భారత స్త్రీల లైంగిక సమస్య-సన్యాసం అంటే...


నా కాశీ ప్రయాణం                   
రామకృష్ణ మిషను నుండి బయటపడి పంజాబ్ మెయిల్లో 7 గంటలు ప్రయాణం చేసి కాశీ చేరుకున్నాను.  నేను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని. నాకు రామకృష్ణ మఠాలు తప్ప బయటి ప్రపంచంతో పరియచం లేదు.  కాశీలో అస్పిఘాట్ వద్ద ఒక ధర్మశాలలో నా మూట పెట్టి నదిలో స్నానం చేశాను. ఈలోగా విశ్వనాధుడికి పూజచేసి, ఆర్ఘ్యపాద్యాలు అర్పించడానికి కమండలం కొందామనుకుంటుండగా ఒక 50 సంవత్సరాల పొడవుపాటి వ్యక్తి వచ్చి మహారాజ్ మీ కమండలం ఇదిగో అని ఇచ్చాడు. చాలా అందంగా ఉంది. దాన్ని చూస్తూ ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెబుదామను కుంటుండగా అతడు వెళ్ళిపోయాడు. విశ్వనాథుడి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళాను.
నాకు ఇప్పుడు సన్యసత్వానిచ్చే ఒక సన్యాసి కావాలి. చౌపత్తి దేవాలయం వద్ద దశవామిలో కాషాయ వస్ర్తాలతో సాధువులు కనిపించగా ప్రణాయం చేసి వారిని సమీపించాను. సాదరంగా నన్ను కూర్చోమన్నారు. నా కథ వినిపించాను. మౌనంగా విన్నారు. వారిలో ఒక వృద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు. నీ కృషి శ్లాఘనీయమైనది. మా జీవితంలో ఇలాంటి సన్నివేశం చూడలేదు. నెలలో ఐదు వందలు సంపాదిస్తూ జర్మనీలో చక్కని కుటుంబంతో కారులో, షికారులో పయనిస్తూ వుండాల్సింది. అయినా సాధు జీవితాన్ని కోరుకున్నావు. కాని సన్యాసిని కావడానికి వీలులేదు. బ్రాహ్మణులు మాత్రమే అందుకు అర్హులని నీకు తెలుసనుకుంటాను అన్నారు స్వామి సుమేధానంద. అయితే, శూద్రుడైన వివేకానందుడు సన్యాసి కాలేదా? అని అడిగాను.
నిజమే కాని సంస్కారాలున్న వ్యక్తికి సన్యాసం సులభం. కాని నీవు విదేశాల నుండి వచ్చావు. దశవామిలో ఎవరూ నీకు సన్యాసం ఇవ్వరు. ఇచ్చినా మేము నిన్ను సన్యాసిగా అంగీకరించం అన్నారు సుమేధానంద. వారికి నమస్కరించి వెళ్ళిపోయాను.
తరువాత రెండు రోజుల పాటు మూడు డజన్ల మఠాలలో వందకు పైగా సాధువులను కలుసుకున్నాను. పుట్టుక దోషం వలన నేను సన్యాసిని కావడానికి వీలులేదని, సనాతన బ్రాహ్మణులు చెప్పారు. నీకు ఎక్కడి నుండి వచ్చినా సరే విష్ణువు దేవాది దేవుడని వేదాల సారాంశాన్ని కబీరు చెప్పాడని నీవు అతన్ని గురువుగా స్వీకరిస్తే, తమలో చేర్చుకుంటామని అన్నారు. ఇలాంటి వారితో నాకు మాయావటిలో రెండేళ్ళ అనుభవం వుంది. మరికొందరు నన్ను వేచి వుండమని తమ పద్ధతులను చూచి తట్టుకోగలవసుకుంటే కాలక్రమేణా చేర్చుకుంటా మన్నారు. అవన్నీ నాకిష్టం లేకపోయాయి. ఊరికే ఉండదలచ లేదు. హరిద్వార్, షీకేష్ లో లాంఛన ప్రాయంగా కొంత డబ్బిస్తే సన్యాసిగా దీక్ష ఇస్తారని తెలిసింది. వేలాది మంది ఈ విధంగా సన్యాసం పుచ్చుకొని కాషాయ వస్ర్తాలు వేసుకున్నారు. మరి కొందరు స్వతంత్ర సాధువులు స్వయంగా కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో పేరు పెట్టుకొని స్థిరపడటమో లేక సంచారమో చేశారు. సన్యాసి కాక పూర్వం ఏమిటో సాధారణంగా అడగరు. సాధువులలో వందలాది మంది పండితులున్నారు. వేలాది మంది పామరులూ వున్నారు. సన్యాసులకు గుర్తింపు పత్రం ఏదీ లేదు.
ధర్మశాలలో నిద్రపోవాలని ప్రయత్నించాను. అంతలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద కొందరు జనం గుమిగూడి ఒక స్వామీజీ ప్రసంగాన్ని వింటున్నారు. అతడు మాయను గురించి ఉపన్యసిస్తున్నాడు, నేనూ వెళ్ళాను. అది వెన్నెల రాత్రి, అందరూ వెళ్ళిన తరువాత ఆయన నన్ను చూచి అయితే ఈ జనంతో పాటు నువ్వూ చేరావన్న మాట అన్నారు. గత రెండు రోజులుగా నా అనుభవాలు చెప్పాను. ఆసక్తికరంగా విన్నాడు. నేను హరిద్వార్  వెళ్ళి సన్యాసం పుచ్చుకుందామనుకుంటున్నాను అన్నాను. ఆయన రుద్రాక్షమాల త్రిప్పుతూ మౌనంగా వుండమని నాకు సంజ్ఞ చేసి, చాలా సేపు అలాగే ఉండిపోయారు. తరువాత ఆయన అన్నారు. ఒకవ్యక్తి త్యజిస్తే, అతడు విముక్తి పొందాలి అని ఉపనిషత్తులో ఉన్నది. ఇది బ్రాహ్మణులకే పరిమితం కాదు. కనుక నీకు దీక్ష ఇస్తాను అలాంటి వాక్యాలను మాయావటిలోని సన్యాసులు కూడా తరచు ఉదహరిస్తుండే వారు. ఆశ్రమాలు సన్యాసానికి రావాలని వీరు సనాతనులకు సమాధానం చెప్పేవారు. ఏమైనా నేను అమితానందం చెందాను వినయంగా కృతజ్ఞతలు చెప్పాను. ముకుళిత హస్తాలతో కూర్చున్నాను. ఫాడ్యమినాడు నీకు సన్యాసం ఇస్తాను. ఇంకొక వారం రోజులు నీవు వేచి వుండాలి. రేపు భిక్ష ఇస్తాను. దక్షిణ తీసుకురా. నా పేరు విశ్వానంద భారతి. హనుమాన్ ఘాట్ దగ్గర మద్రాసు స్వామీజీ అని అడిగితే చాలు అన్నారాయన.
ఒకడజను అరటి పళ్ళు, కొబ్బరికాయ, కొన్ని బత్తాయిపండ్లు సేకరించాను. ధ్యానం చేసి విశ్వనాథ దేవాలయంలో పూజచేసి మరునాడు ఉదయం ఉపవాసం వున్నాను. ఘాట్ వద్దకు రాగానే మద్రాసు సాధువు కొరకా అంటూ ఒకతను నా దగ్గరకు వచ్చాడు. అవునన్నాను. స్వామిని అతిథిగా ఆహ్వానించిన కాశీ కుటుంబవాసి కుమారుడతను. వారు 300 ఏళ్ళనాడు పశ్చిమ భారతం నుండి వచ్చి స్థిరపడ్డారు. స్వామి విశ్వానంద దక్షిణాది నుండి వచ్చారు. ఆయన ఇంకొక వారానికి పెళ్ళి కానుండగా 18 ఏళ్ళపుడు సన్యాసం స్వీకరించాడు, దశమి ఆశ్రమంలో అధ్యయనం చేసి 7 సంవత్సరాలు గంగోత్రిలో ధ్యానం చేశాడు. నాలుగు పూర్ణ కుంభాలలో ఆయన స్నానం చేశాడు. అనేక పర్యాయాలు భారతదేశం పర్యటించాడు. హిందీ, కన్నడం, తమిళం, సంస్కృతం అయనకు కొట్టినపిండి. తమిళ, సంస్కృతంలో చక్కని సిద్ధాంత చర్చలు, భక్తిగీతాలు వ్రాశాడు. ఇంగ్లీషు చదవగలరు. కాని మట్లాడలేదు. నేను హనుమాన్ ఘాట్లో ఆయన గదిలో ప్రవేశించి సాష్టాంగ ప్రమాణం చేశాను. ఆయన చదువుతున్న పత్రిక పక్కనబెట్టి, కళ్ళజోడు తీసి తన ప్రక్కన కూర్చోమన్నాడు. దక్షిణ తెచ్చావా అని అడిగాడు. చీకటిపడే సమయాన దీక్ష ఇస్తాను. తరువాత విశ్రాంతి తీసుకో. రాత్రి 12 గంటలకు మణికర్ణికలో సన్యాసం స్వీకరించు.

సన్యాసం అంటే...
మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి ఏడున్నర వరకు సన్యాసిగా బాధ్యతలేమిటో ఎలా జీవించాలో ఆయన చెప్పారు. నేను మాయావటిలో ఉండగా లైంగిక విషయాలతో బాధపడ్డాను. నా ఆలోచనలు పసిగట్టినట్లుగా ఆయన అన్నారు. నీవు యవ్వనంలో ఉండగా నీకు లైంగిక బాధలు ఉండకపోవచ్చు. 45-60 సంవత్సరాల మధ్య శరీరం తిరుగుబాటు చేస్తుంది. మనస్సు భయాందోళనకు గురౌతుంది. అప్పుడు లైంగికంగా అసలు కష్టాలు ప్రారంభమౌతాయి. ఇప్పుడు నీకు చేస్తున్నది త్యాగమే అయితే యిది అసాధ్యం కాదు. మధ్యలో ఎప్పుడైనా నీవు పతనమైనా మనస్సును వికలం చెందనీయకు. మళ్ళీ తపస్సు ప్రారంభించు. నా దృష్టిలో పతనం కాని సన్యాసంటూ లేడు. అలా పడుతూ లేస్తూ ఉండాలి తప్పదు. వీటి మధ్య గిరిగీసి చూడటం అజ్ఞానం. మనం సాధువులం... న్యాయవాదులం కాదు అని బోధించారు.
సన్యాసం స్వీకరించిన తరువాత కాశీలో ఉండి భిక్ష స్వీకరించవచ్చు లేదా ఇతర సాధువులవలె తీర్థయాత్రలు చేయవచ్చు అని చెప్పారు. నీవు గ్రామాలలో పర్యటించేటప్పుడు ఏ చెట్టుకిందో కూర్చొని ఆహారం స్వీకరించు, ఆ గ్రామస్తులకు దర్మం బోధించు. వారెన్నడూ వినవి విషయాలు వినిపిస్తే అంతకంటే కావలసినదేముంది, మనం చేసేది గొప్పపని మనకు ప్రజలు ఆహారాన్ని ఇవ్వకపోతే మనం వ్యక్తులుగా, వ్యవస్థగా ఉండలేకపోవచ్చు. ఈ దేశంలో కాషాయవస్ర్తాలు అదృశ్యమయ్యే రోజు రావచ్చు. అది చాలా మందికి ఆనందంగా ఉంటుంది. మనం వీటిని పట్టించుకోకూడదు. ఎవరి దారిన వారుపోవాలి అని విశ్వానంద భారతి చెప్పారు.
సన్యాసిగా యెలాంటి మర్యాదలు పాటించాల్సింది ఆయన చెపుతూంటే నేను రాసుకోబోయాను. కాని, ఆయన వారించారు. పరిస్థితిని బట్టి అవన్నీ జ్ఞాపకానికి వస్తాయని ప్రశాంతత అవసరమైనప్పటికీ, ఒక్కోసారి ఆగ్రహం చూపవలసి వస్తుందని ఖచ్చితమైన నిబంధనలంటూ లేవని చెప్పారు. అప్పటికి సాయంకాలం ఆరయింది. స్వామి విశ్వానంద మళ్ళీ చెప్పారు. అర్థరాత్రి నిన్ను పూర్తి సన్యాసిని చేస్తాను. చాలామంది నిన్ను సన్యాసిగా గుర్తించకపోవచ్చు. సనాతనులు నిన్ను గుర్తించకపోవచ్చు. నీవు ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకుంటే నేడు గుర్తించని వారు రేపు గుర్తించవచ్చు. నీవు ఆది బ్రహ్మ అవతారమైనా నీకు గుర్తింపురాదు. ఇదంతా బాధాకరంగా వున్నా నీవు పట్టించుకోరాదు. సంపద, సంతానం, సాంఘిక బహిష్కారం, సాంఘిక ఆమోదం ఇత్యాది అన్నిటిని వదలుకోవడమే సన్యాసి మార్గం. అవి పాటించనంతకాలం నీవు సన్యాసివే వెళ్ళి నిద్రపో, బ్రహ్మచారిగా ఇదే నీ ఆఖరి నిద్ర రేపటికి నీవు సన్యాసివౌతావు.
ఇంకో పావుగంటకు అర్థరాత్రి అవుతుందనగా లేచాను. స్నానం చేసి, లంగోటి ధరించి, లోహఘాట్లో కొన్ని దుస్తులు ఒక సేవకుడికి ఇచ్చి నా వెంట రమ్మన్నాను. కాశీ సందు గొందులలో వేగంగా నడుచుకుంటూ పోతే మణికర్ణికఘాట్ కు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మణికుండలం వద్ద ఒక క్షణం ఆగాను. గంగానది ఒడ్డుకు 15 గజాల దూరాన ఉన్న ఆ బావిలో శివుడి కర్ణకుండలాలు పడిపోయాయట. ఇక్కడ చనిపోవడం పవిత్రమని హిందువులు భావిస్తారు. రాత్రింబగళ్ళు ఇక్కడ శవాలు తగలబడుతూ ఉంటాయి.
అక్కడ చాలా మంది బ్రహ్మచారులు, సన్యాసులు ఉన్నారు. ఆనాడు అరడజను మంది బ్రహ్మచారులు సన్యాసం స్వీకరించనున్నారు. హరిద్వార్ నుండి వచ్చిన స్వామి జగదీశ్వరానంద నలుగురికి సన్యాసం ఇప్పించబోతున్నారు. నాతో ఈ విషయాలు చెప్పిన సన్యాసిని ఉద్దేశించి విశ్వానందజీ ఎవరికైనా సన్యాసం ఇస్తారని తెలుసా? అన్నాడు. ఒక మ్లేచ్చుడికి సన్యాసం ఇవ్వబోతున్నారట. అదెలా సాధ్యం? అయినా మద్రాసు సాధువు గొప్ప జ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు అన్నాడాయన. ఇంతలో ఒక పొడవాటి స్వామి వచ్చి నీకోసం ఆచార్య చూస్తున్నారు. త్వరగా రమ్మన్నాడు. ఆయన దుర్గ గుడి వద్ద విశ్రమించి ఉన్నారు. నన్ను చూసి ఇంకా అర్థగంట వ్యవధి ఉన్నది. ముందే వచ్చావు వెళ్ళి దేవుని పూజించు. ఇదే తగిన సమయం అన్నారు. మణికర్ణిలో నేను దేవుని పూజించి లేచే సరికి ప్రవేశద్వారం వద్ద నున్న విశ్వానందను చూసి పాదచారులు నమస్కరించి పక్కకు తప్పుకొన్నారు. బహుశా వారికి ముందే విషయం తెలుసనుకుంటాను. రానురాను శ్మశానంలో సన్యసత్వం స్వీకరించే పద్దతి తగ్గిపోతున్నది. సన్యసత్వాన్ని స్వీకరించడంలో కొందరు శ్మశానాన్ని కోరుకోగా, మరి కొందరు చక్కని గృహాన్ని లేదా దేవాలయాన్ని కోరుతుంటారు. మణికర్ణిక అందుబాటులో ఉండగా నేను మాత్రం సన్యసత్వం ఇక్కడే ఇస్తాను. నీకేది కావాలో కోరుకోమన్నారు. నేను శ్మశానాన్నే కోరుకున్నాను. నన్ను ఆశీనుణ్ణి చేసి స్వామి విశ్వానంద నా ఎదుట కూర్చుని వామహస్తంతో ఆచమనం చేశారు. సన్యాస దీక్ష సమయంలో అలా వేయాలట. 23 స్వాహాలు చదివి అందుకు ఉపకరించిన పరికరాలన్నీ విరాజి హోమంలో పడేశారు. చివరగా నా పిలకను కత్తిరించి దానిలో పడేశారు. తరువాత నన్ను మరో చితి వద్దకు తీసుకెళ్ళారు. అదింకా నిప్పంటించని చితి దాని మీద నన్ను పడుకోమన్నారు. నా దేహాన్ని ఏడు చోట్ల తాకి లాంచనప్రాయంగా చితినంటించారు. నేను సంకేతపూర్వకంగా దహనం కావించబడ్డాను. ఆ సందర్భంగా నేను లేచి చనిపోయిన వారినుద్దేశించి చదివే మంత్రాలు చదివాను. నా దేహం సజీవంగా ఉన్నప్పటికీ నేను చనిపోయాను. సన్యాసి నేను అంటే తన శరీరం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని కాదు. నేను అంటే బ్రహ్మతో తాదాత్మ్యం చెందటం. సామాన్యుడుకూడా బ్రహ్మే. ప్రాణులన్నీ బ్రహ్మే. కాని సన్యాసికి తాను బ్రహ్మని తెలుసు. నేను బ్రహ్మచారి దుస్తులను వదిలేసి గంగానదివైపు నడిచాను. బ్రహ్మచారులు స్నానానికి వచ్చేటప్పుడు ఇతరులు వైదొలుగుతారు. నేను గంగలో మునిగి వచ్చిన తరువాత స్వామి విశ్వానంద నాకు కాషాయ వస్ర్తాలు ఇచ్చారు. నేను వెంటనే ధరించాను. ఆగేహానంద భారతికి విజయోస్తు అని నన్ను దీవించి నా కొత్త నామధేయాన్ని నిర్ణయించారు. నాకిచ్చిన దండను గంగా నదిలోకి విసిరేసి పరమహంసలకు నియమాలుండవని అన్నాను.
తొలి భిక్ష ఎవరినుండి స్వీకరిస్తావో నిర్ణయించుకోమని విశ్వానంద చెప్పారు. మేము ఘాట్ నుండి వచ్చేవరకి అరిటాకులలో మంచి ఆహారాన్ని పెట్టుకొని ఒక డజను మంది స్ర్తీ పురుషులు ఎదురు చూస్తున్నారు. వారు నా పాదాలు స్పృశించి తమ ఆహారం స్వీకరించమని కోరారు. సన్యాసి ప్రథమ పర్యాయం ఎవరి ఆహారం స్వీకరిస్తాడో వారికి చాలా గౌరవమనీ, ఈ విషయంలో నీవెవరికైనా మాటిచ్చావా? అని విశ్వానంద అడిగారు. ఆయన ఇంగ్లీషులో అడిగిన దానికి నేను ఇంగ్లీషులోనే సమాధానం చెప్పాను, అయితే  నీవు మాటిచ్చిన వారి ఆహారమే స్వీకరించమన్నారు. నన్ను ఆహ్వానించిన వ్యక్తి అనేక పదార్థాలు సిద్ధం చేసి నా పాదాల చెంత ఉంచాడు. నేను కూర్చుని భుజించాను. ఈ శవానికి అప్పటికే చాలా ఆకలిగానూ, దప్పికగానూ ఉన్నది. తరువాత శవం వలె నిద్రపోయాను. లేచేసరికి విశ్వానంద వక్క నములుతూ మాపక్కనే కూర్చున్నారు. ఆగేహానంద మహారాజ్, స్నానం చేసి రండి మాట్లాడుకుందాం అన్నారు. తిరిగి వచ్చేసరికి లడ్లు, జిలేబిలు, టీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడేం చేస్తావు ఆగేహానంద అని అడిగారు. ఏం చేయమంటారు? అని అడిగాను. విశ్వానంద చెపుతూ, ఏడు పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలు చేయవచ్చు లేదా భారత దర్శనానికై పర్యటించవచ్చు. కాని ఒక వారం పాటు ఉండి ధ్యానం చేయి అన్నాడు. నేను దేశపర్యటన చేస్తానని చెప్పి ఆయన ఆజ్ఞాపించినట్లుగా తరువాత ఏడు రోజుల పాటు అన్నపూర్ణ గుడివద్ద కూర్చుని ధ్యానం చేస్తూ రాత్రిళ్లు మణికర్ణిక ఘాట్ లోని స్మశాన మైదానంలో ధ్యానం చేశాను. ఒకవారం తరువాత స్వామి విశ్వానంద భారతి దగ్గరికి వెళ్ళి ఏదారిన వెళ్లమంటారని అడిగాను. ఆయన భుజాలెగరవేసి ఇలా అన్నారు. నేను సన్యాసి నైనప్పుడు హరిద్వార్లో ఉన్నాను. మైసూర్ లోని శారదా పీఠం వరకూ నడిచివెళ్ళి నరసింహ భారతికి ప్రణామం చేశాను. ఆయన దర్శనార్థం 1500 మైళ్లు నడిచి వచ్చానంటే ఆయన ఆ విషయాన్ని గుర్తించినట్లే లేదు. కనుక నీ ఇష్టం, ఎక్కడికైనా పో అన్నారు.
శృంగేరీ పీఠాధిపతి వద్దకు వెళ్దామనుకున్నాను. విశ్వానంద చెపుతూ నీ తెల్ల శరీరం దేనికైనా పనికివస్తుందేమో కాని గుర్తింపుకు మాత్రం అది ఆటంకం. అందువలన గుర్తింపుకు ప్రయత్నించవద్దు అన్నాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాను. స్వామీజీ ద్వారం చెంతనే నాపాదుకలను వదిలేసి బయలుదేరాను. మొదట్లో కొంత శ్రమనిపించినా మూడు వారాలకు మడమలు బాగా గట్టిపడ్డాయి. గంగా మాతకు తర్పణాలర్పించి, విశ్వనాథుణ్ణి పూజించి, ప్రసాదం స్వీకరించి బయలుదేరాను.

సన్యాసి దేశాటనం
కాశీని చుట్టి, దక్షిణాదికి బయలుదేరాను. కాని నాకు మార్గం తెలియదు. నాగపూర్ శివార్లలో తిరుగుతూ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించబోతున్నట్లు తెలుసుకున్నాను. తరువాత జాగ్రత్తపడి కొన్ని గ్రామాల మీదుగా తిరుపతి వైపుకు పయనించాను. పెద్ద నగరాలలో ప్రముఖదైవ మందిరాలుంటే తప్ప సాధువు నగరాలను తాకకూడదంటారు.  సాదువు తమ దర్శనార్ధం వచ్చిన గ్రామస్థులను వెళ్ళిపొమ్మనరాదు. నేను కునికిపాట్లు పడుతున్నప్పుడు కొందరు ముకుళిత హస్తాలతో ధ్యానం చేస్తున్నట్లు కూర్చుంటారు. గ్రామాలలో చెట్ల క్రింద, దేవాలయ ప్రాంగణాలలో నన్ను చాలామంది వెక్కిరించారు. అయినప్పటికి గ్రామాలలో 90 శాతం ప్రజలు సాధువులకు అనుకూలంగానే ఉన్నారు. 5 శాతం మంది సంప్రదాయ కారణాలుగా సాధువులను వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారు సెక్యులర్ కారణాలుగా వ్యతిరేకిస్తున్నారు. సాధువుల వద్దకు ముందుగా స్ర్తీలు వస్తారు. వారు పిల్లలతో సహా పురుషులందరూ వెళ్లిపోయిందాకా ఉండి తరువాత తమ సందేహాలకు సాధువులకు వ్యక్తం చేస్తారు. అన్ని రకాల ప్రశ్నలు వస్తుంటాయి. కొన్ని పర్యాయాలు కలహాలను కూడా తీర్చ మంటుంటారు. నేను అనేక పర్యాయాలు రోడ్డుపై కూర్చుని అనుభవాలను నన్ను దర్శించుకోడానికి వచ్చినవారు చెప్పిన విషయాలను రాసు కున్నాను. వాటన్నిటినీ ప్రచురిద్దామనుకుని మళ్ళీ తమాయించు కున్నాను. వ్యక్తిగత విషయాలు నాతో చెప్పుకున్నప్పుడు వాటన్నిటినీ బయటపెట్టడం మంచిదికాదని భావించాను.

భారత స్త్రీల లైంగిక సమస్య
ఒక గ్రామంలో ఒక స్ర్తీ నాతో సందేహాలు తీర్చుకోడానికి ఇలా అడిగింది. నాకు ఏడుగురు సంతానం. గత పదేళ్ళుగా నా భర్తతో కాపురం చేస్తున్నాను. మన కవులు చెప్పే ఆనందం గాని, మనపాటలలో వినిపించే విషయాలుగాని నాకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. ఆమె చెప్పదల్చుకున్న దేమనగా భార్యగా పిల్లలను కన్నానే తప్ప లైంగికంగా నాకు తృప్తిలేదు అని మాత్రమే.
నేను తొమ్మిది మాసాలు కాలి నడకన దేశమంతా తిరిగాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వింధ్య ప్రాంతాలు, హైదరాబాదు. కూర్గ్ లలో గ్రామీణ స్త్రీలు ఇంచుమించు తమ లైంగిక అసంతృప్తిని మాటలలో నాకు వెల్లడించారు. ఢిల్లీ, కలకత్తా, పాట్నా, ట్రివేండ్రంలో ఉన్న వంశాలకు చెందిన స్ర్తీలు ఇలానే చెప్పటం నాకు తెలుసు. భారతీయ పురుషులు గొప్ప ప్రేమికులనే గొప్పలు చెప్పుకోవడం తప్ప భార్యల నుండి ఇలాంటి ఫిర్యాదులున్నాయని వారికి తెలియదు. ఈ విషయాలను వారికి చెప్పేవారు లేరు. గ్రామాలలో నేను పురుషులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ విషయాలను సూచన ప్రాయంగా చెప్పాను. వారి ముఖాలలో రాగద్వేషాలున్నవి. తరచు స్త్రీలతో సంపర్కం ఉన్నప్పుడు స్త్రీలకు అసంతృప్తి ఉంటుందని పురుషులు భావించరు. ఒకవేళ తెలిసినా పట్టించుకోరు. లైంగిక సంబంధం ఒకవిధి అని, అది పురుషుడికి అనందాన్నిస్తే చాలని అనుకుంటారు.
గ్రామాలలో ఆహారం, దైనందిన చర్యలు, లైంగిక విషయాలు, మత పరంగా జరిగిపోతుంటాయి. మొత్తం మీద గ్రామాలలో హిందువులు దయామయులు. ప్రేమపాత్రులు. నేను వారితో విభేదించినా, కఠినంగా మాట్లాడేవారు కాదు. ఆగ్రహం కూడా సన్యాసులపట్ల వ్యక్తమయ్యేదికాదు. అతిథి గౌరవం గ్రామాలలో గొప్పగా ఉండేది.

మానసికంగా దేవి దర్శనం
నేను 1500 మైళ్లు పర్యటించాను. నా ధ్యాన దృషిని మరల్చలేదు. నాకు ఈ విషయంలో ఏకాగ్రత ఉన్నది. నాగపూర్ కు దక్షిణంగా 50 మైళ్ళ దూరంలో దారితప్పి గ్రామస్తులను మార్గం అడిగాను. తరువాత 11 మైళ్ళు నడిచి ఒకచోట రోడ్డుకు 50 గజాల దూరంలో ఒక గుడిని చూశాను. సాధువుకు త్రోవలో ఎక్కడ దేవాలయం కనిపించినా తన భక్తి ప్రవత్తులు వెల్లడించాలి. నేను చూసింది 14వ శతాబ్దం నాటి గుడి. అందులో విఠల్ విగ్రహం ఉన్నది. ద్వారప్రవేశంలో సాలగ్రామం ఉన్నది. లోనికి ప్రవేశిస్తే దేవి విగ్రహం కనిపించిది. పూలమాలాలంకృతమైన ఆ దేవి విగ్రహం చుట్టూ పూజాద్రవ్యాలతో, సువాసనలతో ఆకర్షణీయంగా ఉన్నది.  చుట్టూ ఎవరూ కనిపించలేదు. విగ్రహం ముందు ప్రణామం చేసి కొంచెం సేపు పూజించి బయట ఒక స్థంభంపై ఉన్న పూలమాలను దేవి మెడలో వేసి నిశ్శబ్దంగా కాసేపు కూర్చున్నాను. అప్పటికి మధ్యాహ్నం కావస్తున్నది. కుంకుమ తీసుకుని నొసటికి అద్దుకుని మరోసారి ప్రణామం చేసి బయలుదేరాను. రెండు మైల్ళు వెళ్ళేసరికి గుడిసెలలో బీడీలు తాగుతూ కొందరు రైతులు కనిపించారు. అలసిపోయిన నన్ను విశ్రాంతి తీసుకోమని మజ్జిగ ఇచ్చారు. దేవిగుడి గురించి అడిగి పూజ ఎవరు చేస్తారని ప్రశ్నించాను. వారంతా ఏమీ ఎరుగనట్టు ముఖం పెట్టారు. అందులో 50 సంవత్సరాల వయస్సుగల ఒక వ్యక్తి మహారాజ్ ఇక్కడకి 50 మైళ్ల చుట్టుపట్ల దేవి గుడి  ఏదీ లేదు. మేము విఠలుడిని పూజిస్తాం. కొందరు శివపూజ చేస్తారు. నేను కలవరపడి చూసిన విషయాన్ని చెప్పాను. అతడు మళ్ళీ ఇక్కడకు 6 మైళ్ల దూరంలో మార్తాండుడి గుడి వున్నది. కాని మాతాతల కాలం నుండి అక్కడ పూజా పునస్కారాలు లేవు. అక్కడ ఏవో శక్తులున్నాయని ఎవరూ వెళ్ళరు అన్నాడు. నేను ఆశ్చర్యంతోనూ, ఆగ్రహంతోనూ మరోసారి అక్కడకు వెళ్లానుకున్నాడు. నాతోపాటు రమ్మంటే ఎవరూ రాలేదు గాని, దయ్యాలంటే, భూతాలంటే భయంలేని కుర్రవాడనిచ్చి పంపించారు.
ఈ సంఘటనకు కారణాలు ఉత్తరోత్రా ఆలోచించాను. కొన్ని వారాలుగా నేను దేవిని గురించి ఆలోచిస్తూ సౌందర్యలహరి గానం చేస్తూ ఉన్నాను. నా మనస్సంతా దానిపై లగ్నమైనందున అది ఏదోక విధంగా వ్యక్తం కావాలి. ఈ విధంగా జరిగిందని మానసిక వివరణ చెప్పుకోవచ్చు. దీనినే హిందువులు దర్శనం అంటారు. నా పర్యటనలో సన్యాసిగా మనోపరిశోధనా రీతులలో జరిగిన ఒక సంఘటన ఇది.

బళ్ళారిలో చాతుర్మాస్య దీక్ష
నేను బళ్ళారిలో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించాను. ఒక స్మార్త బ్రాహ్మణుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రతిరోజూ సాయంత్రం సమావేశాలు జరిగేవి. పొద్దుబోయే వరకూ సాగేవి. మధ్య తరగతి వారితో నాకు సన్నిహిత పరిచయం కలిగింది. కాలేజి విద్యార్థులు సంస్కృతీ పరులైన స్త్రీలు ఆ సమావేశంలో పాల్గొని చర్చను ఆసక్తికరం చేసేవారు. మూడు మాసాలు లోపే వర్షాలు తగ్గినందున చాతుర్మాస్యం అన్ని ముగించుకుని, మైసూరులోని శృంగేరి పీఠానికి వెళ్ళాను. దేవాలయం వద్ద కొలనులో స్నానం చేసి శారద పూజ చేసి, జగద్గురువు శంకరాచార్య చంద్రశేఖర భారతి దర్శనార్ధం వెళ్ళాను. అక్కడ ఒక స్వామి నన్ను సాదరంగా అతిథి గృహంలో ఉంచారు. మరునాడు స్వామీజీ వద్దకు రమ్మన్నారు. అలాగే వెళ్ళాను. కాని శంకరాచార్యుల వారు నన్ను చూడరని చెప్పారు. నేను కారణం అడగలేదు. ఆయన తపోదీక్షలో ఉన్నందున తరచు ఎవరినీ కలవడం లేదని చెప్పారు. ఆరోగ్య దృష్ట్యా ఆయన ఏదో ఉన్మాద స్థితిలో ఉన్నట్లు కొందరు చెప్పారు. తరువాత కొద్ది సంవత్సరాలకే తుంగభద్రలో స్నానం చేసిన అనంతరం ఆయన చనిపోయారు. కాని నన్ను చూడడానికి నిరాకరించడంలో విశ్వానంద ఊహించిన కారణమే కావచ్చు. నా గురించి ఆయనకు ముందే తెలియజేశాను. నేను సన్యాసిని అని ఆయన గుర్తించలేదు. ఒక సాధారణ వ్యక్తిగానూ చూడలేరు.
విచారంగా శృంగేరీ వదిలి తొమ్మిది మాసాల పాదయాత్ర అనంతరం మొదటిసారిగా బస్సెక్కాను. షిమోగా, హసన్ల మీదుగా బేలూరు, హళబీల్లో, హోయనల శిల్పాలను చూడడానికి వెళ్ళాను. అక్కడ కామశిల్పాలు విరివిగా, అందంగా ఉన్నవి. వీటిని హిందూ పునర్వికాసకారులు అసహ్యించుకుంటారు. హిందూ సంప్రదాయంలో అంతర్భాగంగా వీటిని నేను అభినందించాను. ఇవి అనేక సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలిస్తాయి.
బెంగుళూరులో రైల్వే స్టేషను నుండి పోతుండగా ఒక తమిళుడు వచ్చి నన్ను అతిథిగా ఉండి, తన గృహాన్ని పావనం చేయమన్నాడు. ఆహారం కేవలం శాకపాకాలతో  ఉన్నప్పటికి చాలా రుచిగా ఉన్నాయి. వియన్నా కాఫీ నాకు గుర్తుకు వచ్చింది. దక్షిణాదిలో కాఫీ చాలా బాగుంటుంది. హాలు మధ్యలో సోఫా మీద నేను ఆసీనుడిని కాగా ఇంటి యజమాని, స్నేహితులు, వారి భార్యలు వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇంగ్లీషులో ఒక అర్థగంట మాట్లాడిన తరువాత చర్చ హుందాగా, హాస్యపూరితంగా హైందవ సంస్కృతీ విలువలతో సాగింది. ఇది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. పాదయాత్రలో ఇలాంటివి తక్కువ నా రాకను ముందుగానే ప్రకటిస్తారు. గనుక కొన్ని ప్రశ్నలతో వచ్చేవారు. తరువాత ఎక్కడికి వెళతారని నన్ను అడిగారు. చెప్పాను. ఎలా వెళతారని అడిగాడు. ఏమో తెలియదన్నాను. టికెట్ కొనే అవకాశాన్ని తనకు కల్పించమని అడిగాడు. మొదటి తరగతి టికెట్ కొని ఇచ్చారు. అది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మద్రాసు మీదుగా ఇటార్పి., కాశీ చేరుకున్నాను. చూడడానికి కావలసినన్ని దృశ్యాలు, సావకాశంగా ఆలోచించడానికి కావలసినంత కాలం లభించింది. ప్రపంచం దుఖఃమయం కనుక నేను సన్యాసిని కాలేను. ఆనందమయం కనుకనే సన్యాసినయ్యాను.
 Telugu Version-Innaiah Narisetti

2 comments:

కమనీయం said...


very enlightening, very informative about ascetics(sanyasis).

v g said...

Thank you very much for this translation. Looking forward to reading the rest of the book.

Post a Comment