పిల్లి చెప్పబోయేకథ--1ఒక పిల్లి. అదీ దొంగ పిల్లి – అలగా జాతి పిల్లి తన కథను లోకానికి చెబుతోంది. ఇది అపూర్వం. సాహిత్య చరిత్రలో ఇంతవరకూ ఇలా జరగలేదు.
నవ్వొస్తుంది కదూ మీకు? సంఘపరంగా చెప్పబోయే నా కథను క్రమేణా వింటారు.
చిక్కు సమస్యగా తోస్తున్నదా!
కాని నా కథ వినడానికి ఆసక్తిగానే వుంటుంది. అంతా చదివిన తరువాత నిరుత్సాహపడరు.  ఎంత ఆసక్తిగా వుంటుందో చెప్పలేను గానీ, విజ్ఞాన పూరితంగా వుంటుందనడంలో సందేహం లేదు.  సాహిత్యంలో సఫలం కావాలంటే వినయం అవసరం. రచయితలకు వినయం లోపిస్తే, సాహిత్య ప్రపంచంలో గొప్పవారుగా కనిపించేవారే కాదు. అయితే, ఇదేమంత దురదృష్టం కాదని చతురాడే నిరాశావాదులున్నారు. నేను నిరాశావాదిని కాదు. అయినా ఈ విషయంలో వారితో ఏకీభవిస్తాను.
అచ్చువేసేవారు. అమ్ముకునేవారు  లాభాలు గడించవచ్చు. వారి సంగతి  అలా వుంచండి. కొందరు హఠాత్తుగా  పెద్ద రచయితలైపోతారు. వారి రచనలు విపరీతంగా అమ్ముడు  పోతాయి. ఎంతమంది రచయితలు  పెరిగారో దానినిబట్టి సాహిత్య  వికాసాన్ని కొలవరాదు. ఎంతమంది  పాఠకులున్నారనేది ముఖ్యం. ఇదికూడా పిల్లి మనస్తత్వం  కావచ్చు. నేను పిల్లిగా నా నీడ నుంచి తప్పుకోలేను కదా!
ఇదంతా విడ్డూరంగా అనిపిస్తున్నది గదా! ఒకవైపు రచయితల్ని వెక్కిరిస్తూనే మరోప్రక్క నేను రచయితల జాబితాలో చేరబోతున్నాను. ప్రపంచంలో పనికిరాని పుస్తకాలకు నేను సైతం మరొకటి జోడించి, పనికిరాని పుస్తకాలను పెంచబోతున్నాను. చదువురాని పిల్లి తార్కికంగా వుండాలనుకోవద్దు. చదువుకున్న పిల్లి చెడ్డదనుకుంటే, తర్కం వచ్చిన పిల్లిని భరించడం కష్టం. మొదట్లోనే పాఠకుల సహనాన్ని పరీక్షకు పెట్టదలచుకోలేదు.
అచ్చం పిల్లిలాగా ఎటో వెళ్ళిపోయాను. నా కథతో ఎందుకు మొదలుపెట్టలేదో మనవి చేస్తాను. కొద్దిగా జంకాను. చేయబోయే సాహసమే యిందుకు కారణం. పిల్లి కథ మనుషులకు ఎలా ఆసక్తి కలిగిస్తుంది? ఎందుకు కల్పించకూడదు అనిపించింది. ఏమైనా, సందేహిస్తూనే నా కథ ఆరంభిస్తున్నాను.
మనుషుల్ని దగ్గరగా చూచాను. జైల్లో కొంతకాలం గడిపాను. నేను ఆడపిల్లిని. కాని స్త్రీలతో  నాకు పరిచయం ఏర్పడలేదు. వాళ్ళూ నా వలె ప్రవర్తిస్తారనుకుంటున్నాను. నా వ్యక్తిగత అనుభవానికి తోడు, నా జాతి అనుభవం అంతా నా ముందున్నది.
పిల్లులు గృహ జంతువులు అనడానికి వీల్లేదు. అంటే పిల్లులు మనుషులకు చేరువగా మసలినా, వాళ్ళ స్వార్థానికి పూర్తిగా లొంగకుండా బానిసలుగా మారకుండా వుండగలుగు తున్నాయి.
ఇళ్లల్లో పొయ్యి మాకు వెచ్చని  స్థావరం. అక్కడ వుంటూ మానవ స్వభావాన్ని బాగా చూస్తుంటాము. నేను యిళ్లల్లో గడపలేదు. జైలులో వున్నాను. అదీ గమ్మత్తుగా వుంది. మనిషిలోని పశుత్వం యిక్కడ కూడా తొంగి చూస్తుంది. అనేక మనస్తత్వాలను పరిశీలించడానికి జైలులో నాకు అవకాశం కలిగింది. మా పిల్లి జాతికి తెలిసింది ఎక్కువ కనుక ప్రపంచంపట్ల నిరాశ పెరిగింది. ఉదాశీనంగా పరిశీలించ గలుగుతున్నాం. మనుషుల్లో వున్న అజ్ఞానం చూసి ఆశ్చర్యపడ్డాం. నెలల తరబడి ఆలోచించి, నాకు తెలిసిందంతా చెప్పకపోవడం స్వార్థం అనిపించుకుంటుందనుకున్నాను. ఇలాంటి నిస్వార్థ నిర్ణయంలో, సాహిత్య ఆసక్తితో రంగ ప్రవేశం చేస్తున్నాను.
ఇదంతా ఆనందదాయకం అనుకోవద్దు. ఎక్కడో ఒకచోట మానవుడి గుట్టు బయటపెట్టాల్సి వస్తుంది.
“సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
మా బ్రూయాత్ సత్యం అప్రియం”
అన్నారు. మన ఋషులు, ఎంతో తెలివితో చెప్పారు. (నిజం చెప్పు కాని ఇష్టమైన నిజం చెప్పు. ఇంపుగా లేని సత్యం చెప్పవద్దని  అర్థం) చిరకాలంగా వస్తున్న ఈ మాటల్ని పాటిస్తే నా సాహిత్య సాహసయాత్ర జయప్రదమవుతుంది. ఒక పిల్లి తొలి జీవిత చరిత్రను స్వీకరిస్తారు. బాగా అమ్ముడు  పోవచ్చు కూడా. ఇంపుగా లేని వాస్తవాలను వదిలేసి అవాస్తవాలను  చక్కగా చెబితే సరిపోతుంది. పైగా అదంతా దైవం చెప్పినవని కూడా పేర్కొనవచ్చు. వ్యక్తిగతంగా నాకు మేలు జరిగినా, ప్రజలకు  హాని జరుగుతుంది. కాని నిస్వార్థంగా నేనీ సాహసయాత్రకు పూనుకున్నాను. కనుక నిష్కామకర్మ చేయదలచాను. మా జాతి స్వార్థానికి పెట్టింది  పేరు. కానీ నేనందుకు భిన్నంగా పోదలచాను. అయితే పిల్లి జాతి సంపద అంతా నాకు సంక్రమించింది. సొంతంగా నిర్ణయించుకోగలను. ఎవరినీ నమ్మను. ఎవరినీ పట్టించుకోను. నాని నా చాదస్తం నాది. నిస్వార్థంగా నిజం చెప్పదలచాను గనుక. నా నిర్ణయానికి తిరుగులేదు.
నా సందేశాన్ని ఎలా అందజేస్తే  బాగా నాటుకు పోతుందో చూడాలి. సందేశం ఇవ్వడంలో వెనకా ముందూ  లేదు. ప్రపంచాన్ని కాపాడటానికే  ఇండియా వున్నదనేమాట ఎన్నోసార్లు  నేను విన్నాను. ఇండియాలో నేనూ భాగస్వామిని కనుక ఆ కార్యక్రమంలో రవ్వంత నేనూ భాగం పంచుకుంటాను. అయితే ఆ సందేశం ఏమిటో  నాకే తెలియదు. తీరిగ్గా ఆలోచించటానికి  కావలసినంత విరామం ఉండటంతో, ఈ చిక్కు సమస్యను విప్పగలిగాను. సందేశం ఏదైనా సరే. ముందు  భారతీయులుగా నెరవేర్చడానికి సిద్ధంగా వుండాలి. “నిన్ను నీవు తెలుసుకో” అనేది భారతీయ మూలసూత్రం గదా! ఇందులో కొద్దిగా గ్రీక్ వాసనలున్నాయనుకోండి. అయితే ఇది కూడా ఇండియా నుండే పూర్వం గ్రీకులు కొట్టేశారనడం కూడా నేను విన్నాను. ఏమైనా ఆత్మజ్ఞానం అత్యున్నతమైందనే హిందూ తత్వ సూత్రం ఆచరించాలంటే “నిన్ను నీవు తెలుసుకో” అన్నదే అమలులో పెట్టాలి.
శారీరకంగా చూస్తే నా కంటే అధికులైన మనుషులకు యిలా ఒక చదువురాని పిల్లి బోధించటం ఏమిటి అనుకుంటున్నారా? జీవపరిణామం గురించి బెర్గ్ సన్ ఏమన్నాడో, తెలుసా? జీవపరిణామంలో మనిషి ఎదగకపోగా పతనమయ్యాడట. ఏనుగుతోనో కోతితోనో, పోల్చి చూస్తే మానవుడి శరీరం అతడికి అనుకూలం కాదని బెర్గ్ సన్ చెప్పాడు.
మానవుడికంటే శారీరకంగా  ఆధిక్యతలో వున్న జంతువుల  జాబితాలో పులి, సింహాన్ని  కూడా చేర్చవచ్చు. పులికి అత్తఐన పిల్లి కూడా ఆ పట్టికలోనే చేరుతుంది మరి! కనుక మనిషికి చెప్పే అర్హత నాకున్నది. పెద్దల వివేచనను భారతీయ సంప్రదాయం నొక్కి చెబుతుంది. అది గృహంలోనూ సంఘంలోనూ వున్నది. నేను ఒక ఏడాది ప్రాయంలోనే వున్నా మా జాతి వివేచనా సంపద నాకు సంక్రమించిందని గుర్తుంచుకోండి.
వయస్సు ఎంత వుంటే ఏముంది? అత్త అత్తే. బ్రాహ్మడు బ్రాహ్మణుడే. సంప్రదాయకంగా బ్రాహ్మణుడికి సమాజ అవకాశాలు సంక్రమించాయి. చదువురాని వాడైనా, దుర్మార్గుడైనా సరే బ్రాహ్మణుడికి దండం పెట్టాల్సిందే. గీత చెప్పినట్లు దైవదత్తంగా సంక్రమించిన బ్రాహ్మణాధిక్యత వలన అతడికి గౌరవం యివ్వాల్సిందే. సమాజంలో హెచ్చు తగ్గుల వలె, ఇంట్లో కూడా సంబంధాలన్నీ దైవ నిర్ణయాల్ని పాటించకపోతే భారతదేశం ఏమయ్యేట్లు? జాతి విధ్వసమౌతుంది. అజ్ఞానం, అసూయ, మూఢనమ్మకాలు తలక్రిందులౌతాయి. అవి మన ఉన్నత సంపద గదా!
Memoirs of a cat by M N Roy;   Telugu : Komala Venigalla

2 comments:

voleti said...

మధ్యలో భ్రాహ్మణుల మీద నీ ఏడుపేమిటో అర్ధం కావట్లేదు.. చూస్తే పిల్లి మీద శునక జాతి వైరం లాగ వుంది...

Narsimha said...

"గీత చెప్పినట్లు దైవదత్తంగా సంక్రమించిన బ్రాహ్మణాధిక్యత వలన..."

ఏ శ్లోకం లో చెప్పారో కాస్త చెప్పగలరా!?..నాకు తెలిసి జన్మతహ అనె కాన్సెప్ట్ లేదె....కర్మ, ఙాన సాధన,ఇవె రెండు మార్గాలు భగవంతుని వద్దకు చేరుటకు,ఙాని వేద ఙానం కలిగి దైవాని చేరితే,పామరుడు కర్మల వల్ల చేరుతాడు...కులాలని గీత ఏ శ్లోకం లో చెప్పలేదు,అలాంటప్పుడు కులాల గౌరవం గూర్చి ఎక్కడ చెప్పారు?కాస్త శ్లోకాలు చెపితె నేర్చూని మళ్ళీ ఎక్కడా కంఫ్యూస్ కాను అందుకే!!?.

Post a Comment