పైప్స్ పుట 165).
క్రైస్తవ, యూదు మేథావుల నుండి అనుకోకుండా వచ్చిన మద్దతును ఇరాన్ ఆహ్వానించింది. వలసవాదుల ప్రయత్నాలూ, దైవ విలువల తృణీకరణ, ప్రవక్తల పట్ల అవమానం వీరు అవగాహన చేసుకున్నారు (పైప్స్ పుట 166) ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్త్ ప్రదర్శనకు వ్యతిరేకంగా క్రైస్తవులతోపాటు ముస్లింలు ఇస్తాంబూల్ లో చేతులు కలిపి రుణం తీర్చుకున్నారు.
1920 నుండి పాశ్చాత్య లోకంలో వామపక్ష ఉదార మేథావులు యూరోప్ వలన, సామ్రాజ్యవాదం పట్ల నిరసన చూపారు. రసెల్ ఇలా రాశాడు. పాలితజాతులపట్ల, అణగారిన ప్రజలలో ఉన్నత ధర్మాలున్నాయని నమ్మి కొందరు వారిని అభనందించటం ప్రారంభించారు. (రసెల్. పుట. 58, ఆన్ పాప్యులర్ ఎస్సేస్, న్యూయార్క్, 1950. ఇస్లాంను, ఇస్లాం దేశాలనూ విమర్శించటం జాతి విద్వేషంగా, పాశ్చాత్య కుట్రగా పరిగణించారు. ఇస్లాం చట్టంపై రోమన్ చట్టం ఎంత ప్రభావం చూపిందో పెట్రిషియా క్రోన్ రాశారు.
ఇస్లాంకు అలాంటి చట్టాలు నొచ్చుకునేవిగా ఉన్నాయి. యూదులతో పోల్చితే గ్రీస్, రోమన్ ప్రభావాలు అంత బాధాకరమైనవి కాకపోవచ్చు. ఇస్లాం కళలూ, శాస్త్రం, తత్వంలో మాత్రమే ఎలాంటి డొంకతిరుగుడూ లేకుండా ప్రభావాల చర్చ జరుగుతున్నది. పాతకాలపు ప్రాశ్చ్యవాది స్థానంలో నేడు ఆధునిక చరిత్రకారుడు చోటు చేసుకున్నాడు. పాశ్చాత్య సామాజిక శాస్త్రజ్ఞుడూ, అరబ్ వాది, ముస్లింల మంచితనంకోసం తిప్పలు పడుతున్నారు. ఇస్లాం నాగరికత బోధించడంలోనూ, అధ్యయనం చేయడంలోనూ అది పుట్టిన స్థానాన్ని విస్మరిస్తున్నారు. (క్రోస్, రోమన్, ప్రోవిన్షియల్ అండ్ ఇస్లామిక్ లా. కేంబ్రిడ్జ్. 1987, పుట 6.7)
1960-70 నాటికి పశ్చిమ యూరోప్ లో కొందరు ముస్లింలు బయలుదేరి ప్రతి నాగరికత కొన్ని అద్భుతాలతో కూడిందని చెప్పారు. బహుళ సంస్కృతి కర్మాగారాలు, విద్యాసంస్థలూ వెలువడ్డాయి. విమర్శ అంటే జాతివాదం, కొత్త వలసవాదం, ఫాసిజం అని పిలిచాడు.
1920 నుండి 50 వరకూ వామపక్ష మేథావులు కమ్యూనిజాన్ని విమర్శించటానికి నిరాకరించినట్లే రష్డీ వ్యవహారంలో సమాంతర ధోరణులు కనిపించాయి. కప్పి పుచ్చేకుట్ర అని రసెల్ ఈ వాతావరణాన్ని చిత్రించాడు. (రసెల్ థియరీ అండ్ ప్రాక్టీస్ అఫ్ బోల్డ్స్ విజం, పుట 165, లండన్, 1921) 1920లో సాహసోపేతంగా సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని విమర్శించినప్పుడు, వామపక్షాలు దాడిచేసాయి. వి.యస్. నయపాల్ యమోంగెస్ట్ ది బిలీవర్స్ అనే పుస్తకంలో ఇరాన్ విప్లవాన్నీ, సున్నితంగా ఇస్లాంను విమర్శించినందుకు మేథావులూ, ఇస్లాం వాదులూ విరుచుకుపడ్డారు.
లెనిన్, స్టాలిన్ కమ్యూనిజం గురించి వామపక్ష మేథావులు అబద్ధాలనెలా దిగమింగకున్నారో, జార్జి ఆర్ విల్, ఆర్థర్ కోస్ట్లర్, రాబర్ట్ కాక్వేస్టు చూపారు. రాజకీయంగా సరిగా ఉంటే, సత్యంతో పనిలేదని ఆధునిక ధోరణిగా ఉంది. అలాంటప్పుడు విమర్శ, చర్చ అసమ్మతికి గురవుతున్నాయి. ఏమాత్రం విమర్శించినా అది నేరంగా, ద్రోహంగా భక్తులు భావిస్తున్నారు. (కోస్లర్, ది యోగీ అండ్ ది కమిసార్, 1946 న్యూయార్క్ పుట 125) నిశిత పరిశీలనా దృష్టిని అరమరికలు లేకుండా ధారాదత్తం చేశారని కోస్లరంటున్నాడు. (పుట 127).
స్టాలిన్ నిర్బంధ కార్మిక, శిబిరాల గురించి సాత్రే ధోరణితో, ఖొమినీ దారుణాలపట్ల ఫూకో ప్రవర్తనను పోల్చవచ్చు. (పుట. 127) ఫ్రెంచి కార్మికులు నిరుత్సాహపడకుండా ఉండాలంటే నిర్బంధ శిబిరాల గురించి పట్టించుకోరాదని, లేదా సమాచారం దాచిపెట్టాలని సాత్రే భావించాడు. (కాంక్వెస్ట్, ది గ్రేట్ టెర్రర్, లండన్ 1968 పుట. 678-79) ఇరాన్ లో సంఘటనలపట్ల ఉత్సాహం చూపిన ఫూకో 1976 అక్టోబరులో రాస్తూ, వునర్వికాస కాలం నుండీ పాశ్చాత్యలోకం విస్మరించిన, క్రైస్తవ సంక్షోభానికి గురైన, రాజకీయ ఆధ్యాత్మికత సాధ్యమేనన్నాడు. (ఎరిబన్ పేజి 305-306) పైకల్ ఫూకో పారిస్ 1989) ఇస్లాంను ఫూకో అభనందించడంపట్ల ఒక ఇరాన్ యువతి ఇలా రాసింది.
పాతికేళ్ళ నిశ్శబ్దం, అణచివేత అనంతరం ఇరాన్ ప్రజలకు అటు షా రహస్య పోలీసా సావక్, ఇటు మత మూర్ఖత్వమే మార్గాంతరాలా ? ఆధ్యాత్మికతా ? ఇస్లాంలోకి పోవడమా.. సౌదీ అరేబియా అలానే పయనిస్తున్నదిగా. ప్రేమికులు, దొంగల తలలు సమానంగా తెగతున్నాయి. పాశ్చాత్య వామపక్షం వారికి, ఇస్లాం అభిలషణీయమే మిగిలినచోట్ల ! నా వలే అనేకమంది ఇరానియన్లు గందరగోళ పడుతున్నారు. ఇస్లాం ప్రభుత్వం అనే భావనే నిరాశ కలిగిస్తున్నది. వారేం అంటున్నారో ఇరానియన్లలకు తెలుసు. ఇరాన్ పొరుగు దేశాల్లో ఫ్యూడల్, తప్పుడు విప్లవ వాదుల్ని దాచి పెడుతున్నారు. పాకిస్తాన్, ఇండోనేషియా, ట్యునీషియా వంటిచోట్ల అణగారిన ప్రజలకు చెప్పుకునేందుకు ఇస్లాం తప్ప మరో మార్గం లేదు. ఇస్లాం చట్టం ఎంత దారుణమైందో పాశ్చాత్య ఉదార వామపక్షీయులు గ్రహించాలి. మార్పును కోరేవారికి ఇది భారమైంది. రోగంకంటే చికిత్స ఘోరమైంది.
ఇస్లాంను ఉద్వేగపూరితంగా భావించే వామపక్షీయుల పట్ల వచ్చిన విమర్శకు, అర్థం కాని ధోరణిలో ఫూకో సమాధానం ఇచ్చాడు. కొమిని అధికారం చేపట్టిన అనంతరం తలలు తెగి పడుతుంటే, కొమినిపట్ల అతడి రాజకీయ ఆధ్యాత్మికత పట్ల ఫూకో విమర్శించకుండా తన భావాలకు ఏ మాత్రం బాధపడకుండా ఉన్నాడు.
కమ్యూనిజం ఇస్లాంపట్ల సానుభూతిగలవారు పాశ్చాత్య ద్వేషాన్నిచూపడం ఫూకోవంటి వారు చేస్తూ, ప్రాచ్య ఆధ్యాత్మికతను విస్మరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై విపుల వివరణ అవసరం. ఇస్లాం నాగరికతకు పాశ్చాత్య విలువలు అన్వయిస్తే, సామ్రాజ్యవాదం, జాతివాదం, వలసవాదం అని ఖండిస్తారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో చక్కగా జీతాలు పుచ్చుకునే మేథావులే వీరంతా.
రోజర్ గరాడే
ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, పార్టీ అధికారిక తత్వవేత్త అయిన రోజర్ గరాడే విషయం పరిశీలించి ముగిద్దాం.
స్టాలిన్ మద్దతుదారు, క్వశ్చేవ్ ను వెనకేసుకొచ్చిన వ్యక్తి, ఉత్తరోత్తరా పశ్చాత్తాపం చెందాడు అని గరాడే గురించి మూసే రాశాడు. (లైఫ్స్ ఆఫ్ మైకల్ ఫూకో, లండన్ 1990 పేజి. 110) ముఠా తగాదాలలో గరాడేను ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ బహిష్కరించిన తరువాత, అనేక అవతారాలెత్తాడు. మార్క్సిస్టు హ్యూమనిజం అన్నాడు కొన్నాళ్ళు. చివరకు ఒక నియంతృత్వంలోకి మారి, ఇస్లాం అన్నాడు. ఇస్లాం నుండి మారితే, శిక్ష మరణం గనుక, బహుశ అందులోనే ఉంటాడనుకుందాం.
ఇస్లాం వాదులు మార్పుకు వ్యతిరేకంగా మౌలిక శక్తుల్ని అట్టిపెడుతున్నాయని, సంస్కరణ వాదులు, సెక్యులరిస్టులు దుయ్యబడుతున్నారు. ఈ విషయమై ప్రొఫెసర్ బెర్నార్డ్ లూయీస్ ఇలా అంటాడు. కొత్తవారు మిత్రులు సైతం అలా విమర్శించడం కద్దు. ఇస్లాం వాదులకు, ఇస్లాం ఛాందసులకూ మధ్య కనిపించే పోలిక పై పైనేగాని, వాస్తవం కాదు. తేడా గమనించకుండానే సంస్కరణ వాదులు విమర్శిస్తున్నారు (లూయీస్ పుట 194 నోట్ 1, రైజ్ అండ్ స్లేవరి అండ్ ది మిడిల్ ఈస్ట్ 1990 న్యూయార్క్)
వాట్, డేనియల్, ఎస్పోజిటనో వంటి పండితులు నిష్పాక్షిక చారిత్రక వాదులు గాక, కేవలం క్షమాపణవాదులుగా ఉన్నారు. నిష్పాక్షికతను వాట్ నిరాకరించాడు. ముస్లిం భక్తుడు ఎలా సమర్థిస్తాడో అలాగే వాట్ కూడా. మహమ్మద్ ఆధ్వర్యాన 600 నుండి 900 యూదుల్ని చంపడాన్ని వెనకేసుకొచ్చాడని, నార్మిన్ స్టిల్ మన్ అన్నాడు. (పేజి. 16, ఫిలడెల్ఫియా) గ్రీక్ తత్వంతో అల్గజాలి తారసపడినప్పుడు, ఇస్లాం మత సిద్ధాంతం విజయవంతంగా బయటపడిందని వాట్ భావించాడు. (వాట్. ది ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అల్ ఘజాలి, లండన్ 1967 పేజి 15) మధ్య ప్రాచుర్యంలో సమస్యలకు క్రైస్తవ పరిష్కారం సూచిస్తూ ప్రొఫెసర్ లూయీస్ మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు చేయాలన్నాడు. (లూయీస్, పేజి 186, రైజ్ అండ్ స్లేవరి యిన్ ది మిడిల్ ఈస్ట్ 1990, న్యూయార్క్)
ఇటీవల ఒక బ్రిటిష్ యూనివర్సీటీ సౌదీ అరేబియా వత్తిడి వలన ఇస్లాం అధ్యయనం చెప్పే లెక్చరర్ను ఉద్యోగం నుండి తొలగించింది. అతడు ఇస్లాంను చెప్పే తీరు తమకు నచ్చలేదని సౌదీ పోషకులు అన్నారు. (ఈస్టర్ మన్ న్యూ జెరూసలేయ్య్ లండన్ 1992, పేజి 92-93)
అల్జీరియా నుండి బాగా చదువుకున్న ఒక ముస్లిం మిత్రుడు నా పుస్తకాలను చూస్తూ, రస్సెల్ రాసిన వై ఐ యామ్ నాట్ ఎ క్రిస్టియన్ పట్టుకున్నాడు. సంతోషంతో ఎగిరి గంతేశాడు. క్రైస్తవానికి రస్సెల్ గ్రంథం చావు దెబ్బగా భావించాడు. రస్సెల్ వాదనే ఇస్లాంకూ వర్తిస్తుందని అతడు గ్రహించలేదు. దేవుడు అనే చోట అల్లా అని పెడితే, మా మిత్రుడు గూటి నుండి బయట పడతాడా... నిషే రాసిన దానిలో దేవుడు బదులు అల్లా అని రాస్తే నా మిత్రుడు షాక్ తినడా ?
గాడ్ యీజ్ డెడ్ అన్నాడు నిషే. అక్కడ మార్చితే అల్లా మరణించాడు అవుతుంది.
పాశ్చాత్య లోకంలో వస్తున్న శాస్త్రీయ సామాజిక మేథా రంగపు పరిణామాల పట్ల ముస్లింలు ఉదాసీనంగా ఉండజాలరు. వాటి ప్రభావం అందరిపైనా ఉంది. నిషే ఫ్రాయిడ్, మార్క్స్, ఫ్యూయర్ బాహ్, హెన్నెల్, స్ట్రాస్, బాయర్, వ్రెడి, వెల్స్, రెనాన్ వంటి వారి భావాలు తాత్విక ఫలితాల నుండి ముస్లింలు దాగి ఉండజాలరు. ఇస్లాం విషయమై, మతం అద్భుతాల గురించి రాసింది. అన్వయించుకోవాలి. పాత, కొత్త బైబిల్ లో అబ్రహాం, ఇస్మాయిల్, ఇసాక్, జాకబ్, మోసెస్, డేవిడ్, జోనా, ఇనాక్, నోవా, జీసస్ ప్రస్తావనలు ఖురాన్ లో ఉన్నాయి. 19వ శతాబ్దిలో జర్మనీలో బైబిల్ పట్ల, మతం పట్ల నిశిత పరిశీలన సాగింది. బైబిల్ లో జోనా అనే వ్యక్తి ఎప్పుడూ లేడని, పెంటకాక్ ను మోసెస్ రాయలేదని బైబిల్ పండితులు చెబుతుంటే, అలాంటి పరిశీలన ఖురాన్ కు కూడా వర్తిస్తుంది.
పాశ్చాత్య శాస్త్రీయ ఆలోచనకు ఖురాన్ తట్టుకుంటుందా ? మానవుడు, సృష్టి గురించి డార్విన్ పరిణామ సిద్ధాంతం చావు దెబ్బ తీసిందిగదా, ఖురాన్, బైబిల్ కూడా ఆదాం, ఈవ్ ప్రస్తావన చేశాయి. శాస్త్రీయ పరిశీలన ఫలితాలు చాలామంది క్రైస్తవులు అంగీకరించి, సర్దుకుపోతున్నారు. బైబిల్ ప్రస్తావించిన పూర్వీకుల్ని అంటిపెట్టుకోవడం లేదు.
ముస్లింలు ఇంకా మొదటి అడుగు వేయాల్సి ఉంది.
------
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment