పిల్లి చెప్పిన కథ - 6 శాకాహారం గొప్పదా ?





ఏ మతమైనా మాంసం తినవచ్చునని అంగీకరించినప్పుడు ఒక జంతు మాంసాన్ని ప్రత్యేకంగా నిషేధించటానికి కారణమేమీ కనపడదు. మేక మాంసం, గోమాంసం, అని తేడాలు చూపడం దేనికి? మాంసంవల్ల శరీరానికి ఆత్మకూ హాని కలుగుతుందంటే అన్ని మాంసాలు నిషేధించాలి. హిందువులలో కొన్ని తెగలవారు శాకాహారమే మంచిదనటం హేతుబద్ధం కాదు. వైజ్ఞానికంగా చెప్పేది అర్థం లేనిది. రసాయనికంగా మాంసానికి, కూరగాయలకు తేడా లేదు. ఆహారం ప్రభావం శరీరం మీదగాని, మనసు మీదగాని (ఆత్మ ఉందనుకుంటే దాని మీదగాని) ఉందనుకుంటే దానిలోని రసాయన పదార్థాల ప్రభావంగానే భావించాలి. శరీర పోషణలో కొన్ని రసాయనిక పదార్థాలు అవసరమే. గోమాంసం తిన్నా, అరటికాయ కూరతిన్నా, నెయ్యి తిన్నా ఆహారంలో రసాయనిక పదార్థాలుండడం అవసరం. శాకాహారి అయినా, మాంసాహారి అయినా వారి శరీరాలు ఆరోగ్యంగా వుంటే వారు తినే ఆహారం నుండి ఒకేరకమైన  రసాయనిక పదార్థాలను ఒకే పరిమాణంలో తీసుకుంటాయి. జీర్ణం చేసుకోవటం వారి అలవాట్లను బట్టి ఉంటుంది. మతం ఆచారాలు అడ్డు రావటంతో అచ్చంగా శాకాహారం తింటున్న సామాన్య ప్రజలను పరీక్షిస్తే వారు  అవయవ పుష్టిలోను తెలివితేటల్లోనూ కూడా తీసికట్టుగా కనిపించవచ్చు. తగిన మోతాదులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు శరీరానికి చాలా అవసరం. వాటిని పొందాలంటే జీర్ణకోశపు శక్తికి మించిన పని కలిగించేట్లుగా ఎక్కువ అన్నం, పప్పులూ తినవలసి వుంటుంది. దాని ఫలితంగా బుద్ధి మందగిస్తుంది. పాలు, వెన్న, పప్పులు, కూరలు, పళ్ళు మొదలైనవి జీర్ణాశయానికి ఎక్కువ పని కల్పించకుండానే శరీరానికి కావలసిన పోషకపదార్థాలను అందించగలవు. కాని, ఈ విధమైన ఆహారం సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు. అందువల్ల వాళ్ళు బలహీనంగా ఉంటారు. జీర్ణకోశానికి ఎక్కువ పని కలిగించే సారంలేని పదార్థాలు తిని మానసికంగా మందకొడిగా తయారవుతున్నారు. భారతీయులు మానసికంగా శారీరకంగా వికాసం పొందాలంటే శాకాహార చాదస్తాన్ని విడనాడాలి. మాంసాహారి అయిన ఈ చిన్న ప్రాణి మాట వినండి. మాంసం ఎక్కువగా తినండి. అది మీ ఆత్మ విముక్తికి రాచబాట. నా జీవిత చరిత్ర నుండి మీరు నేర్చుకోవలసింది ఏమిటంటే మాంసాహార జంతువులెప్పుడూ పెంపుడుకావు. గడ్డితినే పశువుల బానిస బ్రతుకంటే మాకు రోత అని. ఐతే మరి కుక్క యెందుకు ఈ సూత్రానికి కట్టుబడదు అంటే అది తనజాతికే ద్రోహి. కుక్క స్వామి భక్తిని గురించి వేరే చెపుతాను.

మూలం తెలుగు సేత
ఎమ్.ఎన్.రాయ్   వెనిగళ్ళ కోమల

2 comments:

Unknown said...

>>మాంసాహార జంతువులెప్పుడూ పెంపుడుకావు. గడ్డితినే పశువుల బానిస బ్రతుకంటే మాకు రోత అని. ఐతే మరి కుక్క యెందుకు ఈ సూత్రానికి కట్టుబడదు అంటే అది తనజాతికే ద్రోహి. కుక్క స్వామి భక్తిని గురించి వేరే చెపుతాను."

నేను పెంచుకునే పిల్లి మాంసాహారి.
నేను పెంచుకునే కోడి మాంసాహారి.
నేను పెంచుకునే టర్కీ కోళ్ళూ మాంసాహారులే.
ఒక్క కుక్కను మాత్రమే ద్రోహి అని "పిల్లి" నిందవేయడాన్ని ఖండిస్తున్నాం. :-))

పిల్లి చెప్పిన కథలో పిల్లి మాంసాహారి కాదుగానీ కుక్క మాంసాహారి. వ్వాటే...లాజిక్...కికికి... :-))

KumarN said...

"భారతీయులు మానసికంగా శారీరకంగా వికాసం పొందాలంటే శాకాహార చాదస్తాన్ని విడనాడాలి. మాంసాహారి అయిన ఈ చిన్న ప్రాణి మాట వినండి. మాంసం ఎక్కువగా తినండి. అది మీ ఆత్మ విముక్తికి రాచబాట. "

ఆ మూలం లో పూర్తిగా ఏం రాసారో తెలీదు కానీ, మీరిచ్చిన పైభాగం మీ బ్లాగు మీద గౌరవం తగ్గించేలా ఉంది. What nonsense is all that? Neither is it true nor is it appropriate. Ridiculous.

Post a Comment