పిల్లి చెప్పిన కథ - 12ఆధ్యాత్మికతకు మూలం - 2




ఇక వుద్రేకాల విషయానికొద్దాం, శరీరంలో కొన్ని గ్రంథుల నుండి స్రవించే రసాయనిక పదార్థాలు వుద్రేకాలను కలిగిస్తాయని ఆధునిక శారీరక శాస్త్రం స్పష్టం చేస్తున్నది. మానవునితో సహా ఉచ్ఛ ప్రాణులన్నింటిలలో ఈ గ్రంథులు ఒకే రకంగా వుంటాయి. అవి ఒకరివి మరొకరికి అమర్చవచ్చు. థైరాయిడ్ గ్రంథిలో వుత్పన్నమయ్యే రసాయనిక పదార్థం బుద్ధి కుశలతకు ఉద్రేకాలకు కారణం. ఇవి సరిగ్గా పనిచేయకపోతే, మానవతత్వానికి దగ్గరగా వుండే జంతువుల థైరాయిడ్ గ్రంథుల నుండి తీసిన ద్రవాన్ని మానవులకెక్కించి వారి గ్రంథుల లోపాన్ని దిద్దవచ్చు. ఆధునిక శస్త్ర వైద్యం చాలా అభివృద్ధి చెందింది. కొన్ని జంతువుల థైరాయిడ్ గ్రంథులను మానవులకు శస్త్ర చికిత్స ద్వారా అమర్చటం వలన వారి మానసిక ఉద్వేగ అలసటలను దూరం చేయగలుగుతున్నారు. పిట్యుటరీ గ్రంథులు గూడా ఒక మాదిరి ఉద్వేగాలను కలిగిస్తాయి. జంతువుల నుండి తీసిన పిట్యూటరీ ద్రవం మానవులకు ఎక్కిస్తే వారిలో భయోత్పాతాన్ని కలిగిస్తుంది.
ఇవీ, ఇంకా యిలాంటి ప్రయోగాలవల్ల నిర్థారణగా తేలేదేమంటే ఆధ్యాత్మిక లక్షణాలని చెప్పుకోబడేవన్నీ మెదడుకు, కేంద్రనాడీమండలానికి సంబంధించినవి. క్రింది జీవాల నుండి మనషి వరకూ అన్నింటిలో మెదడు వుంది. నాడీ మండలం వుంది కనుక వీటి నుండి పుట్టే మానసిక లక్షణాలు జంతువులలో లేవనటానికి వీలులేదు. ఆధునిక జీవశాస్త్రజ్ఞులు, విద్యాధికులైన వైద్య నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
జంతుమనస్తత్వ శాస్త్రం ఇంకా చిరుప్రాయంలోనే వుంది. ప్రాణుల అవయవ పరిణామంలో ఎంతో దిగువ నుండి మానసిక లక్షణాల్లా కనిపిస్తున్నట్లు రుజువు చేయటానికి తగినంత  విషయసేకరణ ఇప్పటికే జరిగింది.  వృక్షజాతిలో గూడా ఈ లక్షణాలు  వున్నట్లు నిదర్శన్నాయి. అయినా చెట్లు బాధ, సంతోషం మొదలైన వాటిని అనుభవిస్తాయని యింకా రూఢిగా చెప్పలేం. కాని బాహ్య ప్రపంచపు కదలికలను బట్టి చెట్లలో చలనం కలుగుతుందని, అలాంటి చలనాన్ని పొందే అవయవాలు వాటికున్నాయని ప్రయోగాల ద్వారా నిరూపింపబడినది. ఏమయినా జంతువులలో చాలా దిగువశ్రేణి వరకూ మానసిక లక్షణాలున్నాయని ఆధునిక మనస్తత్వ శాస్త్రం చెప్పుతుంది. ఈనాడు మనో విజ్ఞానం అంటే ఆత్మ సంబంధమైనదని అనుకోవలసిన పనిలేదు. అది జీవ పరిణామ శాస్త్రంలో ఒక భాగం అంటే శరీరశాస్త్ర సంబంధమైనదని తెలిసింది. జంతుమనస్తత్వ శాస్త్రం చిరుప్రాయంలో వున్న జంతు జీవిత సత్యాలను తెలుసుకోవటంలో జంతు శాస్త్ర పరిశోధనలు చాలా ముందుకు వెళ్ళాయి. ఆత్మగలవి, లేనివి, అనే తేడా  శాస్త్రం ఎక్కడా చూపదు. మిగతా జంతు ప్రపంచం నుండి మనిషిని వేరుగా చూపగల ఆధారాలు లేవు. అంగ నిర్మాణం, వాటిపని, ఆలోచన, అన్నీ ఒకలా వుండటం వలన ఈ తేడా చూపలేం. జీవపరిణామంలో నాడీ మండలంగల జంతువులను వేరు చేద్దామనే ప్రయత్నం కూడా ఫలించలేదు. శాస్త్ర ప్రకారం చూస్తే అమీబా గూడా మానసికానుభవాలు పొందుతున్నట్లు తేలుతోంది. బాహ్యప్రపంచపు వత్తిడివల్ల గూడా ఎమీబాలో కదలికలు ఏర్పడతాయి. దానిని బట్టి అలాంటి కదలిక అంతరంగికంగా కూడా పనిచేస్తుండాలి.
ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, కోతులు మొదలైన జంతువుల (పిల్లులు కూడా  ఈ సంపన్న జంతుకోటిలోనివే) తెలివితేటలను సందేహించటానికి ఆస్కారం లేదు. వీటికి ఉద్రేకాలు, అనుభవాలు కలుగుతాయంటే వింత పడనవసరం లేదు. నేను తెలివిగల దాన్నంటున్నాను గదా అని డిఫరెన్షియల్ కాలుక్యులస్ కు సంబంధించిన లెక్కలు చేయగలనని గాని, రస్సెల్స్, వైట్ హెడ్, విటెగెన స్టైన్ వంటి వారి గణిత శాస్త్రతర్కాన్ని గాని, భౌతిక శాస్త్రసంబంధమైన గణితాన్ని గాని, మానవులకంటే బాగా అర్థం చేసుకోగలనని అనటంలేదు. మానవులు నాపట్ల చూపే ప్రవర్తనకు నేను ఎదురు తిరగగల నా తెలివి వారి నమ్మకాలను, భావాలను, ఆచారాలను దుయ్యబట్టగలదంటున్నాను. నాలో తెలివి వుందని ఒప్పుకోకపోతే నా పరిశీలనా శక్తికి విలువ వుండదు. దానినంతగా పట్టించుకోరు. నన్ను మరోలా అర్థం చేసుకోకుండా వుండటానికి వీలుగా నాకూ మానవునికి మధ్యగల భాషాపరమైన తేడా (అంగీకరించటానికి నా మనసు ఒప్పుకోకపోయినా)ను మరొకసారి నొక్కి చెపుతున్నాను. మనుష్యులు కూడా జంతు జాతివారే అయినా వారికి భాష వున్నది గనుక ఆధ్యాత్మికాభివృద్ధి అవకాశాలు వారికే ఎక్కువగా వున్నాయి. తరతరాలుగా మానవునిలో జంతు స్వభావం వున్నతి చెంది, పురాణదేవుళ్ళ మహిమకంటె మించిన మహిమను అతనికి సంతరించి పెడుతున్నది. దురదృష్టవశాత్తూ మానవులు చాలామంది తమ విలువలను గుర్తించి సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు.
ఇంతకీ నేను చెప్పదలచింది  ఏమంటే మానవుడు జంతువులను మించిన వాడుకాడు. జంతువులలో పై మెట్టున వున్నవాడు. శరీరనిర్మాణంలో వున్నత శ్రేణికి చెందినవాడు. జంతువు చరమదశే మానవత్వం. మానవుని మానసిక అభివృద్ధి వూహానిర్మితమైన దైవత్వం మీద ఆధారపడలేదు. జీవపరిణామ పద్ధతిలో పరిణితి చెందటం, అతని అవ్యక్త మెదడు లెక్కలేనన్ని అనుభవాలకి నిలయమవటం వీటన్నిటిమీద అతని ఆధిక్యత ఆధారపడి వుంది.
తమ గొప్పను నేను సందేహించినందువల్లనైనా మానవుడు తనను తాను విమర్శనా దృష్టితో చూచుకోగలడేమో అనుకున్నాను. నాకు తెలిసిన మనుషుల్లో (వీరు భారతీయులందరికి ప్రతినిధులు) నిజమైన మానసిక వికాసం జరిగినట్లు కనిపించదు. మాటల నిరంకుశత్వం వారిని అధముల్ని చేసింది. జంతువులకంటే హీనంగా, అజ్ఞానులుగా, అసహజంగా, వాస్తవానికి దూరంగా కపట జీవితం గడుపుతున్నారు. వారు అధికులమనుకోవటం గాలిలో మేడలు కట్టటంలాంటిదే. దేహంలో పూర్తిగా భిన్నమైన, స్వతంత్రమైన ప్రత్యేక ఆధ్యాత్మిక స్థితి  ఉన్నదని భ్రమలోపడి మనిషి ఒక కపట జీవితానికి అలవాటు పడ్డాడు. పరమాత్మ స్వరూపులమనే అహంభావంతో వాస్తవాన్ని చూడలేకపోతున్నాడు. మానవులు నాలా స్వేచ్ఛగాను, నిష్కపటంగానూ వాస్తవ జీవితాన్ని గడపలేరు. గనుక, నిజాయితీగా ఆలోచించి సహజంగా ప్రవర్తించలేరు గనుక వారిని నాకంటే అధికులమనుకోవటం నా వల్లకాదు.
సామాన్య మానవుల నిత్య జీవితాలను పరిశీలించి వ్యక్త పరచటమే నా వుద్దేశ్యం. నాకున్న తెలివితేటలతోనే నాపనిని సక్రమంగా చేయగలననుకుంటున్నాను. మనిషి సహాయంతో మనిషి భాషలో నేను చెప్పాలనుకున్న విషయాలు, జంతు మనస్తత్వ శాస్త్ర పరిశోధనలు విమర్శనా సాహిత్యానికి కొంతవరకు తోడ్పడగలవనుకుంటున్నాను. ఈ కథలో కొంత వూహాకల్పితాలున్నాజంతు ద్వేషంతో కూడినవి మాత్రం కాదు. నేనున్న పరిస్థితులలో, నేను మాట్లాడగలిగి వుంటే నా అభిప్రాయాలను ఎలా చెప్పగలిగేదాన్నో సరిగ్గా అలాగే నా సహాయకుడు వూహించాడు. మానవభాష నాకు ఏ కొద్దోతప్ప అర్థం కాదు. గనుక తను వ్రాసింది ఎంతవరకు సరిగ్గా వుందో నేను చెప్పలేను. నా భావాలను, నా వుద్రేకాలను, నా ప్రవర్తనను నిశితంగా పరిశీలించటానికి చాలా శ్రమపడ్డాడు. అందుకని తను రాసినదానికి నేను అనుకున్నదానికి ఆట్టే తేడా వుంటుదనుకోను. రాసినకథ చాలా నిర్దుష్టమైందని, చాలా నమ్మకంగా నా మనోగత భావాలను చక్కగా చిత్రించాడని చెప్పగలను. విమర్శనాత్మకంగా వున్న భాగాలు చాలా వరకు నా సహాయకుని వూహలనవచ్చు. కాని వాటిని నా మనోభావాల విశదీకరణగా తీసుకోవచ్చు. మానవుల స్వభావం, ప్రవర్తనలపట్ల నాలో కలిగే భావాలను బట్టి అతను ఒక నిర్దుష్టమైన విమర్శనా పద్ధతిని అనుసరించి వుండవచ్చు. కొద్దిలో చెప్పాలంటే మా ఇద్దరి సహకారం చాలా బాగా సాగింది. దీనికి కారణం అతను మనిషిలోని జంతుతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటమే.
సమాజంలోని లోపాలు గమనించగలిగినవారికి నా ఈ సాహిత్యరచన సమంజసంగానే వుంటుంది. ప్రఖ్యాత రచనలన్నీ సామాజిక వ్యవస్థల మీద, వాటిని బలపరచే పాత భావాల మీద తిరుగుబాటు చేయటానికి సాగినవే. ఇలాంటి రచనలింకా ఆధునిక భారతీయ సాహిత్యంలో కనిపించటంలేదు. భారతీయ పునర్వికాసోద్యమం కొనసాగాలంటే, దానికి సాహిత్యం సహాయపడాలంటే, నేటి సమాజంలోని కుళ్ళను, ప్రచారంలో వున్న తప్పుడు భావాలను, పనికిమాలిన సమాజవ్యవస్థల స్వరూపాలను, గుట్టులేకుండా విమర్శించే రచనలు సాగాలి. సమాజ వ్యవస్థలో మార్పు రావాలి అని కోరే రచయితలకూ యిలాంటివి రాయాలని తోచకపోవటం వింతగా వుంది. చదువుకున్న యువకులు కూడా జాతీయతత్వంలోపడి, సమాజ సమస్యలను విమర్శనాత్మకంగా చూడలేకపోతున్నారు. జాతీయత అచ్చంగా మానవగుణమో, దుర్గుణమో?. నాకీ బాధలేదు. జంతువులకు, సుఖంలేని మానవులకు (భారతదేశంలో అధిక సంఖ్యాకులు ఇలాంటివారే) ఈ జాతీయత అంటలేదు. నా రచన ముఖ్యమైన ఉద్దేశం భారతీయ ఆధునిక సాహిత్యంలో విమర్శనా దృష్టిని ప్రవేశపెట్టి ప్రజలకు జీవిత సత్యాలు తెలిపే మార్గం చూపటమే. నా రచనలో పాత భావాలకు, ఉద్వేగాలకు, నీతి బోధలకు తావుండదు. నేను భారతీయ యువతను కోరేది నాపట్ల క్రూరంగా ప్రవర్తించినవారి పట్ల ఎదురుతిరగమని కాదు. ప్రగతిపథంలో అడ్డగోలుగా వున్న భారతీయ సామాజిక జీవితంలోని కుళ్ళును, అసత్యాన్ని, కపటాన్ని ఎదుర్కోమని, మానవులు చేసే పనులు నేను సమర్థించలేను. కనుక నాతో పరిచయమున్న మానవుల అసహ్యమైన, హాస్యాస్పదమైన, లక్షణాలను బాహాటంగా వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి భావాలను స్పష్టం చేసిన నా కథ చదువరుల దృష్టిని వీటి మీదకు మరల్చి వాటి వెనుకగల సామాజిక కారణాలను వారు తెలుసుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాను. నేనొక అమోఘమైన రచనను చేస్తున్నట్లు నటించను. కానీ ఉత్తమ కోవకు చెందిన విప్లవ రచనల్ని సమర్థులైనవారు సృష్టించటానికి నా  రచన మొదటి మెట్టుగా వుంటుందనుకొంటున్నాను.
                         మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment