గుర్రపు పందాల ఫాసిజం-పిల్లి చెప్పిన కథ - 4





సరే! ఇవన్నీ మనిషికి సంబంధించిన విషయాలు. నా జీవితం కష్టాలతో కూడినదనటానికి మనిషి గూడా తోడ్పడ్డాడు గనుక మానవుల గురించి సందర్భానుసారంగా క్లుప్తంగానూ, వివరంగానూ రాస్తాను. తనకు దగ్గర బంధువులైన జంతువులను సైతం మనిషి అర్థం చేసుకోలేని స్థితికి వచ్చాడని చెబుతున్నాను. మనిషి ఇష్టపడి, అర్థం చేసుకొని బాగా చూస్తాడనుకునే జంతువు గుర్రాన్నే ఉదాహరణగా చెప్పుకుందాం. గుర్రాన్ని అడిగి చూడండి. దాని అనుభవం అదేమి చెపుతుందో, గుర్రం స్వామి భక్తిగలదని పొగిడి పద్యం వ్రాసేవారెవరైన, ముందుగా మనిషి గురించి దాని అభిప్రాయమేమిటో అడిగి కనుక్కున్నారా? తమ పురాణాల ప్రకారమే ప్రపంచాన్నంతా కొలువ చూస్తాడు. గుర్రాన్ని మనిషి ప్రేమిస్తున్నాడంటే తనకు తాను ప్రేమించుకున్నట్లే, మనిషికి గుర్రం అంటే నిజంగా ప్రేమ ఉంటే దాని వీపు ఎక్కి అది నురగలు కక్కే దాకా పరుగులు తీయిస్తాడా? దాని ప్రాణానికి హాని కలిగించే పరుగు పందాలు పెట్టి గెలిచి బహుమతులు పొందగోరతాడా? తమ యజమాని ఇంత బాధపెడుతున్నా, ఇంత నీచంగా చూస్తున్నా గుర్రాలు సంతోషంగా ఉన్నట్లు ఎందుకు  కనపడతాయని మీరడగవచ్చు. ఈ విషయం జర్మనీ ప్రజలనడిగితే మీకు సమాధానం దొరుకుతుంది. నాగరిక జర్మనీని మధ్య యుగపు కిరాతకానికి దిగజార్చ పూనుకున్న హిట్లర్ ను గెలిపించటానికి వారంతా ఎందుకు ముందుకు వచ్చారో తెలుసుకోండి. ఆ జర్మన్ ప్రజలు ఈ పెంపుడు గుర్రాలవలె ‘మేమెలా  చేసామా?’ అని నోళ్ళు తెరచి ఆశ్చర్యపడవచ్చు. మిలటరీ బ్యాండ్ వినగానే సైనిక శ్రేణుల్లో నిలబడి ‘హేల్ హిట్లర్’ అని సైనిక వందనం చేయటానికి ప్రేమతో కూడిన క్రౌర్యానికి ఉత్సాహంగా లోబడతాయి.  ఈ రెండు ఉదాహరణలలో ప్రవర్తన నిర్బంధంతో ప్రారంభమై క్రమంగా బానిస మనస్తత్వంగా రూపొందినా లోలోపల వున్న అసహ్యం పూర్తిగా మరుగైపోదు.


మూలం     తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment