పైథాగరస్ మొట్టమొదట తత్త్వం పద ప్రయోగం చేశాడు. ప్లేటో దీనికొక ప్రత్యేక శాఖగా పెంపొందించాడు. వారికి ముందు తత్త్వం లేదని అర్థం కాదు. అప్పుడూ ఉండేది. మానవుడు ఆశ్చర్యంతో, భయంతో, జిజ్ఞాసతో సూర్యోదయం, అస్తమయం ఎందుకు జరుగుతాయనీ, మేఘాలెలా ఏర్పడతాయనీ, వర్షాలెలా కురుస్తాయనీ, వరదలూ, తుపానులు, పిడుగులూ, మెరుపులూ దైవాగ్రహానికి సూచనలూ అనీ, చావుబ్రతుకులు అన్వేషణ, ప్రశ్నించటం మొదలు పెట్టినప్పటి నుండీ తత్వం పుట్టింది.
తొలుత తత్త్వంలో అన్ని శాఖలూ ఉండేవి. 18వ శతాబ్దం వరకూ ఈ ధోరణి అమలులో ఉన్నది. ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వంలో అందరినీ తాత్వ్తికులని పిలిచారు. తత్త్వంగా ఒక ప్రత్యేక క్రమశిక్షణను తరువాత రూపొందించారు. జ్ఞానం అంతటినీ స్వీకరించి, అర్థాన్ని సమకూర్చి జీవితానికొక గమ్యం, ప్రయోజనం చేకూర్చడాన్ని తత్త్వం ఉద్దేశించింది. జ్ఞానంగాని, అనుభవంగానీ జడప్రాయంకాదు. అవి పెరుగుతూ విస్తరిస్తూ ఉంటాయి. తత్త్వం కూడా అలాగే పెంపొందుతుంది. కాలక్రమేణా మార్పుల కనుగుణంగా తత్త్వం సాగిపోతుంది. తత్త్వం కేవలం ప్రపంచాన్ని విడమరచి చెప్పటమేగాక, మార్చుకుంటూ పోవాలని మార్క్స్ అన్నాడు.
భారతదేశంలో తత్త్వాన్ని దర్శనం అంటున్నారు. ప్రత్యక్షంగా చూడటమని దీని అర్థం. దేనిని చూడటం అంటే, ఆత్మ రూపాన్ని వ్యక్తిగా, పరమాత్మగా చూడటమన్నారు. ఆవిధంగా తత్త్వం దేశంలో గాడి తప్పింది. బాహ్యప్రపంచాన్ని పరిశీలించకుండా, హేతు బద్ధంగా ఆలోచించకుండా, శాస్ర్తీయ పరిశోధనలను గమనించకుండా, మానవుడికీ మానవుడికీ సంబంధాలు చెప్పటం కష్టం. ప్రపంచమంతా తత్త్వానికి చెందినదని విల్ డ్యూ రాంట్ అన్నాడు. (Willdurant : The Pleasures of Philosophy, Page 11). విశ్వమంతా భ్రాంతి అనుకుంటే తత్త్వం విజ్ఞానం లేని తత్త్వం శక్తిహీనమైనదని విల్ డ్యూ రాంట్ అన్నాడు. భారతీయ త్తత్వం విజ్ఞానాన్ని దూరంగా పెడుతుంది. ఆత్మ ఒకటే, ప్రపంచం అంతా మాయ అంటుంది. కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, ఊపిరి బిగబట్టి ఇంద్రియాలను పనిచేయనివ్వకుండా, మనసును స్థంభింపచేస్తే, ఆత్మ పరమాత్మలను ప్రత్యక్షంగా చూడవచ్చునంటుంది. వివిధ వేదాంత దర్శనాలు చెప్పేది ఇదే. ఇది నైతిక పతనానికీ, మానసిక రుగ్మతలకూ దారితీస్తుంది.
భగవద్గీతను తత్త్వం అనే కంటే మత ప్రమాణంగా భావించాలని రాధాకృష్ణన్ రాశాడు. (The Bhagavadgeetha, London 1956) గీతలో ఉన్నతత్త్వం ద్వితీయ స్థానానికి చెందినట్లు అతడు సూచించాడు. వాస్తవానికి అలాంటిదేమీ లేదు.
సందేహించడం తత్త్వం కావచ్చు కాని, పిడివాదం కాదు. గీత ఏవిధంగా చూచినా తాత్త్వికం కాదు. అందులో పిడివాదాలూ నిండిపోయి ఉన్నాయి. అది మొండివాదాల నిఘంటువు, ఆధ్యాత్మిక విద్య, మాయ, మంత్రం, యుగధర్మం వంటి పిడివాదనలు అందులో కనిపిస్తాయి. గీత నమ్మకాల పుట్ట అని హాప్ కిన్స్ అన్నాడు. నిర్ధారణ లేని ధోరణి, దాటవేసే పద్ధతి గీతలో హాప్ కిన్స్ చూసాడు. (E.W. Hopkins, Madras, 1953).
అరుణ్ శౌరి ఈ విషయంలో హాప్ కిన్స్ అభిప్రాయాలతో ఏకీభవించాడు. (Arun Showrie : Hinduism, Essence and Consequence : 1979).
గీతా సంప్రదాయంలో మునిగితేలిన రాధాకృష్ణన్ అయోమయం మధ్య అర్ధాన్నీ క్రమత్వాన్నీ చూచాడు. మానవ స్వభావం అంతా సమన్వయీకరణగా గీతలో కనిపిస్తుందన్నారు. రుషికీ, ఆటవికుడికీ మధ్య తాత్త్వికుడు ఎక్కడ యి ముడుతాడో ఇంకా రాధాకృష్ణ చెప్పాలి. గీతలో భిన్న రీతుల్ని సమన్వయించిన తీరు మనకు చూపటానికి రాధాకృష్ణ ప్రయత్నించాడు.
డి.ఎస్.శర్మ గీతలో ఎలాంటి సమైక్యతా లేదన్నాడు. క్రమత్వం చూడలేమన్నాడు. కాని, గీతను దివ్య కవిత్వమయంగా చూచాడు. పర్వతాలూ, సముద్రాలూ, అడవులూ ఎలా క్రమం లేనివో, గీత కూడా అంతే అన్నాడు. అది మతం, తత్త్వం కాదనీ, కవితా గానం అనీ పేర్కొన్నాడు. వీరిరువురిలో మనం ఎవరిని స్వీకరించాలి.
గీత అనంత ప్రశ్నలకూ దారి తీస్తుంది. అందులో పిడివాదం అలాంటిది. ఈ విషయాలనే అరవిందశర్మ అనేక ప్రశ్నల రూపంగా చూపాడు. నిజమైన గీత ఏదో చూపగలరా. లేదు. ప్రధాన ప్రశ్నలను దాటవేసే తీరులో గీత పయనిస్తుంది. దేవుడు ఒకప్పుడు వ్యక్తిగతమనీ, మరొకప్పుడు కాదనీ అంటుంది. (అధ్యాయం 9-17, 18) దేవుడు బ్రహ్మపదార్థం అంటుంది. (14వ అధ్యాయం, 27) మానవుడిలో దేవుడికి ఆసక్తి ఉందా. లేక పట్టించుకోడా. అవును, కాదు అంటుంది. (అధ్యాయం 9-22, అధ్యాయం 11-32,33,34) ఒక క్షణంలో ప్రేమ, దయ, క్షమాభిక్ష చూపిన దేవుడు, మరుక్షణంలో పగసాధిస్తాడు. ప్రపంచం వాస్తవమా. అవును. (అధ్యాయం 7-4) కాదు. అదంతా భ్రమ. (అధ్యాయం 7-14) నీవేమి చేయాలో, చేయగూడదో వేదాలు నిర్ణయిస్తాయి. (అధ్యాయం 16-24) కాదు. నీవు వేదాధికారం నుండి స్వేచ్ఛగా పయనించాలి. (అధ్యాయం 2-45, 46) యజ్ఞాలు కావాలి. అవును. మరోచోట అవసరం లేదు. పూజలు చాలు అంటుంది. ఇలా అనంతంగా పరస్పర వైరుధ్యాలు సాగుతాయి.
గీతాభిమానులు ఈ వైరుధ్యాలను కేవలం పైకి కనిపించేవిగా భావించి వాస్తవం కాదని కొట్టిపారేస్తారు. వారంతా కావాలని కళ్ళు మూసుకుంటున్నారు. ఒకవైపు అహింసను పేర్కొంటూ మరొకవైపు యుద్ధాన్ని పురికొల్పారని డి.డి. కొశాంబి రాశాడు. (Myth and Reality, Bombay, 1962). ఇది కూడా పైకి కన్పించే విరుద్ధత్వమైనా. కె.టి. తెలాంగ్ గీతక్రమం లేని రచన అనీ, ఈ విషయంలో ఇది ప్రాచీన ఉపనిషత్తులకు పోలిందనీ అన్నారు. (K.T. Telang, The Bhagavad Geetha with the Sanastugatiya and Anugita Oxford, 1908).
అప్పుడప్పుడూ వేదాలూ, వేదక్రతువులపై గీతలో అన్న విసురులు చూపి మతంపై తిరుగుబాటుగా కొందరు చూపుతున్నారు. అసలు విషయమేమంటే ఎవరికేది కావాలో అది చెప్పి అందరినీ వలలో వేసుకోటమే గీత చేసిన పని. ఫ్రాంక్లిన్ ఎడ్గర్టన్ అదే రాశాడు.
కలగా పులగం అనేది గీతకు ప్రత్యేక లక్షణం. భిన్న ఆలోచనా స్రవంతులను సరిదిద్ది సమన్వయ పరుస్తున్నదని రాధాకృష్ణ అన్నాడు. అది అడ్డగోలుగా పయనించటమే. గతంలోనూ, నేడూ దేశంలో ఇదే జరుగుతున్నది. కలగా పులగంలో సమన్వయం లేదు. భిన్న ఆధారాలనుండి విభిన్న భావాలు స్వీకరించి ఒకే తీరులో సమన్వయీకరంచాలనటం కుదిరే పని కాదు. అది ద్వంద్వ మనస్తత్వానికీ, దోషపూరిత జీవితానికీ దారితీస్తుంది. భారతీయ చింతనాపరులు అలాంటి ఊబిలోనే పడ్డారు. గీతలోనూ ఆలక్షణాలున్నాయి. గీతకు నిర్దష్టత లేదు. తత్త్వం, మతం, నీతి సమాజశాస్త్రాలలో గీతస్థానం ఎక్కడా కచ్చితంగా నిలబడదు.
ఒక్క విషయం మాత్రం గీతలో నిర్ధిష్టంగా చెప్పవచ్చు. అదే లొంగుబాటు. మనసునూ, ఇచ్ఛనూ, స్వేచ్ఛనూ, అన్నిటినీ పూర్తిగా తనకు లొంగుబాటు చేయమని చెప్పటమే గీత సారాంశం. నేను పోరాడను అని చెప్పిన అర్జునుడు నీవు చెప్పినట్లే చేస్తానని ముగిస్తాడు. అందులోనే గీత సారాంశమున్నది. తిరుగుబాటు నుండి లొంగుబాటుకూ, స్వేచ్ఛ నుండి బానిసత్వానికి గీత దారిచూపింది.
మనిషి ఎందుకు లొంగుతాడు, లొంగకుండా ఉండటం ఎంత కష్టం అనే విషయాన్ని ఎరిక్ ఫ్రాం చక్కగా వివరించాడు. రాజ్యానికీ, మతానికీ, ప్రజాభిప్రా యానికీ లొంగి ఉంటే క్షేమం. ఎవరికి లొంగి ఉన్నామనేది ప్రధానం కాదు. ఒత్తిడిని ప్రయోగించే సంస్థ ఏదైనా సర్వశక్తి వంతంగా రూపొందుతుంది. అందులో భాగంగా లొంగిపోయిన వ్యక్తి తానూ శక్తివంతుడినే అనుకుంటాడు. తన కోసం నిర్ణయాలు చేసే సంస్థ బలీయమైనది. కనుక తానేమీ దోషం చేయలేదనుకొంటాడు. (Eric Fromm : See A Matter of Life, ed. By Clara Urquhart, Boston, 1963).
కృష్ణుడు తనను సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడుగా చెప్పుకొని అర్జునుడితో పాటు అందరినీ తనకు లొంగిపొమ్మన్నాడు. ప్రపంచ మత సాహిత్యంలో అంత ఆడంబరంగా గొప్పలు చెప్పుకున్న ధోరణి మరి ఎక్కడా కనిపించదు. తన శక్తిని శంకించిన వారినందరినీ ఖండించాడు. అలాంటి తత్త్వం అత్యున్నతమైందని మన నాయకులు పొగిడారు. మనదేశం శతాబ్దాలుగా లొంగిపోయిందంటే ఆశ్చర్యమేమున్నది. ఇరానియాన్లూ, గ్రీకులూ, బాక్టీరియన్లూ, కుషాణులూ, హుణులూ, శాక్యులూ, అరబ్బులూ, తురుష్కులూ, మొగలులూ, ఆఫ్ఘన్లూ, పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిషువారికి భారత జాతి లొంగిపోయింది. 1962లో చైనావారి తన్నులకు గురయింది. ఇదంతా లొంగుబాటు తత్త్వ సారాంశమే.
భారతదేశం ఏనాడైనా నిశిత పరిశీలనకు పూనుకుంటుందా. వివేచనతో ఆలోచిస్తుందా. మూఢనమ్మకాలూ, సంప్రదాయాలూ, పెత్తందారీ తనాన్ని ప్రశ్నిస్తుందా. గీతభజన చేస్తూ కృష్ణుడిని స్తుతించినంత కాలం ఇది జరగదు.
by Narla Venkateswararao Telugu by Innaiah Narisetti
1 comment:
నేను పోరాడను అని చెప్పిన అర్జునుడు నీవు చెప్పినట్లే చేస్తానని ముగిస్తాడు. అందులోనే గీత సారాంశమున్నది. తిరుగుబాటు నుండి లొంగుబాటుకూ, స్వేచ్ఛ నుండి బానిసత్వానికి గీత దారిచూపింది.
------
కత్తి ని పట్టుకుని ఊపుతూ ఆడుకుంటున్న చిన్న పిల్లవాడికి తల్లి అది తప్పు అని చెప్తే ఒప్పుకుని కత్తిని ఇచ్చేయటం కూడా స్వేచ్చని వొదులుకుని బానిస గా మారడమేనా?అక్కడ సన్నివేశం యేమిటి? యుధ్ధం మొదలయ్యాక తీరిగ్గా అన్ని అన్యాయాలు చేసిన వాళ్ళని పట్టుకుని వీళ్ళంతా నా చుట్టాలు, వీళ్ళని నేను చంపనని యేడ్చేవాడికి కొంచెం తిలివిగా అలోచించేలా చెయ్యటం. అదే తప్పైతే ఇప్పటి దాక స్వేచ్చగా ఉన్న్న మాలాంటి వాళ్ళు మీరు చెప్పేవి వింటే అదీ మేము మీకు బానిసలమైనట్టు కాదా?
Post a Comment