జ్యోతిష్యం మూఢనమ్మకం


పిల్లి చెప్పిన కథ – 17
ముగింపుజ్యోతిష్యాన్ని గురించి నేనేమన్నా విమర్శిస్తే పాఠకులు అభ్యంతరం పెట్టరనుకుంటున్నాను. భారతీయులు చాలామంది, చదువుకున్నవారు గూడా,  యింకా ఈ పురాతన మూఢ నమ్మకాన్ని ఒక శాస్త్రంగా పరిగణిస్తున్నారు. అలాంటప్పుడు దాన్ని గురించి విమర్శించటం ఏమీ చేయకూడని పని కాదు. మూఢనమ్మకాలంటే నాకు గిట్టవు. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఖండించకుండా వుండలేను. ఈ మూఢనమ్మకాల మబ్బులు భారతీయాకాశం నుండి చెదిరిపోతే తప్ప జ్ఞానసూర్యుని ప్రకాశవంతమైన కిరణాలు ప్రసరించవు. ఈ అజ్ఞానాంధకారం ప్రారద్రోలాలంటే మంచి విమర్శ అవసరమవుతుంది.
విశ్వనిర్మాణ విధానంలో తానే కేంద్రం అనుకొని మానవుడు మిడిసి పడుతుంటాడు. అందునుండి జ్యోతిష్యం పుట్టింది. కోపర్నికస్ సూర్యకేంద్ర ఖగోళశాస్త్రం కనుగొనటంతో మానవుల అహంకారానికి చావుదెబ్బ తగిలింది. జగత్తుకు కేంద్రం భూమి కాదని తేలగానే మానవుని ప్రాధాన్యత సన్నగిల్లింది. దేవుడు గ్రహాలను మానవుల సంరక్షణార్థం సృష్టించాడనేది  శాస్త్రరీత్యా రుజువుచేయలేకపోయారు. జగత్తుకి భూమి కేంద్రం కాదన్న తరువాత ఈ జగన్నాటకంలో అతి ముఖ్యమైన పాత్రవహిస్తున్నామని మానవులు విర్రవీగటానికి వీలు లేకపొయింది.
ఈ దేశం నమ్ముతున్న జ్యోతిష్యం మరీ కాలదోషం పట్టింది. అది విజ్ఞానస్థాయి నెప్పుడూ చేరుకోలేదు. పైగా కేవలం గుడ్డి నమ్మకం. అందులో జంతుతత్వం స్ఫురిస్తుంది. అనాగరికుల మతమది. పాశ్చాత్య జ్యోతిష్యులు తమది విజ్ఞానసమ్మతమైన జ్యోతిష్యం అంటారు. నక్షత్రాలు, మానవులలో ఒక విధమైన భౌతిక-రసాయనిక పరివర్తనలు కలిగిస్తాయని వారంటారు. ఈ అభిప్రాయం అర్థరహితమైంది. ఇంతకంటే హాస్యాస్పదమైంది హిందూ జ్యోతిష్యం.
హిందువుల ప్రకారం నవగ్రహాలు భౌతికమైనవికావు. అవి దేవతలు. అందులో రాహుకేతులనేవి సగం దేవతలు, సగం రాక్షసులూను. ఈ జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా సమర్థించలేం. ఆధునిక ఖగోళశాస్త్రంలో దీనికి స్థానంలేదు.
సాంకేతికంగా నవగ్రహాల్ని దేవతలన్న, అవి భౌతికమైనవేనని, భౌతిక రసాయనిక             ( ఆధునికంగా చెప్పాలంటే- విద్యుత్ సంబంధమైన) మార్పులు మానవులలో కలిగిస్తాయని వాదించటానికిగుడా వీలు లేదు. ఖగోళశాస్త్రంలో ఏపాటి ప్రవేశమున్నా నవగ్రహ సిద్దాంతాన్ని త్రోసిపుచ్చాలి కనుక హిందూ ఖగోళశాస్త్రాన్ని ఏ విధంగాను సమర్థించలేం. అలా సాంప్రదాయంగా వస్తున్నా ఈ సిద్దాంతం లేనినాడు హిందూ జ్యొతిష్యమేలేదు.
గ్రహకూటమి, గ్రహసంచారంవల్ల మానవ జీవితం ప్రభావితం అవుతుందనే ప్రాతిపదిక ఆధారంగా లెక్కలు కట్టి జ్యోతిష్యము చెపుతారు. నవగ్రహాలు నక్షత్రాలు అంటారు. అవన్నీ కలగాపులగం. సూర్యనక్షత్రం ఆరుగ్రహాలు, రాహుకేతువులు ఊహాకల్పితాలు. ఆరు గ్రహాలూ గూడా సూర్యకుటుంబానికి చెందినవీ లేనిదీ తేల్చలేము. చంద్రుని గ్రహమంటారు. కాని భూమిననుసరించుకొని తిరిగే ఉపగ్రహం. మిగిలిన ఐదుగుడా గ్రహాలా లేక ఊహాకల్పితాలా అని నిర్ణయించడానికి వీలు లేదు. ఎలా చూచినా నవగ్రహాలలో ఐదు మాత్రమే హిందూ జ్యోతిష్యంలో లెక్కకు తేలుతాయి. గ్రహబలం మానవుల జీవితాల మీద వుందనుకుందామన్నా,  తొమ్మిదిలో నాలుగుపోతే మిగిలేది ఐదు గ్రహాలే కనుక వాటి ప్రకారం జ్యోతిష్యం లెక్క తప్పవుతుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లెక్కలు సరిగ్గానే వున్నాయని చెప్పటం నమ్మకాలను బలపరచినట్లే అవుతుంది. జ్యోస్యాలు నిజం అయ్యాయి అనటానికి కారణం అవి తప్పవవచ్చు అనే అనుమానం ఎవరికీ లేకపోవటమే. విశ్వాసంతో కొండను గూడా కదిలించొచ్చంటారు ఇలాంటి నమ్మకాలు గలవారు. నవగ్రహాలలో నాలుగు వట్టిదే అని తేలినా యింకా జ్యోతిష్యం, గణితం తప్పంటే వొప్పుకోరు. విశ్వాసాలను ఒక  దరికి నెట్టి విమర్శనాత్మకంగా ఆలోచిస్తే జ్యోతిష్యం తప్పో ఒప్పో బోధపడుతుంది.
జ్యోతిష్యపు లెక్కలు గణితం లెక్కల్లా ఖచ్చితమంటారు. ఆధునిక ఖగోళ శాస్త్రానుసారం చూస్తే జ్యోతిష్య లెక్కలు గణితానికి సరిపోవంటారు. అయితేయేం! వాటిని బట్టి చెప్పే జ్యోస్యాలు నిజమవుతున్నాయి! ఇది అద్భుతాల్లో ఒకటి. అలా అవకపోతే దీనికి సంజాయిషీ లేదు. విశ్వాసాన్ని వీడండి. ఈ లెక్కలు, వాటి నిజాయితీ అంతా బూటకంగా తోస్తుంది. మీ ఆరాధ్య దేవతలు మట్టిబొమ్మలన్నా, మీ జ్యోతిష్యాలు తప్పన్నా మీకు కోపం వస్తుంది. నేను మీ జ్యోతిష్యాన్ని నిరసించినట్లే మీ ఆధ్యాత్మికవాదులు శాస్త్ర విజ్ఞానాన్ని నిరసిస్తారు. మీరు యిలాంటివారే అయితే నేను చేయగలిగిందేమీ లేదు. "మానవుల శక్తులన్నిటిలో అత్యున్నతమైన విజ్ఞానాన్ని, విచక్షణనూ నిరసించే వారు నావాత పడక తప్పదు" అని                  (జర్మను మహాకవి గోధే) "పాస్ట్"లో ఒక భూతం చేత చెప్పించిన మాటలు మాత్రం గుర్తు చేస్తాను.
ఆధునిక ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యానికి స్థానం లేదు. పదార్థ విజ్ఞాన శాస్త్ర ప్రకారం విశ్వ నిర్మాణ విధానంలో మానవునికి విలువేమీ కనిపించదు. ఆధునిక ఖగోళ శాస్త్ర మూల సూత్రాలను పరిశీలిస్తే మానవునిది లజ్జాకరమైన స్థానమని తేలుతుంది. మానవ నివాసమైన  ఈ భూమి సూర్యకుటుంబంలోని చిన్న గ్రహాలలో ఒకటి. ఈ కుటుంబ కేంద్రమైన సూర్యుడు పదివేల కోట్ల నక్షత్ర సమూహాల్లో సామాన్యమైన పరిమాణం గలది అందులో కొన్ని సూర్యుని కంటే ఎన్నోకోట్ల రెట్లు పెద్దవి. అలాంటి పదివేల కోట్ల నక్షత్ర సముదాయాలతో కూడినదే ఈ విశ్వం అని పరిశీలనకు తేలిన విషయం.
ఈ విషయాన్నే మరో కోణంలో చూస్తే విభ్రాంతి కలుగుతుంది. అన్ని సముద్ర తీరాలలో కలిసి ఎన్ని యిసుక రేణువులుంటాయో విశ్వమంతటిలో నక్షత్రాలు అన్ని అంటాడు, సర్ జె.హెచ్ జీన్సు అనే ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త. అసంఖ్యాకమైన ఈ నక్షత్రాల్లో సూర్యుడి పరిమాణం చాలా చిన్నది. అయితే భూమికంటే సూర్యుడు పది లక్షల రెట్లు పెద్ద పరిమాణం కలది. ఒక నక్షత్రానికీ మరో నక్షత్రానికి మధ్యగల దూరం చాలా ఎక్కువ. ఆ దూరాన్ని ‘కాంతి సంవత్సరాలు’ అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటే 1,86,000 x 60 x 60 x 24 x 365 మైళ్ళ దూరము, ఇది వెలుతురు సెకండుకు 1,86,000 మైళ్ళ చొప్పున సంవత్సరంలో ప్రయాణం చేసే దూరమన్నమాట. సూర్యుణ్ణి మినహాయిస్తే మిగతా నక్షత్రాల్లో భూమికి దగ్గరలో వున్న దాని నుండి వెలుగు భూమికి చేరటానికి 4.3 కాంతి సంవత్సరాలు పడుతుంది. సూర్యుని కాంతి భూమికి చేరటానికి పట్టేది 8 నిమిషాలు మాత్రమే.
అణు సమానమైన ఈ భూమి మీద మానవులను కనిపెట్టి, కాపాడటానికి యీ ఖగోళ నిర్మాణం జరిగిందని తలచటం మానవుల అహంకారం వల్లనే. ఇది ఎంత అసంబద్ధమో వూహించనవసరం లేదు.
ఖగోళంలో ఒక గోళానికి, మరో గోళానికి వున్న సంబంధం వెలుతురు ద్వారానే, మానవ జీవితాలమీద నక్షత్రాల ప్రభావం అంటూ వుంటే అది వెలుగుద్వారా జరగవల్సిందే. సూర్యుడు కాక భూమి మీదకు వంద ఏళ్ళ కాలంలో వెలుగు పంపగలవి మూడే మూడు నక్షత్రాలు. అంటే చాలా ఎక్కువ కాలం బ్రతికిన ఒక వ్యక్తి జీవిత కాలం పడుతుందన్నమాట. ఆ వెలుగు భూమికి చేరే సరికి. అంటే భూమి మీద నివశించే మానవుల జీవితాల మీద యించుమించు ఏ నక్షత్ర ప్రభావం వుండదన్నమాట. ఇలాంటి నక్షత్రప్రభావం వీలుకాదు అన్నప్పుడు ఫలానివాడి జన్మ నక్షత్రం ఫలానా అని అనటంలో అర్థంలేదు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతి దగ్గరలో వున్నదనుకున్న నక్షత్రం నుంచి ప్రయాణమైన కాంతి కిరణాలు ఆ వ్యక్తి పుట్టిన 4.3 కాంతి సంవత్సరాలకు గాని భూమికి చేరవు. ఇక మిగతా నక్షత్రాల విషయం చెప్పనక్కరలేదు. ఒక మనిషి పుట్టినప్పుడు బయలుదేరే కాంతికిరణం ఆ మనిషి చనిపోయిన చాలా ఏళ్ళ తరువాత గాని భూమిమీద పడలేదు.
మానవ జీవితాలను ప్రభావితం చేసేవి నక్షత్రాలు కావు. సూర్యకుటుంబంలోని గ్రహాలు  అని వాదిస్తే జ్యోతిష్యమంతా అబద్ధమే అవుతుంది. ఆ వాదన వల్ల ఒరిగేదేమీ వుండదు. నక్షత్ర దూరాల వాదననుండి తప్పించుకున్నా ఈ వాదన మరో చిక్కుకు దారితీస్తుంది. గ్రహాల మధ్య సంబంధం గూడా వెలుతురు వల్లే జరగాలి. గ్రహాలకు వెలుగు లేదు. అవి కాంతి కిరణాలను ప్రసంరింపచేయవు కనుక ఎంతో దూరానవున్న మానవులమీద వాటి ప్రభావం వుండటానికి వీలులేదు.
విశ్వనిర్మాణంలో మానవుని పాత్ర ఎంత అల్పమైందో మరో కోణం నుంచి తెలుసుకుందాం. కోపర్.నీకస్ భూమిని విశ్వానికి కేంద్రం కాదన్నాడు. మానవుడు ప్రత్యేక సృష్టి కాదన్నాడు డార్విన్. భూమివరకైనా మనిషికి ప్రాముఖ్యం లేకుండా పోయింది. సూర్యునిలోని ఒక చిన్న గోళం వూడిపడి, చల్లనై గట్టిపడి భూమి అయింది. ఈ పని జరగటానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది. తరువాత పరిణామం 40.50 కోట్ల సంవత్సరాలవుతుంది. అంటే 40 కోట్ల సంవత్సరాలు భూమిమీద ప్రాణులు లేవన్నమాట, భూమి పుట్టుక నాటినుండి జీవపదార్థం పుట్టేంతవరకు పట్టిన కాలంతో పోలిస్తే జీవపదార్థం మానవుడుగా పరిణితి చెందిన విషయం నిన్న మొన్నదిగా ఎంచాల్సి వుంటుంది. మనిషి పూర్వీకులు తమ నివాసాలైన చెట్లను వదిలి నేలమీద వెనుక రెండు కాళ్ళతో నడవడం ప్రారంభించి సుమారు పది లక్షల సంవత్సరాలయింది. భూమే కాదు సూర్యకుటుంబము ఏర్పడక పూర్వం కోటానుకోట్ల సంవత్సరాలుగా లెక్కలేనన్ని నక్షత్రాలు, నక్షత్రాలుగా ఏర్పడుతున్న పదార్థాలు ఈ విశ్వమంతా నిండివున్నాయి.
ఇన్ని కోట్ల సంవత్సరాలుగా సాగిన నక్షత్ర, భూమి, జీవనపరిణామం అంతా మానవ సృష్టికి పూర్వరంగంగా నమ్మి సృష్టిక్రమాన్ని గురించి వారికున్న ఆధ్యాత్మిక దృక్పథానికి మానవులు గర్విస్తుండవచ్చు. మూఢనమ్మకాలు సబబేనని చెప్పచూసే ప్రయత్నంలో మతవాదులు తమ దేవుణ్ణి ఎలా అగౌరవ పరుస్తున్నారో పరిశీలిస్తే వింతగా వుంటుంది. ఇన్నికోట్ల ఏండ్లు కష్టపడి  ఈ ప్రపంచాన్ని నిర్మించి తన స్వరూపాలను ఈ భూమి మీద నిలిపాడు దేవుడు అంటే ఆ దేవుడు సర్వశక్తివంతుడు కాదని తృణీకరించటమే అవుతుంది. నిష్కపటమైన మతానికీ, నమ్మకాలకీ, కావలసింది బైబిలులోని దేవుడు లేక పురాణాలలో దేవుడు. అలాంటి దేవుడు సొంత ప్రతిభతో భక్తులలో నమ్మిక కలుగజేస్తాడు. తన వునికిని లీలను సబబు అని నిరూపించి సమర్థించటానికి కపట తత్వవేత్తల సహాయం అవసరం లేదు. విమర్శ, విశ్వాసం పరస్పరం వ్యతిరేకమైనవి. అవి రెంటికీ ఎలాగో బలవంతాన పొంతన కుదిరిస్తే ఒక విచిత్రమైన అటు మతమూకాని ఇటు తత్వమూ కాని సంకరరూపు దాలుస్తుంది. విజ్ఞానశాస్త్రమూ, మూఢ నమ్మకమూ ఒక వరలో యిమడలేవు. వాటి సంయోగం వల్ల పుట్టినదే జ్యోతిష్యం. ఈ స్థితిలో విజ్ఞానం అడుగంటి విశ్వాసం బలపడింది.
విశ్వపరిణామం దైవస్వరూపులైన మానవుల సృష్టి నుద్దేశించి జరిగినదనే వాదన నిస్సారమైంది. భౌతిక జగత్పరిణామంలో వుద్దేశానికి ఎక్కడా తావులేదనే విషయం తెలియకపోవటమే యిందుకు కారణం. భౌతిక పరిణామంలో సర్వత్రా జీవపదార్థం ఆవిర్భావించాలనేదేమీలేదనీ ఖగోళ విజ్ఞాన శాస్త్రం చెపుతోంది. ఒకవేళ జగత్పరిణామం వెనుక ఏదైనా ఉద్దేశ్యం అంటూ ఉంటే అది జీవోత్పత్తి కాదు. మానవుడు దేవుని ఉత్తమ సృష్టికాదు. ప్రాణి అద్భుతమైన విశ్వసామరస్యాన్ని మలినపరిచే ఒక మొలక. జగత్ నిర్మాణంలో  ప్రాథమిక ఖగోళాలన్నీ కళంకరహితం, వాటి పవిత్రతను ఎవరూ పాడుచేయలేరు.
కణకణమండే గ్రహాలనబడే అగ్ని గోళాల నుండి రాలిన మసినలుసుల  మీదనే జీవోత్పత్తి సాధ్యమని తేలింది.  మసినలుసుల్లో గూడా అతి చిన్నదైన భూమి జీవోత్పత్తికి లోనయింది. సూర్య కుటుంబంలోని అంగారక, శుక్రగ్రహాలు తప్ప మిగతా ఆరు గ్రహాల మీద జీవోత్పత్తికి అనువైన పదార్థ – రసాయనిక పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడవని సిద్ధాంతీకరించబడినది అంగారక గ్రహంలో సరిపడ్డంత కాకపోయినా, కొంతవరకు నీరున్నది. అక్కడి వాయువులలో జీవోత్పత్తికి వీలైన లక్షణాలున్నాయి. శీతోష్ణస్థితి గూడా యించుమించు సరిపోతుంది.  కాని ఇంతవరకు అంగారక వాసులను గురించి ఉన్న వూహలు నిజమైనట్లు ఖగోళశాస్త్ర సంబంధమైన యిటీవలి పరిశీలనలు రుజువు చేయటం లేదు. ఒకవేళ అక్కడ జీవచిహ్నాలేమైనా ఉంటే, చిన్న చిన్న మొక్కల వరకే పరిమితమైనాయేమోగాని, ఆపై స్థాయిని అందుకోలేదు. ఈ పరిస్థితులు అంగారక గ్రహంలో ఏర్పడి చాలా కాలమైంది. భూమితోపాటే జీవరాసులు అక్కడా పుట్టాయి. జీవపరిణామ విధానానికి  ఒక ప్రయోజనానికి తావువుండి ఉంటే, ఆది మానవులను దైవాకారంలో సృష్టించటమే అయితే, ఈపాటికి అంగారక గ్రహం మానవ నివాసస్థలమయే ఉండేది. అలా జరగలేదు. కాబట్టి విశ్వ నిర్మాణంలో ఏదో ఉద్దేశ్యం ఉందనే సిద్ధాంతంతోపాటు బెర్గోనసం, లాయడ్ మార్గన్ ల తాత్విక ప్రయత్నాలన్నీ నేలగరిచాయి.
శుక్రగ్రహం ఇంకా మర్మంతో కూడి వుంది. అట్లాగే అక్కడి నివాస యోగ్య పరిస్థితి కూడా, ఈ గ్రీకు సౌందర్య దేవత తన అందాన్ని రహస్యంగా దాచుకుంది. ఈ రహస్యాన్ని కనుగొందామనే కుతూహలంతో ఖగోళశాస్త్రవేత్తలు ప్రయత్నించి విభ్రాంతులయ్యారు. అయినా కొంత విషయ సేకరణ చేయగలిగారు. సూర్యకుటుంబంలోని యీ విచిత్ర గ్రహం యిప్పుడిప్పుడే జీవ పదార్థ ఉత్పత్తికి  అనువైన స్థాయి చేరుకుంటున్నది. కాని అక్కడ జీవ పరిణామం మానవుని దాక సాగుతుందో లేదో ఇంకా తెలిసికోవలసి ఉంది. ఇంతవరకు తేలిన విషయమేమంటే జీవ పరిణామం మానవ సృష్టి దాకాపోవాలి అనే సిద్ధాంతం ఏమీ లేదని, అగ్ని గోళాల నుండి విడివడి చల్లారిన బూడిద మీద కూడా ఇది జరగాలనేమీ లేదు.
మానవ అహంకారాన్ని దెబ్బతీసే మరో విషయం ఆధునిక ఖగోళ శాస్త్రాన్ని బట్టి తేలిందేమిటంటే అసలీ గ్రహాలే విశ్వ నిర్మాణంలో అరుదు అని. భౌతిక పరిణామ విధానంలో అవి పుట్టి తీరాలి అనేదేమీ లేదు. బహుశ సూర్యకుటుంబం ఒక్కటే గ్రహకూటమిగా కానవస్తున్నది. నక్షత్ర సహజ పరిణామంలో సూర్యకుటుంబం మామూలుగా రాలేదు. అది ఒక విపరీత సంఘటన ఆ సంఘటన ఫలితమే మానవుడు జగత్తు గనుక దైవసృష్టి అయితే సృష్టికర్త మానవుని సృష్టించాలని ఉద్దేశించలేదు. మానవులు సృష్టి విధానంలలో దొంగతనంగా జొరబడ్డారు. గనుక మానవుని పుట్టుక దైవం సంకల్పించింది. పైగా విధివిధానానికి ఎదురు తిరిగి జరిగింది.
అలాంటప్పుడు దైవకార్యం ఏదో నిర్వహించటమే మానవుని బాధ్యత అనీ, అది జరగటానికే  విశ్వం యావత్తు సృష్టించబడిందనీ మానవులు అనుకోవటం హాస్యాస్పదం కదూ... భౌతిక జగత్తు దేవుని ప్రతినిధులో, ప్రతి  రూపాలో, పుత్రులో అయిన మానవులు సంచరించటం కోసం ఏర్పడ్డ రంగస్థలం కాదు. కనుక నక్షత్ర  చలనానికీ కేవలం యాదృచ్ఛికంగా భూమి మీద సంచరించే  ఈ రెండు కాళ్ల మానవుల జీవితాలకూ, ఏమీ సంబంధం ఉండదు. నేను చెప్పేది జ్యోతిష్యంలో లెక్కల ప్రకారం చెప్పబడే ఆధ్యాత్మిక సంబంధం సంగతి భౌతిక రసాయనిక పదార్థం నుంచి జీవం పుట్టింది కనుక భౌతిక సంబంధం వుంటుంది.
జీవోత్పత్తి కేవలం దైవాధీన సంఘటన కాదు. మనిషి నివాసమైన భూమి సూర్యకుటుంబంలోని చిన్న భాగం. ఆ సూర్యకుటుంబం కూడా తలవని తలంపుగా పుట్టింది కాదు. సర్, జెమ్స్, హెచ్. జీన్సు సూర్యకుటుంబపు పుట్టుక ఒక వైపరీత్య మన్నాడు. దీనిని గురించి ఆయన ఒక ప్రామాణిక  సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఇంచుమించు శాస్త్రజ్ఞులంతా దీన్ని అంగీకరించారు. ఆయన సిద్ధాంతం క్లుప్లంగా ఇలా వుంది.
అనేక కోట్ల సంవత్సరాల క్రితం - చాలా పెద్ద నక్షత్రం ఒకటి సూర్యుని సమీపంగా దూసుకుపోయింది. విసురుకు మండుతున్న వాయుపదార్థం కొంత ఆ నక్షత్రం వెంట కొంత దూరం జాలుగా వెళ్ళింది. ఆ వాయుపదార్థపు జాలు తరువాత తునకలైంది. సూర్యుని నుంచి విడిపోయినవి అవటం వల్ల వాటికి భ్రమణం  సంక్రమించింది.  వర్తులంగా తిరిగినందువల్ల అవి గుండ్రంగా అయినయ్ మండుతున్న వాయుగోళాలు క్రమంగా చల్లబడి గట్టిపడినాయ్ వాటినే సూర్య కుటుంబంలో గ్రహాలంటున్నాము. నియమ బద్ధమైన భౌతిక జగత్పరిణామంలో సంఘటన కేవలం యాదృచ్ఛికం కాదు. కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా సూర్య కుటుంబం లాంటివి పుట్టటం పూర్తిగా సంభవం కాదు. కాని తరువాత సంభవించటానికి ఆస్కారం లేదు. గణిత శాస్త్రానుసారం సరిగ్గా లెక్కకట్టి డెబ్భయి లక్షల సంవత్సరాలలో ఒకసారి సుమారు లక్ష నక్షత్రాలలో ఒకటి మరో నక్షత్రం పక్కగా, సూర్యకుటుంబం లాంటి దాన్ని పుట్టించడానికి అనువుగా పోవచ్చునని జీన్స్ నిర్ణయించాడు. అయినా అలాంటి గ్రహాలు పుట్టడానికి గల అవకాశం సుమారు పదింట ఒకటి ఉంటుందనీ, పుట్టకపోవటమే అధికంగా జరుగుతుందనీ అన్నాడు. భౌతిక జగత్తంతటిలోనూ కోటికోట్ల వంతులో మాత్రమే జోవోత్పత్తికి వీలున్నట్లు ఆయనే లెక్కచెప్పాడు. వీలున్నంతమేరలో కూడా అతి స్వల్ప భాగంలోనే జీవం ఉంటూ వచ్చిందన్నాడు.
ఆధునిక ఖగోళ శాస్త్రంలో ప్రయోగాత్మకమైన పరిశోధనలలో ఇంత వరకు తేలిన సత్యాలను బట్టి జ్యోతిష్యాన్ని నమ్మటం కేవలం మూఢత్వం వల్లనే అని స్పష్టమౌతుంది. స్వర్గంలో దేవతలు మానవ కర్మలను చూస్తూ ఉండరు. దేవతలు, గ్రహాలు ఆడించినట్లు మానవుడు కీలుబొమ్మలాగా తైతక్కలాడటం లేదు. ఆత్మగౌరవం గల ఏ వ్యక్తి తనను  ఈ దుస్థితిలో వూహించడు. స్వర్గంలో దేవత మీద నమ్మకం ఉంటే వారు స్వార్థపరులనీ మనిషి విధిని వారు పట్టించుకోరని గ్రహించాలి. సోమపానాలతోనూ, అప్సరసలతోనూ వారికి తీరికి ఉండదు. వారు సందు చిక్కినప్పుడంతా, గురువుగారి భార్యతోసహా సరససల్లాపాలు గావిస్తుంటారు. వారిలో వారికి ఎన్నో కుట్రలు, అసూయలు, పోరాటాలు సాగుతుంటాయి. వారిని రాక్షసుల భయం వెన్నాడుతూ వుంటుంది. ఒక వేళ ఇలాంటి దేవతలు వున్నారనుకున్నా వారి స్వంతగోడే వారికి సరిపోతుంది. ఇంక యితర సంగతేం పట్టించుకుంటారు? ఎక్కడో స్వర్గం అని ఉండే ఈ నీతి నియమాలు లేని, తాగుబోతులు, పిరికివారైన దేవతలకు జీవితాలను అర్పించటం ఆత్మగౌరవంగల మానవుల లక్షణం కాదు.
నిజంగా గ్రహచలనాలమీద జ్యోతిష్యం ఆధారపడితే, మానవులు లెక్కిస్తున్నామన్న చాలా గ్రహాలు నిజంగాలేవనీ, జ్యోతిష్యుని వూహకందని గ్రహాలబలం భూమి మీద చరించే మానవుల మీద ఏమాత్రం లేదనీ తెలిస్తే మానవులు నిరాశ చెందుతారు.
ఒక్క ప్రశ్నతో ఈ విషయాన్ని వదిలేస్తాను. జ్యోతిష్యాన్ని ప్రాపంచిక పరిజ్ఞానంతో పరీశించారా? వైజ్ఞానిక పుష్టిగల శాస్త్రం అయితే అది పరిశీలనకు కొంతవరకైనా నిలబడగలగాలి. అలాంటి పరీక్షనొకదానిని సూచిస్తాను. ప్రయత్నించిచూడండి.
భూమిమీద సగటున ప్రతి అరనిముషానికి ఒకరు పుడుతున్నారు. ఒక్కొక్క గ్రహకూటమి కొద్ది నిముషాలే వుందనుకొన్నా -  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలాకాలం వుంటుంది. ప్రపంచంలో ఆ సమయంలో పుట్టిన చాలామంది ఒకే సంఘటనల అనుభవం పొందివుంటారు. ఒకే గ్రహకూటమిలో పుట్టినవారు కనుక వాళ్ళ జీవితాలు ఒకే తీరున నడవాలి. అలా నిజంగా నడుస్తున్నాయా అని తెలిసికోటం ఏమంత కష్టం కాదు. ఒకే గ్రహకూటమిలొ పుట్టినవారి జీవితాలన్నీ ఒకే తీరుగా వున్నట్లు రుజువయితే జ్యోతిష్యానికి మంచి బలం చేకూరుతుంది. చారిత్రకంగా గూడ ఈ పరిశోధన జరుపవచ్చు. జ్యోతిష్యం ప్రకారం గ్రహకూటాలు పునరావృత్తమౌతాయి. జ్యోతిషుల లెక్కలు నిజమనుకుంటే చరిత్ర గూడా చాలా మార్లు మళ్ళీ మళ్ళీ జరిగిందే జరగాలి. బుద్దుళ్ళూ, క్రీస్తులూ, మహమ్మదులూ, అలెగ్జాండర్లూ, హానీబాలులు, నెపోలియన్లు మొదలగువారు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూండాలి. గ్రహకూటాల సంఖ్యా కొన్ని సంవత్సరాలలో పరిమితమయివుంటుంది. వాటి ననుసరించి మానవ చరిత్ర కూడా అన్ని సంవత్సరాల పరిమితిలోనే పునరావృత్తం కావాలి. గ్రహాలననుసరించి మానవుల జీవితాలు కొన్ని రకాలుగానే విభజింపబడాలి. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే చాలు జ్యోతిష్య శాస్త్రం పరీక్షకు నిలువగలదో, లేదో తెలుస్తుంది. ఊహామాత్రాలైనా గ్రహకూటాలమీద మానవ జీవితాలు ఆధారపడి లేవని చెప్పటానికి చరిత్ర పునరావృత్తం కాక పోవటంలోనే తెలుస్తుంది.
గుడ్డినమ్మకాలు తాత్వికాభివృద్దికి పెద్ద అవరోధాలు. జ్యోతిష్యం, మూఢనమ్మకం, భారతీయులు అనుభవిస్తున్న దుర్దశ, అవమానం, నైతిక పతనంలాంటి వాటిని తుదముట్టించాలంటే ఈ మూఢవిశ్వాసాల పట్లగల ఉన్నతభావాలు నశించాలి. భారతదేశ పునరుజ్జీవనానికి అంధవిశ్వాసాలు పోయి శాస్త్రవిజ్ఞానంతో కూడిన విచక్షణాదృష్టి ఎంతైనా అవసరం. పూర్వీకులు ఎంత గొప్ప వారైనా గతంలో కలిసిపోయినవారే. రవీంద్రకవి వ్రాసిన గేయం నుండి జీవితాదర్శాన్ని తెలుసుకుందాం. అందరి ప్రవక్తలవలె మర్మవాదం బోధించక ముందు, రవీంద్రుడు కవిగా వ్రాసిన గేయం ఇది. ప్రవక్తను చూచి నవ్వుకున్న కవినుంచి నేర్చుకోవలసింది.
సోదరులారా! ముందుకు పోదాం!
వెనుకబడితే బ్రతుకు వృధా
జీవచ్ఛవాలుగా బ్రతకటమెందుకు?
                         మూలం                                  తెలుగు సేత
            ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల

3 comments:

astrojoyd said...

ఎవరి పిచ్చి వారికీ ఆనందం అని వూరికే అన్నారా మన పెద్దలు.పోస్ట్ రాసేందుకు బాగానే శ్రమించారు

kodali srinivas said...

Dear Sir, I wish to re publish this article in my blog http://hetuvaadi.blogspot.in with your kind permission.

vempati said...

how can you judge astrology as superstion when you are not aware of astrology. the mathematics behind the calculation of planetary position. we indian without doing through research on the ancient subjects talk loosely and degrade our civilsation.
Science is not superstious its the people who doesn't know how to use the subject and turn out to be dumbs.

Post a Comment