పిల్లి చెప్పిన కథ - 16-స్త్రీ విమోచ





జంతువులలో సంతానానికి వస్తురూపమైన విలువ వుండదు. ఆధిపత్య భావంలో పవిత్రమైన పితృవాత్సల్యాన్ని మలినపరచవు. తమపట్ల తల్లిదండ్రులు చూపిన శ్రద్ధకు సంతానం రుణపడి వుండదు. సంతానం ద్వారా లాభాన్ని పొందుదామనే ఆశ లేనందున తల్లిదండ్రులు మా భవిష్యత్తు యెలా వుంటుందో తెలుసుకుందాం అనుకోరు. మా తండ్రి బాధ్యత మా తల్లి గర్భవతి అయ్యేవరకే.  ఇది స్వల్పమే అయినా ముఖ్యమైన విధి. మానవులలో గూడా తండ్రులు చేస్తున్నది మాత్రం యింతకు మించి యేముంది? ఆ కాస్త పని ముగిశాక మా తల్లుల గర్భస్త శిశువుతో తండ్రులకేం నిమిత్తం వుండదు. మనుష్యులలో వలె ఇలాంటి నిమిత్తం పెట్టుకోవటం జంతువులలో లేదు. పొలంలో విత్తు నాటిన నుండి యజమాని పంటపొలాన్ని యెలా శ్రద్ధగా కాపాడుతాడో మానవులలో గర్భవతులైన స్త్రీలను అలాగే కాపాడుతారు. ఆధిపత్య భావమే శ్రద్ధకు కారణం. వ్యవసాయ కూలీకి పొలం మీద గాని, ఆ పొలంలో పండే పంట మీద గానీ శ్రద్ధ వుండదు. భూమికి యెలా అయితే పంట ఆశతో విలువనిస్తారో అలాగే స్త్రీ కూడా బిడ్డలను కంటుంది. కనుక విలువ పొందుతుంది. హిందూ సామాజిక న్యాయం, భార్యకు సంతానం కలుగకపోతే మరొక భార్యను చేసుకునే అధికారం పురుషునికివ్వటంలోనే తెలుస్తున్నది. స్త్రీ-పురుష సంబంధం ఎలాటిదో, ఒక చేను పండకపోతే మరో చేను సాగుచేస్తారు. అలాగే భార్య విషయంలోనూ స్త్రీ ఉత్పత్తి సాధనమే.
జంతువులలో స్త్రీ-పురుష సంబంధం యాజమాన్యాన్నిబట్టి వుండదు. మగ జంతువు శారీరకంగా తన తండ్రి పాత్ర నిర్వహిస్తుంది. కూలీకి పంట మీద హక్కు లేనట్లే సంతానం మీద యాజమాన్య ధోరణి లేకుండానే తండ్రి పాత్ర నిర్వహిస్తుంది. సంతానానికి తాను యిచ్చే ఆస్తిపాస్తులు లేవు. కనుక తండ్రి అనే భావనలో అది చిక్కుకోదు.
జీవోత్పత్తి విధానంలో స్త్రీ పాత్ర యెక్కువ గనుక మగదాని కంటే ఆడ జంతువు తన సంతానం విషయంలో ఎక్కువ కాలం శ్రద్ధ తీసుకుంటుంది. సంతానం తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిననాడే తల్లి పోషణ ఆగిపోతుంది. గీత ఉపదేశించిన నిష్కామకర్మను ఆచరణలో చూడదలచుకొంటే ఆధ్యాత్మిక శక్తి సంపన్నులమనుకునే మానవులవైపు గాక, జీవపరిణామానుసారంగా జంతువుల్లో జరిగే జీవనోత్పత్తి విధానం వైపు దృష్టి మరల్చండి. పురుషులలో గీత మీద ప్రమాణం చేయనివారూ, నిష్కామకర్మ ఆడంబరత్వమనీ ఖండించేవారూ, ఫలితాన్ని ఆశించకుండా నీ పని నీవు చేయమనే శాస్త్రాన్ని వెక్కిరించే వారూ యీ ఆదర్శాన్నే పాటించటం గమనించవచ్చు.
సంతానోత్పత్తిలో తండ్రి భాగం చిన్నదే అయినా మానవ సమాజం నాగరికం అయిందనుకుంటున్న నాటినుండి తండ్రికి తన సంతానం మీద మితిమీరిన అధికారం సంక్రమించింది. ‘పాశ్చాత్యం’ అని సమాతన హిందూ జాతీయవాదులు పైకి నిరసించి, లోలోపల కోరే ఆధునిక నాగరికత సంతానం మీద తండ్రులకు గల ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించి వేసింది.  అయినా పిల్లలు తండ్రుల అధికారానికి లోబడాలని న్యాయశాస్త్రం చెబుతున్నది. ఇండియా వంటి వెనుకబడిన దేశాల్లో తండ్రుల నిరంకుశాధికారం పిల్లలను మరీ కృంగదీస్తున్నది. అత్యంత గౌరవింపబడే ఉమ్మడి కుటుంబ విధానం  వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేస్తుంది. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం బాగా వికసించటానికి ఈ విధానం ఒక సామాజిక తత్వంగా వుపయోగపడుతున్నది. దీన్ని జాతీయవాదులంతా కోరుకుంటున్నారు. ఫ్యూడల్ – పితృస్వామిక విధానం కాలదోషం పట్టినా ఆదర్శంగా చూచేవారు కూడా పితృస్వామ్యాన్నే కోరుతున్నారు. బిడ్డలు పుట్టడానికి కారకుడైన తండ్రికే బిడ్డలమీద అధికారాన్ని సంక్రమింపచేశారు. స్వంత ఆస్తి పద్ధతి రాకముందు, సహజ జంతు జీవిత స్వేచ్ఛను మానవులు కోల్పోక ముందు, అహంకారం – అవిద్య ప్రబలకముందు, క్రైస్తవ మతపరంగా చెప్పాలంటే తల్లులే యాజమాన్యం వహిస్తున్న సమాజ వ్యవస్థ వుండేది. అప్పుడు  స్త్రీ పురుషుని ఆస్తి కాదు. సంతానోత్పత్తి కార్యం ఆమె ఆధిక్యత వహిస్తుంది కనుక ఆమె స్వేచ్ఛాయుత జీవిగా పరిగణింపబడేది. తల్లి ప్రాముఖ్యంగల వ్యవస్థలో స్త్రీకి చాలా ఉన్నత స్థానం వుండేది. ఆమె సంతానోత్పత్తికి సాధనంగా వుండనంగీకరించింది. అందువలన తన సంతానానికి ఆమె అధిపతి. ఆ పరిస్థితిలో పురుషుడు సంతానోత్పత్తికి ఉపయోగపడే ఒక చిన్న కొరముట్టు మాత్రమే. స్త్రీ ఉన్నత స్థానాన్ని పురుషుడు ఆక్రమించి, ఆమెను చరాస్తిగా భావించిన నాటినుండే సమాజంలో ఆదిమ స్వేచ్ఛ, అమాయకపు సహజత్వమూ లోపించాయి. సహజ స్వేచ్ఛాయుతమైన స్వర్ణయుగం నుండి మానవులు బయటపడి, మతాధిపతుల, జమీందారుల ఏలుబడి ఇష్టానుసారంగా సాగుతున్న మధ్యయుగాల అంధకారంలో ఐచ్ఛికంగానే మునిగారు.
మధ్యయుగాల మతమౌఢ్యం, పితృస్వామ్యం నుంచి యూరోప్ ప్రజలు యెలాగో బయట పడ్డారు. భారతదేశం మాత్రం యింకా మృత ప్రాయమైన పాతకాలపు సాంప్రదాయాలను పాతేయక జాగ్రత్తగా భద్రపరుస్తుంది.
భారతీయ సమాజ వ్యవస్థల్లో నాడూ, నేడూ గూడా పురుషుని ఆస్తిగానే స్త్రీ చూడబడుతోంది అని అంటుంటే చాలా మందికి కోపం రావచ్చు. కొందరు నా అజ్ఞానానికి నవ్వుకోవచ్చు. పిల్లి నుండి మీరింకేం జ్ఞానం ఆశించగలరు?. హిందువులు చేసే శక్తి పూజ అంటే స్త్రీకి దైవత్వం ఆపాదించటమేనని పాపం  ఈ పిల్లికి తెలియదనుకుంటారు. నాకీ కట్టుకథలన్నీ తెలియవనుకోకండి?. స్త్రీని పూజిస్తున్నామంటూ, సమాజంలో  వారి స్థానమేమిటో తెలియకుండా స్త్రీలను అజ్ఞానంలో వుంచుతున్నారు. ఓ నా మోసపోయే సోదరీమణులారా! ఒకసారి గోమాత స్థితిని పరికించిన,  మీ స్థితేమిటో మీకు అర్థమవుతుంది. గోవుగూడా దేవతగానే పూజింప బడుతోంది. ఎందుకు?  అది ఉపయోగపడే జంతువు గనుక. మిమ్మల్ని బానిసలుగా  ఉపయోగించుకొంటూ దైవత్వం అనే అందమైన ముసుగు వేస్తున్నారు. పురుషుడి అహంకారానికి లొంగివుండటంలోనే గౌరవం వుంది, అని నమ్మించడానికి మిమ్మల్ని పొగుడుతూ  వుంటాయి. మతమూ, సమాజమూ కూడా మిమ్మల్ని మాతృత్వం అనే ఉన్నత స్థాయి నుండి దిగజార్చి, మీ యిష్టాయిష్టాలతో పని లేకుండా పురుషులు మీకు భర్తలయ్యారు. దీనికి ఆధ్యాత్మిక నంటగట్టారు. మిమ్మల్ని దేవతలన్నారు. నిజంగా మీరు దేవతలా? మీ యిష్ట ప్రమేయం లేకుండా పురుషుని కామం తీర్చి, వారికి బిడ్డల్ని కనాలని మనుధర్మశాస్త్రం శాసిస్తోందని మీరెరుగుదురా?  అదే ధర్మశాస్త్రం, పాతివ్రత్యం అంటూ మిమ్మల్ని దాసుల్ని చేస్తున్నది. కానీ, భర్తలు మాత్రం తమ కామ తృప్తికి ఎంతమందినో వాడుకోవచ్చు. అనేకమందితో సపంర్కం జరిపి ఎంతోమందికి బిడ్డలు పుట్టడానికి కారణమవచ్చు. కాని నిస్సహాయులైన భార్యలు మాత్రం తమ కడుపుపంటను పురుషుల అధీనం చేయాలి. సారవంతమైన భూములను కంచెవేసి కాపాడునట్లు పురుషులు మిమ్మల్ని జాగ్రత్తగా పరదాల వెనుక దాస్తారు. స్త్రీలు పరాయిపురుషులను అభిలషించకూడదు. మీకు మనస్సులో యిష్టమున్నా ఆ తలపులు రాకూడదు. వచ్చినా మీకు వచ్చినట్లు మనసులో నైనా ఒప్పుకోకూడదు. మరొక పురుషునితో తృప్తిపడకూడదు. బలవంతంగా మీకు ముడిపడిన వాడితోనే గడపాలి.
జంతువుగా పుట్టినందుకు నా మట్టుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా తల్లి బానిస కాదు. సహజసిద్ధమైన శరీర నియమం పాటించటానికి నన్ను కన్నది గాని పురుషుని అహంకారానికి, ఆధిక్యతకి దాసురాలై కాదు. నా తల్లిని చూసి నేనెంతో గర్వపడతాను. స్త్రీ జాతిని ఆమె చైతన్యవంతం చేయగలదని ఆశిస్తాను. ఆమె పిల్లల్ని కన్నది  ఏ గృహస్థ ధర్మాన్నో, మత విశ్వాసాన్నో, సామాజిక విధిని పురస్కరించుకునో కాదు. ప్రేమకలాపాలెన్ని చేసినా తానే అధికుడననే పురుషునికి లొంగికాదు. ధర్మపన్నాల ప్రకారం ఆస్తికి వారసులను సృష్టించాలనీ, మధ్యయుగాల, మహారాజులో, యీ కాలపు హిట్లరు, ముసోలినీలో తమ గొప్పను, తమ రాజ్యపు గొప్పను ప్రదర్శించాలని చేసే యుద్ధాలకు బలికావటానికి  బిడ్డలను కనమన్నందుకు కాదు. నా తల్లి ఆనందంలోంచి నేను పుట్టాను. అందులో నా తండ్రి పాత్ర గూడా వున్నదనుకోండి. నా పట్ల నా తల్లిదండ్రులు చూపిన శ్రద్ధ సహజంగా జనించింది. దానిలో  ఏ బంధం లేదు. నేనీ ప్రపంచానికి ఒక పెట్టుబడిగా రాలేదు. పితృభక్తిని చూపాలనే బాధ్యత నాకు లేదు, అలాంటి భక్తిభావం జమీందారీల సమిష్టి కుటుంబాలలోని సంతానం మనసులో కంటగించుకొంటూ పైకి ఆదర్శంగా నటించేది. ప్రేమ-విధి కలసి మనలేవు. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామూ అంటే అది బాధ్యతలకు దూరంగా సహజంగా ఆనందదాయకంగా జరగాలి.
నా తల్లిదండ్రులకు నన్ను కనాలనే తలంపు ముందునుండి లేదు. వారి సంపూర్ణ జీవితానందంలో నేను పుట్టాను. నా జీవితం మీద వారెట్టి అధికారం చూపరు. నా కాళ్ళమీద నేను నిలబడగలగ్గానే నా బ్రతుకు నేను చూసుకోసాగాను. ఈ కారణంగా మానవుడిలా జ్యోతిష్యంలో నమ్మకంకలిగి, ఏ పండితుడికో యింత ముట్టచెప్పి నా భవిష్యత్తు తెలిసికోవాలని నా తల్లిదండ్రులు అనుకోలేదు. నా జీవితచరిత్ర అంతా పండితుడు గీసిన ఏవో గీతలమీద, తద్వారా దేవతల కరుణకు పాత్రమైందని తృప్తిపడనవసరం లేకుండా పోయింది. నా జీవిత చరిత్రముందే ఏదో కాయితం మీద ఏవో గీతల రూపంలో వ్రాసి లేనందుకు పండితులవారికి మధ్యమధ్య ఇంత దక్షిణ యిచ్చి నా జీవితంలో జరిగేఘట్టాల, కనుగుణంగా ఆయన వ్రాసిన జ్యోతిష్యాన్ని విప్పి చెప్పించుకోలేను. అయినా జీవితంలో జరిగేవి పండితులవారి తెలివితేటలమీద గాని, గ్రహాలమీద గాని ఆధారపడిలేవు.
                        మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                         వెనిగళ్ళ కోమల

1 comment:

Unknown said...

చాలా బావుంది... మీకు ధన్యవాదాలు...

మీకు సమయం దొరికినపుడు మా బ్లాగ్ ను కూడా ఒక చూపు చూడండి. :)

ధన్యవాదాలు,
తరుణ్,
www.techwaves4u.blogspot.com (తెలుగు లో టెక్నికల్ బ్లాగు )

Post a Comment