భాషాసంకెళ్ళు--పిల్లి చెప్పిన కథ - 7




భాష మానవుడిని ఇతర జంతువుల  నుండి వేరు చేసింది. అది  వారి బుద్ధివికాసానికి తోడ్పడింది.  ఈ మాట్లాడే శక్తి వల్లనే మానవుడు ఈర్ష్య, అసూయలు, గొప్పలు  చెప్పుకోటం వంటి చెడు విషయాలకు గురి అయ్యాడు. ఇవి అతని బుద్ధి వికాసానికి అవరోధాలే.

మొదట్లో మానవుడు తన ఉద్రేకాన్ని  వెలిబుచ్చటానికి భాష తోడ్పడింది. నెమ్మదిగా తన భావాలను వ్యక్తం  చేయసాగాడు. భావాలను స్వేచ్ఛగా  వెల్లడించటానికి భాష అడ్డుపడసాగింది. మాటల ఆధిపత్యానికి ఆలోచన  పరిమితమైంది.  మాటల నిరంకుశత్వంలో  మానసిక వికాసం వెనుకబడింది. ఉదాహరణకు పవిత్ర గ్రంథాలను  చూడండి. (ఏ మతానికైనా సరే) వాటిలోని పదజాలానికి మానవుడి  భావాలు కట్టుబడి ఉండవలసి  వచ్చింది. ఉద్రేకాలను, భావాలనూ  దాచుకునే ప్రయత్నంలో జీవితమంతా  అబద్ధాల పుట్ట అవుతుంది. భావ స్వాతంత్ర్యానికి నీళ్లు వదలాల్సి వస్తుంది. స్వతంత్రమైన  ఆలోచనలూ, మతపరమైన నమ్మకాలూ కలసి ఉండలేవు. దైవ నామమే  దైవమయింది. రామ రామ, శివ  శివ, హరి హరి అంటూ దేవుని పేరు జపం చేస్తే పుణ్యం కలుగుతుందని  చాలామంది హిందువుల నమ్మకం, ధర్మం, జీవిత పరమావధి అంటూ పెద్దలు చెపుతుంటే విన్నాను. ధర్మం అంటే ఏమిటో వారినడగండి. అతిగా ఈమాట వాడేవారిలో వెయ్యిలో ఒకరు కూడా దీని అర్థం సరిగా చెప్పలేరు. ‘ధర్మం’ అనేది ఒక మాట. ఈ మాటల గారడిలో కోటానుకోట్ల ప్రజలు తమ ఆలోచనా శక్తిని కోల్పోయారు. ‘ధర్మం’ అనే పదానికి ఏదైనా అర్థం ఉన్నదనుకున్నా, అది కొన్ని మూఢ నమ్మకాలనూ, ఆచారాలనూ, దారి తెన్నులేని జీవిత విధానాన్ని సూచిస్తుంది. ఇవి కూడా ప్రాంతాలవారిగా, తెగలవారీగా మారుతుంటాయి. ఈ ఆచారాలను యెందుకు పాటిస్తున్నారనిగానీ, కొన్ని కర్మకాండలు ఎందుకు జరుపుతున్నారనిగానీ ప్రశ్నిస్తే ధర్మం అలా చేయమంటుంది అంటారు. ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ మొదటికే వచ్చాం. మనుషుల జీవితమంతా ఈ అర్థం లేని పదం, పెత్తనంతో గడుస్తుంది.
ఆచారాలకు గుడ్డి నమ్మకాలకూ అతీతమైందని చెప్ప జూచేవారు ‘ధర్మం’ ద్వారా విశ్వాత్మను చూడగలమంటారు. వాస్తవాన్నితెలుసుకోటానికి తోడ్పడుతుందంటారు. ఒక హిందూ మతానికే కాకుండా అన్ని మతాల సారమని భావింపబడే గాంధీ ఈ నిర్వచనం చేశారు. ఇది పరమాత్మ ఇలా ఉంటుందని యెవరూ చెప్పలేరు. అది మాటలకూ ఆలోచనకూ అందనిది. ఐతే తాను తెలుసుకున్నది పరమాత్మ స్వరూపమేనని నిర్ణయించటం యెలా? ఇదంతా భాషకు దాసోహమవటమే అంటాను నేను.

మూలం తెలుగు సేత

No comments:

Post a Comment