గీత ఎవరు రాశారు?--11--serial Truth about Gitaమనకు తేదీలు లేని చరిత్ర ఉన్నట్లే, పేరు లేని రచయితలున్నారు. అలాంటి వారే గీతను రచించారు. గీత మాట్లాడిందీ కాదు, ఆలాపించిందీ కాదు. కేవలం రాశిందే. అందుకు గీతలోనే ఆధారాలున్నాయి. ఈ పవిత్ర సంబాషణను ఎవరు చదివినా-అంటూ కృష్ణుడు చెప్పటమే అందుకు ఆధారం. (18వ అధ్యాయం, 70వ శ్లోకం) తాము చెపుతున్న తాత్త్వికవచనాల్ని సంజయుడు వింటున్నాడని కృష్ణుడికి తెలియదు. వ్యాసుడు తన ఇంద్రియాతీత శక్తులతో సంభాషణంతా పొందుపరుస్తూన్నాడని తెలుసా. దేవుడు గనుక వాటన్నిటినీ గ్రహించాడా. కురుక్షేత్రంలో అర్జునుడు కుప్పగూలిపోతాడనీ, అతన్ని ప్రోత్సహించి పోరాడమని చెప్పవలసి వస్తుందనీ కృష్ణుడికి ముందే తెలుసా. ఇది కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకటం వంటిది కాదు. రాసిన దాన్నే చదవగలరు. అనూహ్యపరిణామంపై అప్పటికప్పుడు మాట్లాడిన దానిని చదవలేదు. అర్జునుడితో తన సంభాషణను పవిత్రం అనటం సరైనాదేనా. సుక్తాంకర్ దృష్టిలో మన ప్రమాణాలను దేవుళ్ళకు అంటగట్టకూడదు. గీతను భిన్న సమయాలలో విభిన్న వ్యక్తులు రాశారు. కృష్ణుడి జీవితాన్నీ, కాలాన్నీ మహాభారతం, పురాణాల దృష్య్టా చూచినప్పుడు అతడు గీతా రచయితకాదని తేలిపోతుంది. భాగవతంలో బాల్యచేష్టల పిల్లవాడు తాత్త్వికుడు కాలేడు. మహాభారతంలోని జిత్తులమారి తాత్త్వికుడు కాలేడు. నేను కృష్ణభక్తుడిగా కాక ఆలోచనా జీవిగా చూస్తున్నాను. భక్తుడైతే పారవశ్యంతో మనసు కుంచింప చేసుకుంటాడు. పూనకం ఎక్కువైన కొలదీ దేవుడికి సన్నిహితుడుగా భావిస్తాడు. కృష్ణుడు మెకవెల్లి అవుతాడేమొగాని సోక్రటీస్ కాలేదు. తాత్వికుడి స్వభావం అతడికి లేదు.
కృష్ణుడు గీత రచయిత కాదనడానికి కొన్ని కారణాలున్నాయి. అంగీరసుడు శిష్యుడని ఆదిశంకరాచార్యుడు చేసిన ప్రచారం కృష్ణుణ్ణి గురించి కేవలం కల్పితగాధే. పురాణాలను బట్టి వారణాసి వద్ద అవంతిపూర్లో సందీపుని వద్ద కొద్దికాలం కృష్ణుడు ఉన్నాడు. ఉత్తరోత్తరా అతడికి చదివే అవకాశమే లేదు. అమ్మాయిల మీదున్న ఆసక్తి అధ్యయనంపై లేదు. వేదవేదాంగాల జిజ్ఞాసి అని భీష్ముడు చెప్పిన మాటలను అంతగా పట్టించుకోనక్కరలేదు. యుధిష్టిరుడు రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలం భీష్ముడికి యివ్వవలసింది. అందుకు మారుగా ఆ గౌరవం ఎవరికి దక్కాలో చెప్పమని భీష్ముడినే అడిగాడు. రాజుపేరు చెపితే చిక్కువస్తుందని అతడు కృష్ణుడి పేరు చెప్పాడు. భీష్ముడి అనౌచిత్యాన్ని శిశుపాలుడు ప్రశ్నించాడు. కృష్ణుడిని అజ్ఞాని అన్నాడు. కృష్ణుణ్ణి సమర్ధించటం విజ్ఞాననిధిగా, భీష్ముణ్ణి పొగిడాడు. అంతమాత్రన అతడే గీతా కారుడంటానికి వీలులేదు. కృష్ణుడు మిధ్యకాదనీ, కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ అనుకొందాం.
యుద్ధ సమయంలో కృష్ణుడి వయసెంత? ద్రౌపదీ స్వయంవరంలో అతడి వయసు 64. అర్జునుడు సుభద్రను పెళ్ళాడినప్పుడు కృష్ణుని వయసు 80. కురుక్షేత్ర యుద్ధం నాటికి 94 ఏళ్ళు అన్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు. సి.వి. వైద్య అంచనా ప్రకారం క్రీ.పూ. 3185లో కృష్ణుడు పుడితే మహాభారత యుద్ధం నాటికి 84 ఏళ్ళుండాలన్నాడు. యుద్ధంలో పాల్గొనటానికి అది సరైన వయసు కాదు. ఐతే దక్షిణాఫ్రికాలో బ్రిటిషు సైన్యాల అధిపతిగా లార్డ్ రాబర్ట్స్ ఉన్నట్లు ఫీల్డ్ మార్షల్ చెప్పారు. కనుక 84 ఏళ్ళపుడు కృష్ణుడు రథసారధి కావటంలో తప్పులేదన్నాడు. ఆధునిక యుద్ధాలకూ, ప్రాచీన యుద్ధాలకూ తేడా అతను గమనించినట్లు లేదు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు తప్ప రథసారధులందరూ చనిపోయారు. కాని కృష్ణుడికి యుద్ధ నియమాలేవీ సోకినట్టు లేదు అని హాప్ కిన్స్ రాశాడు. (E.W. Hopkins, The Social And Military Position of the Ruling Caste in Ancient India, 1972, Varanasi)
కృష్ణుడు రథసారధిగా వృధ్యాప్యంలో పనిచేయటం, అప్పుడే గీతాలాపన చేయటం అసంబద్ధమైన విషయాలు. శీతానాధ్ తత్త్వభూషణ్ అదే విషయాన్ని చెపుతూ క్రీ.పూ. 12వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి గీతను చెప్పి ఉండడని అభిప్రాయ పడ్డాడు. (Krishna Ad the Geetha) గీతను బయట నుంచి ప్రవేశ పెట్టినట్లు 1863లో వెబర్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక అది కలగా పులగమైన రచన అన్నాడు. (Quest for the Original Geetha, Quoted by G.S. Khair, 1969 Bombay) 1877లో మోనియర్ విలియమ్స్ రాస్తూ గీత ఒక ఆణిముత్యమనీ, ఐతే అది మహాభారతంలో చొప్పించారనీ అన్నాడు. బహుశ బ్రాహ్మణుడో, వైష్ణవుడో, తాత్త్వికుడో ఈ పని చేసి ఉండవచ్చునని అన్నాడు. ఆ తాత్త్వికుడు కృష్ణుడు మాత్రం కాదు. గీతను ఒకవైపున పొగుడుతూనే అందులో అసంబద్ధాలున్నా యన్నాడు. (E.W. Hopkins, Religions of India)
రిచర్డ్ గార్బ్ జర్మనీలో గీతను గురించి రాశాడు. దీనిని కె.ఎస్. ఉపాధ్యాయ ఉదహరించాడు. తొలుత గీత సాంఖ్య సారాంశమనీ, ఉత్తరోత్తరా ఓ వేదాంతి దీనిని విస్తరించి ఉండవచ్చుననీ అన్నాడు. గార్బ్ ఉద్దేశంలో తొలిగీతలో 528 శ్లోకాలున్నాయి. (K.N. Upadhaya : Early Buddhisnm And Bhagavat Geetha)
రుడాల్ఫ్ ఓటో గీతపై తన సిద్ధాంతాలను ప్రకటించాడు. తొలిగీతలో 28 శ్లోకాలే ఉన్నాయంటాడు. తరువాత నెమ్మదిగా చేర్చుకుంటూ వచ్చారంటాడు. (Rudolf Otto : The Original Geetha, London 1936)
గీతాకారుడెవరో మనకెంత తెలుసో ఓటోకి అంతే తెలుసు. అది రాసింది మతకర్త కాదనీ, గొప్ప కవిమాత్రమే అలా సృష్టించగలడనీ అన్నారు.
మహాభారతం కంటే గీత ముందు రాశారనీ, తరువాత 80 శ్లోకాలలో మహాభారతం ప్రస్తావన తెచ్చారనీ ఎస్.సి. రాయ్ అన్నారు. బౌద్ధం కంటె ముందే గీత ఉన్నదని అన్నారు. (The Bhagavat Geetha And Modern Scholarship, Quoted by B. Majundar Krishna in History)
సురేంద్రనాథ్ దాస్ గుప్త బౌద్ధానికి ముందే స్వతంత్ర గ్రంథంగా గీత ఉన్నదనీ, దాన్ని మహాభారతంలోకి తెచ్చారనీ, గీతకున్న పవిత్రత దృష్ట్యా అలా చేశారన్నాడు.
గీతపై పరిశోధించిన ఫ్రాంక్లిన్ ఎడ్గర్ టన్ గీతను సమైక్య రచనగా పేర్కొన్నాడు. భారతంలో ఇది భాగం కాదనీ, తరువాతనే దీన్ని ప్రవేశపెట్టారన్నాడు. గీతను ప్రార్థనా గ్రంథంగా వాడిన గజానన్ శ్రీపతిఖేర్ 26 శతాబ్దాల క్రితం జరిగిన గీతారచన ఇంకా భారతీయుల్లో ప్రతిధ్వనిస్తుందన్నారు. భౌతికవాదానికి దూరంగా, ఆధ్యాత్మిక వాదానికి చేరువగా ఉంచుతుందన్నారు. భగవాన్ కృష్ణుడు గీతను రాయలేదనీ, యుద్ధరంగంలో గద్యంలో జరిగిన సంభాషణంతా తరువాత గీతగా శ్లోకాలలో మలచి జొప్పించారనీ అన్నాడు. మొత్తం ముగ్గురు రచయితలు గీతను పూర్తి చేశారన్నాడు. (G.S. Krishna : Quest for the Original Geetha, Bombay 1969)
ఈ విధంగా చూస్తే గీత రచనల గురించి అనంతంగా చర్చ సాగుతుంది. అందులో ఆలోచనా సమైక్యతే ఉంటే, క్రమబద్ధమైన తత్త్వమే ఉంటే, ఇంత గందరగోళం వచ్చేది కాదు. మహాభారతం ఎంతకలగా పులగమే, గీత కూడా అంతే అని వింటర్ నిజ అన్నాడు.
by V R Narla Telugu: Innaiah Narisetti

No comments:

Post a Comment