అత్తదనం !!-----పిల్లి చెప్పిన కథ - 2




పాతుకుపోయిన నియమాల్ని  పాటించకపోతే భారత సమాజ చట్రం బద్దలౌతుంది. ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించడానికి ఏ ఆదర్శమూ మిగలదు. భారత ఆధ్యాత్మిక సంస్కృతి చాలామట్టుకు మూఢ నమ్మకాలతో నిండిపోయింది. దీనికి మతం ముద్రవేసింది. వాస్తవాలకు గౌరవం లేదు. బొత్తిగా అర్థం పర్థం లేని భ్రమలు ఆచరణలో వున్నాయి. మన పూర్వీకుల వివేచనను కొలవడానికి పాశ్చాత్యుల భౌతిక ప్రమాణాన్ని తీసుకోకూడదు. పూర్వీకులు, పెద్దలు, వివేచనాపరులు. ఇందుకు వయస్సు ముఖ్యం కాదు. ప్రమాణాలను కొలవడానికి కోడిగుడ్డుపై వెంట్రుకలు లెక్కించే తర్కం పనికిరాదు. శరీరాన్ని బట్టి చూస్తే వయస్సుకు ప్రాధాన్యత వుండొచ్చు. ఆత్మ నిత్యం. దానికి వయస్సు లేదు. శారీరకంగా అత్త చిన్నదే కావచ్చు. కాని ఆత్మ దృష్టితో అత్తదనం అనుభవించే అవకాశం అత్తకు వుండాలి. మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు కంటే అత్త వివేచన ఆధిక్యతలో వున్నది. అత్తదనంలో వున్న యీ హక్కు విడదీయరానిది. తిరుగులేనిది.

అత్తదనం!! ఈ మాట కనిపెట్టడంలో నేను సైతం తత్వశాస్త్రానికి మూలభావాన్ని అందించగలుగుతున్నాను. పిల్లిగా నేనెరిగినంతలో, ప్లేటో యిలాంటి భావానికి మూలపురుషుడు. గుర్రపుదనం, ఏపిల్ దనం, చెట్టుదనం చెప్పిన ప్లేటో అత్తదనం వూహించలేదు.
నా పెదతండ్రి పులి గంభీర  జంతువు. మనుషులు దాని ముందు  తీసికట్టు. మనుషులకు చెప్పగల  హక్కు మాకువున్నా, నేను భారతీయ సందేశాన్ని అందించడానికి, సాధారణ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను మనుషుల మధ్య బ్రతికాను. కనుక రోజువారీ విషయాలలో జరుగుతున్న విషయాలను సరిగా ఆలోచించే చెప్పదలచాను. నేను చెప్పేదంతా సూటిగా సాహసంగా వుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను కనుగొన్నంత మేరకు మానవుల కథ వెల్లడిస్తాను. రాగ ద్వేషాలు లేకుండా చెబుతాను. నన్ను గురించి చెప్పబోవడంలేదు. నా జీవిత సంఘటనలు చూపుతాను.

రాగద్వేషాలు జీవిత లక్షణాలు. అవి లేకుంటే జీవితం లేదు. నేను లేకుంటే నా కథ వుండదు. రాగ ద్వేషాతీతంగా సొంత కథలు చెబుతానంటే జాలిపడాలి. అది ఆత్మవంచన. తనకు తాను అబద్ధాలాడటమే జీవితం అంటే ఆకలి, ప్రేమ, ద్వేషం, కోపం, దయ మొదలయిన వాటి కలయికే. ఇందులో కొన్నిటి కారణంగా నాకు మానవులతో సంబంధం ఏర్పడింది. నాకు ఆకలేసినప్పుడు నిర్దాక్షిణ్యంగా చూచిన మనిషిపట్ల నాకు ఆగ్రహం లేకపోతే నాలో మానవత్వం లేనట్లే. అలాంటప్పుడు మనిషి నిజ స్వభావం బయటపడుతుంది. జైలులో మానవుడి నిజస్వరూపం బయట పడిన సందర్భాలలో నేను అతడిని చూచాను. కనుక నా నిర్ణయాలు నిష్పాక్షికంగా వుంటాయి. నిష్పాక్షికం అంటే రాగద్వేషాలు లేవనుకోరాదు. నిష్పాక్షికత అంటే వాస్తవం అన్నమాట. రాగద్వేషం జీవితంలో మౌలిక సత్యం.
బెర్నాడ్ షా గొప్ప రచయిత. అతడి ఆధారంగా నా కృషి ప్రారంభిస్తాను. షా వినయంగా ఆరంభించినట్లే  నేనూ సమతతో మొదలెట్టి ఫలవంతం చేస్తాను. ఒక కళాకారునిగా నేను సఫలం కాదలచలేదు. సాంఘిక విమర్శకునిగా జయం పొందదలచాను. యవ్వనంలో బెర్నాడ్ షా చూపిన సాహిత్య ప్రతిభ అంతా విఫలమైపోయింది. నాకు అలాంటి లోపంలేదు. కనుక విజయం పొందగలను. నేను ఎలా చెబుతున్నాను అనే కంటే, ఏమి చెబుతున్నాను అనేది ముఖ్యం.

బెర్నాడ్ షా ‘ప్లేస్ అన్ ప్లజంట్’ అనే తన నాటకాలకు యిలా ముందుమాట రాశాడు. కళాఖండాల కోవలో నా నాటకాలకు స్థానం లభించాలంటే, నేను విచారంతో వేచి వుండాలి.  విషయాన్ని బట్టి నా మిత్ర పాఠకులొకరిద్దరు నాటకాలపట్ల ఆసక్తి చూపొచ్చు. అభినందించవచ్చు, ఆనందించవచ్చు. కాని నా రచన రమణీయంగా, హార్థంగా వున్నదనలేరు. ఇతి వృత్తంలో చేదు జీవిత సత్యాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో పాత్రలు ఉన్నతంగా మాట్లాడరు, నాజూకుగా నివశించరు. తమ జీవిత స్థితిగతులను చిత్తశుద్ధితో ఎదుర్కోరు. సుఖప్రదమైన జీవితంలోని ఆనందాలకు, సౌందర్యాలకు ఈ రచనలో తావులేదు. కలుషిత విషయాలను పైకి తెచ్చి బట్టబయలుచేసి, పాఠకులను నవ్విస్తారు. ఇది నా దోషం కాదు. రామణీయకత కంటే నా తెలివితేటల వికారాలు, నైతిక దృష్టి నారచనలలో కనిపించడం నా తప్పు కాదు.

పిల్లి కథ మనుషులకు ఎందుకు ఆసక్తిగా వుండదు? పిల్లి తన సొంత గాథను ఎందుకు చెప్పకూడదని లోగడ అన్నానుగదా నా జాతివారు తమ తమ కథల్ని వినిపించనూవచ్చు. అవి మనుషులకు ఉపయోగపడనూవచ్చు.  ఈ మాటలంటే తగాదా వస్తుంది కూడా. మనుషులకు ఆడంబరం జాస్తిగదా! మనిషిస్థానం ఈ విశ్వంలో అనల్పం అని గ్రహిస్తే యింత గర్వం వుండదేమో. ఈ విశ్వధూళిలో మానవుడు సంచరించే ఒక బొగ్గుకణం అని తెలుసుకుంటే తన ఆండంబరానికి తానే సిగ్గుపడతాడు కూడా.

మనుషుల గర్వాన్ని దెబ్బకొడుతూ  కోపర్నికస్ శాస్త్రజ్ఞుడు  ఖగోళ శాస్త్రాన్ని తిరగదోడాడు. అనుకోని సంఘటనగా సూర్యమండలం ఏర్పడినట్లు ఆయన చూపాడు. వేదాంతులు పేర్కొన్నట్లు  అనంతసృష్టికి మానవుడు పరిమిత ప్రతిబింబమైతే  ప్రత్యేక దైవదృష్టికి మనిషికి యింత అవమానకరమైన స్థానం యెందుకున్నట్లు? భౌతిక విశ్వంలో అనంతంగా నక్షత్రాలున్నాయి. అందులో సూర్యుడు ఒకటి, లక్షలాది నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ మానవుడు కొరకు అమర్చిన వేదిక కాదుకదా. విశ్వం అంతా మానవుడి కొరకు, అతడి జీవితం కోసం ఏర్పడింది కాదు. మహోన్నత సమన్వయంలో మానవ జీవితం ఒక బుడగవంటిది. అందులో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్, ఎడ్గార్ వాలేస్ వున్నారు. నేనూ వున్నాను. సంచరించే ప్రతి ప్రాణి కూడా ఈ అపఖ్యాతిలో భాగస్వాములే.

మనిషి, కోతి, గుర్రం, కుక్క, పిల్లి, గబ్బిలం అట్లాంటి ఉన్నత ప్రాణులన్నీ ఒకేరీతిగా  కనిపించే అండం నుండి పుట్టినవే. గొప్పరచయితలకూ నాకూ ఈ పుట్టుకలో తేడా లేదు. ఈ పోలికను జీవపరిణామంలో అంతటా చూడొచ్చు. నేను ఆ తల్లి కడుపులో వున్నప్పుడు 2 మాసాలప్పుడు చూస్తే, ఇతరులకూ నాకూ తేడా వుండదు. ఇందులో తండ్రిపాత్ర రేతస్సు కణాన్ని అందించడమే. అది తల్లి కడుపులోని అండంతో కలసి పిండం ఏర్పడుతుంది. ఈ పుట్టుక తలవనితలంపుగా జరుగుతుంది. ఇందులో కూడా గొప్ప వ్యక్తికీ నాకూ తేడా వుండదూ. తల్లి గర్భాన్ని ఆశ్రయించి పిండం పెరుగుతుంది. తల్లికి లభించే క్లోరోఫిల్ సూర్యుని నుండి వస్తుంది. మనం బ్రతకడానికి అవసరమైనదంతా సూర్య కిరణాలనుండి అందుతుంది. తల్లి అందం, తండ్రి రేతస్సు అనుకోకుండా కలిసినప్పుడు, వీటికి సూర్యరశ్మి శక్తి తోడైనప్పుడు పుట్టుక జరుగుతుంది. ఇందులో గొప్ప మెదడు వున్నదనుకున్న మనిషికి, ఇతర జీవులకూ తేడా లేదు. నేనూ అలాగే పుట్టాను. ఇవన్నీ తిరుగులేని జీవిత సత్యాలు. కనుక మానవుడి గర్వానికి ఆధారం లేదు. నా శరీరానికి, మానవ శరీరానికీ, ఆకారానికీ, గుణంలోనూ యెలాంటి తేడా కనిపించదు. మానవుడు తనలో దైవ గుణాలూ, అద్భుత శక్తులూ ఉన్నాయి గనుక గొప్పవాణ్ణి అనుకుంటాడు. రెండుకాళ్ళమీద నడిచే వాళ్లకూ, నాలుగు కాళ్ళమీద నడిచే మాకూ తేడా లేదు.  ఈ విషయంలో నేనింకా యెక్కువ చెప్పినా నాకు పోయేది ఏమీ లేదు. పిల్లికి కూడా మెదడుంటుందా అని యెగతాళి చేయకుండా నా మెదడును పరిశీలించండి. జీవపరిణామంలో మెదడు పరాకాష్ఠ. అంటే భౌతికంగా ఇది అతి ఉన్నతమైన దశ. అంతేగాని పరిణామం వలన ఇది జనించింది అని కాదు. ఆధ్యాత్మిక చింతనగల మానవుడి మెదడుతో నా మెదడు వుంచి శరీర శాస్త్రవేత్తను పరిశీలించమనండి. సైజు తేడా తప్ప మిగతా తేడా ఏమీ ఉండదు. శరీర శాస్త్రవేత్తకు ఏ మెదడు యెవరిది అని తెలుసుకోవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. చూడండి! పిల్లులలో కూడా ప్రతిభ గలవి ఉంటాయి. నేను ప్రతిభగలదాన్ని కాదని మీరెట్లా అనగలరు? ‘పిల్లి పుస్తకం రాయటమేమిటి’ అని మీరంటే ‘యెందుకు వ్రాయకూడదూ’ అని యెదురు ప్రశ్న వేయగలిగానంటే నా సత్తా మీకీసరికి తెలిసే వుంటుంది.

ఇప్పటిదాకా మానవులకే పరిమితమైన  సరస్వతీ దేవిని నేనూ ప్రసన్నం చేసుకున్నానంటే మళ్ళీ యెన్నో ప్రశ్నలను నేను యెదుర్కోవలసి ఉంటుంది. నాలుగు కాళ్ల జంతువులకు కూడా మేధస్సు, ప్రతిభ వుంటే అవి యెక్కడా బయట పడలేదేమని ప్రశ్నలేయవొచ్చు. ఇలాంటి అనుమానాలు కలుగుతాయని నాకు ముందే తెలుసు. ప్రశ్న అసంబద్ధమైనా సమాధానం చెప్పటం తేలికే సాపేక్షతా సిద్ధాంతం పదార్థ విజ్ఞానశాస్త్ర పరిధిలు దాటి మానవుల ఆదర్శాలను విప్లవాత్మకం చేస్తున్నది. అప్పుడు మీ సందేహానికి తావుండదు. (వేదాంతులారా! బహుపరాక్!) మానవుల ప్రమాణాలు పిల్లలు మీదా రుద్దకండి. మహాత్ములకున్న అవలక్షణాలు, చరిత్రహీనత పిల్లులకూ, కుక్కలకూ, కోతులకూ ఉండవూ. మానవేతర జంతువులలోని ప్రతిభ వెల్లడి కావటం అనేది వాటి చరిత్రలో యెక్కడా జరగలేదని ఒక నిర్ణయానికి అంత తొందరగా రాకండి!

మూలం;                తెలుగుసేత
ఎమ్.ఎన్.రాయ్       వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment