ఎందుకు పుడతారు ?పిల్లి చెప్పిన కథ - 13-




ఇండియాలో జన్మదినోత్సవాలు జరుపుకునే ఆచారం పెద్దగాలేదు. అందుకని సామాన్య మానవులు బాధామయమైన  ఈ ప్రపంచంలోకి అడుగిడిన సమయాన్ని గుర్తుగా వ్రాసుకోరు. అలాంటప్పుడు నాలాటి అలగా జాతి పిల్లి ఎప్పుడు పుట్టింది కచ్చితంగా తెలిసే ప్రశ్నేలేదు.
భారతీయులు జన్మదినాన్ని ఎందుకు జరుపుకోరో ఆలోచిస్తే ఆసక్తిదాయకంగా ఉంటుంది. జీవితానికి నాంది అయిన ఈ పుట్టుక పట్ల మనుషులెందుకింత విముఖంగా వుంటారో? జీవితంలో పుట్టుక అతి ప్రధానఘట్టం. పుట్టుక లేకపోతే జీవితమే లేదు. బ్రతుకుతున్నామంటే పుట్టటం వల్లనే ఇలాటి ముఖ్య విషయాన్ని ఒక జాతి యావత్తూ నిర్లక్ష్యం చేయటం ఆశ్చర్యకరంగా వుండదూ? లౌకిక జీవితమంతా ఒక భ్రమ అని, బంధం అని హిందూ వేదాంతం బోధిస్తుంది. ఆచరణలో యిది చూపకపోయినా యీ సూత్రాన్ని హిందువులు నమ్ముతారు.  కనుక  భ్రాంతిలాంటి ఈ జీవితం పట్ల ఆసక్తి చూపెట్టరు. భ్రాంతిని నిజమని ఎవరు భావిస్తారు? జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో అనేది అంత పట్టించుకోవలసిన సంగతి కాదు. కలలో చూచినది దేవలోకం అయినా పాతాళలోకమైనా అది భ్రమ అని మేల్కోగానే తెలుస్తుంది.  స్వప్నం తాలూకు జ్ఞాపకాలు మిగిలినా అది సరిగ్గా ఎప్పుడు ప్రారంభమయిందో గుర్తు పెట్టుకోరు. కల ఎంత నిజమో జీవితమూ అంతే నిజం అంటాయి. హిందూ మతమూ, వేదాంతమూ గూడా జీవితం వారివారి ఖర్మననుసరించి సుఖస్వప్నమో, పీడకలో అవుతుంది. పుట్టుక అంటే కల ప్రారంభమన్నమాట. ఆ ప్రత్యేక సమయాన్ని గుర్తుపెట్టుకోవలసిన అవసరమేముంది? పైగా జీవితాన్ని ఒక బంధంగానూ, దురదృష్టంగానూ భావించేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన పనేలేదు. ఖైదీ తాను నిర్బంధింపబడిన రోజు గుర్తు పెట్టుకొని పండుగ జరుపుకోడు. దురదృష్టం ఆవరిస్తే అలాటి రోజును జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పనేముంది?   
ఇలాంటి మతపరమైన తత్వసిద్ధాంతం, దాని కనుకూలమైన సామాజిక పరిస్థితుల్లోనే పెరగగలదు. భారతీయుల్లో ఎక్కువమంది జీవితాన్ని దురదృష్టమని తలచటానికి కారణం వారి జీవితం దుఃఖంతో, కష్టాలతో గడపటమే. జీవితంలో సుఖం అంటూ ఎరుగరు వాళ్ళు. రెక్కాడినా డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి ఇంక సుఖాలు, చదువు, నాగరికత వారికందని విషయాలు. ఈ పరిస్థితులు యిప్పుడు కొత్తగా వచ్చినవేమీ కాదు. జీవితం దుఃఖమయం అనుకున్న నాటినుండి, దాన్ని పైగా ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో చూడటం మొదలైననాటినుండీ పరిస్థితులిలానే వున్నాయి. నిరాశ, నిస్పృహలతో నిండిన ప్రజానీకపు జీవిత విధానం ఈ దృక్పథాన్ని బలపరుస్తుందీ అంటే ఈ దృక్పథం ఇలాంటి సామాజిక పరిస్థితులవల్లే పుట్టిందన్నమాట. ఇన్ని శతాబ్దాలుగా దృక్పథం వదల్లేదంటే దాని పునాది చాలా గట్టిదై వుండాలి. ‘రామరాజ్యం’ అనేది ఒక కల్పిత కథే. ఈ గాథలో ఏ మాత్రమైనా చారిత్రక సత్యం వుండి వుంటే ప్రజల జీవిత దృక్పథం మరోలా వుండేది. ఒకవేళ పౌరాణికమైన ‘స్వర్ణయుగం’ ఎప్పుడైనా ప్రజలు చూచారా? అంటే అది వారు ఆధ్యాత్మిక తత్వానికి బలికాక ముందే వుండాలి. రామరాజ్యంలో ప్రజలెలా వున్నారో రామాయణమే చెప్పదు. అయోధ్యానగరం శోభతప్ప. ఇంత సిరి రాచనగరానికి ఎలా దక్కిందో ఎక్కడా రాయలేదు. తిని కూర్చొని ఎప్పుడూ అస్త్రవిద్య అభ్యసించే రాచ కుటుంబీకులు సంపాయించింది కాదు. పురోహితులైన బ్రాహ్మణుల మంత్రాలవల్ల వచ్చిందీకాదు. చివరకు జనక మహారాజు తన బంగారు నాగలితో చిన్న చెక్కను మించి దున్నలేదు. ఆ సంపదనంతా చేర్చింది అతిహీనంగా బ్రతికిన సామాన్య ప్రజలు. అలా కాకపోతే వారికి అప్పటి సమాజ చరిత్రలో స్థానం వుండేదే. చరిత్రకారుడు వారిని మనుషుల్లో లెక్కగట్టి వుండడు. కనుక రామరాజ్యం సామాన్యజనానికి స్వర్ణయుగం కాదన్నమాట.
అత్యవసరమైన భారతీయ సమాజ చరిత్రను నేను రాయడంలేదు. విమర్శనా దృష్టితో వ్రాయబడిన అలాంటి చరిత్ర సహాయంతోనే మత సాంప్రదాయాలను, తాత్విక సిద్ధాంతాలను అర్థం చేసుకోగలం.
నా అల్ప జీవితం ప్రస్తుతం వున్న సామాజిక పరిస్థితులను చూపగలదు. వర్తమాన పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూడటం వల్ల గత చరిత్రను తరచి చూడాలనిపిస్తుంది. అదే విధంగా పూర్వ చరిత్రను తిన్నగా అర్థం చేసుకుంటే ప్రస్తుత పరిస్థితిని బాగా అవగాహన చేసుకోవచ్చు. ఒక సామాన్యమైన పిల్లి పుట్టుక విషయం చాలా అప్రధానమైనది. అలాంటి పిల్లి పుట్టుకదినం గుర్తున్నా లేకున్నా పోయేదేంలేదు. ఈ కథ మొదట్లో భారతీయులు జన్మదినం జరుపుకోరనే విషయం నా దృష్టికి వచ్చింది. యెందువల్ల అని యెవరూ దీని గురించి ఆలోచించకపోయినా దీనికి సామాజిక ప్రాధాన్యత చాలా వుంది.  విషయాన్ని తరచి చూడటం మొదలెడితే భారతీయ సామాజిక చరిత్ర ఆది నుండి విపులంగా కనులముందు కనిపిస్తుంది.
నీకు దేవునిలో నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ దైవ నిర్మితం అని అనుకుంటే జీవితం పట్ల హిందూమతం బోధించే అసహ్యభావం నీకుండటానికి వీలులేదు.  ఈ జీవితంకంటే అతీతమైన జీవితం ఏదో ఉందనుకున్నా  వైరుధ్యాన్ని దాటలేము.  ఈ జీవితం హీనమైనదని తలంచినా మీ విశ్వాసాల దృష్ట్యా భగవంతుని సృష్టిలో భాగమే అవుతుంది. మనం ఎక్కడో వున్నదనుకొనే మహత్తర జీవితం ఎంతకోరదగిందో ఈ జీవితం గూడా అంతవాస్తవమని గ్రహించాలి.  ఈ నిజానికి జీవితమే వాస్తవం. ఎందుకంటే అతీతజీవితం వూహల్లో తప్ప మరెక్కడా లేదు. అది ఉన్నదని నమ్మేవారే అది ఎలా వుంటుందో చెప్పలేరు. ఈ జీవితానికి అతీతమైన స్థితిని స్వయంగా అనుభవించామనేవారు గూడా  ఈ జీవితస్వభావమేమిటో వర్ణించలేరు. అయినా ఆ స్థితినందుకోటమే జీవితాదర్శం అనుకుంటారు. నిజాన్ని భ్రమ అనుకొని దాని స్థానంలో భ్రమనే నిజమని ప్రతిష్టించుకొంటున్నారు. ఇది ఎలా జరిగింది? ఈ మార్పుకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు భారతీయ సామాజిక చరిత్రకారులు సమాధానాలు  చెప్పవలసి వుంటుంది.   ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు అన్వేషించాలనే తలంపుతో చరిత్ర చదవటంగానీ, రాయటంగానీ చేయాలి. మిధ్యను జీవితంగాను, జీవితాన్ని మిధ్యగాను తారుమారు చేయటం భారతీయుల ప్రత్యేకత అని సరిపెట్టుకోలేం. ఇలాంటి ప్రతిభ భారతీయులకెలా సంక్రమించింది? ఈ ప్రతిభ భారతీయుల్లో ఉంది అంటే వారి జాతి అహంకారాన్ని ప్రదర్శించటమే కాక దేవుని ప్రతిభను శంకించటమవుతుంది. తమ ఆధ్యాత్మిక ఘనతను చాటటానికి దేవుని చిన్న చూపు చూడటం అవుతుంది. దేవునిలో నమ్మకం సడలటం అవుతుంది. భారతీయ సమాజ జీవితాన్ని విమర్శ దృష్టితో పరిశీలిస్తే హిందూ సిద్ధాంతాలలోనూ, ఆదర్శాలలోనూ యిలాంటి విరుద్ధ భావాలు అనేకం కనిపిస్తాయి.
మూఢ విశ్వాసాలు అభివృద్ధి నిరోధకాలు, ప్రతి విషయం విమర్శనాత్మకంగా చూడాలి. విశ్వాసాలను విమర్శకు గురికానివ్వాలి. ప్రతి సిద్ధాంతం విచక్షణతో విడమరచి చూసి సత్యం గుర్తించాలి. హిందువులు జన్మదినాలు జరుపుకోరు. అంటే వారిలో అధిక సంఖ్యాకుల జీవితాలు నికృష్టంగా వుండబట్టే సంతోషకరమైన విషయాలే గుర్తుంచుకొంటారు. వారి అనుభవమే వారికి జీవితం ఒక బంధం అని నేర్పుతుంది. అలాంటి అనుభవాన్ని వారు తిరిగి పొందాలని కోరుకోరు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన అనుభవం. సామాన్య ప్రజలు భరింపరాని జీవిత బంధాల నుండి పారిపోయే ప్రయత్నం చేయకుండా అసలు  ఈ జీవితమే భ్రమ అనే సిద్ధాంతం వ్యాపింప చేసారు. ఈ జీవితానికి అతీతమైనదేదో వున్నదని ప్రజలను మోసగించారు. ఆకాశకుసుమంలాంటి ఆ జీవితం ఆశతో ఈ దుర్భర జీవితాన్ని జనం నెట్టుకొస్తున్నారు. ఈ జీవితం ఒక బంధం. బంధం కూడా భ్రమే కనుక దాన్ని పట్టించుకోబోకు. బానిస బ్రతుకే బాగుందనుకో. బానిసత్వం తప్పదనుకో.
ఈ రకమైన జీవితానికి ఆధ్యాత్మికత్వం అంటగట్టి పొగడటం కేవలం వక్రీకరించటమే. ఇదంతా పచ్చి మోసం ఈ వేదాంతమే దేశానికి అనర్థం తెచ్చిపెట్టింది. మానవులు తమ జీవితాదర్శాలను అందుకోవాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అలాంటి పరిస్థితులను ఉపేక్షాభావంతో చూస్తే అభివృద్ధికి కావలసిన ప్రేరణ సమాజంలో లోపిస్తుంది. తమ జీవిత విధానాల కెదురు తిరిగి మార్పు తెచ్చే ప్రయత్నాలే సమాజ క్రమ వికాసానికి తోడ్పడతాయి. ఇలాంటి చైతన్యం లేని సమాజం స్తంభించిపోయి, హీనస్థితి పొంది అవినీతికి, వినాశనానికి గురి అవుతుంది. ఆధ్యాత్మిక వాదం పుణ్యమా అంటూ శతాబ్దాల తరబడి భారతీయ సమాజం స్తంభించిపోయింది. పర్యవసానంగా వేయి సంవత్సరాలుగా పరాధీనమై, ఆర్థికంగా చితికిపోయి, బుద్ధి మాంద్యంగా నాగరికతకు దూరమయింది.     
                         మూలం                                  తెలుగు సేత
            ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment