మానవవాది హీరో ముసిని నారాయణ
నైజాం పాలనలో తలెత్తుకొని తిరిగి ‘నేను మానవవాదిని’, ‘నేను సోషలిస్టుని’ అని చెప్పటం ఒక పట్టాన సాధ్యమయినది కాదు. దేశంలో ఇతర చోట్ల ముఖ్యంగా, నిజాం రాష్ట్ర చుట్టుపట్ల మానవవాదులు విపరీతంగా ఉద్యమించి పనిచేశారు. అందులో మహరాష్ట్ర, కన్నడ, ఆంధ్ర పేర్కొనదగినవి. అలాంటి రోజులలో తెలంగాణాప్రాంతం మహబూబ్ నగర్ నుండి ముసిని నారాయణ తలెత్తుకొని గ్రామాలలో తిరిగి మానవవాదిగా చెప్పుకుంటూ సిద్ధాంతాలను ప్రచారం చేయగలిగాడు. ఆయన ధైర్యసాహసాలకు హాట్స్ ఆఫ్!
ముసిని నారాయణ 1929లో మహబూబ్ నగర్ జిల్లా జానాం పేటలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో పుట్టారు. తండ్రి శివయ్య ఆయుర్వేద వైద్యుడు. తల్లి వెంకమ్మ గృహిణిగా సంసారం చక్కపెట్టేది. నారాయణ హైస్కూలు విద్య ముగించి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ రెవెన్యూ సర్వీసులో చేరాడు. తహసీల్దారుగా ఉద్యోగం ప్రారంభించి, ఖమ్మం జిల్లా కల్లూరులో బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా అనుభవం పొందారు. ఆనాడు స్థానిక నాయకుడుగా జలగం వెంగళరావు ప్రజాదరణ పొందిన వ్యక్తి. అతని సోదరుడు కొండలరావు కూడా స్థానిక రాజకీయాలలో ప్రాబల్యంగలవాడు. వారు సిఫారసు చేసినపుడు అది సరైన మార్గంలో లేనపుడు నారాయణ ధృవీకరించి తన మార్గాన ముక్కుసూటిగా వెళ్ళేవాడు. సహజంగా రాజకీయనాయకులకు ఆగ్రహం రావడం నారాయణను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయించటం జరిగింది. అయినా తన సక్రమ పద్ధతులను నారాయణ మార్చుకోలేదు.
అప్పటికే  ఎమ్.ఎన్.రాయ్ మానవవాద సిద్ధాంతాలు  చదివి ఆకర్షితుడై వాటిని తన స్థాయిలో ప్రచారం చేయటం  మొదలు పెట్టాడు. ప్రజలు సార్వభౌములని వారు నిలదొక్కుకుంటే పాలన చక్కబడుతుందని రాయ్ చెప్పింది  ఆయనకు నచ్చింది. అంతేగాక  వికేంద్రీకరణ జరిగితే అధికారం  కేంద్రీకృతం కాకుండా వుంటుందని  అవినీతికి అవకాశం తగ్గుతుందని  రాయ్ చెప్పాడు. అదికూడా నారాయణకి బాగా నచ్చింది. రాయ్ రచనల తెలుగు అనువాదాలను వెంటబెట్టుకుని రోజూ పొద్దున్నే బయల్దేరి గ్రామాలలో ఉన్న ఉపాధ్యాయుల దగ్గరకి, పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళి పుస్తకాలు పంచేవాడు. సిద్ధాంతాలు చెప్పేవాడు. పిల్లలకు అవి చెప్పమని ఉపాధ్యాయలను ప్రోత్సహించావాడు. ప్రజలలోకి రాయ్ సిద్ధాంతాలు తీసుకెళ్ళమని స్థానిక నాయకులను ప్రోత్సహించేవాడు. తాను ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అదనంగా ఈ పనులు చేసేవాడు. అది చాలామందిని ఆకట్టుకుంది. తరువాత ఉద్యోగాలలో బదిలీలు జరుగుతుండగా మానవవాద కార్యక్రమాన్ని మాత్రం వదలకుండా వ్యాపింపచేశారు.
ఆరోజులలో  మానవవాద ఉద్యమకారుడు ఎమ్.ఎన్.రాయ్ సిద్ధాంతాలను యువతకు, గ్రామస్తులకు  ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాడు. ముఖ్యంగా శలవులలో ఈ కార్యక్రమాలు నిర్వహించేవాడు. నారాయణ ఇందులో పాల్గన్నాడు.  సంక్షిప్తంగా ఉపన్యాసాలు చేసేవాడు. ఇతరుల ఉపన్యాసాలు విని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసేవాడు. ఆ విధంగా మానవవాద ప్రముఖులైన ఆవుల గోపాలకృష్ణమూర్తి, మల్లాది రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, కోగంటి సుబ్రహ్మణ్యం,  ఆలం ఖుంద్ మిరి, మొదలైనవారితో సన్నిహిత పరిచయాలు జరిగాయి. నేను 1960 నుండి నారాయణతో సన్నిహిత పరియస్తుణ్ణయ్యాను. ఆయన ఆసక్తికరంగా చర్చలు చేసేవాడు.
నూకల రామచంద్రారెడ్డి  రెవిన్యూమంత్రిగా వుండగా భూ ఆక్రమణలు, అన్యాక్రాంతాలపై  విచారించడానికి నారాయణను ఏకసభ్యసంఘంగా నియమించారు. అప్పట్లో ప్రధానకార్యదర్శి ఎం.టి. రాజు వుండేవాడు. నారాయణ విచారణ జరుపుతుండగా సాక్షాత్తు ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ అవినీతి కార్యక్రమములో భూ ఆక్రమణ జరిగినట్లు తెలుసుకొని నోటీసిచ్చాడు. ఒక చిన్న ఉద్యోగి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీచేయటమనేది మానవవాద సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న వ్యక్తే చేయగలడు. అదే నారాయణ ఉద్దేశం. ఫలితంగా ఆయన్ను బదిలీ చేశారు. అంతేగాక ఆయన నోటీసిచ్చిన విషయంపై విచారణ జరపలేకపోయారు. అలాగే నారాయణ హయాంలో మంత్రులూ అధికారులూ దారితప్పి సౌకర్యాలు ప్రభుత్వపరంగా పొందాలనుకుంటే ఆయన పడనిచ్చేవాడు కాదు. ఆవిధంగా జీవితమంతా రాజీపడని మానవవాదిగా కొనసాగాడు. ఇంగ్లీషు తెలుగు రాడికల్ హ్యూమనిస్టు పత్రికలను తెప్పించి చదివి ఇతరులకు చెపుతుండేవాడు. 1956 నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నారాయణ స్వేచ్ఛగా సిద్ధాంత ప్రచారాలు చేశారు.
న్యూట్రిషన్ ల్యాబ్స్ లో సైంటిస్టుగా  పనిచేసి రిటైర్ అయిన రఘురాములు  నారాయణ ప్రేరణతో హేతువాద, మానవవాద సభలలో పాల్గొని ప్రచారంచేసేవారు.
కేవలం మాటలు  చెప్పటమే కాక ఆచరణలో కూడా నారాయణ తన జీవితంలో అన్వయించి  చూపారు. తన కుమార్తె వివాహాన్ని మానవవాద పద్ధతిలో జరిపించారు. ఆమె వివాహాన్ని సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుతో సెక్యులర్ గా జరిపించగా  వేదికపై ప్రత్యేక అతిథిగా  ఎన్. ఇన్నయ్యను ప్రసంగింప  చేశారు. తన కుమారునికి ‘మానవేంద్ర’ అని పేరు పెట్టారు. అది ఎమ్.ఎన్.రాయ్ పూర్తిపేరు. అతను ప్రస్తుతం కెనడాలోని రాన్ కోవర్ లో వుంటున్నారు. మరొక కుమారుడు రవిప్రకాష్ నారాయణ సిద్ధాంతాలను జీవితంలో పాటించిన ఉపాధ్యాయ సంఘ నాయకుడు. ఆయన కూడా రిటైర్ అయి ప్రస్తుతం అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నారు. ఆనాడు తెలంగాణాలో రేగుచుక్కగా మార్గదర్శిగా కష్టాలను ఎదుర్కొని మానవవాదాన్ని సాధ్యమైనంతవరకు పరిచయం చేసిన వ్యక్తి నారాయణ. 2003లో నారాయణ చనిపోయాడు. ఆయన చూపిన మార్గం గొప్పది సాహసోపేతమైనది. అలాంటి వ్యక్తితో పరిచయం వుండటం నేను గొప్ప లక్షణంగా భావిస్తున్నాను.


 Contributed by Innaiah Narisetti

No comments:

Post a Comment