పిల్లి చెప్పిన కథ - 12--ఆధ్యాత్మికతకు మూలం -1



మనిషి ఆధ్యాత్మిక లక్షణాలనబడే మతము, నీతి, కళలు అన్నీ కూడా జంతు ప్రేరణలకు నిలయమైన అవ్యక్తపు అదుపులోనివే. కనుక నా  సాహిత్య సాహసం ఏమంత
సహజమైంది కాదు.



మీకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవటమొక్కటే నా రచనలోని లోపం. అది పూర్తిగా మంచిని చేకూర్చకపోయినా నా రచనను నేను యిష్టమొచ్చినట్లుగా చేసే స్వేచ్ఛనిస్తుంది. భావాలు భాషకు బలికానక్కరలేదు. గునపాన్ని గునపమనే చెప్పనక్కరలేదు. ఇనుముతో ఫలానా ఆకారంతో తయారు చేయబడిన  పనిముట్టు అనొచ్చు. అయినా భాషకు సంబంధించిన అవరోధం ఏర్పడుతుంది. సాంకేతికంగా దీనిని దాటాలి. నేను చెప్పదలచుకొన్నది మీ భాషలో చెబితేగాని మీకు అర్థం కాదాయె. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనిషి సహకారం అవసరమవుతోంది. అదీ దైవంలో నమ్మకంలేని వాడు దొరకాలి. తనలోని జంతుతత్వాన్ని పూర్తిగా ఎరిగినవాడు కావాలి. అలాంటివాడే నా భావాలను సరిగా తెలుసుకొని వాటిని మనుషుల భాషలో చెప్పగలడు. 

అలాంటి వాడొకడు నే పుట్టిన జైల్లోనే దొరికాడు. నాకు ఒక నెల వయసులోనే అతన్ని కలిశాను. లోకం దృష్టిలో నేనతనికి పెంపుడు జంతువుని. అతను నాకు యజమాని. యదార్థానికి మా సంబంధం మరొక రకమైనది. లేక పోతే అతను నాతో సహకరించి నా మనసులోని భావాలను మనిషి భాషలో వ్రాయటం జరిగేది కాదు. అయితే జంతువుల ఉద్రేకాలు గ్రంథ రూపంలో వెలువడడం యిదే మొదలు కాదు. (వైజ్ఞానిక పుస్తకాలు మినహాయిస్తే) మిగిలిన సాహిత్యమంతా ఇలాంటి ఉద్రేకాల చిత్రణే. తేడా ఎక్కడంటే సహజమైన జంతుం ప్రేరణలను మానవత్వపు మిషతో అవినీతిగానూ, నీచంగానూ, అసత్యంగానూ, మారురూపాలతో చిత్రించటం జరుగుతోంది. ఈ తేడా చాలా పెద్దది. నా  ఈ రచన నా వుద్రేకాలను మాత్రమే వెలిబుచ్చేదికాదు. మానవ ప్రవర్తనను పరిశీలించి ఆ ప్రవర్తనకు కారణమైన భావాలను విమర్శనా దృష్టితో వ్యక్తపరచదలిచాను.

మానవుల గుత్తాధిపత్యమైన సాహిత్య రంగంలోకి నేనెందుకు ప్రవేశించదలిచానో సరిగానే చెప్పాననుకుంటాను. సాహిత్యం వారి సొంతమనుకోటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి వారి భాష, రెండోది బుద్ధిలోను, భావాలలోను అధికులమనుకోటం. మొదటిది వారికి అనుకూలమైంది కాని మీరు దీన్ని ఇంతవరకు దుర్వినియోగం చేస్తూవచ్చారు. అయినా నాకు దాని వల్ల ప్రయోజనం లేదు. మా భావాలేమిటో మనిషికి తెలియపరుద్దామంటే వీలుకాకుండా వుంది. భాషాపరమైన యిబ్బందిని ఎదుర్కోగలిగాను. బుద్ధిలోనూ, భావాలలోనూ మనిషి అధికుడు అనుకోవటం కేవలం భ్రమ.

నేనెంత తెలివైనదాన్నో, నా భావాలెంత సున్నితమైనవో మానవునకు తెలియదు. ఇప్పుడు ఇవి తెలుసుకోవాలంటే కేవలం వూహమీదే ఆధారపడనవసరంలేదు. పరిసరాలను గుర్తించటం, వాటి ద్వారా కొన్ని అభిప్రాయాలు ఏర్పడటం జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతున్నది. జ్ఞానేంద్రియాలో ఏవో కొన్నయినా మానవులలోకంటే జంతువులలోనే ఎక్కువ శక్తివంతంగా వున్నాయనేది నిర్వివాదాంశం. నా చూపు మనుషుల చూపుకంటే చురుకైనది. మనిషి చూడలేని  అనేక వస్తువులను నేను చూడగలను. అంతవరకు నా తెలివితేటలు మేలేనన్నమాట. పరిశీలించి చూస్తే మేమెంత సున్నితంగానూ, సునిశితంగానూ వుంటామో అర్థమవుతుంది. జంతువుల జీవితాలను గురించి ఆధునిక శాస్త్రం ఎన్నో విషయాలను తెలుపుతున్నది.

బుద్ధికి మూలమైన మెదడు సంగతికొద్దాం. నా మెదడుకు, మనిషి మెదడుకు గల తేడా పరిమాణంలోనే గాని గుణంలో కాదు. నా మెదడు చిన్నదైనా నా తలపరిమాణాన్ని బట్టి సరిగా వున్నట్లే, నా తల గూడా మనిషి తలంత ఉన్నట్లయితే నా మెదడు మనిషిని మెదడును మించి వుండేది. పరిమాణంలో గల తేడా సాపేక్షమైనది.  నిర్మాణంలోనూ, పనిచేయటంలోనూ ఏమీ తేడాలేదు. పరిసరాలు మెదడులో కలిగించే చిత్రణల సాముదాయక రూపాన్ని ‘జ్ఞానం’ అంటారు. ఈ చిత్రణలు జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడుతాయి. నేను ఒక్క దృష్టి విషయంలోనే గాక అన్ని విధాల మానవునికంటే సునిశితంగా వుంటాను. మనిషి మెదడులో చిత్రణలకు నా మెదడులోని చిత్రణలు ఏ మాత్రం తీసిపోవు. అలాంటప్పుడు మానవులకంటే నేను తెలివితక్కువ దానినని ఎందుకనుకోవాలి.

మానవుల కంటే దిగువ శ్రేణిలోవున్న జంతువులకు ఆలోచనాశక్తి లేదనుకుంటారు. మానవుల అహంకారం అలా అనుకొనేలా చేస్తుంది. మానవులకర్థమయ్యే భాషలో మా భావాలను వ్యక్తం చేయలేమనీ మాకసలు ఆలోచించే శక్తే లేదనీ, అదంతా వారి సొత్తేననీ తలుస్తారు. ఆలోచన శారీరకమైన క్రియ బాహ్య ప్రపంచం కలిగించే చైతన్యం మూలంగా జరిగేపని. ఈ చైతన్యం మానవులలోను, జంతువులలోను ఒకే విధంగా వుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే, శారీరక, రసాయనిక మార్పులవల్ల ఈ చైతన్యం భావాలుగానూ, వుద్రేకాలుగాను రూపం దాలుస్తుంది. అవయవ నిర్మాణంలో, శారీరక ధర్మాలను బట్టి చూస్తే మానవదేహాలకూ, వారి కంటే ఒక మెట్టు క్రిందవున్న జంతువులకూ తేడా ఒక్క పరిమాణంలోనే అని తెలుస్తున్నది. మానవ నాడీమండలం క్లిష్టమైనదంటారు. ఈ విషయం గూడా శాస్త్రీయంగా సరైనది కాదు. మెదడు పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలంటే శరీర ప్రవర్తనను పరిశీలించటం ద్వారానే తెలుసుకోవచ్చు.  ఒక్క మాట్లాడే భాష విషయంలోనే మనిషికీ జంతువుకీ తేడా ఉన్నది. మాట్లాడటం అంటే బిగ్గరగా ఆలోచించడం అన్నమాట, కానీ తీవ్ర ఆలోచనలు చేయాలంటే నిశ్శబ్దంగా చేయాల్సి వుంటుంది. అతిగా వాగేవారికి బుర్రలు శూన్యంగా వుంటాయి. మౌనమే భూషణం అన్న సామెత అందుకే పుట్టింది. పద్మాసనం వేసి ఇబ్బందిగా కూర్చొని కళ్ళు మూసుకుంటేనో, లేక బొడ్డువైపు చూస్తూ వుంటేనో ఆ మనిషి చాలా గట్టి ధ్యానంలో మునిగి వున్నట్లు లెక్క. నా నాలుగు కాళ్ళు పొట్ట కాళ్ళు పొట్ట కిందకు ముడిచి పడుకుని కళ్ళు మూసుకొని ఉంటే (నిద్రపోవటం కాదు). నేను కూడా ధ్యానంలో ఉన్నానని ఎందుకనుకో గూడదు? మీకు ఓపిక, పరిశీలనా శక్తి వుంటే, ఒక్క క్షణం మీ అహంకారాన్ని  విడవగలిగితే (యిది అన్నిటికన్నా ముఖ్యం) గంజాయి పొగ పీల్చడం వల్ల బుద్ధి మాంద్యం ఏర్పడ్డ సాధువుల లక్షణాలు నా ముఖంలో స్పష్టంగా చూడగలుగుతారు. ఎవరన్నా పోసిన పాలైనా, లేక దొంగిలించినవైనా కడుపు నిండా త్రాగితేనో, లేక మంచి పచ్చిమాంసం తిన్నా నాలోని ఆధ్యాత్మిక చింతన యింకా బాగా కనబడుతుంది. తినటానికి ఎలుకన్నా, ఉడుతన్నా దొరికితే యింకా మజాగా వుంటుంది నా పరిస్థితి.

మానవ జీవితాన్ని సన్నిహితంగా చూడగలగటం వల్ల వారిలా మేము గూడా తాత్విక ధోరణిలో పడుతూవుంటాం. తిండికి తిప్పలు పడనవసరం లేకపోతే మేమెప్పుడూ ధ్యానంలో  ఉండిపోయేవాళ్ళం. ఆధ్యాత్మిక భావాలు పెంపొందాలంటే విశ్రాంతి కావాలి. ఈ సూత్రం మాకూ అన్వయిస్తుంది. మా ఆధ్యాత్మిక ఆధిక్యతను హిందువులు తప్పక గుర్తించాలి. మాటల్లో వ్యయం అయ్యే శక్తిని కూడగట్టుకోటానికి వారప్పుడప్పుడూ మౌనం  వహిస్తుంటారు. మా జీవితం అంతా తపస్సుకే అంకితం అయిపోయింది. భావాలను మాటల్లో వ్యక్తం చేయలేకపోవటం ఒక విధంగా మాకు మంచిదే. దైహికమైన (దైవికమైన కాదు) ఈ లోపం మా మానసిక స్వేచ్ఛకు కారణమైంది. మనిషికాస్వేచ్ఛలేదు. వారి భావాలను ఉద్రేకాలను భాష పరిమితం చేస్తుంది. మాకలాంటి బాధలేదు. మా భావాలు, వుద్రేకాలు మనుష్య పద్ధతిలో రాయబడవు. అవి మరోవిధంగా జాగ్రత్త చేయబడతాయి. అవి మానవుని అవ్యక్తాంశం లోనికి ప్రవేశిస్తాయి. ఈ ఆవ్యక్త భాగమే మానవుని చేష్టలన్నిటికి హేతువు.

ఒక భాషతప్ప మిగతా ప్రవర్తన అంతా మానవులలో జంతువులలో ఒక్కలానే ఉంటుంది. ఒకేవిధమైన శారీరక ప్రవర్తనల కాధారమైన మానసిక ప్రవృత్తులు గూడా ఒకేలా వుంటాయి. కనుక మానవుడిలో ఆత్మ అనేదేదో వుంటుంది. అదే వారి ఆధ్యాత్మికతకు ఆధారం అనే మూఢ నమ్మకంగల మానవులకు, జంతువులకు ఆత్మవుండదు కనుక ఆలోచించలేవు అనిపిస్తుంది. నా కథ వింటుంటే నా తెలివితేటలు మీకే అర్థం అవుతాయి. ముందు ముందు నాకంటే ఎక్కువ అనుభవంగల ఒక గండు పిల్లిని పరిచయం చేస్తాను. మానవ శత్రువు మీద విజయాన్ని సాధించటానికి అతడెంత తెలివిగా, జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో మీకు రుజువవుతుంది. నెపోలియన్ ధైర్య సాహసాలు, మెకివల్లీ నేర్పరితనం, రిచ్ లు మాయోపాయం అన్నీ అతనిలో కనిపిస్తాయి.
(ఇంకావుంది)

    మూలం      తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment