న్యాయశాస్త్రం పదింట తొమ్మిది పాళ్ళు సొంతానికి ప్రాధాన్యతనిస్తుంది. మానవుడు ఏర్పరచిన ఈ న్యాయశాస్త్రం దైవ నియమాలకు ఎప్పుడూ విరుద్ధంగావటానికి కారణం ఏమిటా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. దొంగతనం కూడా హింసే. అదొక చిన్న తరహా దోపిడి కాని చిత్రమేమిటంటే ఇంకొక అడుగు అవతలకు వేసి చూస్తే నలుపు తెలుపుపై కూర్చుంటుంది. దండయాత్ర పెద్ద ఎత్తున జరిగే దోపిడి. కాని దండయాత్రను ఎవరూ అవినీతి గానూ, న్యాయశాస్త్ర దృష్ట్యా శిక్షార్హంగానూ చూడటంలేదు. ఆక్రమణకు బలిఅయినందున ఈనాడు భారతీయులు దురాక్రమణను నిరసిస్తున్నారు. ఈ సందర్భంలో వారికి నీతి ప్రవచనం నచ్చేటట్లు లేదు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు మొదలైన వారిని హిందువులు ఆదర్శ ప్రాయంగా ఎంచి పూజిస్తున్నంతవరకూ హిందూ జీవకారుణ్యంలో అహింస యిమిడి వున్నదంటే కాస్త జ్ఞానం కలవాళ్లెవరూ నమ్మరు. ఈ పురాణ వీరులు యింతగా పొగడబడటానికి కారణం వారి దండయాత్రలు, టోకుగా చేసిన హింసాకాండలే. ఒక జాతి మరో జాతిమీద పెత్తనం చలాయించటాన్ని గర్హిస్తున్న ఈ భారతీయులే. తమ పూర్వుల గొప్పతనాన్ని వారు ఒకప్పుడు సముద్రాలు దాటి విదేశాలలో ఎట్లా పెత్తనం చేస్తారో చెప్పటం పరిపాటి అయింది. దొంగతనం చిన్న దండయాత్ర గనుక హింసాత్మకం అవుతుంది కాని ఆ హింసవల్లనే అది గౌరవప్రదం, గర్వకారణం అవుతుంది. దొంగిలించగల నైతిక సాహసం అందరికీ వుంటే ప్రపంచంలో దొంగలే వుండరు.
మళ్ళీ విషయానికొద్దాం. నాలో కలిగే మొదటి ప్రేరణ ప్రకారం నా స్వభావానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తే నా ఆకలి సులభంగా తీరుతుంది – కనుక పరిస్థితుల యెడల నాకు కలిగే అభిప్రాయాలు సరైనవేనని ఆ ప్రవర్తన రుజువు చేస్తోంది. నేను మరోవిధంగా ప్రవర్తించి, యజమాని అనుమతికోరితే ఏం జరిగివుండేదో చూద్దాం. మొదటి చిక్కు మానవులు నన్ను అర్థం చేసుకోలేకపోవటం నేను ‘మ్యావ్, మ్యావ్’ అనగానే నా సమస్యేమిటో తెలిసికోవటానికి ప్రయత్నించకుండానే నన్ను బయటకు తోలేస్తారు. జంతువులకు కూడా ఆకలి వేస్తుందని, ఎలాగో అవి తమ ఆకలి తీర్చుకోవాలని ఆలోచించే ఓపిక వారికుండదు. మనిషి కూడా తనలోని ప్రేరణ వల్లనే అలా ప్రవర్తిస్తాడు. కాని అది నాలోని ప్రేరణలా సహజమైందికాదు. అది అలవాటుకు లొంగినది. తన పాలగిన్నె నాకందకుండా కాపాడుకునేందుకు అప్రయత్నంగా జాగ్రత్త పడతాడు. మనిషి పాలగిన్నెతో సహా పుట్టలేదు. అది అతని శరీరంలో ఒక భాగం కాదు. నా ఆకలి, కోరిక శారీరకమైనవి. ఆకలి దేవుడిచ్చినది. మీలో దైవభక్తి వుంటే, విశ్వసృష్టికి ప్రయోజనం వుందనుకుంటే, మీరీ విషయం కాదనలేరు. అలా త్రోసిపుచ్చితే మీ నమ్మకాన్ని, తత్వాన్ని వ్యతిరేకించినట్లే శారీరక ప్రేరణలన్నీ దేవుడిచ్చినవే. అందుకు భిన్నంగా ఆస్తి మాత్రం మానవుడు స్వయంగా దక్కించుకున్నది. పాలగిన్నెకూ, నాకు గల సంబంధం దైవశాసనం దాన్ని అనుభవించేవారిని నిర్ణయించేది మానవ నిర్మిత న్యాయశాస్త్రం. ఇది భగవదాదేశాన్ని అనుసరించకుండా అడ్డు తగులుతున్న కృత్రిమ ఆటంకం.
మొదటి మాట – ఆ పాలు ఒక ఆవువి. న్యాయంగా అవి దాని దూడకు చెందాలి. కాని దూడను కాదని మనిషి వాటిని స్వాధీనపరచుకున్నాడు. ఆవు మాతృహృదయాన్ని గాయపరచి, దూడకడుపు మాడ్చి పాలమీద ఆధిపత్యాన్ని మానవుడు సాధించాడు. మూడో విషయం ఏమంటే ప్రస్తుతం ఆ పాలతో అతనికి పనిలేదు. ఇలాంటి కొన్ని కారణాలవల్ల పాలగిన్నె నాకందకుండా ఆ మనిషి దాచుకోటంకన్నా, నేను పాలను దొంగిలించటంలోనే ఎక్కువ న్యాయం కనబడుతుంది. (నేను చేసే పనిని వ్యక్తం చేయటానికి ఇంతకంటే సరైన మాట దొరక్క సరియైనది కాదని తెలిసీ ఈ మాట వాడుతున్నాను.)
చాలా తెలివిగలవాళ్ళే అయినా, మానవుల్లో, చాలామంది పరిస్థితిని ఈ విధంగా సరైన దృష్టితో చూడరు. మాటల మాయలో పడ్డారు. వస్తువుల పేర్లను, ఉద్రేకాలను, సంబంధాలను, భావాలను వ్యక్తీకరించటానికి ఆదిలో మాటలు పుట్టాయి. కాలక్రమేణ మాటలు సూచిస్తున్న వాటితో నిమిత్తం లేకుండా స్వాతంత్ర్యం సంపాయించుకున్నాయి. ఈ శూన్య శబ్దాలతో తయారైన వలలో మానవ మేథస్సూ చిక్కుపడ్డది.
భాషా విషయపు చర్చ చాలా ముఖ్యమైంది. ఉత్సాహవంతమైంది. కనుక దీన్ని నేను మరికొంత పొడిగించటానికి క్షమాపణ కోరనక్కరలేదు. మనోభావాలను, ఉద్రేకాలను వ్యక్తం చేయటానికి కాకుండా వాటిని, కప్పిపుచ్చటానికి ఎక్కువగా భాష పూర్వం వాడబడింది. ఇప్పుడూ అంతే.
ఉచ్ఛ ప్రాణులన్నింటికి కామవాంఛ చాలా ప్రధాన లక్షణం. భాష పుణ్యమా అంటూ దానికో మాట – ప్రేమ తగిలించారు. క్రమంగా ఈ ప్రేమ అనేకమైన వూహాకల్పిత భావాలను నిర్దేశించటం మొదలుపెట్టింది. దాని నిజమైన అర్థం కపటంలోను అసత్యంలోనూ మరుగుపడిపోయింది. ప్రేమ అంటే ఒక ఆధ్యాత్మిక మనోభావం అని వ్యాఖ్యానించేదాకా వెళ్ళింది వెర్రి. ఆధ్యాత్మికతను కామ వికారానికి ముడిపెట్టటం దాన్ని మలినపరచటమే. ఎన్ని నీతులు వల్లించినా మానవుడు తన నీడనుండి ఎప్పుడూ తప్పించుకోలేడు. ఆడయినా, మగయినా జీవిత ప్రధాన నియమాలలో ప్రేరణ ఒకటి. దాన్ని తృప్తి పరచాలి. నిజానికి శారీరక నియమం పాటించబడుతున్నది. జీవసృష్టి సాగుతూనే ఉంది. కాని, ఇది కుటిలంగా జరుగుతోంది. మనిషి తనను చూసి తానే సిగ్గుపడుతున్నాడు.
మూలం తెలుగు సేత
ఎమ్.ఎన్.రాయ్ వెనిగళ్ళ కోమల
No comments:
Post a Comment