కామ్రేడ్ ఎం.ఎన్.రాయిగారి జీవిత చరిత్ర-rare article




6 అడుగులు, 2 అంగుళముల పొడుగు, బలిష్ఠమయిన శరీరము, విశాలమయిన వక్షము, కార్మికుల సేవయందు కష్టములకోర్చి దేశాటనము  చేసిన గుర్తులింకను  మాయని ముఖవర్చస్సు రాయిగారు రూపవంతు డనిపింపకున్నను అసామాన్య ప్రజ్ఞాశాలియనియు ఎట్టి కష్టములకైన జంకని ధీరుడనియు చెప్పకయే చెప్పుచుండును. వీరి వయస్సు 44 సంవత్సరములు.
రాయిని నేను మొదట చూచినది ఫయిజ్ పూర్. కాంగ్రెసునందు కార్మికజనానికి సంబంధించి నేనడిగిన ఒకటిరెండు క్లిష్టమయిన ప్రశ్నలకు నేను వెంటనే అతడొసంగిన జవాబులే అతడు ప్రతిభావంతుడని నాకు స్ఫురింపజేసినవి. అందువల్లనే అమెరికా, యూరోపు, ఆసియాఖండములందలి విప్లవోద్యములలో అతనికి అంతట జోక్యం కలిగియుండుటకు కారణము.
మానవేంద్రనాథ్ రాయ్ అనుపేరు అతనికి పుట్టుకతో వచ్చినది కాదు. బెంగాలు రాష్ట్రమందలి మిడ్నపూర్ జిల్లాలోని ఒకానొక పల్లెటూరు అతని జన్మస్థానము. బ్రాహ్మణ కులము. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నప్పటిపేరు నరేంద్రనాథ భట్టాచార్య. 13 సంవత్సరముల వయస్సునందే బెంగాలు విప్లవోద్యమమునందు రగుల్కొన్నందున త్వరలోనే పోలీసువారి డైరీలో కెక్కి చాలాకష్టములననుభవించి కారాగృహ శిక్షకు పాత్రుడయ్యెను. 1914 సంవత్సరములో ఇండియా దేశమునకు స్వరాజ్యం సంపాదించవలెనంటే జర్మనులతో సహాయము అపేక్షించుట అవసరమని తలచి రాయిగారు బటేనియా, జపాను, చీనా దేశములకు రహస్యముగా తప్పించుకొని వెళ్ళి తన ప్రయత్నము సాగనందువల్ల అమెరికాకు పోయి అప్పటికే అచ్చట ప్రవాసము చేయుచున్న దివంగతులయిన లాలాలజపతిరాయిగారితో హిందూ స్వాతంత్ర్యమును గురించి ప్రచారము చేయుచుండెను. అమెరికా అప్పటి ఐరోపా యుద్ధములో మిత్రమండలికి అనగా ఇంగ్లండు ఫ్రాన్సు వగయిరా దేశములకు అనుకూలముగా ప్రవేశించినందువలన రాయిగారిపైనను లజపతిరాయిగారిపైనను అమెరికనుల అభిమానము తగ్గనారంభించెను. కాని అక్కడి పాటకజనులు మాత్రము వీరి ఉపన్యాసము శ్రద్ధతో వినుచుండిరి. ప్రపంచమందలి కార్మికులందరు ఏకమైనగాని కార్మికవర్గమునకు మోక్షము లేదను సూత్రము అమెరికాయందే రాయిగారికి చక్కగా స్ఫురించినది. రాయిగారు అమెరికావదలి అమెరికా సామ్రాజ్య చక్రములక్రింద నలిగిపోవుచుండిన  ఫిలిప్పైన్స్ దీవులకు, మెక్సికో దేశమునకు పోయి అచ్చటి స్వాతంత్రోద్యమమునకు విశేషముగా పాటుపడెను. ఆ దేశములో సామ్రాజ్య వాద సంఘమును స్థాపించుటకు సహాయపడి ప్రథమ విప్లవ ప్రభుత్వమునకు సలహాదారుడుగా నుండెను.
యం.యన్.రాయియొక్క తెలివితేటలు సామర్థ్యమును, మార్క్సు సిద్ధాంతములను జీర్ణించుకొనుటయందు అతని ఉన్న ప్రజ్ఞను కనుగొన్న లెనిన్, రాయిగారిని మాస్కోకు పిలిపించుకొనెను. మార్గమధ్యమందు రాయిగారు స్పెయిను యందు కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించిరి. మాస్కోయందు మూడవ ఇంటర్ నేషనల్ సంఘము స్థాపనకు లెనిన్ గారికి వీరు చాలా సహాయపడిరి. తూర్పు టర్కీస్థాన్ మొదలగు ప్రాచ్యదేశముల పరిస్థితులను గమనించుటకై వీరు ప్రత్యేకముగ నియమింపబడిరి. పోలిట్ బ్యూరోనందు వీరు సభ్యులై రష్యా రాజకీయములందు చాలా ప్రాముఖ్యతను వహించిరి. ఆసియా ఖండము యొక్క ఇతర బానిసదేశములయొక్క వ్యవహారములను పరిశీలించుచు కార్యదర్శిగా రష్యా ప్రభుత్వముచే వీరు నియోజింపబడిరి.
1925వ సంవత్సరము వరకు చీనా కమ్యూనిస్టు పార్టీ ట్రాట్ స్కీ సిద్ధాంతములను అనుసరించుచు చీనా జాతీయ ఉద్యమమునందు పాల్గొనక ఒంటరిగా పనిచేయుచుండిరి. రాయిగారు అచ్చటికి పోయిన పిమ్మట ఈ పద్ధతిని మార్పించి చీనా జాతీయ సంస్థయగు ‘కోమింగ్ టాంగ్’ సంఘమునందు  ఈ పార్టీ సభ్యులందరు చేరునట్లు చేసి కమ్యూనిస్టు పార్టీ బలమును వేలకువేలుగా వృద్ధియగునట్లు చేయగల్గెను. నాటినుండి ‘కోమింగ్ టాంగ్’ సంస్థకు ప్రజాబలము హెచ్చి రష్యాయందలి ప్రజాసంస్థలు అన్నిటికన్న మేటియయ్యెను. మాస్కో నుండి యీ పార్టీకి సలహాదారుడుగా రాయిగారు పంపబడుటచే 8 మాసములు చీనాయందే యుండి ఐరోపా సామ్రాజ్యవాదుల చేతులలోని కీలుబొమ్మలగు చైనా సేనానాయకులను ఓడించగల్గిన పరిస్థితులను కలుగజేసెను. కాని అచ్చటి పార్టీ ఇప్పుడు తూర్పు ప్రాంతపు రెడ్ ఆర్మీకమాండరుగా నున్న మార్షల్ బ్లూచర్ మాటలకు లోబడి రాయిగారి సలహాను త్రోసిపుచ్చి కొన్ని గొప్ప పొరపాట్లను చేయసాగెను. ప్రకారణముల వల్ల చీనా జాతీయ ప్రభుత్వ నాయకుడగు చాంగ్ కేషేక్ (ఇప్పటి చీనా నియంత)  పొరపాట్లను ఆధారము చేసికొని వేలకొలది కమ్యూనిస్టులను రైతులను చంపించెను. రాయిగార్కి విసుగు పుట్టి తిరిగి మాస్కో వెళ్ళిపోయిరి.
జర్మనీలో 1928 సంవత్సరము ఆఖరులో రాయిగారు జబ్బుపడిరి. అదేసమయమున మూడవ ఇంటర్ నేషనల్ సంఘము తరఫున 4వ ప్రపంచ కార్మిక సభ జరిగెను. ఆ సభయందు లెనిన్ సిద్ధాంతముల నుండి ఇప్పటి రష్యా నాయకులు వీడిపోవు సూచనలు కనిపించెను, రాయిగారు దీనికి సమ్మతించక తన భేదాభిప్రాయమును పై సభకు తెల్పుచు బానిస దేశముల స్వాతంత్రోద్యముల యందు చూపవలసిన వైఖరిని విశదీకరించిరి. మరియు హిందూదేశ స్వాతంత్ర్యపోరాటము కాంగ్రెసుతో లీనమైనడుపబడవలసిందే కాని పెడత్రోవల ద్రొక్కకూడదని హెచ్చరించిరి. పై మహాసభ రాయిగారి వాదమును అంగీకరించక హిందూదేశములో కాంగ్రెసుకు విరోధముగా పనిచేయు సామ్రాజ్య నిరోధక సంస్థను స్థాపించవలెనని తీర్మానించిరి. ఈ పద్ధతి యొక్క విషఫలములే ఇండియాయందును, జర్మనీయందును, కానవచ్చుచున్నవి. నానాటికి రాయిగారికిని రష్యానియంత స్టాలిన్ కును భేదాభిప్రాయములు హెచ్చిపోవుటవల్ల రష్యాను వదలివేసి హిందూదేశమునకు వచ్చిన వెనువెంటనే జైలుబాధలనుభవించవలయునని తెలసికూడా తనకు ఉగ్గుపాలతో పుట్టిన ధైర్యముతో హిందూదేశ స్వాతంత్ర్య పోరాటమునందు పాల్గొనుటకై ఇండియాకు వచ్చిరి.
అప్పుడు హిందూదేశమునందు నిరాకరణోద్యమము విజృంభించుచుండెను. కొన్ని నెలలపాటు సంయుక్తరాష్ట్రములలో కర్షకుల సంఘస్థాపనకై పనిచేసెను. 1931 సంవత్సరము ఇండియా ప్రభుత్వము వీరిని బొంబాయిలో అరెస్టు చేసి 1924 సంవత్సరములో వారిపై మోపబడిన రాజద్రోహనేరమునకు విచారించి 13 సంవత్సరములు శిక్షవేసిరి. అప్పీలులో 6 సంవత్సరములు తగ్గించిరి. 1936 సంవత్సరము ఆఖరులో ఆరోగ్యమును కోల్పోయి బలహీనుడై మరల మాతృపాదపద్మములకడ తన శిరము నుంచుటకు సిద్ధపడి రాయిగారు జైలుకమ్ముల నుండి బయటపడిరి. వీరు మార్క్సు సిద్ధాంతములను గురించి హిందూదేశ పోరాటమును గురించి కొన్ని గొప్ప గ్రంథములను వ్రాసియున్నారు.
విడుదలైన వెంటనే వీరు కాంగ్రెసులో చేరి అఖిలభారత కాంగ్రెసు సంఘమునకు ఎన్నుకొనబడి హిందూదేశ స్వాతంత్ర్య పోరాటమునందు ప్రథమ పంక్తిలోని సేనానాయకులలో ఒకరుగా ఏర్పడినారు. కాంగ్రెసుద్వారా హిందూదేశపు సామ్రాజ్య నిరోధక శక్తులను కేంద్రీకరించి స్వతంత్రపోరాటము జరపవలెనని వీరి నిశ్చయము. కాంగ్రెసు యొక్క పలుకుబడి ఆవంతయు తగ్గుటకు వీరు సమ్మతింపరు. ఆ మహాసంస్థపై ఈగనుగూడ వాలనీయరు.  ఈ సందర్భమున వారికిని కొందరు సామ్యవాదులకును భేదాభిప్రాయములు కల్గినవి. కాంగ్రెసు అధ్యక్షులైన జహ్వర్లాల్ గారితో పూర్తిగా ఏకీభవించుచున్నారు.
(20-8-1937 న ఆంధ్రపత్రిక దినపత్రికలో ప్రచురింపబడినది)
-         వెన్నెకంటి రాఘవయ్య
Vennelakanti Raghavaiah was from Nellore, related to V V Giri, the president of India.He is the person who invited and brought M N Roy to Andhra in 1938 to South India agriculture labor conference at Nellore
1938 August

No comments:

Post a Comment