గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.-16సామాజిక శాస్ర్తం సమాజాన్ని అధ్యయనం చేసే విధానం. అది ఆత్మజ్ఞానం కాదు. భగవద్గీత-హిందూ సమాజ శాస్త్రం అనే పుస్తకాన్ని ఎమ్.కె. శ్రావణ్ రాశాడు. అందులో అట్టమీద తప్ప సమాజ విజ్ఞాన ప్రస్తావన లోపల ఎక్కడా లేదు. సుప్రసిద్ధ సమాజశాస్త్రజ్ఞుల పేర్లు తెలిసినట్లే లేవు. డర్క్ హైమ్, లాల్, బెంధామ్, కామ్టే, మిల్, స్పెన్స్ ర్, మార్క్స్, ఏంగెల్స్ గురించి విన్నట్లే లేదు. సమాజం, సమాజశాస్త్రం అతని పరిధిలోనే లేవు. కుల ప్రస్తావన మినహాయిస్తే, సమాజ విజ్ఞానాన్ని పట్టించుకున్నట్లే లేదు. ఆత్మ, బ్రహ్మ, ధర్మ, కుర్మ, మాయ, యోగ, వేదాంత-ఎంతసేపూ, అదే గొడవ. గీత భక్తి సారాంశమని రాశాడు. (M.K. Sravan : Bhagavadgeetha And The Hindu Sociology, Delhi, 1977) అలాంటప్పుడు గీతలో సమాజశాస్ర్తం వుంది అని ఎందుకు పేర్కొన్నట్లు?
ఒక పేజిలో చెప్పింది పక్క పేజీలో శ్రావణ్ మర్చిపోతున్నాడు. బీష్ముడూ, కృష్ణుడూ క్షత్రియులైనప్పటికి, బ్రాహణులు వారిని తమవర్గంగా, ఉపాధ్యాయలుగా భావించారు. మరోచోట యుధిష్టిరుడు బ్రాహ్మణుల పాదాలు కడిగినట్లు చెప్పాడు. కృష్ణుడు శాంతి సమయంలో వలె యుద్ధంలో కూడా నెమ్మదిగానే ఉండేవాడన్నాడు. రెండు పర్యాయాలు కురుక్షేత్రయుద్ధంలో కృష్ణుడు రధం దిగి భీష్ముణ్ణి ఎదుర్కోబోగా అర్జునుడు వారించిన విషయం మరిచిపోయినట్లున్నాడు. శ్రావణ్కు తెలియకపోయినా గీతకు సొంత సమాజశాస్త్రం ఉన్నది. గుణాన్నీ, పనిని బట్టి నాలుగు వర్ణాలూ నేనే సృష్టించానని చెప్పటంలోనే సారాంశం ఉన్నది. నాలుగు వర్ణాల బదులు నాలుగు కులాలని అల్లాడి మహాదేవశాస్త్రి తన అనువాద గ్రంధంలో రాశాడు. (Shankaracharya, The Bhagavadgeetha with the commentary, tr. by Alladi Mahadeva Sastry, 1979) జాన్ డేవిడ్ అనువాదం కూడా నాలుగు కులాల్నే సూచిస్తున్నది. కృష్ణుడు పేర్కొన్న నాల్గు విధాలైన సృష్టి నాలుగు కులాలకు చెందినది. హిందువు కులంలో పుడతాడు, అందులో నివశిస్తాడు, గతిస్తాడు. బ్రతికుండగా పాటించిన కులధర్మాన్ని బట్టే జన్మాంతరం కూడా ఆధారపడి ఉంటుంది. కులవిధానంలో పైకి పోయే అవకాశం లేదు. అదే, వర్గ సమాజంలో కూలివాడి కుమారుడు ఎంత పెద్ద స్థానానికైనా ఎదగవచ్చు.
కృష్ణుడు కులసమాజసృష్టికి తానే బాధ్యుడనని ఒప్పుకున్నాడు. గతజన్మల పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో కులనిర్ధారణ అవుతుంది. ఇలా చెప్పటంలో కృష్ణుడు మాటల గారడీ చూపాడు.
గీతా భాష్యకారులు కులం దైవసృష్టి, కనుక పవిత్రమయింది అంటున్నారు. దేవుడు స్థాపించిన సాంఘిక వ్యవస్థను కూలద్రోయటమే కులవిమర్శకుల పని అంటున్నారు. ఈ వ్యవస్థ హెచ్చుతగ్గులతో కూడినది. దేవుడు నామమాత్రంగానే ఈ విధానాన్ని సృష్టించినా, పూర్వజన్మల కర్మ ఫలితమే యిందుకు కారణం, మనిషి స్వాభావిక అభిరుచుల్నీ బట్టి కులాన్ని నిర్ధారించటం దేవుడి పని. పుట్టకముందే ఈ స్వభావం ఎలా తెలుస్తున్నదీ అంటే దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి గనుక, తల్లి గర్భంలోకి రాకముందే మానవుడి స్వభావాన్ని నిర్ణయిస్తాడు. కృష్ణుడు అర్జునుడిలో నీ గత జన్మలన్నీ నీకు తెలియవు గాని, నాకు తెలుసు అంటాడు.
కులవిధానంలో ఎలాంటి దోషాలున్నా క్షమించే గుణం, ప్రేమ, దయ భగవంతునికున్నాయి. ఈ విషయం శంకరాచార్యుడు చాలా తెలివిగా చెప్పాడు.
నాలో శరణుపొందే వారందరూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటారు. స్త్రీలూ, వైశ్యూలూ, శూద్రులూ పాపయోనికి పుట్టినప్పటికీ, నావలన విముక్తులవుతారు. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఒకపట్టాన విస్మరించటానికి వీలులేదు. శంకరా చార్యుడు అతి తెలివిగా దీనిని దాటవేశాడు. హిందూసమాజంలో 90 శాతానికి వర్తించే శ్లోకమిది. అందులో 50శాతం స్త్రీలకు చెందినది. వైశ్రులూ, శూద్రులూ కలిపి 40 శాతం ఉన్నారు. అంటరానివారి ప్రస్తావన గీతలో లేదు. వీరంతా పాపజన్ములేనా. పాపయోనికి పుట్టారనేమాటను శంకరాచార్యుడు కావాలని దాటేశాడు. పవిత్రబ్రాహ్మణులంతా, రాజర్షులంతా తనను ఆరాధిస్తారని కృష్ణుడు అన్నాడు. ఆయన దృష్టిలో ఆ కొద్దిమందే పవిత్రులు. తెల్లవారు కానివారంతా తక్కువవారని కిప్లింగ్ అన్నట్లే గీతకూడా చులకన భావం చూపిస్తున్నది.
జీవనరంగంలో ఉన్నతస్థాయికి చేరుకున్న రాజులూ, పురోహితులూ సంపదను అదుపులో పెడుతూ సుఖాలనుభవిస్తున్నారు. ఆత్మ, పరమాత్మల సమ్మేళనానికి ప్రయత్నిస్తూ లోకంలో గడుపుతున్నారు. అణగారిపోయిన ప్రజల ఆగ్రహానికి రాజులూ, బ్రాహ్మణులూ గురికాకుండా ఉండాలని యిలాంటి మాటలు చెప్పారు.
పాపయోని నుండి పుట్టినవారిలో స్త్రీలూ, వర్తకులూ, శ్రామికులూ ఉండటం, వీరు అత్యధిక సంఖ్యాకులు కావటం గమనిస్తే, గీతాప్రవచనం క్షమించరానిది అని చిన్మయానంద అన్నారు. దేవుడు చెప్పినా సరే అంగీకరించరాదన్నాడు. (Swami Chinmayananda Bhagavadgeetha, 1979, Madras Chapters : 7, 8, 9, Page : 158) ఐనా ఏమో కుంటిసాకులతో చిన్మయానంద తప్పుకుపోయాడు. రాధాకృష్ణ కూడా ఈ మాటలపై వ్యాఖ్యానిస్తూ నాటి కాల పరిస్థితులను బట్టి చూడాలేగాని, స్త్రీలనూ శూద్రులనూ వేదాలకు దూరం చేయాలనే ఉద్దేశ్యం లేదన్నాడు. గీత ప్రేమ సందేశం అందరికీ వర్తిస్తుందన్నారు. జాన్ డేవిడ్ కూడా ఇలాగే వ్యాఖ్యానించటం చూస్తే ఆశ్చర్యం వేసింది. జవహార్ లాల్ నెహ్రూకు చిన్నతనంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఎఫ్.టి. బ్రూక్స్ కూడా గీతను ఈ విషయంలో ఏదో విధంగా సమర్ధించాడు. కీన్ బోల్, ఎ,జె,బాన్, శకుంతలారావు, శాస్త్రి, అనిబిసెంట్, భగవాన్ దాస్, పరమానంద, వీరేశ్వరానంద, శివానంద, ఆర్ధర్ ఆస్ బోర్నో, జి.వి. కులకర్ణి, నిహాల్ చంద్ వైశ్, పి.లాల్ తమ గీతాభాష్యాలలో ఇంచుమించు శంకరాచార్యుని అనువాదాన్నే పాటించారు. మిగిలిన వారు చాలామంది పాపయోనికి పుట్టినవారిని గురించి అనువాదాన్ని తప్పించటమో, ఏదో ఒక విధంగా పక్కదారులలో పోవటమో చేశారు. శీతానాధ్ తత్త్వ భూషణ్ గూడా అలా చేయటం ఆశ్చర్యకరం. ఈ శ్లోకాన్ని చూచి కలవరపడిన దిలీప్ కుమార్ రాయ్ అసలే వదిలేసాడు. ఎడ్విన్ ఆర్నాల్డ్ సూక్ష్మంగా ఏదో చెప్పబోయాడు. ఎ.ఎస్.పి. అయ్యర్ బాధ్యతా రహితంగా ఈ శ్లోకాన్ని అనువదించి భాష్యం చెప్పాడు. పాపయోని అనటానికి బదులు పాపాత్ములైన స్త్రీలకు పుట్టినవారు అన్నాడు.
నీ కులధర్మం నుండి ఎన్నడూ తప్పుకోరాదని గీత బోధిస్తున్నది. కులవృత్తిలో అభిరుచి లేకపోయినా అంటిపెట్టుకోవాలంటున్నది. నీస్వభావాన్ని నిర్ణయించటంలో కృష్ణుడి కంటే నీకు ఎక్కువ తెలుసా అంటున్నది. స్వభావాన్ని బట్టి కులం వస్తున్నది గనుక, గత జన్మల చర్యలను బట్టి కులనిర్ధారణ జరుగుతున్నట్లు తెలుసుకోమంటున్నది. ఆకలితో అలమటిస్తుంటే అదీ గత జన్మల పాపఫలితమే అంటున్నది. కులవృత్తిని వదిలేసి సమాజానికి బాగా సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది ఉపద్రవానికే దారితీస్తుందంటున్నారు. ఎలాంటి ఉపద్రవం రానున్నదో తెలుసుకునే శక్తి నీకులేదంటున్నది. కనుక మూర్ఖమార్గాలను అవలంబించవద్దంటున్నది. శంకరాచార్యుడు చిన్నరకం భగవంతుడు గనుక, ఈ ఉపద్రవం నరకానికి పోవటమేనని చెప్పాడు.
పాండిచేరీ ఆశ్రమంలో సంపన్నుల ఆదరణ పొందిన అరవిందుడు గీతపై మరొక విధంగా వ్యాఖ్యానం చేశాడు. గీత ప్రకారం ఎత్తులు, తమశక్తియుక్తులు గమనించకుండా వృత్తిని పాటించాలని అనటం లేదన్నాడు. (Sri Aurobindo : Essays on the Geetha) భారతదేశ స్వేచ్ఛా పురోగతిని అడ్డుకున్న వాళ్ళలో ఈ పాండిచేరి ఆశ్రమవాసి కూడా ఒకడు.

గీత కులాన్ని ఎలుగెత్తి చాటుతున్నది. అర్జునుడు వాపోవటంలో కుల కారణాలున్నాయి. యుద్ధ విపత్తు వలన అక్రమం పెరిగి, స్త్రీలు అవినీతిపరులై, కుల విధానంలో గందరగోళం వస్తుందన్నాడు. కులనియమాలు, కుటుంబం నాశనమవు తుందన్నాడు. తమవారిని చంపటం కంటే కులం ధ్వంసం కావటం విచారకరంగా అర్జునుడు భావించాడు. గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.
By late V R Narla Telugu : Innaiah Narisetti

No comments:

Post a Comment