ఎమ్ ఎన్ రాయ్ ను కలిసిన రావిశాస్త్రి


సుప్రసిద్ధ విప్లవ రచయిత  రాచకొండ విశ్వనాథ శాస్త్రి విశాఖ పట్టణంలో ఎమ్.ఎన్.రాయ్ ను కలిసి చేరువైన ఉదంతం  వెలికి వచ్చింది. ఈ విషయాలు  రావిశాస్త్రి స్వయంగా రాసుకున్న  ఆయన డైరీలలో లభించాయి.
కాలేజీ చదువుల్లో ప్రవేశించిన  తొలిరోజులలో (1937, ఆగస్టు 19, గురువారం) రావిశాస్త్రి విశాఖపట్టణంలో మానవేంద్రనాథ్ రాయ్ ను కలుసుకున్నారు. కళాశాలలో యూత్ లీగ్ సభ్యుడుగా చురుకుగా పనిచేస్తున్న రావిశాస్త్రిని ఆనాడు అబ్బూరి వరదరాజేశ్వరరావు  వెంటబెట్టుకుని ఎమ్.ఎన్.రాయ్ వద్దకు తీసుకువెళ్ళారు. తన డైరీలో తొలి పరిచయాన్ని రాసుకుంటూ ‘రాయ్ ఆజానుబాహుడని, భాషోచ్ఛారణలో జర్మన్ భాష ప్రభావం కనిపించిందని, ఆయన వెంట అమెరికన్ భార్య కూడా ఉన్నదని’ రాసుకున్నారు.
1937లో ఎమ్.ఎన్.రాయ్ విశాఖకు  రావటానికి ఎమ్.వి.శాస్త్రి (మునుకుట్ల వెంకటశాస్త్రి,  కాకినాడ), అబ్బూరి రామకృష్ణారావు  కారకులు. అంతకుముందే జరిగిన  ఫైజ్ పూర్, మహరాష్ట్రలో  కాంగ్రెస్ మహాసభలలో తొలుత  ఎమ్.ఎన్.రాయ్ ప్రసంగం విని  ప్రభావితుడైన ఎమ్.వి.శాస్త్రి  ఆయనను ఆంధ్రకు ఆహ్వానించాడు. ఆ విధంగా రాయ్ వచ్చాడు.  ఆంధ్రాయూనివర్సిటీలో లైబ్రేరియన్  గా పనిచేస్తున్న అబ్బూరి  రామకృష్ణారావు నాటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డికి రాయ్.ను పరిచయం చేశారు. విశాఖలో పి.హెచ్ గుప్త ఇంట్లో రాయ్ దంపతులు వుండేవారు.
1937 ఆగస్టు 22న విశాఖ బీచ్  లో రాయ్ ఉపన్యాసాన్ని  రావిశాస్త్రి విని ప్రభావితుడయ్యాడు. ఆ విషయం డైరీలో రాసుకుంటూ  భారతదేశానికి షోషలిజం  అంతగా ఉపకరించదని ఆయన  ఉపన్యాసంలో ధ్వనించినట్లు  రావిశాస్త్రి అభిప్రాయపడ్డారు.  తరువాత 1937 ఆగస్టు 27న, రాయ్  చరిత్రపై జరిగిన సెమినార్ కు అధ్యక్షత వహిస్తూ ముఖ్యోపన్యాసం చేశారు. రావిశాస్త్రి అందులో పాల్గొన్నారు. సమావేశానంతరం ఆయనతో తేనీటి విందులో పాల్గొని ఫోటో తీయించుకున్నారు. రావిశాస్త్రి తాను ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి, రాయ్ ని కలవబోతున్నట్లు చెప్పగా, అతడు వ్యాఖ్యానిస్తూ ‘బాంబులు తయారు చేయటం ఎలాగో రాయ్ దగ్గర నేర్చుకుంటారా’ అన్నాడని చెప్పారు. ఆ సంగతి రాయ్ తో చెప్పాము. ఆ తర్వాత తన ఉపన్యాసంలో రాయ్ ప్రిన్సిపాల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ మాట్లాడారు. మరునాడు రావిశాస్త్రి రాయ్ ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అంతకు ముందు తీసుకున్న ఫోటో కాపీని ఇచ్చారు. అది బాగా వచ్చిందని రావిశాస్త్రి సంతోషించారు.  మరు సంవత్సరంలో రాయ్ మరోసారి విశాఖకు వచ్చినప్పుడు రావిశాస్త్రిని కలుసుకున్నారు (అది 1938 జులై 19). అప్పటికే రాయ్ రచనలు చదవటం మొదలెట్టిన రావిశాస్త్రి అవి తార్కికంగా క్రమపద్ధతిలో ఉన్నాయని భావించారు. కాంగ్రెసు సోషలిస్టు పార్టీకి రాయ్ రాసిన బహిరంగ లేఖలను రావిశాస్త్రి చదివారు.  ఆ తరువాత వారం రోజుల్లోనే రాయ్ నడుపుతున్న ‘ఇండిపెండెంట్ ఇండియా’ అనే వారపత్రికను తెప్పించుకోవడం మొదలుపెట్టారు. అందులో హక్కులు బాధ్యతలు, ప్రజలతో సంబంధాలు అనే అంశాలు రావిశాస్త్రిని ఆకట్టుకున్నాయి. 1938లోనే ‘ఇండియన్ రివ్వ్యూ’ పత్రికలో ఫిలిప్స్ స్ప్రాట్  రాస్తూ ఎమ్.ఎన్.రాయ్.ను ఠాగోర్.ను నిశిత పరిశీలన గావించి గాంధీ ధోరణికి సుముఖత వ్యక్తం చేస్తూ అభిప్రాయం వెల్లడించాడు. అది గ్రహించినట్లు రావిశాస్త్రి పేర్కొన్నాడు.
ఎమ్.ఎన్.రాయ్ విశాఖకు వస్తూ  పోతూ వుండటం, యువతలో చర్చనీయాంశమయింది. ఆయనకు అనుకూలంగా రాజేశ్వరరావు, ప్రతికూలంగా ఎన్.వి. రామారావు వాదోపవాదాలు చేశారు. అబ్బూరి వరదరాజేశ్వరరావు చాలా గట్టిగా రాయ్.ని వెనకేసుకొచ్చేవారు. ఆ విధంగా రాయ్ సాహిత్యాన్ని రావిశాస్త్రి రెండుమూడేండ్లపాటు చదువుతూ పోయారు. 1941లో వచ్చిన ‘గాంధీయిజం, నేషనలిజం, సోషలిజం’ అనే రాయ్ రచనలు రావిశాస్త్రి చదివారు. ఆ పుస్తకం చదివిన తరువాత తనకు స్పష్టత లభించినట్లు రావిశాస్త్రి రాసుకున్నాడు.
రావిశాస్త్రి రాయ్.ని కలుసుకోవటం అంతటితో ఆగిపోయినట్లున్నది. ఆ తరువాత ఆయన చదువును సాగిస్తూ, కమ్యూనిస్టులకు దగ్గరైనట్లు తెలుస్తుంది.
ఎమ్.ఎన్.రాయ్.తో రావిశాస్త్రి తీయించుకున్న ఫోటో సేకరించే ప్రయత్నంలో ఉన్నాము. విశాఖలో వుంటున్న రావిశాస్త్రి సోదరులు రాచకొండ నరసింహ శర్మగారు ఈ డైరీ ప్రతిని నాకు అందజేశారు. వారికి ధన్యవాదాలు. ఆయన లోగడ అమెరికాలో సైక్రియాట్రిస్ట్ డాక్టరుగా చేసి రిటైర్ అయి విశాఖలో స్థిరపడ్డారు. ఆయన ఇంగ్లీషు, తెలుగు భాషలలో కవి, రచయిత కూడా. రాచకొండ గేయాలను, కథలను కొన్ని ఇంగ్లీషులోకి అనువదించారు కూడా.
మొట్టమొదటిసారిగా నా దృష్టికి వచ్చిన  ఈ విషయాలను వాటి ప్రాధాన్యత దృష్ట్యా అందిస్తున్నాను. అబ్బూరి రామకృష్ణారావు  రాష్ట్రంలో రాయ్ ప్రతినిధిగా  రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఆర్గనైజర్ గా కృషిచేశారు.
నాకు 1968 నుండి రాచకొండతో  సన్నిహిత సంబంధాలుండేవి. గోరాశాస్త్రి, సి.ధర్మారావు, నేను అయతో కలిసి ముచ్చటించుకున్నాము. అప్పట్లో నాకీవిషయం తెలియదు. తెలిసుంటే ఇంకా లోతుపాతులు చర్చించేవాణ్ణి.
Written by Innaiah Narisetti 
Taken from Andhra Jyothi daily published on 25th feb 2013

          

No comments:

Post a Comment