బ్రహ్మచర్యం-పిల్లి చెప్పిన కథ - 11




సహజమైన కామ జీవిత సుఖానుభూతి కాంక్షించరాదని, దానికి సంబంధించిన వాంఛను దాచుకోవాలనీ చంపుకోవాలనీ చేసే కపట ప్రయత్నమంతా మాటల మాయాజాలం నుంచి పుట్టిందే.  ఈ కపట వర్తనకు కేంద్రం బ్రహ్మచర్యమనే పదం. దీని దుష్ప్రభావంవల్ల మోసపోయిన బుద్ధిమంతులు చాలామంది ప్రకృతితో యుద్ధం సాగించే వృధాప్రయత్నం సాగిస్తున్నారు. ప్రకృతి బలీయమైనది. జయంలేని  ఈ యుద్ధాన్ని సాగిస్తున్నట్లు నటించటానికి మోసం, మాయ, కపటం అన్నీ ఉపయోగించవలసి వస్తుంది. బ్రహ్మాండమైన మానసిక శక్తులు సాధించటానికి, శారీరక పవిత్రతను కాపాడుకోవటానికి, అసత్యాన్ని కపటాన్ని అలవరచుకోవలసిన దుస్థితి పట్టింది. బ్రహ్మచర్యంలో నీకు విశ్వాసముండాలి. ఈ ఒక్క మాటలోని నిరంకుశత్వం నిన్ను నిష్కపటిగా వుండనీయదు. మానవశరీర నిర్మాణము, ఆవయవ విధులు తెలిసినవారికి పరిమితమైన కామ క్రీడవల్ల నష్టం లేదని తెలుస్తుంది. ఈ పనిలో వ్యయమయ్యే వీర్యం ఒకవేళ స్థంభింపచేయవచ్చుననుకున్నా, దానివల్ల అద్భుతమైన శక్తులను సాధించగలిగేదేమీలేదు. పైగా యీడొచ్చిన వారికి అలా స్థంభింపచేయడం చెడు పరిణామాలకు దారితీస్తుంది. శరీరావయవ నిర్మాణం దృష్ట్యా వీర్యానికొక ప్రత్యేకమైన విధి ఉంది. అదే గర్భధారణకు తోడ్పడటం, అంతకుమించి మరో ఉపయోగం ఏమీలేదు. కామ ప్రేరణను బలవంతంగా అణచివేయచూస్తే ప్రమాదకరమైన మానసిక వ్యాధులకు దారితీస్తుందని ఆధునిక మనో విజ్ఞానం స్పష్టపరుస్తోంది. బుద్ధివికాసానికి యెంత విచిత్రమైన మార్గం.
సాహిత్యం పని మనోభావాలను, ఉద్రేకాలను ప్రతిబింబింపచేయటమైతే, ఆ పని సరిగ్గా జరగాలంటే, మానవుల చేతులలోనుంచి సాహిత్యం బయటపడాలి. మానవుల చేతులలో ఉన్నంతవరకూ మనోభావాలు గాని, ఉద్రేకాలుగాని వాటి సహజరూపంలో బయల్పడవు. నాలాగా జంతువులైనా సారస్వత గుత్తాధిపత్యంలోకి జొరబడాలి. లేకపోతే పురుషులు, స్త్రీలు కూడా సహజమైన ప్రేరణలను అంగీకరించగల ధైర్యాన్ని, నిజాయితీనీ చూపగలగాలి.
పాశ్చాత్య దేశాలలో, అసత్యం, కుటిలత్వం వంటి ఉత్తమ మానవ లక్షణాలనుండి ఆధునిక సాహిత్యం కొంతవరకు విముక్తి పొందింది. తమ ప్రేరణల పట్ల, ఉద్రేకాలపట్ల సిగ్గుపడని ఆడా, మగా ఆ దేశాలలో ఉన్నారు. మాయావాదులు, పౌరాణికులుకాని కళాకారులు అక్కడ కనిపిస్తారు. మన భారతదేశంలో సారస్వతం చాలావరకు మానవసంబంధమైనదే దానికి వాస్తవికతతో పనిలేదు. దాని దృష్టిలో సత్యం అనే మాట పవిత్రంగా వల్లించటమే గాని ఆచరణతో పనిలేదు. భారతీయ సాహిత్యంలో కనిపించే నాయకీ నాయకుల చిత్రీకరణ తప్పుడుగా గోచరిస్తుంది. కారణం ఆ చిత్రణకూ, లోకపు తీరుకూ సంబంధం లేకపోవటమే ఈ సాహిత్యంలో ప్రముఖంగా కనపడేది శృంగారం  ఈ శృంగారానికీ వాస్తవమైన ఉద్రేకాలకూ పోలిక ఉండదు. విద్యావతి, చండీదాస్, జయదేవ్, చివరకు రవీంద్రనాథ్ రాసిన చక్కటి శృంగార పదాలను గూడా ఆత్మ-పరమాత్మ సంయోగసంబంధమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చెప్పేవిగా వ్యాఖ్యానించటం జరుగుతున్నది. యౌవనంలో ఉన్న ఆవులకాపరి వ్యభిచార గాథలు, గోపికల స్వైర విహారాలు మొదలైన వాటికి గూడా ఏవేవో వేదాంతార్థాలు చెప్పుతుంటారు. ఆత్మ-పరమాత్మల పరస్పర ఆకర్షణ అంటూ, నిస్సారమైన కల్పనలతోను, ఆధ్యాత్మికానుభూతి ముసుగులో జరిగిన శృంగార గాథలతోను, భారతీయ సాహిత్యం నిండివుంది. అందులో జీవిత సత్యాలకు తావులేదు.
హిందూదేశంలో నేడు కూడా పురుషుడు దేవుడైపోదామనుకుంటున్నాడు. స్త్రీల పేర్ల చివర ‘దేవి’ అని చేర్చి సహజంగా సున్నితమైన వారి ప్రకృతిని కలుషితం చేస్తున్నాడు. ప్రేమను గురించి ఎంత వాక్చాతుర్యాన్ని వెలిబుచ్చినా, పురుషులకు తమపట్ల ఎలాంటి భావం ఉందో స్త్రీలకు బాగా తెలుసు. దైవసమానులైపోదామనే వృధా ప్రయాసలో పడి మానవుడు, తన నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఈ ఆదర్శమనే భ్రమను మనిషి ఎన్నటికీ సాధించలేడు. మనిషి దేవుడు కాలేడు. తన మానవ నైజాన్ని మరుగుపరచే తలంపుతో కపటంతో కూడిన అసత్యవాదిగా మారుతున్నాడు.  పతనాన్ని సమంజసమని చూపటానికే సాహిత్యం వినియోగింపబడుతున్నది.
నీచ జంతువుల కంటె మనుషులు వివేక దృష్టిలో అధికుడనే భావాన్ని గూడా ఆధునిక మనస్తత్వ శాస్త్రం పటాపంచలం చేస్తున్నది. నీచం అనే పదాన్ని నేను అయిష్టంగానే వాడుతున్నాను. మనిషి నిజంగా అధఃపతనం చెందిన జంతువు. ఉచ్ఛ ప్రాణులన్నింటికీ సహజమైన ప్రేరణలవల్లనే ఆధ్యాత్మిక గుణాలతో సహా మానవజీవితం నిర్ణయమవుతుంది. మనిషి తన తెలివికి గర్వపడుతున్నాడు. గాని తన మనసును పాలిస్తున్న జంతు ప్రేరణలను కొంచెమైనా తెలుసుకోలేకపోతున్నాడు. మేము జంతువులమే గనుక మాలో ప్రేరణలకు సిగ్గుపడక ఐచ్చికంగా ప్రవర్తిస్తాం. మానవుడు తనలో అజ్ఞాతంగా ఉన్న జంతు ప్రేరణలకు బానిస అవుతున్నాడు. మనిషి కాడికికట్టిన ఎద్దులాంటి వాడు. ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో ప్రవర్తన విజ్ఞానం (బిహేవియరిజం) మనిషికి మనసు వుంటుందని ఒప్పుకోదు. అవయవాలతో కూడిన మరలా అని మనిషిని తేల్చింది. తమ జాతికి చెందని జంతువులన్నింటిని మానవులు హీనంగా చూస్తున్నారంటే అది కేవలం వారి అహంకారమేనని శాస్త్రం రుజువు చేస్తోంది.
జంతువులు ఎప్పుడూ ప్రేరణల ననుసరించి నడుస్తాయి. ప్రకృతి నియమాలను పాటించుతాయి. దైవ సంకల్పాన్ని ఆచరణలో పెడతాయి. మానవ ప్రవర్తనకు కూడా మూలం ఈ ప్రేరణలే. ఆధునిక మానసిక శాస్త్రం అలా నిర్థారణ చేసింది. ప్రవర్తన శాస్త్రజ్ఞుడు మనో విశ్లేషకుడు మగ్ డోగల్ సైతం ఈ దృక్పథాన్ని బలపరుస్తున్నాడు. మానవులు తమలో కలిగే ప్రేరణలు లేకపోతే ఆలోచించలేరని, కార్యశూరులు కాలేరని అంటాడాయన. మానవుల ఆధ్యాత్మిక ఉన్నతి అంతా అభూత కల్పన. వారిలో కలిగే ప్రేరణలను యుక్తి బద్ధం చేయచూస్తారు. తమలోని జంతు ప్రేరణలను బుద్ధి కుశలత, నీతి మొదలగు ముసుగులో కప్పచూస్తారు. ఇదంతా వారి ఆధ్యాత్మిక వక్రత్వానికి చిహ్నం. దీనితో వారు దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని సరిదిద్దుదామనుకుంటున్నారు. మీకు దేవుడిలో విశ్వాసంవుంటే మీ విశ్వాసాన్ని దుర్వనియోగం చేసి మీ దేవుణ్ణి అవమానించకండి. దైవ సంకల్పం అంటూ ఒకటి వుంటే దానిని సర్వాధికారాలతో నిరాటంకంగా సాగిపోనివ్వండి.
మీరు నిజంగా ఉన్నదానికంటే భిన్నంగానూ, అధికులుగానూ కనపడదామని నటించకండి. మీలోని జంతు స్వభావానికి సిగ్గుపడకండి. అప్పుడు పురుషత్వానికి, మానవత్వానికీ గల గౌరవం మీకు దక్కుతుంది. అలా కాక ఆధ్యాత్మిక ఔన్నత్యం జీవిత పరమావధి అనే వ్యామోహానికి గురి అయ్యారంటే మీ పతనానికి మీరే కారకులవుతారు. నిజాయితీగా, నిష్కపటంగా బ్రతకవీలుండదు.
మానవుడిలో శారీరకంగా, మానసికంగా గమనిస్తే చైతన్యం అనేది ప్రధానం. ఇది దైవాంశంగా పేర్కొంటారు. మనిషి ఆలోచనలు, ఆచరణ అంతా చెప్పడానికి వీల్లేని ‘అవ్యక్త మనస్తత్వం’ వలన వుంటున్నది. సహజ ప్రేరణ కూడలి ఈ అవ్యక్త మనస్తత్వం. జంతు పరిణామ క్రమం నుండి మానవుడికి సంక్రమించిన సంపద అంతా మనిషి మస్తిష్కంలో నిక్షిప్తమైందన్న మాట. మనిషిలోని మానసిక, ఆధ్యాత్మిక ధోరణి అంతా, కొద్దిగానే పైకి కనిపిస్తుంది. చైతన్యస్థాయిని మించి తొంగిచూచే అంశం చాలా స్వల్పంకాగా, గర్భితంగా అవ్యక్త స్థితిలో ఎంతో ఉంటుంది. మనిషి వ్యక్తిత్వంలో ఈ అవ్యక్తం ఎక్కువ పాళ్ళున్నది. మనం చూపే ఉద్రేకాలు, వెల్లడించే భావాలు  ఈ అవ్యక్త నిధిలోనుండి పెల్లుబికి వచ్చేవే. మనం హేతుబద్ధం చేసి చూపే ఉద్రేకాలు, వూహించిన భావాలు, ఆడంబర చర్యలు రెండోదశకు చెందినవే వీటిని నడిపించే శక్తి లోన దాగి వున్నది. మానవుడిలోని జంతు ప్రవృత్తి అంటే ఇదే.
క్లుప్తంగా యిది మనో విశ్లేషణ దృక్పథం. దీనివల్లే మానసిక వ్యాధులు కుదర్చటం సాధ్యపడుతున్నది. రోగి అవ్యక్తంలో అణగివున్న జంతు ప్రేరణలను గుర్తించి అవి బాహాటంగా వ్యక్తం కావటానికి సాయపడితే మానసికారోగ్యం కుదుటపడుతుంది. సహజ ప్రేరణలకు ‘మనస్సాక్షి’ అనబడేది వున్నవి వున్నట్లుగా వ్యక్తం కానీయదు. వాటికి మాయపూతలు పూసి, మెరుగులు దిద్దటంవలన చివరికి మానవ జీవితం సత్య దూరంగానూ, కపటంగానూ మారుతుంది.
హిందువులు లింగాకారాన్ని పూజిస్తారు. ఫ్రాయిడ్ చెప్పే జననేంద్రియ సిద్ధాంతాన్ని యింతకంటే తగిన ఉదాహరణ మరొకటిలేదు. బ్రహ్మచర్యం పేరుతో, సహజమైన కామవాంఛను తొక్కిపట్టటం జరుగుతోంది. దీనికి ప్రకృతి పగ తీర్చుకుంటుంది. ఉన్నత ప్రాణుల జీవిత విధానంలో కామరూపంలో వున్న లింగాకారంలో పూజించటం ఆచారమయింది. ఈ విధంగా ప్రకృతి మానవుడిమీద పగ సాధిస్తుంది. హిందువుల ఆచార వ్యవహారాలలోనూ సామాజిక వ్యవస్థల ద్వారానూ అణచివేయబడ్డ ఎన్నో సహజ ప్రేరణలు వ్యక్తం అవుతాయి.
                         మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment