15 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”
విజ్ఞానంలో వాస్తవాలకు ఆస్కారం ఉన్నదిగానీ, పెత్తనానికి అవకాశం లేదు. ఒక సిద్ధాంత వాస్తవాన్ని తేల్చడానికి వాస్తవాలే తుది నిర్ణయాలు గనక వాటికి ఈ ప్రాధాన్యం లభించింది. రెండొందల సంవత్సరాల పాటు ప్రపంచంయావత్తు న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని ఆమోదించింది. కొన్ని కీలక పరిశోధనలతో సాపేక్షతా సిద్ధాంతం సరయిందని రుజువయ్యే సరికి, పదార్థ విజ్ఞానంలో న్యూటన్ తుదిపలుకు పలికాడనే విషయాన్ని తోసిపుచ్చడానికి విజ్ఞానవేత్తలెవరూ తటపటాయించలేదు. విజ్ఞానేతర రంగంలోని వారి ధోరణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయం ఆచార్యులను ఆహ్వానించి తన టెలిస్కోప్ ద్వారా జుపిటర్ కు చెందిన ఉపగ్రహాలను చూడమని గలీలియో కోరగా వారంతా నిరాకరించారు. వారు విద్యావిహీనులుకారు. చిత్తశుద్ధిలేని వారుకారు. ఇటలీ సమాజంలో ఎంతో సంస్కృతీపరులూ, బాగా చదువుకున్న వారు కూడా అలాంటివారు గలీలియో ఆహ్వానాన్ని ఎందుకు నిరాకరించినట్లు. వాస్తవాలకు భయపడా, లేక గలీలియో తలతిక్కవాడని భావించారా. ఇవాళ వింతగా కనిపించవచ్చుగానీ ఆనాడు గలీలియో తలతిక్కవాడనే వారు భావించారు. జుపిటర్ కు ఉపగ్రహాలున్నాయనీ, ఆరిస్టాటిల్ ఎక్కడా రాయలేదు కదా. కనక అలాంటి ఉపగ్రహాలు ఉండటానికి వీలులేదు. టెలిస్కోప్ ద్వారా స్వయంగా చూశామని ఎవరైనా అంటే అలాంటివారు భ్రాంతిలో ఉండి ఉండాలి. అటువంటి భ్రాంతిపరులపట్ల చూపవలసింది దయమాత్రమే, మెచ్చుకోలుకాదు.
శబ్ద ప్రమాణం అనేది నాటి ఫ్రొఫెసర్ల ధోరణి నిర్ధారించటానికి తోడ్పడింది. అదే ప్రమాణంతో గెలీలియో, చావుకు వెరచి, తన అభిప్రాయాలు మార్చుకోవలసి వచ్చింది. ఇటువంటి శబ్ద ప్రమాణంతోనే బ్రూనోను ఉరికంబం ఎక్కించారు. మనదేశంలో సీత సహగమనానికీ, అమానుషమైన అంటరాని తనానికీ, ఇంకా అనేక నమ్మకాలూ, ఆచారాలు జీవితంలో పెనవేసుకుపోవడానికీ, శ్రుతి, స్మృతి అనే ప్రమాణాలే కారణం.
భారత కమ్యూనిస్టులూ, వారి సహచరులూ అనుసరించే ధోరణిని బట్టి శబ్ద ప్రమాణాన్ని వారెలా పూజిస్తారో సాదాహరణగా చూపవచ్చు. భారతదేశంపై చైనా దురాక్రమణను చాలా సంవత్సరాల పాటు వాళ్ళు గ్రహించలేక పోయారు. ఐక్యరాజ్య సమితిలో దురాక్రమణ అంటే ఏమిటో నిర్వచించలేదన్నారు. ఒకవేళ నిర్వచించగలిగినా, కమ్యూనిస్టుదేశం దురాక్రమణ వంటి దోషానికి గురి కాదని, కమ్యూనిజం మానవ సోదరత్వాన్ని ప్రబోధిస్తున్నదని అన్నారు. లామాల ప్యూడల్ పరిపాలన నుంచి విమోచనగావించే నెపంతో నిస్సహాయంగా ఉన్న టిబెట్ ను కమ్యూనిస్టు చైనా కబళించి వేసింది. 12వేల చదరపు మైళ్ళ భారతభూభాగాన్ని చైనా వశం చేసుకుంది. ఇదంతా వారి దృష్టిలో ప్రధానం కాదు. చైనా ప్రభుత్వం బాండుంగ్ ప్రకటనలో భాగస్వామి అనీ, పంచశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నదనీ వాదించారు. గలీలియో టెలిస్కోప్ నుంచి జుపిటర్ ఉపగ్రహాలు చూడటానికి నిరాకరించిన ప్రొఫెసర్లు అరిస్టాటిల్ ఆ విషయం చెప్పలేదంటూ, శబ్ద ప్రమాణాన్ని అడ్డం పెట్టుకున్నారు.
కమ్యూనిస్టు నిరంకుశత్వాన్ని, దురాక్రమణను సాధ్యమని మార్క్స్ చెప్పలేదు. గనక కమ్యూనిస్టులు వాస్తవాన్ని చూడలేక పోయారు.
సిద్ధాంతాల నిర్ణయానికి వాస్తవాలే తుది ప్రమాణమైనప్పుడు వైజ్ఞానిక ధోరణిని అనుసరించి సాంఘిక విధానాన్ని, అందులో నివసించే వారి అనుభవాన్ని బట్టే నిర్ణయించాలి. తన పక్షాన శాసనం చేయటానికీ, విధానాలు నిర్ణయించటానికీ, ప్రాతినిథ్యం వహించటానికీ ఎవరు ఉండాలనేది నిర్ణయించే హక్కు పౌరులదే మిగిలిన సాంఘిక వ్యవస్థలతో పోల్చిచూసినప్పుడు ప్రజాస్వామ్యానికి తనను తాను సరిదిద్దుకునే స్వభావం ఉంది. ఇది వైజ్ఞానిక దృక్పథం నుంచి వచ్చిందే.
అంతర్వాణికి అవకాశం లేదు
వైజ్ఞానిక పద్ధతిలో వాస్తవాలపై ఆధారపడే విధానంవల్ల జ్ఞానం అందరికీ చెందడం, ప్రపంచానుభవంతో కూడింది గావడం విశేషంగా పేర్కొనాలి. అన్వేషణలో అలౌకికత్వానికి చోటులేదు. నమ్మకానికి బదులు జ్ఞానం అనేది ఆధారంతో కూడిన వాస్తవాలపై నిలబడుతుంది. అనుభవంతో పరీక్షించటానికి వీలులేని వాటిని సత్యాలుగా అలౌకిక వాదం పేర్కొంటుంది. ఈ కారణాల వల్లనే, వైజ్ఞానిక పద్ధతికి మార్మిక వాదం కూడా పొసగదనే చెప్పాలి. మార్మికుని అనుభవం వైజ్ఞానిక పరిశోధనకు, ఆసక్తికీ వస్తువు కావచ్చు. మానవుడి మనస్సు కొన్ని పరిస్థితులలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోటానికి ఈ అన్వేషణ ఉపయోగపడు తుంది. మార్మికుడు తన అనుభవానికి భాష్యం చెపుతూ దైవంతో లీనమైనట్లు పేర్కొంటాడు. అందులో వైజ్ఞానికంగా నిలబడేదేమీ లేదు. సరైన జ్ఞానం లభించక ముందు, లోగడకూడా మూర్ఛలకూ అంటువ్యాధులకూ గ్రహణాలకూ తోకచుక్కలకూ వక్రభాష్యాలు చెప్పారు. సూర్యగ్రహణానికి సనాతనులు చెప్పే వ్యాఖ్యానంలో ఎంత నిజం ఉన్నదో, మార్మికుడు తాను అనుభూతి పొందాననే సత్యంలోనూ అంతే నిజం ఉన్నది.
మార్మికవాదం, అలౌకికవాదం జ్ఞానానికి సంబంధించినంతవరకూ నిస్సారమైనవి అలాగే మహాత్ముని అంతర్వాణిని కూడా ఇతరులకు ఎలాంటి మార్గాన్ని చూపలేని సారంలేని విషయంగానే భావించాలి, ఒక విషయాన్ని గురించి వివేచనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు అందులో తుదిఘట్టంగా ఉపచేతనావస్థలో, మెరుపు మెరసినట్లు అంతర్ దృష్టి పడవచ్చు. అయితే ఉత్తరోత్తరా దానిని వాస్తవ సంఘటనలు సమర్థించేవిగా ఉంటాయి. కాని అంతర్వాణి ప్రతిపాదనలను నిశిత పరిశీలనకు గురిచేసి పరీక్షించి వాస్తవాన్ని చూడవలసి ఉన్నది. ఒక వ్యక్తి అంతర్వాణి ఏమేరకు నమ్మదగింది అని తేల్చి చెప్పటానికి ఒక పద్ధతి ఉన్నది, అంధవిశ్వాసం, వీరారాధన లేకుండా ఇతరులకు వినిపించి అవగాహన అయ్యేటట్లు చేయాలి. అలా చేయకపోతే రెండు ప్రమాదాలున్నాయి. అంతర్వాణి ఆధారంగా తప్పు తోవలుపట్టి హిమాలయాలంత పెద్దదోషం చేయవచ్చు. ఇకాం ఘోరం ఏమంటే అంతర్వాణిని విశ్లేషించక పోవడం, అంతర్వాణి చెప్పినవి దోషాలని సంఘటనలు రుజువు చేస్తున్నా గుణపాఠం నేర్చుకోకపోవటం సంభవమే.
మానవ వ్యవహారాలలో ఉద్రేకాలు
ఉద్రేకాల పాత్ర ఏమిటో వైజ్ఞానిక పద్ధతి స్పష్టపరుస్తుంది. విశ్లేషణకు సాధనగా ఉపకరించేది వివేచనేకాని ఉద్రేకం కాదు. కనక ఒక సన్నివేశంలో సమస్యలను పరిష్కరించటానికి ఉద్రేకాలను వివేచనకు లొంగి ఉండేటట్లు చేయాలి. మానవ జీవితంలో ఉద్రేకానికి చోటు లేదని కాదు. పైగా, చూస్తూ ఊరుకోటం గాక గాఢమైన ఉద్రేకాలను కనబరచటం, అందాన్ని మెచ్చుకోడం మానవ జీవితంలో ముఖ్యమైన విషయం. మానవద్వేషి తప్ప మరెవరూ మానవుడిని కేవలం లెక్కలు వేసే యంత్రంగా పరిగణించరు. ఉద్రేకాలన్నీ ఆనందానుభూతులుకావు. రామణీయకత భిన్న కోణాలలో మానవుడు చూడగలడనే విషయాన్ని నిరూపిస్తుంది. గాంధీ తన జీవితంలోని చివరి దశలో ఎదురైన ఒంటరితనాన్ని, ఓటమిని గ్రహించిన వ్యక్తిగా పరిణితి చెందిన వ్యక్తిగా భావించవచ్చు. గాంధి హత్య, ఏటా వర్థంతి రోజున ఉపవాసం అనే వాటికే ప్రాధాన్యం ఇచ్చే వారు ఇంకా అపరిపక్వదశలోనే ఉన్నారన్నమాట. అవగాహన అనేది ఉద్రేకాలు పరిపక్వదశకు వచ్చినప్పుడు పనిచేసే తీరన్నమాట. జ్ఞానాభివృద్ధి వల్ల అవగాహన వస్తుంది. ఉద్రేకాన్ని వివేచనకు లోబరచాలంటున్నామంటే మానవుడి అంతరంగిక జీవితాన్ని తగ్గించడం కాదు. పైగా ఉద్రేకాల మూలాధారాన్ని వికసింపజేసి, దీని ఫలితంగా వచ్చే శక్తిమంతమైన ఉద్వేగాలకు సరిగా అవగాహన చేసుకొని, ఆచరణకు దిగటానికి తోడ్పడటమై ఇందలి ఉద్దేశం. ఉద్రేకం బలంగా ఉన్నప్పుడు పైకి వ్యక్తం కావాలనుకొంటుంది. ఇవి తరచు ఏదో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయటపడటం. ఒక్కోసారి గురిలేకుండా బయటపడటం జరుగుతుంది. ఆగ్రహావేశంతో ఉన్న గుంపు బస్సుపై రాళ్ళు వేయటమనేది విధ్వంసక చర్య. దీని వల్ల సాధించే ప్రయోజనం ఏమీ లేదు. మిగిలేది గందరగోళం, దిగజారుడు విధానం మాత్రమే. ఒకవేళ ఆచరణ అనేది ఫలప్రదమైనప్పటికీ, దీనిని తెలివిగా ఒక పథకం ప్రకారం పట్టుదలతో నిర్వహించటం అవసరం. ఈ విధంగా వివేచన ఆధారంగా ఉద్రేకం ఉంటే జీవిత పోరాటంలో ఇంకా ఉత్తమంగానూ, వదిలేస్తే ఎండు గడ్డిపై నిప్పుపడినట్లే ఉంటుంది.
రచన తెలుగుసేత
ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment