దేవుని దోషాలు-పిల్లి చెప్పిన కథ - 9




నాకు ఆకలి వేసినప్పుడు నా ఆకలిని సందేహించే పనేలేదు. ప్రకృతే దీన్ని నిరూపిస్తుంది. నేను పాలగిన్నెను చూస్తే ఎవరి అనుమతి కోరకుండానే పాలను తాగేస్తాను. అనుమతి కోరినా దొరకదని తెలుసు. నైతికంగా ఉన్నతులమనుకునే ఈ మానవులెవ్వరూ, తమకు ఉపయోగపడితే తప్ప ఒక జంతువు ఆకలి తీర్చటానికి త్యాగం చేయలేరనే సత్యం యిక్కడ బయటపడుతుంది. అనుమతి లేకుండానే నేను పాలు తాగిన విషయాన్ని మీరెలా అన్వయిస్తారో మరి! ఇది దొంగతనం! మా జాతిలోని నైతిక పతనానికి అంటగట్టిన లక్షణం. రెండు సత్యాల సమ్మేళనం వలన యిలా  జరుగుతున్నదని మీరెవరైనా ఆలోచించారా?
ఇలాంటి ఇబ్బందులు రాకుండా అర్థంలేని మాటలతో మరికొన్ని నీతి సూత్రాలు ప్రవేశపెట్టారు. ఆత్మనిగ్రహము, త్యాగము బోధిస్తారు. నేను నా ఐహిక వాంఛలను అదుపులో వుంచుకోవాలి. ఆకలితోవున్నా దొంగలిద్దామనే కాంక్షకు కళ్లెం వేయాలి.  ఈ నీతి బోధ వెనుక దాగిన అసలు ఉద్దేశం, నేను నైతిక పతనానికి లోనుకాకుండా కాపాడటం కాదు. వారి పాలగిన్నెను వారు దక్కించుకోవటం. రక్షణ అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం తయారు చేసిన బ్రిటిష్ పెద్దల సృష్టి కాదనుకోండి. అల్ప సంఖ్యాకులు, అధిక సంఖ్యాకుల నోళ్లు కొట్టి తమ అధిక్యత సాగించుకునే సమాజ వ్యవస్థ ఏనాడు పుట్టిందో, ఆనాటి నుండి మానవుని ప్రాతిపదిక అది.
మీరు మీ హక్కుల్ని కాపాడుకొనే తొందరలో కళ్ళు మూసుకొని, అసలు అన్ని నీతులకు మూలమైన మీ మతానికి ఎసరు పెట్టే నీతి సూత్రాలను నిర్మించుకున్నారు. ఆకలయినప్పుడు తినటం  పాపం అయితే, భగవంతుడు జంతువులకు పొట్టను సృష్టించేవాడు కాదు. ఆకలి దేవుడిచ్చినది. ఆకలి తీర్చుకోవటం దైవ నిర్ణయాన్ని పాటించటమే. కనుక దేవుడిచ్చిన ఆకలి తీర్చుకోవటానికి దొంగిలించటంకంటే కడుపు మాడ్చుకోవటం మంచిదని భావిస్తే అది నీతి కాదు. ఆత్మనిగ్రహమూ కాదు. భగవంతుని సృష్టిని మరమత్తు చేయబోవటం, అది దైవదూషణ అవుతుంది, అంటే దేవుడు లేడనటమే. మీరు నిజంగా భగవంతుడున్నాడనుకుంటే భిన్నంగానూ, ఉన్నతంగానూ ఉండాలనుకోటం పొరపాటు. మానవజాతి నింతవరకు దాస్యబంధనాలలో బిగించి ఉంచిన మూఢ విశ్వాలకు అది గొడ్డలిపెట్టు. సత్యము, న్యాయము మొదలైన మాటలకు శాశ్వత నిర్వచనం చెయ్యాలంటే, అతిలోక ప్రమాణం ఏదో ఒకటి వుండాల్సి వస్తుంది.
‘త్యాగం’ అనేది నైతిక ధర్మం. ఈ సుగుణాన్ని అలవరచుకోమని పాలగిన్నె యజమాని బోధించటం సబబుగా వుంటుందని తోచటంలా మీకు? అలా కాక త్యాగశీలత గురించి నాకు బోధ చేయటం అంటే దూడ నోరు గొట్టి సంగ్రహించిన ఆ ఆసామీ పాలగిన్నెకు రక్షణ కల్పించబోవటమే అవుతుంది. మీకు సంబంధించిన మరో ఉదాహరణ తీసుకుందాం. ఈ సందర్భంలో మీకు విషయం క్షుణ్ణంగా బోధపడుతుందనుకొంటాను. ఎప్పుడూ నిజం పలకాలి అబద్ధమాడటం పాపం. ఒకరి కుమారుడు శిక్షార్హమైన నేరమేదో చేశాడనుకోండి. తండ్రి అబద్ధమాడితే శిక్ష తప్పించుకోగలడు. అలాంటి సందిగ్ధావస్థలో తండ్రి ఏం చేయాలి? నిజం చెప్పాలా? లేక తండ్రిగా అబద్ధమాడి కొడుకును రక్షించి తన కర్తవ్యాన్ని నెరవేర్చాలా? ఇక్కడ వాత్సల్యమనే స్వాభావికమైన కోరికకు సత్యం అడ్డుతగులుతుంది. ఈ భావనే మానవుని జంతువుకంటే మిన్నగా చూపుతుంది.
సత్యానికి, ఇతర నైతిక విధులకు ఆదరణలో వైరుధ్యం ఏర్పడే సందర్భాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇలాటి సందిగ్ధావస్థలో మనిషి మాటల నిరంకుశత్వానికి లోనై మానవుడు సహజంగా, తన ఇష్టానుసారం ప్రవర్తించలేకపోతున్నాడు.
కిందటి జన్మలో నేను చేసిన పాపం వల్లనైతేనేమి, నా తల్లిదండ్రుల ఉద్రేకం వల్లనే కానీయండి నేను ఆ పాడు ప్రపంచంలో పుట్టాను. ఎప్పుడైనా పాలగిన్నె నా కంట పడటం జరిగితే నాలో మొదట కలిగే ప్రేరణ ఏమిటంటే  సూటిగా వెళ్ళి పాలు తాగేద్దామని. అలా చేయటం దేహధర్మం గనుక ఆ ప్రేరణ కలిగినందుకు నేను సిగ్గుపడను. మానవుల భాషలో చెప్పాలంటే నేను పిల్లిగా పుట్టటం దైవ నిర్ణయమే. నాలో ఈ ప్రేరణ గలగటం వల్ల సృష్టి సామరస్యం భగ్నమవుతుందనుకుంటే అలాంటివి నాలో కలగకుండానే దేవుడు నన్ను పుట్టించి వుండేవాడు. ఇంతెందుకు, దొంగిలించాలనే నాలో ప్రేరణను అనుసరిస్తున్నానంటే దైవ సంకల్పాన్ని అనుసరిస్తున్నానన్నమాట. మానవుడు  కూడా ఇలాంటి స్థితిలో వుంటే అతనిలోని ప్రేరణలు గూడా యిలానే ఉంటాయని నా నమ్మకం. ఎవరైనా ఈ ప్రేరణలకు లొంగక ఆత్మనిగ్రహం చూప ప్రయత్నిస్తున్నారంటే వారు నీతివర్తనులని అర్థంగాదు, అది వారిలోని పిరికి తనమే, ‘వీడు దొంగ’  అని లోకం తనని వేలెత్తి చూపుతుందనో, శిక్షిస్తుందనో భయమన్నా కావాలి లేక ఇది తనకే సిగ్గుచేటుగా వుండొచ్చు. ఈ భావన మరీ ఏహ్యమైంది.
మనుషుల సంగతి ఎలా వున్నా నేను మాత్రం పాలగిన్నె కంటపడితే ఏమాత్రం సందేహించను. పైగా అది దేవుడు నాకోసం పంపించాడని తాగేస్తాను. దొరికిపోతే తన్నులు తినాలనే భయం ఓ వంక వుందనుకోండి. నీతులు మాత్రం నాకడ్డురావు. అంతకంటే నేను చేయగలిగిందేముంది? సత్యం, న్యాయం, శాంతి మార్గాలతో అంటే యజమానిని బ్రతిమాలుకోవటం వల్ల ఆ పాలు నాకు లభించే అవకాశం పదింట ఒకటి గూడా వుండదు. న్యాయం శాంతి అని వూగిసలాడకుండా దైవదత్తమైన ప్రేరణ ననుసరించి నడిస్తేనే మంచి అవకాశం లభిస్తుంది. అడిగితే పాలు పొయ్యరు గనుక అడగకుండానే తాగేస్తాను. నాగరిక మానవ సమాజం అనబడే ఆ నాగరిక వ్యవస్థలో నేను గూడా దురదృష్టవశాత్తు ఒకదాన్నైతే  ఈ నేరానికి నాకు శిక్షపడేది. అయితే తెలివిగా దొంగిలించేవారు పట్టుపడరు. అనుమతి పొంది పాలు త్రాగాలంటే నాకవి ఎంతవరకు దొరుకుతాయో ఆలోచించరు. వాళ్ళు నా బాధ్యతను తమ కొలత బద్ధతో కొలుస్తారు. వారి వాదన ఏమంటే పాలు నాకు చెందినవి కావు. నేను ఆకలితో మాడుతున్నా, ఆ పాలలో మూతి పెట్టే హక్కులేదు. నేను ఆకలితో చచ్చినా వారికేం పట్టదు.
                         మూలం                                  తెలుగు సేత
            ఎమ్.ఎన్.రాయ్                           వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment