గోమాంసం తిన్న ఋషులు-పిల్లి చెప్పిన కథ - 5




మనిషి తన స్వార్థం కోసమే జంతువులు మచ్చిక చేసుకుంటాడని నేనంటాను. హిందువులు చేసే గోపూజలో గూడా ఏమీ ఉన్నతమైన ఆదర్శం లేదని నా అభిప్రాయం. ఇలా మాట్లాడి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను. ఎలానూ మాటజారాను గనుక ఈ విషయం గురించి విపులంగానే చెపుతాను.
ఆవును పూజించటం ఒక విచిత్రమైన ఆచారం. చదువుకున్న హిందువులు దీనిని సరైనదని సమర్థిస్తుంటారు. విమర్శనా దృష్టి కలిగిన వారుకూడా దీనిని మెచ్చుకోటం చూచాం. ఈ ఆచారం వలన మనిషి మానసికంగా ఉన్నతి చెందుతాడని వీరి భావం. ఈ విషయంలో వివాదం పెంచటం నా పని కాదు. అసలు సమస్య ఏమిటి, దానిని ఎలా పరిశీలించి చూడాలి. అనేది నా కోరిక. ప్రగతిని కోరే హిందువులంతా భారతజాతి సమగ్రాభివృద్ధికి హిందూ ముస్లిములు ఐక్యంగా ఉండటం అవసరమంటారు. ఈ సమైక్యత సాధించడానికి వీరిలో ఎంతమంది కృషి చేస్తున్నారు?
పై చెప్పిన ఐక్యత కుదరక పోవటానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. అవి జన సామాన్యం మీద సూటిగా పనిచేయటం లేదు. హిందూ ముస్లిముల మధ్య ఉద్రేకాలు రెచ్చగొట్టటంలో ఈ గోపూజ కూడా ఒక కారణంగా నిలుస్తున్నది. హిందువులకు కావలసింది గోపూజా లేక దేశ విమోచనా? ఈ రెండింటిలో ఒకదానినే హిందువులు ఎంచుకోవాలని నేనంటే నేను అతిగా మాట్లాడుతున్నానని నన్ను తిట్టకండి. ఈ దృష్టితో చూస్తే భారతజాతి బానిస సంకెళ్ళలో  ఈ గోపూజ ఒక కొక్కెమే తప్ప భారతీయుల ఆదర్శంగా మాత్రం కనిపించటం లేదు.
బూజుపట్టిన సమాజ వ్యవస్థలూ కరడు కట్టిన మత ద్వేషాలు చెడు ఫలితాలనే కలిగిస్తున్నాయి. గోపూజ ఒక మూఢ నమ్మకం – భారత యువకులు తమ తెలివి తేటలను గోపూజ సమర్ధన వంటివి చేపట్టటంలోగాక ఇతర విషయాలలో ఉపయోగించి తమ విమర్శనా శక్తిని పెంపొందించుకోవాలి.
ఆవులోనే ప్రత్యేకమైన దైవత్వం ఉందని విచక్షణా జ్ఞానం కలవారెవరూ వాదించరు. పరమాత్మ ప్రతి జీవిలోనూ ఉన్నాడని భావించటమే దీని ఉద్దేశం ఐతే ఋషులు ఆవునే పూజకు తగినదని యెలా నిర్ణయిస్తారు? జంతువులపట్ల సనాతన హిందువుల ప్రవర్తనను పరిశీలిస్తే వారు చెప్పే బ్రహ్మస్వరూప వాదం యెక్కడా కనిపించదు. ఇది నేను అనుభవం ద్వారా తెలుసుకున్న విషయం. పూర్వాచారాలుగల హిందువులు మా పిల్లిజాతిని ద్వేషిస్తారు. నా జీవితం చాలా భాగం పూర్వాచారాలుగల హిందువుల మధ్య గడిచిపోయింది. కొన్ని సులువైన మార్గాలు నేను వెతుక్కోకపోతే నా జీవితం నరకం అయ్యి ఉండేదే. ఈ హిందువులు ప్రవర్తించిన తీరు మీకు చెపితే మీరు ఆశ్చర్యపోతారు. మనుషులంటే ద్వేషించీ, వితండవాదానికి దిగే నేను ఇతరులెవరన్నా వీరి ప్రవర్తన గురించి చెబితే నమ్మి ఉండేదాన్ని కాదు. పిల్లులు పూజకు నోచుకోని జంతువులే కాక మామూలు ఆదరణకు కూడా తగవని వీరి భావం అవి దుష్టజాతివట! ‘వాటివల్ల మనకేం లాభం’ అంటుంటారు వాళ్ళు. చాలా జంతువులు అపవిత్రమైనవని సనాతనుల ఉద్దేశం. ఇవన్నీ తెలిసిన నేను గోపూజ సరైనదని అంటే ఎలా నమ్మగలను?
పరమాత్మను ప్రతి జీవిలోనూ చూడదలచిన హిందువుల ప్రవర్తన దీనికి భిన్నంగా ఉండకూడదు. గోపూజ జరపటంలో పరమాత్మ సిద్ధాంతం ఏమీ కనిపించదు. అసలు విషయం ఆవు వారికి ఉపయోగపడటమే. అవసరానికి ఉపయోగించుకోవటం తప్ప ఇందులో ఆధ్యాత్మిక చింతనకు తావులేదు. ఇందులోనే భారతీయుల ఆధ్యాత్మిక అనాగరికతా లక్షణాలు బయటపడుతున్నాయి.
అసలు హిందువుల పూజలందుకునే స్థాయికి ఆవు ఎలా వచ్చిందా అన్నదే ప్రశ్న. మత చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా పిల్లి బుర్రకు అంతు చిక్కని విషయమిది. ఇప్పుడది ప్రస్తావించవలసిన అవసరమూ లేదు. ఐనా కొంతవరకు ఈ విషయం కదిలించాను గనుక నా అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండలేను.
అసలు గోపూజ అనేది ఒక సామాజిక అవసరాన్ని బట్టి ఒక ఆచారంగా పుట్టిందనిపిస్తుంది. ఒకానొకప్పుడు భారతదేశంలో పశు సంపద కొరతపడి ఉండాలి. నిజంగా   ఈ దేశం, ఇక్కడి వాతావరణం కూడా పశువులు ఆరోగ్యంగా పెరగటానికి అనువైనవి కావు. ఇప్పటికి  ఈ దేశంలో పశువులు సంఖ్యకు చాలా ఉన్నా ఈసురోమని నాసిరకంగా వుంటాయి. వీటి పరిస్థితి ఇంకా దిగజారే లక్షణాలన్నాయి. కేవలం గడ్డి గాదంతోనే పశువులు వృద్ధి చెందవు. మెట్ట భూములూ, అక్కడ వీచే చల్లని పొడిగాలి పశువుల పెంపకంలో చాలా అవసరం. మధ్య ఆసియా పశువుల పెంపకానికి అనువైనది. అందువల్ల అక్కడివారు ఎక్కువగా పశువులను పెంచేవారు. వారిలో కొంత జనాభా హిందూకుష్ పర్వతాల మీదుగా ఉత్తర హిందూ దేశానికి వలస వచ్చినప్పుడు వారితో ఎక్కువ సంఖ్యలో పశువులు రాలేదు. వారు ప్రయాణం చేసిన దారి సరిగా సరిగా ఉండక పోవడం, దారి పొడవునా భరించలేని చలి మూలంగా పశువులు రాలేకపోయాయి. మధ్య ఆసియా నుండి వచ్చిన ఈ సంచార జాతులవారు పశువులంటే చాలా విలువనిచ్చేవారు. వారు వచ్చిన కొత్త దేశంలో పశుసంపద కొరవడింది. ఉన్న కొద్ది పశువులను కాపాడుకోవాలనే తాపత్రయం. పైగా ఆర్యులు మాంసాహారులు. ఉన్న కొద్ది పశువులూ త్వరలోనే ఆహారం కోసం ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. మొట్టమొదటి హిందూ మత గ్రంథాలలో (బౌద్ధం విస్తరించిన తరువాత, హేతుబద్ధంగా వ్రాయబడినవికావు) గోమాంసం ఆహారంలో ప్రధాన భాగమని వ్రాయబడింది. భారత విజ్ఞానం అనబడేదంతా గోమాంసం తిని, సోమపానం చేసిన ఋషుల నుండి సంక్రమించినదే. కొత్తదేశం వచ్చిన సంచార జాతివారు క్రమేణ నాగరికులయ్యారు.  దేశ దిమ్మరితనం మానేసి ఒకచోట వ్యవసాయ వృత్తిలో ఉండసాగారు. తాము ఓడించిన వారిచేత బానిసల మాదిరి చాకిరి చేయించుకుంటున్నా, వ్యవసాయానికి పశువులు గూడా బాగా ఉపయోగిస్తాయని తెలుసుకున్నారు. ఎద్దులను ఆహారంగా వాడేకన్నా ఉత్పత్తి సాధనంగా వ్యవసాయ పనుల్లో వాడితేనే సమాజానికి ఎక్కువ ఉపయోగమనుకున్నారు.
ఈ ఉపయోగానికి దైవత్వం అంటగట్టారు. ఆలోచనాపరంగా వెనుకబడినవారు మత దృష్టితోనే ఆలోచించగలరు. ఎప్పటికీ పాడి పశువులను తమ చాకిరీకి వాడుకోవాలనే స్వార్థంతోనే గోవధ చాలించారు. గోవును సంరక్షించి గోమాత అన్నారు. గోమాత తన సంతానాన్ని మనుషుల విలాసానికి  బానిసలుగా చేయవలసి వచ్చింది. ఒక్కవేటుతో బలి కోరుకుంటుందో లేక జన్మంతా బానిసగా బ్రతుకుతుందో అని ఎద్దునడిగితే ఏమి చెపుతుందో అనేది చాలా ఆసక్తి కలిగించే విషయం. ఎద్దులేమి కోరుకుంటాయో తేలికగా ఊహించవచ్చు. నేనే ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఏమాత్రం పొరపాటు చేయను. నా పశు సోదరులు కూడా తెలివిగానే నిర్ణయం చేసుకోగలవనుకుంటాను. ఎల్లప్పుడు బండ చాకిరీ చేసే బదులు కొద్దికాలమైనా సుఖంగా జీవించటం ఎంతోహాయి.
ఇంతకీ తప్పు రెండువైపులా ఉన్నది. పశువులు మనిషి మచ్చికకు లోనుకావటం పొరపాటు. అందుచేతనే అవి బాధకు గురి అయ్యాయి. అవి మానవుడికి పనికొచ్చేవిగా కనిపించాయి. మానవులు అతి తెలివిగా వాటిని ఉపయోగించుకోసాగారు. మేం పిల్లులం మాత్రం మనిషి జాతికి ఉపయోగపడకుండా జాగ్రత్తపడ్డాం. అందుకే పురాతన హిందువులు మమ్మల్ని ఏవగించుకొంటారు. అన్ని ప్రాణుల్లో చూడగలిగిన పరమాత్మను మాలో చూడలేరు.  అయితే మాత్రం ఏముంది? మేము స్వేచ్ఛా జీవులం. స్వేచ్ఛకంటే మించిన దైవం ఏముంది? సనాతన హిందువులారా? మీరీ సత్యాన్ని తెలుసుకోండి, మీ ఆత్మ వికాసానికి ఎంతో తోడవుతుంది.
గోమాత తన సంతానాన్ని శాశ్వతంగా మానవ దాస్యానికి అంకింతం చేసింది. గనుక హిందువులు గోవధ మానివేశారు. అందుకు వారిని నేను తప్పు పట్టటం లేదు. ఇందులో సామాజిక అవసరమే తప్ప నీతి ప్రమేయం ఏమీ లేదు. ప్రాచీన నాగరికతంతా మనుషుల, పశువుల బానిసత్వం మీద ఆధారపడినదే. బానిస విధానం లేకపోతే గ్రీకు నాగరికతే లేదు. శూద్రులు లేకపోతే బ్రాహ్మణుల ఆధిక్యం ఉండేది కాదు. నేటి విద్యావంతులు కూడా గోపూజను హేతుబద్ధం చేయబూనటమే అభ్యంతరకరంగా ఉంటుంది.
ఇప్పటి కాలంలోనే గోపూజలో నమ్మకం ఉన్నవారు జీవకారుణ్యమే గోపూజకు మూలమని చెపుతున్నారు. ఇది అర్థంకాని వాదన అని తెలుస్తున్నది. అనేక రకాల జంతువులపట్లే కరుణ చూపటమెందుకు? ఈ విషయం సరిగా పరిశీలిస్తే జీవకారుణ్యమే మోసంతో కూడినదనిపిస్తుంది. అవును ఆహారంగా వాడటం కంటే దాని  సంతానంతో చాకిరీ చేయించుకోటమే లాభసాటిగా ఉన్నది. జీవకారుణ్యం పేరుతో ఆవును మరొకరకంగా వాడుకుంటున్నారు. సమాజశ్రేయస్సు దృష్టితో గోవధ మానవలసి వచ్చినా, ఆధ్యాత్మిక విజ్ఞానానికి మూలపురుషులైన ఆర్యుల చేత గోమాంసం తినటం మాన్పించటం అంత తేలికైన పనికాదు. ఇతర జంతుబలిని సమర్థిస్తూ వేదాలలో ఎక్కడా రాసి లేదని మీరు వాదించవచ్చు. దానికి సమాధానం నేను చెబుతాను. గోపూజ చేయాలని వేదాలలో ఎక్కడా లేదు. వేదకాలం పురుషులు దిట్టమైన మాంసాహారులే. ఒకే నాగరికతలో మెలుగుతున్న ఇతర మనుషులకంటే హిందువులు యెక్కువ దయామయులని చెప్పలేం. నన్ను వాళ్లు అమానుషంగా చూస్తారు. మరివారు దయామయులెలా అవుతారు?
ఈ సందర్భంలో శాకాహారుల విషయం ముచ్చటిస్తాం. నేను మాంసాహారిని గనుక ఈ విషయంలో నాకు పట్టుదల ఎక్కువ. మేము మాంసాహారులం గనుక హిందువులు మమ్మల్ని ద్వేషిస్తారు. నేను యే ఎలుకనో పట్టి చంపినప్పుడు నన్ను పాపిగా చూస్తారు. ఈ భూమిని అపవిత్రం చేస్తున్నానంటారు. గోవధ నిషేధం హేతుబద్ధం కాదని చెప్పటానికి శాకాహారం గురించి కొన్ని సంగతులు చెపుతాను.
                               
                మూలం                                  తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

1 comment:

srini said...

very funny, till now i have high respect on m s roy ideology but after reading this, its clear he is also a psyche.

Post a Comment