‘ఓం’ కూ ‘మ్యావ్’ కూ తేడా ఏమిటి ?--పిల్లి చెప్పిన కథ - 8
‘ధర్మం’ అంటే చెప్పబడే నిర్వచనాలన్నీ నాకు తెలుసు. ధర్మం అంటే ప్రపంచాన్ని నిలబెట్టగలదనీ, సమాజానికి ఆధారభూతమైనదనీ హిందూ మేధావులు చెపుతారు. ఐతే సమాజానికి ఏది ఆధారభూతం అని నిర్ణయించేదెవరు? మత వాదులకు ఈ ప్రశ్న చాలా అసందర్భంగా తోస్తుంది. వారు చెప్పేది లోగడే నిర్ణయం ఐపోయింది. పవిత్ర గ్రంథాలలో అది రాసి వున్నది. దానిని అనుసరిస్తే అంతా సక్రమంగా నడుస్తుంది. ఇలా మళ్ళీ మాటలలోకి వచ్చేస్తున్నాం. హిందూమతం ఆదిలో శబ్దం వున్నదంటుంది. (క్రైస్తవ మతం కూడా ఇలాగే అంటుంది) ‘ఓం’ శబ్దం భాష కంతకూమూలం అంటారు. చిత్రమేమిటంటే ఈ ‘ఓం’ శబ్దం మాట్లాడే భాషలో భాగంగా లెక్కించరాదని, మానవులకంటే ఈ ధ్వనిని జంతువులే బాగా చేయగలవు. నా మేనల్లుడున్నాడొకడు. వాడీ శబ్దాన్ని మనుషుల్ని భయకంపితుల్ని చేసేట్లుగా చేస్తాడు. అయితే హేతుబద్ధం చేయదలిచేవారు (హేతువాదులు కాదు). పిల్లులు ‘ఓం’ శబ్దాన్ని అపవిత్రం చేయటం సహించరు ‘ఓం’ అంటే ‘అ’ ‘ఉ’ ‘అం’ కలసిన సంయుక్త శబ్దం. ఈ విషయం ఒప్పుకున్నంత మాత్రాన ఇక్కడ సమస్య పరిష్కారం కాదు. దీనిని బట్టి తేలుతుందేమంటే రెండు అచ్చులూ, ఒక హల్లుగల మాటలను మాత్రమే ఆదిమ మానవులు మాట్లాడ గలిగారని. అలాంటి శబ్దాలు చేసే మానవులకూ ఆట్టే జంతువులకూ తేడా ఉండకూడదు. నిజం చెప్పాలంటే ‘ఓం’ ఒక మాటకూడా గాదు. సగం పలికే శబ్దం మాత్రమే. ఐనా ఆధ్యాత్మిక జీవితాలమీద అది గొప్పగా పెత్తనం చేస్తుంది.

ఈ ‘ఓం’ శబ్దాన్ని పదేపదే  వల్లిస్తే ఆధ్యాత్మికంగా మనిషి ఉన్నతుడెలా అవుతాడు? నేను చేసే ‘మ్యావ్, మ్యావ్’ శబ్దం కూడా ఆ పని చేయలేదా? అర్థం లేని సంకేతం, ఆకారంలేని దేవుడికి చిహ్నం ఎలా అవుతుంది? కడుపు నిండా తిని బ్రేవ్ మని తేనుస్తూ ‘ఓం’ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన ఆధ్యాత్మిక అనుభూతి ఎట్లా కలుగుతుంది? నా మాదిరిగా ఇలా ప్రశ్నలు వేయకుండా మాటల గారడీతో నోళ్ళు మూయిస్తుంటారు. మానవుడి అభివృద్ధి తొలిదశలో ‘నమ్ము, ఆలోచించకు’ అనే మాటలు ప్రచారం చేశారు. నేటికి ఈ మాటల మాయలోనే అనేకమంది కొట్టుకు పోతూ వున్నారు. ‘శబ్దబ్రహ్మ’ కోరల్లో నుండి భారతదేశం ఇప్పట్లో బయటపడే లక్షణాలేమీ కనిపించటం లేదు.
జాతీయోద్యమం రోజుల్లో స్వరాజ్యం, సహాయనిరాకరణ, అహింస, త్యాగం, బాధలు వంటి మాటలు వినబడ్డాయి. వీటికి కొన్ని కేవలం ఆధ్యాత్మిక పదాలు గూడా జోడించారు. అందులో ముఖ్యమైంది. ‘సత్యం’ ప్రతి జాతీయవాదీ ఆలోచనలో, ఆచరణలో, మాటల్లో సత్యం, అహింసా పాటిస్తానని వాగ్దానం చేస్తాడు. నీతి పదాలూ ఆధ్యాత్మిక భావాలూ జాతీయ భావానికి విలువనిస్తాయని నమ్మకం.  ఈ మాటలు ప్రతివాళ్ళూ వల్లించారు. కాని అర్థం తెలుసుకుందామని ఎవరూ ప్రయత్నించలేదు. ఫలితంగా ఆలోచన ఆగిపోయి ఉద్యమ సామాజిక ఆర్థిక లక్ష్యాల విషయం అయోమయంగా తయారయ్యింది.
‘సత్యం’ అనే మాట నిర్వచనానికి అందకుండా రూపుదాల్చింది. అయినా జాతీయవాదులకు అది ఒక అందమైన నినాదంగా మిగిలింది. సత్యానికి కట్టుబడి వుంటామని వారు వాగ్దానం చేసేటప్పుడు నైతికంగా ఎంతో ఎత్తు పెరిగినట్లు భావించుకున్నారు. యెలాంటి దేవతకు తాము బద్ధులమై ఉంటామని వాగ్దానం చేస్తున్నారో వారు గుర్తించలేదు. ‘సత్యం’ అంటే ఏమిటి? ఇంత చిన్న మాటను ఏ భక్తుడూ వివరించలేడంటాను నేను.

మూలం తెలుగు సేత
ఎమ్.ఎన్.రాయ్   వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment