భారతీయుల బలహీనత-పిల్లి చెప్పిన కథ - 14






బ్రిటీషువారు భారతదేశాన్ని జయించటం చారిత్రకంగా దిగ్భ్రమ కలిగించే విషయం. ఎంతో దూరదేశం నుండి వ్యాపారం పేరుతో ఇక్కడకు వచ్చిన కొద్దిమంది సాహసవంతులు సులువుగా  దేశానికి యజమానులై కోటానుకోట్ల ప్రజలను దోచుకోగల స్థితికి ఎలా వచ్చారు ? భారతీయులు సాధారణంగా చెప్పే సమాధానం బొత్తిగా నమ్మదగింది కాదు. భారతీయుల ఆధ్యాత్మిక వాదం, సమాజ వ్యవస్థ, జాతీయంగా దాని ఫలితాలు ఇవన్నీ పట్టి పరిశీలిస్తేగాని సరైన సమాధానం దొరకదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థత, చారిత్రక సత్యాన్ని ఎదుర్కోగల ధీరత్వం భారతీయులకు కలిగినప్పుడే వారు తమ చరిత్రలోని ఈ అవమానకరమైన ఘట్టాన్ని రూపుమాపగలరు.
భారతజాతీయోద్యమం ఆధ్యాత్మిక తత్వంతో ముడిపడి వుండటం దానిలోని బలహినతను వ్యక్తపరుస్తుంది. నాయకులు ఆధ్యాత్మికతత్వంలో మునిగి తాము నడిపే వుద్యమాన్ని ముందుకు సాగనీయకుండా కళ్లాలు బిగలాగారు. వారీ తత్వాన్ని అంటిపెట్టుకుని వున్నంతకాలం ప్రజానీకాన్ని తాము గడిపే దుర్భరమైన జీవితంపట్ల విప్లవానికి పురికొల్పలేరు. వారింకా స్తబ్ధులుగా వుండిపోవటానికే ఆధ్యాత్మికత దారి తీస్తుంది. అంతా విధివిలాసం అని వారింకా పనికిమాలినవారైపోతారు. పరమాత్ముని లీలలకు అడ్డుతగలడం అపచారమనుకుంటారు. కర్మ సిద్ధాంతాన్ని తు.చ.తప్పకుండా నమ్మేవాళ్ళు గనుక నికృష్ట జీవితానికి తల ఒగ్గుతారు. సాంప్రదాయాలకు దాసులు గనుక వారిలో విప్లవం వచ్చే సూచనలే వుండవు. బ్రాహ్మణులు చేసే ముక్తి మార్గ బోధలు వారికి బాగా ఒంటబట్టాయి. అందుచేత వారి బానిస బ్రతుకులే వారికి నచ్చాయి. దేవుని చిత్తాన్ని బ్రాహ్మణులు సమర్థవంతంగా బోధించారు. దాని ఫలితంగా ఏర్పడ్డ సామాజిక పరిస్థితులు భారతదేశం పరాధీనం కావటానికి దోహదం చేశాయి. పాశ్చాత్య తెల్లవ్యాపారులు  ఈ దేశాన్ని నాగరికం చేసే  భారాన్ని తమ నెత్తిన వేసుకోవలసి వచ్చింది.
హిందుమతం సామాజిక బానిసాదర్శమే, ప్రతిమతము ప్రజలను మరింత అజ్ఞానానికి  గురిచేసే సాధనంగా వుండిపోయింది. ప్రజలు వున్నత వర్గాల పరిపాలనకు లొంగిపోవాలి. సిరిసంపదల హెచ్చుతగ్గులను దైవ నిర్ణయాలుగా భావించాలి. వారు పూర్వజన్మలో చేసిన పాపపరిహారంగా యీ జీవితాన్ని దుర్భరంగా గడపాలి. మూఢవిశ్వాసాలతో జ్ఞానశూన్యులుగా భావస్వాతంత్ర్యం ఎరక్కుండా బ్రతకాలి. మతమే ప్రజల్ని ఈ దుస్థితిపాలు చేసింది.
మానవసమాజ పరిణామ తొలిదశలో మతం అవసరమై వుండొచ్చు. శైశవావస్థలో ఆలోచన అంతా మత దృష్టితోనే జరిగేది ప్రకృతి అంతా ఏవో అతిలోక శక్తుల ద్వారా ఏర్పడిందని భావించేవారు. మానవ పరిణామ చరిత్రలో మతం కొంత స్థాయివరకూ అవసరమైనట్లే ఆ దృష్టిని విడిచి మరో దృక్పథంతో ఆలోచించవలసిన అవసరం అవుతుంది. అలా జరగనినాడు ఆ సమాజాభివృద్ధి ఆగిపోయి యెన్నో యిక్కట్లకు గురి అవుతుంది. మళ్ళీ కూకటి వేళ్ళతో సహా కదిలించగల విప్లవ పరిణామం జరిగితేనేగాని ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు సాగనీయలేం.
శారీరకంగా బాల్యావస్థదాటి పెద్ద వాళ్ళవుతారు. అటు తరువాతే మానసిక పరిణితి ఏర్పడుతుంది. ప్రాయంతో పాటే ముందు పిల్లల వూహలు మానసికంగా నిలకడలేని స్థితి, అటు తరువాత భావాల కుదిరిక కలుగుతుంది. అలాగే సమాజ జీవితంలో గూడా  తొలుత మత దృష్టి తదుపరి వివేచన, ఆ మీదట వైజ్ఞానిక దృక్పథం వరుసగ కనిపిస్తే యౌవనంలో వున్న వ్యక్తి పసివాడిలా ప్రవర్తిస్తే వాడి బుద్ధి మందగించిందంటాం. దీన్ని మానసిక శారీరక వ్యాధిగా భావించి చికిత్స ద్వారా బాగుచేయించవచ్చు. పెద్దవాడు పసివాడులా మాట్లాడితే అది అతనిలో మానసిక పతనావస్థగా భావిస్తాం.
భారతీయులకున్నంత చరిత్రగల ఏ జాతైనా వివేచనాత్మకంగా ఆలోచించలేక పోయినా, ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మినా, ఎదురు తిరగకుండా సాంప్రదాయాలకు కట్టుబడివున్నా, గుడ్డిగా నమ్మటమే గాని తెలుసుకుందామనే తాపత్రయం లేకపోయినా, విమర్శ దృష్టితో కాక ద్వేషించినా,  లక్షణాలు ఏ జాతిలో వున్నా అవి వారిలో జబ్బు లక్షణాలు. సమాజం స్తంభించిపోవటంవల్ల మరీ వ్యాపించాయి. పిల్ల తరహా మత విశ్వాసాలు రాజ్యం చేసినా, బూజుపట్టిన పురాణ భావాలు పేరుకుపోయినా, అవి ఆ సమాజపు పురోభివృద్ధిని కృంగదీసే లక్షణాలే,  ఈ వ్యాధి ముదిరిపోయి భారతీయ మానసిక, శారీరక శక్తులను తుదముట్టిస్తుంది. దీన్ని నయం చేయాలంటే చాలా తీవ్రమైన శస్త్ర చికిత్స జరగాలి. కుళ్ళిపోయిన గ్రంథులను నిర్దాక్షిణ్యంగా కోసివేసి, వాటి బదులు ఆరోగ్యకరమైనవి అమర్చాలి. ఇతరులు దేహాల నుండి తీసిన బలమైన రక్తాన్ని ఎక్కించాలి. మరీ తేట తెల్లంగా చెప్పాలంటే భారతదేశం వినాశకరమైన ఆధ్యాత్మిక తత్వాన్ని విడనాడాలి. పెడ మార్గం పట్టించే నాయకుల ‘పాశ్చాత్యనాగరికత’ అని తెగడే ఆధునిక మానవ వారసత్వాన్ని అందుకొని అభివృద్ధి మార్గంలో నడవాలి. లేదా ఆధ్యాత్మిక ఉన్నతి పేరుతో పతనానికి సిద్ధమైనా కావాలి.  
పురాణాల్లో చెప్పబడిన స్వర్ణయుగాన్ని తీసుకురావటానికి యిప్పటికే చాలా జాప్యం జరిగింది. మానసిక దాస్యం సర్వోత్తమమైనదనే విపరీత భావం ప్రజలలో ఉన్నంతకాలం భారతీయులు దానినుండి బయటపడలేరు. నిరాడంబర జీవితం ఆదర్శవంతమైనదని బోధించే కపటప్రవక్తలు, తప్పుడు తత్వవేత్తలు దేశాన్ని నడిపించినంతకాలం ఈ పతనం తప్పదు. నిరాడంబరమే జీవితాదర్శమైతే  ఎంత నిరాడంబరంగా వుంటే అంతమంచిది.  ఈ బోధనను పాటిస్తే భారతీయులు వెనుకకు నడవాల్సుంటుంది. ఈ కృత్రిమ ఆదర్శాన్ని చేరాలంటే మనుషులు నాగరిక జీవితాన్నుంచి తిరోగమనం చేసి చేసి చివరికి వారి పూర్వీకులు బ్రతికినట్లు ఏ చెట్లమీదనో పుట్లమీదో నిరాడంబరంగా బ్రతకాలి.
జాతిని భౌతికంగానూ, నైతికంగానూ, వైజ్ఞానికంగాను పునరుజ్జీవింప చేయాలంటే వినాశకారి అయిన  ఈ నిరాడంబర ఆదర్శాన్ని విడనాడాలి. కొద్దిమంది సంపన్నుల, కులపతుల, మతాచార్యుల రక్షణకోసం ఈ సిద్ధాంతం బోధించారు. పాతకాలపు ఉత్పత్తి విధానంలో, సామాన్యుల శ్రమ ఫలితాన్ని  బోధించారు. పాతకాలపు ఉత్పత్పి విధానంలో, సామాన్యుల శ్రమఫలితాన్ని పై వర్గాలవారు పూర్తిగా  దోచుకుంటూ సోమరులుగా సుఖాలను అనుభవిస్తుంటే ఉత్పత్తి కారకులైన ప్రజలు అతి సామాన్యమైన నిత్యావసరాలు గూడా తీర్చుకోలేకపోతున్నారు. పై వర్గాల వారు (భూస్వాములు, భాగ్యవంతులు, మత గురువుల ఉత్పత్తిలో అధిక భాగాన్ని అనుభవించడమేగాక, పండించేవారికి దక్కవలసిన దానిలో గూడా ఇంకా, ఇంకా కోత పెడుతుంటారు. ఆర్థిక అసమానతలు సమాజంలో సాదా జీవనం గురించి బోధించటం అవసరమే. మరి అల్పసంఖ్యాకులు భోగం అనుభవిస్తుంటే అధిక సంఖ్యాకులు అతి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు.
రోమన్ సామ్రాజ్యం, మధ్యయుగాల నాటి యూరోప్, భారతీయ వైభవం కూడా సామాన్య ప్రజల పేదరికంపై  ఆధారపడిందే. క్రైస్తవ మతం కూడా నిరాడంబర జీవితాన్ని కావాలంటుంది. మధ్యయుగాలలో మతాధికారులు ఈ సిద్ధాంతాన్ని బోధించగా సామాన్య ప్రజ తప్పనిసరై దానిని అనుసరించారు. గొప్పగా నిర్మించిన దేవాలయాలు దుబారా ఖర్చుతో కూడిన మత ఉత్సవాల పవిత్రప్రభావాన్ని సూచించవు. అవి పాలకుల ప్రతిభను, ప్రజానీకపు దుస్థితిని వెల్లడిస్తాయి. జాతి సంపదను అలా పనికిరాని పనులకు వ్యయం చేస్తే సమాజంలో ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలు శ్రమతో సాధించిన సొత్తు అధికోత్పత్తికి వినియోగించకుండా, పెద్ద పెద్ద రాతి కట్టడాలకు, బంగారునగలకు వాడారు. ఇదే ప్రజల శ్రమ ఫలితాన్ని దోచుకోటమంటే ప్రజలను బానిసలుగా చేసి వారిచేత వెట్టి చాకిరీ చేయించుకోటానికి అనువుగా కులతత్వాన్ని ప్రవేశపెట్టారు.
నిరాడంబర జీవితం. ఈలోక విషయాలను తుచ్ఛంగా భావించమని  బోధించే మత సిద్ధాంతాలు, నీతి బోధలూ ప్రజల దారిద్ర్యం అండగా పెట్టుకొని మధ్య యుగాల సమాజం నిలవగలిగింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానం పారద్రోలి విజ్ఞానం పొందాలన్నా ఈ విపరీత ధోరణులకు స్వస్తి చెప్పాలి. ఈ సిద్ధాంతాలను బోధించేవారు మహాత్ములైనా, వేదాంతులైనా మధ్య యుగాల్లోని వెనుకబడినతనాన్ని సమర్థించినవారే. ప్రజలు తామున్న దుస్థితిలోనే సరిపెట్టుకున్నంత కాలం పారిశ్రామికంగా, వ్యాపార రీత్యా బాగుపడలేదు. ఐహిక సుఖాలు తుచ్ఛమని భావించకుండా తమ జీవితావసరాలను  సుఖం కోసం తీర్చుకుందామని ప్రజలకు కోరిక కలిగితేనేగాని పరిశ్రమలూ వాణిజ్యం వృద్ధి చెందవు. మధ్యయుగపు వెనుకబడినతనం నుండి  ప్రజలు బయటపడాలంటే సామాన్య ప్రజల జీవిత  ప్రమాణాలు పెరగాలి. నిరాడంబర సూత్రం జాతి పునరుజ్జీవనాన్ని ఆపివేస్తుంది. భారతీయులు ఆధునికం కావటం కాని, రాజకీయంగా స్వేచ్ఛాపరులవటం గాని, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందకుండా త్రొక్కివేస్తున్నది. వారి ఆధ్యాత్మికత, ఐహిక వాంఛలు తుచ్ఛమనే భావమే.
ప్రజానీకం జీవితం అంటే తుచ్ఛమనే భావాన్ని విడనాడకపోతే వారికి బాగుపడే అవకాశమేలేదు. ఆధ్యాత్మికత్వం ఎంత బోధించినా భారత ప్రజలు అందరిలాగే జీవితాన్ని ప్రేమిస్తారు. అయితే మత సిద్ధాంతాలు, సాంప్రదాయాలు వారిని సహజంగా బ్రతకనీయటంలేదు. ఐహిక సుఖాలను విడనాడటం  వారు ఇష్టపూర్వకంగా  కాక గతిలేని విధిగా చేస్తున్నారు. అతి భారంగా జీవితాలు గడవటం వల్ల వారు యీ వినాశకారి సూత్రాలను వీడి జీవితం నుండి పారిపోవాలనుకుంటున్నారు. జీవిత సుఖాలకు  ఎడం కావటం మంచి లక్షణమేమీకాదు. కోరి వరించిన ఆత్మ వంచనే. ఇలాంటి సభ్యత నీతి దూరమైంది. వంచన మానవుని మనసును మలినపరుస్తుంది. దురభిప్రాయాలు జ్ఞానాన్ని సంకుచిత పరుస్తాయి. మూఢవిశ్వాసాలు నైతికంగా అభివృద్ధి చెందనీయవు. తాను నమ్మిన జీవితాన్ని గడపాలంటే ఇవన్నీ అవరోధాలే.
రాజకీయ స్వేచ్ఛ పొందాలన్నా, ఆర్థికంగా ముందుకు పోవాలన్నా, నాగకరికత పెరగాలన్నా, నైతికంగా ఉన్నతం కావాలన్నా భారత ప్రజలు బ్రతుకును ప్రేమించగలగాలి. యధాలాపంగా కొందరు ఏ గంగా తీరానో, లేక అలాంటి మరో మురికి నీటొడ్డునో పుట్టినంత మాత్రాన వారు ప్రకృతి జయించలేరు. మానవాతీత శక్తులను పొందనూలేరు. జీవితాన్ని ప్రేమించటం అనేది అసలు జీవితంలోనే ఇమిడివున్నది. ప్రేమతోనే జీవితం ప్రారంభమవుతుంది. జీవితాన్ని ప్రేమించటమే నేరం అయితే దేవుడు ఈ ప్రపంచాన్ని మరోరకంగా ఏర్పాటు చేసివుండేవాడు. అసలు అతను ఒక పాపసముద్రాన్ని ఎందుకు సృష్టిస్తాడు... దాన్ని తరించాల్సిన బరువును మానవులమీద ఎందుకు పెడతాడు? జీవితాన్ని ప్రేమిస్తారు. కాని అదేదో నేరమన్నట్లు దాపరికంగా చేస్తారు. ఈ జీవితానికి అతీతంగా మరో మహత్తర జీవితం ఉందనుకోటమే జీవితంపట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తుంది. ఆ జీవితాన్ని పొందాలనే ఆశతో యీ జీవితాన్ని విడనాడాలనుకోటం జరుగుతున్నది. దీన్ని సర్వసంగ పరిత్యాగమని విమర్శనాత్మకమైన  దృష్టి లేనివారే భావిస్తారు. జీవితాన్ని నేరంగాను, దొంగతనంగాను భావించకుండా బాహాటంగా, ధైర్యంగా ప్రేమించగలగాలి. నిజమైన అత్మోన్నతి సహజమైన సమాజాభివృద్ధిలోనే ఉన్నది. జీవించటమెలాగో తెలియనప్పుడు జీవితాన్నుండి పొందగలిగేదేముంది? ఆత్మహత్య తరుణోపాయం కాదు.
జీవితంలోని తీపి యేమిటో తెలుసుకున్ననాడు భారతీయులు మత విశ్వాసాలకు, కృత్రిమ తాత్విక సిద్ధాంతాలకు లొంగని జీవితవైపు దృష్టి సారించి బ్రతకగోరుకుంటారు. అది వారి ఆత్మవికాసానికి దారితీస్తుంది. జీవిత సుఖాలంటే ఏమిటో చవిచూసిన వారు దాన్నుండి పారిపోవటానికి ప్రయత్నించరు సరికదా దాన్ని ఒక వరంగా భావిస్తారు. అప్పుడు పాశ్చాత్యపద్ధతి అనబడే జన్మదినోత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ నా పుట్టినరోజు ఏదో తెలియకుండానే నా కథ ప్రారంభించాల్సి వచ్చింది. పరిస్థితులకు నేను లొంగిపోయానంతే.
                         మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment