పవిత్ర గ్రంధంగా గీత-13-Truth about Gita




గీత వేదమూకాదు, వేదాంగమూ కాదు. దీనికి పవిత్రత తరువాత ఎప్పుడో గాని రాలేదు. ఆది శంకరాచార్యుడికి ముందు గీతను ఎవరూ తీవ్రంగా పట్టించుకోలేదు. గ్రంధంలో అంతర్గత ప్రతిభను బట్టిగాక శంకరాచార్యుడు తన కుల, శాఖ ఆసక్తుల దృష్ట్యా శ్రద్ధ వహించారు. వాదంలో అతడు దిట్ట. ఇబ్బందికరమైన మాటలను తనకనుకూలంగా మార్చేశాడు. ఎదుటివారి వాదనలను వారికిబ్బందికరంగా పరిణమించేటట్లు చేసేవాడు. జుగుప్సాకరమైన స్థితిని సానుకూలం చేసుకునేవాడు. నిస్సందేహంగా అతడు ప్రతిభావంతుడు. పాతేయటానికి వీలుగా సమాజాన్ని నిర్మించటంలో అందె వేసినచేయి. శంకరుడు ఆలోచనారంగంలో నాయకత్వం చేపట్టిన తరువాత భారతదేశం వాడిపోయింది. క్రీస్తు తరువాత ఎనిమిదివ శతాబ్దం నుండి శంకరుడి అనంతరం జాతిపతనమయింది. అతడి తరువాత సాహిత్య సృష్టి, విజ్ఞానం వట్టిబోయాయి. శంకరాచార్యుడు గీతను తవ్వితీశాడు. మెరుగుపెట్టాడు. శంకరాచార్యుడి అనంతరం గీతకు అధిపత్యం లభించిందని ఎస్.కె. బెల్వాల్కర్ అన్నాడు. (The Cultural Heritage of India, 1969).
కాలాది ఆచార్యుడు మార్గం చూపిన తరువాత రామానుజుడు, మధ్వుడు, వల్లభుడు గీతను తమ ప్రయోగాలకు వాడుకున్నారు. పతంజలి కాలంలో హిందూమతాన్ని మొదటిసారి తిరగదోడగా దక్షిణాది నుండి వచ్చిన 4 గురు ఆచార్యులూ రెండవసారి తిరగదోడారు. శంకరుడు కేరళనుండీ, రామానుజుడు తమిళనాడు నుండీ, మధ్వుడు కర్నాటక నుండి వల్లభుడు ఆంధ్రనుండి వచ్చారు. ఈ నలుగురూ దేశంలో అంధకారయుగానికి నిర్మాతలయ్యారు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకూ ఆదశ కొనసాగింది. స్వాతంత్ర్యానంతరం వారి ప్రభావం పూర్తిగా పోలేదు.
ఆచార్యులు 4గురూ గీతను తమకనుకూలంగా వాడుకున్నారు. అద్వైత గ్రంథంగా శంకరుడూ, విశిష్టాద్వైత రచనగా రామానుజుడూ, ద్వైతంగా మాధ్వుడు, శుద్ధ అద్వైతంగా వల్లభుడూ వాడుకున్నారు. ఈ ఆచార్యుల బాణీలో గీతకు భాష్యాలొచ్చాయి. భాష్యాలపై భాష్యాలొచ్చాయి. చెప్పిందే చెప్పటం హిందూ మతరచనల్లో అనుచానంగా వస్తున్నది. ఆలోచనారాహిత్యానికి అది నిదర్శనం. ఈ భాష్యాలను గురించి తెలుసుకోవాలంటే సురేంద్రనాధ్ దాస్ గుప్త రాసిన భారత తత్త్వ చరిత్ర చూడవచ్చు. అతడి జాబితాలో కూడా ప్రాంతీయ భాషలలో వచ్చిన పుస్తకాలు లేవు. మరాఠీలో జ్ఞానేశ్వరి ప్రస్తావన లేదు. తెలుగులో తిక్కన గీతపై ఉన్నతాభిప్రాయాన్ని వెల్లడించలేదు. భీష్మపర్వంలో కేవలం 35 పద్యాలతో సరిపెట్టి, 700 గీతాశ్లోకాలను కుదించివేశాడు.
అందరూ తిక్కనలు కారు. గీతానువాదాలు నిరంతరంగా వెలువడ్డాయి. వివిధ భాషలలో వచ్చాయి. 1785లో గీత ఇంగ్లీషు అనువాదం వెలువడింది. ఛార్లెస్ విల్ కిన్స్ ఇంగ్లీషు అనువాదాన్ని బాగా ప్రచారంలో పెట్టాడు. కంపెనీ పాలకులు దీనికి రాజపోషణ చేశారు.
గీత ఫ్రెంచి అనువాదం 1787లో వెలువడింది. ఎం.పరాద్ అనువదించాడు. ఐనా, జనంలో గీతాప్రభావం కనిపించలేదు. ఎడ్విన్ ఆర్నాల్డ్ చేసిన స్వేచ్ఛానువాదం గీతకు చాలా ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. దీనికి (The Song Celestial) పేరు పెట్టాడు.
హెన్రీ డేవిడ్ ధోరో గీత అనువాదాలలో ఏది చదివాడో తెలియదుగాని, గీతాస్నానం రోజూ చేస్తానని అన్నాడు. దాని ముందు ప్రపంచ సాహిత్యం అంతా మరుగుజ్జు వంటిదన్నాడు. రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ గూడా భగవద్గీతను ఆకాశానికెత్తాడు. ఆవిధంగా గీత విదేశాల్లో కూడా ప్రభావాన్ని కనబరిచింది. అనువాదాలూ, భాష్యాలూ, సిద్ధాంతాలూ, స్తుతి పాఠాలూ వస్తూనే వున్నాయి.
గీతను రబ్బరువలె సాగదీసి చెప్పటానికి వీలుగా సంస్కృత భాషవాడారు. గాంధీకి, గాడ్సేకి గూడా గీత పవిత్రగ్రంధమే. ఎటుబడితే అటు వ్యాఖ్యానించటానికి వీలుగా గీత ఉన్నది. సంస్కృతంలో పదాలకు నానా ఆర్ధాలూ, భిన్న అర్ధాలూ ఉండటమే అందుకు కారణం. శ్రీ అనే పదానికి సంపద మొదలు విషం వరకు 20 అర్థాలున్నవి. అలాగే ధర్మం అనే పదానికి మతం మొదలు విల్లంబువరకు 23 అర్థాలున్నాయి. దీని సంయుక్త పదాలు 150 వరకూ ఉన్నవి. వాటిలో మళ్ళీ అనేక ఛాయాబేధాలున్నాయి. గీతలో వచ్చే ధర్మం, ఖర్మం, యోగం ఎన్నో విధాల చిత్రించే అవకాశం ఉన్నది. పురోహిత భాషలన్నింటికీ యీ లక్షణాలున్నాయి. అందులో సంస్కృతానికి ఇంకా ఆధిక్యాలున్నవి. ఈ విషయాన్ని డి.డి. కోశాంబి బాగా వివరించాడు.
గీత ఇంగ్లీషు తెలుగు అనువాదాలు, భాష్యాలతో నాకలాంటి అనుభవం ఉన్నది. దాదాపు 40 ఇంగ్లీషు అనువాదాలూ, 6 తెలుగు అనువాదాలూ నా సేకరణలో ఉన్నాయి. వీటిలో శంకరుడూ, రామానుజుడూ, మధ్వుడు, శ్రీధరుడూ, విల్ కిన్స్, డేవిస్, ఆర్నాల్డ్, తెలాంగ్, బిసెంట్, రాధాకృష్ణన్, ప్రభుపాద, మహేష్ యోగి, చిన్మయానంద, అరవిందో జహనీర్ వంటి వారున్నారు. చదువుతూ పోతే గందరగోళం కూడా పెరుగుతూ పోతుంది.
గీత పేరిట జరిగిన గ్రంధచౌర్యాలను ఉపాధ్యాయ వివరించాడు. ప్రధాన భావాలనేగాక, అనేక భాగాలను ఉపనిషత్తులనుండి గీత స్వీకరించింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ చాలా మర్యాదగా పేర్కొన్నాడు. (Early Buddhism and the Bhagavad Geetha) ఉపనిషత్తులనుండి యథాతధంగా స్వీకరించినవి 22 చూపారు. ఇతర చోట్ల నుండి అరువు తెచ్చుకున్న భావాలు 13 వరకు చూపాడు. గీతభక్తులు శ్లాఘించే విషయాలలో ఉపనిషత్తుల నుండి కాపీ కొట్టేసినవి 7 చూపాడు. అందుకే కాబోలు గీతను ఉపనిషత్తుల సారాంశం అంటారు. అన్ని మతగ్రంధాలూ, యిలాంటి పనులు చేశాయి. గ్రంధ చౌర్యంలో గీతకు ప్రధమ బహుమతి లభించాలి.
by late Narla Venkateswararao Telugu: Innaiah Narisetti

2 comments:

voleti said...

రావణుడు రామునికి శత్రువు అయినప్పటికీ అతని పేరుని ఎక్కువ సార్లు పలకడం వలన మోక్షానికి అర్హుడు అయ్యాడు.. హిందూ వ్యతిరేక భావాలు, హిందూ దేవుళ్ళ మీద అక్కసుగా అయినా చాలా కష్ట పడుతున్నందుకు రావణునికి పట్టిన గతే పడుతుంది..

Viswahith said...

Nonsense. It is nothing but religious fundamentalism.

Post a Comment